Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంతర్జాతీయ న్యాయము (సార్వజనికము)

వికీసోర్స్ నుండి

అంతర్జాతీయ న్యాయము (సార్వజనికము) Public International Law] :- అంతర్జాతీయ న్యాయశాస్త్ర మనగా నేమి ? పరిణామము యొక్కయు చారిత్రికావసరముల యొక్కయు మంద ప్రవృత్తిచేత సార్వజనికమయిన(Public)అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క నియమములు అంతర్జాతీయ సమాజములో పెంపుగాంచి యున్నవి. సార్వజనిక మగు (Public) అంతర్జాతీయ న్యాయశాస్త్రము వైయక్తికమగు అంతర్జాతీయ న్యాయశాస్త్రము కంటె భిన్నమయినది. ఇందు సాధారణముగా రాజ్య సముదాయములు పరస్పరముగా ప్రదర్శింపదగిన నడవడిని నిర్ణయించెడి నియమము లుండును. వైయక్తికమగు (Private) అంతర్జాతీయ న్యాయశాస్త్రము విశదముగా వ్యక్తులతో సంబంధము కలిగియున్నది. సార్వజనిక మగు అంతర్జాతీయ న్యాయశాస్త్ర సూత్రములు అట్లుగాక, ఒకటి అంతకంటే ఎక్కువసంఖ్యగాగల రాజ్యముల మధ్యగల సంబంధమును వివరించుచు సాధారణముగా రాజ్యమును పరస్పరము అవశ్యకర్తవ్యముగా గుర్తింపదగిన నడవడిని నిర్ణయించును. కాని ఆధునిక కాలపుపరిణామము లనుబట్టి చూచినచో, అంతర్జాతీయ న్యాయము రాజ్యములకుమాత్రమే సంబంధించినదని శాసించి చెప్పుటతప్పు. వివిధ రాజ్యముల మధ్య క్రమమును న్యాయబద్ధమునై న జీవనమును, సహజమైన మైత్రిని స్థాపించుటలో ఈ సూత్రములును నియమములును విశేషముగా కారకములయ్యెననుటలో సందేహములేదు. గడచిన రెండు ప్రపంచ యుద్ధములు, తరువాతి సంఘటనలును కలిగించిన ఫలితముగా, జటిలములును,సుసంఘటితమును అయిన అ నేక సంస్థలును, అంతర్జాతీయ న్యాయశాస్త్ర సమ్మత వ్య క్తిత్వముగల అంతర్జాతీయ జనసంఘములును బయలుదేరినవి. వాటికి అంతర్జాతీయ న్యాయసూత్రములు వర్తింప జేయబడినవి. అంతర్జాతీయ సంస్థల యొక్క ప్రత్యక్ష నిర్వహణమునకు సంబంధించిన నియమములకును, ఆ సంస్థలలో ఒక దానితో మరి యొకదానికి గల భిన్న సంబంధములు, భిన్న రాష్ట్రములతో వాటికి గల సంబంధములకును సార్వజనికమయిన (Public)అంత ర్జాతీయశాస్త్రన్యాయములో స్థాన మొసంగబడినదని గమనించుట ముఖ్యవిషయము. అంతేకాక, రెండవ ప్రపంచయుద్ధము ముగిసిన తర్వాత అంతర్జాతీయ న్యాయశాస్త్రములో కొన్ని క్రొత్తసూత్రములు బయలు వెడలినవి. అవి ముఖ్యముగా కొన్ని తరగతుల వ్యక్తులకు మాత్రమే సంబంధించినవి. న్యూరెంబర్లు, టోకియోలలో అంతర్జాతీయ సైనిక న్యాయసభలచే విచారింపబడిన యుద్ధాపరాధుల విషయము దీనికి ఉదాహరణము. అంతర్జాతీయ న్యాయము భిన్న రాష్ట్రముల మధ్యనుండు నియమములకు మాత్రమే ముఖ్యముగా వర్తించును అను న్యాయశాస్త్రజ్ఞుల పూర్వాభిప్రాయమును ఈ పరిణా మము పూర్తిగా రద్దుచేసినది. ప్రత్యేక వ్యక్తులు కూడ అంతర్జాతీయ న్యాయము ననుసరించి నిర్వర్తింపవలసిన కొన్ని హక్కులును, ఆవశ్యక కార్యములును కలవను విశ్వాసమును యుద్ధాపరాధములను గూర్చిన భావన కలిగించినది. ఐక్యరాజ్య సమితిచే ఆమోదింపబడిన రీతిగా మానవుని హక్కుల యొక్క ప్రతిపాదనము ఈ విశ్వాసమును ఇంకను ఎక్కువగా బలపరచినది. అందుచే ఈ ఆధునిక పరిణామములనుబట్టి అంతర్జాతీయ న్యాయశాస్త్రము తిరిగి యిట్లు నిర్వచింప బడవలసియున్నది. ఎట్లనగా:- చాలవరకు రాష్ట్రజనులు మనస్సాక్షిగా తమకు అవగ్యాచర ణీయము లని భావించునట్టియు, పరస్పర అలవాటు ప్రకారము ఒక రాష్ట్రమువారు అన్య రాష్ట్రీయుల పట్ల అనుసరించునట్టియు న్యాయసూత్రముల యొక్క సముదాయమే అంతర్జాతీయ న్యాయము. అయినను దానియందు అంతర్జాతీయ సంస్థల యొక్కయు లేక వ్యవస్థల యొక్కయు ప్రవృత్తులకును, వాటి అన్యోన్య సంబంధములకును చెందిన నియమములుగూడ ఇందులో చేరియున్నవి. మరియు ప్రత్యేకవ్యక్తులకును, ఇతరరాష్ట్రీయులకును సంబంధించి, వారికి కొన్ని హక్కులను, ధర్మములను విధించెడి న్యాయశాస్త్ర నియమములు గూడ ఇందులో చేరియున్నవి.

ఆంతర్జాతీయ న్యాయశాస్త్రముయొక్క ఉద్దేశము:- శాంతి కాలములోగాని, యుద్ధ కాలములోగాని, అంతర్జాతీయ సమాజములోని న్యాయపరిపాలన (Rule of Law) సూత్రమును వర్తింపజేయుట "సార్వజనికమగు అంతర్జాతీయ న్యాయము” యొక్క ప్రధానోద్దేశమై యున్నది. సార్వజనికమగు అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క నియమములు తరచుగా శాంతి సమయమందే గాక, యుద్ధమువంటి అసాధారణ పరిస్థితులయందును తటస్థ స్థితియందునుగూడ అలవాటును బట్టి అనుసరింపబడుచున్నవి.

అంతర్జాతీయ న్యాయశాస్త్రముయొక్క ఉత్పత్తి వికాసములు :- అంతర్జాతీయ న్యాయము యొక్క నియమములు మానవ నాగరికత యొక్క ఉదయకాలము నుండి ఉద్భవించియున్నవి. రాజదూత, లేక రాయబారులను రక్షించు నియమములు, యుద్ధధర్మములు, ప్రాదేశిక ఆధిపత్య నియమములు మున్నగు సూత్రములు ప్రాచీన గ్రీసునందలి రోమన్ విజయమునకు పూర్వయుగముల నుండియును, ప్రాచీన భారతమునందలి పురాణయుగము నుండియును అనుసరింపబడుచున్నట్లు తెలియుచున్నది. అతి ప్రాచీన కాలపునాటి అంతర్జాతీయ న్యాయశాస్త్రముకంటె భిన్న మైన ఆధునిక కాలపు అంత ర్జాతీయ న్యాయశాస్త్రము గడచిన నాలుగు, ఐదు శతాబ్దముల నుండి మాత్రమే క్రమపరిణామమును పొందినది. దీనికి నేటి యూరపు దేశము నందలి క్రైస్తవ నాగరికతతో గాఢమైన అనుబంధము కలదు అందుచేత అంతర్జాతీయ న్యాయశాస్త్ర నియమములలో పెక్కులు పాశ్చాత్య దేశముల యొక్క జాతీయ సర్వాధిపత్యము, ప్రాదేశిక పూర్ణత, రాష్ట్ర స్వాతంత్య్రము మున్నగు భావముల ప్రభావమునకు లోనై యుండుటలో ఆశ్చర్యములేదు.

రోమన్ సామ్రాజ్యము విచ్ఛిన్నమై, యూరపులో స్వతంత్ర రాష్ట్రములు బయలు దేరిన కాలమునుండియు నేటి అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క చరిత్ర ప్రారంభమగు చున్నది. అంతర్జాతీయ న్యాయశాస్త్రమునకు రోమనులు గావించిన పుష్టి మిక్కిలి స్వల్పమైనది. ఏమనగా రోము సామ్రాజ్యరాష్ట్రము గనుక, దానితో సమాన ప్రతిపత్తిగల ఎట్టిసంబంధము వృద్ధిపొందుటకు అవకాశములేదు. ఐనను, చాల కాలము తర్వాత, అంతర్జాతీయ వ్యవహారముల యొక్కయు, కార్యకలాపముల యొక్కయు విషమ సమస్యలతో గూడిన పరిస్థితులకు మాయోపాయముచే దాటుటకు అంతర్జాతీయ న్యాయశాస్త్రజ్ఞులు రోమను న్యాయము యొక్క సూత్రముల సహాయము నర్థించి వాటిని స్వేచ్ఛగా ఉపయోగించుచుండెడివారు.

మధ్య యూరపులోను, అంతకంటే ఎక్కువగా ఇటలీలోను, చిన్నచిన్న స్వతంత్ర రాజ్యములు పెంపుగాంచుటతో, ఒక దానితో నొకటి రాజ్యతంత్ర సంబంధము లేర్పరచుకొనుటకు రాష్ట్రములకు అవసరము కలిగెను.అందుచే రాయబారులను పరస్పరము మార్చుకొనుట వారిని నియోగించుట, వారిని స్వీకరించుట, వారికి తగు మర్యాద నొసగుట, వారికి రక్షణమొసగుట మున్నగు నియమములును, న్యాయశాస్త్రోక్తమయిన యుద్ధమునకును తాటస్థ్యమునకును సంబంధించిన మరికొన్ని నియమములును నెమ్మదిగా అంకురింపదొడగెను. ఈ కాలముననే కొందరు తొలి రచయితలు న్యాయశాస్త్ర విషయమున ఎన్నదగిన కృషిని సలిపియుండిరి. వీరిలో నీ క్రిందివారు ముఖ్యులు :- విటోరియా (1482-1546) - ఇతడు సాల మన్కా విశ్వవిద్యాలయము నందలి ఆచార్యుడు;ఆయలా(1548-1584) - ఇతడొక స్పెయిన్ న్యాయశాస్త్రజ్ఞుడు; సూరస్ (1548-1617), గెంటిలిస్ (1552-1608) ఇటలీ దేశీయుడగు నితడు తర్వాత ఆక్సుఫర్డులో “సివిల్” న్యాయాచార్యు డయ్యెను. కాని ప్రాథమిక రచయితలలో మిక్కిలి గొప్పవాడు హ్యూగో వాన్ గ్రూటు అనునాతడు. ఇతడు అంతర్జాతీయ న్యాయ రచయిత గ్రోషియస్ (1583-1645) అను పేరుతో ఇతడు ప్రసిద్ధికెక్కెను. ఇతడు "జాతీయ న్యాయపిత "అని ప్రశంసింపబడి, ఆరాధింపబడుచున్నాడు. "డిజూర్ బెల్లి ఏక్ పేసిస్ (Dejure belli acpacis) ( అనగా యుద్ధము యొక్కయు, శాంతి యొక్కయు న్యాయము) అను నితని సమగ్రమైన గ్రంథము 1625 లో మొదట ప్రచురింపబడినది. ఇది అంతర్జాతీయ న్యాయశాస్త్రమును గూర్చి వ్రాయబడిన మొదటి గ్రంథము. ఇది అన్ని న్యాయశాస్త్ర గ్రంథములలో నెల్ల విశిష్టమైనది గాను, ప్రామాణికమైనదిగాను అంగీకరింపబడినది. అయినను ఇతనిని అంతర్జాతీయ న్యాయ శాస్త్రమునకు "స్థాపకుడుగా” పేర్కొనుట అత్యుక్తి కాగలదు. ఇత డొనర్చిన కార్యమిది: చరిత్రలో తొలిసారిగా ఇతడు విషయజ్ఞానమునకు పనికి వచ్చు కొన్ని అంశములను, కొంత సామగ్రిని ప్రోగు చేసి, రాష్ట్ర నిర్వహణమునకు సంబంధించిన కొన్ని ప్రాతిపదిక సిద్ధాంతములను చేసి వాటిని బట్టి రాష్ట్రములు అనుసరింప వలసిన అన్యోన్య ప్రవర్తనమునకు చెందిన నియమములను తర్కించి, రాష్ట్రముల మధ్య ప్రవర్తిల్లుచున్న వ్యవహారములు, ఆచారములు, అలవాట్లు మున్నగువాని యొక్క శిక్షణమును క్రమబద్ధ మొనర్చెను.

గ్రోషియనుకు తరువాత వచ్చిన రెండు శతాబ్దుల యందును, అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క పరిశీలనమునకు ఆక్సుఫర్డులో ఆచార్యుడగు జౌక్(Zouche) (1592-1660), జర్మన్ ఆచార్యుడగు పూఫెన్ర్పు (Pufendorf) (1682-1694); బైన్ కర్ పాక్ (Bynkershock) (1673-1743); ఊల్ఫు అను డచ్చి న్యాయశాస్త్రజ్ఞుడు (1679-1754); వేటల్ (Vattel) (1714-1767) మున్నగువారు ఎంతో దోహధము కలిగించిరి.

1815 లో జరిగిన వియన్నా కాంగ్రెసు సమయ మందే అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క నియమములు నెమ్మదిగా సుస్పష్టమైన వాక్యములలో ప్రతిపాదింపబడుటకు మొదలయ్యెను. ఇంతకు పూర్వము అంతర్జాతీయ న్యాయశాస్త్ర నియమములు వివిధ న్యాయ శాస్త్రజ్ఞుల పరస్పర విరుద్ధాభిప్రాయము లనేడు విషమ వ్యూహమున చిక్కువడియుండెను. 19 వ శతాబ్ది ఉదయించిన తోడనే ప్రకృతము అస్పష్టముగ వ్యవహరింప బడుచున్న అంతర్జాతీయ శాసన నిర్మాణ విధానము పెంపొంద నారంభించెను. ఈ శతాబ్దియందే అంతర్జాతీయ సంబంధముల యొక్క ఆచార వ్యవహారములు నిశ్చయ ప్రమాణమును అందుకొని స్పష్టరూపస్థితిని వహించెను. అనేకములయిన అంత ర్జాతీయ పరిషత్తుల చేత సుస్పష్టముగ నియమములు నిర్వచింప బడెను. 1899, 1907 సంవత్సరములలో హేగ్ నందు పరిషత్తులు ఏర్పాటు చేయుటతోడను; వివాద పరిష్కారమునకై శాశ్వతమైన న్యాయసభ స్థాపింపబడుటతోడను: నానాజాతి సమితి (League of Nations)ఉద్భవించుటతోడను; అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క ఉద్దేశపరిధి విశాలమయ్యెను. ఇంతే కాక "పారిస్ ప్రకటనము" (1856) "జెనీవా సమావేశము" (1864), "లండన్ నావిక ప్రకటన” (1910) వంటి అనేక ప్రకటనములు "ఒడంబడికల ప్రాథమిక పత్రములు (Protocols) మొదలగు వాని వలన, అంతవరకును కేవలము అనిశ్చతములు గాను, కేవలము అంతర్జాతీయ న్యాయశాస్త్రజ్ఞుల అభిప్రాయములుగాను, వివిధ రాష్ట్రముల విశ్వాసము మీదనే విశేషముగా ఆధారపడునవి గాను ఉన్న అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క నియమములకు స్పష్టత, నిశ్చయత సిద్ధించెను.

మొదటి ప్రపంచ యుద్ధమునకు సంబంధించిన ద్వేషములు ఉపశమించినపిదప, హేగుపట్టణము (హొలెండు)లో శాశ్వతముగా అంతర్జాతీయ న్యాయసభ స్థాపింపబడెను. ఆ స్థాపనచే అంతర్జాతీయ న్యాయశాస్త్ర చరిత్రములో "న్యాయ విచారణ శాసన నిర్మాణము" నకు చెందిన ఒక నూతన యుగము ప్రారంభమయ్యెను. ఈ "శాశ్వత న్యాయసభ” చే గావింపబడిన న్యాయ నిర్ణయము మూలమున శాశ్వతమయిన లాభము కలిగెను. ఎందుచేతననగా అంతర్జాతీయ న్యాయశాస్త్రము నందలి సందిగ్ధములును వివాదగ్రస్తములును ఐన యంశములు న్యాయసభచే పరిష్కరింపబడును. అట్లు పరిష్కరించుటలో న్యాయసభ ఇంకను నవీనములైన న్యాయ శాస్త్రవిధులను ప్రవచించి ప్రతిపాదించెను. శాశ్వత న్యాయసభ యొక్క స్థానములో నేడు "అంతర్జాతీయ న్యాయశాస్త్ర విచారణ సభ" పని చేయుచున్నది. ఇదికూడ అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క నియమములను వ్యాఖ్యానించుట యందును, అన్వయించుట యందును నిమగ్నమైయున్నది.

మొదట ప్రపంచయుద్ధమునందు పాల్గొనిన జాతుల వారు తాము నూతనముగా కనిపెట్టియున్న అపాయకరములగు యుద్ధాయుధములను అందు ఉపయోగించిరి. ఇట్టి యుద్ధానంతరము అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క సామాన్య సూత్రములందు పెక్కు మార్పులు ఘటిల్లెను. - 1899, 1907 సంవత్సరములలో జరిగిన హేగ్ పరిషత్తులు నిర్ణయించిన భూయుద్ధ సముద్రయుద్ధ నియమముల నన్నింటిని యుద్ధానుభవము ననుసరించి సవరించి, యుద్ధము ముగిసినతోడనే ఉదయింప దొడగిన అంతర్జాతీయ సంబంధముల విషయమున మార్పు నొందుచున్న ఆశయములకు అనుగుణముగా క్రొత్తనియమము లేర్పరుపవలసిన అవసరము కలిగెను. యుద్ధములో విమానముల యొక్కయు, జలాంతర్గాముల యొక్కయు ఉపయోగము అంతర్జాతీయ న్యాయశాస్త్రము నందు విచ్ఛేదమును కల్పించెను. ఇంతకుమునుపు ఊహించుటకు కూడ సాధ్యపడని పరిస్థితుల నెదుర్కొనుటకై క్రొత్త నియమములను ఏర్పరుపవలసి వచ్చెను. ఆధునికములైన యుద్ధావసరములను ఎదుర్కొనుటకయి 1919 లో విమాన యాత్రాపరిషత్తును, 1925 లో బాష్ప ప్రయోగముతోను, క్రిమీప్రయోగముతోను కూడిన యుద్ధమునకు సంబంధించిన జెనీవా ఒడంబడికను, 1929 లో జెనీవా సమావేశమును, 1936 లో లండన్ జలాంతర్గామి నియమము లకు సంబంధించిన ఒడంబడికను ఏర్పరచ వలసివచ్చెను. అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క నియమములను విశేషసంఖ్యగల రాష్ట్రములు బద్ధము లగుటకు అంగీకరించిన నియమములను దోషరహితములయిన పదములచే నిర్వచించుటకును నానాజాతి సమితి కూడ ప్రయత్నించెను. అట్లే, రెండవ ప్రపంచయుద్ధము ముగియుటతోడనే, క్రొత్త నియమములను ఏర్పరచి, ప్రాత నియమములను సమంజసముగా కాలానుకూలముగా మార్చవలసివచ్చెను.అంతర్జాతీయ న్యాయశాస్త్రమును కాలానుగుణముగా సవరించి ప్రగతియుక్తముగా స్మృతి బద్ధము చేయు (codify) నవకాశములను అన్వే షించుటకై ఐక్యరాజ్యసమితి ఒక నిపుణుల సంఘమును నియమించెను.

సభ్యత్వము (membership) గల రాష్ట్రముల అంగీకారముతో అంతర్జాతీయ శాస్త్రము యొక్క నియమములను స్పష్టమును, శక్తియుతమునైన పదములతో నిర్వచించునట్టి దుర్వహమైన కార్యమునందు 1948 లో ఐక్యరాజ్య సమితియొక్క సాధారణ సమితిచే నియుక్తమయిన అంతర్జాతీయ న్యాయశాస్త్ర సంఘము నిమగ్నమై యున్నది. అణుసంబంధములగు అస్త్రములను, బహిష్కరించు విషయము నేటి వివాదగ్రస్తములును చర్చనీయములునైన అంశములలో నొకటి. ఇది సర్వ ప్రపంచములోని, రాజ్యతంత్రజ్ఞుల యొక్కయు, న్యాయశాస్త్రజ్ఞుల యొక్కయు దృష్టిని సమానముగా నాకర్షించుచున్నది.

ఇట్లు న్యాయశాస్త్రజ్ఞులు అంతర్జాతీయ న్యాయమును స్మృతిబద్ధము (codify) చేయుటకు యత్నించుచున్నారు. కాని ఇది యింకను వృద్ధిపొందుచు, ఎడతెగక పరిణామము పొందుచున్న న్యాయముగానున్నది. అంతర్జాతీయ సంబంధముల వైఖరిమీదను, జాతుల యొక్క ఔదార్యము మీదను అంతర్జాతీయసంస్థల నిర్మాణము మీదను ఇది చాలవరకు ఆధారపడియున్నది. అందుచేత, శిక్షా విషయకములును, విధి విషయకములును లేక వ్యక్తి విషయకములును అగు న్యాయశాస్త్ర స్మృతులు మున్నగు నగరపరిపాలనా న్యాయస్మృతులవలె సమగ్ర మైన రూపములో న్యాయశాస్త్ర స్మృతిగా అంతర్జాతీయ న్యాయము రచింపబడుటకు సాధ్యపడలేదు.

అంతర్జాతీయ న్యాయశాస్త్రము వెనుకనున్న అనుమతి (sanction) కచ్చితముగా ఏది ? అను ముఖ్య ప్రశ్నము నిర్ణయింపదగియున్నది. ఇట్టిస్థితిలో ఏ న్యాయ శాస్త్రమునుగూర్చియు చేయబడు తుది విమర్శనమైనను బాహ్యముగాను, ఆంతరముగాను అది విధించెడి విధులకు బద్ధులగు ప్రజలు దానివిషయమున చూపునట్టి విధేయతా ప్రమాణము పై నాధారపడియుండును.

అంతర్జాతీయ సమాజములో ఒక రాష్ట్రములోవలె, నిర్బంధకశక్తి లేదు; అందుచే, న్యాయశాస్త్రములో ఆజ్ఞా సిద్ధాంతమును ప్రబలముగా సమర్ధించువాడగు సర్ జాన్ ఆస్టిన్ వంటి ప్రసిద్ధ న్యాయశాస్త్రజ్ఞుడు అంతర్జాతీయ న్యాయము, యథార్థము చెప్పవలసినచో అది ఒక న్యాయశాస్త్రమే కాదని చెప్పియున్నాడు. ఆస్టిన్ యొక్క దృష్టిలో, ఒక న్యాయశాస్త్రము నిజముగా న్యాయశాస్త్రము కావలయునన్నచో దాని వెనుక ఆధార భూతముగానున్న శక్తి లేక నిర్బంధమునుబట్టి దానిని నిర్ణయింపవలసి యుండును. ఒక సంఘమునందలి మానవ బృందముచేత కొన్ని సూత్రములు లేక నియమములు అలవాటు చొప్పున అనుసరింపబడుచు వచ్చి, అవి స్పష్టతను, నియతత్వమును, సామాన్యతను పొందినచో, అట్టి సూత్రములు లేక నియమములు ఒక సర్వాధికారములు గల ప్రభువు యొక్క ఆజ్ఞ తోగూడిన న్యాయశాస్త్రమునకు ఎట్టి శక్తి గాని, ఎట్టి న్యాయాధికారముగాని గలదో అట్టి శక్తినే, అట్టి అధికారబలమునే పొందును. ఆచారము. పూర్వోదాహరణము, అభ్యాసక్రమము, అవగతి మున్నగునవి ఆధారముగా ఇంగ్లండునందలి న్యాయశాస్త్రము ఏర్పడి యున్నది. అంతర్జాతీయ నియమములు ఇంగ్లండు నందలి అట్టి సామాన్య న్యాయశాస్త్రము యొక్క దృష్టి చేతనే పరిశీలించబడవలయునన్న అంశము అందరు ఎరిగినదే. అందుచేత రాష్ట్రములును అందలి ప్రజలును తప్పక అనుసరింపవలసిన ఇతర ఆచారగతములగు న్యాయముల వంటిదే అంతర్జాతీయ న్యాయమగుచున్నది. ఎందుచేత ననగ, దాని సూత్రములు అభ్యాసవశమున ఆచరింపబడి, అనుసరింపబడి, అమలులో పెట్టబడుచున్నవి. న్యాయ మూర్తియైన గ్రే అను నతడు ఒకమారు ఇట్లు చెప్పియున్నాడు: "అది (అంతర్జాతీయ న్యాయశాస్త్రము)మన న్యాయములో ఒక భాగమై యున్నది. దానిమీద ఆధారపడియున్న హక్కులతో సంబంధముగల ప్రశ్నలు నిర్ణయముకొరకు క్రమముగా దాఖలు చేయబడినపుడెల్ల తగిన న్యాయాధికారము గల న్యాయవిచారణ సభలచే అవి విచారింపబడి, శాసింపబడు చుండవలెను.

ఏన్యాయముగాని ఉల్లంఘింపబడినంత మాత్రముచేత. అది అసలే లేకుండనున్నదానితో సమానము కాజాలదు.తరచుగా చేయబడిన న్యాయభంగములు, ఉల్లంఘనములు లేక గొప్ప నిరాకరణములు, చేయబడినంతమాత్రమున అంతర్జాతీయ న్యాయము అంతర్జాతీయ సమాజములో రూపుమాసిపోయినదని ఊహింపరాదు. సవరింప సాధ్యము గాని దగు జాతీయ అధిరాజ్యము అను సిద్ధాంతము ఒక్కటిమాత్రమే అంతర్జాతీయ సంబంధములలో ముఖ్య లోపముగానుండి, అంతర్జాతీయ న్యాయశాస్త్రము యొక్క నియమములను బలహీనము కావించుచున్నది. కాని శాంతి కాలములో వలెనే యుద్ధ కాలములో గూడ, అంతర్జాతీయ న్యాయశాస్త్ర నియమములు సాధారణముగా అనుసరింపబడి దృఢముగా ఆచరింపబడుచున్నవి, అను విషయమును న్యాయశాస్త్రజ్ఞుడుగాని సాధారణ మనుష్యుడుగాని సరిగా తరచు గ్రహింపజాలకున్నాడు.“ఒకే ప్రపంచము" అనెడు భావన క్రమక్రమముగా అనివార్యమైన సత్యముగా రూపొందుచున్నది. అందుచేత, "సర్వగతమగు అంతర్జాతీయ న్యాయము,” కాలక్రమమున, భావి ప్రపంచ రాష్ట్రము యొక్క సార్వజనిక మైన న్యాయముగా పరిణమింప గలదని నిశ్చయించుట కేవలము ఊహాజనితము కాజాలదు.

ఆర్. వా. పి.