శృంగారనైషధము/సప్తమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శృంగారనైషధము

సప్తమాశ్వాసము

శ్రీరెడ్డివేమవిశ్వ
రమణకృపావిశేశసమధిగతైశ్వ
ర్యారూఢవిభవశృంగా
మారారిపదాబ్జభృంగ! మామిడిసింగా!

1


నలుఁడు దమయంతీసహితుఁడై నిజరాజధాని కేఁగుట

వ.

వినుము.

2


తే.

పయన మై స్వపురోహితప్రవరుఁ డైన
గౌతముండు ప్రస్థానసంగతికిఁ దగిన
మంగళాచార మొనరింప మహివరుండు
శిబిర మెత్తఁ బడాళ్ళకుఁ జెప్పఁ బనిచె.

3


ఉ.

పుట్టిననాఁటగోలె నొకప్రొద్దు నిజాంకతలంబుఁ బాయకు
న్నట్టియనుంగుఁగూఁతు దమయంతి గడుంగడుదూర మన్పుచో
నిట్టవిషాద మాత్మ నుదయింపదు కూరిమియల్లు నంపుచో
నెట్టివిషాద మాత్మ నుదయించెనొ మామకు నత్తగారికిన్.

4

ఉ.

అక్షయరాజ్యవైభవరమానుభవాభినవప్రభాసహ
స్రాక్షుఁడు గుండినాధిపతి యాత్మసుతారమణు న్వినీతతా
లక్షగుణీభవద్గుణకలాపుని నైషధునిన్ వరాటదే
శక్షితిమండలావధిగ సమ్మతి నంపె సుతద్వయంబుతోన్.

5


తే.

ఆత్మమండల మవధిగా ననుచరించి
యవనినాథుఁడు జామాత ననిపి మరలె
నాప్రతీరంబు గంధవాహంబు ననిచి
మరలిపోవుతటాకంబుతరఁగవోలె.

6


వ.

అప్పుడు నిజవియోగజనితక్లేశంబునం గన్నుల బాష్పాంబుకణంబు లురలఁ బ్రణామంబు సేసి తలవాంచియున్న కూఁతుం గౌఁగిలించుకొని గద్గదస్వరంబునఁ దండ్రి యిట్లనియె.

7


మ.

గురువన్నన్ ధన మన్నఁ బుణ్య మనినన్ గోత్రోదయం బన్న దే
వర యన్న న్మన మన్నం దుష్టి యనినన్ వాత్సల్య మన్న న్నిజే
శ్వరుఁ డన్నం బరమోపకార మనినన్ సర్వంబు నన్నం దలో
దరి ! నీకు నిషధాధినాథుఁడె సుమీ తథ్యంబుగాఁ జెప్పితిన్.

8


సీ.

పాటించి కొలువుము భవనదైవతముల
        సవతులఁ గొనియాడు సఖులఁ బోలె
నారాధనము సేయు మత్తమామల నెప్డు
        పరిజనంబులమీఁదఁ గరుణగలుగు
యలుగకు కోపించినపుడు నాథునితోడ
        మదిలోన నుబ్బకు మన్ననలకుఁ
దోడికోడండ్రతోఁ గూడి మాడి చరింపు
        దాసీజనముఁ బ్రోవు తల్లికరణి

తే.

బ్రాహ్మణులయందు గురులందు బంధులందు
భక్తివిశ్వాససౌహార్దపరత నెరపు
భవ్యపతిదేవతాచారపరమపుణ్య
ధర్మ మేమర కుండుమీ తల్లికాన!

9


వ.

అని బుజ్జగించి బుద్ధి సెప్పి కూఁతున్ వీడ్కొనియె దమదమనులుం జెలియలి ననునయించి.

10


ఉ.

సంకుమదంబుఁ గస్తురియుఁ జాఁదుఁబటీరము గప్పురంబునుం
గుంకుమపువ్వునుం బునుఁగు గొజ్జఁగనీరు [1]ననేకభారువుల్
కంకణకంఠికాకటకకాంచిముఖాభరణవ్రజంబుతోఁ
గొంకక తోడఁబుట్టువులు గూరిమి చెల్లెలి కిచ్చి రిద్దఱున్.

11


సీ.

కదళికాచంపకక్రముకపాటలచూత
        కంకేళివాటికాసంకులంబు
లక్షీణబహుళపుండ్రేక్షురాజాన్నాది
        భూరిసస్యసమృద్ధిభూషణములు
కమలనీలాంభోజకల్హారకుముదాఢ్య
        శుంభత్తటాకోపశోభితములు
వివిధాపణస్థలీవిన్యస్తరత్నాది
        బహుపదార్థవ్రాతబంధురములు


తే.

గ్రామములు నూఱు క్రథకైశికంబులోనఁ
బసపు కిచ్చిరి భీమభూపాలసుతులు
దండ్రియాజ్ఞ సహోదరధర్మ మొప్ప
ననుఁగుసయిదోడు దమయంతి ననుపునపుడు.

12

తే.

ఉభయవంశలలామ యయ్యుత్పలాక్షి
యత్తవారింటి కరిగెడునవసరమున
మాతృజనకసఖీజనభ్రాతృవిరహ
మధిపతిప్రేమజలరాశి కౌర్వ మయ్యె.

13


వ.

ఇవ్విధంబున సంబంధిబంధుజనంబుల సముచితప్రకారంబుల వీడ్కొలిపి కతిపయప్రయాణంబుల.

14


సీ.

ప్రణధిలోకానీతపరితోషవార్తాభి
        నందితామాత్యబృందారకంబు
రాజవీథీమహాప్రాసాదశిఖరాగ్ర
        కీలితాలంకారకేతనంబుఁ
గ్రంథకైశికాధీశకన్యావలోకన
        వ్యగ్రపౌరవధూసమాకులంబుఁ
గస్తూరికాలేపకర్పూరరంగవ
        ల్ల్యభిరామమందిరప్రాంగణంబు


తే.

సారసారమసారాశ్మతోరణాంశు
చూర్ణకుంతలమాలికా భమాన
గోపురశ్రీలలామంబుఁ గూర్మిపురము
డాయ నేతెంచె నిషధభూనాయకుండు.

15


తే.

కలయ నేతెంచి నైషధక్ష్మావరుండు
దివుటఁ బురలక్ష్మిపై వ్రాలుదృష్టిఁ దివిచె
నాత్మ నొక్కించుకయుఁ బరాకయ్యెనేనిఁ
బ్రాణపల్లభ దన్నేమియనునొ యనుచు.

16


చ.

ఎదురుగ నేఁగుదెంచిరి మహీపతికిం బురివారు సర్వసం
పదలు ప్రమోదవైభవశుభస్థితియు న్నెరయంగ మిండతు

మ్మెదపదుపుల్మదోదయము మిక్కిలివేడుకయున్ మనంబులం
బొదలఁగ క్రొత్తయామనికిఁబొచ్చెములే కెదురేఁగుచాడ్పునన్.

17


వ.

ఇట్లు మంత్రిపురోహితామాత్యదండనాథప్రధానంబుగాఁ బౌరజనసమూహంబు దన్నెదుర్కొన సముచితప్రకారంబున.

18


నలదమయంతుల పురప్రవేశము

శా.

ఏమో క్రొత్తయపూర్వవార్త విను చేమో చెప్పుచున్ దండనా
థామాత్యాదులు పాదచారమున సేవాసక్తి మైఁ గొల్చిరా
భూమీశాగ్రణి సొచ్చెఁ బట్టణము సంపూర్ణానురాగంబుతో
భామానేత్రచకోరచుంబితముఖప్రాలేయరుగ్బింబుఁడై.

19


క.

సకలధరాధీశ్వరుపైఁ
బ్రకటముగాఁ జల్లి రఫుడు పౌరపురంధ్రుల్
సుకుమారబాహువల్లీ
ముకుళకులసకుల్యలాజముక్తాఫలముల్.

20


మ.

దమయంతీవదనావలోకనసముత్కంఠావలద్భామినీ
సముదాయాననచంద్రబింబపరిషత్సాన్నిధ్యయోగంబునన్
సముపేతార్థము లయ్యె సౌధమణిభాస్వచ్చంద్రశాలావితా
నము లుర్వీపతినందనుండు పురఘంటావీథి నేతెంచుచోన్.

21


తే.

ధరణీనాథాననేందుసుధారసంబు
సౌధజాలమృణాళికాజాలకముల
నుత్పలాక్షీకటాక్షనీలోత్పలములు
ప్రేమమునఁ దప్పిపోవంగఁ బీల్చికొనియె.

22


వ.

అప్పుడు.

23

సీ.

నిరుపమానస్వయంవరమహోత్సవమును
        మధుపర్కసత్కారమంగళంబుఁ
గమనీయతరకరగ్రహణహోమంబును
        విహరణాగారప్రవేశవిధియు
నుభయబంధుభుజిక్రియోపచారంబును
        బ్రాస్థానికస్వస్తిభాషణంబు
హరణార్థసంభారహారికాకృతియును
        నగరసంవేశనానందకళయు


తే.

ననెడువృత్తాంతముల నొప్పునధిపచరిత
మాదిమధ్యావసానంబు లవధరించి
యమరముఖ్యులు గురియించి రలరువాన
యన్నిదినములు దా రున్కియచ్చుపడఁగ.

24


తే.

వికచపౌరాంగనాపాంగవీక్షణములు
హర్షితామరకృతపుష్పవర్షములును
గురియ నృపవీథి నరిగి భూవరుఁడు సొచ్చె
నీరజాక్షీసమేతుఁడై నిజగృహంబు.

25


ఇంద్రాదులు స్వర్గమునకు మరలుట

వ.

అట విబుధులు వృథాప్రయోజనం బైనవసుధాధావనప్రయాసఖేదం బనుభవించి పయోధిపాథస్తరంగంబులుం బోలె వచ్చిన త్రోవయ పట్టి మరలి రప్పుడు.

26


తే.

స్ఫటికభూమీధ్రములమీఁదఁ బ్రతిఫలించు
నర్కబింబంబులునుబోలె నమరవరులు
గనకరథములమీద నాకాశవీథిఁ
జారునైసర్గికప్రభాసౌష్ఠవమున.

27

వ.

చనునప్పుడు.

28


మ.

మెఱుఁగుందీఁగలచాయఁ గేతనము గ్రొమ్మించారుపీతద్యుతిం
గొఱలం జక్రవిఘట్టనంబునఁ బరిక్షుణ్ణంబులై మేఘముల్
పఱియ ల్వాఱఁగఁ గింకిణు ల్మొరయఁగాఁ బాఱె న్నభోవీథి న
త్తఱి జంభాంతకుతేరు మాతలికశాత్రస్తాశ్వవేగంబునన్.

29


తే.

మాటిమాటికి నాకాశమండలమున
నవల నివలఁ బయోవాహనివహమునకు
నమరనాథరథాలంబి యైనధనువు
భాసురస్ఫూర్తి విశ్రమాభరణ మయ్యె.

30


క.

ధళధళ మని జలములలో
బలరిపువజ్రాయుధంబు ప్రతిబింబింపం
గెలఁకుల దందడిఁ దిరిగెడు
జలధరముల కపుడు కులిశసంగతి గలిగెన్.

31


తే.

వర్ణితం బైనసావర్ణివంశమునకు
బట్టుగొడు గైనయంభోజబాంధవునకుఁ
గూడ నేతెంచుగారాపుఁగొడుకుచేతి
దండ మవ్వేళ నాలంబదండ మయ్యె.

32


ఆ.

అధికదూర మగుట నాకాశలక్ష్మికి
గర్ణపాశ మగుచుఁ గరము వొలిచె
దివ్యభవ్యకాంతి దేదీప్యమానమై
పాశపాణిపాణిపాశవల్లి.

33


తే.

పరివహస్కంధమారుతాస్ఫాలనముల
వీతిహోత్రుండు వర్తించువిధము చూచి

భీమనందన నీతఁడు పెండ్లియాడ
బోలు నని య యభ్రచరకోటి బుద్ధిఁదలఁచె.

34


జా.

క్షోణీవల్లభుముద్దుఁగన్నెను సుఁబల్కుల్ గ్రోలుకోలేమి ని
ర్వాణానందము లైనవీనులకుఁ దత్ప్రాయంబు గంధర్వరా
డ్వీణానాద మొకింత సమ్మదము గావింపంగ నింద్రాదిగీ
ర్వాణాధీశచతుష్టయం బరిగెఁ దారావీథి దూరంబునన్.

35


ఉ.

చిత్తములోనఁ బాయక వసించినభోజనృపాలకన్య న
త్యుత్తమరాజుఁ గూర్చి సుర లూఱటఁ బొందిరి యెంతయేనియుం
జిత్తములోనఁ బాయక వసించిననిర్మలతత్త్వవిద్య య
త్యుత్తమశిష్యుగూర్చి గురుఁ డూఱటఁ బొందినయట్టిలాగునన్.

36


సీ.

పక్షులు చరియించుపదవి సుల్లంఘించి
        ఘనములు దిరుగుమార్గంబు గడచి
విద్యాధరశ్రేణి విహరించుపథ మెక్కి
        కరువలి యేఁగెడుకక్ష్య సొచ్చి
గ్రహరాజు వాఱెడుఘంటాపథము దాఁటి
        చుక్కలు వొడ తెంచుచక్కి వెడలి
చదలేఱు ప్రవహించుచాయయు త్తరియించి
        ధ్రువమండలంబు పెంద్రోవ నడచి


తే.

యూర్ధ్వలోకంబునకుఁ బోవుచున్నవారు
భీమభూపాలసుతమీఁది ప్రేమభరము
వీడియును వీడ కాత్మ భావించువారు
వాసవుం డాదియైనగీర్వాణవరులు.

37

ఇంద్రాదులకు మన్మథుఁ డెదురుపడుట

మహాస్రగ్ధర.

కని రంతంత న్నభోమా
        ర్గమున ఘనతమస్కాండసందేహసంపా
దనలీలాజాగరూకా
        తనువికటతనూధామధూమాయితంబున్
వనరాశ్యంతస్తరంగ
        ధ్వనిసమధికదుర్వారకోలాహలంబున్
జనసందోహంబు భూషా
        చ్ఛవిధగధగితాశాకటాహోదరంబున్.

38


తే.

ఇరులు గవియుచు నేరాళ మెట్టయెదుర
నల్లనల్లన నేతెంచె నల్లమంది
గరిమ నాకాశచరుల కాకాశవీథి
గదలి యెదురుగ వచ్చెనో కాక యనఁగ.

39


వ.

ఆజనసమూహంబు ముందట.

40


సీ.

రతిదేవి నెవ్వీఁగు రారాపుఁజన్నులు
        గడకన్నులకు నింపు గడలుకొలుప
గడుసైనపూవింటఁ గూడి కమ్మనితూపు
        కటకాముఖపుఁగేలఁ గరము మెఱయ
గటిమండలంబుపైఁ గనకంపుఁజెఱఁగుల
        జిలుఁగుఁబచ్చనిపట్టుఁజేల మమర
నాలీడపాదవిన్యాసంబు శృంగార
        వీరాద్భుతములకు విందు సేయఁ


తే.

జిన్ని చిగురాకుఁజేర్కోలఁ జేతఁబట్టి
పేరుటామని రాచిల్కతేరు నడుప

సుక్కడీఁ డయి యేతెంచె నుక్కు మిగిలి
కలికిగారాపుఁజెలికాఁడు కలికి మరుఁడు.

41


ఉ.

చీకటితప్పునం బరులచేడియలన్ రమియింప దూతికా
లోకముమాటతీపులకు లోఁబడి భీత్యభిమానలజ్జలన్
బోకడఁబెట్టి ప్రాణ మొకపోకకుఁ గైకొనకుండుసాహసుల్
పైకొని చేరి త న్నుభయపార్శ్వములందున భక్తిగొల్చిరాన్.

42


తే.

బుద్ధదేవపరిస్పర్ధఁ బోలెఁ దాల్చె
లోకజిద్భావ మెవ్వాఁడు లోక మెఱుఁగ
నీశ్వరునిమీఁదఁ దగిలినయీర్ష్యఁబోలె
నతనుఁడై యేలె నెవ్వఁ డీయఖిలజగము.

43


వ.

అమ్మదనుండు త్రిభువనైకవీరుండు నాసీరగతుండై నభోమండలంబున గండుమీనుపడగ పొలుపారఁ జిగురుజగజంపుగొడుగునీడ వాడనివనమాల వక్షస్స్థలంబునం గ్రాల రతియును దానును నేతెంచిన.

44


తే.

నలునిఁజూచినపిదప మన్మథునిఁ జూడ
నాకనిలయులనయనంబు లోఁకిలించె
నయ్యరోచక మమరవైద్యద్వయంబు
దీర్పఁ జాలునొ చాలదో! తెలియరాదు.

45


క్రోధుఁ డెదురుపడుట

సీ.

కట్టెఱ్ఱనెరలదీర్ఘవిలోచనంబుల
        కడల నగ్నిస్ఫులింగంబు లురల
జృంభించి మిగులంగఁ జేవురించినమేనఁ
        బ్రస్వేదజలముఁ గంపంబుఁ బొడమఁ

గుటిలమై చిమ్మచీకటి సంఘటించుచు
        నిటలభాగమున భూకుటి నటింప
నత్యంతగాఢదంతాగ్రపీడనమునఁ
        దొట్టవాతెఱనెత్తు రుట్టిపడఁగఁ


తే.

గటములద్రువంగ మీసాలు గత్తరిల్లఁ
గంఠ కుహరంబునందు హుంకార మెసఁగ
నింగి నేలయుఁ దాటింప నంగలించు
పగిది నేతెంచెఁ గ్రోధంబు గగనవీథి.

46


స్రగ్ధర.

ఆక్రోశాక్రోశఘోషం
        బయి వికటకఠోరాట్టహాసాస్పదం బై
వక్రభూవల్లరీసం
        వలనభయద మై స్ఫారనిశ్వాసధారా
చక్రం బై రక్తరూక్షే
        క్షణ మయి విగతక్షాంతియై నిర్ణయంబై
యాక్రోధం బభ్రవీథిన్
        హఠగతి నమృతాహారులన్ ధిక్కరించెన్.

47


ఉ.

ఈసునఁ బుష్పసాయకునియేటునకుం గడుదూర మైనదు
ర్వాసుని నెమ్మనంబునఁ దిరంబుగ మన్నెము డన్ని రాజ్యసిం
హాసన మెక్కకుండఁ దను నాఁగిన క్రోధముఁ జూచి భీతిమై
వాసపుఁ డొయ్యనొయ్య నఱ వ్రాలిచె ఱెప్పలు వేయుఁగన్నులన్.

48


తే.

మండు నఁట దాను హృదయమర్మములఁ దవిలి
కన్నుఁగవ నంధకారంబు గవయు టెట్లు?

కాగ మొనరించు నఁట తా విరక్తి యెట్లు
తన ప్రభావంబు గ్రోధంబు తాన యెఱుఁగు.

49


మ.

భ్రుకుటీకాలభుజంగ రాజతరుణీఫూత్కారశంకావహా
ధికనిశ్వాససమీరణధ్వనులు సంతీక్ష్ణాగ్రదంతావళీ
శకలీభూతనిజాధరోష్ఠరుధిరస్రావప్రతిద్వంద్విర
క్తకటాక్షుల్ దనపారిపార్శ్వికులు గా దర్పంపుఁ బెంపేర్పడన్.

50


వ.

ఇ ట్లేతెంచె ననంతరంబ.

51


లోభుఁ డెదురుపడుట

తే.

హస్తములు విస్తరించుచు నఱ పలుకుచుఁ
గంఠగద్గది కావ్యక్తకాకువికృతి
రాలుపడి బం డ్లిగుల్చుచుఁ దీలుపాటుఁ
బ్రకటదైన్యంబుఁ దోఁప లోభంబు వచ్చె.

52


సీ.

కడుపుమండించునాఁకటిచిచ్చుసెగ దాఁకి
        గవరనై యున్న కన్గవలవారు
భోగించువారలఁ బుల్కుపుల్కునఁ జూచి
        మెల్లన గ్రుక్కిళ్లు మ్రింగువారు
కుక్షింభరిత్వంబుకొలఁది కగ్గలముగా
        గూఁ డెంత పెట్టిన గుడుచువారు
ప్రాణగొడ్డము లైన పరమసాహసములఁ
        బరులసొమ్ముల కాసపడెడువారు


తే.

పామునకు బలి వెట్టనిప్రతినవారు
[2]ఈఁగ కెన్నఁడు నే నిలి యిడనివారు

ధనముగాఁపున్నదయ్యాల దఱుమువారు
బలిసి లోభంబు నిరువంకఁ గొలుచువారు.

53


మ.

కమియం బాపము లొండు రెండు వరుసన్ గల్పింపఁగాఁ జాలు కా
మము క్రోధంబును నిచ్చ మెచ్చక యహంభావంబుతో నుండుఁ బం
చమహాపాతకసంగ్రహైకఘటనాచాతుర్యధుర్యంబు లో
భము లోభంబు గదా గుణద్విరదరాట్పంచాస్య మూహింపగన్.

54


సీ.

ఇన్ని యింద్రియములు నెవ్వానికి గృహంబు
        లట విశేషంబు జిహ్వాంచలంబు
సంప్రార్థనాదీనచాటూక్తి యెవ్వాని
        కాజన్మసంసిద్ధ మైనమతము
పాత్రహస్తములపైఁ బడుదానజలవృష్టి
        వారించు నెవ్వాఁ డవగ్రహ మయి
అన్యవిత్తాపేక్ష, యాత్మవిత్తాపరి
        త్యాగ మెవ్వనియంతరంగగుణము


తే.

జారచోరాదిధూర్తవిహారభూమి
దైన్యకార్పణ్యజలరాశిధవళకరుఁడు
కలిమహారాజు నెచ్చెలికాఁడు లోభుఁ
డతఁడు సురలకు జోహారు వనుచు మ్రొక్కె.

55


వ.

అనంతరంబ.

56


మోహుఁ డెదురుపడుట

మ.

తనకుం బట్టపురాణివాస మగుమిథ్యా దృష్టిచే సేతఁ గీ
ల్కొన హత్తించి విరించిముఖ్యదివిషత్కోటి న్విడంబించుచున్
ఘనమార్గంబున నేగుదెంచెను మహాకాయంబు మోహంబు మో

హనవిద్యాగమసంప్రదాయఘటనావ్యాపార మేపారఁగన్.

57


తే.

బాలు రాత్మకుటుంబజంబాలమగ్ను
లనధిగతశాస్త్రు లనధీతు లలసమతులు
దన్ను సేవింప మోహంబు దప్పుద్రోవ
నల్లనల్లన సురల డాయంగ వచ్చె.

58


సీ.

జ్ఞానప్రదీపికాఝంఝాసమీరంబు
        కామలోభక్రోధకారణంబు
సంసారకపటేంద్రజాలవిద్యాపింఛ
        యామ్నాయపదకంటకాంకురంబు
శూన్యవాతారణ్యశుండాలకలభంబు
        కుమతసిద్ధాంతవిభ్రమగృహంబు
బహుళఘట్టకుటీప్రభాతతిగ్మమరీచి
        యంధపరంపరావ్యాప్తసరణి.


తే.

కన్నులకు నిద్ర మదికి జో కన్ను ధృతికి
వినమి చెవులకు నెద్ది భావించి చూడ
నమ్మహామోహుఁ డెదురుగా నరుగుదేర
బ్రమసి చూచిరి వాసవాద్యమరవరులు.

59


వ.

అయ్యనసరంబున.

60


కలియెదురుపడుట

సీ.

పాతకంబులు నీలిపట్టుబొందడములు
        పగలింటినిద్రలు పచ్చడములు
పరదూషణంబులు ప్రాలంబహారంబు
        లన్యకాంతాసక్తి యంగరాగ

మీర్ష్యాపరత్వంబు హేలావతంసంబు
        బుధజనద్వేషంబు పువ్వుదండ
మిథ్యాప్రలాపంబు మృగనాభితిలకంబు
        బహులాశనత్వంబు పరికరంబు


తే.

పరులఁజూపులు వాకొల్పఁ బ్రసభలీల
రాసభాంగరుహాగ్రధూమ్రప్రకార
బర్బరాకారదేహు లంబరము నిండి
సరస వచ్చిరి కలిరాజుసైన్యభటులు.

61


వ.

ఆసుభటు లుభయపార్శ్వంబుల.

62


సీ.

కుండబొజ్జలక్రింద ద్రిండుగా బిగియించి
        గడితంపుమడుఁగులు గట్టినారు
బూజుపట్టినదేహములపైఁ దళంబుగా
        మలయజపంకంబు లలఁదినారు
నునుబట్టతలలపైఁ గనకంపుఁ జెఱఁగుల
        బట్టుచీరలు మూయఁ జుట్టినారు
కరమువ్రేలుడు లైనకర్ణపాశంబులఁ
        దోరంపుఁబోఁగులు దొడిగినారు


తే.

వెలయ మృగనాభి గీర్బొట్టు పెట్టినారు
పసిఁడిలాతాలు సేతులఁ బట్టినారు
చండముద్రాధరులు నభోమండలంబుఁ
బూరటిల బట్లు కలిరాజుఁ బొగడి పొగడి!

63


వ.

త్రైలోక్యంబును వినునట్లుగా నిట్లనిరి: ‘యాగఫలంబు పాషాణసలిలోన్మజ్జనంబు; దేశాంతరదేహాంతరకాలాంతరంబులం గర్మఫలభోక్త యాత్మ యనుమాట యసత్యంబు; వేదం

బప్రమాణంబు; వేదమర్మభేదంబునఁ గదా బోధిసత్త్వుండు సత్త్వహేతువుగా జగం బస్థిరంబని సమర్థించె నెద్దియెద్ది సత్తద్ది యద్దియధ్రువం; బగ్నిహోత్రంబుం ద్రయీతంత్రంబు ద్రిదండంబున్ భస్మగుంఠనంబు బుద్ధిపౌరుషహీను లగుపురుషులకు జీవితోపాయంబులు; స్వచ్ఛందంబు ధర్మంబు; కామదేవుండ దైవంబు; మరణంబె యపవర్గంబు; భస్తీభూతంబగు భూతంబునకుం బునరాగమనంబు గల దనుట భ్రాంతిగాదె? యామ్నాయంబు లేమి యెఱుంగు? నెఱింగెనేని “కోహి తద్వేద యద్యముష్మిన్ లోకే౽స్తి వా న వేతి” యని సందేహించునే యని వెండియు.

64


క.

తారు దముఁ గాచుకొనరే
యీరసమునఁ గావఁ బోదు రింతుల వంశా
చారస్థితి డాంభికు లగు
వారు మరుఁడు దమకెకాని వారికి లేఁడే?

65


క.

శతమన్యునంత ధర్మ
స్థితి యెఱిఁగినవాఁడు గలఁడె త్రిభువనమునయం?
దతనియహల్యాజారత
యితరులజారత కనుజ్ఞ యిచ్చుట గాదే?

66


క.

మారుఁడు దుర్వారుఁడు సం
సార మిది యనాది వంశసంరక్షణ మం
భోరుహవదనలచేతిది
యేరూపున జాతిశుద్ధి యేర్పఱుప నగున్?

67


క.

రాజానుమతము ధర్మము
రాజు నిశాకరుఁడు మీకు బ్రాహణులారా!

రాజు ప్రవర్తించిన పే
రోజన గురుతల్పగమన ముచితము మీకున్.

68


క.

ఏకార్యంబు సుఖోత్తర
మాకార్యము సేయ నర్హమగునెడ సుకృతం
బాకాంక్షింతురు సురతము
నాకాంక్షింప రది యేమి యవనీవిబుధుల్?

69


చ.

మలిచినరాలయందుఁ గుసుమంబులు వోయఁగ మీఁద నెన్నఁడే
ఫల మొకనాఁడు గల్లు ననుపల్కది యెవ్వడు నమ్మినాఁడు? కో
మలవనరాజిలోనఁ గుసుమంబులు గోయుట యొప్పు డప్పుడే
ఫలములు వోవొ పోవునొ యుపాసకులార! తలంచి చూడుఁడా.

70


తే.

అన్యదేహాప్తి సందేహ మైనయెడనుఁ
గలుషములు మాన నెబ్భంగి వలయునేని
విడుఁడు యాగంబు లో వేదవిప్రులార!
జంతుహింసామహాదోషసంశయమున.

71


తే.

స్మృతులయందు బలాత్కారకృతము లెల్ల
నకృతములుగా విధించినాఁ డట్టె, మనువు
బలిమి బ్రాహ్మణులార! పాపములు సేయుఁ
డేమి సేసినఁ జేయ రయ్యెదరు మీరు.

72


సీ.

ఐకమత్యంబు లే దఖిలశాస్త్రములకు
        నిగమంబు లొకజాడ నిలువ కాడు
నాగమంబులత్రోవ యది యొండుచందంబు
        పంకంబులోని కంబంబు తర్క

మతిగూఢమై యుండు యామళంబులచాయ
        యుపనిషత్తుల భావ మొక్కరీతి
బహువిధంబులు మంత్రపారాయణంబులు
        సాంఖ్యయోగములవాసనలు వేఱు


తే.

పట్టి యేదర్శనం బైనఁ బ్రతిభకలిమి
వలసినట్లు వక్కాణింప వచ్చి యుండు
నరసి దుఃఖంబు లేక సౌఖ్యంబు కలుగు
ధర్మ మొకఁ డేరికొనుఁడు విద్వాంసులార!

73


తే.

అస్మితాబుద్ధి గలదేహ మనలశిఖల
భస్మమై పోవ నెచ్చోటఁఁ బాప ముండు?
సౌఖ్యదము లైనపరదారసంగమాది
పాపములు సేయుఁడోపినభంగి జనులు!

74


క.

మృతుఁ డఁట పుట్టుఁ బెఱుంగును
మృతుఁ డఁట వేఱొకఁడు గుడువ మేకొనుఁ దృప్తిన్
మృతునకు నఁట కర్మఫలం!
బతిధూర్తులవార్త లేటి కావర్తింపన్?

75


ఉ.

చీటికి మాటికి న్నిఖిలజీవులునుం బొనరించు పాపముల్
గోటులు దన్నుఁ జుట్టుకొని ఘోరపుబాధలఁ బొందు చొంటి మైఁ
బాటిలునాత్మకున్ భరమె పాపము నీయది? నిండుబండికిం
జేట భరంబె? యేమిటికిఁ జేయవు విప్రుఁడ! కిల్బిషంబులన్?

76


చ.

కలుగుట లేమి సందియము కార్యఫలంబులయందు నిట్టిచో
ఫల ముదయించె నేని దమపాలిటివేల్పులు మంత్రతంత్రశ
క్తులును తదీయలాభమునకుం దగుహేతువు లందు రన్యథా
కలనకు నంగలోపములు గారణ మందురు మాంత్రికాధముల్.

77

తే.

అర్థి నార్జింప వర్జింప నలవి గాని
ధర్మము నధర్మమును జెప్పెఁ దగిలి మనువు
నేరములు వెట్టి దండువు నిశ్చయించి
ధరణిఁ గలచోట నర్థ మెత్తంగఁ దలచి.

78


శా.

లాలామూత్రపురీషఘర్మజలకీలాలాత్మికల్ భామ లం
చేలా రోఁతలు పుట్ట నాడుడురు యోగీంద్రుల్ వృథాలాపముల్?
లాలామూత్రపురీషఘర్మజలకీలాలాత్ములో తారటే
ప్రాలేయాంబుపటీరపంకఘనసారక్షౌద్రదివ్యాత్ములో.

79


వ.

పురాణంబు ప్రమాణీకరింతు మేని తత్ప్రణేత పారాశర్యుఁడు పాండవులనగర చాటుకవి; కవులమాటల కేటి పాటి? మత్స్యపురాణంబునందు మత్స్యంబు వక్తయఁట? తిర్యగ్జంతుమతంబులు సిద్ధాంతీకరింపవచ్చునే! యది యట్లుండె.

80


సీ.

దిననాథనందనుఁ దిత్తొల్చి విడిచిరి
        కరుణలే కెముక లేరిరి దధీచిఁ
బాతాళబిలమున బలిఁ గట్టి వైచిరి
        జీమూతవాహను జీవి వాపి
రెత్తి పా ల్గొనిరి శిబీంద్రునంతటివానిఁ
        గలగుండు వెట్టిరి కలశవార్ధిఁ
దివుటఁ జుక్కలఱేని దినగోరు మెసఁగిరి
        పండు డుల్చిరి కల్పపాదపంబు


తే.

నయ్య లెంతకు నేర రర్థార్థిజనులు
వీరిమనసులు వట్ట నెవ్వారితరము?

కీర్తి యిటు వెల్గు నండ్రు దాక్షిణ్య ముఱరు
దారు గల్గినఁ బదివేలు దమకుఁ గలవు.

81


తే.

శాంతమతిఁ గాముకత మాని సప్తతంతు
దీక్ష గైకొన్నవారలతెఱుఁగు లెస్స
స్వర్గమున కేఁగి రంభాదివారసతుల
కుచభరంబులపై వ్రాలఁ గోర రేని.

82


తే.

ఆహవంబున మృతు లైనయట్టివీరు
లమరలోకంబునకుఁ బోదు రనుట గల్ల
నిజమయేని దైత్యారిచే నిహతిఁ బొంది
యతనితో విగ్రహింపరే యసురు లచట?

83


క.

అక్షచరణుండు చెప్పిన
మోక్షములు శిలాస్వరూపములు వీనికిఁగాఁ
బ్రేక్షావంతులు దచ్ఛా
స్త్రాక్షరములు చదువ నేల యతిబాలిశులై?

84


ఆ.

దైన్యమునకుఁ ద్రోవ దలఁప నస్తైన్యంబు
గుక్షివంచనంబు గడు పుడుగుట
బుద్ధి యైనయట్ల భోగింప నేర్చుట
సార మైనబోధిసత్త్వమతము.

85


తే.

క్రోధనులు దారు పరుల కక్రోధశిక్ష
సేయుచుందురు కపటవసిష్ఠమునులు
తారు నిర్ధనులై యుండి ధాతువాద
మొకరికిం జెప్పువిప్రలంభకులు వోలె.

86


తే.

కలవు విధ్యర్థమంత్రభాగములు మూఁడు
శ్రుతుల నామూఁటియందు మీమతికి నెక్క

నర్థవాదాంశ మఖిలంబు ననృత మయ్యె
నట్ల యగుఁ గాక మంత్రవిధ్యంశములును.

87


వ.

అని యీప్రకారంబు వాచాటు లై టిట్టిభంబులుంబోలెఁ గర్ణకంటకంబు లైనదుర్వర్ణంబులు వేదంబు ప్రమాణంబు గా దనియును నాగమంబుల నగడు నేసియు ధర్మంబుల మర్మంబు లుచ్చి పో నాడియు పురాణంబులఁ ద్రాణలు సెఱిచియు నితిహాసంబుల నపహసించియు యామళంబులం గలంచియుఁ జన్నంబులఁ జిన్నవుచ్చియు మంత్రపారాయణంబులఁ దృణీకరించియుఁ గలికిఁ గౌతూహలంబును జైనులకు సమ్మానంబును బౌద్ధులకు నుధ్ధతియును జార్వాకులకు నిర్వృతియు లోకాయతుల కుత్సేకంబును బాషండులకుం జెవులపండువును గాపాలికుల కుపకారంబునుం గాఁ గైవారంబు సేయుపాఠకులం గనుంగొని శక్రుండు సక్రోధుండును వరుణుం డరుణలోచనుండును నగ్ని యుద్విగ్నమానసుండును గృతాంతుం డత్యంతరోషుండును నై యయ్యాశాపతులు నలువురు నల్గిక్కు మొగంబై “యోదురాత్ములారా! యేమిదుర్భాషణంబు లాడెదరు? దంభోళిధారాసంరంభంబును బాశవల్లీసముల్లాసంబును సముజ్జ్వలజ్జ్వాలాకరాళతయు నుద్దండగదాదండతాండవంబును నెఱుంగరె? యేల ప్రేలెదరు? పుత్రకామేష్టి శ్యేనకారీరీ ప్రముఖంబు లగుమఖంబులు దృష్టఫలంబు లగుటం గన్నులం గానరే?యావేశంబున గయాశ్రాద్ధాదు లపేక్షించు భూతంబులం జూచి పుణ్యఫలంబులు తెలియ రావె? యంగారప్రవేశంబు దేహంబులు పొక్కకుండుట నేత్రోత్పాటనంబునఁ గన్నులు

వచ్చుట యాదిగాఁ గలవిశేషంబుల దేవతాప్రభావంబులు భావింపం దగదె? యివ్విధంబునం బ్రల్లదంబు లాడెదరు గాన మిము నాలుకలుఁ గోయక సెలవులు వ్రీల్పక ప్రాణంబులు గొనక యెట్లు సైరింపవచ్చు?" ననిన భయం బంది యవ్వందిజనంబులు బృందారకులకు నమస్కరించి యి ట్లనిరి.

88


మ.

బలభిద్వహ్ని యమప్రచేతసులకుం బ్రహ్మాయు వే మెల్లనుం
గలిభూపాలునియొద్దిపాఠకుల మీకైవారదుర్భాషణం
బులకుం గాని యతండు మెచ్చఁడు దయాబుద్ధిం పరాధీనవృ
త్తుల నిర్పేదల మముఁ గావఁదగు నీద్రోహంబు లేకుండఁగన్.

89


సీ.

వందిజాతులము మావాచాటతాటోప
        మునకు నల్గకు మయ్య యనిమిషేంద్ర!
యనపరాధులము మాయందు నక్కటికంబు
        పాటింపు మయ్య కృపీటజస్మ!
పరతంత్రులము మాయబద్ధవాక్యములకుఁ
        దప్పు పట్టకు మయ్య ధర్మరాజ!
యాశార్తులము మా యహంకృతిస్ఫురణకు
        నెరసు లేరకు మయ్య వరుణదేవ!


తే.

భయము గొందుము నిర్ఘాతపాతమునకు
దలఁకుదుము భీషణోల్కాప్రవాహమునకు
జంచలింతుము పటుదండచండిమలకుఁ
బగులుదుము పాశవల్లరీబంధములకు.

90


వ.

అని యంజలిపుటంబులు లలాటంబున ఘటియించి యచ్చాటుకారులు గైవారం బుడిగి యూరకుండి రనంతరంబ.

91

ఆ.

గగనమండలమునఁ గాలాయసపుఁదేర
మాలకాకి పడగ దూలి యాడ
ద్వాపరంబ దానుఁ దన్మధ్యవర్తియై
వచ్చువాని నీలవర్ణదేహు.

92


సీ.

కఱకు లై పెరిగినకుఱువెండ్రుకలతోడఁ
        బట్టయౌదలఁ గావిపాగ యమర
నిగిడి పూఱేకు బాగుగఁ గత్తిరించిన
        గడ్డంబుకొన రొమ్ముఁ గమ్మిరింప
బండికందెనతోడఁ బ్రతివచ్చు మైచాయ
        నీలిపచ్చడముతో మేలవింప
నవరత్నచందనద్రవకల్పితం బైన
        నూత్నత్రిపుండ్రంబు నొసల నొప్పఁ


తే.*

గోఱమీసలు మిడిగ్రుడ్లు కుఱుచపొడవు
డొప్పచెవులును గొగ్గిపండులును గలిగి
యున్న మద్గ్రీవుఁ డై వచ్చుచున్నవానిఁ
గలిమహారాజుఁ గనిరి దిక్పాలవరులు.

93


క.

హేలాబృందారకుఁ డగు
నాలవయుగరాజు గాంచి నయనాంబుజముల్
వ్రాలిచిరి నిర్జరేంద్రులు
మాలనిఁ గనుఁగొన్న యుత్తమద్విజులక్రియన్.

94


తే.

ప్రౌఢగురుకోపరీఢావలీఢుఁ డైన
యాత్రశంకుండువోలె జంభారియెదురఁ
గాంతిసంపద గోల్పోయి కలియుగంబు
సాధ్వసాతిరేకంబున జలదరించె.

95

వ.

ఇట్లు ప్రభావోపనమ్రుఁడై ప్రణిపాతంబు సేసి.

96


తే.

నేమమే నిర్జరస్వామి? శిఖి! సుఖంబె?
శర్మమే నీకు నోయమధర్మరాజ?
స్వస్తియే పాళహస్త? మీ ప్రస్తవమునఁ
దగ నపాస్తరజస్తమస్తముఁడ నైతి.

97


వ.

దమయంతీస్వయంవరంబునకుఁ బోవుచున్నవాఁడఁ గాలాతిపాతంబుగాకుండ నన్ను వీడ్కొలుపుడు నామనోరథంబు సఫలం బగునట్లుగా ననుగ్రహంబు సేయుండు మీయాశీర్వాదంబునం గ్రథకైశికాధీశ్వరతనూభవ వివాహంబై మిమ్ము దర్శింపంగలవాఁడ నని పల్కుటయు.

98


క.

వా రన్యోన్యంబు ముఖాం
భోరుహములు సూచి నేత్రముల జిఱునగవుల్
దేరఁగ నిట్లనిరి యహం
కారగుణాంకురితబహుళగలికిం గలికిన్.

99


సీ.

తగు నయ్య! కలిరాజ! తగవుధర్మము దప్పి
        యాడునె యిట్లు నీయంతవాఁడు?
పరమేష్ఠి నైష్ఠికబ్రహ్మచారిగ నిన్ను
        నా డెఱుంగఁగఁ జేసినాఁడొ లేదొ?
యవకీర్ణియని నిన్ను నవధరించినయప్డు
        ద్రోహిగాఁ దలఁపఁడే ద్రుహిణుఁ డాత్మ?
నీశ్వరాజ్ఞాసేతు వెట్లు దాఁటఁగ వచ్చుఁ
        దదధీనులకు నన్యథాకరించి?


తే.

మాకుఁ జూడంగ నిది యసమంజసంబు
మిన్న కరుగుము కాదు నీకన్న తెఱఁగు

సత్వరంబునఁ బరుల కిచ్ఛావిఘాత
మాచరింపరు కృతబుద్ధు లయినవారు.

100


వ.

త్రిభువనానందమాకందవాటికావసంతంబైన యవ్వృత్తాంతంబు సరికడచె నచ్చోటనుండియ కదా మేము మరలివచ్చుచున్నవారము సానురాగు లగునాగులం బరిత్యజించి యనల్పు లగు వేల్పుల నధిక్షేపించి యసమాను లగురాజమానులం దృణీకరించి యన్నళినాక్షి నలుండనువాని వరించె నేమి సేయవచ్చు? నీశ్వరాజ్ఞ బలీయసి, నీవును మాతోడివాఁడవ కదా, మరలి రమ్మనవుడు రోషాంధుండై యక్కలిరాజు దివిజరాజుల కిట్లనియె.

101


తే.

పద్మజున కేమి? మీకేమి? పరుల కేమి
యంగనాపరిభోగలోలాత్మకులకు?
నైష్ఠిక బ్రహచారి యై నష్టిఁ బొంది
చేరుగడ లేక కలి చెడం జెడియెఁగాక.

102


వ.

ఏకపత్నీవ్రతస్థు లైనమీరేల దమయంతిం గామించి పోతిరి? ధర్మంబు పరుల కుపదేశింపవచ్చుంగాక తమకుం జేయవచ్చునే? పోదురు గా కేమి? మీయందు నొక్కరుం డక్కొమ్మ వరియింపఁగలిగెనే? నిషధరాజు భోజకన్యక వరియింప మీరు లజ్జవరియించితి రింతియకాక యేమి? మిమ్ముం గడకంటం జూచుచు నెమ్మొగం బోరపుచ్చుచు నటఁ గడచి యప్పణఁతి యెట్లు చనియె? మీ రెట్లు సహించితి? రిది యసంగతంబు, చిత్తంబులు చిలివిలివోవ నఱ్ఱెత్తి మీరు సూచుచుండ నమ్మత్తకాశిని మనుష్యు నెట్లువరియించె? మీయంతవార లపేక్షించియుండ నప్పదాక్షి నతిసాహసంబున నవ్వైరసేని యెట్లు

చేకొనియె? నతండు చేకొనినం గొనియెఁ గాక యీకృపీటయోని యతనివివాహంబునం గూటసాక్షియై కైలాటంబు సేసి యప్పాటం దనకుం బెండ్లి ఘటింపంజేయ నావటంబై యుండునట్లు సేయక హుతం బెట్లు పరిగ్రహించె? మహానుభావులగుమీరు భావంబుల నిట్టియభిమానభంగం బెబ్భంగి నంగీకరించితిరో కాని ననుబోఁటికి నియ్యపవాదకందళి చందురునియందుఁగందునుంబోలే డెందంబునం బాయదు. మీయందఱకు నొక్కవిన్నపం బనుగ్రహించి వినుం డవ్వసుమతీశు మోసపుచ్చి యమ్మచ్చెకంటి నెత్తుకొని మింటిమీఁదికిం దెచ్చెద నప్పుడు మీకడకంటికిం గెంపు రాదు గదా! మహాలాభంబుపట్టున నీర్ష్యారోషంబు లెట్టివారికిం బుట్టు ననాదికాలప్రవృత్రంబులైన రాగద్వేషంబులు భేదింప నెవ్వరికి శక్యం బగు? నది యట్లుండె మఱియొక్కయుపాయం బవధరింపుఁడు, పాక శాసనుండు పావకుండు పరేతపతి పాశహస్తుండు పంచముండ నైనయేను నియ్యేవురముం బాండవులు పాంచాలినిబోలెఁ బంచికొని యసుభవింతము గాని యప్పంకజాక్షిం బట్టికొనివత్తునే? యని పరమకపటోపాయమాయాప్రయోగపరిపాటీపాటవంబు దేటపడ బహుప్రకారంబులం బలికిన.

103


ఆ.

హరిహయాది విబుధు లక్కలిమూర్ఖతా
ముఖరతావికారములకు ఱోసి
కడఁగి పలికి రపుడు గంభీరభారతీ
భారతీవ్రమైనభాషణముల.

104

సీ.

అర్హ మెవ్వనిరూప మంగసంభవరాజ్య
        రుక్మసింహాసనారోహమునకుఁ
గడుగు నెవ్వనికీర్తి కార్తికీతిథినిశా
        నాథబింబంబు నెన్నడిమికందు
భవన మెవ్వనిప్రతాపప్రదీపమునకుఁ
        బుండరీకభవాండమండలంబు
చుట్ట మెవ్వనికేలు సురభిచింతారత్న
        రోహణాచలవారివాహములకుఁ


తే.

గలుష మెవ్యానిఁ దలఁచినఁ గ్రాఁగిపోవుఁ
బుణ్య మెవ్వానిఁ గీర్తింపఁ బొడవువడయు
వాఁడు నిషధేశ్వరుండు మా పరుసవాఁడు
కలిమహారాజ! మన్నింతు గాక వాని.

105


ఉ.

మచ్చిక వీరసేనునికుమారునకుం బరమోపకారికిన్
మెచ్చి జగం బెఱుంగఁ దమనెయ్యపుఁజెల్లెలి నిండుఁగొల్వులో
నిచ్చితి మింతలోపలనె యింతటివారముఁ దప్ప నేర్తుమే?
యచ్చపలాక్షి గూఁతు రతఁ డల్లుఁడు మాటలు వేయు నేటికిన్.

106


ఆ.

ఏము నలువురందు నెవ్వాఁడు గాఁ జాలు
నిచ్చిపుచ్చుకొన్న యీలగ్రద్ద?
మాకు నింపు గావు మాను మీసుద్దులు
కలహములమొగంబ! కలియుగంబ?

107


క.

పామరతఁ బట్టఁ బాఱకు
పామర! కలిరాజ! నిషధపతి మదలీలా
పామరసావేశంబునఁ
బా మరవిందారిఁ బట్టఁ బాఱినభంగిన్.

108

క.

కాలోచిత మగుకార్యం
బాలోచితముగ నొనర్పు మది మేలు విరు
ద్ధాలాపంబులు పలుమఱు
నేలా పచరింప నిపుడు? హేలానిమిషా!

109


వ.

అని తమలోన.

110


క.

పోయెడుఁ బో యిప్పుడు తా
ర్తీయీకయుగంబునుం దురీయయుగంబున్
దోయి యయి నలున కుపహతి
నేయంగా లేరు వానిశీలముకలిమిన్.

111


క.

యుగశేష మశేషమహీ
జగదవనపరాయణుండు సమధికబాహా
యుగళీయుగపదుపార్జిత
జగతీవిజయుండు నలుఁడు సామాన్యుండే?

112


వ.

అని వెండియు నాఖండలాదులు “పరోక్షప్రియా దేవా” యనుపురాణవచనంబు గారణంబుగా నిగూఢప్రౌఢనిజభాషణవిశేషంబున.

113


తే.

'యామితి త్రేత్యసజ్ జ్ఞాన మమరశేష
రాజసంస ది హాస్యతాం రహా తమాంసి
తత్ర మా గాస్త్వ మితి గతో ద్వాపరేణ
రాజసంసది హాస్యతాం ప్రథమ' మనిరి.

114


వ.

మఱియు బహుప్రకారంబుల బుద్ధి సెప్పియుం బ్రియంబు వలికియు హెచ్చుఁ గొండాడియు బృందారకులు గలిద్వాపరంబుల భూలోకగమనంబు ప్రతిషేధించిరి. ఇట్లు ప్రతిషేధించినను వారిసుభాషితంబు పెడచెవులం బెట్టి మోర

కంబును సాహసంబును మదంబును నమాయయు నవివేకంబుఁ దనకు నైజగుణంబు లగుటం గలియుగంబు కరయుగంబు మొగిచి యిట్లనియె.

115


ఉ.

వేలుపులార! మీకుఁ బదివేలనమస్కృతు లాచరించెదన్
మేలు దలంపుఁ డే నవనిమీఁదఁ జరించెదఁ గొంతకాల ము
ద్వేలత నెవ్వఁడే నొకఁడు దేశములోన నధర్మవర్తియై
వ్రాలినవాఁడు లేఁడె పలువంకల నారసి చూడ వచ్చినన్?

116


తే.

వానిదుర్వృత్తి నెపముగా వసుధ యేలు
నలునిపైఁ బ్రత్యవాయంబు గొలుపువాఁడఁ
గొలిపి యతనిఁ బ్రవేశించి నిలుచువాఁడ
నిలిచి యాతని మననీక యలఁచువాఁడ.

117


మ.

వినుఁడీ నాదుప్రతిజ్ఞ వేల్పులు! జగద్విఖ్యాతచారిత్రు నా
తని నేఁ బట్టెద నెద్దియేని యొకరంధ్రం బబ్బెడుంగాక యే
ననువేలంబును గొల్చుదేవతలు రాలా యేమి? యావంతత
ప్పున వైనం గలి సొచ్చుఁగాని మయిమైఁ బోనిచ్చునే యెవ్వరిన్?

118


తే.

ఆవగింజలు దాటికాయలుగ నాడి
దొడ్డ సేయుదు సన్నంపుదోస మైన
హరిహరబ్రహ్మ లైననాయంతవారె
కపటమాహేంద్రజాలాదికౌశలమున?

119


క.

కాదంబరిఁ ద్రావింతును
జూదం బాడింతు వలలఁ జొక్కులఁ బెట్టం
బైదలుల నియోగింతును
వైదర్భతనూజమీఁదివల పుడిగింతున్.

120

తే.

వేయుమాటలు నేల? యో విబుధలార!
యవధరింపుఁడు నిజము మీయడుగులాన
భైమితో భూమితో బెడఁ బాపువాఁడ
నిమిషమాత్రంబునంద యానిషధపతిని.

121


వ.

అని పలికిన నెమ్మనంబులం గుత్సించుచు నతని యుత్సాహంబు దైవకల్పితంబు గావున నన్యథాకరింప నలవి గాక నాకవప్రముఖు లగుబర్హిర్ముఖు లన్యోన్యముఖావలోకనంబు సేసి మనకుం గలిరాజుతోడ సంవాదం బింతియ చాలు, తమ్ముండు నన్నయు నగుకలిద్వాపరంబులు బ్రహ్మలోకంబుననుండి యాబ్రహ్మనియోగంబునం బోవుచున్నవారు గావలయుఁ బాఱెడునీళ్లకుం గట్టపెట్టం బని యేమి? 'పొదండు పొదం డ'ని పోయిరి. కలియును, గామక్రోధలోభమోహపరివారపరివృతుండై నిషధదేశంబుచాయన భూమండలంబునకు డిగ్గె నప్పుడు.

122

నిషధదేశంబునఁ గలిపురుషుని దుర్వర్తనము

సీ.

[3]హోమాగ్ని ధూమోర్మి కుద్వేగ మొందుచుఁ
        గ్రతుధూమములచేత గాసిపడుచు
నతిథిపాదక్షాళనాంభఃప్లుతము లైన
        గృహమేధిమందిరక్షితితలముల
జీరువారుచుఁ బూర్తశిశిరానిలంబులఁ
        జలివట్టి వణఁకుచు సవనశుష్మ
ఫుటపాకములవెక్కఁ బురపురం బొక్కుచుఁ
        బశుబంధములఁ జూచి భయముపడుచు

తే.

వ్రతులబృసులకు యతికోటిరాంభములకు
బ్రహ్మచారులయాషాఢపంక్తులకును
నంతరంగంబులో నాత్మహననశంక
తరతరమె యుద్భవిల్లంగఁ దల్లడిలుచు.

123


సీ.

సవనయూపస్తంభసంభారములఁ జూచి
        శూలంబులో యని స్రుక్కి స్రుక్కి
భూదేవనిటలోర్ధ్వపుండ్రంబు లీక్షించి
        ఖడ్గంబులో యని కలఁగి కలఁగి
బ్రహచారిజనోత్కరంపుమౌంజులు సూచి
        పాశంబులో యని బ్రమసి బ్రమసి
యధ్వరస్రుఙ్నికాయంబు లాలోకించి
        యురగంబులో యని యులికి యులికి


తే.

విప్రనికరం బనుష్ఠానవేళలందుఁ
బాణిపంకేరుహోదరాభ్యంతరమున
నిలిచి యెత్తినయాచమనీయతీర్థ
జలము శాపోదకం బని యలికి యలికి.

124


సీ.

ఆత్మ ఘాతకుఁ జూచి హర్షింపఁగా నేల?
        యతఁడు సర్వస్వారయజ్ఞకర్త
బ్రహఘ్నుఁ గని యేల పరితోష మందంగ?
        నాతఁడు సర్వమేధాభిరతుఁడు
బ్రహ్మచారీత్వరీరతి కేల మోదింప?
        నది మహావ్రతదీక్ష కంగకంబు
విప్రులమధుపానవిధి కేల యలరంగ?
        సౌత్రామణీష్టియాజకులు వారు

తే.

ధూళిధూసరుఁ బరికించి యేల నిక్క?
పావనస్నానవిధిమృదాభవ్యుఁ డాతఁ
డనుచు మూఁడవయుగము దన్నచట నచట
భ్రాంతిఁ దీర్పఁగ గతిలేక భంగపడుచు.

125


వ.

నిషధదేశంబులోఁ జనువాఁడు మఱియును.

126


తే.

స్నాతకులఘాతుకులఁగాఁగ సంస్మరించు
నహితులకుఁబోలె వెఱచునగ్న్యాహితులకు
దలఁచు దాంతుఁ గృతాంతుఁగాఁ గలియుగంబు
మానితం బై నయమ్మహీమండలమున.

127


సీ.

బౌద్ధులఁ బాటించుఁ బరమబంధులఁబోలెఁ
        జార్వాకులకుఁ గరాంజలి ఘటించు
జైనులంబొడగన్న సంతోషమునఁ దేలుఁ
        జే యని మ్రొక్కు లోకాయతులకు
వైతండికుల కభివాదనం బొనరించుఁ
        బాషండులకుఁ జాల భక్తిసేయుఁ
గాపాలికులకు సత్కారంబు గావించు
        బరిచయించును దిగంబరులతోడఁ


తే.

బాశుపతకక్షపాలికాభస్మధూళి
పాళి యుద్ధూళనక్రియావేళయందు
గాలివెంబడిఁ బై రాలఁ గళవళించుఁ
గలియుగము పావకస్ఫులింగంబు లనుచు.

128


క.

వేగుంబోకల మేల్కని
భాగవతోద్గీయమానభగవద్గీతా

రాగంబులు విని మది ను
ద్వేగంబు వహించుఁ జేఁదు దిన్నవిధమునన్.

129


సీ.

అప్పరాకుఁడు పరాకమ్మగా రేతెంచు
        త్రోవకు దూరంబు తొలఁగిపోవు
నాదోసకారి సన్న్యాసి దవ్వులఁ గాంచి
        యోలంబునకు దారియొదిఁగి యుండు
నాపాపజాతి మాసోపవాసిని నీడ
        లంఘింపఁ బోయి కా ల్నలియఁ గూలు
నావెనుగొఱుకు యాయావరవ్రతధారిఁ
        బగదారి యని డస్సి పండ్లు గొఱుకు


తే.

నానృశంసుండు నుసుఁగు వైఖానసులకు
నాదురాత్ముండు శ్రోత్రియు నపహసించు
నాఖలుఁడు సోమయాజి నిరాకరించు
నక్కిరాతుఁ డనుష్ఠాత ధిక్కరించు.

130


శా.

ఆనిర్భాగ్యుఁడు గాళరాత్రి యని హాహాకారముం జేయుడెం
దాన న్సాధ్వస మంది బ్రాహ్మణులు సంధ్యావేళఁ జేతస్సమా
ధానం బొప్పగ నావహింప నుదయత్సప్తాశ్వబింబంబులోఁ
గా నాకాశపథంబు నిండికొని శ్రీ గాయత్రి యేతేరఁగాన్.

131


తే.

జినగవేషణనిరతుఁ డాచెట్ట సూచు
[4]నభినవబ్రహ్మచారిచయంబు నెదుర
క్షపణకాలోకనార్థి యాఖలుఁడు గాంచు
నక్షపణకేళి రాజసూయాధ్వరమున.

132

మ.

యజమానప్రమదావికస్వరభగన్యస్తాశ్వదీర్ఘస్మర
ధ్వజదండం బగునశ్వమేధమఖతంత్రంబు న్నిరీక్షించి యి
క్కుజనుం డొత్తిలి నవ్వె వేదవిదులం గుత్సించి పుష్పాస్తుచే
నిజహస్తంబున వ్రేసి యశ్రుకణముల్ నిండార నేత్రంబులన్.

133


వ.

ఇవ్విధంబున.

134


ఉ.

బాండికమండలీప్రకృతిబంధుఁడు బంధకికాప్రియుండు పా
షండసఖుండు జైనతరుషండవసంతుఁడునుం దిరన్కృత
స్థండిలశాయియుం గపటధార్మికమిత్రుఁడు నైవివింద్యక
ర్ముం డతఁడుండెఁ గొన్నిదినము ల్నిషధావనిమండలంబునన్.

135


మ.

కలికాలంబు విదర్భరాజతనయాగాఢాంకపాళీమహో
త్కలికాలంబుఁడు సంచరించె నిషధక్ష్మామండలి న్మార్గభూ
నలనిగ్రాహిణి యైనపారిషదసైన్యశ్రేణి దర్పోధ్ధతిన్
నలనిగ్రాహిణియైనయాత్రకు సముల్లాసంబు సంధిల్లఁగాన్.

136


వ.

ఇవ్విధంబునఁ గలియుగంబు దిరిగితిరిగి యెప్పట్టునం బాపంబు రూపింప లేక యొక్కచోట నేకాంతంబునం దమయంతవట్టువారినిం గూడి మంతనం బుండి “రంధ్రాన్వేషణంబులంగాని దోషంబులు గానంబడవు, రంధ్రాన్వేషణంబులు గాలక్రమంబునం గాని ఫలింపనేరవు, గావున ద్వాపరం బదేశంబున వివాదలేశంబు లరయునది, నాకుం గామక్రోధలోభమోహంబులకును వేఱువేఱ యధికారంబులు పాలు వెట్టెద, నవి యెయ్యవి యంటేని.

137


సీ.

యతి మాచకమ్మ గొడ్రాలు దీక్షాపత్ని
        మగనిఁ బాసినయింతి మరునిపాలు

తీర్థవాసులును మాంత్రికులు దాయాదులుఁ
        దర్కవాదులును గ్రోధంబుపాలు
యజనదీక్షితులు నధ్యయనపాఠకులును
        భస్మగుంఠనులు లోభంబుపాలు
బాలవైతండికపామరాహంకార
        చుంబకమతులు మోహంబుపాలు


తే.

కేళిసౌధమహాచంద్రశాలయందు
హంసతూలికపాన్పుపై నహరహంబు
నవవధూకేళివిహరోన్మత్తుఁ డైన
నిషధనాథుండు నాపాలు నిక్క మరయ.

138


వ.

అని యందఱ నియోగించి.

139


ఉ.

కాకపతాకతో ఘనసృగాలకిశోరకరథ్యపంక్తితో
గీకసఫాలికాఘటితకింకిణికావలితోడఁ గూడి భ
ల్లూకపకృత్తికౢప్తమగులోహశతాంగముఁ గొంచుఁబోవ నా
జ్ఞాకృతిఁ బంచె నప్డు నిజసారథి యైనదురాత్ము దుస్సహున్.

140


వ.

పంచి యనంతరంబభ యన్నిర్దయుండు దానును గర్దభధూళిలగ్నంబున నిషధనగరంబుఁ బ్రవేశించి సంధ్యాకాలంబున మసకమసక చీఁకటిం గుఱుమాపుడుం బుట్టంబు ముసుంగు వెట్టికొని పెడతెరువున శూన్యభవనద్వారవేదికావిటంకంబుల విశ్రమించుచు దేవమందిరప్రాంగణంబులకుం దొలంగి వేశవాటంబునడుమ నొయ్యన నడచి యట మలంగి దురోదరక్రీడావినోదంబుల ననుమోదించుచుఁ గాదంబరీగృహంబు లొరసికొనుచుఁ జైత్యంబులు గడచి శృంగాటకంబులు దాఁటి దూరంబు చని నిభృతప్రకారంబున నృపా

గారంబు డాసి యచ్చేరువం గేళిసౌధంబు కెలన శిలాప్రాకారపరివృతంబై నందనవనంబునకు విందనం జాలి చాలం జెన్నొందుమందిరోద్యానంబు దఱిసి నెత్తమ్మికొలని కుత్తరంబునఁ గేళాకూళికిం బడమటఁ గుటజకురంటకఝింటికాసర్జఖర్జూరకేతకీషండమండలంబులోనం గాఱుకొని గాలికిం దూఱరానియొక్కయీరంబు సొచ్చి యచ్చట.

141


శా.

సంతోషంబున నాశ్రయించె విలసచ్ఛాఖోపశాఖాశిఖా
సంతానోదయచుంబితాంబరదిశాచక్రంబు భూపాలశు
ద్ధాంతారామరమాంగనాభిసరణవ్యాపారసంకేతవి
శ్రాంతిస్థానకము న్విభీతకమహాసర్వంసహాజాతమున్.

142


వ.

ఇట్లు కలిరాజు నిషధరాజధర్షణార్థంబు శుద్ధాంతలీలావనంబులోని తాఁడిమ్రానికోటరంబున వసియించి రంధ్రాన్వేషణతత్పరుండై యుండె నట పూర్వంబున.

143


నలదమయంతీగృహప్రవేశము

తే.

అవ్విధంబున నిషధదేశాధిరాజు
నగరు సొత్తెంచి యంతరాంతరములందు
దొరల మంత్రుల దండనాథులను నృపుల
నిజనివాసంబులకు నన్పె నిలిచి నిలిచి.

144


ఉ.

పాయఁ దొలంగుఁ డం చభయపార్శ్వములం బగళంబు సేయుచుం
దోయజలోచన ల్గొలిచి తోఁ జనుజేరఁగఁ బెండ్లికూఁతుర
త్యాయత వైభవస్ఫురణ నంతిపురంబున కేఁగుదెంచెఁ బై
డాయఁగ జిడ్డివైచినకడానిమెఱుంగుపసిండిపాలకిన్.

145

ఉ.

కైశికవృత్తి యొప్పఁ గ్రథకైశికరాజసుతావివాహదీ
క్షాశుభవస్తుసంయుతము గా బయకారు లొనర్చినట్టిప్రా
వేశికమంగళధ్రువలు వీనుల కింపుగఁ బాడి రంగనల్
దేశివిధంబు మార్గమున తేటయు నొక్కట సాళగింపఁగాన్.

146


వ.

అనంతరంబ వధూవరులు లౌకికవైదికాచారపారంగతు లగుపెద్దలపనుపున గృహప్రవేశసమయోచితంబు లగుమంగళాచారంబులు ప్రవర్తించుచుండి, రప్పుడు వివిధశిల్పకల్పనానిపుణు లగుశిల్పిజనులు సుపర్వపర్వతశిఖరోత్సేధం బగు విహారసౌధం బలంకరించి రందు.

147

విహారసౌధవర్ణనము

క.

ఒకచోటఁ బువ్వుఁబందిరి
యొకచోఁ జప్పరము దూఁగుటుయ్యెల యొకచో
సకినల గిలిగిలిమంచం
బొకచోఁ గప్పురపుఁ బలుఁగుటోవరి యొకచోన్.

148


సీ.

ఒకచోట సాలభంజిక గీలు వన్నిన
        మురిపెంపురవగొండ్లి పరిఢవించుఁ
గుడ్యగర్భాగారగూఢ యై యొకచోట
        నలవోక నొక్కపద్మాక్షి పలుకు
నొకచోట జలయంత్రయుక్తి నీలపుఱాల
        మొగులు చల్లనిచిన్నిముసురు గురియు
నొకచోటఁ బగలుచంద్రికలు గోయుచు నుండుఁ
        జంద్రకాంతోపలస్తంభవితతి


తే.

రమణఁ బోషితరాజకీరములతోడ
నొక్కచోట విటంకనిర్యూహపంక్తి

నసమశరశాస్త్రకారిక లభ్యసించు
శారికలు నూత్నకనకపంజరములందు.

149


తే.

కోరకించినకడకంటికొలికి జూచి
వాడివాలికపూఁదూపు వంక దీర్చు
చొరగి రతిదేవిపాలిండ్ల నొత్తగిలిన
యించువిలుకాని వ్రాసినా రిడుపునందు.

150


సీ.

అమరవల్లభుఁడు గౌఁతముకూర్మి యిల్లాలి
        జీకటితప్పు సేసినవిధంబు
సితభానుఁ డాచార్యుచిగురాకుఁబోఁడిపై
        గన్నువైచినకన్నె కలుపుమరులు
నట్టేట దాగశన్యకకు నువ్విళు లూరి
        జాలిఁ బొందినపరాశరువిరాళి
గారాపుఁగూఁతుపైఁ గాఁ గానిపనిఁ బూను
        వనజసంభవునినెమ్మనమువెలితి


తే.

దారువనవీథి శీతాంశుధరునిరంతు
శౌరిగోపాలకామినీచౌర్యకేళి
కామరసభావములు మించి కానఁబడఁగఁ
దీర్చి యిడుపులయందుఁ జిత్రించినారు.

151


చ.

భవజలరాశిదాఁటు నెడ భావజవాయువు వీచినం దపః
ప్రవహణముల్ సమున్నతసుపర్వవధూకుచపర్వతాహతిం
బవిలిన దీనతావికలభావము నొందిన మౌని నావిక
ప్రవరులభావచిత్రములు వ్రాసినవారు కపోతపాలికన్.

152


శా.

చూడా హేమవిటంకకోణములయంచు ల్మెట్టి యెవ్వారికిం
జూడం గాళ్లు వడంకు నన్నెలవునం జోద్యంబు వేద్యంబుగాఁ

బాడుం గోమలపంచమస్వరమును బంచేషుశౌర్యాంకము
ల్గ్రీడాకిన్నరయుగ్మముల్ నఖరపాళిం గిన్నెర ల్మీటుచున్.

153


తే.

వలచుఁ గస్తూరినిగరాలతలుపు దెఱవ
గాజుటోవరిలో ధూపగంధలహరి
హటదురుస్ఫూర్తినాసికాపుటకుటీర
కోటరాంతఃకుటుంబితాపాటవమున.

154


క.

అచ్చట నచ్చట నిడుపుగ
విచ్చినఁగుసుమాస్త్రశాస్త్రవేదులమనముల్
మెచ్చించుఁ దెరలమంజిడి
పచ్చడములు చతురశీతిబంధంబులతోన్.

155


క.

కలకంఠులకును సురతపుఁ
గులుకుటెలుంగులు వచించుగురువులువోలెన్
వలభులఁ గలకలరవములఁ
గలకల యని పలుకుఁ గలికికలవింకంబుల్.

156


ఉ.

టంకముఖంబుల న్మణివిటంకములన్ లిఖియించి యున్నమీ
నాంకరసప్రసంగమధురాదిమగాథలు పారదారికా
హంకరణక్రియాసమభిహారమహాపరిహాససంకథా
సంకలితంబు లొప్పిదపుశైలిఁ బఠింతురు ప్రౌఢభామినుల్.

157


నలదమయంతులవిహారము

వ.

ఇట్టికేళీసౌధంబున నిషధరాజు వధూసహాయుండై రతిసహాయుం డైనమన్మథుండునుంబోలె నభీష్టవిషయోపభోగంబులం దృతీయపురుషార్థంబు చరితార్థంబుఁ జేయువాఁడై.

158


తే.

కామశరవృత్తవర్తికాగంధతైల
దీపితానేకదీపికాదీప్తిజాల

వర్ధితాటోపకామదేవప్రతాప
మయినయాహర్మ్య మెక్కె నింతియును దాను.

159


సీ.

ప్రథమానురాగంబు రాజహంసముచేతఁ
        దెలిపి యంపినయట్టి దిట్టతనముఁ
బేరోలగంబునఁ బెద్దగద్దియనుండి
        దృష్టించి డిగ్గనిధీరతయును
నుత్తరప్రత్యుత్తరోక్తినైపుణశక్తి
        గర్వంబు సూపినకలికితనము
వరణావసరమున వాసవాదులమాయ
        మాయింప నేర్చినమతిబలంబు


తే.

నాత్మదివ్యావతారతావ్యంజకంపుఁ
బ్రౌఢి బచరింప వ్రీడాభరంబుకలిమి
వైశికం బయి యుండు నెవ్వరికిఁ జూడఁ
గాన లజ్జింప లజ్జించె గమలవదన.

160


తే.

స్వప్నసంభోగశతసహస్రములు వోయె
భ్రమసమీక్షావినోదార్చుదములు సనియె
మనములో నిండియున్నది ననువుఁ గూర్మి
యింక లజ్జాభయంబుల కెడము గలదె?

161


తే.

ఉపలములకంటెఁ గఠినంబు లొక్కవేళఁ
గుసుమములకంటె నొకవేళఁ గోమలములు
గాన లజ్జాభయంబులు గలవొ లేవొ!
పువ్వుఁబోఁడులహృదయంబు లెవ్వఁ డెఱుఁగు?

162


వ.

కళావతీప్రముఖసఖీజనప్రయత్నంబున నవరత్నశయ్యాసనాథంబును ధవళదుకూలకీలితమనోజ్ఞంబును బ్రత్యంతస్థాపిత

కనకకలశభృంగారుతాలవృంతదర్పణతాంబూలపేటికాఫలకుసుమగంధకస్తూరికాదిపరికరోపశోభితంబును నగు కౌతుకాగారంబు ప్రవేశించి.

163


క.

వ్రీళాసరిన్నిమజ్జన
లీలోచితనమనసల్లలితముఖి యగుచున్
నేలఁ బదాంగుళి వ్రాయుచు
బాలామణి నిల్చెఁ దలిమపర్యంతమునన్.

164


ఉ.

భావము పల్లవింపఁ బువుఁబానుపుమీఁదికి నేర్పున న్వయ
స్యావలి దార్ప నెంతయును నర్మిలితోఁ గుసుమాస్త్రశాస్త్రవి
ద్యావిదుఁ డొయ్య బైఁదిగిచి యక్కునఁ జేర్చె భుజాయుగాంకపా
ళీవలయంబులోనఁ దవిలించి కురంగవిశాలలోచనన్.

165


క.

హారపరీక్షామిషమున
భూరమణుఁడు గమిచె నింతిపొంకపుఁజన్నుల్
కూరిమి నేరిమిఁ బులకాం
కూరంబులు వొడమఁ జిగురుఁగోరులకొనలన్.

166


చ.

శుచి యగుహారదామమున శుక్తిజరత్నవిభాపరీక్షణం
బుచితపుఁగైతవంబుగఁ బ్రియుండు ప్రియం బెసలారఁ జూచినం
గుచలికుచద్వయం బొరసికొంచుఁ బయిం బులకాంకురంబులం
బ్రచురము చేయుచు న్నిగిడె బాణి వధూమణికంఠసీమకున్.

167


తే.

నవసమాగమవేళ నయ్యవసరమున
నువిద లజ్జాభరంబున కోహటించి
యెదుపదిసేసె వలరాజునంతవాఁడు
నరయ నెవ్వానిసొమ్ము జయజయములు.

168

సీ.

ఒకదీప మార్పిన నున్నదీపంబులు
        నప్పుడ తమకుఁ దా మాఱుటయును
దాలవృంతానిలచేలాంచలాదిక
        వ్యాపారముల దీప మాఱమియును
నాఱినదీపంబు లప్రయత్నంబున
        మఱి చూడఁ జూడంగ మండుటయును
మండి యాఱియు నాఱి మండినదీపంబు
        వెలుఁగుఁజీకటియుఁ గావించుటయును


తే.

గలుగునట్లుగ వరశక్తికలన రాజు
శిల్పముల నవ్వులాటకుఁ జేయుచుండఁ
దరుణి కుతుకత్రపాద్భుతాతంకభార
సంకటస్థాయివైసారిణాంక యయ్యె.

169


తే.

తరుణి లజ్జాభరంబుచేఁ దన్నువడియుఁ
దోయజానన వెఱపుచేఁ ద్రోపువడియు
నుల్లమున ఖేద మందక యుండ నట్టె!
బాలుఁడా యేమి తలపోయఁ బంచశరుఁడు?

170


ఉ.

ఇంచుక యుల్లసించినను నేమని చెప్పఁగ? లజ్జ వచ్చి త
ర్జించును సాధ్వసం బడరి శిక్ష యొనర్చును మౌగ్ధ్య మేచి వా
రించుఁ బ్రగల్భభావము ధరించి య టేని వధూమనోగతిం
బంచశిలీముఖుండు పసిపాపఁడు వో నవసంగమంబునన్.

171


సీ.

చూర్ణాలకంబుల స్రుక్కుఁ జక్కఁగఁ దీర్చి
        నలువు నెమ్మనములో మొలవఁ బెట్టు
గర్పూరహారంబు గదియించు నెపమునఁ
        గుచకోరకంబుల గోళ్లఁ గముచుఁ

దల్పయంత్రణనిరోధంబునంకిలి కోర్చి
        యర్ధాంకపాళిక నాదరించుఁ
నిబిడనీవీబంధనిర్మోక్షణమునకుఁ
        బని పూని భీతిఁ గంపంబునొందు


తే.

నూరుసంవాహనమునకు నుత్సహించు
ఘనసనితంబంబుపై నుండ మనసు వెట్టు
నిమ్ననాభికి డిగ్గంగ నెమ్మిసేయుఁ
బద్మలోచన మరఁగి భూపాలుకరము.

172


తే.

విభుఁడు పరిహాస మాడి నవ్వించుఁగాని
పడయలేఁడయ్యె నెన్ని యుపాయములను
రాజబింబాస్యతాంబూలరాగసుభగ
దంతకురువిందమాలికాదర్శనంబు.

173


మ.

మనుజాధీశుఁడు మగ్నహారలతికామాణిక్యముద్రాంకిత
స్తనభారంబుగ గాఢనిర్దయపరిష్వంగంబు పూఁబోడికిన్
ననుపుంగూరిమిమై వడి న్మరపెఁ దన్మందాక్షభావంబునన్
దనపూవిల్లును నొక్కచందమునఁ గందర్పుం డొగిన్ వంపఁగాన్.

174


తే.

మెలతఁ యప్పుడు మందాక్షమీలితములు
సౌహృదస్మేరములు నైనసంగమముల
ముకుళితంబులుఁ బుష్పితంబులును నైన
భూజములతోడియుద్యానభూమిఁబోలె.

175


సీ.

'అధరంబు చవిసూపు మన్య మేమియు నొల్ల'
        నని చెక్కుఁ జేరి మంతనము వలుకు

దైన్యంబు దోఁపఁ బ్రార్థన సేసి తుదిఁబొంచి
        బలిమి సొంపునన చుంబన మొనర్చు
'వదనారవిందాసవము ప్రసాదము సేసి
        నను నేలికొంటి గా'యనుచు మెచ్చు
'ననుఁగుభృత్యునకు నీపని యర్హ మగు' నంచు
        నూరుసంవాహనం బొయ్యఁ జేయు


తే.

'నేల కుసుమాస్త్రుకేలికి నింత వెఱవ!
వెఱవ కేనేమి నీసఖీవితతి యేమి?'
యనుచుఁ దగ బుజ్జగించి హాస్తాంబుజమున
వలపుఁగీలు దెమల్చు భూవల్లభుండు.

176


సీ.

పతిపాణిపల్లవచ్యుతనీవిబంధన
        వ్యగ్రబాలాహస్తవనరుహంబు
ధవకృతాధరబింబదశనక్షతివ్యథా
        భుగ్నలీలావతీభ్రూలతంబు
ధరణినాయకభుజాపరిరంభమండలీ
        గాఢపీడితవధూఘనకుచంబు
వరనఖాంకురమృదువ్యాపారపులకిత
        నీరజాక్షీనితంబోరుయుగళి


ఆ.

యస్తి వామ్యభార మస్తి కౌతూహలం
బస్తి ఘర్మసలిల మస్తి కంప
మస్తి భీతి యస్తి హర్ష మస్తి వ్యథం
బస్తి వాంఛ మయ్యె నపుడు రతము.

177


చ.

కుతుకమునం గురంగమదకుంకుమచర్చ వహించి నీలలో
హితరుచు లై స్వయంభు లయి యీహితసౌఖ్యవిధాయు లైన య

య్యతివపయోధరంబులకు నర్ధనిశాసమయంబున న్సమం
చితనఖకింశుకార్చనము సేసె మహీపతి భక్తి యేర్పడన్.

178


తే.

లావునను గూడి పాణిపల్లవయుగమున
నొ త్తిపట్టిన సరకు గా కుల్లసమున
హారకాంతిచ్ఛలంబున నల్లనవ్వు
తరుణిచన్నులు రాజుచిత్తము హరించె.

179


క.

తరుణికి ధాత్రీపతికిని
బరిచుంబనవేళ దంతపరిపీడన మి
క్షురసంపుఁబానకములో
మిరియపుఁగారంబువోలె మె చ్చొనరించెన్.

180


తే.

చూచియునుఁ జూచుఁ గ్రమ్మఱ సుదతిఁ దివుటఁ
గౌఁగిలించియు నప్పుడ కౌఁగిలించు
జుంబనము సేసియును రాజసూనుఁ డెలమిఁ
జుంబనము సేయుఁ భౌనరుక్త్యంబుగాఁగ.

181


తే.

కులుకుటెలుఁగుల నలరారు పులకములను
గంపములను సమగ్రసీత్కారములను
జుంబనక్రీడలందు రాసుతునిమోము
శీతకరుఁ డౌట చెప్పక చెప్పె నబల.

182


ఉ.

వంచన లేక యాననము వాంచినయప్పుడు ఫాల మోర గా
వించుడుఁ జెక్కుడద్దములు వ్రీడభరంబునఁ గీ లెఱింగి చుం
బించి మనంబు తాలిమి గభీరతరిత్తకు నెత్తఁ బూనినన్
మించి ముఖాబ్జచుంబనము మేకొనినవ్వు విభుండు నేర్పునన్.

183

తే.

సతతతాంబూలభోగకషాయితములు
నుదయభాస్కరనవసౌరభోల్బణములు
నయినయధరామృతముల నింతియును బతియుఁ
జలిపి రన్యోన్యమధుపానలలితకేళి.

184


చ.

అవహితభావభావితసహస్రకరామృతభానుమండలుం
డవుచు నసమ్మతక్షణసమభ్యుదితం బగుభావలాభలా
ఘవము మదిన్ జయించి ప్రియకాంత రసాంతరసన్నిరుద్ధమా
ర్దవఁ గరఁగించుచున్ గరఁగె రాజు సమంచితపారవశ్యుఁడై.

185


తే.

భాగ్యవశమున భావలాభంబు లపుడు
రెండుసమమైనఁ గుసుమకోదండనర్మ
కర్మకాండసమాపనశర్మసార
సంవిభాగంబు సమమయ్యె సతికిఁ బతికి.

186


వ.

ఇవ్విధంబున నవ్వామ వామపాదతలవిలుప్తమన్మథశ్రీవిలాసుం డైనయవ్విలాసివలనం బ్రథమపరిహాసంబునం బతంగపుంగవగవీహైయంగవీనరసరసాయనాస్వాదప్రరూఢంబునుఁ జిరకాలావస్థానసుస్థిరంబును వివిధవిఘ్నపరంపరానిస్తారనిరంకుశభాగ్యోదయంబును సౌభాగ్యగర్వసర్వస్వసహాయంబునునైన నిజానురాగంబునకుం దగి వ్రీడాజితమన్మథంబులును దుల్యలజ్జాస్మరంబులును గందర్పవిజితమందాక్షంబులును నగుకేళీవిశేషంబులం గుచకుంకుమపంకంబుచేతను నున్ముంగురులచిన్నిపువ్వులచేతను నడుగునెత్తమ్ముల కొత్తలత్తుకచేతను బింబాధరంపుఁదాంబూలరసరాగంబులచేతనుం బర్యంకభాగంబు దేటపఱుపం దులాకోటీరటనంబును గంకణఝణఝణత్కారంబుసు మేఖలా

కలాపకింకిణీకలకలంబునుఁ గులుకుటెలుంగులం గలసి సకినలకీలుఁబఱపులచప్పుళ్లు విప్పు సేయం గ్రమంబున విచ్ఛిన్నహారమండలం బగుసురతాండవంబునకుం గళాసిక యగు పారవశ్యంబునం గుసుమకార్ముకనర్మకర్మకాండకేళీసమాపనాశర్మసారంబు సమసంవిభాగంబుగాఁ బంచికొని యనుభవించుచు నిశ్వాసధారాసారంబుల వాసాగారం బధివాసించుచు నెడనెడం బ్రియనఖక్షతార్పణంబులు ఫాణితంబునం దొనర్చిన మరి చావచూర్ణంబులం బోల నర్ధనిమీలితనయనతారకంబునుఁ బ్రస్వేదబిందుకందలితనాసికాశిఖరంబునుఁ జర్వణాధౌతబింబాధరశయాళుయావకంబును సామిలుప్తలలాటతిలకంబును నగువదనకమలంబు హృదయవల్లభు వక్షస్థలైకదేశంబునం జేర్చె నప్పు డమ్మిథునంబు.

187


మహాస్రగ్ధర.

సరి యాతాయాతరంహ
        శ్చలకలితరతశ్రాంతినిశ్వాసధారా
పరిషద్వ్యామిశ్రభావ
        ప్రవిఘటితమిథఃప్రాణభేదోదయంబై
యొరిమన్వక్షోజుపాళీ
        యుగకరిమకరీయుగ్భుజామధ్యచిహ్నా
భరణవ్యక్తైకభావో
        భయవిలసితహృద్భాగమై నిద్రవోయెన్!

188


వ.

మఱియును.

189


తే.

సురతపారవశ్యంబులఁ జొక్కి చొక్కి
కేళినిద్రాసుఖంబులఁ దేలి తేలి

మేలుకొని బాహ్యరతిలీల మించి మించి
దంపతులు గ్రీడసల్పిరి తనివి సనక.

190


సీ.

ప్రాణేశునొసలిలాక్షాంకంబు వొడ గాంచి
        ముసిముసినవ్వుతో మోము మలఁచు
నేల నవ్వితి? చెప్పు మిప్పు డం చడిగిన
        నధిపుచేతికి మించుటద్ద మిచ్చు
మఱుపెట్టి చనుదోయి మదనాంకములు సూచుఁ
        దనునవ్వు విభుఁజూపులన యదల్చు
రాజుచేఁ జికురభారము సెజ్జ మోవంగ
        మ్రొక్కించుకొనుఁ బాదములకు నలిగి


తే.

రుద్రమూర్తిజిగీషానురూపకలన
కతనుఁ డేకాదశాకృతి యైనభంగిఁ
జరణనఖదర్పణములందు ధరణివిభుఁడు
లీలఁ బ్రతిబింబితుండుగా లోలనయన.

191


సీ.

దంతక్షతవ్యథాదాయికాస్యమునకు
        దంతక్షతవ్యథ దండు వయ్యెఁ
గుచకుంభమర్దనక్రూరకర్మం బైన
        కరము పాదము లొత్తి కరుణ వడసె
దీప మార్చినయఫ్టు దీప్తిసూపినకల్ల
        మౌళిరత్నము మ్రొక్క మాన్చికొనియె
నొ త్తినతప్పు వో నుడిపెఁ గ్రీడాశ్రాంతి
        నమృతంబు గురిసి దివ్యాభరణము


తే.

మోస గాకుండ నపరాధములకుఁ దగిన
శాస్తి యన్నింటి కిబ్భంగి సంభవించె

సతికిఁ బతికిని నవ్వేళ సంఘటిల్లు
శంబరారాతిధర్మయుద్ధంబునందు.

192


ఉ.

మంకెనపువ్వుమీఁదియళిమాడ్కి నృపాధరపల్లవోదరా
లంకృతియైనదంతపదలాంఛనముం గని కన్నుఁగోనలం
దంకురితంబు లైనదరహాసలవంబులు పద్మనేత్ర యి
ఱ్ఱింకులు సేసెఁ బక్ష్మముల యీఱమిఁ గాటుక చిమ్మచీకటిన్.

193


ఉ.

క్రిక్కిఱిచన్నుదోయి యిరుగ్రేవలకాంతియుఁ బంచబాణుఁ గ్రొ
వ్వెక్కఁగఁజేయ హస్తయుగ మెత్తి విహారభరంపుఁ బేర్మికిన్
విక్కి ప్రసూనము ల్గురియు వేనలి వీడిచి కొప్పువెట్టుచోఁ
జొక్కులఁబెట్టె భూవరునిచూపులఁ గోమలిబాహుమూలముల్.

194


శా.

వాసోభూషణగంధమాల్యరచనావైచిత్ర్యసజ్జాంగియై
యాసీమంతిని యన్యకాంత యనుమిథ్ాభ్రాంతి పుట్టించుచు
న్వాసాగారమునందు నొక్కతెయ నానాభంగి వర్తించు న
త్యాసక్తి న్నవసౌఖ్యలీలల విభుం డామోదముం బొందఁగాన్.

195


ఉ.

కైటభవైరియున్ జలధికన్యయు నాదిగఁ గీటకంబునుం
గీటకపత్నియుం దుదిగఁ గృత్స్నము రాజును దాను నై నిరా
ఘాటరతిన్ సుఖంచుటకుఁ గాంక్ష యొనర్చు మనోంబుజంబునన్
బాటలగంధి నిత్యనిరుపాధికరాగనిబంధనంబునన్.

196


ఆ.

వనిత రూపవేషవాసోంగవాసనా
భూషణాదిబహువిశేషరచన
నన్యదివ్యకాంత యనుశంక పుట్టించి
నేర్పు గ్రొత్త గాఁగ నృపతిఁ గవయు.

197

వ.

ఇవ్విధంబున నమ్మిథునంబు నిధువనక్రీడాపరాధీనంబై యానందజలధి నోలలాడుచుండ నవ్విభావరి జరాభావంబు ధరియించె. మనోభవుండు కోదండం బెక్కుడించి సంగ్రామవిరామసూచకంబుగాఁ గుక్కుటకంఠకాహళంబులు పట్టించె, నప్పుడు వైతాళికులుం గేళీప్రాసాదపర్యంతభాగంబున నుండి యుచ్చైస్స్వరంబున ని ట్లనిరి.

198


ఆశ్వాసాంతము

మ.

ప్రణతానేకనృపాలమాళివలభీపర్యంకరత్నావళీ
ఘృణికిర్మీరితపాదపీఠజయలక్ష్మీకేళిమాణిక్యద
ర్పణ! దర్భాంధవిరోధిరాజనివహప్రాణానిలాహారభ
క్షణకుక్షింభరిభూరిదక్షిణభుజాస్తంభాసికుంభీనసా!

199


క.

ప్రౌఢజయశ్రీకుచభర
గాఢపరీరంభకేళికౌతుకసుఖసం
రూఢనవపులకముకుళ
వ్యూఢోరస్స్థల! విలోచనోత్సవమూర్తీ!

200


మాలిని.

అమృతజలధికన్యాప్రాణానాథాంఘ్రిసీమా
సముచితసురగంగాసామ్యకీర్తిప్రదీపా!
కమలభవపురంద్రీకంఠనక్షత్రమాలా
సమధికమణిరోచిస్స్వచ్ఛలీలానులాపా!

201


గద్యము.

ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సకలవిద్యాసనాథ శ్రీనాథప్రణీతంబైన శృంగారనైషధకావ్యంబునందు సప్తమాశ్వాసము.

  1. అనేకబారువుల్; అనేకభారువుల్' అని ముద్రితలిఖతపుస్తకపాఠములు.
  2. 'ఈగ కెన్నఁడు గాటిని యిచ్చునారు' అని పాఠాంతరము చింత్యము.
  3. 'హోమాజ్యగంధోర్మి' అని పాఠకల్పనము సమంజసము.
  4. 'అభినవబ్రహ్మచారిచయాజినంబు' అని పాఠకల్పనము మూలానుగుణము.