శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తొలిపలుకు
శ్రీమత్త్రికూటాచల క్షేత్రము
‘కోటప్పకొండ' అనబడు నీ క్షేత్రము గుంటూరుజిల్లాలోని నరసరావు పేట
తాలూకాకు దక్షిణమున నేడు మైళ్ళ దూరములో నున్నది. దీని చుట్టుకొలత 'అడుగు
తక్కువ యామడ' యని వాడుక. కాని యాఱుమైళ్ళుండవచ్చును. దీని యెత్తు
1587 అ. లు. వైశాల్యము 1500 ఎకరములు. ఇప్పుడెల్లరును బూజించు కోటీశ్వర
స్వామి దేవళము 600 అ. ల యెత్తునఁ గలదు. దీని కెగువభాగమున 'ప్రాఁత
కోటప్ప గుడి' కలదు, ఓపిక గలవా రచటికి వెళ్ళివత్తురు.
సోపాన మార్గములు :
ఈ కొండ నెక్కుటకు మూఁడు సోపాన మార్గములు కలవు. (1) పూర్వము నరసరావుపేట రాజాగారి యొంటె లెక్కు పడకదారి, ఇది పైనిగల పాపనాశన స్వామి గుడికి క్రిందుగఁ బోవును (2) ప్రస్తుత మందఱు నెక్కి పోవు దారి. దీనిని 120 ఏండ్ల క్రిందట నిప్పటి జమీందారుగారి ముత్తాతగారు కట్టించిరందురు. (3) రాధాకృష్ణ సోపాన మార్గము. రెండవదారికి కుడిప్రక్కను గలదు.
దొనలు :
ఇందు దైవనిర్మితము అయిన దొన లెన్నియో గలవు. ప్రస్తుత దేవాలయ మున కెగువ నున్న యెనిమిది దొనలలో పెద్దవానియందు యాత్రికులు స్నాన మాడుదురు. ప్రాఁత కోటప్ప గుడికిఁ బోవు త్రోవలో 'ఎద్దడుగు' ఆను దొన యన్వర్థసంజ్ఞతో నొప్పును. బసవేశ్వరుఁ డచ్చట తపస్సుచేసె నందురు. ఇంకను ‘పుఱ్ఱచేతి దోన' - 'ఉబ్బులింగము దొన' మొదలగున వెన్నియో కలవు. ఇవి గాక ఋష్యాదులకు తపోయోగ్యములగు గుహ లెన్నియో గలవు.
త్రికూటాచల నామము :
ఈ పర్వత మే వంకనుండి చూచినను మూఁడు కూటములు (బోళ్ళు) గఁ
గన్పట్టును. అదియే దీనికి 'త్రికూట పర్వత మనియు, నిందుఁ గల దేవునికి 2
'త్రికూటేశ్వరుఁ' డనియు, నీ స్థల పురాణమునకు 'త్రికూటాచల మాహాత్మ్య'
మనియుఁ బేరువచ్చుటకుఁ గారణమని తోఁచెడిని. కాని ఏ శాసనములలోను నిది
త్రికూటాచలముగఁ బేర్కొనఁబడలేదు. ఇందలి శిఖరములను బ్రహ్మ, విష్ణు,
రుద్ర శిఖరము లందురు.
'త్రికూట పర్వతము' గజేంద్రమోక్షణ స్థలమైనట్లు భాగవతమునఁ గలదు.
అందలి కూటములను 'గాయత్రి. సావిత్రి. సరస్వతి' అందురు. అది రాజపుటాన
లోని అజ్మీరున కేడుమైళ్ళలో పుష్కరిక్షేత్ర మనఁ బరగుచున్నది.
ఇవిగాక 'త్రికూటాచల' మని మతొక్కటి తిరునల్వేలి జిల్లాలో 'తెన్ గాసి'
స్టేషనుకు మూఁడు మైళ్ళలో తిరుకుత్తాలము నొద్దఁ గలదు. అందు తీరుకుత్తా
లేశ్వరునియు, రాజరాజేశ్వరియు కోవెలలును, అగస్త్యాశ్రమమును, గొప్ప నీటి
ధారలును గలవు.
శ్రీ కోటీశ్వరస్వామి క్షేత్రమే గజేంద్రమోక్షణ స్థానమని కొందఱందురు.
అది సరిగాదనిపించుచున్నది.
‘శ్రీ త్రికోటీశ్వరునికి క్రిష్ణదేవమహారాయలు ఆనతిని ప్రధాని తిమ్మరుసయ్యం
గారు దండం పెట్టి సమర్పించిన గ్రామం కొండకావూరు' అగ్రహారము సమీప
మైనసు, కొన్ని శాసనములలో 'కావూరి త్రికోటీశ్వర శ్రీ మహాదేవర' కని
యున్నను ఎల్లమంద కోటీశ్వరుఁ డనియే ప్రజల వాడుక.
ఇచ్చట కొండపైని గల కోటీశ్వరాలయములో వెలనాటి గొంకరాజు
మొదలగువారి నాఁటి దీప దాన శాసనములంబట్టి 840 సం. లకుఁ బూర్వమే
యీ యాలయ ముండినట్లు తెలియుచున్నది.
శిఖరములు :
రుద్రశిఖరము : ప్రాత కోటీశ్వరుని స్థలము. ఇచ్చట నొక చిన్న గుడియు, లింగమును దాని కెదుట శిథిలావస్థలో నున్న దారుధ్వజమును గన్న ట్టును, ఇచ్చటి నుండియే కోటీశ్వరుఁడు గొల్లభామ యింటికి దిగివచ్చుచు నడుమ విల్చెనవి చెప్పుదురు. దీని నిర్మాణ మనూహ్యము.
బ్రహ్మశిఖరము: ఇప్పు డందఱును బూజించు కోటీశ్వరాలయ ప్రదేశము.
విష్ణుశిఖరము : ఇచ్చట పాపవినాశనస్వామి గుడి గలదు. దీనినే గద్దల
3
శ్రీ త్రికోటీశ్వరాలయముు
ఇందలి శాసనాదులను బట్టి 11వ శతాబ్దమునాఁటికే యీ గుడి యున్నట్లు స్పష్టము. కాని యొక్క కథమాత్రము చెప్పుదురు. గురవయ్యపాలెం కాపురస్థులు గ్రంథెవారను వైళ్యు లీ కొండపైకి కలపకొఱకు వెళ్ళఁగా హఠాత్తుగా పెద్దవాన గురిసి యొక సెలయేటిగుండ లంకెబిందెలు కొట్టుకొని వచ్చినట్లును, వారి కారాత్రి కలలో కోటీశ్వరుడు యోగివలె నగపడి తనకు గుడి కట్టించుమని చెప్పఁగా వారట్లొనర్చి రనియు పరంపరగాఁ జెప్పుదురు. దీని కెట్టియాధారములు గానరావు. ఇందుఁగల సాలంకయ్య యను భక్తుని చరిత్రమే యిట్లు చెప్పిరేమో: విమర్శనీయము, క్రమముగా నా గుడిని కొందఱు భక్తు లొక్కొక్కభాగము కట్టించుచు వచ్చిరి. అందు ముఖ్యులు మాదల శంభులింగమ్మ, సిద్ధుమల్లప్ప, మన గ్రంథకర్త నరసింగయ్య, తిరుమలరాజు మొదలగువారెందఱో గలరు. 'ఎండోమెంటుబోర్డు' వారి పరిపాలనకు వచ్చిననాఁటినుండి దేవాలయము సర్వవిధముల సుచ్చదశలోనికి వచ్చినది. ప్రజలకు వలయు సౌకర్యము లెన్నఁదగినవిగ నున్నవనవచ్చును..
ఇతర దేవాలయములు :
కోటీశ్వరుని గుడికి దక్షిణమున గణనాథాలయము గలదు. పశ్చిమమున, నుత్తరమున సాలంకేశ్వర సంతాన కోటీశ్వర లింగములు గలవు. ఎడమవై వున దొనయొద్ద మార్కండేయ లింగము గలదు.. దిగువ మెట్లవరుసప్రక్కను రామలింగేశ్వర లింగము గలదు. సోపానమార్గమున గొల్లభామ గుడి యున్నది.
సోపానమార్గమున ముందుగ బొచ్చుకోటీశ్వరునిగుడి గలదు. ఇందు మ్రొక్కుబడులవారు కేశఖండనము చేయించుకొందురు.
ఇంక కొండక్రింద ప్రపన్న కోటీశ్వరుడు, వీలకంఠేశ్వరస్వామి మొదలగు
పేరు గల గుళ్ళు పెక్కులు గలవు.
ఇచ్చట 'ఓంకారనది' ఓగేరు అను పేరుతో చేజెర్లలోని కపోతేశ్వరుని
గుడిప్రక్కనుండి ప్రవహించి యీ కొండకు సమీపముగా వెడలి సముద్రమున
గలియుచున్నది. మఱియు శ్రీ త్రికోటీశ్వరస్వామి కర్పించిన భూముల వై నమును,
కోనేళ్ళు, బావులు, సత్రములు వానికి సంబంధించిన శాసనముల వివరములును
కీ. శే. మద్దులపల్లి గురుబ్రహ్మముగారి త్రికోటీశ్వర చరిత్రము (వచనము) నఁ
4
కొండ పైని స్వామివారి సన్నిధి నర్చకులతోఁబాటు భక్తులుకూడ ప్రదక్షిణాది పేఐలొనర్చి కృతార్థులగుచున్నారు. ఇప్పటికి నఖండ దీపారాధన పూజాదికములు జరుగుచున్నవి. ప్రతి మాఘ శు।।1 నుండి మాసాంతముదాఁక ప్రజలు పశువులతో గిరిప్రదక్షిణము చేసి స్వామిని సేవించి, పలు విధములయిన మ్రొక్కుబడులు తీర్చుకొందురు. దేశ దేశములనుండి సుమారు రెండులక్షల ప్రజలీ యొక్క నాఁటి యుత్సవమునఁ బాల్గొందురు. సంకల్పము లేనివారికిని శివరాత్య్రు యుత్సవ సమయ మునకు నిర్నిమిత్తముఁగ భక్త్యుద్రేకము గలిగి తక్షణము బయలుదేఱి వెళ్లుట యిందలి ప్రత్యేకమహిమ యమటలో నతిశయోక్తి రవంతయులేదు. శివరాత్రినాఁటి యుత్సవమును, రకరకముల ప్రభలను, వాద్యములను, జనబాహుళ్యమును జూడని వాని జన్మము వ్యర్థమనియే చెప్పవచ్చును.
స్థలపురాణరచనలు :
ఈ స్థలమునకు యుగాంతరములనుండి మహిమ యున్నట్లు చెప్పుదురు.
దీని మాహాత్మ్యమును దెలిసికొనుటకు (i) కీ. శే. బ్ర॥ కొప్పరాజు నరసింహకవి
గారు వ్రాసిన ‘శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్య' మను మూడాశ్వాసముల పద్య
కావ్యము (ప్రకృత గ్రంథము) ముఖ్యాధారము.
(ii) మఱియు క్రీ శ. 1905 లో రూపెనగుంట సీతారామయ్యగారు గుమ్మెట కథ (రగడ) నుత్సవాదులు వర్ణించుచు వ్రాసిరి.
(iii) డెబ్బదియేండ్ల క్రిందట బ్ర॥ తుళ్ళూరి మాధవరాయఁడుగా రీ కథను కుంచించి “మనఃకాంతాము క్తికాంతాసంవాద' మని 12 చరణముల కీర్తన వ్రాసిరి.
(iv) 1922 లో కీ. శే. బ్ర॥ తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రిచే రచింపబడిన 'శ్రీ కాకాని మల్లీశ్వర మాహాత్మ్యము"లో సుమారు 11 పేజీల కథను శ్రీ కోటీశ్వర మాహాత్మ్యమని వ్రాసిరి. అది దేవినిబట్టి వ్రాసిరో తెలియదు. కథాభాగము వేఱు.
ప్రకృత గ్రంథకర్త :
ఈ గ్రంథకర్త వివాసస్థలము సత్తెనపల్లి తాలూకా కోసూరు. గ్రంథమునం దీయబడిప వంశావళినిబట్టి యీ కవీంద్రుని వంశవృక్ష మీ ప్రక్కపుటలో నొసంగఁ బడినది. ఆదిపురుషుడైన కొప్పరాజువామమే వీరి గృహనామముగ నేర్పడుట. పలవు నాయన ప్రసిద్ధపురుషుఁడై యుండనోపు.
-
ఈకవి క్రీ.శ. 1852 (శా.శ. 1774) విరోధికృత్ సం. మాఘ బ 14 లు సోమవారమునాఁడు శివరాత్ర్యుత్సవమునకు సకుటుంబముగ శ్రీ త్రికోటీశ్వరుని సన్నిధానమునకు బోయి, యుపవాసాదులు సల్పి, యుత్సవమును గాంచి నివ్వెఱ పడి యంతటి తిరునాళ్ళు జరుగుటకుఁ గల కారణ మచ్చటి విప్రోత్తముల నడిగి, వారెఱుఁగ మన మఱునాఁడింటికి ప్రయాణమై వచ్చుచుండెను. త్రోవలో శ్రీశైల ప్రాంత వాసియైన ముదిగొండ కేదారలింగమను ఆరాధ్య బ్రాహ్మణుఁ డెదురుపడెను. కవి యా విప్రునికి నమస్కరించి తన కోర్కె వెల్లడించెను. తోడనే యాతడు "ఇది శివుఁడు దక్షిణామూర్త్యవతారంబునఁ బండ్రెండేండ్ల వటుఁడై సమస్త బ్రహ్మర్షి దేవర్షులకు బ్రహ్మోపదేశ మొనర్చిన పుణ్యక్షేత్రము. ఈ విషయము చిదంబర నటన తంత్రమునఁ గలదు, సంపాదించి చూడుఁడు. బహు ప్రసిద్ధ మైనది" అనివెడలిపోయెను. అంతఁ గవి దాని నెట్లో సంతరించి శ్రీ దక్షిణామూర్తి స్వామికిఁ గృతిగ మూఁడాశ్వాసముల పద్యకావ్యమును వ్రాసెను. ఇందు కథాభాగ మతిస్వల్పము. భక్తి స్తోత్రాదులు, వర్ణనలు విస్తారముగ వ్రాయఁబడెను. ఈయన వేదాంతకవి. పరమ భక్తుఁడు, ఉభయభాషాభిజ్ఞుఁడు. శివపూజా ధురంధరుఁడు. తపస్సంపన్నుడు. శిష్యపరంపరలో నీయన కిప్పటికి నారాధన సాగుచున్నదని చెప్పుదురు. నరసింహకవి కొందఱు శిష్యులతో శ్రీ కోటీశ్వరుని సన్నిధానమున నుండి కోవెల బాగుచేయించునప్పు డొకనాఁ డాయన ప్రా౦తకోటయ్య గుడియొద్దఁ గల పానవట్టమును విష్ణు శిఖరమందున్న పాపవినాశనస్వామి గుడికి తేఁదలంచి శిష్యులతోమ కూలివాండ్రతోమ ప్రయత్నించుచుండెనట. అచ్చటికొక రెడ్డి వచ్చి 'మీరందఱకవైపున, నే నొక్కఁడ నొకవైపున నెత్తుకొని పోవుద'మని వారినొప్పించి యెత్త నతనివైపు భారములేవ వారు తమ యసమర్థతకుఁ జింతించి మఱునాఁటికి వాయిదా వేసిరి. ప్రక్షకుఁబోయి రెడ్డి మాయమయ్యెనఁటు ఎల్లరు నాఁటి రాత్రి కోటీశ్వరాలయమున నిద్రించుచుండఁగా నర్ధరాత్రివేళ నరసింగయ్యగారు వెలు పలికివచ్చి యెవరితోనో రహప్యాలాపము లాడుచుండుట పబ్బతి గురవయ్య యను శిష్యుఁడెఱింగి లేచి మెల్లన బైటికేఁగి, యావలనున్న వ్యక్తిని గానక మఱలివచ్చి వరుండి తెల్లవాఱినపిదప విషయమడుగఁగా గురులు "నాయనా! ఆదిదేవరహస్యము, నీవెఱుఁగఁజాలవు. పానవట్టమును గుడియొద్దకుఁ జేర్చితినని యొక దివ్యపురుషుఁడు చెప్పిపోయె" నవీరఁట. ఆ పిమ్మట నరసింగయ్యగారు తన కార్యక్రమమును నెఱవేర్చుకొని ధన్యులయిరని చెప్పుదురు. ఈ చరిత్రమెంతయు ప్రశంసనీయము. లోకమున మహాత్ములశ క్తిని కొలుచుటకు సాధనములేదుగదా :
ఈ కవి యితర గ్రంథములు (1) మహాకవులెవ్వరుఁ దలపెట్టవీ సూత..
సంహిత నీ మహాకవి యాంధ్రీకరించెను. దీనిని కీ. శే. బ్ర. శ్రీ జానపాటి
7
పట్టాభిరామశాస్త్రి గారు పరిష్కరించి ముద్రించిరి. (2) మల్హణసూక్తి సంగ్రహము. (3) పుష్పందోదిత స్తనము. (పుష్పదంతుని మహిమ్న స్తవము) (4) ప్రదోష పూజామాహాత్మ్యము మొ. వి. ఇవి యలభ్యములు,
పురాణ కథావిధానము :
ప్రజలీ క్షేత్రస్వామినిగూర్చి వాడుకగఁ జెప్పుకొను కథను ముందు క్లుప్త ముగఁ దెలిసికొని గ్రంథస్థ కథాభాగమును పిదపఁ దెలిసికొందము. కలియుగాదిని కొందఱు జంగమయ్యలు శివధ్యాన తత్పరులై కాశికిఁబోవ సమకట్టి నడుమ నడుమ మకాములు చేసికొనుచుఁ బోవుచుండిరఁట. ఈ త్రికూటాచలక్షేత్ర మిఁక పది పదునైదుమైళ్ళ దూరములో నున్నదనఁగా నొక లింగధారి అపర శంకరుఁడన నొప్పు నాతఁ డా గుంపునఁ గలిసి వారికి దివ్యబోధలు సేయుచు వెంటనంటెనఁట. దానికి వారెల్ల రాశ్చర్యనిమగ్నులై యా సమీప గ్రామమునం దొక బసవని సంపా దించి దానిపై నాతని గూర్చుండ నేర్పఱచి భజించుచు, మహిమలఁ జాటుచు నీ క్షేత్రమునకు వచ్చిరఁట. వెంటనే యాజంగమయ్య వారితో 'భక్తులారా నే. నీ త్రికుటాచలమును వీడఁజాలను, చూచివత్తును. మీరిందేయుండుఁ'డని బసవనితో గూడఁ బైకెక్కెనఁట. రెండుమూన్నాళ్ళకును వానిరాక గానక మిగిలినవారు తల కొక దిక్కున కొండను ప్రాఁకి వెదుకఁగా వెదుకఁగా నొక్కచో నాతని రూపము తళుక్కున మెఱపు మెఱసినట్లయి లింగమొకటి యబ్బురముగ గన్పించి, నాఁటి రాత్రి వారి కొక యోగిరూపమున దర్శనమిచ్చి ధన్యులఁ జేసినట్లు చెప్పుదురు. తదాదిగా దీనికి త్రికూటాచల క్షేత్రమనియు, లింగమునకు త్రికోటీశ్వరస్వామి యవియు నామములేర్పడి భక్తులు తరించుచున్నట్లు చెప్పుదురు. అయ్యాదిలింగమే రుద్రశిఖరమునఁగల ప్రాఁత కోటీశ్వరస్వామి యందురు.
గ్రంథస్థ కథావిధానము :
శ్రీ మహాదేవుఁడు పరాశక్తితో కైలాసమున నుండ పార్వతి శివుని గూర్చి "దేవా ! నీవు దక్షిణామూర్త్యవతారమున వసించిన శ్రీమత్త్రికూటాచలము • మహాత్మ్యమును విన్పింపు' మని వేఁడెను. అప్పుడు శివుఁడిట్లు చెప్పదొరఁకొనెను
'పూర్వము బ్రహ్మమానస పుత్తుఁడగు దక్షుఁడు మేరు పర్వతమున శివునిగూర్చి గొప్ప తపమొనర్చి తత్ఫలితముగా ఆదిశక్తి కూతురును శివుఁ డల్లుఁడును వగునట్లుగ వరముఁ బడసి, యట్లేకాఁగా వరగర్వంబునఁ గన్నుగాన కుండెను. శివుఁడు 'భిక్షుకుఁడు, శ్మశానవాసి, నీచుఁడు, గౌరవహీనుఁ డనియు, తాము కైలాసమున కేఁగినప్పు డమర్యాద గానించెననియు పరమ శివద్వేషియై వానిని బిలువకయే యజ్ఞమొకటి చేయ సంకల్పించి ప్రారంభించేను. బ్రహ్మాది దేవతలు, మహర్ష్యాదులు వచ్చిరి. నారదుఁ దావార్త శివున కెఱింగింప సతి, పతి వలదన్నను వినక గణపతితో నచ్చటికేఁగి స్వజనముచే నవమానితయై 'తండ్రీ : ఏ సంబంధమగు తనపు విడుతును. నీకనర్థకమగుఁగాక' యని కాలి బొటనవ్రేలి గోట నేలరాయుడు యజ్ఞకుండమునఁబడి మాయమై పర్వతరాజునకుఁ గూతురై పుట్టెను. శివుఁడు దానినంతను దివ్యదృష్టి నెఱిఁగి కోపించి చెమటనూడ్చి శిలపై జల్లెను. తోడనే ప్రళయకాల రుద్రాకృతితో వీరభద్రుఁ డుద్భవించి తండ్రియానతిఁ జని దక్షాధ్వరవాటమునఁ గలవారినెల్ల చిత్రవిచిత్రముగ హింసించి దక్షునిబట్టి శిరము ఖండించి హోమమొనర్చి యజ్ఞధ్వంస మొనర్చెను. వెంటనే దక్షునిసతి పతిభిక్షకోరి ప్రార్థించినఁ దలవంపులగునట్లు గొఱ్ఱెతలయుంచి బ్రతికించి వీర భద్రుఁడు శివునిజేరెను. పిదవ శంకరుఁడు శాంతమూర్తియై తాను బండ్రెండేండ్ల బాలుఁడుగ మాఱి బ్రహ్మచర్యమువ కైలాసంబున సప్తమావరణంబున సమాధి నిష్ఠుఁడై యుండెను.
రుద్రశిఖరము :
అయ్యెడ సనకసనందవాది బ్రహ్మర్షి సంఘంబుకు, బ్రహ్మాది దేవతలును.
వాలఖిల్యాది యోగసిద్ధులు నా దక్షిణామూర్తిని జేరి మ్రొక్క తమకు బ్రహ్మోవ
దేశముఁ జేయ వేఁడిరి. అతఁ డందుల కంగీకరించి యెల్లరఁ దోడ్కొని చని
త్రికూటాద్రికి వచ్చి విల్చెను. ఆ ప్రదేశమే ప్రాతకోటీశ్వరుని బోడు, రుద్ర
శిఖరము. అందు శివుఁడు బిల్వవనాంతరమున బ్రహ్మాసనాసీనుఁడై యోగనిష్ఠుఁడై
పర్వులకు మౌనముద్రచే బ్రహ్మోపదేశ మొనర్చెను. ఇయ్యది వటువగు
దక్షిణామూర్తిక్షేత్ర మగుటచే కల్యాణోత్సవమును, ధ్వజము నీ ప్రదేశమున లేవు.
విష్ణు శిఖరము :
రుద్ర శిఖరమునకుఁ బ్రక్కనున్న శిఖరమున విష్ణుదేవుఁడు శివుని గూర్చి తపము సల్పి శివుని బ్రవన్నుని గా ఎంచుకొనేను. తోడనే దేవేంద్రాదు లచ్చటికి వచ్చి తాము దక్షాధ్వరంబున హవిర్భక్షణము సలిపిన దోషంబు దొలఁగునట్లు. లింగ
రూపమున నందు నిత్యము దర్శవంతీయఁ బ్రార్థించిరి. శిపుఁ డప్పుడు చేతి త్రిశూ
9
లము నొక చట్రాతిపైఁ బొడిచెను. అచ్చట జల ముద్భవించేను. శివుఁడందు
లింగరూపమున వెలసెను. ఆతఁడు వారి కందు స్నాన మొనర్చి తన్నారాధించి
దోషవిముక్తులుకం డని చెప్పి మాయమయ్యెను. వారట్లోనర్చి ధన్యులయిరి. నాఁటి
నుండి యచ్చటి లింగమును పాపవినాశనేశ్వర లింగమనుట వాడుక. ప్రజలిందు
తొలుదొల్త స్నానమాచరించి శివుని సేవించుట ముఖ్యమని పురాణస్థ విషయము.
దీనినే గ్రద్దల బోడనియు, విష్ణుశిఖర మనియు నందురు.
బ్రహ్మశిఖరము :
రుద్ర శిఖరమునకుఁ గ్రిందుగా నైరృతిభాగమున బ్రహ్మ వసించి, జ్యోతి
ర్లింగ మచ్చట లేకుండుటకుఁ జింతించి శివునిఁ గూర్చి ఘోర తపస్సు చేసెను,
శివుఁడును బ్రత్యక్షమై బ్రహ్మకోర్కె చెల్లించుట కట్టులే వెలసెను. అదియే నేఁడు
సర్వులు పూజించు నూత్న కోటీశ్వరలింగము. ఈ లింగమును స్థల పురాణమున
వచ్చు సాలంకయ్య యను భక్తుఁడు ప్రతిష్ఠించినట్లు గలదు. ఇచ్చట శివుఁడు
తాండవము సల్పుచుండును. దీనికి ఉత్తరమున సమీపస్థ గ్రామము 'ఎల్లమంద'
లేక 'మునిమంద’, ఇందు మునులు గుంపుగా నివసించెడివారఁట. ఈ గ్రామ
సంబంధముచే నీ దేవునికి 'ఎల్లమంద కోటీశ్వరుఁ" డని వాడుక యైనది. ఇందలి
జ్యోతిర్లింగము లగోచరమైన కారణమున మనుష్యులు శిలాలింగముల నేర్పఱచి
పూజించుచుండిరి. వివరములు తెలియవు. ఇవి సురనర సేవ్యములై మోక్షప్రదము
లగుచున్నవి. ఈ గిరి స్థలమున నిప్పటికి నొక సిద్ధుఁ డదృశ్య రూపమునఁ తిరుగు
చుండునని చెప్పుచుందురు.
ఓంకార నది (ఓగేరు) :
దేహమునకు త్రికూట స్థానమందు ఓంకారము ప్రముఖమైనట్టు లీ
త్రికూటాద్రికి దక్షిణముగ ఓంకారనది పాఱుచున్నది. ఇందు తైర్థికులు స్నానమాడి
తీర్థశ్రాద్ధములొనర్చి దేవుని సేవించిన స్వర్గము కరతలామలకము.
పూర్వము శిబిచక్రవర్తి యను రాజు అగస్త్యోపదేశమున జగదేకదాతయై
ఆర్తరక్షణ బిరుదాంకితుఁడై యుండెను. అతని దానశీలమును పరీక్షించుటకై
ఇంద్రుఁడు శ్యేనమై, యగ్నిహోత్రునిఁ గపోతముగఁ జేసి వేటాడుచు వచ్చెను.
ఆకపోతము కిరాతరూపమున నున్న శివునిచేఁ బడి తప్పి శిబినిఁ జేరి శరణు
2
10
వేఁడెను. కిరాతుఁడు పక్షి నిమ్మనెను. శిబి "నా శరీరము నుండి దాని యెత్తు
మాంసమైన విత్తుఁగాని పక్షి నీయననెను. ఎట్టకేలకు కిరాతు డందుల కొప్పుకొనఁగా
రాజు పక్షిని త్రాసున నుంచి దానియెత్తు మాంసము తన దేహమునుండి తఱిగి
రెండవ వైపునఁ బెట్టసాగెను. ఎంతకును లాభములేక తలయందలి మెదడు నౌక
వైపు గోసిపెట్టిన నదియు నిష్ఫలమయ్యెను, రెండవ వైపునఁ గోయఁబోవ శివుఁడు
మెచ్చి ప్రత్యక్షమై రాజు నతని కోరికపై తనయం దై క్యముగావించుకొనెను.
అంత శిబిచక్రవర్తి లింగరూపమై కపోతేశ్వరుఁడను పేర వెలసెను. ఇది
గుంటూరు జిల్లా - నర్సరావుపేట తాలూకాలోని చేజర్ల గ్రామమునఁ గలదు. దీవినే
దక్షిణకాశీ యందురు. దేవాదులెల్ల నా లింగము నోంకారశబ్దమున నభిషేకించిన
జలము భూగతమై లింగము క్రిందుగ వెల్వడి ఓంకార నది యన నొప్పేను.
సాలంకయ్య :
ఈ సాలంకయ్య కాలము తెలియదు. ఈతఁడు త్రికూటాద్రికి నుత్తరమునఁ
గల ఎల్లమంద గ్రామమున లింగబలిజ కులమున నుద్భవించేను. ఈతఁడు గొప్ప
శివభక్తుఁడు. ఇతనికి నల్గురు తమ్ములుండిరి. వారితో నీతఁ డదవికేఁగి కట్టెలే
యమ్ముకొని జీవించుచు, జంగమార్చన సేయుచుండెను.
ఆతఁడు రుద్రశిఖరమునఁ గల లింగము నర్చించి, యమిత ధనము నార్జిం
చుచు, నిత్యము దాని నేమరక మెలఁగుచుండెను. తమ్ములతో నొకనాఁ డతఁడు
పూలు తేర విష్ణుశిఖరమున కేఁగెను. అపుడు విపరీతమగు వర్షము గురిసెను.
ఆ ధాటికి వారొక గుహఁ జేరియును ప్రాణములు నిలుపుకొనఁజాలక కోటీశ్వరుని
శరణుజొచ్చిరి. కొంతవడికి వాన వెలిపెను. వారు శివుని దలంచుచు త్రోవఁబట్టి
నడువ సెలయేటిచే భిన్నమైన యొక తిన్నెయందు ధనపుబిందె అభించెను.
పాలంకయ్య దానివి శివప్రసాదమని గ్రహించి, స్వామి నారాధించి యింటికిఁ జని.
సమస్త వైభవో పేతుఁడై జంగమారాధన వీడక కాలముఁ బుచ్చుచుండెను.
సాలంకయ్య యొక్కతఱి రుద్రశిఖరమునఁ బూజ గావింపుచుండ నక్కడ
నొక జంగమయ్య ప్రత్యక్షమయ్యెను. అతఁడు వానివి పరశివునిగా మనోవాక్కాయ
కర్మములఁ బూజించి తనయింటికి వచ్చి ధన్యుఁ జేయఁగోరెను. అతడు వల్లెయని
యింటికివచ్చి భక్తుఁడిచ్చు వేఱుపదార్థము లొల్లక క్షీరమాత్రాహారుఁడై కొన్నాళ్ళుండి
యుండి యొక్క నాడు మాయమయ్యెను. సాలంకుఁడాతని నిందునందు వెదకి
‘వేసారి విరాహారుఁడై యుండెను.
11
ఆనందవల్లి (గొల్లభామ) కథ :
ఇట్లుండ నీ కొండకు దక్షిణమున ‘కొండకాపూ'రను గ్రామమున
‘సునందుఁ‘డను యాదవుఁడొకఁడుండెను. అతనిభార్య 'కుందరి', ఆమె ఆనందవల్లి'
యను పుత్తికంబడపి యఖిల భోగభాగ్యములఁ దులఁడుఁగుచుండెను. ఆ బాలిక
దినదిన ప్రవర్ధమాన యగుచు సర్వకాల సర్వావస్థలయందును 'శివార్పణబుద్ధితో
సమస్త వ్రతదానము లొనర్చుచు విభూతి రుద్రాక్షలు దాల్చి చెలులతోఁ గొండనెక్కి
శ్రీ కోటీశు నర్చించి వచ్చుచుండెను. తల్లిదండ్రు లా బాలిక నట్లుండవలదని
వారించిరి. ఎంత చెప్పిన నామె వినక వారికిఁ దగు వైరాగ్యబోధలొనర్చి తల్లి
దండ్రులఁ గూడ శివభక్తులుగ మార్చివైచేను. ఒక్కనాఁ డా బాలిక శివరాత్య్రుత్స
వమున కేఁగి ఓంకారనదిని స్నానమాడి రుద్రశిఖరమున బిల్వవనాంతరమున
దక్షిణామూర్తి స్వరూపముననున్న శ్రీ (పాత) కోటీశ్వరుని బూజించి, యించు
కంత సేపు నిమీలిత నేత్రయై తిరిగి కన్నులు విచ్చినంతనే వెనుక సాలంకయ్యకు
గన్పట్టి విందారగించిన జంగమయ్యరూపున నొక దివ్యపురుషుఁడు సాక్షాత్క
రించేను. ఆనందవల్లి నిత్య మాతని కా పాపవినాశన ద్రోణీకనుండి తీర్థము రుద్ర
శిఖరమునకుఁ దెచ్చి యభిషేకించి క్షీరములొసంగి, తద్భుక్తశేషమును దాను
భుజించుచు కాలముఁ గడపుచుండెను.
సాలంకయ్య కీ వృత్తాంతము తెలిసి వచ్చి యామెకుఁ గన్పట్టి పూజగొను
జంగమయ్యకుఁ దన్నెఱింగింపఁ బ్రార్థించి నిత్య మామెకడకు వచ్చుచుఁ బోవు
చుండెను. జంగమమూర్తి మౌనముద్ర దాల్చియుండుటవలనఁ గాఁబోలు నామేకు
సమయము పొనుపడదయ్యెను. అంతలో గ్రీష్మర్తువు వచ్చెను. అప్పటికి నామె
నిత్యనై మి త్తికాదిక్రియలలో లోప మేమాత్రము రానీక యాతని నర్చించుచుండెను.
ఒక్కనాఁ డామె తీర్థఘటమును దెచ్చి వానికి సమీపమున డించి, మఱచివచ్చిన
బిల్వదళములకై పోఁవ నొకకాకి యాఘటముపై వ్రాలెను. కుండ బోర్లబడి
నీరము నేలపాలయ్యెను. దాని కా ముగుద చింతిల్లి నేఁడు మొదలు వాయసములిటకు
రాకుండుఁగాక' యని శపించెను. ఇయ్యది నేఁటికిని నిదర్శనమని యందురు.
దీనినెల్లఁ జూచుచున్న జంగమయ్య 'ఆనందపల్లీ: బాలికవు. ఇంటనుండక
నీవిట్లు శ్రమపడిన మావల్ల నీకు రాఁదగు సుఖము లేమి? నిష్ప్రయోజనము,
ఇంటికేగుము' అనియెను. ఆమెయు దానికొల్లక యెప్పటియట్ల సేవింపుచుండెను.
అంత నా దివ్యపురుషుఁడు జ్ఞానోపదేశమున నామె తన పూజ మానునవి
యెంచి యట్లోనర్ప , నా బాల మిగుల భక్తి కలిగి వర్తింపుచుండెను. మఱియు
12
నామె 'స్వామీ! మీరు దైవస్వరూపులు. అందుపై గురువులరు. వీడిన గురు
ద్రోహ మగు' నని చెప్పుచు నిత్యార్చన మానకుండెను. అందుల కా సిద్ధపురుషుఁ
డామె పడు శ్రమలనుండి తప్పింపఁ దలఁచి, ఒకనాఁడు తన యోగమాయచే
నస్థలిత బ్రహ్మచారిణి యగు నామెకు మాయా గర్భమును గల్పించేను. నవమాస
మలు వచ్చి గర్భభరాలస యయ్యెము. అష్టకష్టముల కోర్చి యామె నిత్యవ్రత
ముఘు మానకుండెను, దాని కా యోగపురుషుఁడు సంభ్రమాశ్చర్యములంది, 'తల్లీ :
నీవింత శ్రమపడి యిచ్చటికి రానేల? నేనే నీ యింటికి వచ్చెదను. నీ వ్రత
మచ్చటనే నెఱవేర్చుకొమము. కాని నీవు వెనుదిరిగి చూడకుండఁ బొమ్ము. చూచి
తివో నే నందే నిలచెదను' అని చెప్పి యొప్పించి ముందు గొల్లభామయు
వెనుక ప్రళయధ్వనులు మ్రోఁగుచుండఁ దానును రుద్రశిఖరమునుండి బ్రహ్మ
శిఖరముదాఁక రాగా, నామె యా ఘోరధ్వనుల కోర్వలేక వెనుదిరిగి చూడఁగా
నాతఁ డందేయుండి 'అబలా ఇంక నేనిందే సమాధినిష్ఠఁ జెందెదను. వ్రత
భంగమైనది' అని యా శిఖరమునఁ గల బిలముఁ జొచ్చెను అదియే నేటి నూత్న
కోటీశ్వరాలయ స్థలము, గొల్లభామయు నందేయుండి యచటఁ బ్రసవించి కుమా
రుని గవి, వ్రతభంగమునకుఁ గుమిలి యందే ప్రాయోపవేశ మొనర్ప నెంచి
మౌనముద్రం దాల్చి, యోగమూని కనులు దెఱచునంతలో ప్రక్కనున్న కుమారుఁ
డదృశ్యుఁ డయ్యెను. వెంటనే యామె యదియంతయు దివ్యపురుషుని మహిమగాఁ
దలంచి జన్మము ధవ్యమయ్యెనవి యెంచి యచ్చటనే సమాధిఁ బూని శివైక్యముం
జెందెను.
సాలంకయ్య చివరి కథ :
ఇచ్చట సాలంకయ్యయు విత్యము గొల్లభామ యోగికితన చరిత్రము విన్పిం చుట కవకాశము కలుగలేదని చెప్పుచు నుండియుండి నేఁడు గొల్లభామ కూడ కన్పింపమికి వేచివేచి వెదకుచు బ్రహ్మశిఖరమున నున్న గుహకడకు రాఁగా నందున్న దివ్యపురుషుఁడు 'నేను నీ యింట విందారగించినవాఁడను, శివుఁడను, గొల్లభామకువ్రత సమాప్తి జేసితిని. ఆమె శివైక్యానుసంధానముఁ జెందెను. నేనిందే యుందును. దీనిపై దేవళ మొండు గట్టించి త్రికోటీశ్వర లింగమును బ్రతిష్ఠించి పూజింపుము. ఉత్సవ దినమున ఓంకార నదీస్నానము జేవి, నన్నభిషేకించి, ఉపవాస జాగరణాదు లొనర్చి, ప్రభలు గట్టించి, వీరాంగాది వాద్యముల న న్నల
రించి మఱునాఁ డన్నదాన మొనర్పుము. గొల్లభామ నా భక్తురాలు, త్రోవలో
13
నామెను దర్శించిన పిదప ప్రజలు నన్ను దర్శించున ట్లచ్చట గుడి గట్టించి విగ్రహమును బ్రతిష్ఠింపు' మని యానతిచ్చి, సాలంకయ్య కోరికపై శివైక్యాను సంధాన స్థితి నుపదేశించి మాయమయ్యెను.
అంత సాలంకయ్య భగవదాజ్ఞ కతిశయముగఁ గోవెలలు నిర్మించి యుత్స వాదుల జేయుచు కాలముఁ బుచ్చుచుండెను. అచ్చట స్వామికి కల్యాణోత్సవము లేకునికి చింతిల్లి శివునకుఁ బడమర నొక కోవెల గట్టి పార్వతిని బ్రతిష్ఠింపఁ బూనఁగనే ఆకాశవాణి "ఈ స్థలము బ్రహ్మచారి యగు దక్షిణామూర్తి క్షేత్రము. ఇందు కల్యాణము నెఱపఁదగ" దని చెప్పెను. అయిన నాతడు తన వాంఛాప్రాబల్య వశమునఁ బ్రతిష్ఠింపఁగావిగ్రహము మాయమయ్యెను. వెంటనే సాలంకయ్య విరక్తి గలిగి శివసాయుజ్యముం బొందెను. తమ్ములు ముగ్గురు నందే శివైక్యమందిరి. వానినే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లింగములని యందురు, సాలంకుఁడు సాలం కేశ్వరుఁడను పేరను, తత్ప్రతిష్ఠిత లింగము త్రికోటీశ్వరుఁడను పేరను వెలసిరి, కావున దీనిని పంచబ్రహ్మస్థానమని యనిరి. సమస్త దేవత అందు జరుగు నిత్యోత్సవ మాసోత్సవ వర్ణోత్సవములందుఁ బాల్గొందురని స్థలపురాణమునఁ గలదు.
త్రికూటాచల మాహాత్మ్యము - ప్రచురణ కృషి :
ఏక త్సుశ్రావ్య కథా మధుర పదబంధ బంధురమగు నీ గ్రంథ మొకటి బహు శిథిలావస్థలో నా ప్రాణమిత్రులు కీ. శే. మద్దులపల్లి గురుబ్రహ్మశర్మగారి యొద్ద కెట్లో చేరినది. దానిని వారు భద్రముగ దాఁచియుంచి తదాధారముగ తెలుఁగువచనమున 1939 లో 'శ్రీ త్రికోటీశ్వర చరిత్రము' అను గ్రంథమును పెక్కు విషయములతో వ్రాసి ప్రచురించిరి. వీరికిఁ బూర్వ కవులవిన మహా ప్రేమ. అప్పుడప్పుడు మూలములో కొన్ని పద్యములను జదివి వినిపించుచుఁ గడు నివ్వెఱపడుచుఁ గవి బుద్ధి కుశలతకు జోహారు లిచ్చుచుండెడివారు. అప్పటికే యా పద్యములు కొన్ని యాద్యంతములు లేక, ఉన్నవానిలో ప్రత్యయ లోపమో, పదలోపమో, ఛందోలోపమో. భావలోపమో యేదో యొకటి గన్నట్టు చుండెడిది. అప్పుడప్పుడు మాటల సందర్భమున "నా కీ వయసున బుద్ధి పని చేయుటలేదు. దీనిని మీరు తీసికొనిపోయి పరిష్కరించి యేనాటికైన నచ్చు వేయింపుఁడు. లేదేని నావలె మీరుకూడ దాఁచియుంచుఁ"డని చెప్పుచువచ్చి, యొక
నాఁడు దానిని వారు నాకోసంగిరి. ఆపిమ్మట కొద్దిరోజులకే వారు దివంగతులై రి.
14
నేనును పది పండ్రెండేండ్లు దాని ప్రస్తావనయేలేక యొకసారి వేసవి సెలవులలో జూడ నారంభించి యున్నంతవఱకు జాగ్రత్తగా నొక 'కాపీని’ వ్రాసి దానిలో సవరణల కారంభించి యెట్లో సంవత్సరమున్నఱ కొక పద్ధతిలోనికిఁ దెచ్చితివి. ఒకనాఁడు దానిని మహానందముతోఁగొని నా కాశ్రయులైన నర్సరావుపేట జమీం చారు మ. రా, రా. శ్రీ మల్రాజు వేంకట రామకృష్ణ కొండల్రావు బహద్దరు గారిని సమీపించి, గ్రంథ విషయము సర్వమును నివేదించి యెట్లయిన నచ్చొ త్తింపఁగోరి కొంతభాగము చదివి విన్పించితిని. అప్పుడు వారా పాఁ తప్రతిని, క్రొత్తప్రతిని జూచి సంతసించి 'మీరింతశ్రమ యెట్లు పడితిరో' యనుచు, ఎండో 'మెంటు బోర్డువారికి సిఫార్సుచేసి కోటప్పకొండకు సంబంధించిన 'ఫండ్పు' నుండి మీకు వలసినంత ద్రవ్య మిప్పింతుమని వాగ్దానముచేసి నాదగ్గర నప్పుడప్పుడు 5, 6 అప్లికేషనులు తీసికొనిరి. కాని యెన్నాళ్ల కది యొక స్వరూపమునకు రాదయ్యెను. దాని కింకను మంచిరోజు రాలేదని తలంచితిని. పిమ్మట శిష్యుల నాశ్రయించినఁ గొదువయుండదను వెనుకటి మర్యాదతోఁ గొందఱి వెంటఁబడి మోసపడితిని. 'కాలాయ నమః' ఆనుకొంటిని. కొంతకాలము వితగ కడచిన కాలమునకు విలువగట్టి భగవంతునిపై భారముంచి యొకనాడు నరసరావుపేట మునిసిపల్ చైర్మన్ చిరంజీవి శ్రీ కొత్తూరి వెంకటేశ్వర్లను సమీపించి, పూర్వగాథ వివేదించి సాయము చేయఁగోరితిని, వెంటనే యాతఁడు__‘ వినయమతితో" "మన మిత్రులు పెక్కుమంది కలరు. మీ కోరిక తీర్తును. మీరు కించపడవల" దనెను. పూర్వకవుల గ్రంథములను పైకిఁ దెచ్చు నా యభిలాష యాతని సాదరవాక్యమున వర్ధిల్లి శ్రీ త్రికోటీశ్వరుని యను గ్రహము లోకమునకే కల్గినట్లు పొంగిపోయితిని. 'శుభమస్తు' అని వెడలితివి. ఆతఁడే ఒక నాఁడు నన్ను బిలిపించి నాకుఁ దెలియకుండఁగ నాతఁడు వేయించిన చందాదారుల పట్టిక నిచ్చి 'ఇంతవఱకయినది. మిగిలినది నాలుగైదు రోజులు తిరిగి పూర్తిచేయుదము' ఆనెను. నేనప్పు దాతని యుత్సాహమునకును, కార్యదీక్షకును, పరోపకారపరాయణత్వమునకును, గుండె దిటవునకును, గురుభక్తికిని, వృద్ధోప సేవకు నబ్బురపడి, నా మిత్రులతో నతని గుణములను గొండాడితిని. చిన్నతనము లోనే వానిని పురపాలక సంఘాధ్యక్ష పదవి వలచి వలపించినదమటలో నాతని లోని సుగుణములే నిదానమవి యా నాఁడు తలంచితిని. ప్రజలు- అందును శత్రువులై నవారు గూడ నాతని పరిపాలనా విధానములో వ్రేలుపెట్టి లోపమును చూపించినవారు లేకుండునట్లు పాలనకుఁగడంగి యచిరకాలముననే యాతఁడు పేరు
గడచెను.
15
ప్రతిష్ఠలు గడించుట యెంతయుఁ బ్రశంసనీయము. నేనాతని శిష్యత్వము నేనాఁడో మఱచితివి. కాని గురుత్వముమాత్ర మాతఁడు విస్మరించినవాఁడు కాఁడు. ఇంతకుఁ బరమేశ్వరుని యనుగ్రహ మీ విధమునఁ దోడయినది. నాలుగైదు నాళ్లలో వలసిన ధనము ప్రోగయినది. దాతలు గూడ ప్రయత్నమునకుఁ దగినటు లడుగుటతో నే ‘లేదు.కాదు' అనకుండ నిచ్చిరి. ఈ గడ్డు రోజులలో నిది యొక విశేషము. ఈ " కార్యక్రమములో నాకు శిష్యతుల్యులును పరమాప్తులునైన శ్రీ మారేపల్లి శ్రీరామ మూర్తి గారు మాకు విక్కార్యమున చేదోడు వాదోడుగాఁ దోడ్పడి గ్రంథము సమగ్ర రూపము దాల్చువఱకు దీక్షతో నిల్చిరి. ఇది శివానుగ్రహమని తలంతును. కార్యానుకూల్యమున కన్నియుఁ గలిసివచ్చునను పెద్దలమాట యనుభవైకవేద్యము ఈ గ్రంథమునఁ బ్రచురించిన బొమ్మలు నాకుఁ బరమ మిత్రులును, నర్సరావు పేటఛాయాచిత్రశాలాధిపతులునగు బ్రో. వే. వళ్లె బిందుమాధవాచార్యులు గారు స్వయముగా కొండ దగ్గఱకు వెళ్లి ఫోటోలు తీసికొనివచ్చి సమయమున కుచితముగా నందించిరి. ఇది తలవనితలంపుగా జరిగిన విషయము. వీరెల్లరి యాశయముల కెల్లప్పుడును పరమేశ్వరుఁడు శ్రీరామ రక్ష' యై శాశ్వతాయురారో గ్యైశ్వర్యముల నిచ్చి సర్వదా వీరిని, వీరి కుటుంబములను కాపాడుఁగాత మవి ప్రార్థించుచున్నాను.
తమ ప్రపితామహులు రచించిన ఈ గ్రంథమును బ్రకటించుటకు సర్వాధికార
ములు నా కొసంగిన శ్రీ కొప్పరాజు వీరభద్రరావుగారి మహొదార్యభరిత సారస్వ
తాభినివేశమునకు నా నమోవాకములు. పరమేశ్వరుఁడు వారికి చిరాయురైశ్వర్యము
లొసఁగి రక్షించుఁ గాక
ఈ గ్రంథమును ముద్దులు మూటగట్టునట్లు ముద్రించి యిచ్చిన మదీయ
సోదరులు, అజంతా ముద్రణాలయాధిపతులు, శతావధానులు, శ్రీ శ్రీనివాససోదరు
లకు మిక్కిలి కృతజ్ఞుఁడను.
సంపాదకుఁడు
మేలిపలుకు
శ్రీమత్త్రుకూటాచలమాహాత్మ్యమను నీగ్రంథమును ఆమూలాగ్రముగాఁ జూచితిమి. రచయిత కొప్పరాజు నరసింహకవి గొప్పశివభక్తుఁడు. శైవవేదాంతము సరహస్యముగ నెఱింగినవాఁడనుటకు గ్రంథమంతయును ముఖ్యముగా ద్వితీయాశ్వాసమును ప్రమాణము విషయమందలి యత్యంతాభినివేశముచే వ్రాసినకావ్య మగుటచే కవిత యావేశపూరితము. తృతీయాశ్వాసమున 215 నుండి 228 వఱకు గల పద్యభాగ మందులకు నిదర్శనము. శివరాత్రి యుత్సవమును వర్ణించుఘట్టము మఱియొక మేలుబంతి. రచన సర్వత్ర గంగాప్రవాహమువలె సాగిపోయినది. తృతీయాశ్వాసములో 302 వ పద్యము కవి భావనాశక్తి కొకమేలియుదాహరణము :
| పై నున్న జనము లాపైన నిల్చినయట్టి | |
ప్రభలకు గట్టిన యద్దములను జూచి కవి చేసిన కల్పన గొప్పగా నున్నది. కొండపైని ప్రభల యద్దములలో కొండక్రింది యుత్సవములు గాంచి కొండమీఁది జను లా యుత్సవము అలచటనే జరుగుచున్నవని భ్రమించి యచ్చటనే యుండిరి. కొండక్రింది ప్రభల యద్దములలో పైనున్న దేవాలయములు మొదలగు దృశ్యములఁ గాంచి ప్రజలు తమమీఁది యనుగ్రహమున కోటీశ్వరుఁడు తన యాలయములను గ్రిందికి దీసికొనివచ్చినట్లు భ్రమించి యచ్చోటు వాయకుండిరఁట: ఎంత చక్కనికల్పనః ఇంకను ఈ కవి కల్పనాచమత్కారమునకు తృతీయాశ్వాసమున 46, 49 మొదలగు పద్యములు చూడవచ్చును. అఖిల చ్ఛందోమయుఁడగు పరమేశ్వరుని దేవేంద్రునిచే వివిధ చ్ఛందోమయ స్తోత్రమున స్తుతింపఁజేసిన కవి యుచితజ్ఞత మెచ్చఁదగినది.
“తరుణి మాకు విరోధి నీ ధవుఁ డతండు
ప్రేత భూత పిశాచ సత్ప్రియ సఖండు
యజ్ఞభూమికి నరుదేఱ నర్హుఁడగునె ?
అతని సతివౌట నీవు ననర్హ విపుడు."
ఇందు 'ఇపుడు' అను పదము మిక్కిలి భావగర్భితము. ఇట్లు పదములను సముచితముగ వాడిన పట్టులు పెక్కు గలవు.
ఈ పద్యమందలి ధారాశుద్ధి, జూడుఁడు :
కాము మెక్కు వౌను కడియ నోటికిఁ బోదు
ధనమున౦దుఁ బ్రేమదగులు మిగుల
చిక్కువడుచునుండుఁ జింతల వంతల
ముదిమి మోక్ష సౌఖ్యమునకు తెరువె ?
భక్తిరస భరితములై న యిట్టి సత్కావ్యములలో నెరసులు పరికించుట సరసుల పని కాదుగదా ! ఇహపర సాధనమైన యిట్టి మంచి కావ్యమును వెలుఁగులోనికిఁ దెచ్చుటకై మిక్కిలి శ్రమపడి సఫలుఁడైన మా సోదరుఁడు విద్వా౯ భాగవతుల వేంకట సుబ్బారావును, ఆతనికి, దోడ్పడిన నరసరావుపేట నగరపాలికాధ్యక్షులు శ్రీ కొత్తూరి వేంకటేశ్వర్లగారు మొదలగువారలకును మా హృదయ పూర్వకాభివందనములు.
3 - 4 - 862 బర్కత్ పూరా,
హైదరాబాదు.
31 - 8 - 1959.
శ్రీనివాస సోదరులు
శతావధానులు.