Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంతర్జాతీయ సంస్థలు

వికీసోర్స్ నుండి

అంతర్జాతీయ సంస్థలు :- ప్రపంచమందు ప్రస్తుతము సుమారు ఎనుబది స్వతంత్ర రాజ్యములున్నవి. ఇవి తమ ఆశయములను సార్థకపరుచుకొనుటకు ఏర్పరచు కొనిన సంస్థలు జాతీయము లని, అంతర్జాతీయము లని రెండు రకములుగ నున్నవి. ప్రత్యేకముగ ఏ రాజ్యమున కారాజ్యము — ఇతర రాజ్యముల ప్రసక్తి ఏలాటిదిలేక -ఏర్పరచుకొనిన విజాతీయ సంస్థలు, ప్రతిరాజ్యమందుండు శాసనసభలు, మంత్రుల సభలు, న్యాయస్థానములు మొదలైనవి ఈ లాటివి. ఇట్లుగాక, ఇతరరాజ్యము లనేకములతో కలసి ఏర్పరచుకొనిన సంస్థలు మరికొన్ని కలవు. అనేక రాజ్యములు కలసి ఏర్పరచుకొనిన కారణమున వీనికి అంతర్జాతీయసంస్థ లను పేరు చెల్లుచున్నది.

అంతర్జాతీయ సంస్థలు సాధింపదలచు ప్రయోజనములు తాత్కాలికములుగాక దీర్ఘ కాలికములుగను, శాశ్వతములుగను ఉన్నవి. వీనిని గురించి గుర్తించతగ్గ విశేషములలో ఇది యొకటి. ఈ ప్రయోజనములు కూడ అన్ని రంగములకు— రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగము లన్నిటికి—చెందిన సాధారణ ప్రయోజనములుగగాని, లేక ఏదో ఒక ప్రత్యేక రంగమునకు చెందినవిగగాని ఉండవచ్చును. ఈ విభేదమునుబట్టి అంతర్జాతీయ సంస్థలను సాధారణ (General) సంస్థలని, ప్రత్యేక సంస్థలని (Specialized) రెండువర్గములుగ విభాగము చేయనగును. మానవుల అభ్యుదయమునకై సర్వవిధములు పాటుబడుటకును, యుద్ధముల నివారించుటకును స్థాపింపబడిన "ఐక్యరాజ్యసమితి” యు (United Nations) దాని అంగములును, శాఖలును మొదటివర్గములో చేరినవి, ఆలాగుకాక ఉత్తరములను, వస్తువులను ప్రపంచములో ఒక ప్రాంతమునుండి మరియొక ప్రాంతమునకు సుకరముగ పంపుటకై ఏర్పాటు చేయబడిన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (Universal Postal Union) రెండవవర్గములో చేరినది. అంతర్జాతీయ కార్మిక సంఘము (International Labour Organisation), ప్రపంచ ఆరోగ్య సంఘము (World Health Organisation), ఆహార, వ్యావసాయిక సంఘము (Food and Agricultural Organisation), అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక, సాంస్కృతిక సంఘము (United Nations Educational, Scientific, Cultural Organisation) మొదలైనవికూడ ఏదియో ఒక ప్రత్యేక ప్రయోజనమును మాత్ర మే సాధించునవి గనుక రెండవవర్గములో చేర్పదగియున్నవి.

దీనితోపాటు మరియొక విభేదముకూడ గమనింప తగియున్నది. ప్రస్తుతము ప్రపంచములో పనిచేయుచుండు అంతర్జాతీయ సంస్థలలో కొన్ని ప్రభుత్వములచే స్థాపింపబడి నిర్వహింపబడుచుండునవి; ఐక్యరాజ్యసమితి, యూని వర్సల్ పోస్టల్ యూనియన్ మొదలైనవి ఈలాటివి. వీనిసంఖ్య సుమారు ఎనుబదియని, చెప్పవచ్చును. మరికొన్ని ప్రభుత్వములతో జోక్యములేని అనధికారులచే స్థాపింపబడి నిర్వహింపబడునట్టివి. వివిధ రాజ్యములలోని వర్తకులు, కార్మికులు, వ్యవసాయదారులు, మతప్రచారకులు, శాస్త్రపరిశోధకులు, గ్రంథకర్తలు మొదలైన వారు వారివారి ప్రత్యేకోద్దేశములను నెరవేర్చుకొనుటకై ఏర్పరచుకొన్న సంఘములు వందలకొలదిగ నున్నవి. అంతర్జాతీయ వర్తక సంఘము (International Chamber of Commerce), అంతర్జాతీయ కార్మిక సంఘముల సమాఖ్య (International Federation of Trade Unions), దివ్యజ్ఞాన సమాజము (Theosophical Society), అంతర్జాతీయ రాజ్యాంగవేత్తల సంఘము (International Political Science Association) మొదలైనవి. ఇట్టివి. దీనినిబట్టి అంతర్జాతీయ సంస్థలను అధికార (Governmental) సంస్థ లనియు, అనధికార (Non-governmental) సంస్థలనియు విభాగము చేయవచ్చునని స్పష్టమగుచున్నది.

ఇటీవలికాలమున అంతర్జాతీయ సంస్థల సంఖ్య విస్తారముగ పెరుగ జొచ్చెను. ప్రకృతిశాస్త్ర జ్ఞానము విపరీతముగ వృద్ధిగాంచి దాని ఫలితముగ ఆర్థిక, రాజకీయ, సాంఘిక, వైజ్ఞానిక రంగము లన్నిటియందును రాజ్యము లన్నియు పరస్పరాశ్రయములగుట దీనికి మూల కారణము. రవాణా సౌకర్యములు పెరుగుట; ఆర్థిక స్వయంపోషకత్వము సాధ్యముకాక పోవుట, పారిశ్రామిక వృద్ధిగాంచిన రాజ్యములు ముడి పదార్థములను ఉత్పత్తిచేయు దేశములపై ఆధారపడవలసివచ్చుట. ఈలాటి మార్పుల మూలమున అనేక విషయములలో అనేక రాజ్యములవారు కలసి పనిచేయవలసిన అవసర మధికమయ్యెను. యూనివర్సల్ పోస్టల్ యూనియన్, అంతర్జాతీయ కార్మిక సంఘము, అంతర్జాతీయ వర్తక సంఘము మొదలైనవి స్థాపింపబడుటకు ఇట్టి పరిణామమే ప్రధాన కారణము.

ప్రకృతిశాస్త్ర పరిశోధనాభివృద్ధి యుద్ధముల స్వరూపమును మార్చి ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థకు అవసరమును కల్పించెను.

రాజ్యములమధ్య వివాదములు తప్పవు. వివాదములను పరిష్కరించుకొనుటలో సామ దాన భేదోపాయములేగాక యుద్ధము (దండము - బలప్రయోగము) కూడ న్యాయమైన సాధన మన్నభావము ప్రపంచమందనాదిగ వ్యాపించియున్నది. అందుచేత వివాదము లనేకములు యుద్ధముల మూలమున పరిష్కృతము లగుట సర్వసాధారణమయ్యెను. ప్రపంచ చరిత్రలో చాలభాగము యుద్ధముల చరిత్రయే కాని ఇటీవలి కాలమున యుద్ధముల స్వరూపము పూర్తిగ మారిపోయెను. వానిలో పాల్గొను సైనికుల సంఖ్య కొన్ని వేలనుండి కొన్ని కోట్లవరకు పెరిగెను. ఆధునిక యుద్ధములన్నిటికి మూలస్థాన మని చెప్పతగ్గ యూరపు ఖండమందు పదునారవ శతాబ్దపు యుద్ధములలో ముప్పది వేలకు మించిన సైన్యములు పాల్గొనియుండలేదు. పందొమ్మిదవ శతాబ్ద ప్రారంభమున నెపోలియన్ నాయకత్వము క్రింద జరిగిన యుద్ధములలో పది లక్షల సైనికులు పాల్గొనిరి. ఇరువదవ శతాబ్దములో జరిగిన మొదటి ప్రపంచయుద్ధమందు ఆరుకోట్ల సైనికులును, రెండవదానియందు సుమారు ఎనిమిదికోట్ల సైనికులును పాల్గొనిరి. పదు నెనిమిదవ శతాబ్దమందు జరిగిన యుద్ధము లన్నిటియందును హతులై నట్టియు. గాయపడినట్టియు సైనికులసంఖ్య నలుబది యైదు లక్షలు; రెండవ ప్రపంచయుద్ధ మందు హతులసంఖ్య 220 లక్షలు, వికలాంగులసంఖ్య 340 లక్షలు; హిరోషిమాలో ఆటంబాంబు పేలుడువలన ప్రాణముల గోల్పోయిన వారిసంఖ్య 78,000. ఈ కాలపు యుద్దముల మూలమున సైనికులేకాక - విమానముల నుండి ప్రేలు బాంబుల కారణమున సామాన్యజనులు కూడా హతులగుటయు, వికలాంగులగుటయు సంభవించు చున్నది. పట్టణములు, పల్లెలు లెక్కలేనన్ని నేలమట్టము అగుచున్నవి. ఆస్తినష్టమునకు మితిమేరలు లేవు. రెండవ ప్రపంచయుద్ధములో ఒక యూరపు ఖండమునందు కలిగిన నష్టము 1,500,000,000,000 రూపాయలకు మించి యుండునని అంచనా వేసియున్నారు. యుద్ధము ముగిసిన తర్వాతకూడ అగ్రరాజ్యములమధ్య పెరిగిన విరోధముల కారణమున, మరియొక ప్రపంచయుద్ధము రానున్నదను భయముచేత, అట్టి ప్రమాదమునుండి తప్పించుకొనుటకు ప్రతిరాజ్యము దాని ఆదాయములో అర్ధభాగమును సైనిక, నావిక, విమాన బలములను చేకూర్చుకొనుటకై ఖర్చు పెట్టుచున్నది. రెండవ ప్రపంచయుద్ధములో ఆటంబాంబు నొక్కదానినే ప్రయోగించిరి. కాని ఇప్పుడు ఆటంబాంబులేగాక హైడ్రొజన్ బాంబులుకూడ తయారగుచున్నవి. ఇవి బ్రహ్మాస్త్రమునకంటె నెక్కుడుశక్తి గలవి. వీని ప్రయోగము మూలమున దేశములకు దేశములే తుడుచుకొని పోవుననుటలో అతిశయోక్తి లేదు.

యుద్ధస్వరూపమందు ఇట్టి విపరీతమైన మార్పులు కలుగుట చేత రాజ్యములమధ్య సంభవించు వివాదములను సర్వనాశకరముగు యుద్ధ సాధనమున పరిష్కరించు కొనుట ఆత్మహత్యవంటి దన్న అభిప్రాయము మొదటి ప్రపంచ యుద్ధ కాలమందే వ్యాపించెను. సాధనాంతర మొకటియున్న గాని వివాదపడు రాజ్యములు యుద్ధమును మానుట జరగదన్న హేతువున అట్టి సాధన మొకదానిని కల్పించు ఉద్దేశముతో 1919 లో నానాజాతి సమితి (League of Nations)ని స్థాపించిరి. ఇది కొన్ని సంవత్సరములపాటు పనిచేసెను. దాని నిర్మాణములో కొన్ని లోపములున్నట్లు అనుభవము మూలమున తెలియవచ్చుట చేత, వాటినన్నిటిని సవరించి రెండవ ప్రపంచ యుద్ధానంతరము విజేతలైన రాజ్యములన్నియు కలసి 1945లో ఐక్యరాజ్యసమితిని స్థాపించినవి. అంతర్జాతీయ సంస్థలన్నిటిలో దీనిదే అగ్రస్థానము. దీనిని గురించిన వివరములను కొన్నిటిని తెలిసికొనుట అవసరము.

ప్రపంచమందంతట శాంతి భద్రతలను స్థాపించుట, రాజ్యముల మధ్య సంభవించు వివాదములను అంతర్జాతీయ న్యాయసూత్రముల ననుసరించి శాంతిమార్గమున పరిష్కరించుట, దురాక్రమణోద్దేశముతో యుద్ధములకు ఉపక్రమించు రాజ్యములను శిక్షించుట, రాజ్యముల మధ్య వివాదములు సంభవింపకుండ చేయగల వాతావరణములు సృష్టించుట. ప్రపంచమందలి ఉత్పత్తికిని, సంఘర్షణములకును కారణములైన దారిద్య్రము, జాత్యహంకారము, మొదలగువానిని తొలగించుట, ఎట్టి వివక్షత లేక మానవులందరకు - (స్త్రీలకు, పురుషులకు ప్రాధమిక హక్కులను సమకూర్చుట, మానవకల్యాణమునకు సమస్తవిధముల తోడ్పడుట - ఇవియే సమితి యొక్క ఆశయములు.

ఇవి నెరవేరుటకు ప్రపంచములోని రాజ్యము లన్నిటి యొక్క సహకార మవసరము. దీనిని గ్రహించి 1945 లో 51 రాజ్యములు కలిసి సమితిని స్థాపించెను. ప్రపంచములోని తక్కిన రాజ్యములకుకూడ సభ్యత్వమును లభింప జేయుటకు సమితి మూల శాసనములో (Charter) కొన్నిసూత్రములు చేర్చబడెను. శాంతిని కాంక్షించు నట్టియు సమితి సభ్యత్వ విధులను నిర్వహించుట కిష్టపడునట్టియు, సమర్థత కలిగినట్టియు రాజ్యములు సభ్యత్వము పొందవచ్చును. దరఖాస్తు పెట్టికొనిన రాజ్యమునకు ఇట్టి అర్హతలు ఉండునదీ, లేనిదీ మొదలు భద్రతా సంఘము పరిశీలించును. అర్హతయున్నట్లు అది అభిప్రాయపడిన యెడల దాని నాధారము చేసికొని మహాసభ (General Assembly) దరఖాస్తును మంజూరు చేయును. భద్రతాసంఘము యొక్క ఆమోదములేక మహాజన సభ ఏ రాజ్యమునకుగాని సభ్యత్వము కల్పించుటకు వీలులేదు. 1945 తర్వాత ఇరువదియైదు రాజ్యములు సమితిలో కొత్తగ చేరగలిగెను.

సమితి వ్యవహారములను జరుపుటకు (1) మహాసభ(General Assembly), (2) భద్రతాసంఘము (Security Council), (3) ఆర్థిక సాంఘిక సంఘము (Economic and Social Council), (4) ధర్మకర్తృత్వ సంఘము (Trustee-ship Council), (5) ఉద్యోగవర్గము (Secretariat), (6) అంతర్జాతీయ న్యాయస్థానము అను ఆరు అంగము లున్నవి.

1. మహాసభ :- సమితిలో సభ్యత్వముగల ఒక్కొక్క రాజ్యము మహాసభకు అయిదుగురు ప్రతినిధులను పంపవచ్చును. కాని ఒక్కొక్క రాజ్యమునకు ఓటు (Vote) ఒకటే. కార్యనిర్వహణమునకై మహాసభ ఏటేట ఒక అధ్యక్షుని, ఏడుగురు ఉపాధ్యక్షులను, ఆరు కమిటీలను తప్పక ఎన్నుకొనును. ఇవిగాక మరికొన్ని కమిటీలుగూడ నున్నవి. మహాసభ అధమపక్షము సంవత్సరమునకొక పర్యాయమైన సమావేశము కావలసియున్నది. అంతర్జాతీయములగు రాజకీయ, ఆర్థిక, సాంఘిక విషయముల నన్నిటినిగురించి (కొన్ని స్వల్పమినహాయింపులకు లోబడి) మహాసభ ఆలోచించి, శిఫార్సు రూపములైన తీర్మానముల గావింపవచ్చును. భద్రతాసంఘముతో భాగస్వామియై ఇది సమితి ప్రధాన కార్యదర్శిని, అంతర్జాతీయ న్యాయస్థాన న్యాయాధీశులను ఎన్నుకోనుచున్నది. ఇదిగాక భద్రతా సంఘపు తాత్కాలిక సభ్యులను, ఆర్థిక సాంఘిక సంఘ సభ్యులను, ధర్మకర్తృత్వ సంఘములోని సభ్యులలో కొందరిని ఇది ఎన్నుకొనును. సమితి జమాఖర్చుల నిర్ణయము దీనిదే. సమితియొక్క తక్కిన అంగములు సమర్పించు నివేదికలను విమర్శించి సూచనలుచేయు అధికారము దీని కున్నది. ఇందులో జరుగు ప్రధానమైన. తీర్మానములు హాజరై ఓటింగు చేయువారిలో మూడింట రెండువంతుల సభ్యుల ఆమోదమును పొందవలెను. మహాసభ ఒక విధమైన పర్యవేక్షణసంఘ మని చెప్ప తగియున్నది.

2. భద్రతా సంఘము :- భద్రతాసంఘము సమితి యొక్క కార్యనిర్వాహకశాఖ. ఇందులో ఐదుగురు శాశ్వత సభ్యులు, ఆర్గురు తాత్కాలిక సభ్యులు- మొత్తము పదునొకండుగురు సభ్యులు ఉన్నారు. అగ్రరాజ్యములని పేరుగాంచిన సోవియట్ రషియా, యునైటెడ్ స్టేట్సు, బ్రిటన్, ఫ్రాన్సు, చైనాలది శాశ్వత సభ్యత్వము. తాత్కాలిక సభ్యులను రెండేండ్ల కాలపరిమితితో మహాసభ ఎన్నుకొనుచున్నది. భద్రతాసంఘమును గురించి గుర్తించ దగిన గొప్ప విశేషము అగ్ర రాజ్యములకు గల అడ్డుపెట్టు (Veto- వీటో) అధికారము. కార్యక్రమమునకు సంబంధించిన (Procedural) విషయములుగాక తక్కిన విషయములను గురించిన తీర్మానము లన్నిటికి అధమపథము మొత్తము సభ్యులలో ఏడ్గురి ఆమోదమును, ఆ ఏడ్గురిలో శాశ్వత సభ్యు లందరి ఆమోదమును ఉండవలెను. తీర్మానమును పదిమంది సభ్యు అంగీకరించినను అగ్రరాజ్య సభ్యుడొక్కడు ఆమోదించక అడ్డుతగిలిన యెడల అది వీగిపోవలసినదే. సమితి వ్యవహారములను నడుపుటలో అగ్రరాజ్యములను కాదని ఏపని చేయుటకు, వీలులేదని ఇది స్పష్టము చేయుచున్నది. ఇదిగాక అగ్రరాజ్యము లైదును ఐకమత్యముగల పై ఒక త్రాటిమీద నడిచినప్పుడే భద్రతాసంఘము ఏపనినైనను చేయగలదని కూడ దీని నుండి స్పష్టమగుచున్నది. అట్టి ఐకమత్యము కుదిరిన పనులను మాత్రమే తల పెట్టుట యుక్తమను భావముతో ఈ సంఘనిర్మాణము జరిగెను. రాజ్యములమధ్య సంభవించు వివాదములను గుర్తించుట, వివాదములు యుద్ధములకు దారితీయకుండ చూచుట, యుద్ధములు సంభవించినపుడు ఉభయ పక్షముల వారితో సంప్రదించి శాంతిని స్థాపించుట. దురాక్రమణ యుద్ధములలో దిగిన రాజ్యములను శిక్షించుట, ఇదంతయు భద్రతా సంఘము చేయవలసిన పనులు. కాని గత పది సంవత్సరముల నుండి సోవియట్ రషియా యునైటెడ్ స్టేట్సులమధ్య విపరీతమగు వైరుధ్యమేర్పడిన కారణమున భద్రతాసంఘము కార్యనిర్వహణసంఘ మగుటకు బదులు, గొప్ప వాద ప్రతివాద రంగముగ మారిపోయెను.

3. ఆర్థికసాంఘిక సంఘము:- ప్రపంచమందు కొన్ని రాజ్యములు ఆర్థిక సాంఘిక రంగములందు వృద్ధిగాంచు నట్టివిగను, కొన్ని వెనుకబడినట్టివిగను ఉన్నవి. ఈ తరతమ భేదములు తగ్గుటకు కావలసిన చర్యలను సంస్కరణములను సూచించుటకును, వెనుక బడిన దేశములలోని దారిద్య్రమును తొలగించుటకును, అన్ని రంగములలో పురోభివృద్ధి మార్గములను సూచించుటకును ఆర్థికసాంఘికసంఘము స్థాపింప బడెను. ఇందు పదు నెనిమిది రాజ్యములకు సభ్యత్వమున్నది. సమితిలో సభ్యత్వముగల రాజ్యములన్నియు ఈసంఘమున కెన్ను కొనబడుటకు అర్హులు. ఏ పదునెనిమిది రాజ్యములను ఎన్నుకొనవలెనో నిర్ణయించు అధికారము మహాసభది. సభ్యత్వ కాలపరిమితి మూడు సంవత్సరములు. ఆర్థికాభివృద్ధి, నిరుద్యోగనిర్మూలము, రవాణా సౌకర్యములు, మానవుల ప్రాధమిక హక్కులు, సంఘమందు స్త్రీలకుండ వలసిన “గౌరవము, మత్తుపదార్ధముల నిషేధము, జనసంఖ్య సమస్యలు మొదలగు వివిధ విషయములను గురించి ఈ ఆర్థిక సాంఘిక సంఘము అనేక పరిశోధనలను గావించి, అభ్యుదయకరము అగు సూచనలను చేయు చున్నది.

4. ధర్మకర్తృత్వ సంఘము ఇదివరకు వలసలుగ (Colonies) నుండిన ప్రాంతము అనేకములు రెండవ ప్రపంచ యుద్ధానంతరము స్వతంత్రరాజ్యములుగ మారినను ఇప్పటికికూడ పరాయి ప్రభుత్వమునకు లోబడిన ప్రాంతము లనేకము లున్నవి. ఆప్రాంతములలోని ప్రజలు రాజకీయముగ వెనుకబడినవా రనియు ఇప్పటికిప్పుడే స్వరాజ్యము ననుభవించుట కర్హులు కారనియు అందుచేత కొంతకాలము వరకు ప్రాంతములలో పరాయి ప్రభుత్వము ఉండుట తప్పదన్న అభిప్రాయమొకటి ఉన్నది. కాని వానిని పాలించు పరాయి ప్రభుత్వముల వారు స్వలాభపరులుగాక పాలితుల శ్రేయస్సుకై పాటుపడునట్లు చేయుట ఐక్యరాజ్యసమితి కర్తవ్యములలో నొకటి యని సమితి నిర్మాతలు అంగీకరించి, ఉద్దేశము నెర వేరుటకు గాను ధర్మకర్తృత్వసంఘమును స్థాపించిరి. ఇందు భద్రతాసంఘములోని శాశ్వత సభ్యులు, వలస ప్రాంతముల పాలించు రాజ్యముల ప్రతినిధులు, సమితి మహాసభ ఎన్నుకొన్న మరికొందరు ప్రతినిధులు ఉన్నారు. సభ్యులలో సగముభాగము వలసలను పాలించు రాజ్యముల ప్రతినిధులుగను, తక్కిన సగము ఇతరులుగను ఉండవలెనను ప్రాతిపదికపై ధర్మకర్తృత్వ సంఘ నిర్మాణము గావింపబడెను. ఇది ఏటేట రెండు పర్యాయములు సమావేశమై, వలసల పరిపాలనము గురించి పరిపాలకులు సమర్పించిన నివేదికలను చర్చించి, ప్రజలకు అన్యాయము జరుగకుండుటకును, శీఘ్ర కాలమున వారికి స్వరాజ్యార్హత లభించుటకును కావలసిన సూచనలను చేయుచుండును.

5. ఉద్యోగవర్గము :- ప్రతిరాజ్యముయొక్క పరిపాలనమునకు నిపుణులతో, కూడిన ఉద్యోగవర్గమున్నట్లు సమితి వ్యవహారములను జరుపుటకుకూడ ఒక ఉద్యోగ వర్గము (Secretariat) ఉన్నది. వీరందరిపై పెత్తనము వహించువాడు సమితి ప్రధాన కార్యదర్శి (Secretary General). ఉద్యోగులు సమితిలో సభ్యత్వముగల వివిధ రాజ్యముల పౌరులు; ఏ ఒక్క రాజ్యమునకు సంబంధించిన వారు కారు.

6. అంతర్జాతీయ న్యాయస్థానము:- అంతర్జాతీయన్యాయ స్థానమందు పదునై దుగురు న్యాయాధీశులున్నారు. వీరిని భద్రతా సంఘము, మహాసభ కలసి నియమించుచున్నవి. వీరి ఉద్యోగకాలము తొమ్మిది సంవత్సరములు. వివాద పడు రాజ్యము లీన్యాయస్థానము యొక్క మధ్యవర్తిత్వము నపేక్షించిన యెడల న్యాయాధీశులు తమ అభిప్రాయములను వ్యక్తపరచుచుందురు. అంతర్జాతీయ న్యాయశాస్త్రమును గురించి సమితికి సంబంధించిన అంగములు సలహాలను కోరినయెడల అట్టి సలహాల నొసగుటకిది సంసిద్ధ ముగనున్నది.

ఐక్యరాజ్యసమితి కార్యములన్నియు మూడు ప్రధాన సూత్రములతో సమన్వయము కావలసియున్నది. అది తలపెట్టు కార్యమేదియు రాజ్యముల సర్వస్వామ్యమును (Sovereignty) నిరోధించునదిగ నుండరాదనునది మొదటి సూత్రము. ఎట్టి పరిస్థితులలో కూడ ఏరాజ్యము యొక్క ఆంతరింగిక (Domestic) వ్యవహారములలోను సమితి జోక్యము కలిగించుకొనరాదనుట రెండవసూత్రము. అగ్రరాజ్యము లైదింటి యొక్క అంగీకారమును పొందిన గాని శాంతిభద్రతల స్థాపించుటకు కావలసిన కార్యములను సమితి కార్యనిర్వాహక సభ యగు భద్రతా సంఘము చేయరాదనుట మూడవ సూత్రము. ఇట్టి సమన్వయము కుదురుట సులభసాధ్యముగా కనబడుటలేదు. అయినను,సమితి ఆదర్శసిద్ధికై అందరు చిత్తశుద్ధితో కృషి సలుపుట ప్రపంచ క్షేమమున కవసరము.

మా. వెం. రం-


[[వర్గం:]]