శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము
ఓం
శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః
శ్రీ త్రికోటేశ్వరాయ నమః
శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము
ప్రథమాశ్వాసము
_____*****_____
శ్రీ మద్దివ్యవిభావటద్రుమ వితర్దిస్థాన సంస్థాయియై
వామాంకంబున బ్రహ్మవిద్య గిరిజావామాక్షి సేవింపఁగాఁ
బ్రేమన్ మౌనుల కాత్మదాయి యగు నా శ్రీదక్షిణామూర్తి స
ద్భూమ బ్రహ్మము నే భజింతుఁ బరమామోదంబు సంధిల్లఁగన్.1
శ్రీశైలేంద్ర సరోజ భృంగము మహాసిద్ధావళీ మానస
క్లేశాస్తోకతమః పతంగము జగత్క్షేమంకరాపాంగమున్
పాశచ్చేది కథాప్రసంగము సుధా పాటీర డిండీర పా
ళీ శుభ్రాంగము మల్లికార్జున మహాలింగంబు సేవించెదన్. 2
కాసర రక్త బీజ మధుకైటభ శుంభ నిశుంభ చండ ముం
డాసుర యోధయూథముల నాజి మదంబడఁగించి, విక్రమా
భ్యాసుని ఘోరదైత్యు నరుణాసురుఁ గూల్పగ శ్రీనగాన వీ.
రాసనవాసియైన భ్రమరాంబ మదిష్టము లీవుగావుతన్. 3
తతపింఛచ్ఛవి శక్రచాపముగఁ జెంతన్ లక్ష్మి సౌదామినీ
లతికాకారతఁబూన వేణురవ గర్జారావ మొప్పన్ మహో
న్నతి భక్తావళి చాతకంబులకు నానందామృతాసార ము
ద్ధతి వర్షించెడి కృష్ణమేఘ మఘసంతాపంబు చల్లార్చెడిన్.4
అటు లిటు లేమరించి శకులాద్యవతార విహారహారియై
యెటు జనునో విభుండనుచు నెప్పుడుఁ దద్ధృదయస్థలంబునన్
స్ఫుటగతి నిల్చి లోకములఁ బ్రోచెడి లక్ష్మి మదీయసద్మమం
దెటులు చలింప కుండుచు మదిష్టఫలంబుల నిచ్చు నెంతయున్.5
వదన చతుష్టయంబునను వాణి చతుర్నిగమ స్వరూపయై
కదిసి వసింపఁగా సురనికాయము పాయక చుట్టుఁ గొల్వఁ ద
ద్విదులు సనందనాదులు నుతింపగఁ గొల్వొనరింపుచుండు నా
త్రిదశవరేణ్యుఁడైన విధి దీర్ఘతరాయువు మాకొసంగెడిన్. 6
వాణి పయోజపాణి మృదు వాగ్రచనా స్తుతి గీత సర్వ గీ
ర్వాణి సమస్త శాస్త్రవిసరాగమ వేద నుతోరు సద్గుణ
శ్రేణి విరించిరాణి యతసీ సుమ నీల మిళిందబృందరు
గ్వేణి మదీయ జిహ్వపయి వేడుకతో నటియించుఁగావుతన్.7
నిజజన కాగ్రభాగమున నిల్చినవేళఁ దదీయ మూర్ధ వా
రిజ రిపుఖండముం గని పరిస్ఫుట మౌళి నదీజ పాండురాం
బుజమని యెంచి చూచి దృఢపుష్కరముంచి పెకల్చఁబూను న
గ్గజముఖుఁ డస్మదీయ మగు కార్యతతిన్ ఘటియించుగావుతన్ . 8
వ్యాస మయూర బాణులను భారవి మల్హణ దండి కాళికా
దాసులఁ గొల్చి యాంధ్రకవితాఢ్యులు నన్నయఁ దిక్కయజ్వ ను
ద్భాసితుఁ బోతరాజు ఘను భాస్కరు సోమునిఁ బ్రస్తుతించి యు
ల్లాసముమీఱ నీ కృతి విలక్షణతన్ రచియింపఁ బూనితిన్. 9
వృత్త నియమంబు నీతిని నెడలఁబుచ్చి
తమ ప్రబంధ రతికి మెచ్చి ధనము మూర్ఖు
లొసఁగ సుఖియించి వేశ్యల యొప్పు దెప్పు
కుకవి సత్కావ్యములఁ జూడఁ గోరు టెట్లు ?10
అని యిష్టదేవతా వందనంబును సుకవిజనాభినందనంబును కుకవి నింద
నంబునుం గావించి శైవకథావిధాన బోధకంబగు నొక్క ప్రబంధంబు
రచియింపంబూని యేకాంత ధ్యానావధానంబున నున్న సమయంబున 11
అరుణారుణాంశు భాస్వర జటావళివాఁడు
స్ఫురదిందు ఖండ శేఖరమువాఁడు
భసిత త్రిపుండ్రాంక ఫాలభాగమువాఁడు
కరుణా కటాక్ష వీక్షణమువాఁడు
నీల నీరదకాంతి కాలకంఠమువాఁడు
కటితటి శార్దూల పటమువాఁడు
వరదాభయమృగాగ్ని కరచతుష్కమువాఁడు
దక్షిణామూర్తియై తనరువాఁడు
శాశ్వతామృతదాయి కోటీశ్వరుండు
నాదు సన్నిధిఁ బొడసూపి నాకు నొక్క
స్థల పురాణంబు రచియింపఁ జాలు దీవు
నేయుమని యదృశ్యస్థితిఁ జెందుటయును. 12
అంతట నేను రచియింపంబూనిన యతిచమత్కృతిమత్కృతి యగు నీ కృతి
రత్నముఖంబునకుఁ దిలకాయమానంబగు మద్వంశావతారం బభివర్ణించెద.
క వి వం శా వ ళి
ఏ మౌనిప్రవరుం డనంత నిగమధ్యేయాత్మవిద్యాతపః
సామర్థ్యంబున నీ ప్రపంచము సృజించన్ బెంచ మాయించ ను
ద్దామ ప్రక్రియ మించు బ్రహ్మహరిరుద్రాఖ్యాత పుత్త్రత్రయం
బామోదంబునఁ గన్నమేటి దగ నయ్యత్రిం బ్రశంసించెద. 14
తదాత్రేయ పవిత్ర గోత్రంబున 15
ఏ మంత్రి యలరారె నామంత్రి తారాతి
ఘనరమా సౌభాగ్య కలన వలన
నే ధన్యుఁ డీరవొందె ప్రాధాన్య సద్గుణ
వ్రాతాభిరామ ధర్మములవలన
నే శౌరి విలసిల్లె నీశోరు పదపద్మ
పూజావిధాన విస్ఫూర్తివలన
నే మహామహుఁ డొప్పె భూమిపాలకదత్త
లసదనేకాగ్రహారములవలన
నతఁడు నతజనపోషుఁ డంచిత విశేషుఁ
డతులితాకారుఁ డాశ్రిత హితవిచారుఁ
డలఘుచరితుండు సత్యదయావ్రతుండు
కులపయోధికి రేరాజు కొప్పరాజు. 16
అలఘుతరాస్మదీయ బహుళాన్వయ మెవ్వని పేర నొప్పె న
బ్బలవదరాతి గంధగజ భంజన సింహుఁ డసహ్య విక్రమం
బలవడ కొప్పరాజు విశదాద్భుతతేజుఁ దనూజుఁ గాంచె న
ద్విలసిత నీతికోవిద విధేయుని వీరయనామధేయునిన్.17
వీరమరాజ కీర్తిముఖ విక్రమ భవ్యతరంగరాజమున్
బోరన వైరిభోగి ఘనభోగములం గడు వ్రచ్చి హ్రాదినిన్
భూరి దృఢాప్తిచే గెలిచెఁ బొందుగఁ దద్రిపుజానుగుప్త వి
స్తార సుభద్రధా వసుధ జాల హరించే విచిత్రవై ఖరిన్ . (?) 18
ఆరమ్య గుణాస్పదుని కు
మారుఁడు సౌందర్యమునకు మారుఁడు శౌర్యో
దార కుమారుం డతిసుకు
మారుఁడు చినకొప్పరాజు మహి నొప్పారెన్.19
నిస్తుల వీరతా విస్తార సార ల
ఘూకృతాఖిల కులక్షోణిధరుఁడు
సాతత్య దానధారాతతవాహినీ
పరిరంభకోత్సాహభరిత వార్ధి
శరదభ్ర విభ్రమ స్సద్యశః కర్పూర
పేటీ భవదజాండ కోటరుండు
హవ్యవాహార్పిత హవ్యతర్పిత ధాతృ
హరిహరా ఖండలాద్యమరవరుఁడు
నగుచు జిన కొప్పరాజొప్పు ననుపమేయుఁ
డురు గిరిక్షోణి నాయక గురుదయా ప్ర
లబ్ధ ఘోటక హాటక లలిత [1]ఛత్ర
చామరాందోళికాదిక సంపదలను. 20
అట్టి మహానుభావ జననాస్పదమై సుయశోభివృద్ధికిం
బట్టయి కొప్పరాజు సచివాగ్రణిపేరఁ బ్రసిద్ధిగాంచి యు
న్నట్టి తదీయవంశమున నద్భుత శైవరహస్యకోవిదుల్
పుట్టిరి మెట్ట వేంకటయ ముఖ్యు లనేకులు లోకమెన్నఁగన్ .21
తదీయ పుత్త్ర పౌత్త్ర పరంపరాభివృద్ధియగు నిమ్మహావంశంబునందు, 22
రక్షించె నెవ్వాఁడు రాజీవజాన్వయ
సంజాత జనుల నాసక్తి తోడ
శిక్షించె నెవ్వాఁడు శితశస్త్రధారచే
మత్త దుష్ట విరోధి మండలంబు
వీక్షించె నెవ్వాఁడు వెసఁ దల్లిమాఱుగా
నైజాంగనాన్య పంకేజముఖుల
ప్రోక్షించె నెవ్వాఁడు భూరిదయాసుధా
సారంబు దీనవ్రజంబుమీఁద
నతఁడు శ్రీ కొప్పరాజాన్వయాబ్ధి చంద్రుఁ
డనఁగ నుదయించెఁ గువలయావనవిధిజ్ఞుఁ
డైన వీరయ నామధేయాంక మంత్రి
మంత్రిమాత్రుండె భువనైకమాన్యుఁ డరయ.23
ఆ వీరప్రవరుండు గాంచె సుతు భవ్యాకార సుశ్రీ యశః
శ్రీ విద్యా బల శౌర్య ధైర్య గుణవిస్తీర్ణ ప్రబోధావన
ప్రావీణ్యంబున నాత్మసన్నిభుని వీరామాత్యు దీపంబు దీ
పావిర్భావము నొందఁజేయుగతి శైవాచారసంపన్నుఁడై. 24
ఆనరసుతుఁ డతనికి ది
ఙ్మానవతీ మౌళిభాగ మానిత సుయశః
సూనుఁడగు సూనుఁడై తగె
సూనాయుధు చక్కఁదనము శూన్యము గాఁగన్.25
హిమగిరి సేతుమధ్యమున నెల్లెడ నున్న ధరామరాళి క
త్యమిత వినూత్న రత్నములు నశ్వకలాప రథాగ్రహారముల్
సమద గజేంద్రబృందములుఁ జామరముల్ గడుఁబ్రీతి నిచ్చె స
ద్విమలత నెవ్వఁ డా విభుఁడు వీరయమంత్రి జనుల్ నుతింపఁగ౯.26
వీరయమంత్రికి గుణవతి
గౌరమ్మకు నుదయమయ్యె గౌరీపతికిన్
గౌరికిఁ గుమారుఁడుంబలె
శ్రీరంగ విభుండు శంభు సేవాపరుఁడై.27
భూరిప్రతాప దీప వి
దూరీకృత గర్వ తిమిర దుష్టారి మహా
వీర మకుటోరు మణి ఘృణి
తారుణ్య వీరాజితాంఘ్రితలుఁడై యలరెన్. 28
అంబుజగర్భసన్నిభ మహాద్భుతతేజుఁడు రంగమంత్రి కృ
ష్ణాంబికయందు బుత్త్రుల విశాలచరిత్రుల హర్షపాత్రులన్
శంబరవైరిరూప సదృశామలగాత్రుల బద్మనేత్రులన్
సాంబశివార్చనానియమ చారు పవిత్రులఁ గాంచె నేవురన్ 29
వారెవ్వరంటేని,30
దుష్టచిత్త సపత్న దుర్వార జీమూత
ఘోర మారుతసారి వీరశౌరి
హరిదబ్జలోచనా హారవల్లీకృత
విమలకీర్తివరుండు వీరవరుఁడు
సకల శాస్త్రపురాణ సారవేదాధికా
శేష విద్యా తంత్రి శేషమంత్రి
కల్యాణనగతుల్య గర్వాఢ్య సద్భోగ
మహిమ దేవవిభుండు మల్ల విభుఁడు
పత్రికోదార లేఖనమాత్ర ఘటిత
సకల దిగ్భ్రాజమాన రాజన్య శౌర్య
నిర్వహణ దివ్య పాండిత్య నీతిశాలి
మహితరుచిహేళి యన్నయామాత్యమౌళి. 31
వారిలోన- 32
సకలక్షోణిపతుల్ నుతింపఁగ శిలాస్తంభంబుపై 'నేలుచూ
రి' కడన్ వ్రాసిన యన్నపార్యుని సుకీర్తి స్వచ్ఛపద్యాళిఁ దా
రకలంకస్థితి రేపు మాపు నరసింహస్వామి పాదాబ్జ సే
వకు లేతెంచి సురల్ పఠింతు రొగి భావంబందు హర్షింపుచున్. 33
ఆ యన్నపార్యుఁ డలఘు స
హోయుఁ డనంతమ్మయందు హరి సిరియందున్
గాయజుఁ గన్న విధంబున
ధీయుతు నరసింహ నామధేయుం గనియెన్. 34
మిన్నున నున్న సౌరికరి మీఁదికి సింహములట్ల మీఱి య
త్యున్నత తారకాద్రిపయి నుజ్జ్వల శంబనిభప్రభావ సం
పన్నములై గడంగి భువి భవ్యరతి న్నుతిఁ గాంచె కొప్పరా
జన్నయ నారసింహ సచివాగ్రణి నవ్యయశోవిలాసముల్. 35
ధైర్యంబునకు మేరుధరము దీటనవచ్చు
వరధర్మగతియందు వంగకున్న
నలఘు గంభీరత నబ్ధి దీటనవచ్చు
నమిత భంగంబుల నందకున్న
దాతృత్వమున కంబుదంబు దీటనవచ్చు
జీవనస్ఫురణ గర్జింపకున్న
సత్కళామహిమకుఁ జంద్రు దీటనవచ్చు
తతకళంకము మేన దాల్పకున్న
ననుచుఁ గొనియాడుదురు మాళవాంగ వంగ
కుకురు కురు కాశ గాంధార కోసలాంధ్ర
పాండ్య కేరళ చోళ భూపాలసభల
నన్నయామాత్య నరసింహు ననుదినంబు. 36
జలజాస్త్ర బాణపంచకమని యనిశంబు
మత్తకాశినులెల్ల మదిఁ దలంపఁ
కల్పభూరుహపంచకంబని సతతంబు
యాచకావళులెల్లు నాశ్రయింప
శంకరు వక్త్రపంచకమని నిత్యంబు
శైవసంఘంబెల్ల సన్నుతింప
పద్మాక్షు నాయుధ పంచకంబని యెప్డు
ధృతిమాని రిపులెల్ల నతి భజింపఁ
జెలగు నుతపంచకంబు నృసింహమంత్రి
కాంచె సిరిపుర సత్కుల కలశవార్థి
లక్ష్మి యన మించి విలసిల్లు లచ్చమాంబి
కా సతీరత్న మందు వికాసమొదవ. 37
దానానూనయశుండు వీరవరుఁ డుద్దామప్రభావుండు యో
గానందుం డనఘుండు గోప సచివాధ్యక్షుండు ధీశాలి ల
క్ష్మీనారాయణ మంత్రి సద్గుణగణగశ్రీకుం డనంతార్యుఁ డా
ర్యానందైక ధురీణు లేవురు సురాహార్యోరు ధైర్యోన్నతుల్. 38
రాజశ్రీమలరాజ సూరధరణీరాట్చంద్రుకార్యంబు ని
ర్వ్యాజప్రక్రియఁ జక్కఁజేయుచుఁ దదీ యా మేయ సమ్యక్కృపా
రాజద్భాగ్యరమావిలాసములచే రంజిల్లె నే మంత్రి యా
తేజో ధన్యుఁడు వీరయార్యుఁ డలరెన్ ధీమంతు లౌనౌననన్. 40
ఆ వీరేశ్వర సక్కృతేశ్వర సపర్యల్ చెప్పఁగా శక్యమే
భావింపంగ నతండొనర్చిన మహా భవ్యాభిషేకాంబువుల్
శ్రీవిస్తారతనిచ్చు పుష్పచయమున్ శ్రీశంకరుండెప్డు గం
గావారీందుకళాంశు దంభమున వేడ్కన్ మౌళిఁ దాల్చుం గడున్. 41
కైలాసగిరికూట కాఠిన్యగతిమాని
పురవైరి తన చిత్తమున వసింప
పంకజాతనివాస పారుష్య మెడలించి
శ్రీకాంత తనయింటఁ జెలువుచూప
వేధతోఁగూడిన విపరీతత నదల్చి
భారతి తనజిహ్వ బాదుకొనఁగ
సర్వభక్షకపదాసహ్యత విడనాడి
జ్వలనుండు తన మఖంబుల భుజింప
ప్రబలె నే మంత్రి యతఁడు దుర్మంత్రినికర
గర్వ దుర్వార తిమిర సంఘాతహరణ
తరణికిరణాభ వర మహాభరణ లలిత
మానశాలి యోగానంద మంత్రిమౌళి. 42
భూపాలాదరణీయ నిర్మలయశః స్ఫూర్త్యగ్ర గంగానదిన్
గోపాల ప్రభుఁడైన శౌరిక్రియ దానున్ శ్రీకరోద్యత్పదా
నౌపమ్యోద్భవగా నొనర్చి కడు బెంపౌ రాజగోపాలు డా
గోపాలున్ నిరసించు సంభృతమహాగోత్రోరు భారస్థితిన్. 43
నానాశాస్త్రవచో విచారపరతన్ వాదించుచోఁ గిర సం
తానంబున్, వరశారికాప్రకట విద్యాసూక్తి, నిస్పంశయా
ధీనస్వాంతములై ముదం బెదల సంధిల్లంగ వర్తించు ల
క్మీనారాయణ పండితోత్తముల సచ్చిష్యాగ్రహారంబులన్. 44
కణభుగ్వాగ్విభవంబుఁ గొల్లగొని సాక్షాదక్షపాదోక్త ల
క్షణ మెల్లన్ దనసొమ్ముఁ జేసికొని వ్యాసప్రోక్త భాషావళిన్
గణన ప్రాప్త సమస్త వర్ణచయముల్‌గాఁగల్గి వర్తించి స
ద్గుణ రత్నాకరుఁడై యనంత సచివేంద్రుం డొప్పు భాగ్యోన్నతిన్. 45
తన దాన మల వనావనదేవ జానూన
సితభాను శరధుల సిగ్గుపరుప
తననీతి మను జాతి ఘనభీతి దమ హేతి
ధరురీతి వరభూతిఁ దాల్బుచుండ
................................................................
.....................................................
తనధైర్య మనివార్యతరచర్య సదహార్య
మదహస్తి చలదాప్తి మలయుచుండ
తన దయారస మసమాన జన మనోభి
మత హితార్థ ప్రదాయక స్థితి నెసంగ
తనరు నీ కొప్పరాజనంతయ్య మంత్రి
మంత్రి మాత్రుండె దేవతా మంత్రి నిభుఁడు. 46
కలిమి కులంబు, పుణ్యముల గాదిలిచుట్టము, నీతిపెంపు వి
ద్యలగని, కీర్తిరాశి, వినయంబులలోగిలి, మేలుకుప్ప, సొం
పుల తొలిపంట, ధర్మముల పుట్టువు, దిట్టతనంబు చక్కి, య
క్కులపతి నెన్నఁగాఁదరమె కుండలిభర్తకునైన ధారుణిన్. 47
అతని దానాంబువు లర్థి సంపద్గతి
కతి నిధానంబులై యతిశయిల్లు
అతని లావణ్యంబు హరిణేక్షణావళి
కతను లావణ్యంబు గతి దలిర్ప
అతని యుక్తులు సజ్జనావన సత్క్రియా
యత నియుక్తిని పెంపు నందియుండ
నతని మానసపద్మ మభవ హంసోత్తమా
యతన మానస పద్మ మగుచు నెగడ
నిరుపమాత్మబోధ నిగమవాక్యవిదుండు
కొప్పరాజనంత కోవిదుండు
ఘనత న మ్మహాత్ముఁ గొనియాడ శక్యంబె
నలువకైన నతని చెలువకై న. 48
బాలేమర్తి పురాన్వవాయ జలధి ప్రాలేయ భానుండు వి
ద్యాలంకారుఁడు పానక ప్రభుఁడు ప్రోద్యత్ప్రీతి వేంకాంబికా
బాలారత్నమునందుఁ గాంచిన సుతన్ భామాభిధానన్ సతీ
శీలన్ వేడ్క ననంతమంత్రి వరుసన్ శ్రీయుక్తితోఁ బెండ్లియై. 49
పంచపాది:
సతత దిశాభిశోభిత విశాల యశోభర సాధులోక స
న్నుతుఁడయి వేడ్క మువ్వురఁ దనూజులఁ గాంచె శంశాంక శేఖరా
ద్భుత పదభక్తి సంజనిత భూరి కవిత్వ లసద్వచః సము
న్నతమతి లింగనాఖ్యు భువవస్తుతశేషు నశేష వుణ్యు నా
శ్రిత హితవృత్తియైన నరసింహుని సత్యదయాభిరాముఁడై. 50
వారిలోన. 51
వేదశాస్త్ర పురాణ వివిధాగమస్మృతీ
కవితాద్యలంకార కావ్యవేది
వేదాంతసార మేధా దక్షిణామూర్తి
మను జపతోషిత మానసుండు
సకల రాజన్య సంసన్మధ్య సంచారి
విద్వజ్జనానీక వినుతకీర్తి
మంత్రలయ హఠాది మహిత యోగాభ్యాస
సాధిత బ్రహ్మైక్య సమరసుండు
విమలచిత్తుండు షడ్వర్గ విజయశాలి
కొప్పరాజ కులాంభోధి కువలయాప్తుఁ
డైన లింగన మంత్రీంద్రుఁ డమ్మహాత్ముఁ
బూని కొనియాడ దరమె వాగ్జానికైన. 52
తమ్ము లిరువురు నుభయ పార్శ్వమ్ము లందు
వామ దక్షిణ భుజములవలె భజింప
నొప్పు రాజన్యసభల దా నుచిత లీల
కావ్య రచనా చమత్కృతుల్ గనినవాఁడు. 53
రసము లొలుక విద్వన్మనోరంజనాఖ్య
మయిన కృతి చెప్పి వీరభద్రాంకితంబుఁ
జేసె, శంభు స్తవంబులు జేసెఁ బెక్కు
శివ గణాగ్య్రుండు లింగన కవివరుండు. 54
వారిధితుల్య గుండిమెడ వంశజ వేంకట కృష్ణ మంత్రికిన్
భూరి వివేక వేంకమకు బుట్టిన కన్యక లక్ష్మమాంబికన్
వీర పతివ్రతాతిలక విశ్రుత లింగన మంత్రి పెండ్లియై
కూరిమిఁ బుత్త్రుఁ గాంచె ననుఁ గోవిదమిత్రుని నారసింహునిన్. 55
సేవించినాఁడ భక్తుల
రావించినవాఁడ శివుని రాజితశక్తిన్
గావించినాఁడ గృతులను
భావించినవాఁడ జగము 'బ్రహ్మంబనుచున్. 56
అరయఁ బ్రదోషవూజన మహత్త్వము పుష్పరదోదిత స్తవం
బురుతర నూతసంహితయు నొప్పుగ మల్హణసూక్త నంగ్రహం
బరుదుగ నాంధ్రభాష పరమార్థముగా రచియించి యింక నే
స్థిర మగు కావ్యమొక్కటి విశేషముగా రచియింపఁ గోరుచున్. 57
ప్రబంధరచనావిషయము
శాలివాహశకాఖ్య సంవత్చరంబులు
వేదాద్రి గిరి శశి విదిత సంఖ్య
గల విరోధికృదబ్ద కలిత మాఘాసిత
వరచతుర్దశి శివ వాసరమున
శ్రీ యెల్లమందాద్రి సేవింప సకుటుంబ
ముగ నేఁగి య మ్మహా నగముమీఁద
శివరాత్రి యుపవాస శివలింగ దర్శన
జాగర బిల్వార్చ నాగమోక్త
వినతు లాదిగ సత్కర్మ వితతి సల్పి
శివుని మదినిల్పి తత్పద చింతనంబు
జేసి యమ్మహోత్సవ పరిస్థితుల నెల్ల
సుమహితాశ్చర్య మొందుచుఁ జూచుచుంటి. 58
అంతట నేను సకల దిగ్దేశ సమాయాత భూసుర వ్రాతంబుల విలోకించి యిట్టి మహోత్సవంబు మీర లెందై నఁ గంటిరే యనిన వార లిట్లనిరి. 59
ఇలను బ్రాగంబోధిఁ గల జగన్నాథాది
సుకర స్థలంబులఁ జూచినార
మిల దక్షిణాంభోధీ నెలమి రామేశాది
ప్రాచీన భూముల జూచినార
మిల పశ్చిమాంభోధి నెసఁగు గోకర్ణాది
శుద్ధోత్సవంబులు చూచినార
మిల నుత్తరంబున వెలయు కేదారాది
శుంభత్ప్రభావముల్ జూచినాము
కాని యిటువంటిస్థలములఁ గాన మనుచు
నిక్క మే బాసకైనను నిల్చు వార
మనుచు నందఱు నొక్క వాక్యంబుగాఁగ
బలికి రా మాట విని నేను బరమభక్తి. 60
అమ్మహాస్థలి కధీశ్వరుండగు త్రికోటీశ్వరలింగంబునకు నమస్కరించి కంచి కాళహస్తి చిదంబర కుంభకోణ రామేశ్వర శ్రీరంగ వేంకటాచల వృద్ధాచల మంగళాచల కాశి గయా ప్రయాగ శ్రీ పర్వతాది మహాస్థలంబులకు స్థలపురాణంబులు గలిగియండ ని మ్మహాస్థలంబునకు స్థలపురాణంబు లేమి కేమి కతంబోయని విచారింపుచు మరునాఁ డ న్నగేంద్రంబుడిగ్గి మ న్నిలయంబగు క్రోసూరి పురంబున కభిముఖండనై వచ్చునెడ మార్గంబునందు, శ్రీగిరి ప్రాంత నిలయుండును నుద్భటారాధ్య వంశజుండును ముదిగొండ వీరభద్రారాధ్యవర్య పౌత్రుండును కేదారలింగంబను నారాధ్యపుంగవుం డద్దేవు సేవింప నరుగునెడ నెదురైన నేను నమ్మహాత్మున కభివాదనంబు వేసి మదీయ చిత్తగతంబగు సంశయం బెఱింగించిన నమ్మహామహీసురుం డది విని మున్ను చిదంబరనటనతంత్రంబున శివుండు మాదేవికిఁ జెప్పిన విధానంబు జెప్పెదవినుము. దక్షాధ్వరధ్వంసానంతరంబున శివుండు క్షైలాస కుధరంబున దక్షిణామూ ర్తియై సమాధినిష్టం గూర్చుండిన బ్రహ్మోపదేశార్థం బచ్చటి కరుదెంచిన సనకాదులం దోడ్కొని యీ త్రికూటాచల మధ్యకూటంబు ప్రవేశించె నందువలన నీ స్థలం బెల్ల మునులకు నివాసంబగుట నెల్లమంద యని జనంబులచేతఁ బలుకఁబడె నిట్టి కథా విధానం బీవును నాంధ్రభాష నతిస్థిరంబుగా స్థలపురాణంబుగా రచియింపు మని యానతిచ్చిన నేను నిది శివప్రసాదంబుగా నంగీకరించి మదీయాభీష్ట సిద్ధి కిదియె కారణంబని తలంచి చిదంబర నటన తంత్రోక్తప్రకారంబున నీ కృతి రచియింపంబూని యేతన్మహాప్రబంధంబునకుఁ గృతినాథు శ్రీశైల
నాథుంజేయుట యిహపర సాధనంబని తలంచి. 61 షష్ఠ్యంతములు
శ్రీశైలపతికి శివునకు
నాశాధిప నుతపదునకు నాశ్రితహృదయ
క్లేశాపహరణ మూర్తికి
పాశవిదారునకు భక్తపాలనరతికిన్. 62
భ్రమరాంబా హృదయాబ్జ
భ్రమరంబున కఖిల భక్త బంభరవృత ప
త్కమల ద్వయ సేవాంచ
త్కమలాక్షున కిందు సూర్య దహనాక్షునకున్. 63
కదళీ బిల్వ వనాంతర
సదన స్థిత మౌనిహృదయ సంచారునకున్
మదన మదధ్వంసున కఘ
విదళన నిజదివ్య నామ విభవోద్ధతికిన్. 64
కరవీర వనోద్భాసిత
సుర కిన్నర యక్ష నాగ సుదతీ గాన
స్ఫురితానులాప తోషిత
పరమానందస్వరూప భాన్వంతునకున్. 65
జంగమ గిరితరు లతికా
సంగత విపినాంతరాళ సంచార మహో
త్తుంగ తపోవ్రత యమిరా
ణ్మంగళమోక్ష ప్రదాన మహిమాఢ్యునకున్. 66
అంకితంబుగా నా యొనర్పంబూనిన త్రికూటాచల మాహాత్మ్యంబునకు కథారంభం. బెట్టిదనిన. 67
కథాప్రారంభము
మొదల వేదంబులు విదితంబుగాఁ బల్కె
సకల ధర్మాధర్మ సమితియెల్ల
నట్టి వేదార్థంబు నతి సుబోధముగాఁగ
బద్ధ చేతనులపైఁ బరమకరుణ
కామికాద్యాగమ గణము బోధించె నం
దు చిదంబర నటన ముచిత లీల
దక్షిణామూర్తి లీలాక్షర మాహాత్మ్య
మద్దేవుఁ డీ త్రికూటాద్రి మధ్య
శిఖర మధ్యస్థుఁ డగుచు నాశ్రిత మనీంద్ర
వితతి కాత్మోవదేశంబు విశదపరచు
విధము బోధించి యా తంత్రవితతిలోన
నధికతలమైన ప్రఖ్యాతి నధిగమించె. 68
తదుక్త విధానం బెట్లనిన 69
తనలోనం గల యా సదాశివుఁడె యంతర్లింగ రూపంబుగా
తన కాంతి ప్రసరంబులందు శివసూత్రస్ఫూర్తి భాసిల్ల గాం
చన గర్భాండ వపుర్విరాట్పురుష సచ్ఛైవాఢ్య వక్షస్థలీ
ఘన రౌప్యాంచిత లింగపేటిక క్రియం గైలాస మొప్పున్ ధరన్. 70
ఫలిత రసాల సాలతరు బంధుర బంధురమా విలాసమై
కలిత సుమేరు మేరునగ కాంత సుకేసర కేసరాఢ్యమై
లలిత నువర్ణ వర్ణి సుమరాజి కదంబ కదంబవాసమై
యలరు నగంబు డంబు గొనియాడఁగఁ జూడఁగ వింత యెంతయున్. 71
సాలోక్యము సామీప్యము
చాలగ సారూప్యపదము సాయుజ్యంబున్
మేలొదవ నొసంగు శివుఁ డా
శైలంబున నిల్చి భక్త సంఘము బ్రోచున్. 72
ఆ కలధౌత శైల శిఖరాగ్రమునన్ నవరత్న నూత్న సు
శ్రీ కమనీయ సౌధమున శ్రీపతి వాక్పతి ముఖ్యదేవతా
నీక కిరీట కోటి తట నిష్ఠిత పద్యుగళుండు శర్వుఁ డి
చ్ఛాకలితాకృతిన్ గొలువుశాల వసించె జగద్ధితంబుగన్. 73
ఆ సమయంబునన్ హిమధరాత్మజ శంకరుఁజేరి మ్రొక్కి యు
ల్లాసముతోడ నిట్లనియె రాజకిరీట మహేశ చిద్వియ
ద్వాస నిరీశ దేవ యపవర్గము నప్పుడె యిచ్చు తావకా
వాస మహాస్థలంబులు భవద్వచనంబున వింటి నెంతయున్. 74
ఇపు డెంతే విన నిచ్చ వుట్టెడిని కోటీశ స్థలాద్రీంద్ర స
ద్విపు లైశ్వర్య మహత్త్వ మీశుఁడిటకున్ విచ్చేయుటల్ తన్మహా
విపినస్థాద్భుతముల్ దదుద్బవము తద్విజ్ఞానమున్ సర్వమున్
గృపతోఁ జెప్పగదయ్య జన్మమరణక్లేశాపహారంబుగన్. 75
అన విని శంకరుఁ డిట్లను
వనజేక్షణ నీవుసేయు ప్రశ్న దలంపన్
జనహితము కొఱకు గాకను
వినవలెనే నీవు బ్రహ్మవిద్యవు గావే. 76
నేను నిర్గుణ తత్వంబ నిశ్చయముగ
నీవు మచ్ఛక్తి వౌటయు నిక్క మరయ
నాకు నీకును భేదంబు లేకయుంట
వేదములు బల్కు చుండును వేయునేల ? 77
అయినను మంత్రకోటులు మహాగమ జాలము కల్పసూత్రమున్
ప్రియమున నీకుఁ జెప్పుటయు ప్రేయసి ! లోకహితంబుఁగోరి యి
మ్మెయి మన కీ జగంబునకు మేలొనగూర్చుటె కార్య మెంతయున్
నయగతి నొండుకార్యము గనంబడునే మన కెంచి చూడఁగన్. 78
అట్లుగావున నీ త్రికూటాద్రిమీఁద
దక్షిణామూర్తి రూపంబు దాల్చి నేను
జగము రక్షింప నిలిచిన సరణి నీకుఁ
దెలియఁ జెప్పెద విను హిమాచలతనూజ. 79
కలదొక్క తత్త్వంబు ఘన సచ్చిదానంద
మద్వైత మమల మనామయంబు
పరమాత్మ యదియ తా పరమశివుండనఁబడు
వీతఁడె స్వశక్తియై యలరు మాయ
చే గూడికొని సదాశివుఁడన విలసిల్లె
నా సదాశివమూర్తి కాత్మశక్తి
వరభోగమునకు భవానియై పురుషార్థ
నటనకు విష్ణువై చటుల కోప
మునకు కాళి యాయోధనంబునకు దుర్గ
యగుచు విలసిల్లె పురుష శక్త్యాత్ముఁడైన
విష్ణుదేవుని నాభి న వ్విధి జనించె
విధికి దక్షుండు జనియించెఁ బృథుల బలుఁడు. 80
ఆ దక్షుఁడు నిజ జనకుని
వేదమయుని విధినిఁజూచి వినుతించి మహా
మోదంబుతోడఁ బలికెను
“వేదార్థము మిగుల నీకు విశదం బగుటన్. 81
భుక్తి ముక్తుల నిప్పుడే పొసఁగనిచ్చు
దైవ మెవ్వఁడొ తెలుపవే తండ్రి !" యనుచు;
"పుత్త్ర! శివుఁడొక్కడుఁన్నాఁడు భుక్తి ముక్తు
లిప్పుడే యిచ్చు దైవ మయ్యీశుఁ దలఁపు.” 82
అని విధి పలికిన దక్షుం డిట్లనియె. 83
“హరుండంచును హరియంచును
సరసిజగర్భుండటంచు శక్తియటంచున్
బరువడిఁ బల్కెద రిందునఁ
బరుఁడెవ్వఁడొ నాకుఁ దెలియ బలుకు విరించీ ! 84
అన విధాతయు నిట్లనె నాదరమున
"శ్రోతృ చిత్త విపాకంబుజూచి శ్రుతులు
హర్యజాదులు పరతత్త్వమని వచించె
గాని నిక్కంబుగాఁగ శంకరునిఁ బలుకు. 85
మఱియు వేదంబు లొక్కొక్క యంశంబున హర్యజాది దేవతలకుఁ బరతత్త్వం బాపాదించి సర్వాంశంబుల శివ పరతత్త్వంబే సాధించుఁ గావున వేదశాస్త్ర పురాణాగమ జాలంబులు సాంతంబుగాఁ జూచిన వారలు శివునియందె పరతత్త్వంబు నిస్సంశయంబుగాఁ బలుకుదురు. వీని యంశాంశ మాత్రంబె చూచినవార లితర దేవతలయందే పరతత్త్వంబు నిశ్చయించి నిస్సంశయంబుగా వాదింపు చుండెదరు. వేదంబులు మన్ముఖోద్గతంబు లగుట తదర్థంబు నాకతి విశదం బందువలన శివుండే పరబ్రహ్మంబని యేను నీకుఁ దెలిపితి నీవును నమ్మహా దేవునికి భక్తియుక్తుల నారా ధించిన భుక్తిముక్తు లీ జన్మంబు నందె చెందెద" వనిన నతండును మేరునగ ప్రాంతంబున బహుకాలంబు జితేంద్రియుండై ఘోరతపంబుఁ జేసెనంత. 86
శతకోటి చంద్ర మోద్భుత దేహరుచితోడ
పటు జటామకుట విభ్రమముతోడ
నీలకంధర నీల నీలకంఠముతోడ
రమణీయ సర్ప హారములతోడ
కుందేందు రుగమంద మందహాసముతోడ
కరుణా కటాక్ష వీక్షణముతోడ
వరదాభయ మృగాగ్ని కరచతుష్కముతోడ
కటి తట పటుచర్మ పటముతోడ
వామ భాగస్థ పార్వతీ భామతోడ
నమల రుచిఁ బొల్చు నంది వాహనముతోడ
నతు లొనర్చెడి ప్రమథ గణంబుతోడ
దక్షునకు నంత శివుఁడు బ్రత్యక్షమయ్యె. 87
ఆ పరమేశుఁ జూచి నయనాంబుజముల్ వికసింప దక్షుఁ డు
ద్దీపిత భక్తియుక్తి నతి దీనగతిన్ వినుతుల్ ఘటించి యో
తాపసవంద్య నీచరణదాసుని నన్నుఁ గృతార్థుఁ జేయవే
పాపముఁ బాపి భక్తజనపావన యంచు నుతించె నీక్రియన్. 88
వృత్త స్తవము :
ముదా సదార్తి భంజనం - పదాహతార్క నందనం
విదారితాఘ సంఘటం - సదా సదా శివం భజే. 89
ఉమా సతీ మనోగతం - రమాధినాథ సేవితం
శమాఢ్య యోగి భావితం - సదా సదా శివం భజే 90
రసాధరేంద్ర కార్ముకం - వసుంధరా మహారథం
పురాసురాపహారిణం - సదా సదా శివం భజే. 91
గజేంద్ర చర్మ వాసనం - నగేంద్ర శృంగ వాసినం
వృషేంద్ర దివ్యవాహనం - సదా సదా శివం భజే. 92
అశేష భక్త పోషణం - విశేష శేష భూషణం
ప్రసిద్ధ తత్త్వ భాషణం - సదా సదా శివం భజే. 93
అని వినుతించు దక్షుఁగని యా పరమేశుఁడు బల్కె నీదు నె
మ్మనమునఁ గల్గు కోరిక శుభం బదె యిచ్చెద నేఁడు నీకు ని
వ్వనజభవాది దేవమునివారము లాది జగంబు నీదు పం
పునఁ జరియింప నీవు నతిపూజ్య జగత్పతివౌదు వెంతయున్. 94
నీదు ప్రజ్ఞచే జగములు నిండియుండి
పుత్త్రులును పుత్త్రికలు గల్గి భూరిభోగ
శాలి వయ్యెదు నీయాజ్ఞ సకల భూత
చయము తప్పక నడచు నిశ్చయము గాఁగ. 95
అంత శర్వాణి కరుణమై నతనిఁజూచి
కోర్కెయేమైనఁ గలదేనిఁ గోరుమనిన
దక్షుఁడిట్లనె; “దేవి ! నా తనయవగుచు
పుట్టు” మన నట్లె వరమును బొసఁగనిచ్చె. 96
ఇట్ల య్యుమామహేశ్వరులు నిజభక్తుం డగు దక్షునకు సకలాభీష్టంబు లొసంగి యంతర్ధానంబు నొందిన నతండంత నిఖిలైశ్వర్యసంపన్నుండై ప్రజాపతియయ్యె. భవానియు సతీనామంబునం బుత్త్రికయై జనించె నద్దేవిని శివునకిచ్చి వివాహంబుజేసి యఖండైశ్వర్యానుభవంబున మదోన్మత్తుండై యొక్కనాఁడు హర్యజాద్యమర్త్యులంగూడి పుత్త్రీజామాతృ దర్శనార్థంబు కైలాసంబున కరిగిన నందుఁ బరమేశ్వరుండు దనకుఁ బ్రత్యుత్థానాభివందనంబులు సేయమికి మనంబునఁ గలుషించి శివరహితంబుగా యాగంబు సేయఁదలంచి విష్ణుబ్రహ్మాద్యఖిల దేవర్షిగణంబుల రావించి శివుం బిలువక యఖండైశ్వర్యవంతుండై మహావిభవ విస్తరంబుగా యాగంబుసేయు సమయంబున మహాశైవుం డగు దధీచిమహాముని శివరహితం బగు యాగం బవలోకించి కోపోద్దీపిత మానసుండై సభాసదులందఱు విన నుచ్చైస్వరంబున దక్షుని వీక్షించి యిట్లనియె. 97
ఏదేవు కరుణచే నిందిరాదీశుండు
విశ్వంబు బాలించు విభుతఁగాంచె,
నేదేవు కరుణచే నీవిధాతయు సృష్టి
కృత్యంబు రచియించె కేవలముగ
నేదేవు కరుణచే నీదిగీశావళి
స్వాదికారస్థితి సరణిఁగాంచె
నేదేవు కరుణచే నీమహైశ్వర్యాది
భోగభాగ్యంబులు పొలుపుమిగిలె
నట్టి జగదీశు నీశ్వరు నంబికేశు
బిలువ కీవు మఖము సేయఁ దలఁచినావు
దీన నీకును నీదేవమౌనితతికి
విలయకాలంబుఁగాఁదోంచె వేయునేల ? 98
అనిన దక్షుండిట్లనియె. 99
రూపహీనుఁడయ్యును బహురూపియైన
నటుఁడు భిక్షకుఁ డగుణుండు జటిలుఁ డెపుడు
నామరహితుండు కల్పితనామకలితుఁ
డెఱుఁగ కిన్నియుఁ దనయ నే నిచ్చినాఁడ. 100
అనిన దదీచి యిట్లనియె. 101
నీవు శివనిందఁ జేసిన నీచవాక్య
ములకు నుత్యర్థముంట నే దెలిసియుంట
బ్రదికితివిగాక, శివనింద పలుకు వినిన
బ్రతుకరా దేరికై నను బాపచరిత ! 102
శివదేవుని, శివభక్తుల,
శివయోగము, శివపురాణ సిద్ధాంతంబున్
గువిచారత నిందించిన
శివనింద యనంగఁబడును జెప్పఁగ నేలా? 103
తల్లినిఁ దండ్రినిన్ సుతుల దాతను దైవము నెల్లవారలన్
బల్లిదులైన యా నృపులఁ బట్టి వధింతురు నిందఁ జేసినన్
జెల్లునె నీకు దక్ష ! శివు చిన్మయు నిందయొనర్ప నక్కటా !
యెల్ల శరీరధారులకు నీపని కూడదు కూడ దెంతయున్. 104
దక్షా ! నీవు శివు న్భజించి మును తద్దాక్షిణ్య వీక్షాప్తిచే
నక్షీణాద్భుత సంపద ల్గని యనంతైశ్వర్య మత్తుండవై
కుక్షిస్థాఖిల లోకు నయ్యభవు సంకోచింప కుద్వృత్తిచే
నాక్షేపంబులు బల్కినా వకట : మోహ బ్రాంత చిత్తంబునన్. 105
అర్థయుతముగ సర్వవేదాళిఁ జదివి
శంభు భక్తుండవయ్యును సర్వవేది
వయ్యు శివనిందసేయుట యరసిచూడ
ప్రకటితైశ్వర్య సంప్రాప్తివలనఁ గాదె ! 106
ధనధాన్య వస్తువాహన దాసదాస్యాది
కలిత సద్గృహరాజి గలిగెనేని
స్రక్చందనాలేప సకల భూషణ వస్త్ర
పర్యంక పంక్తు లేర్పడియె నేని
వర వయో లావణ్య సరసిజాక్షులతోడఁ
దోరమౌ రతికేళి దొరకెనేని
సరసాన్నపాన సంసక్తి నిరామయ
స్ఫురితాంగ విభవంబు పొసఁగెనేని
మత్తుఁడగు గాక శివభక్తి వృత్తుఁడగునె
నిరయగతిగాక కైలాస పురముఁగనునె
నీకు నిన్నియుఁగలుగుట నీచహృదయ !
శివునిఁ జింతింపనేరవు చెప్పనేల ? 107
విను దక్ష ! మేము నీ క్రియ
ఘనతపముల శివునిఁగూర్చి కావించియు శ్రీ
లను గోరకుంట యీగతి
జనియించును మదమటంచు చర్చించికదా ! 108
ఆయినను శివప్రసాదగతంబులై న సంపదలు విపరీత ఫలంబులఁ జేర్చునే యనిన నందు శివభక్తి వితథస్వార్థంబుగాఁగోరిన శివుండిచ్చు సంపదలును నిస్పృహుండైనను నయ్యీశ్వరానుగ్రహంబునం గలుగు సంపదలును భుక్తిముక్తి ప్రదంబులగు గాని రజస్తమోగుణగ్రస్తులై భోగార్థంబుగాఁ గోరిన నీశ్వరుండిచ్చు సంపదలు రావణాద్యసురులకుంబోలె మదంబుఁ బుట్టించు. నీవు భోగార్థంబుగాఁ గోరితి వట్లగుట విపరీతఫలంబు నొందఁగల వహో! శివనిందాఫలంబు నీ యట్టి ప్రజాపతి కమేయ దుర్గతింబొందింప సిద్ధంబయ్యె నింక మసుష్యమాత్రులు - శివనిందజేసినఁ బ్రాయశ్చిత్తంబులేని కతంబున ననేక బ్రహ్మకల్పంబులు ఘోరనరకంబునం గూలుదురని వేదపురాణ సిద్ధాంతంబులు వలుకుచుండు నేమి సేయవచ్చునని నిజకీర్తి విజిత సుధామరీచియగు దధీచి వగచి విషణ్ణుండై దక్షునింజూచిదక్షా! నీవు శివద్రోహి వగుట నిన్నుఁజూచుచు నీ యజ్ఞవాటంబున నిలువఁగూడ దచిరకాలంబున శివాజ్ఞావశంబున నీమఖధ్వంసంబగు నీవు నిహతుఁడవగుదు వీసర్వసుపర్వ నికాయంబును శివనిందాశ్రవణదోషంబున నిప్పుడే శిక్షితులై చండాసురకృత బాధాపీడితులయి సర్వసంహార యోగంబున మృతిబొందెదరని శపించి కరద్వయీ పిహిత కర్ణపుటుండై లేచి చనిన దుర్వాసోజాబాల్యత్ర్యుపమన్యు గౌతమాది శై వర్షి సమాజంబు తోడనం జనియె. నా సభికులందఱు తదాజ్ఞా భయంబునం జనలేక నిలిచిరంత. 109
నారదుఁడు రజతశైలము
జేరి మహాదేవుఁజూచి సేవించి మహో
దారుఁడు దక్షుఁడు యజ్ఞము
వారక యొనరించె నిన్ను వర్జించి శివా ! 110
అని శివుని బలుక సతి విని
జనకుని యజ్ఞంబుజూడఁ జన మనసయ్యెన్
ననుఁబనుపు మనఁగ శంకరు
డనియె ననాహూత గమన మర్హమె నీకున్. 111
అన సతియు భవుని వాక్యము
వినియును నే జనకుయజ్ఞవిభవముజూడన్
జనియెదననె; శివుఁడంతట
పనిగొనఁ బ్రమధాళి నిచ్చి పనిచెన్ వేగన్. 112
అంతట నా జగజ్జనని యద్భుతదివ్య విమానయానయై
ప్రాంతమునన్ గణావళులు భక్తి భజింపఁగ దక్షుయజ్ఞ శా
లాంతర వీథికేఁగి సుషమాఢ్య విమానము డిగ్గి (పోయి) య
త్యంత మనోజ్ఞవేదిక మహావిభవంబున నిల్చె నయ్యెడన్. 113
సభికులు దక్షభీతి నతిసల్పక యూరకయుండి రంత నా
సభగని దక్షసన్నిధికి సాగిన నాతఁడు బంధుకోటియున్
విభవ మెలర్పఁగాంచి యవివేకమునం బలుకాడరైరి య
య్యభవునితోడి వైరమున; నా సతి దక్షునిఁజూచి యిట్లనెన్. 114
తండ్రి మీయజ్ఞ మీక్షింపఁ దలఁచి నాదు
నాథు నెడఁబాసి వచ్చిన నన్నుఁజూచి
పలుక కుండుట యవివేక పథమటన్న
దక్షుఁడిట్లనె క్రోధ తామ్రాక్షుఁడగుచు. 115
తరుణి మాకు విరోధి నీధవుఁడతండు
ప్రేత భూత పిశాచ సత్ప్రియ సఖుండు
యజ్ఞభూమికి నరుదేర నర్హుఁడగునె
యతని సతివౌట నీవు ననర్హ విపుడు. 116
అన విని దక్షుని తోడుత
వనజేక్షణ పలికె నీదు వలన జనించెన్
తను విది దీని విసర్జన
మొనరించి హిమాద్రికేను బుట్టెద సుతనై. 117
అని యోగమార్గ సంజనిత వేగముతోడ
హిమశైలమున కేగ ప్రమధులంత
కై లాసమునకేగి గరళ కంధరు జూచి
యీ వార్త దెలుప న య్యీశ్వరుండు
చటు లోగ్ర కోప సంఘటిత భ్రుకుటితోడ
వికటాట్టహాసుఁడై వీరరౌద్ర
రస సముద్ధతి మేన బొసఁగ ఘర్మాంబువుల్
తనచేతఁబట్టి యుద్ధతి విశాల
పటుశిలా మధ్యభూమిని బారజల్లె
జల్లునంతట నది యతి స్ఫారి తోరు
భిదుర విదళితమైనట్టు బీటలెసఁగి
పగుల విస్తృత తద్రంధ్ర పథమునందు. 118
వీరభద్ర జననము
శ్రీమత్సహస్రాంశుకోటి ప్రభాభాసమానా సమానాంగ రోచిశ్ఛటాచ్ఛాదితా జాండ భాండాంతరాళుండు, నానామణీ కోటి కోటీర కోటి స్ఫురచ్చంద్ర ఖండావతసు౦, డనల్పోగ్ర కల్పాంతవేళా కృశానుజ్జ్వలజ్జ్వాలికా మాలికా భీలఫాలేక్షణుండున్, సుధాధామ భీమోష్ణ ధామాగ్ని నేత్రుండు, ఘోరారి సేనావలి స్ఫార ధైర్యాద్రి నిర్భేదనా క్షుద్ర వీరాట్టహాసుండు, భాస్వన్మహా యుద్దసన్నద్ద శౌర్యోల్ల సద్దైత్యరాజోరు దోరబ్జనాళావలీఖండనాఖండలోద్దండ వేదండ తుండాభ లీలా ప్రచండోగ్రబాహాసహస్రుండు, సత్తారహారావళీ పారిజాత ప్రసూనాచ్చమాలా విశాలాఢ్య వక్షస్థలుండున్, మహాశైలరాజన్నితంబాభ సమ్యజ్నితంబోపరిస్ఫీత కాంచీకలాపాతిశోభావిలాసుండు, నీలాళి నీలాబ్జ కాలాంబుదశ్యామలాకారుఁడై వీరభద్రుండు రౌద్రాకృతిన్ మీఱి యావిర్భవించెన్. 119
అట్లు జనియించి విపులాట్టహాసచకిత
సకల భూత వితానుఁడై శంభుఁజేరి
వినుతిఁ గావించి నేను గావింపవలయు
కార్యమెద్ది మీయాజ్ఞ వేగంబ సేతు. 120
కొండలు పిండి నేయుదునొ, కుంభినిఁగొట్టి రజంబుజేతునో
దండధరున్ సమిద్ధగతి దర్పమడంచి వధించివై తునో
భండనకేళి సర్వసుర పంక్తులబట్టి మదంబడంతునో
ఖండశశాంకమౌళి యధికంబగు నీదగు నాజ్ఞపంపునన్. 121
శివుఁడు వీరభద్రుని దక్షునికడ కంపుట
ఆమాటల్‌విని శంభుడిట్లనియె నీవత్యంత రౌద్రక్రియో
ద్దామ ప్రౌఢిమ దక్షుఁజంపి మఖవిధ్వంసంబుగావించి సు
త్రామాజాచ్యుత ముఖ్యదేవతల గర్వంబెల్ల వారించి ను
క్షేమంబొప్పగ వేగరమ్మిటకు నక్షీణప్రభావోన్నతిన్. 122
అని యిట్లు శివుఁడు బలికిన
ఘనుఁడవ్వీరుండు భద్రకాళియుతుండై
చనువేళఁ దత్సహాయం
బనఘుల గణవరులఁబంచె నధికప్రీతిన్. 123
వారు ననేకోత్కట కరవాల భిండివాల తోమర ముసల ముద్గరాది నానాయుధ పాణులై వీరభద్రేశ్వరుంజుట్టుకొని దక్షాధ్వరశాల కభిముఖులై చనునపుడు కొందఱుగణంబు లద్దేవు నుద్దేశించి వందిమాగధగీతంబులు పాడుచు నిట్లని స్తుతియించిరి. 124
చటుల భుజాస్ఫోట జనితోద్భటార్భటి
బ్రహ్మాండ భాండంబు పగిలిపడఁగ
గమనవేగాకీర్ణ ఘనజటానిహతిచే
గ్రహవీథినుండు తారకలువ్రాల
నిటల నేత్రానల స్ఫుట విస్ఫులింగంబు
లంబరంబునఁ దారకాళి గాఁగ
తతపదఘట్టనోద్ధత భూపరాగంబు
నిర్జర వాహినీ నీరమడఁప
నీవు దక్షుని మర్దింపఁబోవుసరణి
నిఖిల లోకాద్భుతస్ఫూర్తి నివ్వటిల్లు
ప్రళయతర రౌద్ర పరమకృపాసముద్ర
వినుత శతరుద్ర భద్ర శ్రీ వీరభద్ర ! 125
భవదీయ హుంకార పటుమరున్నిహతిచేఁ
గుల పర్వతములు దిక్కులకుఁ జెదర
తావకోత్కట జటాతాడన ప్రౌఢిని
ఘన శింశుమార చక్రంబుదిరుగ
యుష్మత్కరాగ్ర సంయోజితాసి స్పర్శ
బ్రహ్మాండ మూర్ధ్య రంధ్రంబుగాఁగ
భవదుగ్రసింహ రావార్భటి మేరుమం
దర గుహావళి ప్రతిధ్వనులు సేయ
నీవు వీరాంగమేయుచు నిష్ఠురముగ
దక్షు మఖవాటి కరుగుట దలఁపవశమె
ప్రళయతర రౌద్ర పరమకృపాసముద్ర
వినుత శతరుద్ర భద్ర శ్రీ వీరభద్ర ! 126
అని వినుతించెడి గణముల
వినుతులు చెవులార వినుచు వీరేశుఁడు దాఁ
జనె దక్షు యజ్ఞవాటం
బునకున్ గణరాజితోడ పురహరునాజ్ఞన్. 127
ఇట్లు చని ముందట ననంతమణి రుచిరానంతమణి గణభ్రాజిత ద్వారకవాట గేహళీ విరాజితంబును, రాజితాచలసంకాశ సౌధనికాయంబును, కాయమాన నివిష్ట విశిష్ట భూసుర వేదనినాదంబును, నాది తానేక వాద్యకూటంబగు దక్షుయజ్ఞవాటంబులోనికింజని తదీయ ద్వారంబులు నిరోధించిన గణంబులును, నిశితాశు గోద్దండ కోదండపాణులును, భండనప్రచండ గదాదండ మండితులును, వివిధాయుధథారులై తదధ్వరోపగతులై న గరుడ గంధర్వ కిన్నర కింపురుష సుపర్వుల గర్వంబు సర్వంబును నిర్వాపణంబుజేసియు, ముఖశాలాంగణ స్థాపితంబులగు యూపంబుల రూపణంచియు, నగ్నుల భగ్నంబుజేసియు, వేదికల భేదించియు, పురోడాశంబుల నాశంబునొందించియు, నానావిధంబుల యజ్ఞంబు ధ్వంసంబుజేసి రంత వీరభద్రేశ్వరుండు శివరహితంబై న యజ్ఞశాలా మధ్యంబునందున్న దేవర్షి సదస్య ఋత్విజ్ఞి కాయంబుల కాయంబుల మహోద్దండ నిజభుజాదండ మండిత గదాకాండ ఖండితంబులుగాజేసి దక్షుజామాతయై యందుండునిందునిఁ దన పాదతలంబు క్రిందంబెట్టి మర్దించి, దక్షుండుసలుపు శివనిందల హసన్ముఖుండై వినిన పూషాదిత్యు దంతంబులును, తదభిముఖుండై చూచిన భగుని నేత్రంబులును, నందు బ్రహ్మత్వంబు వహించిన భృగుని శ్మశ్రువులునుం బెకలించి యచ్చట వీణాపాణియైపాడు వాణి నాసికాచ్ఛేదంబుంజేసి తన్మఖంబున నాహూతులుగొనిన సప్తజిహ్వుని జిహ్వలు మొదలంటంగోసి శివద్రోహి యగు దక్షువధింపంబోవు సమయంబున దదధ్వర రక్షకులై న విష్ణువిధాత లమ్మహావీరవరుంజూచి భయభ్రాంతచిత్తులై రందు విధాత యద్దేవదేవున కెదురేగి దేవా ! నీవే శివుండవు. జటాజూట చంద్రావతంస ఫాలేక్షణోక్ష వాహనాది చిహ్నంబులు గలిగియు, శివద్రోహియగు దక్షు వధించుటకై రౌద్రంబగు తమోగుణరూపంబు ధరించుటంజేసి నీలవీరదశ్యామలాకారుండ వయితి విట్టినీవు త్రిపురసంహారంబు గావించునెడ నీకు సారథినై వేదాశ్వంబులందోలితిఁగాదె యిప్పుడు భవద్రథ సారథ్యంబుఁజేసెద ననుగ్రహింపవే యని ప్రార్థించిన నవ్వీరుండవ్విధాత సారథిగా నంగీకరించె నంత విష్ణుం డవ్వీరభద్రేశ్వరు సన్నిధికేతెంచి యిట్లని స్తుతియించె. 128
జయ జయ దక్షాధ్వరహర !
జయ జయ శ్రీ వీరభద్ర ! జయ సర్వజ్ఞా !
జయ జయ మృత్యు వినాశన !
జయ జయ భక్తార్తి హరణ ! జయ సర్వేశా ! 129
నీవు పరాత్పర నిర్గుణ బ్రహ్మమౌ
హరుఁడవు, నేను నీ పురుషశక్తి
నగుదు, నీకును నాకు నొగి భేదమనరాదు,
త్రిపురాసురులఁ జంపఁదివురు నీకు
బాణమైతిని, నేఁడు పాపాత్ము దక్షుని
శివవిరోధినిఁ బట్టి శిక్ష నేయఁ
దలఁచు నీకును వేడ్కఁ దగు సహాయము జేతు,
జగతి శివద్రోహిఁ జంపవలయు,
ననుచు నుతిసేయు విష్ణునియందుఁ గరుణ
దొడర మన్నించి దక్షునికడకుఁ జనియె,
శమిత సమవర్తి దేవతా చక్రవర్తి
పటుతరస్ఫూర్తి శ్రీ వీరభద్రమూర్తి. 130
ఆ వీరభద్రుఁ గనుఁగొని
భావంబున బెరుకుదోఁప భయమున దక్షుం
డీవీర మూర్తి యెన్నడు
నేవిన్నదిగాదు చూచియే నెఱుఁగఁగదా ! 131
అనుచుఁజింతించి శంభునిందాఘఫలము
తప్పునేయంచు మిగుల సంతాపమొందె
నీచునకు శిక్షచే బుద్ధి తోఁచుఁగాని
పుట్ట దెందు వివేకంబు బోధచేత. 132
అంత వీరుండు నిశిత వాలాగ్రమునను
దక్షుని శిరంబు ఖండించి దహనశిఖల
వ్రేల్చె శివనింద కిదియపోఁవిథి యటంచు
దెల్పురీతిని సురలు భీతిని జలింప. 133
ఆ వీరభద్రుఁ గనుఁగొని
భావి మహాప్రళయ రుద్ర భాస్వత్తేజ
శ్శ్రీ విభవమూర్తి యీతఁడు
కేవల శివుఁడనుచు మిగులఁ గీర్తించి రొగిన్.134
భుక్తి ముక్తి సౌఖ్యదాయకం సమస్త లోకనాయకం
వాసవాది దేవ సన్నుతం మునీంద్ర భావభావితం
నిత్యసత్యబోధ విగ్రహం నితాంత దుఃఖనిగ్రహం
భక్త దుర్విపద్వినాశకారి వీరభద్ర మాశ్రయే.135
దక్ష దుష్ట యజ్ఞ సూదనం విపక్ష పక్షభేదనం
పూషభాను దంతఖండనం భుజంగరాజమండనం
నీలనీరదాంగ భాస్వరం పరాత్పరం నిరీశ్వరం
భక్త దుర్విపద్వినాశకారి వీరభద్ర మాశ్రయే.136
దుష్ట దైత్య రాజ శిక్షణం కృపాకటాక్షవీక్షణం
మృత్యు గర్వ పర్వ తోద్భిదం సమస్తరాట్పరిచ్ఛదం
యోగి మానసాబ్జ హంసకం సువర్ణ మంజు హాసకం
భక్త దుర్విపద్వినాశకారి వీరభద్ర మాశ్రయే.137
సర్వలోక సౌఖ్యదాయకం మురారి దివ్యసాయకం
కోటికోటి భానుతేజసం నిరస్త మోహరాజసం
భూరి భోగ భాగ్యదాయినం వినష్ట దైత్యమాయినం
భక్త దుర్విపద్వినాశకారి వీరభద్ర మాశ్రయే.138
కాలకాల మద్భుతాకృతిం కృశాను ఫాలలోచనం
బాలచంద్రమౌళి మద్వయం కృష్ణా రసామృతాలయం
భద్రరూప భద్రకాళికా మనోంబుజాత భాస్కరం
భక్త దుర్విపద్వినాశకారి వీరభద్ర మాశ్రయే.139
అని వినుతించు దేవతాగణంబునం దనుకంపాయతచిత్తుండై తద్విప న్నివారణంబు సేసి గణాళితోడంగూడి శ్రీమత్కైలాసాచలంబుఁ బ్రవేశించి పరమేశ్వరునకు నమస్కరించి తన విజయం బెఱింగించి వీరభద్రేశ్వరుండు భక్త సురక్షణశీలుండై నిజేచ్ఛంబ్రవర్తింపుచుండెనంత విధాతయు విచ్ఛిన్నంబైన యజ్ఞంబు సంపూర్తిగావించె నా దక్షుండు శివాజ్ఞా వశంబునఁ బునర్జీవితుండై కాశికాపురికిం జని సకలలోకేశ్వరుండైన విశ్వేశ్వరుంగూర్చి తపంబుజేసి ముక్తుఁడయ్యె నిట్టి వీరభద్రవిజయ కథావిధానం బెవ్వరైన వినినఁ జదివిన లిఖించిన విపత్సముదాయంబులం బాసి భుక్తి ముక్తులం జెందుదురని చెప్పి శివుం డుమాదేవికి మఱియు నిట్లనియె. 140
ఆశ్వాసాంతము
చక్షుశ్రోత్రపభూష, పోషితమునీశా, శాసితాశాధిపా.
కుక్షిస్థాఖిలలోక, దేవవినుతాకుంఠప్రభావోదయా,
రక్షశ్శిక్షణదక్ష దక్షిణభుజా, రాజత్త్రిశూలాయుధా,
వీక్షాశిక్షిత పంచబాణ, సుమనోవేద్యస్వరూపోజ్జ్వలా !141
కరుణా కటాక్ష రక్షిత
సరసిజ గర్భాండ, భక్తసంఘ నిషేవ్యా,
పరమేశ, చంద్రశేఖర,
గిరిరాట్కూట ప్రచార, కేవల సుఖదా!142
నిగమ వినుత లీలా, నిత్యకల్యాణ శీలా,
ఖగ గమన నిషేవ్యా, గాఢవిజ్ఞాన భావ్యా.
మృగధర, గతపాశా , మృత్యుదర్ప ప్రణాశా,
దిగధిపనుతకీర్తీ, దేవ, శ్రీశైలవర్తీ !143
ఇది కొప్పరాజనంతామాత్య పౌత్ర లింగనామాత్య పుత్ర సుజన విధేయ నరసింహ నామధేయ ప్రణీతంబయిన చిదంబర నటన తంత్రోక్త శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యంబునందుఁ బ్రథమాశ్వాసము.
- ↑ సంధి చింత్యము