Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంతర్జాతీయ వ్యాపారము : ఒడంబడికలు

వికీసోర్స్ నుండి

అంతర్జాతీయ వ్యాపారము : ఒడంబడికలు  : 19. వ. శతాబ్దమున అంతర్జాతీయ వ్యాపారవిషయమున అనేక దేశములు విచక్షణారహిత సిద్ధాంతమును(The Principle of Non - discrimination) అవలంబించినవి. ఈ సిద్ధాంతము ననుసరించి ఏ ఇతర దేశమునకైనను ఇచ్చు వ్యాపారసౌకర్యములను అన్ని దేశములకు వర్తింప జేయవలయునని భావము. దీనిని తొలుత ఆమోదించి ఆచరించినది, బ్రిటను దేశము. ఫ్రాన్సు, అమెరికాలు ప్రథమమున ప్రతిఘటించియు కాలక్రమమున అంగీకరించి అవలంబించినవి. దానితో ఈ సిద్ధాంతము సర్వామోదమును బొందినట్లయినది.

1929 లో ఆరంభమయిన ఆర్థికమాంద్యము (Economic depression) అంతర్జాతీయ వ్యాపారము నందును, వ్యాపార పద్ధతుల యందును అనేకములగు మార్పులేర్పడుటకు కారణ భూతమయినది. వ్యవసాయము ప్రధానముగాగల దేశములందు ప్రథమమున ప్రారంభమై ప్రపంచమంతట నావరించిన యీ ఆర్థిక మాంద్యము అపారమైన ఆర్థిక విచ్ఛిత్తికి మార్గదర్శకమయినది. దీనివలన ఉత్పత్తి తగ్గినది. నిరుద్యోగము బలిసినది; కొనుగోలుశక్తి క్షీణించినది; అంతర్జాతీయ వ్యాపారము మిక్కిలి సన్నగిల్లినది. అనేక ముఖ్య దేశములు, తమ తమ దేశములలో ఉత్పత్తి చేసిన సరకులను ఇతర దేశములకు పూర్వమువలె ఎగుమతి చేయలేకపోయినందున దిగుమతులనుగూడ తగ్గించుకొనవలసివచ్చినది.

ఎగుమతి దిగుమతులకు పొత్తుకల్పించుటకై వివిధదేశములు వివిధమార్గములను అవలంబించినవి. అంతర్జాతీయ వ్యాపార విషయములలో ప్రభుత్వములు సంబంధము కల్పించుకొన జొచ్చినవి. దిగుమతి సుంకములను వృద్ధి చేయుట, కరెన్సీ మారకపు విలువలను నిర్ణయించుట, దిగుమతులపై పరిమాణ పరిమితులను (Quantitative restrictions) విధించుట, మున్నగు ననేక మార్గములను అవలంబించి ఎగుమతులను హెచ్చించి దిగుమతులను తగ్గించి రెండిటికిని పొత్తుకల్పింప వివిధదేశములందు ప్రయత్నములు జరిగినవి. ఈ ప్రయత్నములు ఏ దేశమున కాదేశమే ఇతర దేశముల ప్రమేయము లేక ఇతరదేశములపై, తన విధానముల ప్రభావమును లెక్కచేయక, జరుపుట వలన అంతర్జాతీయ వ్యాపారరంగమున అరాజక మేర్పడినది. ఆర్థికమాంద్యము వలన వివిధ దేశములు అనుభవింపక తప్పని చిక్కులతోపాటు ఇతర దేశముల ఆర్థికవిధానముల వలన కలిగిన చిక్కులనుగూడ ఎదుర్కొనవలసి వచ్చెను. రాజకీయ రంగమందువలెనే ఆర్థికరంగమందుకూడ అంతర్జాతీయ సహకారావసరమును మొన్న మొన్నటి వరకు అనేకదేశములు గుర్తింపనేలేదు.

బ్రిటనుదేశము :- ఆర్థిక మాంద్యమువలన కలిగిన విషమ ఫలితములను ఎదుర్కొనుటకు అంతర్జాతీయ వ్యాపారము యొక్క ఒడంబడికల మార్గమవలంబించిన మొదటి దేశము బ్రిటను.

1930వ సంవత్సరమున బ్రిటను దేశమున దిగుమతులకంటె ఎగుమతులు 1030 లక్షల పౌన్లు ఎక్కువగ నుండెను. ఆర్థికమాంద్యము కారణముగ, 1981 లో ఎగుమతులకంటె దిగుమతులే 1040 లక్షల పౌన్లు అధికమయినవి. ఈ అసాధారణ పరిస్థితుల నెదుర్కొనుటకు బ్రిటను అనేక పద్ధతులను అవలంబించినది. అందు మొదటిది పౌను మారకపు విలువను తగ్గించుట. తత్ఫలితముగ బ్రిటను ఎగుమతులు హెచ్చి, దిగుమతులు తగ్గినవి. 1932 నాటికి ఎగుమతులకంటె దిగుమతులు 580 లక్షల పౌన్లు మాత్రమే అధికమయ్యెను. మరుసటి సంవత్సరము రెండును సమానములైనవి.

కాని మారకపు విలువను తగ్గించినందువలన కలిగిన లాభమును బ్రిటను ఎంతయో కాలము అనుభవింపలేక పోయినది. 1933 లో అమెరికా దేశము, 1936 లో ఫ్రాన్సుదేశము, తమతమ కరెన్సీల మారకపు విలువలను తగ్గించినవి. తత్ఫలితముగ బ్రిటనుకు కలిగిన మదృశ్యమయినది.

విదేశములతో వ్యాపారముయొక్క ఒడంబడిక లను గావించుకొనుట బ్రిటను అనుసరించిన రెండవ పద్ధతి. 1932 లో బ్రిటిషు కామన్వెల్తు ఇతర దేశములన్నియు 'అట్టావా' లో సమావేశమై కామన్వెల్తు దేశముల నుండి వచ్చు దిగుమతులపై కామన్వెల్తులో లేని ఇతర దేశములనుండి వచ్చు దిగుమతులపై కంటే తక్కువ దిగుమతి సుంకములను విధించుటకు నిర్ణయించినవి. ఉదాహరణకు:- జపాను దేశమునుండి ఎగుమతియగు వస్త్రములకంటే బ్రిటనునుండి ఎగుమతియగు వస్త్రములకు కామన్వెల్తు దేశములలో రక్షణలభించినది. అట్లే ఇతరములగు సరకులకును రక్షణము లభించినది. ఇంతమాత్రమేకాక కేవలము కామన్వెల్తు దేశముల నుండి మాత్రమేకాక బ్రిటిషు సరకులపై విశేషముగ ఆధారపడు ఇతర దేశముల నుండి కూడ బ్రిటను ఇట్టి సౌకర్యములను సంపాదింప గలిగినది. కాని ఈ యొడంబడిక లవలన బ్రిటిషు సరకులకు కామన్వెల్తు దేశములతో వ్యాపారము హెచ్చినను, ఇతర దేశములతో వ్యాపారము తగ్గినది. తుదకిందువలన బ్రిటను లాభమును పొందినదా లేదా యనునది వివాదగ్రస్తమై మిగిలిపోయినది.

ఇట్లు అంతర్జాతీయ వ్యాపారములో తనభాగమును అధికము చేసికొనుటకు బ్రిటనుపడిన తాపత్రయము సుఖదముగ నుండినట్లు కన్పించినను అవి తాత్కాలికములేయైనవి. ముఖ్యముగ ఇతరదేశములు గూడ బ్రిటను చూపిన మార్గములనే అనుసరించుటతో ఆదేశమునకు తొలుత కలిగిన లాభము మాయమయినది. మరి ఇతరదేశములతో సంప్రదింపక, తన కరెన్సీ మారకపు విలువలను తగ్గించి, తన విదేశవ్యాపారమును వృద్ధినొందించుకొను ప్రయత్నములు చేసికొనుట ప్రతి దేశమునకు పరిపాటియైనది. దానితో కరెన్సీ మారకపు విలువలలో స్థిరత్వము నశించినది. ఇది అంతర్జాతీయ వ్యాపారమునకు బలమైన అంతరాయముగ పరిణమించినది. ద్వితీయ ప్రపంచ సంగ్రామానంతరము అంతర్జాతీయ ద్రవ్యనిధి (International Monetary Fund) ను స్థాపించునంతవరకు ప్రతిదేశమును తనమారకపు విలువలను తగ్గించుటవలన అది లాభమును పొందుటకు ప్రయత్నించు నను భయము పోలేదు.

ఈ విధముగనే వ్యాపారము నందలి ఒడంబడికల వలన కూడా అంతర్జాతీయ వ్యాపారము క్షీణించినది. కామన్వెల్తు దేశములతో ఒడంబడికల ద్వారమున బ్రిటను తన విదేశ వ్యాపారమును హెచ్చించుకొనుటకు చేసిన ప్రయత్నములను ఇతర దేశములు చూచుచు నూరకుండ లేదు. ఆ దేశములు కూడ ఇతర దేశములతో సంప్రదింపులు జరిపి పరస్పర నిర్ణయములు (Bilateral- Agreements) చేసికొనుట కారంభించినవి.ఆ కారణమున అంతర్జాతీయ వ్యాపారము సహజమార్గమున గాక పరస్పర నిర్ణయఫలితమగు కృత్రిమ మార్గమున నడిచినది. అన్ని దేశములును కలిసి, అన్యోన్య సహకారముతో, ఆర్థికమాంద్యమును ఎదుర్కొనియుండినచో అంతర్జాతీయ వ్యాపారము అంతగా తగ్గియుండెడిదికాదు. అట్టి అంతర్జాతీయ సహకారములేని కారణమున ఏ దేశమున కాదేశము తన యార్థికస్థితిని చక్కబెట్టుకొనుటకును, ఎగుమతి దిగుమతులకు పొత్తు కల్పించుటకును విడివిడిగా ప్రయత్నించినందున, కరెన్సీ విలువలలో స్థయిర్యము నశించుట, రెండు రెండు దేశములకు వ్యాపారపు టొడంబడికలు జరుగుట, సామాన్యములయినవి. ఈ విధముగ అంతర్జాతీయ వ్యాపారము తగ్గిపోవుటకు ఈ పద్దతులను ప్రథమ పర్యాయముగ అవలంబించిన బ్రిటనుదే బాధ్యతయని చెప్పకతప్పదు.

జర్మనీ దేశము :- ఆర్థికమాంద్యమును ఎదుర్కొనుటకును, ఎగుమతి దిగుమతులకు పొత్తుకల్పించుటకును. జర్మనీ అవలంబించిన పద్ధతులు అపూర్వములు. ఆర్థిక మాంద్యమువలన కలిగిన నిరుద్యోగ సమస్యను యుద్ధపరికరముల నుత్పత్తిచేయు వ్యాజమున పరిష్కరించినది. అది విషయాంతరము. విదేశ వ్యాపారములో దిగుమతుల అనుమతి విధానము (Import licensing) ను, ఎక్చేంజి కంట్రోలును ప్రవేశ పెట్టినది. అనగా జర్మనీలోనికి విదేశ వస్తువులను దిగుమతి చేసికొనుటకు వ్యాపారస్థులకు ప్రభుత్వానుమతి (License) యుండవలెను. ఎక్చేంజి కంట్రోలు అనగా విదేశములకు ఎగుమతిచేసిన సరకులవలన సంపాదించిన 'విదేశకరెన్సీ' ని, ఎగుమతి వ్యాపారస్థులు ప్రభుత్వాధీనము చేసి, తత్ప్రతిఫలముగ 'జర్మను కరెన్సీ' ని తీసికొనవలెను. ఇట్లు విదేశ వ్యాపారమును క్రమబద్ధముచేయు నధి కారము ప్రభుత్వపరమయ్యెను. ఈ అధికారమును పురస్కరించుకొని జర్మను ప్రభుత్వము ఆగ్నేయ-ఐరోపా దేశములతోను, లాటిన్ అమెరికా దేశములతోను అనేక వ్యాపారపు టొడంబడికలను గావించుకొనినది.ఆ ఒడంబడికలలోని ముఖ్య సూత్రమేమన - ఒక దేశము జర్మనీనుండి ఎంతవిలువగల సరకును దిగుమతిచేసికొనునో అంతే విలువగలసరకును జర్మనీ ఆదేశమునుండి దిగుమతి చేసికొనును. జర్మనీ దేశమునకు తమ సరకులను ఎగుమతిచేయు దేశము లన్నియు తమకు కావలసిన సరకులను జర్మనీ దేశము నుండి దిగుమతి చేసికొనవలసి వచ్చినది. ఈ పద్ధతులను ఇతర పారి శ్రామిక దేశములు తీవ్రముగ విమర్శించినవి. కాని చేయునదిలేక యుద్ధము పరిసమాప్తి యగునంతదనుక వేచియుండక తప్పినది కాదు.

అమెరికాదేశము :- ఆర్థికమాంద్యము నెదుర్కొనుటకు ప్రెసిడెంటు రూజ్ వెల్టు అధ్యక్షుడుగా అమెరికా అవలంబించిన విధానమునకు 'న్యూడీల్' (New Deal) అని పేరు. ఈవిధానము అమెరికా ఆర్థికవ్యవస్థకు తిరిగి స్వస్థత చేకూర్చినది. విదేశ వ్యాపార విషయమున ఇతరదేశములతో వ్యాపారపుటొడంబడికలు చేసి కొనుటకు అధ్యక్షునకు అధికార మీయబడినది. ఇది వ్యాపారపు టొడంబడికల చట్టము (Trade Agreements Act, 1934) గా రూపొందినది.

అమెరికాదేశమున దిగుమతి సుంకముల ద్వారమున దేశ పరిశ్రమలకు, వ్యవసాయమునకు రక్షణ కల్పించుట చిరకాల సంప్రదాయముగనున్నది. ఈ దిగుమతి సుంకములు ఇతర దేశములతో వర్తకపు టొడంబడికలు చేసికొనుట యందు ఆదేశమునకు లాభదాయకమగు నియమములను పొందుపరచుటకు ఉపయోగింపబడినవి. అంతర్జాతీయ వ్యాపారము యొక్క పునర్జీవనమే 1934 లోని వ్యాపారపు టొడంబడికల చట్టము (Trade Agreements Act, 1934) యొక్క ముఖ్యోద్దేశము. ఆ చట్టము ననుసరించి అమెరికా సంయుక్తరాష్ట్రముల అధ్యక్షునకు ఆనాటికున్న దిగుమతి సుంకములను సగమువరకు తగ్గించుటకు అధికార మీయబడినది. అట్లు దిగుమతి సుంకములను తగ్గింపవలెను. ద్వితీయ ప్రపంచ సంగ్రామము నాటికీవిధముగ నిరువది యొక్క వర్తకపు టొడంబడికలు జరిగి అమె రికా దిగుమతులపై గల దిగుమతి సుంకములు 48శాతము నుండి 23 శాతమునకు తగ్గినవి. ఈ వర్తకపు టొడంబడికల వలన చాలవరకు ముందుగా సూహించిన యుద్దేశములు ఫలవంతములైనవి. దిగుమతి సుంకములు పెరుగుటమాని తరుగుట కారంభించినవి. ఈ పునాది పైననే యుద్ధానంతరకాలమున ఈ సమస్యను పరిష్కరించుటకు వలసిన ప్రయత్నములు జరిగినవి.

అంతర్జాతీయ వ్యాపారపు టొడంబడికల చట్టము ఆమోదించిన కాలము నుండియు (1934) అమెరికా దేశము అంతర్జాతీయ వ్యాపారమును పెంపుజేయు పద్దతుల నవలబించుచు వచ్చినది. అమెరికా 1934 నుండి 1939 వరకు గడచిన కాలములో ఇరువది యొక్క దేశములతో వ్యాపారపు టొడంబడికలను గావించుకొని అంతర్జాతీయ వ్యాపార విస్తరణమునకుగల అంతరాయములను నిర్మూలించుటకు గట్టిప్రయత్న మొనర్చినది. యుద్ధ కాలమునందే జరిగిన 'అట్లాంటిక్ ఛార్టరు' అను బ్రిటను అమెరికాల సంయుక్త ప్రకటనమునందు అన్ని దేశములకు వ్యాపారమునందును, ముడిసరకులు సేకరణ యందును సమానావకాశములను కల్పించుటకు అనువుగ తీర్మాన మున్నది.

అంతర్జాతీయ వ్యాపార విస్తరణమునకు యుద్ధానంతర కాలములోని ప్రయత్నములు :- 1943-45 మధ్య కాలమున బ్రిటను, అమెరికా, కెనడా దేశముల ప్రతినిధులు అనేక పర్యాయములు సమావేశమై సమాలోచనములను జరిపిరి. 1945లో అమెరికాదేశము అంతర్జాతీయ వ్యాపార విస్తరణమునకును, సర్వ దేశములయందును నిరుద్యోగ నిర్మూలనము (Full Employment Policy) నకును కొన్ని సూచనలు గావించెను. ఈ సూచనలను అనేక దేశముల ప్రభుత్వములు పరిశీలించి 1947 సంవత్సరాంతమున 'హవానా' యందు జరిపిన సమావేశమున చర్చించినవి. ఈ సమా వేశమున 56 దేశముల ప్రతినిధులు పాల్గొనిరి. 1948 వ సంవత్సరము మార్చి నెలనాటికి "అంతర్జాతీయ వ్యాపార పథక నియమావళిని(International Trade organization charter) 58 దేశము లామోదించినవి. ఈ నియమావళి ననుసరించి అంతర్జాతీయ వ్యాపారపు టొడంబడికలు రెండు రెండు దేశములమధ్యగాక అన్ని దేశములును పాల్గొనుటకు అవకాశము కలిగిన యొడంబడికల మూలమున అంతర్జాతీయ వ్యాపార విస్తరణమే, ప్రధానాంకమయినది. అంతి యేకాక 'అంతర్జాతీయ ద్రవ్యనిధి' (International Monetary Fund) సక్రమముగసాగి, వివిధదేశములమధ్య ఋణపరిష్కారము నిర్నిరోధముగ జరుగవలయుననిన ఇట్టి యొడంబడికలు అవసరమని గుర్తింపబడినది.

వ్యాపారమును, దిగుమతి సుంకములనుగురించిన సాధారణసమ్మతి (General Agreement on Trade and Tariff లేక Gatt) : పై ప్రయత్నముతోపాటు వాణిజ్యసమ్మతుల చట్టము (Trade Agreements Act) క్రింద అమెరికా, 1947లోనే, 15 దేశములతో సంప్రదింపులు ప్రారంభించెను. ఆతరువాత మరి 8 దేశములు కూడా ఈ 'జినీవా' సంప్ర దింపులలో పాల్గొనినవి. ఈసంప్రదింపులలో ఒక ముఖ్య విశేషము గలదు. సంప్రదింపులు రెండుదేశముల మధ్య జరుగును. అందు ఒక దేశము తాను రెండవదేశమునుండి దిగుమతి చేసికొను సరకులపై గల నిర్బంధములను తొల గించుటకు గల అవకాశములను పరిశీలించి, తన అంగీకారమును తెలుపును. అట్లు తాను తొలగించిన నిర్బంధముల వలన కలుగులాభము, సంప్రదింపులు జరిపిన రెండవదేశమే కాక, సమా వేశములో పాల్గొనిన అన్ని దేశములకును గలుగును. అట్లు 1947 వ సంవత్సరము అక్టోబరుమాసాంతమునకు 123 సంప్రదింపులు జరిగి 50,000 సరకులపై గల నిర్బంధములు కొంతవరకు తొలగింపబడినవి. ఈ సమా వేళముల ఫలితములు, వ్యాపారమును, దిగుమతి సుంకములను గురించిన సాధారణ సమ్మతులలో (General Agreement on Trade and Tariff, 1947) పొందుపరుపబడినవి.

రెండు సంవత్సరముల తరువాత 1949 లో 'అన్నెసీ '(Annecy) లో 31 దేశముల ప్రతినిధులు సమావేశమయిరి. ఆ సమా వేశములవలన కలిగిన ఫలితములుకూడ ఆ తరువాత Gatt లో పొందుపరువబడినవి.

ఈ Gatt వలన ప్రపంచ వ్యాపారములో సగము భాగమునకు లాభము కలిగినది, ఈ సమాలోచనములు ఇంకను కొంతకాలమువరకు అప్పుడప్పుడు జరుగుచునే యుండును. ఈ సమాలోచనముల ఫలితముగ అంత ర్జాతీయ వ్యాపారమునకు ప్రస్తుతముండిన నిరోధములు, అంతరాయములు, తగ్గి అంతర్జాతీయ వ్యాపార విస్తరణమునకు దారి ఏర్పడు నని అనేకుల అభిప్రాయము. ఆర్థికముగ వెనుకబడియున్న దేశముల ప్రత్యేకావసరముఅను గుర్తించి ఆ దేశముల పరిస్థితుల కనుగుణముగ ఆయాదేశములు వ్యవహరించుటకు అవకాశములు కల్పించుట ఈ వ్యాపార సంస్థలోని విశేషము. ఈ కారణమువలన ఆర్థిక పురోభివృద్ధిని సాధించిన దేశములును, వెనుకబడిన దేశములును, సమానముగ ఈ సంప్రదింపులలో పాల్గొనుటకు వీలైనది. కాని రష్యా చైనా దేశములీ వ్యాపార సంస్థలలో పాల్గొనకుండుట గమనార్హము.

అంతర్జాతీయ ద్రవ్యనిధి. (International Monetary Fund) :- అంతర్జాతీయ వ్యాపారమునకు అంతరాయము కల్పించిన కారణములలో ఏ దేశమున కాదేశము ఇతర దేశముల ప్రమేయము లేకయే, తన దేశపు కరెన్సీ మారకపు విలువలను నిర్ణయింపబూనుట అని ఇదివరకు సూచింపబడినదికదా ! కరెన్సీ విలువలలో స్థయిర్యము లేనంత కాలమును అంతర్జాతీయ వ్యాపారము ఒడుదుడుకులపాలు కాక తప్పదు. అట్టి స్థిరత్వమును సాధించుటకై అంతర్జాతీయ ద్రవ్యనిధి(International Monetary Fund) 1947 వ సంవత్సరము మార్చినెల మొదటి తేదీనుండి ప్రారంభింపబడి పనిచేయుచున్నది. ఈ ద్రవ్యనిధి నేర్పరచిన సభ్యదేశములు తామావాటికి నిర్ణయించిన తమతమ రెన్సీ విలువలను పరస్పరానుమతిలేక మార్చకూడదనుట నిర్ణయము. ఎగుమతి దిగుమతులకు తాత్కాలికముగా పొత్తు కుదురని కారణమున, ఏ దేశమయినను ఇతరదేశములు చెల్లింపవలసినంత విదేశపు కరెన్సీలను సేకరింపలేని యెడల, నిధినుండి ఋణము తీసికొనవచ్చును. ఈ ఏర్పాటువలన తమకష్టము తొలగనిచో ఎగుమతి దిగుమతులకు పొత్తు కల్పించుటకు తమదేశపు కరెన్సీ విలువలను తగ్గించుట (Devaluation) మొదలగు చర్యలను తీసికొనవచ్చును.

ఈనిధి నియమములు వివిధదేశముల ప్రత్యేకావసరములను దృష్టిలోనుంచుకొని నిర్ణయింపబడినవి. కరెన్సీ విలువలలో మాటిమాటికి మార్పులు జరుగకుండ చేయుటయే దీని ప్రధానాశయము. ఇది వ్యాపారపు టొడంబడిక కాక, క రెన్సీవిలువల విషయమై చేసికొన్న నిర్ణయమైనను అంతర్జాతీయ వ్యాపార విస్తరణమునకు దోహదమిచ్చు ప్రయత్నమగుటచే, ఒకదృష్టితో చూచినయెడల అది అంతర్జాతీయ వ్యాపారపు టొడంబడిక యే యగును.

ఆర్థికమాంద్యము ప్రారంభమయిన అనంతరమున ఉక్కు, రబ్బరు, టీ, పంచదార మున్నగు సరకుల 'గిరాకీ'తగ్గి పోయినది. ఉత్పత్తి యథాపూర్వకముగ సాగుచుండిన కారణమున ధరలు విపరీతముగ తగ్గిపొయినవి. ఉత్పత్తిని తగ్గించి తక్కువసరకును అమ్ముట వలన వచ్చు ఆదాయము కంటె, ఎక్కువసరకును ఉత్పత్తిచేసి విక్రయించుటవలన వచ్చు ఆదాయము తక్కువ. ఆ కారణమున ఆయా సరకుల నుత్పత్తిచేయు దేశములు తమతమ ఉత్పత్తి పరిమితులను నిర్ణయించుటకు తీర్మానించినవి. అట్టి నిర్ణయములు ఉక్కు, రబ్బరు, టీ, పంచదార పరిశ్రమల విషయమున జరిగినవి. ఈ నిర్ణయములు చేసికొనిన సభ్య దేశముల ప్రభుత్వములు ఈ సంప్రదింపులు, నిర్ణయములు జరుపుట ఇందలి వైశిష్ట్యము.

అంతర్జాతీయ వ్యాపారపు టొడంబడికలవలన వ్యాపారము సహజమార్గమునగాక కృత్రిమమార్గముల జరుగును. తత్ఫలితముగ అంతర్జాతీయ వ్యాపారము క్షీణించును అనుటలో వివాదములేదు. ఈ నాడు సుదూరముననున్న దేశములందే ఉత్పత్తియగు వస్తుసంచయమును మనము అనుభవింపగలుగుట, అంతర్జాతీయ వ్యాపార మూలముననే. ఈ వ్యాపార మెంతగా వృద్ధినొందిన ప్రపంచ దేశము లందలి ప్రజల జీవితసౌభాగ్యము అంతగా విలసిల్లును. అంతర్జాతీయ వ్యాపార నిరోధకము లగు వర్తకపు టొడంబడికలు అట్టి అవకాళములను తగ్గించునని వేరుగ చెప్పనక్కరలేదు. అన్ని దేశములందలి ప్రజలు ప్రపంచ మందలి వస్తుసంపదను వీలైనంత అనుభవించుటకు చేయ తగిన మార్గములలో ముఖ్యమయినది ఈ వర్తకపు టొడంబడికలను సాధ్యమయినంతవరకు నిర్మూలించుటయే యగును. ఈ యుద్దేశముతోనే నేడు అంతర్జాతీయ వ్యాపారరంగమున తీవ్రకృషి జరుగుచున్నది. సర్వమానవ ఆర్థికాభ్యుదయమునకు అట్టి కృషి విజయవంతమగుట శ్రేయస్కరము.

కె. స.


[[వర్గం:]]