Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంతర్జాతీయ వాణిజ్యము

వికీసోర్స్ నుండి

అంతర్జాతీయ వాణిజ్యము  : - వివిధములు, ఉన్నతములు, అనేకములు అగు మానవావసరము లన్నియు శ్రమ విభజనమని మనము వర్ణించు సిద్ధాంతము ననుసరించియే తీర్చబడుచున్నవి. ఒక ఆర్థిక వ్యవస్థయందలి సభ్యులు' ఒక ప్రత్యేక వస్తువును ఉత్పత్తి చేయుటయందే శ్రద్ధ వహించి తమసుస్థితికి అవసరమైనతనవస్తువుల నితరులతో మార్పిడి చేసికొందురనుటయే ఈ సిద్ధాంతము యొక్క తాత్పర్యము. శ్రమవిభజన మను సిద్ధాంతముపై ఆధారపడి సరకుల ఉత్పత్తి మార్పిడి సాగించు ఆర్థిక వ్యవస్థ నాగరిక ప్రపంచము సంతను ఆవరించియున్నదను విషయము ఒక్క నిముస మాలోచించినచో మనము గ్రహింపగలము. ఇట్టిపద్ధతి ననుసరించి ప్రపంచమునందలి అన్ని ప్రాంతముల జనులు ఒండొరుల అవసరములను తీర్చుకొనుటకై పరస్పరము సహకరించుచున్నారు. ఆర్థికముగా మిక్కిలి ఉన్నతిని బడసిన జాతులును తమ లాభమునకై అంతర్జాతీయ వాణిజ్యముపై నెక్కువగా ఆధారపడుచున్నవి.

శ్రమ విభజనము, పరిశ్రమల కేంద్రీకరణము అను సూత్రముల వెనుకనున్న సత్యములే అంతర్జాతీయ వాణిజ్యాభివృద్ధికిని కారణములు. జాతులు ఉత్పత్తిని, సామర్థ్యమును అభివృద్ధిచేసి ప్రతిజాతి ప్రపంచమునందలి సరకుల వినియోగమును పొందగల లాభమును అధికము చేయునది అంతర్జాతీయ వాణిజ్యమే. తాను నారింజల పండింపజాలదు కావున ఇంగ్లండు, స్పెయినులనుండి ఆ పండ్లను దిగుమతి చేసికొనును. స్పెయినుకు యంత్రములను నిర్మించుటకు తగినంత శక్తి లేదు, కావున ఆదేశము బ్రిటనునుండి యంత్రములను దిగుమతి చేసికొనును. ఒక వస్తువును తయారుచేయుట యందు ఏదైన దేశమునకు ఒక నిర్దిష్ట సౌకర్యముండుటయే అంతర్జాతీయ వ్యాపార మారంభమగుటకు కారణ మగును.

ఒక దేశమునందు కొన్నిసరకులను ఉత్పత్తి చేయుటకు వీలుండవచ్చును. కాని అందులకు దారుణమగు వ్యయము అవసరము కావచ్చును. ఇటీవల జర్మనీ కృత్రిమమైన సిల్కు, పెట్రోలు, విపరీతమగు ఖర్చుతో ఉత్పత్తి చేయ జాలినది. జర్మనీ యిట్టిపనికి పూనుకొనుటకు కారణములు రాజకీయమైనవి కాని ఆర్థికమైనవి కావు. ఇట్టి సంఘటనలు అరుదు. ప్రతిదేశము ఇతరదేశములకంటే, తాను ఏయే సరకులు తక్కువధరకు ఉత్పత్తి చేయగలదో ఆయా సరకులనే ఉత్పత్తి చేసి, తానే ఉత్పత్తి చేయుటవలన ఎక్కువ వ్యయమగు వస్తువులను వానితో మార్పిడి చేసికొనును.

విదేశములలో అగు ఖర్చుకన్న తక్కువ ఖర్చుకే తాను సరకులను ఉత్ప త్తిచేయగలిగిన పరిస్థితులలో కూడ ఆ సరకు లను విదేశములనుండి దిగుమతి చేసికొనుటయే ఒక్కొక్కప్పుడు ఒక దేశమునకు లాభకరము కావచ్చును. అంతకన్నను ఎక్కువ లాభసాటియగు వస్తువులను తయారు చేయుటయందే దిగుమతిచేసికొను దేశము ప్రత్యేక నైపుణ్యము కలిగియుండుటయే దీనికి కారణము. దీనినే తారతమ్యవ్యయ సిద్ధాంతము (థియరీ ఆఫ్ కంపేరిటివ్ కాస్ట్స్) అని యందురు.

అంతర్జాతీయ వాణిజ్యముయొక్క లక్ష్యము ఒక వస్తువును ఇంకొక వస్తువుతో మార్చిడి చేసికొనుట ద్వార వీలయినంత ఎక్కువ లాభము పొండవ లెననుట యే.అంతర్జాతీయ వాణిజ్య సిద్ధాంతమునకు దేశాంతర్గత వాణిజ్యసిద్ధాంతమునకు మధ్య భేదముకలదు. దేశాంతర్గత వ్యాపారమునందు ఉత్పత్తిసాధనములు తమకు అధిక ప్రతిఫలము లభించు ప్రాంతములకు వృత్తులకు మారుచుండును. ఉత్ప త్తిసాధనముల మార్పు వివిధ దేశముల మధ్య అంత స్వేచ్ఛగా జరుగదు. ఒక దేశమునుండి కార్మికులు మరియొక దేశము వలసపోవుటకు విశేషమైన ఖర్చులు, భాష, భావ భేదములు అడ్డంకు లగుచున్నవి. పెట్టుబడిని ఇచ్చిపుచ్చుకొనుట అంతకష్టమైనది కాకపోయినను, పెట్టుబడిదారుల అజ్ఞానము విదేశములలో పెట్టుబడి పెట్టుటలోగల అపాయములు ఇందుకును కొంతవరకు అడ్డం లగుచున్నవి.

వివిధ రాజకీయప్రాంతముల నడుమ కార్మికులు పెట్టుబడి, సులభముగా రాకపోకలు సాగించలేక పోవుటకు భాష, చట్టములు, ద్రవ్యమానము, మత, సాంఘిక విషయములందుగల తారతమ్యములు, భయము, అజ్ఞానమదతనము, భావభేదములు కారణము లగుచున్నవి. పెట్టుబడి విషయములందుకంటే కార్మిక విషయములలో నే. ఈ అడ్డంకులు ఎక్కువగా వర్తించును. పెట్టుబడిదారులు కూడ కార్మికులవలెనే సాధ్యమైనంతవరకు స్వదేశమందే తమధనమును పెట్టుబడి పెట్టుటకు ఇష్టపడుదురు. అంతర్జాతీయ దేశాంతర్గత వ్యాపారముల మధ్యగల మరియొక ముఖ్యభేదము రెండుదేశములలోను వేరువేరు ప్రభుత్వములుండుట వలన సరకుల రాకపోకలు సులభముగా జరుగుటకు రాజకీయపు ఆటంకము లేర్పడుట.

పోటీవిధానము ఈ కారణములవలన ఒకేదేశము నందు వలె ఒకేవిధమైన వస్తువుల ఉత్పత్తి కగు ఖర్చులు సరి సమానముచేయ లేదు. అనేకములగు వస్తువులను తయారుచేయుట యందు వివిధదేశములకు ఈ విధముగా అసమాన ములు కాని లాభములు వచ్చుట ఈ విధముగా సంభవించును. ఈ కారణముచే వివిధ దేశములు కూటములు ఒక దానితో నొకటి పోటీచేయు అవకాశము సన్నగిలుచున్నది. ఇంతేగాక శీతోష్ణస్థితి మొదలగు ప్రకృతి కారణములు అవకాశములందు వ్యత్యాసములుకూడ సంభవించు చుండును. ప్రాంతీయ శ్రమవిభజనము, పరిశ్రమల కేంద్రీకరణము ఈ విధముగా సంభవించుచున్నవి. ఉదాహరణమునకు ఖనిజసంపద ఒక దేశమునందు ఎక్కువగా నుండ వచ్చును. బెంగాలువంటి కొన్ని ప్రదేశములు జనుము మాదిరి పంటలను పండించుట కనుకూలమైన శీతోష్ణస్థితి, సారవంతమైన భూమి కలిగియుండవచ్చును. ఇట్టి సౌకర్యములను ఒక దేశమునుండి మరియొక దేశమునకు మార్చుట అసాధ్యము కావచ్చును. లేదా అట్టిది సాధ్యమైనను మిగుల వ్యయకరము కావచ్చును.

అంతర్జాతీయ వాణిజ్యము - తారతమ్యవ్యయ సిద్ధాంతము :- అంతర్జాతీయ వ్యాపారము, అందు పాల్గొనువార లెల్లరకు లాభకారియను విషయము ఇటీవలనే గుర్తింపబడినది. అంతర్జాతీయశ్రమ విభజన మను సిద్ధాంతమును డేవిడ్ హ్యూం, ఆదమ్స్మిత్ అను అధునిక అర్థ శాస్త్రప్రవక్తలు 18 వ శతాబ్దపు అంత్యభాగమున ప్రవచించిరి. వివిధ దేశములమధ్య సరకుల మార్పిడియు దేశాంతర్గత వ్యాపారమునందువలెనే శ్రమ విభజనము, పరిశ్రమల కేంద్రీకరణము అను సూత్రములపై ఆధారవడి నడుచు ననుటయే ఈ ప్రవచనము యొక్క అర్థము. ప్రతివారును తమకు ఏ వస్తువును ఉత్పత్తి చేయుటయందు ఎక్కువలాభములున్నవో ఆవస్తువులనే ఉత్పత్తిచేసి తమకు ఆర్ధికముగా క్షేమకరములైన ఇతర వస్తువులను మార్పిడి చేసికొనవలెను. ఏదేని విదేశము మనకన్న తక్కువధరలకు ఒక వస్తువును తయారుచేసి ఈయగలిగిన యెడల ఆదేశమునుండియే ఆ వస్తువును మనకు అధిక ప్రావీణ్యముగల వస్తువులను ఉత్పత్తిచేసి అమ్మగా వచ్చిన ధనముతో తీసికొనవలెను.

రాగి, బట్టలు, అను రెండు సరకులలో బ్రిటను, అమెరికాలమధ్య వ్యాపారము జరుగుచున్నదనుకొందము. అంతేగాక ఆ రెండు సరకుల తయారుచేయుట యందు అమెరికాకు బ్రిటనుకున్న అనుకూలమగు పరిస్థితులు గలవనియు, కాని బట్టలు తయారుచేయుటకన్న రాగి నుత్పత్తి చేయుటయందు ఇంకను ఎక్కువ లాభములు గలవనియు ఆనుకొందము. అట్టి పరిస్థితులలో సరుకుల మార్పిడి జరుగును. ఫలిత మేమన అమెరికా, రాగిని ఉత్పత్తి చేయుటయందు ప్రత్యేకత వహించి, బట్టలు ఉత్పత్తిని బ్రిటనుకు వదలి వేయును. అమెరికన్ రాగి బ్రిటిష్ బట్టలకు మార్పిడియగును. ఏవస్తువులు తయారుచేయుట యందు అమెరికాకు మిక్కిలి ఎక్కువ ఆధిక్యము గలదో ఆ వస్తువులు తయారు చేయుటయందే తన యుత్పత్తి సాధనములను వినియోగించుటయే ఇందుకుగల కారణము, ఈ మాదిరి పరిస్థితులలో రెండుదేశముల మధ్య వ్యాపారము జరుగుట తథ్యము.

పై ఉదాహరణమునందు రెండు దేశములమధ్య జరుగు అంతర్జాతీయ వ్యాపారములను నిర్దిష్టవ్యయమునకు మారుగా తారతమ్య వ్యయముపై ఆధారపడియున్నది. "ఆర్థికశాస్త్ర సిద్ధాంతములు మరియు పన్ను విధానము " అను గ్రంథమునందు రికార్డ అను రచయిత ప్రవచించిన తారతమ్యవ్యయ సిద్ధాంతములోని అంతరార్థమిదియే. ఒక దేశమందు వివిధవృత్తులనడుమ కాలక్రమేణ లాభములు సరిసమానములగుట జరుగును. కాని వివిధ దేశముల మధ్య అట్టిది అసంభవమని రికార్డో తెలిపెను. అంకెలతో కూడిన ఒక ఉదాహరణము నిచ్చుచు అతడు పోర్చుగలు దేశము బట్టలను, ద్రాక్షసారాయిని ఇంగ్లండుకంటె తక్కువ ఖరీదుకు ఉత్పత్తి చేయగలిగినను ద్రాక్ష సారాయిని తయారుచేయుటయందు ఎక్కు వలాభసాటి అవ కాశములు కలిగిన యెడల పోర్చుగలు ద్రాక్ష సారాయమునే తయారుచేసి బట్టలను ఇంగ్లండునుండి దిగుమతి చేసికొనుట మంచిదని నిరూపించెను. రాగిని ఉత్పత్తి చేయుటకన్న బట్టలను తయారుచేయుట యందే ఇంగ్లండు తనశ్రమను పెట్టుబడిని వినియోగించినచో ఇంగ్లండుకు ఎక్కువ ధనసంపద సమకూడును. ఇదే కారణమువలన అమెరికా ఇంగ్లండుకు రాగిని ఎగుమతిచేసి బట్టలను ఇంగ్లండునుండి కొనును.దీర్ఘ కాల ప్రయోజనదృష్ట్యా ఈవిధానము రెండుదేశములకు లాభకరమగుమ. తారతమ్య వ్యయ సూత్రము విదేశ వ్యాపారమునకు మాత్రమే వర్తించుననుట పొరపాటు. ఒకేదేశమందు వివిధజిల్లాల యొక్క ప్రత్యేక ఆధిక్యములననుసరించి ఆ జిల్లాలనడుమ వస్తువులమార్పిడి జరుగుచుండును, ఉత్పత్తి యొక్క అన్ని శాఖలయందును ఏదైనా జిల్లా తక్కిన జిల్లాలకన్న ఎక్కువ ఆధిక్యమును కలిగియున్న యెడల, కార్మికులు పెట్టుబడి తక్కువ జిల్లాలనుండి ఈజిల్లాకు వలసపోయి ఉత్ప త్తిలో పాల్గొని లాభమును పొందుట జరుగును. ఒక దేశమందైనను, ఒక స్థిరనిశ్చల పరిస్థితి పొందునటుల శ్రమ, పెట్టుబడిపోకడ సాగింపజాలవు. రెండుజిల్లాలనడుమ అట్టి స్థిర నిశ్చలత్వము ఏర్పడనంత వరకు సరకులమార్పిడి జరుగుచునే యుండును.

దేశాంతర్గత వ్యాపారములలో కూడ శ్రమ, పెట్టుబడుల గమనము అడ్డంకులతో కూడిన విషయమే. విదేశ వ్యాపార విషయములో ఈ గమనము మరింత బాధాకరము. జె. ఇ. కైర్న్ మహాశయుడు పేర్కొనినట్లు పెట్టుబడిని, కార్మికులను పోటీలేని వర్గములమధ్య మార్పుచేయుట అంతర్జాతీయ వాణిజ్యమందు మనము యోచించవలసిన విషయము. ఈ యుత్పత్తి సాధనములు అంతర్జాతీయ సరిహద్దులగుండ ప్రయాణించుటకు అనుకూలమైనవికావు. రికార్డ్ల్లో ప్రధమమున తారతమ్య వ్యయ సిద్ధాంతమును ప్రవచించిననాటినుండి అంతర్జాతీయముగా ఉత్ప త్తిసాధనముల స్వేచ్ఛాగమనము ఎంతయో సులభమాయెను. కాని దేశాంతర్గత గమన మంతగా కాదు, సిద్ధాంతమునే తలక్రిందుచేయునటులు అంతకన్నను కాదు. సరకులు దిగుమతి చేసికొన్న దేశములు ఎగుమతిచేయు ప్రాంతముల అంతకన్న తక్కువ శ్రమ పెట్టుబడులతో ఆయా సరకులు తయారుచేసి కొనగలిగినను అంతర్జాతీయ వ్యాపార మార్గములద్వారా అనేకములగు సరకులు గమించుచున్నవి. ఆ సరకులు దిగుమతి చేసికొనుటకు కారణము దిగుమతిచేసికొనుచు దేశములకు ఇతర వస్తువులను తయారుచేయుటయందు ఇంకను హెచ్చగు ఆధిక్యముండుటయే. ప్రతిదేశము ఒక సరకును ఏదేని ఒక విదేశముకన్న తక్కువ ఖరీదుకు ఉత్పత్తి చేయగలిగినంత మాత్రమున దానిని తప్పక తయారుచేయుననుట కాక, మిక్కిలి హెచ్చగు లాభసాటి అవకాశములకు మిక్కిలి తక్కువయగు లాభసాటి ఖర్చులకు తయారుచేయగల సరకులను మాత్రమే ఉత్పత్తిచేయుననుటయే అంత ర్జాతీయ వాణిజ్యమునకు సంబంధించినంతవరకు తారతమ్య వ్యయ సిద్ధాంతము. ఏ ఏ సరకులను ఉత్పత్తిచేయుటయందు తన ఆధిక్యము సుస్పష్టములేక ఏయే సరకులను ఉత్పత్తి చేయుటయందు తన అసామర్థ్యము హెచ్చుగా 'కానరాదో అట్టి సరకులనే ప్రతిదేశము తయారుచేయును. ఈ సూత్రము దాని పునాదులయిన శ్రమవిభజనము, పరిశ్రమల కేంద్రీకరణము అను ఆర్థిక సిద్ధాంతములు అమలు జరిగిన కొలది ప్రపంచమందంతటను ఉత్పత్తి ఆర్థిక సామర్థ్యము వృద్ధినొందదు. ప్రతి వ్యక్తిని సంక్రమించు భాగముకూడ హెచ్చగును. • పరిమితులు :- సరకులు ఉత్పత్తియందు తారతమ్య వ్యయభేదములున్నంతవరకే రెండు దేశముల మధ్య వ్యాపారము సాగునను రికార్డో సిద్ధాంతము సత్యమే. కాని రికార్డ్లో ప్రవచించిన రూపమున అది పెక్కు అంశములలో అసంపూర్ణము, తారతమ్య వ్యయములు అంతర్జాతీయ వ్యాపారములోనికి వచ్చుసరకుల జాబితాను మాత్రమే నిర్ణయింపగలవు కాని మార్పిడి షరతులను అనగా ఎన్ని సరకులు దిగుమతి చేసికొనబడునో ఎన్ని సరకులు ఎగుమతి చేసికొనబడునో మార్పిడి అగునది ఎన్ని సరకులు అను విషయమును నిశ్చయింపవు.'క’అనుదేశమునకు సూలుబట్టలు తయారుచేయుటయందు ఎక్కువ లాభసాటియగు అవకాశములు కలవు, కావున వానిని ఉత్పత్తి చేయుచున్నచో "చ" అను దేశము అట్లే ఉన్ని బట్టలను తయారుచేయుచున్నచో ఏసూత్రము ననుసరించి ఆ రెండుదేశములు తారతమ్యవ్యయ సిద్ధాంతమును అమలు జరుపుట వలన వచ్చినలాభములను పంచుకొనును అనుప్రశ్న ఉదయింపగలదు. అది మారకపు రేటు పై ఆధార పడియుండును. ఈమారకపు రేటు ఎట్లునిర్ణయించబడును? విపణియందలి బేరముచేసికొను పద్దతినిబట్టి అని ఆడమ్స్మిత్ ఉద్దేశానుసారముగా రికార్డ్లో అనుచరులిచ్చిన సమాధానము సంతృప్తి కరముగా లేదు. ఆధునిక ఆర్థిక సిద్ధాంతము ననుసరించి వేరొక దేశము యొక్క సరకులపట్ల ఒక దేశమునకుగల "అపేక్ష విస్తరణశక్తి"(యెలాస్టిసిటీ ఆఫ్ డిమాండు) పై ఆధారపడి మార్పిడి నిష్పత్తి యుండును. పై ఉదాహరణమునందు చూపబడినటుల “క” నూలుబట్టల నుత్పత్తి చేయుటయందును, "చ" ఉన్నిబట్టలు తయారు చేయుటయందును శ్రద్ధవహించుచుండగా 'క' 'చ' యను రెండు దేశములనడుమ లాభకరమగు వ్యాపారము సాగు చుండినచో, "క" దేశమునకు ఉన్ని బట్టల యెడల "చ" దేశమునకు నూలుబట్టల యెడలగల అపేక్ష విస్తరణశక్తుల ననుసరించి మార్పిడి రేటు ఉండును. "చ" దేశమునకు నూలుబట్టల యెడలగల అపేక్ష విస్తరణశక్తికన్న 'క' దేశమునకు ఉన్నిబట్టల యెడగల అపేక్షవి స్తరణశక్తి ఎక్కువైన మార్పిడిషరతులు “క” దేశమునకనుకూలముగనుండును. కొన్నీ నూలు బట్టలకుబదులు అంతకన్న యెక్కువ ఉన్ని బట్టలు “క” పొందును. ఇదియే “చ”కును వర్తించును.

సనాతన (క్లాసికల్) ఆర్థికశాస్త్రజ్ఞులు వ్యయమును, శ్రమించిన దినములను బట్టియే నిర్ణయించుట వారి యొక్క తారతమ్య వ్యయసిద్ధాంతమునందలి మరియొక లోపము. శ్రమాధార మూల్య సిద్ధాంతమందు వారికిగల నమ్మికయే దీనికి కారణము. ఆధునిక వాదులు ఉత్పత్తికగు వ్యయమును, శ్రమను బట్టి నిర్ణయించుటలేదు. ఉత్పత్తి సాధనముల యెక్కువ తక్కువ కొలతలను స్ఫురింపచేయునటుల అదనపువ్యయము (మార్జినల్ కాస్టు ఆఫ్ ప్రొడక్షను) సిద్ధాంతపు పరిభాషలో వారే సిద్ధాంతీకరింతురు. దీని ననుసరించి ఒక దేశము సమృద్ధియైన ఉత్పత్తి సాధనముల ఫలితముగ తయారైన సరకులను ఎగుమతి చేసి కొరతగానున్న యుత్పత్తి సాధనములచే తయారు కావలసిన సరకులను దిగుమతి చేసికొనును.

అంతర్జాతీయ వాణిజ్యార్థమై సరకు యొక్క ఆవశ్యకత పెరిగి తత్ఫలితముగ కలుగు ఉత్పత్తి పెంపుదల స్థిర ఫలిత సూత్రమునకు లోబడి వర్తించునని రికార్డో భావించెను. కాని అంతర్జాతీయ పారిశ్రామిక ప్రత్యేకతల వలన ఉత్పత్తి పెరుగుదల ఎల్లప్పుడు స్థిరపరిస్థితిలో నే జరుగదు. ఉత్పత్తి అధికమగుకొలది ఖర్చు తగ్గుచుండినచో తారతమ్య సౌకర్యము హెచ్చుచుండును. కాని ఉత్పత్తి ఎక్కువగుకొలది వ్యయము కూడ హెచ్చుచుండిన యెడల తారతమ్య సౌకర్యము తగ్గిపోవును. కొన్ని సందర్భములలో అది అంతరించుటయు జరుగును. అట్టి సరకులపట్ల అంతర్జాతీయ వాణిజ్యము ఆగిపోవును.

రెండు దేశములనడుమ ఉత్పత్తికగు వ్యయములో తేడా కనుపించినచో అది ఆయా ప్రాంతములలోనున్త ఉత్పత్తి సాధనముల కొలతను తెలియ జేయునను అంశమును మనస్సునం దుంచుకొనినచో రికార్డో పరిశీలనములను ఆధునిక సిద్ధాంత ములతో అన్వయింపగలము. ఫలిత మేమన, ప్రతిదేశము తన ఉత్పత్తిసంపద ఏసరకులను తయారు చేయుటకు హెచ్చు పుష్కలముగా అవకాశమున్నదో ఆసరకులనే తయారుచేయును. ఏ ఉత్పత్తి సంపదయందు కొరతగలదో ఆ ఉత్పత్తి సంపద నుపయోగించి తయారుచేయు వస్తువుల ఉత్పత్తిని తగ్గించి వేయును.

అంతర్జాతీయ ఉత్పత్తి ప్రత్యేకతల విషయములో నిది చాల ప్రాముఖ్యముగల అంశము.

తారతమ్యవ్యయ సిద్ధాంతముయొక్క నిజస్వభావము :- వ్యయము అనుమాటకు అర్థములు అనేకములు. తారతమ్యవ్యయ సిద్ధాంతమునకు అర్థము చెప్పునప్పుడు ధనరూపక మైన వ్యయమునే మనము సూచించితిమి. వివిధ ప్రాంతముల నడుమ ఉత్ప త్తికగు ధనవ్యయములో తారతమ్యములే అంతర్జాతీయ వ్యాపార గమనమును నిర్ణవ్యాపారగమనమును యించునను విషయము యదార్థమే. కానీ ధనరూప వ్యయమున సరకుమార్పిడి సంబంధములే ప్రతిబింబించును. ఏమైనను వ్యయము కొంతవరకు అంతర్జాతీయ వ్యాపార ఫలితమే. ఏలయన అంతర్జాతీయ వ్యాపారము లేనిచో కొన్ని దేశములందు ధనరూపవ్యయము వేరుగానుండును.

రికార్డో దృష్టిలో నిజమైన వ్యయము శ్రమవ్యయమే. శ్రమ విభిన్నత లేని ఒకే ఉత్ప త్తిసాధనగా పరిణమించుటపై అతని సిద్ధాంతము ఆధారపడియున్నది. ఉత్పత్తి వ్యయము వివిధ తెగలకు స్థాయీలకు చెందిన పెక్కు విషయములపై ఆధారపడును. ఇందు కొన్ని యంశములు నిర్దుష్టమైనవి. తక్కినవి బహుళ ఉపయోగములు గలవి. వాస్తవమైన సిద్ధాంతము ఈ అంశములన్నిటినీ గమనించవలెను.

మార్పిడి సంబంధముల నిశ్చయిం చునవి తరతమ భేదములు, తెలియజేయు వ్యయములు లేక అవకాశ వ్యయములు. ఈ ఖర్చులకు, కారణము ఉత్పత్తి కవసరమగు సంపద దానిపై గల అపేక్షతో పోల్చినపుడు ఏ దేశమందయినను కొరతగా నుండుటయే. కావున ఆ కొలది యైన సంపద ను ఏ విధముగా ఉపయోగించవలెనని యెంచి చూడవలసియున్నది. "క" అను వస్తువును తయారు చేయుటయందు ఒక దేశము తన సంపదనంతయు. వినియోగించిన యెడల నిజముగా అది "చ" అను వస్తువును కొలదిపాటిగా కూడ తయారు చేయజాలదు. అది యొక యూనిటు. "చ" అను వస్తువును తయారు చేసికొన దలచినను "క" యను వస్తువును తయారు చేయుటలో ఒక యూనిటు గాని అంతకన్న ఎక్కువగానిత్యాగము చేయవలసి యుండును.

"చ" అను వస్తువును ఒక యూనిటు తయారు చేయుటకు, “క”అను వస్తువు యొక్క 3 యూనిట్లు ఆ దేశము త్యాగము చేయవలయు నని మనమూహించినచో, రెండు సరకుల ఉత్పత్తి నడుమ మన మొక నిష్పత్తి నిర్మింప జాలితిమి. దీనినే తారతమ్య వ్యయ నిష్పత్తి యనిగాని, అవకాశ వ్యయ నిష్పత్తి (ఆపర్చూనిటీ కాస్టు రేషి యో) అనికాని అనదగును. ఏలయన ప్రతిదేశము ఒక వస్తువు నెక్కువగను, ఇంకొక వస్తువును తక్కువగను తయారు చేయదలచినపుడు ఒకదానికి బదులుగా మరియొక దానిని తయారుచేయుటయే జరుగుచున్నది.

ప్రత్యామ్నాయపు నిష్పత్తులు వివిధ దేశములకు వేరు వేరుగానుండును. ఉత్పత్తి సాధనములు పుష్కలముగా నుండుట, తక్కువగానుండుట, వాటి భేదముల హెచ్చు తగ్గులు, వివిధ దేశములకు వేర్వేరుగా నుండుట ఇవియే కారణములు, ఈ తారతమ్యములే అంతర్జాతీయ వ్యాపారము లాభకరము చేయుచున్నవి. "చ" అను వస్తువు యొక్క ఒకయూనిటు తయారుచేయుటకు 3 యూనిట్ల "చ" అను వస్తువును ఒక దేశము కోల్పోవలసివచ్చినచో మరియు "చ" అను వస్తువు యొక్క ఒక యూనిటు ఏదేని పేరు ప్రత్యామ్నాయపు నిష్పత్తిగల విదేశమునుండి యూనిట్ల “క” కన్న తక్కువ మార్పిడి నొసంగి తెచ్చు కొనగల్గినచో (రవాణాలకు అగు ఖర్చులు లేవనుకొనిన పక్షమున) ఆ దేశమునకు "క" ను మాత్రమే తయారు చేసికొని 'చ' ను పొందకలుగుటయే లాభకరము.

ఈ ప్రత్యామ్నాయపు నిష్పత్తులు ఏ దేశమునందును మార్పుచెందక ఒకేవిధముగా నుండవు. ఉత్పత్తి హెచ్చిన కొలది ఆరోహణ ఫల సూత్రము, అవరోహణ ఫల సూత్రము అను ఆర్థిక సిద్ధాంతములపై ఆధారపడి మారుచుండును. రెండు వస్తువులకు రెండు దేశములకు సంబంధించినవిగా చెప్పబడిన ఈ అంశములన్నియు రెండుకన్న ఎక్కువ దేశములకు, ఎక్కువ వస్తువులకు అన్వయించు నటులు విస్తరింపనగును.

డా. జి. రా. రెడ్డి.

[[వర్గం:]]