శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము

ద్వితీయాశ్వాసము



శ్రీసమధిక మురజిద్విధి
వాసవముఖ దేవలోక వర్ణిత చరణా
దాసజనావన పావన
భాసుర కరుణాంతరంగ పర్వతలింగా! 1

అవధరింపు మద్దేవుం డుమాదేవి కిట్లనియె.2

అంతమీఁదట సతియు హిమాద్రివరుని
వరము మన్నించి యాతని భవనమునను
జననముం బొందె నటమీఁద శంకరుండు
దక్షిణామూర్తి రూపంబు దాల్చి మఱియు.3

కైలాసాచలశృంగసంగత మహాకల్యాణసౌధాంతిక
ప్రాలేయాంశుదృశద్వితానకృత శుంభద్వేదికామధ్యమం
దాలోలాతివిశాలపత్ర విలస న్న్యగ్రోధమూలస్థలిన్
హేలామీలితలోచనుండయి శివుం డేకాంత లీలారతిన్.4

వీరాసనస్థుఁ డగుచును
ఘోరాపస్మారవృష్టికుంచితపరుఁడై
ధీరత్వ మొప్పఁ దను దా
వారక వీక్షింపుచుండె పరమసమాధిన్.5



ఆ సమయమ్మునందు సనకాదులు యోగ తపోవ్రతక్రియా
భ్యాస విశేషబోధముల బ్రహ్మ మెఱింగియు దేశికోక్తి న
బ్జాసన విష్ణురుద్రులు గుణాశ్రయులంచుఁ దలంచి నిర్గుణో
ద్భాసిత దక్షిణాభిముఖ దైవము జూడఁగ వెండికొండకున్.6


చనునెడ ముందట నఖండ పాండు డిండీరఖండాచ్చచ్ఛవిభాసురంబులును శరత్కాల కాదంబినీ కదంబక ప్రభాడంబర విడంబితంబులు నగు మహా కలధౌత శిఖరిశిఖరంబుల విలోకించి నమస్కరించి డగ్గరి య గ్గిరీంద్రంబు నకు జుట్టునుంగల గణేశ వీరభద్ర నంది భైరవ కుమార దుర్గా మహాకాల మహాదన్తాభిరక్షి తాష్టదిగ్గోపురద్వారంబగు ప్రాకారం బతిక్రమించి కాంచ నాంచితభూభాగంబగు ప్రథమావరణంబున భక్తులగు ననేక దేవర్షిబ్రహ్మర్షి సిద్ధసాధ్యగణంబుల నాలోకింపుచు నేకోత్తరశతకోటి రజితశిఖర విరాజితం బగు ద్వితీయావరణంబున త్రైలోక్యముక్తులగు నసంఖ్యాత ప్రమథుల వీక్షింపుచు నేకోత్తరకోటి సువర్ణశిఖరాకలితంబగు తృతీయావరణంబున ననేకకోటి రుద్ర రుద్రకన్యా ద్యష్టైశ్వర్యసిద్ధవితానంబులంజూచుచు నేకో త్తరలక్ష లక్షిత మణిశిఖరాలంకృతంబగు చతుర్థావరణంబున స్వాధికారం బులు వదలి మోక్షాపేక్షులై జ్యోతిర్లింగంబు ధ్యానంబుసేయు ప్రాచీన విధి విష్ణుపురందరాది బృందారక సందోహంబు నీక్షింపుచు నేకోత్తరదశసహస్ర స్ఫటికశిఖరాభిరామంబగు పంచమావరణంబున ఋషభ క్షేత్రపాల చండీశ దుర్గా స్కంద నంది గణేశ సైన్యపతుల సామీప్యముక్తుల నవలోకింపుచు నేకోత్తర సహస్ర సూర్యకాంత శిఖరోత్తుంగంబగు షష్ఠావరణంబున నేకోత్తరశత తాండవమూర్తులను సారూప్యముక్తులనుం గనుంగొనుచు నేకోత్తరశతాగ్నికాండశిఖరోదారంబగు సప్తమావరణంబున పరమేశ్వరు పంచవింశతి లీలాస్వరూపంబుల నుతింపుచు నేకాదశ చంద్రకాంత శిఖ రాభిశోభితంబయిన యష్టమావరణంబున నేకాదశరుద్రమూర్తులకు నమస్క రింపుచు నవరత్నమయైక శిఖరమయంబగు నవమావరణంబున సాయుజ్య ముక్తిస్థానంబగు సదాశివు నిలయంబు నందీశ్వరానుమోదితులై ప్రవేశించి యందు దివ్యసౌధప్రాంతంబున నమృతకాసారతీర న్యగ్రోధమూల నవరత్న వేదికాస్థిత మణిగణాకుంఠిత కంఠీరవాసన మధ్యంబునందు. 7


శతకోటిచంద్రమోద్భుతకాంతి గలవాని
         గడు మించు మించెడి జడలవాని
నీరదరుచి నింపు నీలకంఠమువాని
         చారుబాహాచతుష్కంబువాని
స్ఫుట భస్మలేపత్రిపుండ్రాంకములవాని
         ప్రకట రుద్రాక్షమాలికలవాని
నాసాగ్ర వీక్షణాభ్యాస శీలమువాని
         స్వానుభూతిక్రియాసరణివాని

మన్మథాయుత సౌందర్యమహిమవాని
సకల సద్భక్త రక్షణక్షణమువాని
పూర్ణగుణభావు దక్షిణామూర్తిదేవు
గనిరి మౌనులు కన్నుల కఱవుదీఱ.8

కని సాష్టాంగ ప్రణతులు
వినయంబునఁ జేసి లేచి విశ్వాతీతున్
జననాంతదూరు శంకరు
వినుతించిరి మౌనివరులు విమల మనీషన్ 9

జయ జయ చంద్రకళాధర
జయ జయ దేవాదిదేవ జయసర్వేశా
జయ జయ సకల ఫలప్రద
జయజయ గౌరీహృదంబుజాత మిళిందా !10



నీవు నిర్దేహివయ్యును నీలకంఠ
సువిమలస్ఫుటమూర్తివై సులభముగను
పక్వచిత్తుల కుపదేశపథము దెలుప
దక్షిణామూర్తి రూపంబుదాల్తు వభవ.11

బ్రహ్మమానసమున ప్రభవించియును మేము
        సకల వేదార్థముల్ జదివి వినియు
బ్రహ్మ మిట్టి దటంచు భావించి తెలిసియు
        స్వానుభూతిక్రియాసరణిలేక
దేశికశ్రేణిచే దేవ : నీ యనుభూతి
        వెలయు శాస్త్రాళిచే, దెలియదనుచు
బుధవర్యులను జేరి బోధింపుఁడని పల్క
        మే లెఱింగిన యట్లు ప్రేమ వారు

పల్కి రటులౌట బల్కులు పల్కరాని
పరమనిర్గుణ తత్త్వంబు బట్టబయలు
గాగ తెలివిడి సేయుమీ కాలకంఠ!
గురువులకునెల్ల మొదలింటి గురువ వీవ.12

అని మునులు విన్నవించిన
ఘనయోగసమాధి వదలి కరుణాన్వితుఁడై
జననాంతదూరుఁ డీశుఁడు
మునివర్యులఁజూచి పలికె మోదంబెసఁగన్.13

గంధమాదన కైలాస కనకశైల
మందరంబుల గౌరి ప్రమధనిచయము
గొలువఁ గొలువుందు భక్తులకోర్కె లొసఁగ
విల మహాస్థలి లింగమై నిలిచినట్లు.14

మఱియు వ్యష్టిభూతులైన మునులు స్వదేహంబుల త్రికూటాగ్రంబుల నాత్మధ్యానంబు సేయుదు రట్ల సమష్టిభూతుండనైన నేనును బ్రహ్మాండ దేహంబునకు త్రికూటస్థానంబగు నా త్రికూటాద్రియందు ధ్యానసమయంబుల నేకాంతంబుగా నివసించి యుందును గావున నచ్చోట మీకును బ్రహ్మోపదేశంబు జేసెదనని వారలతోడం బలికి సనకసనందనాది పరమహంసలను వాలఖిల్యాది యోగసిద్ధులను నారదాది దేవర్షులను వసిష్ఠాది బ్రహ్మర్షులను మేధాది ప్రధాన రాజర్షులం దోడ్కొనివచ్చి సవ్యాపసవ్య

మధ్యదేశంబులంగల బ్రహ్మ విష్ణు రుద్రులతోడ నేకీకృతయగు నిజమూర్తి ననుసరించి సవ్యాపసవ్య మధ్యదేశంబుల బ్రహ్మ విష్ణు రుద్రరూప శిఖరంబుల నొప్పు నప్పరమేశ్వరాకార ధారుణీధర మధ్యశిఖరంబున బిల్వకాంతార కాంతేందుకాంత కుట్టిమస్ఫుట వటవిటపి నికట స్ఫటిక ఘటిత సహస్ర స్తంభ సంభార సంభృత మణి మండ పాంతర భాస్వర కార్తస్వర వేదికామధ్యంబున నుద్భాసిత వీరాసనాధ్యాసిత పదుండును జ్ఞానముద్రిత హస్తుండును నాసాగ్ర నిరీక్షణుండునునై స్వరూపాలోకానంద పరవశుండై యుండె నంత నమ్మునిసమాజంబుల గిరీంద్రోపత్యకాధిత్యకా స్థలంబులం బ్రవేశించిరి.15


కొందఱు భూరిసానువులఁ గొందఱు దివ్యనితంబ భూములన్
కొందఱు గండశైలములఁ గొందఱు బిల్వవనాంతరంబులన్
కొందఱు రత్నకూటములఁ గోరి వసించుటఁజేసి మారజి
న్మందిర మన్నగంబు మునిమందయనన్ విలసిల్లె నెంతయున్. 16

అంత నద్దేవు నర్చించి యాత్మవిద్య
కరుణ దయచేయుమను సనకముఖమౌని
నికరములఁజూచి యానంద నిలయుఁడైన
దక్షిణామూర్తి బల్కె తత్వైక సరణి.17


మీరలు సాధనచతుష్టయ సంపన్నులును కామక్రోధాది రహితులును దేహాభి మాన వర్ణితులను జితేంద్రియులు నగుట పూర్ణాధికారులగు మీకతి సుల భంబుగా స్వాత్మావ బోధంబగుగాని యనధికారులకు నెన్ని విధంబుల బోధించినం దెలియదవీచెప్పి దయాళుండై.18


ముందర పార్శ్వంబు లందును వెనుకను
         సందుల గొందులఁ గ్రిందుపడఁగ
క్రిందట మీఁదట ముందట ముంగిట
         లోపల వెలుపల లోకమెల్ల
ప్రళయ కాలాంభోధి భంగిని బూర్ణమై
        యచలమౌ బ్రహ్మంబు నా క్షణంబ
మౌనముద్రారూఢ మహిమచే సూచన
        గావించి చూచి యుత్కంఠమీఱ
        
[1]చాక్షుషీ దీక్ష యొసఁగి నిస్సంశయముగ
శక్తి పాతప్రకారైక సరణిఁ దెలువఁ,
బడి విగ్రహ మవనిపై వారి కంత
నంత కాంతకు సత్ప్రసాదాప్తివలన.19

అపుడు విస్మృతిజెంది బాహ్యంతరముల
మరచి సనకాదులంతట నెఱుకగలిగి
గురునిఁబూజించి బ్రహ్మైక్య గరిమగనిరి
మరలవారల కనియె నా పరమగురుఁడు.20

చాక్షుషీ దీక్షచేతను శక్తి పాత
మరయనేరక బయలు బ్రహ్మంబదించు

బలుకుదురు కొంద అంబర భ్రాంతిదొలఁగు
టెట్లొకోయని యెంచ రొకింతయైన.21

బయలిదె బ్రహ్మంబైనను
వియదాకృతియెద్ది దాని వెదుకంగదగు
వియడాత్మలకును రూపము
లయి తగు శబ్దం బశబ్దమనునవి వినుడీ :22

ఇట్లశబ్దంబగు బ్రహ్మం బీ బయలేయని యూహించునెడ నది మనంబునకు విషయంబగుట బ్రహ్మంబెట్లగు నిర్విషయంబగు బ్రహ్మంబు దానిచేతం దెలియంబడదు. తెలియఁబడెనేని సవిషయంబగు నిట్టియెడ నీ ప్రపంచం బంతయు బ్రహ్మంబేయని పలుకుట స్వానుభవంబుగా దట్లగుట నుపదేశసమ యంబునందె శక్తిపాతవశంబున సంకల్పకూన్యంబై శరీరపతనంబైన యప్పుడు బ్రహ్మంబు తానగునంత నీ జగజ్జాలంబంతయు బ్రహ్మంబని స్వానుభవంబునం దెలియంబడునట్టి శక్తిపాతంబు మోచకానుగ్రహంబునం గాని కా దట్లగుట మోచకోపాసనంబు చేయవలయు నదెట్లనిన23

ముక్తియును ముక్త్యుపాయంబు మోచకుండు
యోచనప్రదుఁడను నాల్గు ముఖ్యముగను
శ్రుతులు వివరించిపల్కు విశ్రుతముగాఁగ
బరగ దీనిని వరుసతో నెఱుఁగవలయు.24


అందు ముక్తి చతుర్విధ యగు నెట్లనిన25


సాలోక్యము సామీప్యము
చాలగ సారూప్యవదము సాయుజ్యంబున్
నాలుగు ముక్తులు గలవట
మేలౌ సాయుజ్యపద మమేయము దలఁప౯.26


జగమంతయును రజ్జుసర్ప ప్రతీతీగా
         నాభాసమాత్ర మౌనని తలంచి
తనకు నావరణమై తగు నవిద్యను విద్య
        చే రయంబున బాసి వేరులేక
బ్రహ్మంబు తానయై వాసనా త్యాగాఖ్య
       యోగంబుచేత విరాగియగుచు
చిన్మయానందంబు జెందుట సాయుజ్య
        ముక్తినాదగు నిదె మోక్షమనుచు
        
శ్రుతులఁ బలుకంగబడియె విశ్రుతముగాఁగ
ముక్త్యుపాయంబు జ్ఞానమౌ ముఖ్యముగను
జపతపోవ్రత సత్యశౌచములు క్రమము
దనర ముక్త్యుపాయంబులౌ తపసులార !27

ముక్తి తెలిసియుఁ దదుపాయ ములునుగలిగి
యుండియును మోచకుం డీశు డుండకున్న
ముక్తి కల్గదు, షడ్వర్గ ముక్తికాదు ;
వసుధ నవవర్గ మపగత వర్గమండ్రు.28

కొందఱు కామాదులు మదిఁ
జెందినఁ గొరతేమి తాను జిన్మయుఁడగుటన్,
జెందును తద్వికృతుల నది
యందురు విజ్ఞాన హీనులయి ధరలోనన్.29

మది కామ క్రోధాదులు.
గదియుటచే గాడె మున్ను కల్పావధిగా
వదలక జన్మ జరామృతు
లొదవె సంసారమమత యుడుగక నిలిచెన్ .30



మఱియుఁ దానచలం బగు చిదాకాశంబని ప్రతీతిచేఁగాని స్వానుభవంబున నెఱుంగని కతంబున గదా, స్త్రీ దేహంబుల కామంబులచేత రతియును, యహితులయందు క్రోధంబుచేత హింసయును, ధనంబులయందు లోభంబు చేత దృష్ణయును, బంధువులయందు మోహంబుచేత నాసక్తియును, నైశ్వర్యంబులయందు మదంబుచేత గర్వంబును, దాయాదులయందు మత్సరంబున దీర్ఘ క్రోధంబును గలిగి యనేక జన్మనరకంబులొందెఁ; దదీయారి షడ్వర్గంబు లేకుండుటవలన మోక్షంబున కపవర్గంబను పేరుగలిగె, నట్టి కామాదులు ప్రారబ్ధంబున నొకానొకప్పుడు కలిగినను వశిష్ఠాదులు వాసనా త్యాగ యోగ సంపన్నులగుటఁ దద్దోషంబులం బొరయక త్రికాలజ్ఞాన సంపన్నులయి యణిమాది సిద్ధులుగలిగి జీవన్ముక్తులై రట్లగుట వీని జయించుటకు మోచకుండగు దక్షిణామూర్తి నుపాసించిన నద్దేవు కరుణఁ గామాదులం గెలిచి యిహంబునందె సకల భోగంబులంబొంది వాసనా రహితులై జ్ఞానంబున సాయుజ్యము క్తిఁ గాంతురట్టి దక్షిణామూర్తినగు నేనే త్రికూటాచలంబున కోటీశ్వరాఖ్యనుంట నన్ను భజించిన ముక్తులగుదురని చెప్పి యద్దేవుండు మఱియు నిట్లనియె.31


జగతి కలివేళ మోచకస్మరణ కంటె
ముక్తి వేఱొండు సాధన పొసఁగ దెందు
నదియు మూఁడువిధంబుల నలరుచుండు
నామరూప స్వరూపక నామములను.32


అందు నామస్మరణంబు శివశంకర మహాదేవాది నామోచ్చారణంబు, రూప స్మరణంబు జటాజూట కాలకంఠ చతుర్భుజ గజాజినాగజాంచిత వామాంగ దివ్యమంగళ విగ్రహస్మరణంబు, స్వరూపస్మరణంబు నిర్గుణనిర్వికల్ప నిరాలంబ చిదంబర స్మరణం; బందు నామస్మరణంబున పాపహరణంబును,

రూపస్మరణంబున చిత్త నిగ్రహంబును, స్వరూపస్మరణంబున మనోలయంబునుం గలుగు.33



ఈలీలన్ స్మరణంబు సేయుటకు నయ్యీశ స్వరూపంబు దా
నాలోకించినగాక శక్యమగునే యట్లౌటఁ దత్ప్రాప్తికై
చాలన్ మోచకదాయి సద్గురు తను స్వాంతార్థ దానంబుచే
నోలిం బూజ యొనర్పగాఁదగు మహాయోగ్య ప్రకారంబునన్.34

ఇక మోచకప్రద గురుని రూపంబెట్లనిన35

క్ష్మా దేవతగురుండు సకల వర్ణాళికి
            బ్రాహ్మణేతరులకు బార్థివుండు
వైశ్యుండు గురుఁడగు వైశ్యశూద్రులకును
           స్త్రీ, శూద్రులకు గురుసిద్ధిగాఁగ
నఖిలాశ్రమంబుల కాత్మవిదుండగు
            బ్రాహ్మణుండు గురుండు బ్రజ్ఞవలన
వర్ణాశ్రమంబుల వాసనల్ విడనాడి
            మహి నతి వర్ణాశ్రమస్థుఁడగుచు
            
విగత కామాది షడ్వర్గ విభవుఁడగుచు
సమధికోన్మత్త బాలపిశాచవృత్తి
నరుగునాతండు ననుబోలె నఖిలమునకు
జూడ గురుఁడగుగాని శిష్యుండుగాఁడు.36

గురుమహిమ లిట్టివనుచును
బరగన్ భాషింపవశమె భాషాపతికిన్
గురుమహిమ తెలియనేరని
నరునకు మోక్షంబులేదు నానాగతులన్ .37

హరుఁడు కోపింప రక్షించు గురువరుండు
గురుఁడు కోపింప రక్షింప ధరణిగల రె


గురుఁడె రుద్రుండు, విష్ణుండు; గురుఁడె యజుఁడు,
గురుఁడె పరమాత్మ యతనికిఁ బరుఁడులేఁడు.38

శివుఁడు గురురూపమై వచ్చి చెప్పకున్న
నిరత నిర్మల నిర్గుణ నిర్వికార
నిత్యపరిపూర్ణ తత్త్వంబె నేనటంచు
తెలియఁబడుటెట్లు గ్రంథముల్ దెలుపగలవె ?39

గురుబోధ లేనివారికిఁ
బరగ ననేకార్థశాస్త్ర పాఠవ్యసనం
బెఱుకను దొరకొనజేయునె ?
పరిపక్వము గానివాని భ్రాంతులుగాకన్ .40


మఱియు నీశ్వరానుగ్రహంబున పరిపూర్ణబోధంబు గల్గదేయనిన నీశ్వరుని నిజరూపం బెఱింగి భజించినంగాని పూర్ణానుగ్రహంబు గల్గదదిలేక ముక్తి లేదట్టి యీశ్వరు నిజరూపంబు సద్గురుప్రసాదంబునఁగాని తెలియఁబడ దట్లు తెలియక భజించుటవలన పుణ్యఫలంబెకాని యీజన్మంబునఁబూర్ణ బోధంబు కలుగ దట్లౌట నెన్ని విధంబులనైన గురూపదేశంబుచేఁగాని యీజన్మంబు నందె కేవల ముక్తి సంభవింప దట్టి గురుమూర్తిని చతుర్విధ శుశ్రూషల సేవింపని దేహాభిమానులకు ముక్తి లేదని వేదపురాణజాలంబులు పలుకు చుండునని చెప్పి వెండియు నిట్లనియె.41


గురుభజనమె హరభజనము
గురునిందయె హరునినింద గురుభక్తియె దా
హరభక్తియగును దలఁపఁగ
గురుహరులకు భేది మెద్ది కోవిదులారా :42


గురుపాద జలముగ్రోలుట
గురుతర గంగోదకంబు గ్రోలుటగాదే
గురుసుప్రసాద సేవన
మరయ పురోడాశ భక్షణాతిశయమగున్ .43


గురునిర్ణయ విధమెఱుఁగక
గురుభక్తియు లేక మనసు గుదియింపని పా
మరుఁ డుపదేశంబొందిన
దొరకునె సన్ముక్తి యెన్ని త్రోవలనైనన్ .44

ఇట్లు గురు లక్షణస్థితి యెఱిఁగి యతని
వలన మోచకు ననుగాంచి లలితభక్తి
నన్ను భజియించెనేనియు నాదుకరుణ
విగతషడ్వర్గుఁడై ముక్తి విభవమొందు.45

ఎన్ని విధంబులనైనను
పన్నుగ కామాది శత్రుపంక్తిని విజయా
భ్యున్నతి నణఁచక మోక్షం
బెన్నటికిని గలుగనేర దేరికినైనన్.46

అని బోధించిన దక్షిణాస్యునకు సాష్టాంగంబు గావించి య
మ్మును లాత్మైక్య సమాధిఁజెంది యగరాణ్మూలస్థలిన్ నిల్చి "ర
య్యనఘాద్రీంద్ర మహత్వ మెన్నదరమే యాచక్రవాళావనిన్
ఘనతంగాంచు నగంబు లిగ్గిరి అసద్గండోపభాగంబులే.”47

అని చెప్పి శివుండు పార్వతికి మఱియు నిట్లనియె.48

ఉరు తదద్రి మాహాత్మ్య మటుండనిమ్ము
గుణవికారత మాని నిర్గుణ సమాధి


బూని యేనందు దక్షిణామూర్తి నౌచు
వెస వసించితి నగ్గిరి విడువకుండు.49

ఇట్లు నివసించిన మద్రూపంబు సేవింప నా త్రికూటాచల కూటాధిపతులగు బ్రహ్మ విష్ణు రుద్రు లరుదెంచి దేవా ! నీవు చిదాకాశ రూపంబగు పరశివ తత్త్వంబవయ్యును ఘృత కాఠిన్యమూర్తియగు సదాశివు రూపంబుబొంది యిమ్మునుల కనుగ్రహింప నిపుడు దక్షిణామూర్తి లీల నంగీకరించి యిన్న గంబున నిరంతరంబు నుండఁదలంచుటవలన నేము నస్మచ్ఛిఖరాగ్రంబు లందు నిలిచి నిన్ను సేవింపు చుండెదము. నీవు ననేకకోటి బ్రహ్మాండంబుల కధీశుండవగుట కోటీశుండవని నిన్నఖిలలోకంబులుఁ బలుకుఁగాక యనిన నద్దేవుండు రానంగీకరించి వారల కిట్లనియె.50


మీకు నిలయంబులై కాంతి మెఱయుచున్న
మూఁడు శిఖరంబులందున మూఁడులింగ
రూపములనుందు, మీరు నిరూఢభక్తి
పూజ గావింపుఁ డానంద పూర్ణులగుచు,51

ఈమూఁడు లింగంబు లిహమందు మర్త్యుల
            కగపడకుండుట నవనిజనము
లా మూఁడు శిఖరంబులందున పటుశిలా
           రచితలింగంబు లేర్పఱచి భక్తిఁ
బూజించి యిహపరముల భోగమోక్షంబు
           లందంగ గల రనాయాసవృత్తి
నని సర్వగురుఁ డీశు డానతి యిచ్చిన
          నజ జనార్దన రుద్రు లాత్మ శిఖర

ములను నివసించి తల్లింగపూజనంబు
సేయుచున్నారు తన్మహాక్షేత్ర మహిమ
వేయి యుగములకైనను వేయినోళ్ళ
శేషఫణిరాజు కైనను జెప్పఁ దరమె.52

ఫలశ్రుతి


ఈ కథ వినినను జదివినఁ
బ్రాకటముగ భోగమోక్షపదవులు గలుగున్
జేకూరు ముక్తి సౌఖ్యం
బాకల్పాంతంబు కీర్తి యవనిని నిలుచున్ .53

అనిన మహాదేవున కుమాదేవి యిట్లనియె.54


రత్నకాంచన రాజిత రాజితంబు
లైన శైలంబులను బాసి యంధకారి
ఘోరపాషాణ జర్జర ధారుణీధ్ర
శిఖర మెట్టులుచేరెనో చెప్పు మభవ:55

అన విని శంకరుఁ డిట్లను
వినుము త్రికూటాద్రిరాజ విభవము జెప్పం
గను శక్యమౌనె యేరికి
ముని సుర గంధర్వ సిద్ధ పూజిత మెపుడు.56

త్రికూటాద్రిమహిమ


పూర్వయుగంబుల భూరి రాజిత రత్న
           శృంగ సంఘాతమై చెలఁగుచుండి
కలియుగంబున శిలాకలిత శృంగంబయ్యె
           నిదిగాక యి న్నగం బెంచిచూడ
సరసిజభవ విష్ణు శర్వ మహేశ స
           దాశివమూర్తియై తనరుచుండు
శృంగంబులును మూఁడు శివహరిబ్రహ్మలు
          నగరాజ మీశ్వరుండగుఁ దదగ్ర


లింగము సదాశివుండుగ లీల బ్రహ్మ
పంచకాకృతి నొప్పుచు పరమమౌని
జాలసంగతమైన యాశైలమహిమ
బూని కొనియాడఁదరమె వాగ్జానికైన57

అరయగఁ బంచకృత్య విభవాస్పదమై తగు బ్రహ్మపంచకం
బురుతరమూర్తిగాక భువనోన్నతమై తగు న న్నగంబుతో
సరియనవచ్చుటెట్లు హిమశైలసుమేరు మహీధ్రరౌప్య భూ
ధర వర మందరాద్రులు సదాశివవాసములయ్యు నెంతయున్ .58

ఏ వంకన్ గనుఁగొన్న శృంగములు మూఁ డేపార గన్పట్టుటన్
భావింపంగ త్రికూటనామకముచే భాసిల్లు న ప్పర్వతం
బేవేళం దెడలేక నిల్చె శివుఁ డం దేకాంత మౌనస్థితిన్
ధీ విశ్రాంతి వహించు చో టగుట యందే నిల్చి రమ్మౌనులున్ 59


అట్టి దివ్యస్థలంబున నభవుఁ గూర్చి
జపతపంబులు గావించు జనుల కిష్ట
సిద్ధు లతివేగముగనిచ్చు శివుఁడు భక్త
కామధుజ్మూర్తి సన్మునిఖ్యాతకీర్తి.60

అచ్చోట నొకసారి యభవు నామముఁబల్క
         సాహస్రనామ సంస్మరణ ఫలము
నచ్చోట నతిథికి నన్న మించుక యిడఁ
         గోటి భూవిబుధుల కొసఁగు ఫలము
అచ్చోట దొనలలో నభిషేక మొనరింప
          సార్ధత్రికోటి తీర్థాళిఫలము
అచ్చోట శివయోగి కణుమాత్రమిచ్చిన
           మేరుదానోన్నతి మీఱు ఫలము




నెసఁగ నొసఁగెడి నా త్రికోటీశు నీశు
నర్థిఁబూజించి దిక్పాలకా ద్యమర్త్య
గరుడ గంధర్వ యక్ష కిన్నరులు నరులు
నిజ మనోభీష్ట సిద్ధులు నెమ్మిఁగనిరి.61

ఆ కోటీశ్వరుఁగొల్చి యోగు లిల బ్రహ్మైక్యానుసంధానులై
రా కోటీశ్వరుఁ గొల్చి భక్తు లొగి తారాద్రీంద్ర సంవాసులై
రా కోటీశ్వరుఁ గొల్చి కర్మఠులు దేవావాస సంచారులై
రా కోటీశ్వరుఁగొల్చి లౌకికులు నిత్యైశ్వర్యులై రెంతయున్ .62

ఏమని చెప్పవచ్చుఁ బరమేశుని కన్నగమందుఁ బ్రేమ సు
శ్రీ మహనీయ బిల్వవనసీమల గాంచన పుల్లహల్ల కో
ద్దామ సరోవరంబుల సుధామధుజీవన నిర్ఘరంబు లం
దా మునికోటితోడ ననయంబు విహారముసల్పు నెంతయున్.63

మూఁడు మూర్తుల రూపమౌ మూఁడు శిఖర
ములునుగాక యితర దేవమూర్తులయిన
హ్రస్వశిఖరంబు లెన్నేని య గ్గిరీంద్ర
మందు గల వన్నియునుజెప్ప నలవియగునె :

గుహలును బిలములు కొనలును
బహుళముగా బిల్వవనులు వాపీతతులున్
మహిమాస్పద సిద్ధక్రియ
లహహ : యసంఖ్యంబు లెపుడు న గ్గిరిమీఁదన్ .65

కరిహరి శంబర కాసర
కరిహరి భల్లూక గవయ గండక చమరీ
శరభ వ్యాఘ్రాదిభయం
కర మృగము లనేకకోట్లు గల వ గ్గిరిపై,66


ప్రస్ఫుట చ్ఛత్రాభ బర్హి బర్హచ్చాయ
          పవళించి నిద్రించు ఫణిగణంబు
నట దుగ్ర పంచాస్య నఖనిరాకృత గండ
          కండూతియైన వేదండచయము
శరభ పక్షోద్భూత చటులానిలంబున
         స్వేదంబు నణఁగించు సింహసమితి
వనగత శార్దూల వాహనారూఢులై
         చరులలోఁ గ్రీడించు శబర వితతి
         
గలిగి యచ్చోటఁగల భూతములకు నెపుడు
జన్మజాతివిరోధముల్ సడలిపోవ
తపముజేసిన మౌనుల తపముకలిమి
కభవు డెంతయుఁ బ్రత్యక్షమగుచునుండు.67

శిల లన్నియు లింగంబులు
జల మంతయుఁ దీర్థ మచట సన్మతి నందున్
గలకాల ముండు వారికిఁ
గల కాలమె సఫలమైన కాలము తలఁపన్.68

మాటలేటికి నచ్చోట మలహరుండు
బ్రహ్మపంచకరూపమౌ పర్వతేంద్ర
మగుచు నుండియుఁ ద చ్ఛిఖరాగ్రమందు
లింగమైయుండె మానవశ్రేణిఁ బ్రోవ.69

శివరాత్రి నా శైవ శిఖరంబుపై కెక్కి
        దొనలలో స్నానంబు దనరఁ జేసి
భసితంబు దేహంబుపై నిండుగాఁ బూసి
         రుద్రాక్షమాలికల్ రూఢిదాల్చి


శైవపంచాక్షరీ జప మొప్పఁగాఁ జేసి
       యుపవాస జాగరం బొనర సల్పి
రంగారు కోటీశ లింగ మ స్తకమందు
       బిల్వ దళంబులు బెట్టిరేని

మోక్షమప్పుడె గలు ముముక్షువులకు
తపము లేల ? మహా మంత్రజపము లేల?
క్రతువులేల  : సుదుష్కర వ్రతము లేల ?
యోగ మేల? నిరంతర త్యాగ మేల?70

శిఖరాగ్ర గైరికాశేషధాతు ప్రభా
      చ్ఛన్న అతావళుల్ జడలు గాఁగ
నిఖిల శృంగోద్భూత నిర్ఝర వాహినుల్
      రమణీయ సర్పహారములు గాఁగ
ఘననితం బాభోగ కాదంబినీశ్రేణి
      కటి తటి గజచర్మ పటము గాఁగ
శశికాంత విస్ఫుట స్ఫటికచ్ఛవివ్యాప్తి
        పూసిన సితభూతిపూత గాఁగ

మౌని నేవితమగుచును మౌనముద్ర
దనరఁగా దక్షిణామూర్తి యనఁగనొప్పు
న మ్మహీధ్రంబు తనచుట్టు నర్థిఁ దిరుగు
జనములకు వేగ భోగ మోక్షము లొసంగు.71

పిణుదులు పొదుగు నిండను పెద్దకాల
ముండి తత్ క్షీర మెఱుఁగక యుండినట్టు
ల గ్గిరిని నెప్పు డుండియు నల్పమతులు.
తత్ప్రభావంబు గనలేరు తథ్యముగను. .72


ఎఱుగని వారికి నెఱి ప్రపంచముగాఁగ
       గనుపడి యెఱిగిన ఘనుల కెపుడు
బ్రహ్మమై యుండిన పరశివు కైవడి
       య మ్మహాపర్వతం బరసి చూడ
నెఱుఁగని వారికి గిరిరాజముగఁ దోఁచి
      యెఱిఁగిన విజ్ఞానివరుల కెపుడు
నజ హరి రుద్రేశ్వ రాఢ్య సదాశివ
    పంచకాకృతిగ నేర్పడఁగఁ దోచు

తన్మమహత్వంబు చిత్రమౌ తత్త్వవేది
బృంద సంసేవ్యమును మహానందదాయి
యైన య గ్గిరి నివసించునట్టివారి
కిష్ట సిద్ధు లొసంగు కోటీశ్వరుండు.73

ఆ పరమాద్రిరాజ శిఖరాగ్ర దృషన్మయ సద్మమందు తా
రాపతి శేఖరుండు సుచిరంబుగ నుండుట త జ్జటాటవీ
దీపిత యౌ సురాపగ నదీమని వారిధిఁ జేరబోవు నెం
తే పరిపూర్ణమౌ నొక నదీతిలకంబు వసించు నచ్చటన్.74

అరయంగ ద్రికూట స్థలి
పరగఁగ నోంకార మెపుడు భాసిలుచుండున్
ధరణి త్రికూటాద్రి స్థలి
పరగఁగ నోంకార నదియు భాసిలుచుండున్.75

అన విని పార్వతి యిట్లను
మునిసేవిత: యచటి నదికి మోక్షప్రదమై
చను ప్రణవాభిద యిల నే
యనువున వర్తించెఁ దెలియ నానతి యీవే?76


అని మహాదేవి పలికిన నభవుఁడనియె
ఘనతరంబైన యా నదీజననవిధము
తత్ప్రభావంబు సర్వంబు తథ్యముగను
తెలియ జెప్పెద విను హిమాచలతనూజ !77

ఓంకార నదీ వృత్తాంతము


మును శిబిచక్రవర్తి పరభూభుజులన్ బరిమార్చి వేడ్క మే
దిని గిరి వార్ధి కానన నదీ సహితంబుగనేలి, సర్వభూ
మినిఁ గల భోగ భాగ్యము లమేయగతిన్ భుజియించి మించి తా
వనమున కేఁగె నందు నవవర్గము గోరి తపంబు సేయఁగన్.78

చని యాతండు త్రికూటనామక మహాశైలాధిరాట్పశ్చిమా
శను దానేగియు యోజన త్రయిని శేషాద్రీంద్ర పుచ్ఛస్థలీ
ఘన భూభృన్నికటంబునందు నిలిచెం గాంక్షావిహీనస్థితిన్
మునివేషంబున వల్కలాంబర జటామూర్థప్రభాభాసియై.79

అందు నొక పర్ణశాలయం దధివసించి
మున్ను తన రాజ్యభోగంబు లెన్నికొనుచు
నింతకాలంబు విషయైకచింత చేత
పోయెఁగాలము తృష్ణ తాఁ బోవదయ్యే.80

అని తలంచుచుఁ దన మనంబున నిట్లని వితర్కించె,81

తలిరుంబ్రాయము మోహినీసదృశ సౌందర్యంబు విన్నాణమున్
గులుకుం గుబ్బలు నవ్వుమోము సుమనః కోదండభ్రూవల్లరుల్
గల కాంతామణులన్ రమించితి ననేకావృత్తినై నం గనం
గలనే తృప్తి యొకింతయేని యహహా : కామంబు దుర్లంఘ్యమౌ. 82


ధనము రాసులు మేరు మందరము లట్లు
గూర్చితివి బుత్రపౌత్రులఁ గూడి సుఖము
నొందితినిగాని తృప్తి దా నొందదయ్యె
నీషణత్రయమును గెల్వ నెవరితరము ?83

దానములు పెక్కు జగదేకదాతనౌచు
జేసితిని జన్నములు వేయుఁ జేసినాఁడ
నిన్ని చేసిన ముక్తి లే దెంచిచూడ
తుచ్ఛసంసార మోహంబు దొలఁగకుంట.84

రోగ దారిద్య్ర బంధు విరోధగేహ
కలహ దౌర్భాగ్య దుఃఖసంకలితులయ్యు
వికట సంసారమోహంబు విడువలేరు
వివిధ సుఖభోగవంతులు విడువగలరె ?85

ఇటువంటి సంస్కృతి భ్రమ
నెటులైన న్విడువుకున్న నెవ్వరికైనన్
ఘటియించు నరకవాసము
కటకట : సంసార మింత కష్టంబగునే ?86

అనుచు మహా ధైర్యంబున
జవనాథుఁడు సుతులు హరులు. సామజఘటలున్
ధనధాన్య వస్తుసంపద
లనయ మనిత్యంబటంచు నాశదొరంగెన్ . 87


ఇట్లు విరుక్తుండై యన్నరేంద్రుండు తొల్లి గురూపదేశ శాస్త్రంబులవలనం బడసిన విజ్ఞానంబున తాను శుద్ధచైతన్యం బనియును, తనయందు నారోపితంబైన ప్రపంచంబు తాననియు దెలసియు, జ్యోతిశ్శాస్త్ర విచారంబున గ్రహమండలస్థితి తెలిసియు గ్రహలోకప్రాప్తి లేనియట్లు మననంబులేమి సమాధి వాసనా త్యాగయోగంబులు సంభవించని కతంబున బ్రహ్మపదారూఢి నొందనైతి నిదిగాక దేహాభిమానులై పరస్త్రీ రతులై పరహింసా పరులగుచు కామక్రోధాదిగ్రస్తులైన శుద్ధతామసులు గురూపదేశశాస్త్ర బోధంబుల నీజ్ఞానంబుగల్గియు రావణాద్యసురులంబోలి దండార్హులగుదురు గాని ముక్తినొంద రట్లగుట శుద్ధసాత్వికులయిన యధికారు లీ జ్ఞానంబుగల్గి యీశ్వరోపాసనంబు జేసినఁ గ్రమంబుగా మనన సమాధి వాసనా త్యాగ యోగంబులుగల్గి ముక్తిగాంతురని తలంచి తాను నీశ్వరోపాసనంబు చేయం దలంచియున్న సమయంబున.88


శిబికడ కగస్త్యుఁడు వచ్చుట


శుద్ధశైవుఁ డగస్త్యుఁ డా క్షోణినాథుఁ
పాలి కేతెంచి మోచకోపాసనంబు
నీకుఁ దెల్పంగవచ్చితి నేఁడు మోచ
క ప్రదుఁడనయి తద్విదికలన వినుము. 89

అని మునిముఖ్యుఁడు మోక్షము
దనరంగాఁ దెల్పి యంతఁ దదుపాసనమున్ .
మనమునఁ బనుపడఁ జేసిన
జననాథుఁడు వికచహృదయ జలజాతమునన్.90

ధ్యానంబుజేసె నీశ్వరు
మానితవట మూలదేశ మణిమండపమ
ధ్యానూన సింహపీఠిక
బూనిక గిరిజాసమేతముగ సద్భక్తి.91

సనకాది సన్ముని సంఘంబు లిరువంక
             నుతియింపఁ బ్రమధు లున్నతి భజింప


గనకలతా పింగ ఘనకపర్దము తోడ
            గంధర కందర కాంతితోడ
నురగ హారావళీ స్ఫురిత పక్షముతోడ
           బాహాచతుష్క విభ్రమముతోడ
కటిరూఢ గజచర్మపట విలాసముతోడ
           వీరాసనాభ్యాస విధముతోడ

దనరు శ్రీ దక్షిణామూర్తి దనదు చిత్త
పద్మమందున నిల్పి తాఁ బరమభక్తిఁ
దపముగావించు నారాజు తపము జెఱుపఁ
దలఁచె నింద్రుండు కపట కృత్యంబుతోడ.92


అంతఁదా నొక్క శ్యేనంబై పావకుండు కపోతరూపంబై రాజు మఱుంగున కరిగిన దాని భక్షించు తెఱంగునఁ దన్నికటంబున కేఁగిన నన్నరేంద్రుండు శరణాగత రక్షకుండగుట నక్కపోత సమాన మాంసంబిచ్చి దాని బ్రదికించెదనని నిజ దేహస్థిత మాంసంబు నిశితాసిం జెండి తులారోపణంబు చేసిన నది కపటకపోతంబగుట స్వదేహస్థిత సర్వమాంసంబును దానితోడ సరిఁదూఁగకున్న తన శిరోదేశంబున బిలంబు గావించి శిరస్థితమాంసం బంతయుఁ దులయందిడు సమయంబున నమ్మహేశ్వరుండు,93


శివుఁడు శిబికిఁ బ్రత్యక్షమగుట


అతని ధైర్యంబునకు మెచ్చి హర్యజాది
సురలు గొలువంగ బార్వతీ సుదతిఁ గూడి
నందివాహనమెక్కి యానంద మొదవ
యవనిపతి కంత నెదుటఁ బ్రత్యక్షమయ్యె.94

ఇట్లు ప్రత్యక్ష మగుచు న య్యీశ్వరుండు
క్ష్మాపతినిఁ జూచి యో శిబిచక్రవర్తి :


నేను మెచ్చితి నీతపో నియతి కిపుడు
కోర్కు లేమైన నిచ్చెదఁ గోరుమనియె.95

అనిన నమ్మహీజాని దేవా! ముక్తి ముక్త్యుపాయంబులు దెలిసియు దేహాభిమానంబునఁ గామ క్రోధాద్యంతశ్శత్రుల జయింపం జాలమి మనన సమాధి వాసనాత్యాగ యోగంబులు లభింపక ముక్తుండఁగానైతి నిపుడు మోచక ప్రదుండగు కుంభసంభవు వలన మోచకుండవగు నిన్నెఱింగి భజించుట చేత భవత్ప్రసాదంబున దేహాభిమాన కామక్రోధాదులు వదలుటచేత నచల బ్రహ్మంబు నేనయై ముక్తుండనైతి నింక నాత్మదృష్టి నాకంటె నన్యంబేమియు లేకుంట నేనేమి కోరువాఁడ ? నింతకాలం బవిద్యా ప్రతిబింబ చైతన్యుండనై జీవుండనఁబడి కించిద్ జ్ఞత్వంబున ననేక జన్మంబుల సుఖదుఃఖంబు లనుభవించి మాయా ప్రతిబింబ చైతన్యుండవై యీశ్వరుండవై నీవు సర్వజ్ఞత్వంబున బ్రహ్మంబవగుట నిన్ను గురూపదేశంబున నెఱింగి భుజించుట నీవు నేనయై యచల బ్రహ్మస్వరూపుండనైతి నహో! గురూపదేశం బింతచేసె నధ్యాసశూన్యులైనవారికి గురునియందు మనుష్యబుద్ధి జనించుఁగాని గురుండు సాక్షాత్పరబ్రహ్మం బని యానందించు నన్న రేంద్రునకు శివుం డిట్లను. నీవు విదేహ కైవల్యంబు నొందుము. నీకళేబరంబు కపోతేశ్వర నామక లింగంబై యాకల్పంబు వసించుగాక యని యంతర్ధానంబుఁజెందే నంతట.96



ఆతడుఁ బ్రారబ్ధ నాశనం బగుటవలన
బ్రహ్మమయ్యెను సంకల్పపటలి బా సి
తచ్ఛరీరంబు లింగమై ధరణినిలిచె
నది మహాద్భుతమని యెంచి యచటిమునులు.97

ఆ లింగమూర్తికి నభిషేక మొనరించి
         రోంకార మంత్రంబు నుచ్చరించి.


యా మంత్రతోయంబు లాలింగ మూర్ధస్థ
           బిలమధ్య గతములై పృథివిలోని
కరిగి యచ్చటఁ బుట్టె వరనదీతిలకంబు
          సలలి తోంకారాఖ్య గలిగి యదియు
నా త్రికూటాద్రికి నపరభాగంబునఁ
          బ్రవహించె నిర్మలవారి యగుచు
          
నట్టి యోంకార నదియందు నహరహంబు
స్నానములు సేయు నా గుహాస్థల నివాస
సిద్ధ సంఘంబు నిజయోగ సిద్ధికొఱకు
తన్మహత్వంబు వర్ణింపఁ దరమె జగతి ? 98

ఇట్టి విధంబున జగతినిఁ
బుట్టెనె మున్నెన్నఁడైన బొసగఁగ నదు లే
పట్టున నిట్టి మహత్వము
గట్టిగ లేదనుచు విబుధగణము నుతించెన్.99

అట్టి యోంకారనదియందు నధిక భక్తి
మునిఁగి తజ్జలోదీర్ణమౌ పూర్ణకలశ
మెత్తికొనిపోయి గిరిని కోటీశలింగ
మూర్తి కభిషేక మొనరింప ముక్తిగలుగు.100

నగము త్రికూటంబట, నా
పగ దా నోంకారనామ భాసితయట, సొం
పగు వనులు బిల్వవనులట
యగు లింగము దక్షిణాస్యుఁడట చిత్రమగున్.101

గిరులును నదులును వనములు
నరుదుగ లింగములు గల మహాస్థలు రెన్నో


ధర గలవుగాని యీ దృశ
గిరి సరి దారామ లింగ కీలితగతులే ?102

మఱియుఁ గలియుగంబున మహాస్థలంబులందు దేవతలు తిరోహిత నిజ మహిమానుభావులై ధర్మకర్త్రధీన నిజోత్సవాది కృత్యులగుదు రక్కా లంబున జనంబుల లనధికారులయి శిశ్నోదర పరాయణులయి వృథాద్వైత వచన రచనా ప్రవీణులై మహాస్థలస్థిత దేవతామూర్తులయందు శిలాబుద్ధి గలిగి నిరీశ్వరవాదంబు సేయుదు రట్లవుట సర్వోపదేశ దేశికుండగు దక్షిణామూర్తి కోటీశ్వరుండై త్రికూటాద్రియందు నిలిచి ప్రత్యక్ష ప్రమా ణంబులు సూపి విజోత్సవాదికృత్యంబులకుఁ దాన ధర్మక ర్తయై నిర్విఘ్నం బుగాఁ జెల్లింపుచుండు నిట్టి దివ్యస్థలం బెందును లేదని చెప్పి శివుండు వెండియు నమ్మహాదేవి కిట్లనియె. 103

గురుతరేశ్వరమూర్తియౌ కుధరమందు
హరి హర విధాతృరూప కూటాగ్రములను
మూఁడు లింగంబులై యుండి మూడులోక
ములను రక్షించు దక్షిణామూర్తి యెపుడు.104

మఱియు నగ్గిరీంద్రంబునందుండు దివ్యకూట దివ్యలింగత్రయంబు కలియు గంబునఁ దిరోహిత నిజమహిమంబై కేవల శిలారూపంబునఁ గనఁ బడియు నిష్టసిద్ధు లొసంగు నా దివ్యకూటత్రయ లింగత్రయప్రభావం బెట్టి దానిన.105

త్రికోటీశ్వర మహిమ


ఆ రుద్రాత్మక మధ్యశృంగ మహిమం బత్యద్భుతం బెన్న దు
ర్వారప్రేమ విధీంద్ర ముఖ్య దివిషద్వారంబు కోటీశు దీ
క్షారూఢిన్ మది నిల్పి కొల్చుచుఁ దదంచద్ద్రోణికోపాంత సు
శ్రీరమ్యాయత బిల్వకాననములం. గ్రీడించు నక్రాంతమున్ 106

వెండియు నఖండ పాండు డిండీరఖం డాఖండలోద్దండ వేదండ కుండ
లీంద్ర చంద్ర చంద్రఖండ తార హార హీర పారావార నీహారాచ్చచ్చవి.
భాసురంబై కైలాస శిఖరాకారంబగు నా రుద్రశిఖరంబున రుద్రుం డుమా
స్కంద నంది గణనాథ చండి భృంగి మహాకాల ప్రముఖ ప్రమథగణనాథ
యూథంబులు కొలువ నిత్యసన్నిహితుండయి వసియించు నెంతయు. 107

గురు రత్న భాసుర గోపురంబులతోడ
    పరితప్త హేమకుంభములతోడ
ప్రస్ఫుట స్ఫటికాశ్మ పటుభి త్తికలతోడ
          విమల కర్బుర కవాటములతోడ
గోమేధికోపల కుట్టిమంబులతోడ
          శశికాంత సోపాన సరణితోడ
వర పద్మరాగ శుంభత్ స్తంభములతోడ
           హరినీలరుచిర గేహళులతోడ
           
నమరి యమరీ కదంబ గానావలంబ
ప్రాంగణ స్థల సంగత ప్రమథరాజీ
రాజితంబైన దివ్య హర్మ్యాగ్రసీమ
నవ్య నవరత్న సింహాసనంబునందు.108

శర దుజ్జృంభిత చంద్రకోటి రుచితోఁ జంద్రార్ధజూటంబుతో
నురగేంద్రోజ్జ్వల హారవల్లరులతో నుద్యత్కపర్దంబుతో
‘హరి నీలాంచిత నీలకంధరముతో నానందరూపంబుతో
గిరిజాకాంతను గూడియుండు నురుభంగిన్ రుద్రుఁ డశ్రాంతము.109

స్కంద భైరవ గణనాథ శాస్తృ వీర
భద్రులాదిగ శతకోటి రుద్రు లఖిల
దిశల గొలువంగ హర్యజాధిక సుపర్వ
సమితితోగూడి రుద్రుఁ డాసభ వసించు.110


అందు మూఁడుదినంబు లతిభ క్తితో నిల్చి
           ప్రాచీన కోటీశ భవ్యలింగ
మునకు నర్ఘ్యము పాద్యమును మధుపర్కము
          స్నానంటు వస్త్రంబు జన్నిదంబు
భస్మ గంధాక్షతల్ బహు పుష్పమాలికల్
          మారేడుదళములు భూరి ధూప
దీప నైవేద్యముల్ దివ్య తాంబూలంబు
          నీరాజనంబును నెఱిఁ బ్రదక్షి
ణము లనంగను షోడశ క్రమవిధాన
పూజ లొనరించి తన్మంత్రమును సహస్ర
జపము గావించి ధ్యానంబు సలిపిరేని
భోగ మోక్షంబు లిహపరంబులను గలుగు.111

ఆ శిఖరరాజమందున
పాశచ్చేది శివమూర్తి పనుపడి నిలువన్
క్లేశంబుల నెడఁబాసి ది
గీశావళి మేలు నొందె కేవల మగజా !112

అందు నేను సదాశివఖ్యాతిఁ దనరి
లీలఁ బ్రాచీన కోటీశ లింగమగుచు
నుండి యుండుట ననుఁ గొల్చుచుందు రెపుడు
రుద్రు లాత్మగణాళితో రూఢి మెరసి.113

విష్ణు శిఖరము


అమ్మహారుద్ర వాపమైనట్టి, శిఖర
మునకు వలపల శ్రీ విష్ణుమూర్తి శిఖరం -
ముందు దానికిఁ గ్రిందుగా నుండు నొక్క
దొన సురాపగాంబు సమాన తోయ యగుచు,114

జలజాక్షు పాదమూలము
వలనం గనుపట్టు గంగవలెఁ దగ నేత
జ్జలజాక్షు శిఖర మూలము
వలనం గనుపట్టె దొనయు వైభవ మెసఁగన్.115

ఆ దొన పశ్చిమంబున మహాద్భుతమై శశికాంత కాంతి సం
పాదక దివ్యతేజమయి పాపవినాశన లింగ మొప్పు, న
చ్చోఁ దనరారు సిద్ధతతి సొంపగు నా దొనలోన దోఁగి య
త్యాదర భక్తి నాశిపున కర్చన సేయు నభీష్టసిద్ధికై.116

కాలాభ్ర భ్రమరాభ్ర విభ్రమ మహాకాలోరుకంఠప్రభా
నీలాశ్మ ప్రతిభా తమాలలతికా నీలాబ్ది కాలాంజన
శ్రీ లాలిత్య విలాస విష్ణుశిఖర శ్రేష్ఠాంతర ప్రస్ఫుట
ప్రాలేయాంశుదృష ద్వినిర్మిత మహాప్రాసాద మధ్యంబునన్.117

సంతప్త హేమ నిర్మిత
చింతామణి ఖచిత దివ్యసింహాసన వి
శ్రాంతుం డగుచును లక్ష్మీ
కాంతుండు జగంబుఁ బ్రోచుఁ గరుణానిధియై.118

నీల నీరద నీల నీలాబ్జ వర్ణుండు
           కటి తట సౌవర్ణ పటయుతుండు
శంఖ చక్ర గదాసి సాధన సహితుండు
         కౌస్తుభాభరణ సత్కాంతియుతుఁడు
బహు రత్న నూపుర బాహాచతుష్కుండు
        మకర కుండల గండ మండితుండు
శ్రీవత్స సింధు జాశ్రిత దివ్యవక్షుండు
         భుజగరా ట్పర్యంక భూషణుండు



సకల లోకైకనాథుండు శార్గ్ఙ ధన్వి
గరుడ జయ విజయ సునంద పరమ భాగ
వత వతంసంబు లెంతయు బలసి చుట్టు
గొలువఁ గొలువుండు విష్ణుఁడ క్కూటమునను.119

అచ్చోట నతిభక్తి నైదుదినంబులు
           నిల్చి త ద్రోణికానీరములను
స్నానంబు నేసి భస్మ త్రిపుండ్రాంకముల్
         ధరియించి రుద్రాక్షధారి యగుచు
మునిసేవ్యు పాపనాశన లింగమూర్తిని
          బిల్వదళంబులఁ బ్రీతితోడ
నర్చించి దృఙ్మనః ప్రాణంబు లొకచోటఁ
          గలయ సమాధి సంకలితుఁడగుచు
తపముసల్పిన నష్టవిధంబులైన
సిద్ధులును గల్గు దగఁ గాయసిద్ధి దనరు
నితర సిద్ధులు సిద్ధించు నిచ్ఛలేక,
యుండెనేనియు మోక్షంబునొందు వేగ.120

అందు నేను మహేశ్వర్య కంచమగుచు
పాపనాశన లింగమై పరగుచుండ
నన్ను సేవింపుచుండు నా నలిననాభు
డధికభక్తిఁ ద్రికాల పూజాభిరతుల,121


బ్రహ్మశిఖరము


రుద్రశిఖరంబు వలపల భద్రదంబు
బ్రహ్మశిఖరంబు భాసిల్లుఁ బ్రస్ఫుటముగ
నెలమి నందుండు నూత్నకోటీశలింగ
మచటి మహిమంబు వర్ణింప నలవియగునె. 122



తరుణారుణారుణ ఘుసృణ
కిరణాకృతి సాంధ్యకాలకీలిచ్చాయా
స్ఫురణాఢ్య బ్రహ్మశిఖరా
వరణాంతర సౌధమధ్య వరపీఠమునన్.123

మంజుహాటక కంజ కింజల్క వర్ణుండు
          పద్మరాగ కిరీట భాసితుండు
గండమండల రత్నకుండల లలితుండు
          కేయూర మణిహార కీలితుండు
కల్పద్రుమాలికాకలిత వక్షోభాగుఁ
          డుపవీత శోభితుఁ డున్నతాంసుఁ
డాజానుదీర్ఘ బాహా సముల్లాసుండు
          వాణీవిలావైక వదనకమలుఁ
డజుఁడు గొలువుండు వేదశాస్త్రాగమాది
విద్యలెల్లను దను జాల వినుతినేయ
గరుడ గంధర్వ యక్ష కిన్నరులు సురలు
సిద్ధసాధ్య సమూహముల్ చేరి కొలువ.124

అచ్చోట నొకపక్ష మతిభ క్తితో నిల్చి
       దొనలలో స్నానంబు దనరఁ జేసి
భూతిరుద్రాక్ష విభూషణుండయి దివ్య
       పంచాక్షరీ మంత్ర పఠన మొప్ప
హృదయంబులోన కోటీశు నీశ్వరు నిల్పి
       మానసపూజ నీమంబుతోడఁ
జేసి బాహ్యర్చన సిత పుష్ప నవ బిల్వ
        దళములఁ గావించి లలిత నిష్ఠ

సేవఁ జేసిన మాన నేప్సిత సమస్త
సిద్ధు లొనగూడు మోక్షసంసిద్ధి యగును
తద్గృహస్థల సంరూఢ తాపసాళి
దర్శనము గల్గు దుర్మోహతమము వాయు. 125

అందు నేనును రుద్ర విఖ్యాతిఁ దనరి
నూత్న కోటీశ లింగ వినోదలీల
నొప్పుచుండుట నా లింగ మెప్పు డధిక
భక్తిఁ బూజింపుచుండు న ప్పద్మజుండు.126


ఇట్లు రుద్ర విష్ణు విధాతృ శిఖరత్రయంబున రుద్ర విష్ణు విధాతలు స్వపరి వార సమేతంబుగాఁ గొలువుండి సదాశివేశ్వర రుద్రరూప లింగమూర్తినై యున్న నన్ను నిరంతరంబు భజియింపుచుందు రీ శిఖరత్రయ లింగత్రయ ప్రభావంబు కలియుగంబునఁ దిరోహితంబైయుండు నీ శిఖరత్రయంబున మనుష్య నిర్మిత శిలారూప ప్రాచీన కోటీశ పాపవినాశన నూత్న కోటీశ లింగంబుల భక్తి యుక్తి నారాధించిన మానవులు భుక్తిముక్తులయత్నం బునఁ గాంతు రీశ్వరప్రసాద సంపన్నుల కెప్పుడును ద దివ్యకూటత్రయ లింగత్రయ దర్శనంబగు ప్రాప్త ప్రసాదేతరులకు మంత్ర తంత్ర జప తపో యోగా సాధనంబులఁ దద్దర్శనం బగమ్యంబగు ననిచెప్పి శివుండు వెండియు నిట్లనియె. 127

శివుని నృత్యవర్ణన

అమ్మహా శైల శిఖరత్రయంబునందు
శ్రీ సదాశివేశ్వర రుద్ర భాసురాభి
ధాన లింగాకృతిని నిల్చి త త్ప్రదోష
కాలనృత్తంబు గావించుఁ గాలగళుఁడు.128


విరియబోసిన జటావిసరంబు కెంజాయ
          సాంధ్యరాగ ప్రభాసరణిగాఁ గ
నీల నీలాంబుజ నీలకంధర కాంతి
         లలితాంధకార సంకలనగాఁగ
నాట్యవేగ విలోల నాకాపగావళీ
          శీకరంబులు నుడుశ్రేణిగాగ
నతిసంభ్రమోద్భూత వితతాట్టహాసంబు
         కమనీయ చంద్రికాకాంతిగాఁగ
తన ప్రదోష తాండవకేళి తగఁ బ్రదోష
కాల సామ్యతఁ బూన లోకాళిబ్రోవ
నృత్తమొనరించు సంధ్యల చిత్తజారి
య మ్మహాశైల కూటత్రయంబునందు.129

వాణీశ్వరుఁడు తాళవాదనం బొనరింప
          వాగ్దేవి వల్లకి పాటఁ బాడ
విబుధాధినాథుండు వేణువు పూరింప
          గానంబు గావింప గమలసద్మ
మర్దలధ్వానంబు మధువైరి పొసఁగింప
          వీక్షింపఁ బరశక్తి సాక్షియగుచు
ప్రమథాళి దేవతాపంక్తియు జుట్టును
         నటనంబుఁ జూచి యానందమొంద

పరమశివుఁడు ద్రికూటాఖ్య పర్వతాగ్ర
శిఖరములయందు నాట్యంబు సేయుచుండు
నదియు బ్రమథైకవేద్యమౌ నవని జనులు
కక్షి గమ్యంబు గాకుండు నద్రితనయ! 130



అని చెప్పిన విని యుమాదేవి దేవా: కోటీశ్వరుండు విష్ణు బ్రహ్మ శిఖ రంబుల పాప వినాశన నూతన కోటీశ్వర లింగరూపంబుల నుండుట కేమి కతం బనిన శివుం డిట్లను - మున్ను దక్షాధ్వరంబున కరిగిన మునీంద్రులు కొందఱు సనకాదులంగూడి త్రికూటాద్రి కేతెంచి కోటీశ్వర ప్రసాదంబున విగతదోషులగుట విని నిలింపులు దక్షాధ్వరంబునందు హవిర్భాగంబులు గొనిన స్వకీయ దురితంబు నపనయింప నా త్రికూటాద్రి కరిగి యందు విష్ణు శిఖరాగ్రంబునందుండు మహావిష్ణు దర్శించి పూజించి యిట్లనిరి.131

దేవదేవ : సరోజాక్ష : దీనసులభ :
భక్తమందార ! యిందిరాప్రాణనాథ :
దక్షమఖమున మును హవిర్భక్షణంబు
సేయ మముఁ జెందు దురితంబు పాయుబెట్లు ?132

పాపవినాశన స్థలమహిమ


అని నుతుల్గావించు నమరుల వీక్షించి
         పద్మాక్షుఁ డిట్లనుఁ బ్రాజ్ఞులార :
పంచాక్షరీమంత్ర పఠనమ్ముఁ జేయుచు
         ఘన విరజోదీక్ష గలిగి మీరు
కోటీశు హృత్పద్మ కోశంబునను నిల్పి
         తపము సేయంగఁ బ్రత్యక్షమగుచు
త్య్రక్షుండు మీదోష మక్షయంబైనను
         క్షమియించి రక్షించుఁ గరుణతోడ
ననుచు నుపదేశ మొసఁగిన నమరసంఘ
మమితభక్తిని విష్ణుకూటాగ్రమందు
తపముగావింప నంత దదగ్రసీమ
నెలమిఁ బ్రత్యక్షమయ్యెఁ గోటీశ్వరుండు.133

ముగ్ధ మన్మథకాంతి మోహినీతనుకాంతి
         మోహినీతనుకాంతి మోహనముగ
పద్మకేసరజటా పద్మరాగచ్ఛాయ
         పద్మరాగచ్ఛాయఁ బాయఁజేయ
నీలాళి నీలాబ్జ నీలకంధరశోభ
         నీలకంధరశోభఁ దూలఁ దోల
కాళిమ గజచర్మ కల్పితాంబర దీప్తి
        కల్పితాంబర దీప్తిఁగడకుఁ జిమ్మ
నిట్టి సన్మూర్తిఁ దాల్చి కోటీశ్వరుండు
వృషభవాహాధిరూఢుఁడై వేల్పుగమికి
ముందటను నిల్చి నిర్మలానందమొంద
కోర్కు లేమైన నిచ్చెదఁ గోరుఁ డనిన.134

అంత సద్దేవతాబృందంబున కధీశ్వరుండగు పురందరుం డిట్లనియె.135

ఇంద్రుఁడు శివుని స్తుతించుట


మాలిని

జలధివర నిషంగా శైలకన్యానుషంగా
కలితవరకురంగా గర్వితానంగభంగా
సలలిత వరంగా చారు వార్యుత్తమాంగా
బలవదసురభంగా భవ్య కోటీశలింగా:136

సుగంధి

జూటకోటి చంద్రఖండ శూలపాణి శంకరా
పాటలాబ్జ కేసర ప్రభానిభోల్లసజ్జటా
ఘోటకీకృతోక్షరాజ ఘోర దైత్యమర్దనా
కోటిలింగ నత్త్రికూటకూటగేహ చిన్మయా 1137

స్రగ్విణి

పల్లవ ప్రోల్లసద్భంధు జీవ స్ఫుర
ద్భల్లకోల్లాసకోదభ్రరోచిశ్చటా
వల్లికాపోత దేవాపగా శుభ్రరు
ఙ్మల్లికా మాలికా మౌళి కోటీశ్వరా ! 139

శ్రీ

    శ్రీ
    కో
    టీ
    శా
    
 నారి

కోటీశున్ -జూటేందున్
కూటస్థుం - బాటింతున్ . 140

కన్య

ఈ కోటీశున్ - లోకేశున్ సు
శ్లోకస్తుత్యున్ - వీఁకం గొల్తున్ . 141

పంక్తి

నేనును గోటీ - శానుని భక్తిన్
మానక వేడ్కన్ - బూని భజింతున్.142

శశివదన

మనమున గోటీ - శుని నఘ దూరున్
మునిజన సేవ్యున్ - మునుకొని కొల్తున్.143

హంసమాల

నిరతం బేను కోటీ - శ్వరు దేవాదిదేవున్
పరమానందమూర్తిన్ - స్థిర భక్తి న్నుతింతున్.144





విద్యున్మాల


కోటీశానా దేవాధీశా
జూటప్రాంత స్థేందూత్తంసా
పాటీరాచ్ఛాంభోజాకారా
సూటి న్నిన్నే నే నేవింతున్. 145.

భుజంగ శిశురుతము

సురవర నుత చరిత్రా
కరి దనుజ మదహారీ
పురదితిజహర కోటీ
శ్వర భవ భయ విదూరా : 146

పణవము

కోటీశా నుతగుణవిశ్వేశా
కూటాగ్రాంచిత గురుసద్గేహా
జూటాగ్రాశ్రిత సుమ చంద్రార్ధా
సూటిం గొల్చెద శుభ చారిత్రా !147

దోదకము

పూని సుభక్తినిఁ బూర్ణుని కోటీ
శానునిఁ గొల్చెద సర్వసుపర్వా
నూన పదాధిక నూత్నవిభూతి
జ్ఞాన సుఖప్రదు సద్గురుమూర్తిన్ .148

ఇంద్రవంశము

దేవేశుఁ గోటీశ్వరు దీనవల్లభున్
భావానుకూలస్థితిభావితాకృతిన్
భావోద్భవధ్వంసన ఫాలలోచనున్
భావించి సేవించెద భక్తపోషణున్ .149


మత్తమయూరము

శ్రీ కోటీశా శ్రీనగసీమావని గేహా
లోకాలోకాధిష్ఠిత లోకావనమూ ర్తీ
పాకార్యబ్జాతోద్భవ పద్మాపతి సేవ్యా
నీ కల్యాణాకారము నిత్యంబును గొల్తున్.150

వనమయూరము


శ్రీకర కృపాంబునిధి జిష్ణునుత పుణ్య
శ్లోక జన చిత్తగత శుంభదహిరాణా
నీకకృతభూషణ మునీశనుత కోటీ
శాకలిత మేరుధరచాప హరిబాణా!151

అలసగతి

వరరజిత శైల సునివాసములయందున్
గిరిసుతనుగూడి వరకేళి కల లీలా
సురతసుఖమానక విశుద్ధమతిఁ గీటీ
శ్వరుడవయి నిల్చితి వజాండములఁ బ్రోవన్. 152

పంచచామరము

త్రికూట కూట గేహ దేవదేవ భక్తపాలనా
సుకోవిదాంతరంగవాస శూలపాణిశంకరా
ప్రకోపనాంతరంగదూర పాపనాశ పాశహా
సుకాంతి కాంత కోటిలింగ సూరిచిత్తబాంధవాః153

మందాక్రాంత

కోటీశానున్ కుధరనిలయున్ ఘోరసంసారదూరున్
జూట స్థేందున్ సురమునినుతున్ శుభ్రగంగోత్తమాంగున్
ఘోటీభూతశ్రుతిచయవిదున్ కోటిసూర్య ప్రకాశున్
కోటి బ్రహ్మాండ పతిని నినుం గొల్తుఁ జిత్తంబులోనన్.154



మత్తకోకిల

ఎల్లమందను కోటిలింగ మహేశ్వరేశ్వరుఁ డుండఁగా
కొల్లగాఁగను భుక్తిముక్తులు కోరినట్టులు గల్గఁగా
బ్రల్లదంబున నొండు వేల్పుల భక్తిఁ గొల్తురు మూఢు లి
ట్లెల్లవార లెఱుంగలేరోకొ యేమి చెప్పుదుఁ జిత్రమౌ |155

మత్తేభవిక్రీడితము

పరమోదార నిజప్రభావ గరిమన్ బ్రహ్మాండ భాండంబులన్
బరగన్ సృష్టియొనరఁ బ్రోవఁ జెరుపన్ బ్రహ్మాచ్యుతేశాన భా
స్వర రూపంబుల నద్రికూటగిరి భత్కూటసంవాసియై
గురుకారుణ్యముతోడ నుంటివిగదా కోటీశ విశ్వేశ్వరా!156

చంపకమాల

నిరతము యోగిరాడ్హృదయ నీరజసీమల తారకాద్రిపై
నురుతరలీల నిల్చిన మహోన్నతునిన్ గననేరనట్టి యి
న్నరులకు నీ త్రికూటగిరినాథుఁడపై కనుపట్టు నిన్ను నో
పరశివ కోటిలింగ గురుభక్తి భజించెద నెల్లకాలమున్ .157

మహాస్రగ్ధర

జననాంతా పేతు నీశున్ శరభవజనకున్ చంద్రరేఖావతంసున్
ఘన మౌనిధ్యానగమ్యున్ గరధృతపరశుం గామగర్వాపహారున్
వనజాక్షాబ్దాసనార్చా వ్యవహిత సుపదాబ్జాత మౌళిప్రదేశున్
పరమున్ గోటీశు ధీశున్ భవభయహరణున్ భర్గుదుర్గేశుఁగొల్తున్ .158

పద్మనాభము

శ్రీమన్మహాదేవ గౌరీమనోనాథ, శ్రీకంఠ భక్తావళీభావితాంగా:
కామాతిగర్వాంధకారార్క సర్వేశ ఖట్వాంగపాణీ, వృషాధీశవాహా
సోమాబ్జమిత్రానలాక్షా గణాధీశ శూలాయుధా. వై కలోకాధినాథా
క్షేమప్రదాకార కోటీశ సర్వజ్ఞ శేషాహిభూషావిశేషా మహేశా 159

తన్వి

శ్రీకర కోటీశ మునిజనముతోఁ జెల్వగు నీగిరి నిలిచి సుభక్తా
నీకము కారుణ్యమునను మనుప న్నేర్చిని నీ సరిసరి పరు లేరీ
లోక సమూహంబులు గనుగొన నీలోపల నుండగ నెఱిశివరాత్రి
లోకములెల్లన్ భవదురుగిరి నాలోకననేయఁగఁ జను టరు దీశా! 160

భాస్కర విలసితము

చేరిన సనకసనందన మౌనిశ్రేష్ఠుల కమృతము దెల్పినవానిన్
వారక మును నరు నిమ్మహి సద్భావస్థితి పరశివుఁగల్పిన వానిన్
మీరిన శివతిథినాఁ డిలమీఁదన్ మేలగు విభవము గల్గినవానిన్
సూరిజనములను బ్రోవఁగ గోటీశుండయిన శివుని గొల్చెద భక్తిన్ . 161

మంగళమహాశ్రీ

ఉత్తముల చిత్తముల నుండి రజతాద్రిపయినుండియు త్రికూటగిరిమీఁదన్
సత్తములు కీర్తనలు సల్పఁగను సన్మునులు సన్నుతులభిన్నమతిఁజేయన్
సత్తుగ వసించి నరసంఘముల కిష్టఫలసంపద లొసంగఁగల కోటీ
శోత్తము సుపర్వవరు వోలిఁ గొలువంగను మహోన్నతవిముక్తి సుఖమెందున్ 162

ఇట్లఖిలచ్ఛందోమయుండగు నద్దేవు వివిధచ్ఛదస్థిత వృత్తంబుల నభినుతించి దేవేంద్రుండిట్లను దేవా! నాకును నీ దేవసమాజంబునకును దక్షమఖ హవిర్భక్షణంబునఁ గలిగిన పాపంబు వినాశంబునొందించి నీవు పాప వినాశన లింగంబవై యిచ్చట నిరంతరం బుండవలయు ననిన నా కోటీశ్వ రుండు వారల కిట్లనియె.163

పాతకులకెల్ల నెక్కుడు పాతకుండు
ధర శివద్రోహి యటువంటి దక్షునింట
యజ్ఞభాగంబు గుడిచినయట్టి దోష
మడఁగునే యెంత సేసిన నమరులార 164


శివనిందా దోషము ధర
భవముల నొందింప దధికపాతక మగుటన్
రవితనయు లోకమందున
నివసించును కల్పకోటి నిరయములోనన్. 165

అయినను మీరలు నతిభక్తి నీ విష్ణు
          శిఖరాగ్రవాసుని శ్రీ సహాయు
పరమేశు సద్భక్త పరిపాలనాక్షీణ
         కరుణాకటాక్ష వీక్షణునిఁ జక్రి
పరమాత్ము నవ్యయు గరిమ సేవించితి
         రవ్విష్ణునకు నాకు నరయ భేద
మించుకంతయ గల్గదే నొక్కడనే బ్రహ్మ
        విష్ణురుద్రాకృతి వెలయుచుందు
నట్టి విష్ణునగాధీశు నద్రిమీఁద
నెసఁగ నుపదేశమగుచుఁ గోటీశు నన్ను
మనసులో నిల్పి యతినిష్ఠ ఘనతపంబు
జేసితిరిగాన నఘముక్తి చెందు నిపుడు.166

అనిపల్కి శివుఁడు శూలం
బున పంకజనేత్రు శిఖరమూలముఁ బొడువన్
జనియించె నిర్మలోదక
ఘనమగు దొన యొకటి పాపఖండన యగుదున్.167

అంత వారలఁ జూచి కాలాంతకుండు
పాపనాశని యను పేరఁ బరగు నిదియు
నిచట మునిఁగిన మీ పాపమెల్ల బొలియు
నిందుఁ బొలియని పాపంబు లెందు లేవు..168

బ్రహ్మహత్యాది పాపముల్ పాయు నిచట
నెట్టి ప్రతిబంధకంబైన గిట్టు నిచట
జీవహింసాది దోషముల్ పోవు నిచట
నిచటి మహిమంబు వర్ణింప నెవరితరము :169

ఎంతో వింతయి యున్న యీకొలనిలో నేపారు భక్తిన్ సుఖ
స్వాతంబొప్పఁగఁ దీర్థమాడి యిచటన్ సంతానకోటీశ్వరున్
చింతానాశకుఁ బూజనేసి కొలువన్ శీఘ్రంబుగాఁ గల్గిడిన్
సంతానం బిల వంధ్యకైన వినుఁడీ సందేహము ల్వాయఁగన్ . 170

అనుచుఁ గోటీశుడా దొన కపర భాగ
మందు పాపవినాశన ఖ్యాత లింగ
మగుచు జెలువొంద నది గాంచి యమరవరులు
వినుతిఁ గావించి రానందవివశు లగుచు.171

అంత నా నిలింపు లమ్మహాదేవ త్రికూలాగ్రధారా జనితయును, పంచమహా పాత కోపపాతకా ద్యనేకపాపభయభేదకయును బరమపావనియు నగు నా ద్రోణికాసమీపంబున కరుదెంచి తదీయ నిర్మలోదకంబుల మంత్ర పూర్వకంబుగా స్నానంబుఁజేసి సిత భసితోద్ధూళిత శరీరులై భద్ర రుద్రాక్ష మాలికాభరణులై పంచాక్షరీజపంబుఁ జేసి తద్రోణికాతీరంబున మహా పూతంబైన పాపనాశన లింగంబున కా ద్రోణికోదకంబుల నభిషేకంబుఁ జేసి విష్ణుశిఖరప్రాంత తులసికాకాంతా రావీత దళంబుల బిల్వదళంబుల నష్టోత్తర శతనామ పూర్వకంబుగాఁ బూజించిరి తన్నామ వివరణం బెట్టి దానిన172

అష్టోత్తర శత నామావళి

శ్రీమత్త్రికూట భూమీధ్ర విష్ణుశృంగ నికేతనః
పాపఘ్నః పార్వతీనాథః ఫాలనేత్రః పరాత్పరః.173


కీనాశ గర్వనిర్వాణః కరుణామృత సాగరః
కందర్పమదవిధ్వంసః కమలాక్షాక్షిపూజితః.174

దక్షాధ్వర హవిర్భోజి దేవామౌఘ వినాశనః
దానవ ధ్వంసకో దేవో దరహాస ముఖాంబుజః. 175

దేవదేవో మహాదేవః కాలకంఠో దిగంబరః
చంద్రార్ధ శేఖరః శంభుః శూలపాణి ర్మహేశ్వరః.176

గంగాధరో గణాధీశో నందికేశ్వరవాహనః
నారదాదిమునిస్తుత్యో నాగాభరణభూషితః.177

ఈశ్వరః శివ ఈశానో బ్రహ్మార్చిత పదాంబుజః
కైలాసశిఖరావాసః పరః పాపనికృంతనః.178

పాకారి పూజితః పాశధరో భక్తవరప్రదః
అద్భుతాగ్రః పశుపతి ర్దక్షయజ్ఞవినాశనః.179

ధూర్జటి ర్వామదేవశ్చ స్రష్టా సర్వసుఖప్రదః
ప్రభు స్తత్పురుషో బ్రహ్మా సద్యోజాతః కపాలభృత్.. 180

అఘోరో వహ్నినేత్రశ్చ విశాలాక్షో వరప్రదః
కృత్తివాసాః క్రతుచ్ఛేత్తా భర్గో భీమః పినాకభృత్.181

మేరుచాపో విరూపాక్షో భిక్షుకో మూలకారణః
శిపివిష్ణో మృడ శ్శూలీ ఆధారశ్చ సదాశివః.182

సర్వేశ్వరః స్వరాట్చైవ సర్వాత్మా సర్వసాధకః
సేతుః సర్వవిధి స్సోమః శాస్త్రయోనిః శుభావహః.183

అనంగః పురుషః పూర్ణః పురాణః పరమేశ్వరః
సత్యానందో నిర్వికారో నిర్గుణశ్చః నిరంజనః. 184

ఆకాశ ఆస్తికో జ్యోతిః చిదాభాస స్స్వయంప్రభః
మృత్యుంజయో మృగధరః శంకర స్త్రిగుణాత్మకః, 185

శివంకర శ్చిదానందో నిత్యానందో నిరామయః
ప్రజాపతిః పరంధామ భువనేశ స్సభాపతిః. 186

సులభః స్థూలసూక్ష్మాత్మా సర్వరక్షణ దీక్షితః
స్మృతత్రికూట వరదః సర్వలక్షణ లక్షితః.187

తత్రత్యద్రోణికానీరస్నానమాత్రాఘకృంతనః
భక్తదారిద్య్రవిపిన దవీభూతాగ్నిలోచనః.188

తచ్చైల శిఖరాగ్రస్థ యోగిబృంద నిషేవితః
ఎల్లమందాద్రి సంస్థాన ప్రభుః పాపవినాశనః,189


పూజించి యమరు లయ్యీశ్వర లింగంబునకు ధూపదీపాపూర్వఫల నివేదన మొనరించి మిగుల వినుతిఁజేసి పాపములఁ బాసి స్వర్గలోక పదము గని రంత తత్కూటాధిపతి విష్ణుం డమ్మహాలింగం బీశ్వరలింగం బగుట తదీయ పంచవింశతి లీలోపన్యాస పూర్వకంబుగా నిట్లని స్తుతియించె. 190

సోమకళాంచిత సుందరలింగం - శైలసుతామయుత శర్మదలింగం
గోపతివాహన శోభితలింగం - ధీమహి పాపవినాశనలింగం. 191

నాట్యవిలాస సుతోషితలింగం - భూరివివాహమహోత్సవలింగం
ఆదిమభిక్షువిధాయతలింగం - ధీమహి పాపవినాశనలింగం, 192

మన్మధ దర్పవిభంజనలింగం - కాలమదోద్ధతినాశనలింగం
రాక్షసపట్టణ భేదనలింగం - ధీమహి పాపవినాశనలింగం. 193


వీరజలంధర మర్దనలింగం - బ్రహ్మశిరోహర పావనలింగం
దక్షమఖక్షయ దక్షిణలింగం - ధీమహి పాపవినాశనలింగం.194

పాపవినాశ విచక్షణలింగం - అర్ధశరీర శివాశ్రితలింగం
రమ్య కిరాత వపుర్ధరలింగం - ధీమహి పాపవినాశన లింగం,195

ఆస్థి విభూషణ భూషితలింగం - చండిసుపూజిత శివకరలింగం
రౌద్ర విషాద న రాజలింగం - ధీమహి పాపవినాశనలింగం. 196

కేశవదత్త సుదర్శనలింగం - స్కందశివాగమ ప్రస్తుతలింగం
ఏకపదస్థ మహేశ్వరలింగం - ధీమహి పాపవినాశనలింగం. 197

సర్వ శుభావహ చిన్మయలింగం - రమ్యవటస్థల రాజితలింగం
విష్ణు విరించి సమర్చితలింగం - ధీమహి పాపవినాశనలింగం. 198

చిత్రపదవృత్తము :

పాప మోచనం ఫాలలోచనం - శమన నిగ్రహం శాంతవిగ్రహం
భ క్తపోషణం భవవిశోషణం - భుక్తిముక్తిదం త్వా మహం భజే. 199

నమో నమస్తే జగదేకనాథ - నమో నమస్తే గిరిజాపతే ప్రభో
నమోనమః పాపవినాశనే - నమోనమస్తే వృషభేంద్రవాహన. 200


అని ఇట్లమ్మహావిష్ణుం డా లింగమూర్తిని వినుతించి నేఁడాదిగా నిచ్చట.
కేతెంచువారలు ముందుగా పాపవినాశన జలంబులం దోగి యీ లింగ
మూర్తినిఁ బూజించి సకల పాపవిముక్తులై పిదపఁ గోటీశ్వరు నీక్షించిన
సకలాభీష్టసిద్ధి యగునని సకలలోకంబుల కాజ్ఞాపించి య మ్మహాశిఖర
మధ్యస్థుండై యుండె నంతట. 201


ఆ కూటస్థ మహాబిలాంతరములం దాపశక్తి సిద్ధవ్రజం
బేకాలంబు వసించి భక్తిరతి న య్యీశాన లింగంబు న
స్తోక ప్రక్రియ బూజసేతు రది యెంతో వింతమౌ మానవా
నీకాగోచరమైన యా మహిమ వర్ణింపంగరా దేరికిన్. 202

దక్షిణామూర్తి రజితభూధరము విడిచి
యా త్రికూటాద్రి రుద్ర కూటాద్రి సీమ
లలిత కోటీశలింగమై నిలిచె విష్ణు
శృంగమందు పాపవినాశ లింగమయ్యె.203

ఆ లింగము జ్యోతిర్మయ
మా లింగము చిత్ప్రకాశ మఖిలాధారం
బా లింగమూర్తిఁ గొలిచిన
దూలును సంసారమాయ దురితం బడగున్. 204

ఆ లింగంబు భజింపఁ గల్గు నఖిలేష్టార్థంబు లీలోకమం
దా లింగంబు భజింపఁ గల్గు నతి ఘోరాఘచ్చటాభేదనం
డా లింగంబు భజింపఁ గల్గు నవవర్గానందమందంబుగా
నా లింగంబు భజింప కుండు నరులాహా! యెంత పాపాత్ములో205

మహితకార్తీక శ్రావణ మాఘమాస
ములను పాపనాశనియందు మునింగి దొనను
పూని లింగార్చనము సేయు మానవులకు
గరిమతో భోగమోక్షముల్ గల్గు టరుదె206


అందుఁ గార్తిక మాసమం దధికభక్తి
నచట నిల్చి లింగార్చనం బమరఁ జేయు
నతని కీశుండు నచ్చోట నధివసించు
సిద్ధమండలి ప్రత్యక్షసిద్ధి నొసఁగు.207.

శ్రావణమాసంలు సరస రుద్రాభిఖ్య
         శిఖరాగ్రమందునఁ జేరి నిలిచి
కార్తికమాసంబు కమలాక్ష శిఖరాగ్ర
       నిర్మల స్థలమున నియతి నిలిచి


మాఖమాసంబున మహిత విరించ్యాఖ్య
         శిఖరాగ్రమందున జెలఁగి నిలిచి
ప్రాచీన కోటీశు పాపవినాశన
         నూత్న కోటీశ్వరానూనలింగ
మూర్తులను బూజగావించి ముక్తి కార
ణంబయిన మహాలింగార్చనంబు చేసి
భూసురుల కన్న మిచ్చిన పుణ్యఫలము
శేష భాషాపతులకైనఁ జెప్పఁ దరమె:208

మఱియు న మ్మహాగిరి యాత్రికులగు వారలు విష్ణుశిఖరంబు నెక్కి పాప
నాశనీ ద్రోణికా జలస్నానంబు జేసి పాపవినాశన లింగంబు బూజించి
విగతపాపులై నూత్న కోటీశ్వర సోపాన మధ్యస్థ వల్లపాంగనా దర్శనంబు
జేసి బ్రహ్మశిఖరస్థ నూత్న కోటీశ్వర లింగంబును తత్పరివార లింగంబుల
సేవించి యోంకార నదీజలంబులఁ దీర్ఘవిధు లొనరించిన నిది పూర్ణయాత్ర
యగు నిందుఁ బ్రథమ సేవ్యంబగు పాపనాశన లింగంబును నచటి విష్ణుం
డును సురగణంబును నేవింపుచుండు నిక నూత్న కోటీశ్వర లింగావిర్భావం
బెట్టిదనిన.209

అంతఁ గొంతకాలంబున కబ్జభవుఁడు
"రుద్ర హరికూటముల లింగరూప మొంది
శివుఁడు నిలిచెను మామక శిఖరమందు
దనర లింగంబు నిల్పెను దపము జేసి. "210

అనుచుఁ జింతించి బిల్వవనాంతరమున
బద్ధ పద్మాసనస్థుఁడై భవ్యలీల
హంసమార్గానువర్తియై యమలభక్తి
తపముజేసి కోటీశు జిత్తమున నిల్పి. 211


శబ్దాది వైఖరీజాలంబు నింద్రియ
       మధ్యమస్థితియందు మట్టు పఱచి
యింద్రియ మధ్యమ నేపార మానస
          పశ్యంతి లోపల పరగ నిలిపి
మానసపశ్యంతి మానక హంసయౌ
         నా పరాశక్తియం దణఁగఁజేసి
యా పరాశక్తిని నమల చిదానంద
         రూపంబుగాఁ జేసి రూఢిమెరయ
నట్టి రూపంబు దానయై యఖిలవస్తు
చయములోపల వెల్గుచు సర్వభూత
తతి విలోకించి కావించెఁ దపము మిగుల
నిలినగర్భుఁడు నిర్మలానందుఁ డగుచు.212

ఇట్లు గొంతకాలంబు జిరసమాధినిష్ఠుండై యుండునంత నా చిదాకాశ
మధ్యంబునందుఁ బరచలనంబై పశ్యంతీపదంబొందు సమయంబున,213

పొడచూపెన్ శతకోటిభాస్కరకరస్ఫూర్జత్ప్రభాశాలియై
యుడురా డర్ధ కిరీటుఁడై సురనదీప్రోద్యజ్జటాజూటుఁడై
కడిమిం బన్నగభూషణుండయి శుభాకారుండునై దిక్కులం
దెడలేకన్ బ్రమథాళిఁ గొల్వఁగను గోటీశుండు బ్రత్యక్షమై.214

అట్లు ప్రత్యక్షమైనట్టి యభవుఁజూచి
మధ్యమావైఖరులఁ గూడి మహిమదనరి
పద్మగర్భుండు సంతోష భరితుఁడగుచు
నుతుల గావించె నానంద మతిశయిల్ల.215


దేవా యీ చిదాకాశ రూపంబగు పరమ శివ సముద్రంబున ఘృత కాఠిన్య
మూర్తినగు నీవును, విష్ణుండును, నేనును త్రిగుణాత్మికయగు ప్రకృతియు

నీప్రమథ సురనికాయంబును స్థావర జంగమాత్మకంబగు నీ విశ్వంబంతయు
శ్రీకరజాలంబని భవదనుగ్రహంబున నిట్లు చిరసమాధి నిష్టుండనై కంటిఁ
గాని మదన్యుం డెవ్వం డిట్లు తెలియనేర్చు నేనును భవత్ప్రసాదంబునన
కంటిని. భవత్ప్రసాదంబును గురూపదేశంబును కర్మ సామ్యంబును గల
వారలు జన్మంబునందే యిట్లు పరమానుభవంబు నెఱింగి ముక్తులగుదురని
యెఱుంగక కదా వివిధమత ప్రవిష్టులై చెడువాదంబులు సేయుచు బరస్పర
వంచకులై ప్రవర్తింపుచుందురు. వారలైనను గామక్రోధ రహితులై
స్వమతాచార నిష్ఠులై న్వేష్ట దేవతాభక్తి గలిగి యితర దేవతా మత
దూషణంబు లేక ప్రవర్తించిరేని జన్మాంతరంబున దత్తదేవతానుగ్రహంబున
గురూపదేశంబుఁ బొంది యిట్టి పరమానుభవంబునం జేసి ముక్తిఁ గాంతు
రేనును గృతార్డుండనైతి ననుగ్రహింపవే యని విధాత మఱియు నిట్లనియె.

హరిహరాభిఖ్య దివ్య కూటాగ్రములను
లింగమై యుండినట్టుల లింగమగుచు
నాదు శిఖరంబునందున నాథ ! నీవు
నిలువఁగోరితి నీపూజ నేను జేతు.217

అను వనజ గర్భు పలుకులు.
విని కోటీశుండు కరుణ విధి కిట్లనియెగా
విను నూతన కోటీశ్వరుఁ
డనఁగా లింగ స్వరూపమై విలసిలుదున్ .218



అని చెప్ని కోటీశ్వరుం డచ్చోట నూతన కోటీశ్వరుఁడై విరాజిల్లినది
మొదలుగా విధాత యీ లింగంబు నర్చింపుచుండు నిట్లు కూటత్రయంబు
నందు కోటీశ్వర పాపనాశన నూత్న కోటీశ్వర దివ్య లింగంబులు రుద్ర
విష్ణువిధాతలు సేవింపుచుందు రీ లింగంబులు మానవుల కగోచరంబులగుట
నీ స్థలంబుల శిలారచిత లింగంబులఁ బ్రతిష్ఠించి జనంబులు భక్తియుక్తం
బూజించి భుక్తిముక్తు లనాయాసంబుగాఁ గాంతురని శివుం డుమాదేవికిఁ

జెప్పె నట్లు చిదంబర నటన తంత్రోక్త ప్రకారంబుగా నాంధ్రభాషాకృతి
వతంసంబు రచించితి నిది వినిన వ్రాసిన బఠించినవారికి సకలేష్టసిద్ధులు
కోటీశ్వరానుగ్రహంబునఁ గలుగు మఱియును.219


ఆశ్వాసాంతము

శ్రీశైలేంద్ర విహార హార లతికా శ్రీరూఢ భోగిళ గీ
శాశాధ్యక్ష ముఖామరాధిప కిరీటాగ్రస్థ సత్పద్మ ప
ద్మేశారాధితపాద పాదనతమౌనీశాన పాపావళీ
పాశధ్వంసక నామ నామరహిత ప్రాశస్త్య దివ్యాకృతీ. 220

కరుణారస వరుణాలయ
శరణాగత భక్తరాజి సమ్యగ్భరణా
అరుణాంశు కోటి కోటి
స్ఫురాణాద్భత దివ్య కాంతి శోభిత చరణా 221

స్రగ్విణి :

శ్రీ గణాధీశ్వరా సిద్ధ సంసేవితా
భోగిభూషా మహాభోగ సంధాయకా
రాగ దూరామణీ రాగ రాజజ్జటా
సాగమామ్నాయ విద్యామయా శంకరా. 222



ఇది కొప్పరాజనంతామాత్య పౌత్ర లింగనామాత్య పుత్ర సుజన
విధేయ నరసింహ నామధేయ ప్రణీతంబయిన చిదంబర నటన తంత్రోక్త
శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యంబునందు ద్వితీయాశ్వాసము.

  1. చాక్షుషీ దీక్ష — చేప గ్రుడ్డులను చూచినంతనే పిల్లలగును. అట్లే దక్షిణామూర్తి
    మౌనమొద్రతో చూచినంతనే గురుబోధ జరిగినది అని భావము