Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అద్వైతము

వికీసోర్స్ నుండి

అద్వైతము :- “అద్వైతమ్" ద్వే-ఇతే యస్యతత్ ద్వితం. ద్వితమేవ ద్వైతమ్, నద్వైతం, అద్వైతమ్- అని విగ్రహము. రెండు విధములు లేనిది. ఒకటే విధము. అనగా విజాతీయమగు జగము మిథ్యగాన విజాతీయమే లేనందున విజాతీయ భేదము ఆత్మకు ప్రాప్తించదు. సజాతీయమగు మరియొక ఆత్మ లేనందున సజాతీయ భేదము గూడ ఆత్మకు ప్రాప్తించదు. ఆత్మ నిరవయవము, నిర్గుణము, నిష్క్రియము అగుటచేత స్వగతమగున దేదియు వృక్షాదులకు శాఖాదులవలె లేనందున నాత్మకు స్వగత భేదము ప్రాప్తించదు. కాన సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యమగు చిద్రూవబ్రహ్మ మొక్కటియే సత్యము; ప్రపంచమంతయు మిథ్య అని "అద్వైతము" అను పదము వలన తేలిన ఆశయము,

అద్వైతము శ్రుతి, స్మృతి, పురాణేతిహాస ప్రసిద్ధము. దీనిని సదాశివుడు విష్ణువునకును, విష్ణువు చతుర్ముఖ బ్రహ్మకును, బ్రహ్మ వశిష్ఠునకును, వశిష్ఠుడు శక్తి కిని, శక్తి పరాశరునకును, పరాశరుడు వ్యాసునకును, వ్యాసుడు శుకయోగీంద్రునకును ఉపదేశించెను. తద్వారమున గౌడ పాదాచార్యుల వారును, తద్వారమున గోవింద భగవత్పాదులును, వారి వలన శ్రీ జగద్గురు శంకరభగవత్పాదులును ఉపదిష్టులై ఈ అద్వైతమును భూలోకమున వ్యాపింప జేసిరి.

వశిష్ఠుడు శ్రీరామచంద్రునకు అనేక చిత్ర విచిత్ర గాథలతో ఈ యద్వైతము నుపదేశించెను. ఆ ఉపదేశములే ఛందోఒద్ధములై "యోగవాసిష్ఠము" అను పేరుతో ప్రసిద్ధిగాంచి, పామరులకును, పండితులకును, ఆదరణీయములైనవి. అద్వైతమును బోధించుటకే శ్రీ వేదవ్యాసులవారు 192 అధికరణములు, 16 పాదములు, 4 అధ్యాయములుగల “ఉత్తర మీమాంసాశాస్త్రము" రచించి యుండిరి. ఈ ఉత్తర మీమాంసాశాస్త్రము అనేక న్యాయోపబృంహితమయి యున్నది. గౌడ పాదాచార్యుల వారు ప్రధానముగ మాండూక్యోపనిషత్తు ననుసరించి దానికి వివరణముగ “ఆగమము, అద్వైతము, వై తథ్యము, ఆలాతశాంతి" అను నాలుగు ప్రకరణములుగల కారికలను రచించిరి. ఈ కారికలలో “వై తథ్య” ప్రకరణమున స్వప్నమునకు మిథ్యాత్వమును సాధించి తద్ద ృష్టాంతము ననుసరించి జగత్తునకు మిథ్యాత్వమును స్థాపించిరి, అందు దృష్టాంత ధార్ష్టాంతికములతొ వారు చూపిన హేతువాద పాండిత్య ప్రకర్షకు అక్షపాదుడు, కణభుక్కు కూడ ఆశ్చర్య చకితులైరి.

శ్రీ శంకరులు, గోవిందభగవత్పాదులకు శిష్యులై, ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రములకు, శ్రీ మద్భగవద్గీతలకు, సనత్సుజాతీయమునకు, విష్ణు సహస్రనామములకు భాష్యములను వివరించియుండిరి. ఇంతియేగాక ఉపదేశ రూపములుగను, స్తోత్రముల రూపముగను శ్రీ శంకరాచార్య స్వాములు తమ అనర్గళ కవితావల్లరి దశదిశల ప్రాకునటుల శతాధిక గ్రంథరాజములను వెలయించిరి.

ప్రపంచ మిథ్యాత్వ సాధనము: జంగమ స్థావరాత్మకః మగు ఈ ప్రపంచ మింద్రియ గోచరమగుచుండ శుక్తి రజతాదులవలె, స్వప్న ప్రపంచమువలె, మిథ్య యెట్లగుననిన, దృశ్యములగు శుక్తిరజతాదులును స్వప్న ప్రపంచమును ఎటుల సత్యేతరములో అటులనే యీ ప్రపంచము మిథ్య యగును. కావున దృశ్యమను హేతువు వ్యభిచారి యగుటచే ప్రపంచమునకు సత్యత్వమును స్థాపింపనేరదు.

శుక్తియందు రజతభ్రాంతి కలిగిన పిమ్మట “ఇది శుక్తి" అను జ్ఞానము కలిగి అద్దానిచేత రజత భ్రాంతి తొలగును. అచట రజతము లేదు, ప్రపంచమనునది ప్రత్యక్షముగ గాన్పించుటయే కాక వస్తుస్థితిని గూడ జూచుచుండ ప్రపంచము మిథ్య యని యెటుల చెప్ప నొప్పును అను విషయము విచారింప తగినది.

భ్రమస్థలమున శుక్తిని జూచిన తోడనే “ఇది శుక్తి” అను జ్ఞానము కలుగలేదు. "ఇది రజతము" అను జ్ఞానమే కలిగినది. ఈ జ్ఞానము ప్రత్యక్షమా? అనుమితియా ? ఉపమితియా ? శాబ్దమా? అర్థాపత్తియా ? అనుప లబ్ధియా ? అనినచో శుక్తికకు చతురింద్రియమునకు సంయోగము ప్రాప్తించి "ఇది రజతము" అను జ్ఞానము కలిగిన పిమ్మట నేను రజతము నూహించుచుంటిని.” అను నీమొదలగు అనుభవములు (అనువ్యవసాయములు) లేకుండుటచేత “ఇది రజతము" అను జ్ఞానము అనుమిత్యాదికము కాదు. "ఇది రజతము" అను జ్ఞానము కలిగిన పిమ్మట " నేను రజతమును చూచుచుంటిని" అను అనుభవముండుట చేత “ఇది రజతము” అను జ్ఞానము "ఇది రజతము" అను జ్ఞానము ప్రత్యక్షమేయని అంగీకరింప వలయును. దేశాంతరము నందుండు రజతమునకును చదురింద్రియమునకును సంబంధము ఏర్పడదు గావున "ఇది రజతము" అను జ్ఞానమున దేశాంతరస్థమైన రజతమే భాసించునని చెప్ప నొప్పదు. రజతము లేకున్నను "ఇది రజతము" అను భ్రాంతి కలుగుననిచో, విషయమే లేనితరిఅట్టి జ్ఞానమే కలుగదు. మరియు నేను రజతమును చూచుచుంటిని" అను అనువ్యవసాయము రజతస్థితిని ధ్రువపరచుచున్నది. కావున "ఇది రజతము” అను భ్రాంతిస్థలమున రజత మున్నదని యొప్పుకొని తీరవలెను. కాని ఆ రజతమేది యని మాత్రము విచారింప వలయును.

దేశాంతరస్థమయిన రజతమునకు చదురింద్రియమునకు సంబంధము పొసగదు కావున దేశాంతరస్థ రజతము "ఇది రజతము" అను భ్రాంతియందు భాసింపనందున "ఇది రజతము" అను భ్రాంతి సమకాలమున నొక రజతము పుట్టి, యా రజతమే “ఇది రజతము" అను జ్ఞానమున భాసించుచున్నదని యొప్పుకొనవలయును. కాని ఇట్టి రజతము పుట్టుటకు కారణ మేమియుండునని మాత్రము విచారింపవలసి యున్నది. చక్షురింద్రియమునకును, పురోవర్తి వస్తువునకును సంయోగము కలిగిన పిమ్మట “ఇది శుక్తిక” అను జ్ఞానము కలుగలేదు. అనగా శుక్త్య జ్ఞానమే యున్నది. ఇది యిట్లుండ పూర్వమునం దెన్నడో సత్య రజతమును జూచినప్పు డాయనుభవము వలన రజత సంస్కారము జనించియుండెను. ప్రకృతమున చక్షు రింద్రియమునకును పురోవర్తి వస్తువునకును సంయోగము జనించుతరి పురోవర్తి వస్తుగత చాకచక్యము ప్రత్యక్షమై ఆ ప్రత్యక్షము వలన పూర్వ రజక సంస్కార ముద్భుద్ద మగును. అట్టి ఉద్బుద్ధ సంస్కారముతో బాడీ శుక్త్య జ్ఞానము రజతాకారముగను, రజత జ్ఞానా కారముగను పరిణమించును. ಇಟ್ಟಿ రజతమునే ప్రాతిభాసిక రజతమందురు. కావున "ఇది రజతము" అను జ్ఞానమున భాసించు రజతము శుక్త్య జ్ఞానము వలన పరిణమించి, శుక్తి జ్ఞానము వలన నివర్తించునటుల, ఆత్మా జ్ఞానము వలన పరిణమించిన యీ నిఖల ప్రపంచము, నాత్మజ్ఞానము వలన నివర్తించునట్టి దగుట చేత శుక్తిరజతమువలె మిథ్యయేయని యొప్పుకొనవలెను.

శుక్తిరజత మర్థక్రియాకారి యగుటలేదు. భుజించినట్లు స్వప్నము వచ్చినపుడు స్వప్నమునందు స్వప్న సమ కాలమున భుజించుటయు, దానివలన తృప్తియు కనిపించుచున్నవి. కావున స్వప్నము సత్యమే యగుచుండ స్వప్నమువలె ప్రపంచము మిథ్య అనుట యెట్లు పొసగుననిన సమాధాన మిట్టిది. వినుము :

ఒక డేగ తన శక్తికొలది ఇటు నటు ఎగిరి యెగిరి శ్రమమునుపొంది సాయం కాలమునకు తనగూటి కేగి రెక్కలను ముడుచుకొని యెట్లు విశ్రమించునో, అట్లే ఆత్మయు అంతఃకరణముతో తాదాత్మ్యాధ్యాసను పొంది, అంతఃకరణ ధర్మములయిన అహంకార మమ కారాదులను ఆత్మయందారోపించుకొని, “నేను, నాది" అని అహంకార మమకారావిశిష్టమై చదురాదీంద్రియముల ద్వారమునబయలు వెడలిన అంతఃకరణవృత్తులను తనయందారోపించుకొని “నేను కర్తను, నేను భోక్తను, నేను సుఖిని, నేను దుఃఖిని" అని అనేకవిధముల క్లేశముల నొంది విశ్రాంతినిగోరి పరుండును. ఆ తరుణమున సర్వేంద్రియములు మనస్సునందు లయించును. అట్టి సమయమున జాగ్రదవస్థయందనుభవముల వలన జనించిన సంస్కారములతో గూడిన అవిద్య యొక్క పరిణామములగు స్వాప్నిక పదార్థములను జూచును. ఆ సమయము నందు గలిగిన జ్ఞానము ప్రత్యక్షాత్మక మగుటచేత స్మృతి యని యనిపించుకొనదు. ప్రత్యక్షాత్మక మగుటవలన పదార్థములకు స్థితి నొప్పుకొన వలయును. ఆ స్వప్న పదార్థములగు గజతురగాదులు స్వీయ నివాసమునకు దగని ఈ శరీరమునందే గోచరించుటచేత, సత్యము అనుటకు వీలులేదు. ఐంద్రజాలికుడు ప్రాసాదమును మ్రింగుచున్నట్లు అతని మాయచే కనిపించును. కాని అతని ముఖమున ప్రాసాదమునకు ప్రవేశించు యోగ్యత లేనందున . ప్రాసాద నిగరణమునకు అయోగ్యమగు నతని ముఖమునందు అగుపడు ప్రాసాద నిగరణము మిథ్య యగునట్లు, స్వాప్నిక గజతురగాదులు మిథ్యయే అని యొప్పుకొన వలయును. ఈవిషయమునే శ్రీ గౌడ పాదాచార్యులవారు తమచే రచింపబడిన మాండూక్యోపనిషత్కారి కలయందు వై తథ్య ప్రకరణమున మొట్టమొదటనే

"వై తథ్యం సర్వభావానాం స్వప్న ఆహుర్మనీషిణ।।
అంతస్థానాత్తు భేదానాం సంవృతశ్వేన హేతునా"

అను కారికచే స్పష్టముగ జెప్పిరి.

పై గౌడపాద కారిక వలన "ఏ పదార్థము తనకు తగని ప్రదేశమున గోచరించునో ఆ పదార్థము మిథ్య" యని తేలినది. స్వాప్నిక పదార్థము అట్టివి కావు. మరే మనిన జీవుడు దేశాంతరమున కేగి యోగ్యస్థలముల యందుండు గజతురంగాదులనే జూచును. కావున స్వప్నమునందు . గోచరించు గజతురగాదులు సత్యములే కాని మిథ్య కావని శంకింప జనదు. ఇట్టి ఆశంకను తొలగించుటకే శ్రీ గౌడపాదాచార్యుల వారు పై నుదహరించిన కారిక తరువాత,

"అ దీర్ఘ శ్వా చ్చ కాలస్య గత్వా దేశాన్న వళ్యతి”

అని కారికను వ్రాసియుండిరి. అనగా ఒకనికి కాశి కేగినటుల స్వప్నము వచ్చినది. కాశి కేగవలెననిన విమానముచే నేగినను నాలుగు గంటల కాలమైన కావలెను.క్షణకాలమున స్వప్న మునందు కాశీ కేగినటుల కనిపించును. ఇంత స్వల్పకాలమున దీర్ఘకాలమునందు ప్రయాణము చేయదగిన కాశికి ఆతడు ప్రయాణముచేయనేరడు కావున స్వాప్నిక పదార్థములు తగని యీ శరీరమునందే గోచరించునని యొప్పుకొని తీరవలెను. అందుచే స్వాప్నిక పదార్థములు మిథ్యయే యని తేటపడుచున్నది.

స్థూలశరీరముతో కాశి కేగుటకు దీర్ఘ కాలము కావలెను కాని లింగదేహముతో కాశికేగుటకు దీర్ఘకాలము అవసరములేదు. కావున జీవుడు లింగదేహముతో మాత్రము కూడుకొని శీఘ్రకాలముననే కాశికి బోవచ్చును. అచట పదార్థములను జూడవచ్చును. అందుచే స్వాప్నిక పదార్థములు తగు ప్రదేశముననే గోచరించుటచే సత్యమేయని శంకింపరాదు. అట్టి శంకను తొలగించుటకే శ్రీ గౌడ దాపాచార్యులవారు పై కారిక యొక్క ఉత్తరార్ధమును

"ప్రతి బుద్ధళ్ళ పై సర్వస్తస్మినేనే న విద్యతే"

అని చెప్పియుండిరి. ఒక పురుషునకు క్షణకాలములోనే కాశి కేగి కాశీ విశ్వనాథునకు అభిషేకము చేయుచున్నట్లు స్వప్నము కలిగెను. వెంటనే ఆతడు మెలకువ గాంచెను. ఇట్టిసమయమున అత డుండవలసిన చోటు తన గృహమా, లేక కాశీవిశ్వనాథుని యాలయమా అనినచో, అతడు తన గృహమున పడకటింటియందు శయ్యపై నున్నట్లు స్వప్నము రాలేదు కావున క్షణమాత్రమున ఇంటికి జేరలేదు. కాశీ విశ్వనాథునకు అభిషేకము జేయు చున్నట్లు స్వప్నములోనుండి మెలకువ గాంచెను. కావున అతడు కాశీవిశ్వనాథుని యాలయములోనే యుండక పడకటింటియందలి శయ్యమీదనే ఉండుటచే స్వప్నమునందు దేశాంతరమునందుండు పదార్థములను జూచుట లేదు. ఇక ఏ మనిన నిద్రాది దోషముతో గూడి, పూర్వానుభవ జనిత సంస్కారసహితమగు అవిద్యవలననే జనించిన స్వాప్నిక పదార్థములను అయోగ్యమగు నీ దేహము నందే జూచును. కావున స్వాప్నిక పదార్థములు మిథ్య యే యని యొప్పుకొనవలయును. అట్లే జాగ్రదావస్థ యందు గోచరించు నిఖిల ప్రపంచము మిథ్యయే యని తెలిసి కొనదగును. స్వాప్నిక పదార్థములు జాగ్రత్తునందు గోచరించక పోవుటచే మిథ్య కావచ్చుననిన, అట్లగుచో జాగ్రదవస్థయందు గోచరించు పదార్థములు స్వప్నమునందు గోచరించక పోవుటచే నవియు మిథ్యయే యనవలయును. అనగా పరస్పర వ్యభిచారులగుటచే రెండును మిథ్యయే. "స్వప్న కాలమున పదార్థములు సత్యములుగా గోచరించి ప్రబోధావస్థయందు మిథ్య యగునట్లు జాగ్రదావస్థయందు గోచరించు నీ ప్రపంచము అనగా బ్రహ్మ భిన్నమగు ఈ నిఖిల ప్రపంచముకూడ మిథ్య యగుచున్నది. "నేను బ్రహ్మస్వరూపుడను" అను జ్ఞాన నిష్ఠా గరిష్ఠునకు ప్రపంచ భావమే లేనందున నిఖిల ప్రపంచము మిథ్యయే యని యొప్పుకొనవలయును.

ఆత్మైక్య సాధనము : ఆత్మతత్త్వమును విచారించుచో ప్రత్యక్షాది ప్రమాణములకు విరోధము వాటిల్లునుగాన ఆత్మైక్యమును జెప్పుటకు వీలుపడదు. ఎట్లనిన :

"నేను" అనెడి జ్ఞానము వేరు వేరుగ ప్రతి దేహమునందును ప్రత్యక్షముగ కన్పట్టుచున్నందున. ఇట్లు "అహం ప్రత్యయ భేదముండు ప్రతి దేహమందున నాత్మ వేరు” అను అనుభవముచే ఆత్మ ప్రతి దేహము నందు వేరగుచున్నది. అట్లు కాక ఆత్మ యొక్కటియేయన్నచో “నేను, వీడు" అను వ్యవహారము లోపించును. అందుచేత ఆత్మలు అనేకములనుటకు బ్రత్యక్షముప్రమాణము. ఇట్టి ఆత్మ భేదము నొప్పనిచో "నేను, వీడు" వ్యవహారము మరియొక విధమున సిద్ధింపనందున, అను అర్థాపత్తి ప్రమాణముచే గూడ ఆత్మభేదము సిద్ధించు చున్నది. శరీరములు అనేకములు గావున గవాదులవలె వాటియందుండు ఆత్మ లనేకములు. లేక ప్రతిదేహము నందును “నేను. నేను” అను జ్ఞానము వేరుగ నుండుటచే ఆత్మ ప్రతి శరీరము నందును వేరుగ నుండుము" అను అనుమాన ప్రమాణముచే గూడ ఆత్మ భేదము సిద్ధించు చున్నది.

“అదితి, దేవా, గన్ధర్వా, మనుష్యాః, పితరో, ఒ, సురాః"

అను శ్రుతి వాక్యమును, “దేవ, దానవ, గంధర్వా, యక్ష, రాక్షస, కిన్న రాః"అను పురాణవచనమును, ఆత్మభేదమునే బోధించుచున్నవి. కావున ఆత్మలు భిన్నములనుటయందు శబ్దము కూడ ప్రమాణము.

ఇన్ని ప్రమాణముల వలన ఆత్మభేదము సిద్ధించుచుండగా “ అద్వైతము ” అనునది యెట్లు సిద్ధించునను ప్రశ్న ముదయించుచున్నది.

మరియు ఆత్మైకత్వమునే అంగీకరించినవో సర్వ దేహములయం దుండు ఆత్మ యొక్కటియే గాన ఒకడు దుఃభించిన నందరు దుఃఖంచుటయు, ఒకడు సుఖించిన నందరు సుఖంచుటయు సంభవించును. అట్లే దేవాది సర్వ దేహముల యందుండు ఆత్మ యొక్కటి గావున, దేవతలు సర్వజ్ఞు లగుటచే మనుష్యులు గూడ సర్వజ్ఞులు కావలసివచ్చును. అట్లగుచో విధినిషేధశాస్త్రములు వ్యర్థములు కావలసివచ్చును. అట్లే ఒకడు బద్ధుడగుచో నందరు బద్దులు ఒకడు ముక్తుడగుచో నందరు ముక్తులు కావలసివచ్చును. కావున ప్రత్యక్షానుమాన శబ్దార్థాపత్తి ప్రమాణ సిద్ధమగు ఆత్మా నేకత్వమును అంగీకరింపవలయును. అట్లు అంగీకరించినచో నద్వైత మెట్లు పొసగునని శంకింపజనదు.

ఒకనికే బాల్యావస్థ యందు “నేను బాలుడను" అను జ్ఞానముండినను, కౌమారావస్థయందు “నేను బాలుడను” అను జ్ఞానముండక, “నేను కుమారుడను" అను జ్ఞాన ముండును. వానికే యౌవనావస్థయందు “నేను బాలుడను, నేను కుమారుడను" అను జ్ఞానముండక "నేను యువకుడను" అను జ్ఞానముండును. అట్లే వార్ధక్యమునందు "నేను బాలుడను, నేను కుమారుడను, నేను యువకుడను" అను జ్ఞాన ముండక " నేను వృద్ధుడను" అను జ్ఞానమే ఉండును. అట్లగుటచే ఒకనికే ఆ యా యవస్థలయందు నేను బాలుడను, నేను కుమారుడను, నేను యువకుడను, నేను వృద్ధుడను" అనునట్టి జ్ఞాన భేద మున్నను, తా ననేకము కాక ఒక డే యగుచుం డెను. కావున “నేను, నేను" అను అహం ప్రత్యయభేదము ఆత్మకు అనేకత్వమును స్థాపింపనేరదు. కనుకనే ప్రత్యక్ష ప్రమాణము వలన ఆత్మకు అనేకత్వము సిద్ధింపదు.

మరియు ఆత్మ శైశవాద్యవస్థాభేదముచే ననేక మన్నచో, నొకనిచే ననుభూతమగుదానిని మరి యొకడు స్మరింపకపోవుట వలన "బాల్యమునందు నేను కందుకముతో క్రీడించితిని" అని వృద్ధుడు స్మరింపకపోవును.కావున జ్ఞాన భేదమున్నను జ్ఞాన విషయ అహం ప్రత్యయా ర్థమగు ఆత్మకు భేదము సిద్ధించనందున ప్రత్యక్ష ప్రమాణము వలన ఆత్మభేదము సిద్ధించదు.

స్థూల సూక్ష్మ కారణదేహములు, జాగ్రత్స్వప్న దేహములు వేరైనను, అహం ప్రత్యయార్థమగు ఆత్మకు భేదము లేనందున “శరీరములు భిన్నములు కావున ఆత్మలనేకములు" అను అనుమాన ప్రమాణము కూడ ఆత్మా నేకత్వమును సాధింపనేరదు.

ఎట్లు స్థూల సూక్ష్మ కారణదేహ భేదములచే ఒక్కటి యగు ఆత్మకు భోగములు వేరువేరుగ నుండునో, అట్లే ఆత్మ యొక్కటియే యైనను దేవాదిదేహ భేదముచే ఒక యాత్మకే భోగములు వేరు వేరుగ నుండును. కనుకనే దేవాదిదేహములు భోగాయతనములు గాని, ఆత్మ భేద ద్యోతకములు కావు. ఆ దేహములయందే రూప తేజ స్స్వభావముల భేద మగపడుచున్నది కాని, చేతన భేద మగపడనందున, ఆత్మ విషయకమగు "నేను" అను జ్ఞాన మెప్పుడును ఒక విధముగనే యుండుటచే “అదితిర్దేవా గంధర్వా" అను శ్రుతి శరీరభేద ప్రతిపాదన వరమే కాని ఆత్మ భేదమును జెప్పునది కాదు.

ఒక శరీరమునందే అవయవ భేదము నాశ్రయించి శిరస్సు, హస్తములు, పాదములు అనెడి వ్యవహార మెట్లు కలుగుచున్నదో, అట్లేయాత్మ యొకటేనను, శరీర భేదము నాశ్రయించి, “ నేను, నీవు, అతడు, దేవతలు, దానవులు" అను వ్యవహారము కలుగుచున్నదే కాని, ఆత్మ భేదము ననుసరించి కానందున " దేవ దానవ గంధర్వాః” అను పురాణ వచనములుకూడ ఆత్మ భేదమును బోధింప నేరవు. ఇట్లే “నీవు, నేను" అను వ్యవహారము శరీర భేదము నాశ్రయించి ఉపపన్నమగుటచే ఇట్టి వ్యవహారాజన్య 'ధానుపపత్తి' సంభవింప నందున, అత్మలకు అనేకత్వమును సాధించుటయందు అర్థాపత్తియు ప్రమాణము కానేరదు.

పుణ్యపాపముల వలన సుఖదుఃఖములు ప్రాప్తించును. అవి యనేక విధములు. అట్టి పుణ్య పాపములకు కర్మ కారణము. “యత్కర్మకురుతే తదభి సంపద్యతే” “యథా కారీ యథా చారీ తథా భవతి" అను శ్రుతులు "ఆయా కర్మలు ఆయాకర్మ ఫలభోక్తలు ననేక విధము" లని బోధించుటవలన కర్మవై చిత్య్రముచేతనే సుఖదుఃఖాది వైచిత్య్రము ఉపపన్న మగుచుండ, “నాత్మైకత్వము నొప్పినచో ఒకడు సుఖించుచుండిన నందరు సుఖింపవలయును ఒకడు దుఃఖించిన నందరు దుఃఖింపవలయును" అను నాపత్తి యును సంభవింపదు.

అంతటను ఆత్మయే స్వయముగ ఆ యా బుద్ధివృత్తుల ననుసరించి విషయములను తెలిసికొనును. దేహములు అనేకములుగాన దేహముల యందుండు బుద్ధి వృత్తులు గూడ అనేకములు, దానివలన బుద్ధివృత్తియగు జ్ఞానము కూడ ప్రతి దేహమునందును వేరువేరుగ నుండును. ఆ జ్ఞానము చదురింద్రియమువలె స్వసంబద్ధమగు విషయమును మాత్రమే భాసింపజేయును. పరిచ్ఛిన్న మగుటచే సర్వ పదార్థ సంబంధము ఆ బుద్ధి వృత్తికి సంభవింపదు. కావున నొకడు సర్వజ్ఞుడైన నందరకు సర్వజ్ఞత్వము ప్రాప్తించదు. ఎట్లనిన శబ్దొత్పత్తి కారణమును, విభువునగు నా కాశమునకు నంతటను భేర్యాదులతో సంబంధ ముండినను, ఎచట భేరి దండముచే కొట్టబడునో అచటనే శబ్దము పుట్టును కాని భేర్యాదులున్న ప్రతి స్థలమునందు శబ్దము పుట్టుటలేదు. అట్లే ఆత్మ పరిపూర్ణము, ఏకము, అయినను, ఏదేహమునందు బుద్ధివృత్తికి సంబంధముండునో అక్కడనే (ఆ దేహావఛ్ఛేదముగనే) జ్ఞానము కలుగును కాని మరియొక స్థలమున (ఇతర దేహావచ్ఛేదముగ) జ్ఞానము కలుగనేరదు. కనుకనే బుద్ధివృత్తులు అనేకము లగుటచే వ్యాపకములు కానందున "ఆత్మైకత్వ మొప్పినచో ఒకడు సర్వజ్ఞుడగుచో నందరు సర్వజ్ఞులు కావలెను" అను ఆపత్తియు సంభవింపదు.

కనుకనే కించిద్ జ్ఞులకు ప్రవృత్తి నివృత్తి హేతువులు కావున విధి నిషేధ శాస్త్రములకు ఆనర్థక్యము సంభవింపదు. ప్రాణులకు సర్వజ్ఞత్వము లేదని చెప్పుటచే "తద్యోయో దేవానాంప్రత్యబుధ్యత స ఏవ తదభవ త్త థర్షీణాం తథా మనుష్యాణాం" అను శ్రుతి ననుసరించి వేదాంత శ్రవణ జన్య జ్ఞానముచేత ప్రత్యభిన్నమగు పరమాత్మను దేవ ఋషి మనుష్యులలో నెవడు తెలిసికొనునో వాడే ముక్తు డగును. అందువలననే ఆత్మ యొక్కటైనను “జ్ఞానా దేవతు కైవల్యం" అను నియమ శ్రవణమున ఆత్మజ్ఞానము చేతనే ముక్తు డగును. కనుకనే "ఆత్మైక్యము నొప్పినచో నొకడు ముక్తుడైనను, బద్ధు డైనను అందరు ముక్తులు కాని, బద్దులు కాని కావలెను" అను నాప త్తియు సంభవింపదు. . ఇదియునుగాక' ఆత్మలు పూర్ణములు, అనేకములని చెప్పు ఈ పక్షమునందే ఈ దోషము లన్నియు సంభవించును.

పరపక్షమున దోషములు : ఏలన సర్వవ్యాపకములు అనేకములు నగు నాత్మలు పరస్పరము పరస్పర మనో బుద్ధ్యాదులతో అన్ని దేహములయందు కలిసి కొనుటచే నొకడు దుఃఖించిన నందరు దుఃఖించుటయు, ఒకడు సుఖించిన నందరు సుఖించుటయు, నొకడు బద్ధుడైన నందరు బద్దులగుటయు, నొకడు ముక్తుడైన నందరు ముక్తులగుటయు సంభవించును. మరియు “ఏయే వస్తువు ఇతర వస్తువులకంటె వేరుగనుండునో, ఆయా వస్తువు పరిచ్ఛిన్న మనబడును" అను న్యాయముచేత ఆత్మలు అనేక మైనచో వాటికి నితర భేదము ప్రాప్తించునుగావున ఆత్మ లన్నియు పరిచ్ఛిన్నము లగుటచే వాటికి పూర్ణత్వము పొసగదు. పూర్ణత్వమే యున్నచో ననేకత్వము సమకూరదు. పరస్పర విరుద్ధములగు నీ రెంటికి నాత్మల యందు సమావేళమును బ్రహ్మకూడ నిర్వహింపజాలడు. కావున ఆత్మైకత్వము అవశ్యాంగీ కార్య మగు చున్నది.

ఆకాశవ త్సర్వగతశ్చ నిత్యః, ఏక స్తథా సర్వ భూతాంతరాత్మా | ఏకో దేవ స్చర్వ భూతేషు గూఢః, ఏకస్సన్ బహుధా విచచార ౹ ఏక ఏవహి భూతాత్మా, నిరపేక్ష ఏకఏవ, సాక్షి ఏక స్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం, అశరీరం శరీరే ష్వనవస్థే ష్వవస్థితమ్ | మహా నతం విభుమాత్మానం మత్వా ధీరో నశోచతి" ఇత్యాద్యాత్మే కత్వ నిత్యత్వ పూర్ణత్వ బోధక శ్రుతుల చేతను, "నిత్య స్సర్వ గతస్థాణుః, నిత్యస్సర్వ గతోప్యాత్మా కూటస్థొ దోషవర్జితః | ఏకస్స న్భిద్యతే భ్రాంత్యా మాయయాన స్వరూపతః" ఇత్యాదిస్మృతులచేతను ఘటాదుల యందున్న ఆకాశమువలె సర్వ శరీరముల యందున్న ఆత్మ పరిపూర్ణు డగుటచేత ఒక్కడే యని నిర్ణయము. ఇట్టి నిర్ణయమే సిద్ధాంతమగుట వలన “పూర్ణములు కాకపోయి నను ఆత్మలు పరిచ్ఛిన్నములు, అనేకములు, చిద్రూపములు" అను పక్షము గూడ తొలగింపబడెను.

మరియు ఆత్మ అంశరహితమగుట వలనను, సర్వప్రకాశకమగుట చేతను, సర్వసాక్షియగుట చేను, అంతటను అహం ప్రత్యయార్థమగుట చేతను, ఇంకను ఇట్టి అనేక యుక్తుల చేతను ఆత్మ పరిపూర్ణమని నిశ్చయింపబడు చున్నందునను, ఆత్మ పూర్వోపదర్శిన శ్రుతి స్మృతియుక్తి ప్రామాణ్యము చేతను ఆత్మ ఒక్కటి అనియే సిద్ధాంతము.

పరమాత్మ జీవాత్మైకసాధనము  : అద్వైతము శ్రుత్యాది ప్రసిద్ధమని తెలిసికొని యుంటిమి. అద్వైతమును బోధించు శ్రుతులు “తత్త్వమని" "అహంబ్రహ్మాస్మి" "అయమాత్మా సర్వానుభూ:" "ఆత్మై వేదం సర్వం" మొదలగునవి కలవు. అవి అద్వైతమును బోధింప జాలవు. తత్త్వమసి అను వాక్యములో తత్, త్వం, అసి అను మూడు పదములు గలవు. అందు 'తత్" అను పదము సర్వజ్ఞత్వ విశిష్టమగు చిత్తును, 'త్వం' అనుపదము కించిద్ జ్ఞత్వ విశిష్టమగు చిత్తును బోధించును. “విరుద్ద ధర్మములు కల ఘట, పటముల కైక్యము పొసగునటుల విరుద్ధములగు సర్వజ్ఞత్వ కించిద్ జ్ఞత్వ రూప ధర్మములు గల పరమాత్మ, జీవాత్మలకు ఐక్య మెన్నడు సంభవము కాదు” అని శంకింపరాదు.

తత్త్వమస్యాది వాక్యములు జహదజహల్ల క్షణచే చిద్విషయకమగు “చిత్" అను నిర్వికల్పక ప్రత్యక్షమును బోధించును. జహదజహల్లక్షణ యనగా శబ్దార్థమున కొంత భాగమును విడిచి కొంత భాగమును విడువక శబ్దార్థిక దేశమును బోధించునది. అది యెట్లనిన “త త్త్వమసి" అను స్థలమున "తత్" అను పదమున కర్ణము సర్వజ్ఞత్వ విశిష్ట చిత్తు. "త్వం" అను పదమున కర్ధము కించిద్ జ్క్షత్వ విశిష్ట చిత్తు. "తత్, త్వం" పదములు రెండును సమాన విభ క్తికములగుట చేత ఈ రెండు పదములకు సామానాధికరణ్యము కలదు. పదములయందుందు సామానాధికరణ్యము ఏకార్ధ బోధకత్వమే. అందుచేత "తత్, త్వం" అను రెండు పదములు ఏకార్థమును బోధింపవలయును. పరస్పర విరుద్ధ ధర్మములుకల “తత్, త్వం" పదార్థములగు సర్వజ్ఞత్వ విశిష్ట, కించిద్ జ్ఞత్వ విశిష్ట చిత్తులకు అభేదము పొసగనందున ఇచట “జహద జహత్స్వార్థ" అను లక్షణా వృత్తిని అంగీకరింప వలయును. అనగా శబ్దార్ధైక దేశములగు సర్వజ్ఞత్వ, కించిద్ జ్ఞత్వ వైశిష్ట్యములను విడిచి విశేష్యమగు కేవల చిత్తును మాత్రమే బోధించును. కావున జహద జహత్స్వార్ధలక్షణచే "తత్త్వమసి" మొదలగు మహా వాక్యములు కేవల చిద్విషయకమగు “చిత్" అను నిర్వికల్ప బోధను గలుగ జేయును

నిర్వికల్ప బోధస్వరూపము  : "నిర్వికల్ప బోధ”యనగా పదార్థమునందు ఏధర్మముగాని, ఏసంబంధముగాని భాసింపక, కేవల పదార్థ వివయకమగు బోధయగు చున్నది. శబ్దమువలన కలిగెడి బోధ సవికల్పక మే యగును కాని, నిర్వికల్పకము కానేరదు అను తార్కిక నియమము ఉండగా “తత్త్వమసి" అను మహాకావ్యము వలన నిర్వికల్పక బోధ యెట్లు కలుగు"నని శంకింపజనదు.

శక్తివాదములో విశేష కాండమున ఆ కాళపద శక్తి నిరూపణ ప్రస్తావమున ఆకాశ పదము వలన శబ్దాశ్రయ త్వేన ఆకాశీబోధ కలుగునని ఉపపాదించి "అస్తువా పదాదపి నిర్వికల్పక బోధః" ఆకాశపదమువలన నిర్వికల్పక బోధ కలుగుగాక అని తార్కికాగ్రేసర చక్రవర్తియగు శ్రీ గదాధర భట్టాచార్యులవారు ప్రతిపాదించిరి. కావున పదమువలన నిర్వికల్పక బోధతార్కిక సమ్మతమేకాని తార్కిక విరుద్ధము కాదు.

“తత్త్వమసి" అను వాక్యమునందుగల "తత్, త్వం" న్అను పదములు జహదజహత్స్వార్థ చేత చిత్తును, చిత్తును బోధించునమనపుడు, ఆ రెండు చిత్తులకు అభేదము చెప్పిన "చిదభిన్నము చిత్తు" అను బోధ కలుగునని చెప్పవలెను. ఇట్టి బోధ తార్కికాది సర్వమత విరుద్ధము. ఎందువల్లనన శబ్దజవ్య జ్ఞానము సంశయ వారకమగును. సంశయమును దొలగింపని శబ్దజన్య జ్ఞానము ఉండ నేరదని తార్కికులు "విరూపోప స్థితయో రేవ శాబ్దబోధః" భిన్నములగు ధర్మములు పురస్సరముగ శబ్దముల వలన నువస్థితములగు పదార్థములకే అభేదాన్వయ బోధ నంగీకరించిరి. కనుకనే "నీడోఘటః" అను స్థలమున నీలత్వ, ఘటత్వరూప భిన్నధర్మ పురస్సరముగ నుపస్థిత మగు నీలఘటముల కభేద బోధ కలుగును. "ఘటో ఘటః" అను స్థలమున నేకధర్మమగు ఘటత్వ పురస్సరముగ నుపస్థితములగు ఘటములకు అభేద బోధ, సంశయమును నివారింపనందున, కలుగనేరదని వ్యుత్పత్తి వాదమున స్పష్టముగ చెప్పి యుండిరి. కావున "తత్వమసి" అను మహావాక్యమువలన చిత్తునకు చిత్తునకు అభేదబోధ కలుగ నేరదని శంకింప జనదు.

"తత్వమసి" అను వాక్యమువలన “చిదభిన్నము చిత్తు" అను బోధ కలుగునని అద్వైతులు చెప్పెయుండ లేదు. “త త్త్వమసి" అను వాక్యమువలన సర్వజ్ఞ త్వోప లక్షిత కించిద్ జ్ఞత్వోప లక్షిత చిద్విషయక “చిత్" అను బోధ మాత్రము కలుగుననియే అద్వైత సిద్ధాంతము. దీనిని మాత్రము విస్మరింపు తగదు.

"భూతలము ఘటము కలది" అను జ్ఞానమును నివర్తింప జేయునది "భూతలము ఘటాభావము కలది" ఆను జ్ఞానమే. అనగా తద్వత్తా బుద్ధికి తదభావవత్తా జ్ఞానము(నిశ్చయము) ప్రతిబంధకము (నివర్తకము) అట్లే “నేను బ్రహ్మమును కాను” అని అజ్ఞానికిగల మిథ్యా జ్ఞానమును బోగొట్టునది "నేను బ్రహ్మమును" అను జ్ఞానమే. అనగా తదభావవత్తా జ్ఞానమును ప్రతిబంధించుటకు తద్వత్తా జ్ఞానము సమర్థమగును. “తత్త్వమసి" అను వాక్యము వలన కలిగెడి "చిత్” అను నిర్వికల్ప జ్ఞానము తదభావవాదుల నవగాహింప జాలనందున “నేను బ్రహ్మమును గాను" అను నజ్ఞానికి నిరూఢమగు జ్ఞానమును తొలగింపలేక “త త్త్వమసి" అను వాక్యోపదేశము నిరర్ధకమే యగునని శంకింపరాదు.

'తత్త్వమసి' అను వాక్యమువలన జనించిన జ్ఞానము తదభావవాదుల నవగాహింపక అజ్ఞాన జనితమగు 'నేను బ్రహ్మనుగాను' అను జ్ఞానమును తొలగించుననియే, అద్వైతి చెప్పెను. “తత్త్వమసి' అను మహావాక్య జనిత మగు 'చిత్' అను జ్ఞానము స్వరూపము చేతనే సూర్యుడు తిమిరమును, గారుడమంత్రము సర్పవిషమును దొలగించినటుల, అజ్ఞాన జనితమగు భ్రాంతుల నన్నిటిని తొలగించుననియే అద్వైత సిద్ధాంతము. ఇట్టి నిర్వికల్పకబోధ కలుగజేయుటకే 'తత్త్వమస్యా'ది మహావాక్యములకు అఖండార్థత్వమును అద్వైతులు అంగీకరించియుండిరి. ఈ విషయమునే

శ్లో॥ సంసర్గా సంగి సమ్యగ్దీ హేతు యాగిరామియం
ఉక్తాఽఖండార్థతా యద్వా తత్పాతిపది కార్థతా॥

అని చెప్పియుండిరి. మరియు భ్రాంతి మూలకము లగునట్టి కుశంకలను దొలగించుకొనలేక “స ఆత్మా తత్త్వమసి" అనుచోట 'అతత్, త్వం, అసి' అని కొందరును, 'తస్మై త్వం, అసి' అని కొందరును, 'తేన, త్వం, అసి' అని అన్యులును, 'తస్య, త్వం, అసి' అని మరికొందరును. ఇట్లు అనేక రీతుల లుప్త విభక్తికముగ ‘తత్' అనుపదమును సమర్థింప పూనుకొనిరి. ఈ యన్ని విధముల చేతను గూడ జీవేశ్వరులకు భేదమే బోధింపబడుచున్నది. తత్త్వమస్యాది వాక్యముల వలన కలిగెడి జీవ పరభేదజ్ఞానము 'నేను బ్రహ్మముకన్న వేరు” అని జీవునకుగల అనాది భేదజ్ఞానమునే బోధించు చున్నది. ఇట్టి సిద్ధజ్ఞానమునే "తత్వమసి" అను మహా వాక్యము బోధించుచో, ఈ మహావాక్యము అనువాద రూపమే యగునుకాని ఉపదేశము కాజాలదు. ఉపదేశమనగా అజ్ఞాతార్థ జ్ఞాపకము (కావున ఇట్టి విపరీతార్ధములు జెప్పి లోకమును మోసపుచ్చు వారలు ఉపేక్ష్యులు) కనుకనే "తత్త్వ మస్యాది వాక్యోత్థ సమ్యగ్ధీ జన్మ మాత్రతః। అవిద్యా సహ కార్యేణ నాసీద స్తి భవిష్యతి” అను నార్యోక్తి తత్త్వమస్యాది వాక్యములవలన గలిగిన అఖండార్థ విషయక మగు సమ్యక్ జ్ఞానమువలన అవిద్య, తన కార్యములతో గూడ నివర్తించుచు కాలత్రయము నందుగూడ లేదనుటను నిరూపించును.

తత్త్వమస్యాది వాక్యజన్యజ్ఞానము శబ్ధ జన్య మగుట చేత శాబ్దమే యగును. ఇట్టి శాబ్దము జీవునియందు నిగూఢ మగు భేద ప్రత్యక్షము నెటుల తొలగించుననినచో, సమాధాన మిది. సన్నికృష్ట స్థలమున 'దశమ స్త్వమసి' అను శబ్దమువలన గూడ ప్రత్యక్షము గలుగునటుల “తత్త్వ మస్యాది" వాక్యములవలన అపరోక్షజ్ఞానము గలిగి, అజ్ఞానమువలన జనించెడి నిఖిల వ్యావహారిక బంధక జ్ఞానమును తొలగించును.

ఆత్మ, “త త్త్వమసి" అను మహావాక్యజన్యమగు ప్రత్యక్ష విషయమగుచో అద్వైతులు జగత్తు మిథ్యయనుటయందు ప్రయోగించిన దృశ్యత్వ మను హేతువు బ్రహ్మమునందు కూడ నుండుటచే ఈ బ్రహ్మము గూడ మిథ్యయనియో లేక దృశ్యత్వ హేతు వ్యభిచారి యనియో అనక తప్పదని శంకింపజనదు.

తత్త్వమస్యాది వాక్యజన్య వృత్తి విషయత్వము, బ్రహ్మమునందుండినను, వృత్తి ప్రతిఫలిత చైతన్య విషయత్వము బ్రహ్మమునందు లేదు. జగన్మిథ్యాత్వమును సంపాదించుటకు ప్రయోగింపబడిన దృక్యత్వ మను హేతువునకు అర్థము వృత్తి ప్రతిఫలిత చైతన్య విషయత్వము. అట్టి దృశ్యత్వము బ్రహ్మమునందు లేనందున బ్రహ్మమునకు మిథ్యాత్వము ప్రాప్తింపదు. దృశ్యత్వహేతువు వ్యభిచారియుగాదు. మరియు దృశ్యత్వమనగ సప్రకారకజ్ఞాన విషయత్వము, “తత్త్వమసి" అను వాక్యమువలన కలిగెడి జ్ఞానము చిద్విషయక మగు నిర్వికల్పకము. సప్రకారకము కానేరదు. కానీ తత్త్వమస్యాది వాక్యముల వలన కలిగెడి నిర్వికల్పక ప్రత్యక్షవిషయత్వము బ్రహ్మమునందుండినను సప్రకారకజ్ఞాన విషయత్వరూపమగు దృశ్యత్వము బ్రహ్మమునందు లేదు గావున జగన్మిథ్యాత్వము సాధించుటకు ప్రయోగింపబడిన దృశ్యత్వము వ్యభిచారి కానేరదు.

లోకమున ఘటాదులకు కారణమగు కులాలాదిచేతనులకు నిమిత్త కారణత్వమే కాని ఉపాదాన కారణత్వము లేదు. అట్లే జగత్తునకు కారణమగు బ్రహ్మము కూడ జగత్తునకు నిమిత్త కారణమే కాని, ఉపాదాన కారణము కానేరదు. అట్లు ఉపాదాన కారణము గూడ బ్రహ్మమే యగుచో కుండలాదుల కుపాదానమగు సువర్ణమంతయు కుండలములుగ పరిణమించినటుల బ్రహ్మమంతయు జగద్రూపముగ పరిణమించి జగత్తుకంటే వేరుగ బ్రహ్మము లేకపోవలసివచ్చును. కొంత బ్రహ్మమే జగద్రూపముగ పరిణమించినచో, బ్రహ్మసావయవము కావలసివచ్చును. బ్రహ్మమునకు సావయవత్వము అంగీకరించినచో, బ్రహ్మమునకు నిరవయవత్వమును బోధించు శ్రుతులు అప్రమాణము కావలసివచ్చునని శంకింపజనదు.

ఈ విషయమునే వ్యాసభగవానులు "కృత్స్న ప్రసక్తి ర్నిరవయత్వ కోపోవా" అను సూత్రముచే ఆశంకించి 'తదనన్యత్వమారంభణ శబ్దాదిభ్యః' అను సూత్రముచేత తగు సమాధానమును జెప్పిరి. ఉపాదాన కారణము 'పరిణామి' ఉపాదానమనియు, 'వివర్త ఉపాదానమనియు రెండు విధములు. అందు జగత్తునకు పరిణామ్యుపాదానము అవిద్య, వివర్తిపాదానము బ్రహ్మము. వివర్తో పాదానమనగా అన్యథాస్థిత మైనది అన్యథా భాసించుటయే. పై విద్ధాంత సూత్రమువలన ఈ విషయమే చెప్పబడెను. జగత్తు బ్రహ్మముకంటె అనన్యము. అనగా బ్రహ్మము కన్న వేరేమియు లేదని తాత్పర్యము. ఎందువల్ల ననిన 'వాచారంభణం' ఇత్యాది శబ్దములవలన ఘటశరావాదులను విచారించినచో, మృత్తుకన్న వేరుగలేవు. మృత్తికనే ఘట శరావాది శబ్దములచే వాడుచుంటిమని ఛాందోగ్యమున చెప్పబడినదియే సూత్రార్థము. కావున బ్రహ్మము జగత్తునకు నిమిత్త కారణము, ఉపాదాన కారణముగూడ నగును. ఈ విషయమునే "ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాం తానుపరోధాత్" అను సూత్రముచే వ్యాసభగవానులు స్పష్టపరచిరి.

ఇట్లు బ్రహ్మసూత్రముల వలనను, భగవద్గీతల వలనను అద్వైతమే బోధింపబడుచున్నది. 'ద్వాసుపర్ణాసయుజా" ఇత్యాది శ్రుతులు జీవేశ్వరభేదమును బోధించినను, ఆ భేదము ఔపాధికము అనిన ఆ శ్రుతులు ఉపపన్నము లగును. అద్వైతబోధకశ్రుతులను అన్యథా వ్యాఖ్యానింప వీలుపడకుండుటచేత అద్వైతమే శ్రుతి, స్మృతి, సూత్ర, పురాణ, ఇతిహాస తాత్పర్యమనుట నిర్వివాదము .

ఋ.ఱ. శా

[[వర్గం:]] [[వర్గం:]]