శ్రీరస్తు
శృంగారనైషధము
అష్టమాశ్వాసము
|
శ్రీధామరెడ్డి వేమ
క్ష్మాధీశ్వర సచివసింగనామాత్య! దిశా
సౌధశిఖరాగ్రకీలిత
సాధీయస్స్ఫటికకుంభసన్నిభకీర్తీ!
| 1
|
మ. |
జయ శీతాంశుకులావతంస! నిషధస్వామీ! మహారాజ! య
వ్యయధైర్యాకర! నిద్ర మేల్కొనుము సంధ్యావేళ యేతెంచె నీ
నయనాబ్జంబుల కిచ్చు భవ్యశకునానందైకకల్యాణమున్
శయనోత్థాయము భోజరాజతనయాసంఫుల్లనేత్రాబ్జముల్.
| 3
|
మ. |
వరుణప్రేయసి యైనదిక్కుఁ గదియ న్వాంఛించుచున్ జంద్రికా
పరిధానంబుఁ గ్రమక్రమంబునఁ బరిభ్రంశంబు నొందించు చం
దురునిం గన్గొని యింద్రదిగ్వనితప్రత్యూషప్రసాదోదయ
|
|
|
దురునిం గన్గొని యింద్రదిగ్వనిత ప్రత్యూష ప్రసాదోదయ
స్ఫురణవ్యాజమున న్నిజాననమున న్బూనెం బ్రహాసద్యుతుల్.
| 4
|
సీ. |
చంద్రాతపంబులు సాంద్రక్షపాతమ
స్సహయుధ్వలై పరిశ్రాంతిఁ బొందె
నతిదరిద్రాణదేహద్యుతి ప్రాణమై
ప్రాలేయకిరణబింబంబు వ్రాలె
నపరస్పరంబులై యాకాశవీథికిఁ
గొన్ని భాస్కరకరాంకురము లెగసె
నమహతితరదీప్తి నంతంతఁ జుక్కలు
సంఖ్యావిధేయశేషంబు లయ్యెఁ
|
|
తే. |
గుముదకేదారమున నుండి క్రొత్తవిరియుఁ
గమలషండంబునకు వేడ్కఁ గాఁపువచ్చు
కొదమతుమ్మెదకడఱెక్కఁ గుసుమవెట్టె
నభినవం బైనప్రథమసంధ్యాగమంబు.
| 5
|
క. |
కరవాఁడిసూదితుదమొన
నర దఱువంబడిన ముత్తియంబునుబోలెన్
గర మొప్పె రజనికరణీ
కరవమథువు హిమము కుశశిఖాశిఖరమునన్.
| 6
|
మ. |
దివిషద్ధంపతితల్ప మైనగగనోద్దేశంబునం దారకా
నివహంబు ల్గుసుమప్రసంగములు గా నిర్వాణకాంతిచ్ఛటా
నవతూలప్రకరోదరంభరినిశానాథుండు గండోపధా
నవిధాలీల వహించె నత్తఱి నఖండం బైనబింబంబుతోన్.
| 7
|
శా. |
శ్యైనంపాతమెయి న్నభంబున సహస్రాంశుండు వైచెన్ గర
శ్యేనవ్రాతము నంధకారబలిభుక్ఛ్రేణీజిఘాంసారతిన్
|
|
|
దానం జంద్రుఁడు పశ్చిమాశకు శశత్రాణార్థమై యేఁగె ను
డ్డీనం బయ్యె నుడువ్రజంబు పరిపాటిం బారువాలో యనున్.
| 8
|
క. |
లఘుగతి ననూరుసారథి
విఘటితతిమిరుఁ డయి వీఁడె విచ్చేసె దివిన్
మఘవపురప్రాసాద
ప్రఘాణకప్రాంగణము లుపఘ్నంబులు గాన్.
| 9
|
చ. |
గ్రహములు నిర్జరీసురతకాలవిసూత్రితహారరత్నసం
గ్రహములు మేఘవీథి యనుకౌతుకమందిరచత్వరంబునన్
బహుకరమార్జనావిధి ప్రభాతముఖంబునఁ బాయఁ దట్టె ని
ప్డహహ భుజిష్యవో నియతి! యంతక యారసి చూడవచ్చినన్.
| 10
|
సీ. |
ఆమ్నాయశాఖాసహస్రవివర్తంబు
లుడురాజకల్యాణహోమవహ్ను
లాకాశహర్ష్యాగ్రహస్తదీపంబులు
ప్రాలేయజలరాశిబాడబములు
చక్రవాకమనోవిశల్యౌషధంబులు
దశదిశాకుంకుమస్థాపకములు
రాజమండలకాంతిరాజయక్ష్మము లంధ
కారవేదండకంఠీరవములు
|
|
తే. |
పద్మవననిర్ణిబంధనబాంధవములు
కైరవాకరసమ్మోహకారణములు
సవితృమణిపావకేంధనసామిధేను
లెగసె నుదయాద్రి యవుల నీరెండకొనలు.
| 11
|
క. |
పసిపాప యెండకొనలను
మసమసకనియిరులుఁ గలసి మన మలరించెన్
|
|
|
దెసల నలుగడల గుంజా
విసరంబుల సరులు వ్రేలవిడిచినభంగిన్.
| 12
|
సీ. |
నముచిసూదనువీటినడువీథిచక్కటి
నింతకు నేతెంచు నినునితేరు
కట్టుపకాసులై గగనాంగణంబున
మందేహులింతకు మాఱుకొండ్రు
స్రవియించు నింతకుఁ బ్రథమాద్రిదఱులలో
నూష్మసోఁకి శిలాజతూత్కరములు
ప్రీతి నింతకు నేగుఁ బిచ్చుకుంటుకు మ్రొక్క
వినుతసౌభ్రాత్రుండు వినతపట్టి
|
|
తే. |
మేలుకొను మిదె రాజన్యమీనలక్ష్మ!
కాలకంఠసమర్చనాకాలమయ్యె
విశ్వవిశ్వంభరాభారవిధృతిదీక్ష!
దీర్ఘతరనేత్ర! నిషధధాత్రీకళత్ర!
| 13
|
వ. |
మఱియునుం దిమిరవిరహపాండూసమానదిఙ్మండలంబును విచేయతారకంబును దరిద్రాణప్రాణరోహిణీరమణబింబచుంబ్యమానచరమాచలశిఖరభాగంబును శిశిరసలిలక్షోశోదకుక్షింభరిక్షీరకంఠరవిమయూఖంబును గుముదకేదారనిద్రాసుఖనిదానంబును, నిశావిరహవిహ్వలచక్రాహ్వయవిహంగమస్త్రీపపుంసహృదయబృంహితాహ్లాదంబును గువలయినీకుక్షిభ్రూణాయమానమదసుప్తబంభరంబును లవణస్యదౌపవాహ్యహయవిలేహ్యమానమాణిమంథశిలాశకలంబును, సంధ్యామౌనవ్రతపరాయణవిశిష్టాధ్యేతృ జనవిహితాధ్యయనవిరామంబును బ్రాహ్మణాభిమంత్రితార్ఘ్యాంజలిజల
|
|
|
వజ్రధారావిదారితమందేహదేహంబును నై యత్తఱిం గ్రొత్తవిరియు నెత్తమ్మివిరులకేసరంబులవాసనలు గ్రోలి మత్తిల్లి యుల్లాసంబునం దూలియాడు కొదమతుమ్మెదకదుపులు ఘుసృణసుమనశ్శ్రేణిశోణం బగుపొడుపుసంజకెంజాయయుం గలయ బెరసి గురువెందపేరులయందంబు వహించుటయునుం, గుశకిసలయంబులమీఁదం బ్రాలేయాంభఃకణక్రమసంభృతంబులై రజనియనుపిడియేనుంగుఫూత్కారంబు సేసి యుమిసినం జిలికిన కరవమధుశీకరంబులంబోని యుదకబిందుసందోహంబులు సుషిరకరణనిపుణ నికరనిశాతాయన సూచీశలాకాశిఖాంకురసంకరంబునం గరంబు హత్తినముత్తియంబుల ననుకరించుటయును, వికసితైకదళంబు లగుకుశేశయకోరకంబులచేతం గమలాకరంబులు మిహిరకిరణాభోగభోజనార్థంబు సంధ్యారాగాంబువుంజేత మొదల నాపోశనం బెత్తుభావంబు భజియించుటయును, చులుకితతమస్సింధుపూరంబు లగుబిసినీబాంధవువి కరంబులవలన రంధ్రస్రుతంబు లగునంధకారబిందుసందోహంబు లిందిందిరవ్యాజంబున నంభోజవనంబులోనం దొరఁగి విసృమరమధుస్రోతఃకచ్ఛద్వయీపరిసరంబులం బంకశంశావహం బగుటయునుఁ, దటరుహతరునికాయనిష్కుహక్రీడానీడంబుల నిద్రించి మేల్కాంచి కలగొనం బల్కుపులుఁగులయెలుంగులకోలాహలంబులచేతనుంబోలెఁ బ్రత్యుద్బుద్ధంబు లగుసరోజాతంబులలో మధువ్రతవ్రాతంబులు వధూవదనలబ్ధమధురాధరసుధాపానంబుతోడ సాధువిధీయమానంబు లైనమధుపానమహోత్సవంబులం బ్రవర్తిల్లుటయు, గాఢతమతమ
|
|
|
స్తమాలగహనభంగమాతంగంబులును గనత్కనకరేణుత్రసరేణువిసరపిశంగంబులు నగుపతంగకిరణశృంగంబులు భవనవలభిజాలంబులం దూఱి భ్రమదణుగణాక్రాంతంబులై కుందపరిభ్రమణభ్రాంతి నాపాదించుటయును విభాతలక్ష్మీవిలాసంబు విశ్వనయనోత్సవం బయ్యె; వెండియు.
| 14
|
మ. |
సలిలాభ్యుక్షణకంబుసంభవరజోజంబాలపాండూభవ
జ్జలజచ్ఛిత్కరపత్త్రభావభజనన్ సంధిల్లి శీతాంశుమం
డల మిప్డస్తమితార్ధబింబ మగుచు న్నక్షత్రశంఖచ్ఛిదా
కలనచ్ఛేకసరోజబాంధవకరాగ్రస్వైరనిష్పీడనన్.
| 15
|
చ. |
తటుకున నస్తమించెఁ బతిదైన్యముఁ జూడఁగ నోడి తారకా
పటలమునుం ద్రియామయును బాపురే! యింతులవాఁడిపంతముల్!
గటకట! తద్వియోగమునఁ గ్రాగి నశింపఁడ నిష్ఠురాత్ముఁడై
పటికమొకో విధుండు? నడుపట్టుకలంకము నల్లగారయో?
| 16
|
ఉ. |
నిద్దుర మేలుకొమ్ము రజనీకరవంశవతంస! కుంకుమం
బగ్గినభంగి మింట నదె యామినిచెల్లెలు కాల్యసంధ్య దా
నుద్దియ సేయుచున్నయది యుష్ణమయూఖసుతప్రసూతికిం
బొద్దులు సొచ్చి యున్నయవి పూర్వదిశాసరసీరుహాక్షికిన్.
| 17
|
శా. |
వైదర్భీహృదయేశ! మేలుకొని నిర్వర్తింపు సంధ్యానవ
ప్రాదుర్భావవిధేయమున్ విధికలాపంబు ముహూర్తంబుో
నాదిత్యుం డిటఁ దోడుసూపుఁ బటురంహఃపిష్టపిష్టకృత
క్ష్మాదిగ్వ్యోమమహాతమోఘ్నము నమోఘంబున్ మయూఖౌఘమున్.
| 18
|
శా. |
ప్రాతఃకాలము వాయసంబు 'పణినాపత్యోక్తశాస్త్రంబులో
దాతఙ్ స్థానులు చెప్పుఁ డెవ్వి?' యనుచందం బొప్పఁ గౌకౌయనం
జాతుర్యం బలరార నుత్తరము విస్పష్టంబుగాఁ గోకిల
వ్రాతం బిచ్చెఁ దుహీతుహీ యనిగృహారామప్రదేశంబులన్.
| 19
|
ఉ. |
వారక రాత్రియెల్లఁ బ్రియవల్లభుఁ డైనశశాంకుఁ గూడి యి
చ్ఛారతికేళి జాగరము సల్పినఖిన్నత నొక్కొదీర్ఘికా
కైరవరాజి యిప్డు నిజగర్భనివిష్టమదద్విరేఫఝం
కారమిషంబునం దఱచుగా గుఱువెట్టుచు నిద్రవోయెడిన్.
| 20
|
వ. |
అని యివ్విధంబునం బ్రభాతకాలవర్ణనంబు సేయువైతాళికుల నాదరించి.
| 21
|
మహాస్రగ్ధర. |
బలవద్దారిద్ర్యముద్రా
ప్రకుపితకమలాపాటలాపాంగరోచిః
కలికాసందేహదాన
క్షమకమలమణిగ్రామజాగ్రన్మయూఖో
జ్జ్వలశుద్ధస్వర్ణభూషా
సముదయ ముదయత్స్వాంతసంప్రీతి నయ్య
ర్థులకుం బుత్తెంచె భూనా
థుసతి యుడిగపుందోయజాతాక్షిచేతన్.
| 22
|
నలుఁడు ప్రాతఃకాలకృత్యంబులం దీర్చుట
తే. |
తనకు నెద్దాన్ని గన్యాప్రదానవేళఁ
యౌతకంబున నిచ్చె నెయ్యంపుమామ
|
|
|
యట్టియీశ్వరవరదత్తమైనరథముఁ
గామగమనంబుఁ దలఁచె నక్షణమ నృపతి.
| 24
|
క. |
మదిఁ దలఁచినంతమాత్రన
యుదయించు సహస్రరశ్మి కుపమానంబై
మదనక్రీడాసౌధము
తుదనిలువున నిలిచె రథము తోయదవీథిన్.
| 25
|
తే. |
కనకకింకిణికాజాలకములు మెఱయ
గగనతరుపుష్పమగుపుష్పకంబువోలె
నెచటనుండియొ యేతెంచి యెదుట నున్న
పసిఁడితే రెక్కి వసుమతీపాలసుతుఁడు.
| 26
|
శా. |
వాతాహారవిరోధి నెక్కి చను విష్వక్సేనుఁడుం బోలె ని
ర్ధౌతాసిద్యుతిమేచకం బగువియద్భాగంబునన్ భాస్కర
ద్యోతస్ఫీతవిమాన మెక్కి మదిలో నుత్సాహ మేపారఁగాఁ
బ్రాతస్స్నానము సేయఁ బోయె ధరణీపాలుండు మిన్నేటికిన్.
| 27
|
వ. |
ఏఁగి యట మహానటజటాటవీవాట నవతరించి నభోవీథీమేథీభూతం బగుధ్రువమండలం బొరసికొనుచు శింశుమారాకారంబునం దారకామూర్తియై పవ్వళించిన పాంచజన్యధరునిచరణపల్లవంబుఁ బ్రక్షాళించుచు, సోమార్కమయమహాసోపానంబులఁ బ్రవహించి, పరివహపవనఝంపాసంపాతంబులం దూఁగియాడు కరుళ్లచప్పుళ్లు దిక్కుటంబుల నాస్ఫోటింపం, ద్రివిష్టపలలాటికాతిలకంబును నరకపురగోపురద్వారదంతార్గళయును నారాయణచరణారవిందమకరందబిందునిష్యందంబునుఁ బుండరీకభవకమండలుతీర్థధారయు నైనయమ్మహానది డాసి విమానంబు డిగ్గి, జలవగాహనా
|
|
|
యాతజంభారాతికుంభికుంభస్థలిసాంద్రసిందూరపరాగసంధ్యాయమానసలిలంబును నప్సరఃకుచతటీపటీరచర్చామచర్చికాసురభిళంబునుఁ బ్రతీరపారిజాతకుసుమధూళిపాళికిశంగితసైకతంబునుఁ జింతామణిశిలాసంఘాతసంఘట్టనసముచ్చలజ్జలశీకరాసారచ్ఛటాస్ఫోటితగగనభాగంబును గనత్కనకపులీనవేదికామధ్యాసీనకామధుగ్ధేనూధస్యధారాధోరణీప్రవాహబృంహితోర్మియు నగునొక్కరేవున డిగ్గి తత్ప్రదేశంబున.
| 28
|
సీ. |
అత్యంతనియతిఁ బంచాంగంబు పఠియించె
నఘమర్షణస్నాన మాచరించె
దైవతఋషిపితృతర్పణం బొనరించె
సంధ్య నారాధించె సవితఁ గొలిచె
గాంగేయవాలుకాలింగమూర్తిని నిల్పి
కాంచనాబ్జములఁ బూజించె శివునిఁ
బారిజాతకలతాపల్లవాగ్రంబులు
చిదిమి యెయ్యన మేపెఁ ద్రిదశగవికిఁ
|
|
తే. |
గేలుదోయెత్తి యౌదలఁ గీలుకొలిపి
గగనమునిరాజు లైనచుక్కలకు మ్రొక్కె
దివ్యరథ మెక్కి వేగ యేతెంచె మరలి
యధిపుఁ డటు సురనదిఁ దీర్థయాత్ర సలిపి.
| 29
|
తే. |
హృద్యసౌధాద్రికుట్టిమానేకరూప
ధాతుకాధిత్యకాతటాంతరము సేరె
ధరణినాథపురందరాధ్యాసితంబు
రత్నదివ్యవిమానధారాధరంబు.
| 30
|
తే. |
దివసముఖకార్యజాతంబుఁ దీర్చి వచ్చు
పతి నెదుర్కొనె భక్తిసంభ్రమ మెలర్పఁ
జెలువ ప్రత్యగ్దిశాసింధుసలిలవీచి
తూర్పుదెస వచ్చునిండుచందురునిఁబోలె.
| 31
|
వ. |
తరణిఖరకిరణకందళితమందాకినీకనకారవిందంబునకు విందై నిజసందర్శనానందమందస్మితసుందరం బగునయ్యిందువదనవదనంబు మదనరాగంబు సంపాదింప సర్వసర్వంసహానిలింపసార్వభౌముండు.
| 32
|
ఉ. |
మానససంప్రమోదము సమగ్రముగా సురలోకవాహినీ
స్నానవిధి ప్రవృత్తివచనంబునఁ జెప్పక చెప్పినట్లు స
మ్మాననఁ ద న్నెదుర్కొనిన మానవతీజనతాలలామకుం
గానుక యిచ్చెఁ దావి వెలి గాని కనత్కనకారవిందమున్.
| 33
|
క. |
పురుషోత్తమలాలిత య
త్తరుణీమణి మిగుల నొప్పెఁ దత్సమయమునన్
సురసింధుహేమకమలము
కరకమలంబున ధరించి కమలయుఁబోలెన్.
| 34
|
తే. |
రాజముఖికి నయ్యేకవరాటకంబు
లలితసమానమున నేకలక్ష మయ్యె
రాజకృపఁ గన్న యొక్కవరాటకంబు
నేకలక్షం బగును సంశయింపనేల?
| 35
|
వ. |
అనంతరంబ విధివిశేషంబు సమాప్తింపంగోరి చకోరలోచనం గడకంట నీక్షించుచు నిషధాధ్యక్షుం డగ్నిహోత్రగృహంబునకుం జని.
| 36
|
తే. |
తన కనిష్టంబు లగుకలిద్వాపరముల
కేతు సూపియుఁ బోలే ధాత్రీశ్వరుండు
నిత్యసత్త్రేత ఋత్విక్ప్రణీత యైన
త్రేత సేవించె విజితమిత్రేతరుండు.
| 37
|
తే. |
విభుఁడు ప్రాహ్ణేతనక్రియావిధికలాప
మీవిధంబునఁ దీర్చి సద్భావ మొప్ప
భామినీభావజిజ్ఞాసఁ బాదపద్మ
యుగము నిశ్శబ్దముగ మెట్టు చొయ్య వచ్చె.
| 38
|
ఉ. |
మిన్నక చేర వచ్చి యొకమేలపుమైవడిఁ బువ్వుఁబోఁడి క్రా
ల్గన్నులు మూసెఁ బాణికమలంబుల భూపతి నవ్వుచున్నయా
సన్నసఖీజనంబుఁ గనుసన్న నదల్చుచు నవ్వధూటి క్రా
ల్గన్నులఁ జేరలం గొలుచుకైవడిఁ గన్నుల నవ్వు దేఱఁగాన్.
| 39
|
తే. |
ఒక్క పూఁబోఁడి భూసంజ్ఞ నొయ్యఁ బిలిచి
యాత్మహస్తాధికార మయ్యబ్జవదన
హస్తముల కిచ్చి యెఱుఁగనియట్ల తాను
వసుమతీశుండు నగె నప్డె వచ్చినట్లు.
| 40
|
తే. |
జ్ఞాతహస్తాంబుజాంతరస్పర్శ యగుటఁ
గైతవంబు నెపంబు గాఁ గమలనయన
మానసంబున మానసంపద వహించె
నాననంబున ధరియించె మౌనముద్ర.
| 41
|
చ. |
కుటిలకటాక్షవీక్షణముఁ గోమలనూత్నకపోలరాగముం
జటులసమంచితభ్రుకుటిసంవళనంబునుఁ జూచువేడుకన్
జిటపొట రేఁచె రాజు సరసీరుహనేత్రకుఁ గామకేళికిన్
గటుకులు గానిమానములు గావె ప్రదీపనసిద్ధిహేతువుల్.
| 42
|
వ. |
అప్పుడు నృపతి సామోపాయంబునం బ్రణయమానం బపనయింపం దలంచి యిట్లనియె.
| 43
|
ఉ. |
దాస్యము నిన్న రే కుసుమధన్వుఁ డొకండును సాక్షిగా సరో
జాస్య! వహించినాఁడ, విను, మప్పుడ మ్రొక్కుట లేదు, నీకు వి
శ్వాస్యుఁడఁగాన మ్రొక్కుఁగొను స్వస్తటినీసలిలాభిషేకసా
రస్యపవిత్రమస్తకము వ్రాల్చెద నీపదయుగ్మకంబుపై.
| 44
|
తే. |
కుటిల మగునీకటాక్షంబుఁ గువలయాక్షి!
యించుకించుక నామీఁద నెఱ్ఱఁబాఱి
నిగిడి మరలినభావంబు నిజము దెలిసె
శ్రవణకూపనిపాతైకశంకఁ జూవె?
| 45
|
క. |
లేయెండ వేఁడి యయ్యుం
దోయజషండముల కింపు దొలఁగించు క్రియన్
నీయలుక పరుసనయ్యును
నాయెడదకు వేడ్క సేయు నళినదళాక్షీ!
| 46
|
తే. |
చివురుఁ గెమ్మోవిచిఱుగాటు నెపము గాఁగఁ
దామరసనేత్ర! కోపింపఁ దగదు మమ్ము
ఫలరసాస్వాద మొనరించుచిలుకమీఁదఁ
బింబవల్లీమతల్లి కోపించు నెట్లు?
| 47
|
తే. |
ఉవిద! నీమాట విన నొల్ల మూరకుండు
కా దనక వింటి మే నేమి కారణంబొ?
రాజకీరంబు మము నిష్ఠురంబు లాడుఁ
బ్రతిపదంబును బరుసగాఁ బలుకు వీణ.
| 48
|
తే. |
చూడ వేటికి నిడువాలుసోగమీల
సూడు పట్టంగఁజాలెడుచూపుఁగొనలఁ
బలుకుపలుకున నమృతంబు చిలుకుచుండఁ
బలుక వేటికిఁ జిలుకలకొలికికాన!
| 50
|
శా. |
కోపం బింతయు నుజ్జగించి సుమనఃకోదండనారాచధా
రాపాణింధమ మైననీధవళనేత్రజ్యోత్స్నపైఁ జల్లవే
తాపం బాఱఁగఁ గౌఁగిలించుకొనవే తథ్యంబు నీబంట నే
యోపుంస్కోకిలవాణి! యోశశిముఖీ! యోపక్వబింబాధరా!
| 51
|
మ. |
విసు వౌచున్నది కాలయాపనకు నువ్విళ్లూరెడున్ భావముల్
రసభంగం బగు మానరోష మతిదీర్ఘం బయ్యె నే నింతటం
బ్రసభాలింగనపూర్వకంబుగ మనోరాగంబు రెట్టింపఁ గా
ణసిధాత్వర్థ మనుగ్రహింపఁ గదవే నీరేజపత్రేక్షణా!
| 52
|
వ. |
అని పలికి బలిమిన యాలింగనంబు సేసి తల్పంబునకుం దార్చి.
| 53
|
తే. |
పతి కళావతి యనుదానిఁ బద్మనయన
దమసహోదరిగారాపుదాదికూఁతు
నంతికమునకు రప్పించి యాదరించి
నర్మసాక్షిణిఁ గావించి నగుచుఁ బలికె.
| 54
|
వ. |
కళావతీ! నీవు నొడికారపుమాట లాడం బ్రోడ వని విందుము. నీ వెఱుంగని పాడిపంతంబులు లేవు. తగవు దప్పక చెప్పె దేని గొన్ని మాట లడిగెదము. మాటలాడక విచారించి యుత్తరం బిమ్ము.
| 55
|
తే. |
అన్యపురుషునిఁ గలలోన నైనఁ దలఁప
దాత్మలో నండ్రు మీ విదర్భాత్మజాత
|
|
|
యన్యపురుషుఁడు గాఁడె పుష్పాయుధుండు?
వనిత దనయాత్మలోన నెట్లునిచె నతని.
| 56
|
వ. |
అని యడిగిన నది యిట్లనియె.
| 57
|
తే. |
వనితహృదయంబులో నున్నవాఁడ వీవు
నీ ప్రతిచ్ఛాయ మదనుండు నృపవరేణ్య!
యట్లు గాకున్న నశరీరుఁ డయినయతఁడు
పుణ్యశుభమూర్తి దేవరఁ బోలు టెట్లు?
| 58
|
తే. |
తోఁకచుక్కలఁబోలు దృక్తోయజముల
వెలితి లేకుండ మీబోఁటి చెలులఁ జూచుఁ
గాంత వీక్షింప దరగంటఁ గాని మమ్ము
నేము నేసినయపరాధ మేమి? సెపుమ.
| 60
|
క. |
భూపాల! మెఱుఁగుఁబోఁడుల
చూపులకంట్రాయి నీదు సొబ గ ట్లగుటన్
మాపిన్నది యిసిఱింతల
చూపుల నరగంట వెఱచుచు న్నినుఁ జూచున్.
| 61
|
క. |
కలకంఠి దనకు వలసినఁ
‘గలికీ’ యని నిన్నుఁ బిలుచుఁ గలమధురముగా
‘నల’ యను రెండక్షరములు
పలుకఁగ నాలుకకు నెంత భారంబొ కదా?
| 62
|
తే. |
మగువ దేవరదివ్యనామము జపించు
నెమ్మనమ్మున నిత్యవ్రతమ్ము గాఁగ
నచ్ఛముక్తాఫలైకావళిచ్చలమునఁ
జన్నుగవ నక్షసూత్రంబు సంతరించి.
| 63
|
చ. |
మదగజరాజకుంభముల మచ్చరికించు చురోజకుంభముల్
గదిసి కలంత మేరయునుఁ గైకొనియున్నవి యెల్లవారికిన్
విదితము గాఁగ నిట్టితఱి నీచెలిడెందమునందు నేనియుం
గదలక మాకు నుండ నవకాశము లేదు గదే కళావతీ!
| 65
|
తే. |
రమణిహృదయంబునను మహారాజ వీవు
గరిమ విచ్చేసి యుండిన కారణమున
దీనివక్షోరుహంబు లాలోన నుండ
నెడము లేకున్న మరి కదా వెడలె వెలికి?
| 66
|
వ. |
అని కళావతి రాజు నుద్దేశించి.
| 67
|
ఉ. |
వంచన యింత లేక కరవాఁడినఖంబుల నొక్కి నొక్కి నొ
ప్పించితి రెండుసేతులనుఁ బెద్దయులావున నొత్తి యొత్తి పీ
డించితి విట్టిఱాకటికిడెందమువానికి నీకుఁ గాక మా
చంచలనేత్రయొప్పులకుచంబులు పయ్యెదలోన డాఁగెడున్.
| 67
|
ఉ. |
మ్రుచ్చిలి గంధవారణసమూహము కుంభవిలాససంపదల్
మ్రుచ్చిలి మించుపయ్యెదలలోపల డాఁగుచు నుండు నెఫ్టు మీ
నెచ్చెలికత్తెచన్నుఁగవ నీవు విచారము సేయుమా మదిన్
మ్రుచ్చుల గిట్టి పట్టుదురు నొంపుదు రేమనవచ్చు రాజులన్.
| 69
|
వ. |
అని పలికి రాజు కళావతీ! మామాటలకుం బ్రత్యుత్తరంబులు పొసంగ నిచ్చితి; మేలనవచ్చు! నీప్రసంగం బిట్లుండె నీచెలికత్తియ నేఁడు మాతోడ నేల పలుకదు? నీవు చెలిఁ జేరి మంతనంబుండి తదభిప్రాయం బెఱింగి మాకుం జెప్పుమా. మెచ్చుగల దనినం బ్రసాదం బని మదనరాజకార్యషాడ్గుణ్య
|
|
|
చక్రవర్తిని యగు నయ్యింది దమయంతిం జేరవచ్చి యషడక్షీణమంత్రరహస్యంబున.
| 70
|
మ. |
వరివస్యానియమం బఖండితముగా వాత్స్యాయనీయాదిక
స్మరశాస్త్రంబులు వింటి నాముఖమునన్ జాణుండు నీభర్త నే
ర్పరివై చిత్తముకీ లెఱింగి సురతప్రాగల్భ్యముల్ సూపితే
సరసీజానన! యన్న నుగ్మలి వయస్యన్ వ్రేసెఁ గెందామరన్.
| 71
|
వ. |
వ్రేసి యసూయాకుటిలం బగుకటాక్షవీక్షణంబునం దర్జించె, నిట్లు నిర్భర్త్సింపఁబడి వైదర్భిం జూచి రిత్తయలుకఁ దెచ్చుకొని 'యుపదేశగురువ నగునాకు రతిరహస్యవార్త సెప్పవైతి, ధూర్తవై నీవు సెప్పకుందు గాకేమి? నా నేర్పున నీమగనిచేతన చెప్పించెద, నిదె చూడు' మన మఱియుం గొంతతడవు మంతనం బున్నయదియై శుద్ధాంతచారిణి మహీకాంతునితో నిట్లనియె.
| 72
|
తే. |
'అధిప! వైదర్భి దర్భాంకురాగ్రబుద్ధి
మనతలంపులఁ బోల దీమగువతలఁపు
బాల యనుచున్నవార మిప్పద్మనయన
నిట్టి ప్రౌఢియుఁ గలదె యేయింతులకును?
| 73
|
|
వ. ప్రణయకోపంబులు రతిదీపనౌషధంబులు; పొలయలుక లేక మగవారికి మగువలు బ్రాఁతులు గారు; దీర్ఘంబు లయ్యెనేని యవియే ప్రేమభంగకారణంబులు, గావునం గోపం బింతమాత్రంబు చాలు నని పలికి దేవరమాఱుగా బాదప్రణామంబు సేయంబోయి లీలాకమలంబున మొత్తువడితిఁ, బడుదుఁగాకేమి? యమ్మత్తకాశినిచిత్తం బెఱింగి నచ్చితి నవధరింపుము.
| 74
|
ఉ. |
నా మది నమ్ముకున్నది విదర్భనరేంద్రతనూజ నిన్ను సు
త్రాముఁడ వంచు నీయరమరంబునఁ బో మన సీదు నీకు సు
త్రాముఁడు గానివానికి బ్రతాపమునం జదలేటిపైఁడికెం
దామరపువ్వుఁ దే వశమె ధాత్రికి మాటలు వేయు నేటికిన్?
| 75
|
క. |
దంభోళిభాగ్యరేఖా
దంభంబునఁ బ్రస్ఫుటముగ ధరియించెదు హ
స్తాంభోజంబున దేవర
జంభారివె యగుట కేల సందేహింపన్?
| 76
|
తే. |
లోకపాలుఁడ వస్వల్పలోచనుఁడవు
వజ్రపాణివి దేవతావల్లభుండ
విన్నిలాంఛనములఁగూడ నింద్రుఁడవుదు
నైషధుండ వగుటకుఁ జిహ్నంబు సెపుమ.
| 77
|
వ. |
మహేంద్రుం డింద్రజాలమాయావిదుండు, స్వయంవరసమయంబునం దెట్లట్ల నలరూపధారియై వచ్చెనో యని శంకించుచున్న యది. మందాకినీకాంచనకమలదానంబు సుమీ యీసందేహంబునకు నిదానంబు.
| 78
|
ఉ. |
రోయఁ డొకించుకేనియు మరుత్పతి యన్యకళత్రదూషణా
న్యాయము సేయ మన్మథమదాంధత నాశ్రమభూమిఁ గొక్కురో
రో యని కూయఁడే యతఁడు గుక్కుటమై నడిరేయి గౌతమ
ప్రేయసిఁ బొందఁ గోరి తనపెద్దతనంబు జలంబుపాలుగాన్.
| 79
|
వ. |
నీవు తత్త్వనైషధుండ వైతేని యనన్యసాక్షికంబు లగుశయ్యారహస్యంబు లుగ్గడించి యిప్పంకజాక్షిశంకాకలంకం బపనయింపు మనుటయు మందస్మితసుందరవదనారవిందుం
|
|
|
డై యయ్యిందుముఖి నుద్దేశించి పురందరుం డనుసందేహంబు డిందుపడునట్లుగా మహీపురందరుం డిట్లనియె.
| 80
|
తే. |
మఱచితే నెమ్మనంబులో మెఱుఁగుబోఁడి!
ప్రథమరతికేళి నతిపరిశ్రాంతిఁ బొంది
కూడ రెండవరతికి నూల్కొనని నిన్ను
గ్రీష్మయామిని యని యేను గేలిగొంటి.
| 81
|
తే. |
నీవు మృదుశయ్యం గపటంపునిద్ర వోవ
నెలఁత! కేల్దమ్మి యిడితి నీనిమ్ననాభి
నప్పు డచ్చోటఁ బులకంబు లంకురింప
నంబురుహనాభి వైనచందంబుఁ దలఁపు.
| 82
|
ఉ. |
కామిని! ఘర్మ దువులు గస్తురిబొట్టునఁ దోఁగి రేఖలై
గోమలగండపాళికలకోణములన్ దిగజాఱ నంచల
శ్యామల మైనయాత్మవచనాబ్జముఁ జూతుఁగదే మదీయచిం
తామణిదామదర్పణమున న్నెఱిఁ దత్సమయోచితంబుగాన్.
| 83
|
తే. |
తరుణి! యెఱుఁగవె వీటికాదానవేళ
గురుజనప్రాంతమునయందు గూఢవృత్తి
నాగవల్లీదళంబు నెన్నడుమఁ జీఱి
మడిచి యందిచ్చినపుడు గోరిడుదుఁ గేల?
| 84
|
ఉ. |
మానిని! భోజనావసరమధ్యమునం గొనియాడ గోస్తనిం
దేనియ సంస్తుతింప వినుతింపను మీఁగడ ఖండశర్కరా
పానక ముగ్గడింపఁ బ్రతిపక్షచటూక్తినిసర్గరోషర
క్తానన మైననీయధర మల్గునొ యంచు మదిం దలంకుచున్.
| 85
|
తే. |
ఆననం బాదిగా నాభి యవధి గాఁగఁ
బ్రేమ భవదంగకములు చుంబించునపుడు
|
|
|
చరమచుంబనవేళ నోసరసిజాక్షి!
యేను జెక్కిలి గిలిగింత లిడుటఁ దలఁతె!
| 86
|
మ. |
అని సంకల్పభవైకసాక్షు లగుశయ్యానేకసంభోగచి
హ్ననలన్ భూపతి ప్రత్యభిజ్ఞ కొఱకై యందంద వాక్రువ్వ
నవ్వనితారత్నము వాలుఁగన్నులఁ బతి న్వారించుచు న్మూనె నొ
య్యన ధాత్రేయి శ్రుతిద్వయంబు నిజహస్తాంభోజయుగ్మంబునన్.
| 87
|
వ. |
ఇట్లు లజ్జావశంబునం దనవీనులు మూసిన.
| 88
|
తే. |
అధిప! తాటంకచక్రధారాంచలములు
వాఁడు లతికోమలములు పూఁబోఁడిచేతు
లొయ్య నేతెంచి శ్రుతరోధ ముడుప నీకు
నర్హమాయాస మైనను నయ్యెఁ గాని.
| 89
|
వ. |
అనిన విని నీవు మాన్యురాలవు నీమాట యతిక్రమింపవచ్చునే! యనుచు నమ్మచ్చకంటిం గ్రుచ్చి కౌఁగిలించుకొని శయ్యాంతలంబునకుం దెచ్చి ముచ్చట వోవం జెక్కుటద్దంబులు ముద్దు పెట్టుకొనియె నయ్యవసరంబున సమీపకక్ష్యాంతరంబుననుండి వైతాళికపురంధ్రి యుచ్చైస్స్వరంబున.
| 90
|
సీ. |
అవధారు దేవ! మధ్యాహ్నసంధ్యావేళ
దినయౌవనంబు దోతెంచె నిపుడు
అతితీవ్రతాపతప్తాంగియై మేదిని
భవదాప్లవనవాఃపిపాసు వయ్యె
మార్తాండమండలీమధ్యభాగంబున
నీడెందమునఁబోలె నిలిచె శివుఁడు
|
|
|
నిష్ప్రతీపం బైననీప్రతాపంబుతో
హెచ్చుకుందాడె నీరెండవేఁడి
|
|
తే. |
నీలనీలంబు లైననీనిడుదనెఱుల
యంచుఁ బ్రవహించు చమలగంగాంబుధారఁ
దలఁచుగాక కళిందజాసలిలవేణి
తరళతరవీచికాపూర్వపరిచయంబు.
| 91
|
వ. |
అని వైతాళికపురంధ్రి పలికిన.
| 92
|
తే. |
ధరణినాథుండు గేళిసౌధంబు డిగ్గి
జలక మింటికి నేతెంచె సమ్మదమున
నవసరము వేచియున్న నానావనిపులు
దవ్వుదవ్వుల నిలిచి వంచన మొనర్ప.
| 93
|
తే. |
అంగుళిక్షేపలోచనాపాంగభంగి
విభ్రమభ్రూతరంగసంవేల్లనముల
నాదరంబు ప్రసాదించి యవ్విభుండు
సకలనృపతుల నిజనివాసముల కనిచె.
| 94
|
తే. |
కలపములతోడి ననయక్షకర్దమమున
నలుఁగు వెట్టించికొని రాజనందనుండు
మహితమృగనాభిపంకంబు మౌళిఁ దాల్చి
జలజలోచన లార్పంగ జలకమాడె.
| 96
|
చ. |
మహీపతి భామినీకరసమంచితకాంచనకుంభతీర్థవా
ర్లహరులు మూర్ధభాగమున వ్రాలఁగనొప్పె విలోచనోత్సవా
వహమహనీయమూర్తి యయి వారిజలోచనపాదతీర్థవా
ర్లహరులు మూర్ధభాగమున వ్రాలఁగనొప్పుహిమాద్రి కైవడిన్.
| 97
|
క. |
వ్యామగ్రాహ్యస్తను లగు
భామలు మును జలక మార్పఁ బదపడి నిషధ
స్వామికిఁ దీర్థం బార్చిరి
భూమీనిర్జరులు మంత్రపూతాంబువులన్.
| 98
|
ఉ. |
అంతరకల్ప్యమానచుళు కాచమనంబుగ నైషధక్షమా
కాంతుఁడు తీర్థమాడె మధుకైటభవైరపదాంబుజోదరో
ద్వాంతమధూళి యైనశుభవారి మహీదివిజు ల్వినిర్మల
స్వాంతులు చేరువ న్నిలిచి వారుణసూక్తము లుచ్చరింపఁగన్.
| 99
|
తే. |
కమలకింజల్కరేణుసంకాశ మైన
గౌరమృత్స్నాద్రవం బంగకములఁ బూసి
తీర్థమాడె మహారాజు త్రిదశ సింధు
పుణ్యజలముల సంకల్పపూర్వకముగ.
| 100
|
క. |
గర్భధృతహరితకోమల
దర్భం బై యొప్పె ధరణిధవుహస్తము వై
దర్భీకుచయుగవిరహహ
విర్భుగ్ధూమాంకురాభివృతమునుబోలెన్.
| 101
|
తే. |
మృదులతరగౌరమృద్బిందువదనచంద్ర
చికురశేషాంబుమౌక్తికప్రకరదశన
గురుపయఃకుంభపృథులవక్షోజకుంభ
పతి భజించె గంగాజలాప్లవనలక్ష్మి.
| 102
|
సీ. |
సీమంత మేర్పడఁ జికురభావమున సు
శ్లిష్టబంధంబుగ శిఖ యమర్చి
గన్నేరుఁబూచాయఁ గనుపట్టుజిలు గైన
సలిలకాషాయవస్త్రంబుఁ గట్టి
|
|
|
చంద్రాతపముతోడ సరియైన వెలిపట్టుఁ
బుట్ట ముత్తరవాసముగ ధరించి
ప్రక్షాళితము లైనపదియాఱువన్నియ
కనకంపుగొడుగుఁబాగాలు దొడిగి
|
|
తే. |
శైవుఁ డగుబ్రాహ్మణబ్రహ్మచారి యిచ్చు
హస్త మవలంబనంబుగ నల్లనడిచి
నియతమౌనవ్రతంబుతో నృపతి సొచ్చె
శాంతచిత్తుఁడై దేవపూజాగృహంబు.
| 103
|
సీ. |
అభినవాజ్యసమేధితాఖండదీపంబుఁ
బుష్పమండలికావిభూషితంబు
ననవద్యబహునివేద్యసమన్వితంబును
వివిధచిత్రసువస్త్రవిలసితంబు
నఖలతీర్థాంబుపూర్ణార్ఘ్యపాత్రంబును
గలధౌతరత్నోపకరణచితము
శశికాంతకుట్టిమక్ష్మాకుట్టమితమును
జందనస్రక్కుశాక్షతయుతంబు
|
|
తే. |
నయినయద్దేవపూజాగృహంబునందు
భద్రపీఠాసనస్థుఁడై పరమనియతి
నాగమోక్తప్రకారంబు ననుసరించి
శంభులింగంబుఁ బూజించె జనవిభుండు.
| 104
|
తే. |
పసిఁడిదుత్తూరపుష్పంబు ఫాలనయను
పానవట్టంబుపైఁ బెట్టఁ బార్థివుండు
|
|
|
విశ్వపతి యాత్మసంగ్రామవిజయలబ్ధ
మదనకాహళముగ దాని మదిఁ దలంచె.
| 105
|
క. |
అమృతాంశుమౌళిమౌళిం
గమలభవకపాలమాలికకు సదృశముగా
విమలారవిందకోరక
సముదయమాల్యంబు నిషధజనపతి చుట్టెన్.
| 106
|
సీ. |
ఖట్వాంగపాణిఁ జెంగల్వపుష్పంబుల
ఫాలలోచను బిల్వపల్లవముల
నాగేంద్రకేయూరు నాగ కేసరముల .
బాలేందుకోటీరుఁ బాటలములఁ
గుసుమకోదండారిఁ గుండవర్ధనములఁ
గాంచనాచలచాపుఁ గాంచనముల
నంబికాహృదయేశు నసితాంబుజంబుల
దక్షాధ్వరధ్వంసి దమనకములఁ
|
|
తే. |
బొండుమల్లియవిరిదండ ఖండపరశు
సఖిలసురసార్వభౌము దూర్వాంకురముల
బంతిశ్రీవత్సలాంఛనప్రాణబంధు
శివునిఁ జేమంతిబంతిఁ బూజించె నలుఁడు.
| 107
|
ఉ. |
డగ్గఱ మేదినీపరిబృఢప్రవరుండు సువర్ణపాత్రలన్
బుగ్గన దివ్యసౌరభవిభూతి యెలర్పఁగ సాత్కరించెఁ బెం
పగ్గల మైనభక్తి మహిషాక్షరజస్త్రసరేణుసమ్మిళ
ద్గుగ్గులుధూపధూమములు గోమలతారకరాజమౌళికిన్.
| 108
|
తే. |
సరసధూపార్థమై కామశరములందుఁ
బురములందునుఁ బొగసూపె భూవరుండు
|
|
|
మదనసంహారుఁడునుఁ బురమర్దనుండు
నయినదేవర కామోద మావహిల్ల.
| 109
|
సీ. |
పద్మాసనస్థుఁ డై భావించె మానస
కమలకర్ణికయందుఁ గాలకంఠుఁ
బంచాస్యుమ్రోల జపించెఁ బంచబ్రహ్మ
పంచాక్షరంబులఁ బరమనియతి
భక్ష్యభోజ్యాదికబహుపదార్థంబుల
నసమాక్షునకు నుపహార మిచ్చె
రాజదేవోపచారప్రకారంబుల
నతిభక్తిఁ గొలిచె రాజార్ధమౌళి
|
|
తే. |
మంత్రపుష్పంబుఁ బెట్టె మన్మథవిరోధి
మూర్ధభాగంబునందు సమ్మోద మెసఁగ
నవనిసంస్పృష్టసకలాంగుఁ డగుచు మ్రొక్కె
నిఖలలోకైకభర్తకు నిషధరాజు.
| 110
|
వ. |
అనంతరంబ పరమపురుషునిం బురుషోత్తము నారాధింప నద్దేవునిసన్నిధికి వచ్చి.
| 111
|
సీ. |
కీలుకొప్పునఁ బైఁడిగేదంగిరేకులు
గొనలు గానంగ రాఁ గుదురుపఱిచి
కర్ణపాశంబులఁ గలధౌతమయపాండు
పుండరీకవతంసములు ధరించి
బాహుమధ్యంబునఁ బవడంపుఁ జివుళులఁ
బచ్చలఁ దోమాలె యచ్చుపఱిచి
|
|
|
చరణపీఠంబుల గరుడాంకమణిఖండ
తుళసీదళంబులు నెలవుకొలిపి
|
|
తే. |
పురుషసూక్తనిపాఠంబు పరిచయించి
పావనాష్టాక్షరీమంత్రపఠనఁ దగిలి
పాంచరాత్రోదితక్రియాపథమునండు
నలిననాభు సమారాధనంబు సేసె.
| 112
|
చ. |
గురుతరకౌస్తుభాశ్మమణికుట్టిమ మైనరథాంగపాణిపే
రురమునఁ బూన్చె నొక్కయసిలోత్పలమాలిక షట్పదావళీ
గరుదనిలావతారమునఁ గంపము నొందెడు రేకు లిందిరా
తరళకటాక్షవీక్షణవిధావికటాయిత మభ్యసింపఁగాన్.
| 113
|
క. |
అలనాఁటి కాళియోరగ
వలనంబులు దలఁప కున్నె వనమాలి మది
న్నలదత్తవికచవిచికిల
కలికాడుండుభకదంబఘటితాంగకుఁ డై.
| 114
|
క. |
నరనాథసమర్పిత మగు
విరవాదులదండ యొప్పె వెన్నుని పాదాం
బురుహంబున నంగుటమున
నురలినయాకాశగంగ కుపమానంబై.
| 115
|
వ. |
ఇవ్విధంబున నిషధదేశాధ్యక్షుండు పుండరీకాక్షు నర్చించి ప్రణామంబు సేసి యప్పరమపురుషు నిట్లని స్తుతియించె.
| 116
|
సీ. |
జయ భూర్భువస్స్వస్త్రిజగదేకనాయక!
జయ సర్వదేవతాసార్వభౌమ!
|
|
|
జయ పూర్వగీర్వాణసంహారకారణ!
జయ కుక్షినిహితవిశ్వప్రపంచ!
జయ జహ్నుకన్యకాజనకపాదాంభోజ!
జయ కోమలాంబుదశ్యామలాంగ!
జయ వైజయంతికాస్రక్ప్రభాలంకార!
జయ పుండరీకవిశాలనయన!
|
|
తే. |
జయ శతక్రతుముఖమరుచ్చక్రవాళ
కనకకోటీరచారుసంఘటితనూత్న
రత్ననీరాజనక్రియారాజమాన
చరణపీఠాంతికోద్దేశ! జయ రమేశ?
| 117
|
క. |
భవదీయము లగుమంత్రము
లవాఙ్మనసగోచరంబు లంభోరుహసం
భవభవుల కనిన శక్యం
బవునే మాబోటివారి కచ్యుత! పొగడన్?
| 118
|
శా. |
ఓదామోదర! యిందిరాయువతివిద్యుల్లేఖతో నూత్నపిం
ఛాదామత్రిదశేంద్రకార్ముకముతో సమ్యక్కృపాదృష్టితో
నీ దేహం బనుమేచకాంబుదము మన్నేత్రద్వయీచాతకా
హ్లాదంబుం బొనరించుఁగాత భవతాపాటోపముం బాపుచున్.
| 119
|
తే. |
కపటమత్స్యంబ వై నీవు గడలి నడుమఁ
బుచ్ఛ మల్లార్ప నెగసినభూరిజలము
మింటఁ గడుఁ దెల్లనై పాఱుచుంటఁ జూచి
యభ్రనది యంచు వర్ణించె నఖిలజగము.
| 120
|
క. |
గతభువనసర్గసముదయ
ధృతభూవలయాంకసదృశదృఢచరమతనూ
వితతబహుచక్రచిహ్నముఁ
బతగధ్వజ! కపటకచ్ఛపము నినుఁ గొలుతున్.
| 121
|
తే. |
చించి వెడలినతనురుహశ్రేణిచేతఁ
బద్మజాండంబు కడప పూబంతిఁ బోలఁ
బెరిఁగియున్నట్టికిటిరూపధరుని నిన్ను
ఖురచతుష్టయబిలచతుశ్శరధిఁ గొలుతు.
| 122
|
మ. |
అతిగంభీరహిరణ్యదైత్యహృదయాహంకారకూపోదరా
పతితస్వర్గరమాసువర్ణకలశప్రత్యుద్ధృతిప్రక్రియా
యతపంచాంగుళలోహయంత్ర మగునీహ స్తంబు వర్ణింతు ను
ద్ధతకంఠధ్వనికుంఠితారిహృదయోత్కంఠా! నృకంఠీరవా!
| 123
|
తే. |
'భోగి సహవాససంబంధములు భజింతు
భువనధార హస్తంబునఁ బోయు' మనుచు
రెంటమాటల బలిఁ బ్రతారించినట్టి
దంభవామన! మామనస్తాప ముడుపు.
| 124
|
మ. |
తఱి నాక్రాంతసమ లోక! బలిదైత్యధ్వంసి! యోదేవ? నీ
యఱకా లుద్ధతి రాహుమండలము బ్రహ్మాండంబుతో నొత్తినం
గుఱుగుఱ్ఱం చెడ సంది బిట్టొరలునగ్ఘోరాహి నీ యంఘ్రికిన్
గిఱు జెప్పైనవిధంబు నామనములోఁ గీలించిన ట్లయ్యెడున్.
| 125
|
తే. |
తిరిగె నఁట జాంబవంతుండు దేవ! నీకు
దైత్యబంధనవేళఁ బ్రదక్షిణంబు
|
|
|
దద్భ్రమీచక్రవలయంబు దంభవటుక!
యుచితబంధనరజ్జు వై యుండ కున్నె?
| 126
|
తే. |
క్షత్రజాతికి నీచేయి కారణంబు
దత్క్షయంబున కదియ నిదాన మయ్యెఁ
గారణమునంద విలయంబు గార్యమునను
ననుట యుచితంబు గాదె రామావతార!
| 127
|
సీ. |
తను సృజించినవిధాతకుఁ బూర్వరాముండు
లీలాభ్యసనహస్తలేఖనముగఁ
దనవిశ్వభూషణత్వముతోడ ఖరదూష
ణచ్ఛిదాకేళి యన్వయము నొందఁ
దన్నుఁ జింతించునధ్యాత్మవేదులు రావ
ణానీకహృన్మోహ మాసపడగఁ
దనఖడ్గధారఁ ద్రెచ్చినశంబుకునికీర్తి
కడలికంబుకదంబకంబు గెలువ
|
|
తే. |
దివ్యనామసహస్రప్రతినిధి యనఁగఁ
దారకబ్రహ్మ మనఁ దనపేరు మెఱయ
నతిశయిల్లిన నీసప్తమావతార
మహరహంబును వర్ణింతు నాదిపురుష!
| 128
|
సీ. |
జనకాజ్ఞకును లోకజనవాదమునకుఁగా
నుర్వీజ యగులక్ష్మి నుజ్జగించి
తజునిఁ బుత్రుని జేసి తట్టినెయ్యముపొంటె
నజునిపౌత్త్రుండవై యవతరిలితి
ధాత్రి నిక్ష్వాకుసంతతి నుద్భవం బొంది
యాశ్రయించినవారి కమృత మిత్తు
|
|
|
వాలాయముగ విశ్రవసుకూర్మికన్నెకు
విశ్రవస్త్వము గూర్ప వేడ్కపడితి
|
|
తే. |
పెద్ద కొలంబు వాసితి ప్రియవధూటి
ననుజు నొకనాఁడు వాసి దేహంబు దొఱఁగి
తెవ్వఁడెఱుఁగును నీచంద మిట్టి దనఁగ
రాజితానేకగుణభద్ర! రామభద్ర!
| 129
|
తే. |
కామసమ్మోహితక్రౌంచఘాతమునకు
వగచి నీచాటుకవి చెంచువానిఁ గినిసెఁ
గామమోహిత యగునింతిఁ గస్తిపఱుప
ననుజుఁ బురికొల్ని తిది నీకుఁ జనునె రామ!
| 130
|
తే. |
నందనోద్యానవాటికాంతరముఁ జొచ్చి
వితరణస్పర్ధఁ బోలె దైవతకుజంబుఁ
బెఱికి భువిమీఁదఁ బడవైచి పేర్చినట్టి
విక్రమాలంకరిష్ణు శ్రీవిష్ణుఁ గొలుతు.
| 131
|
తే. |
శైశవమునాఁడు కర్బరీశకలపాళిఁ
దెచ్చి కాళిందితరఁగల ద్రెవ్వవైతు
భావిబాణభుజాదండభంజనముస
కభ్యసన మయ్యె నీకది యజ్ఞనాభ!
| 132
|
చ. |
వలపలికన్ను నీకు రవి వారిజలోచన! చందురుండు దా
పలినయనంబు కర్ణుడును బార్థుఁడుఁ దత్ప్రియనందనుండుఁ ద
త్కులజుఁడు వీ రొకం డొకనితోఁ గలహింప సహించి తెట్లొకో?
వలపలిలోచనాబ్జమును వామదృగబ్జము వేఱె యచ్యుతా?
| 133
|
తే. |
అమరపతిసూను నిర్జించి తార్కిఁగూడి
దైత్యమర్దన! రామావతారవేళ
|
|
|
నామనఃక్లేశ ముడుగ నే యార్కి నణఁచి
తమరపతిసూనుఁ గూడి కృష్ణావతార!
| 134
|
తే. |
దైత్యమర్దన! శ్రీవత్సధారణంబు
పొసఁగు దేనర శ్రీవల్లభుండ వగుట
దామరసనేత్ర! నీవు రాధాప్రియుండ
వకట! రాధేయుఁ జంపించు టర్హమగునె?
| 135
|
తే. |
కుముదబాంధవ! రేవతీరమణ! భద్ర!
కామపాల! శరన్మేఘగౌరవర్ణ!
త్రిజగతీలోచనోత్సవ! దేవ! నీకు
నందమై యుండు నీలాంబరాకలనము.
| 136
|
క. |
బలరామకృష్ణసంజ్ఞలు
దెలుపు నలుపు నైనదివ్యతేజంబులతో
నిలమీఁద నవతరించిన
జలజాక్షునినెఱులు శర్మసౌరభ మొసఁగున్.
| 137
|
తే. |
ఏక! యద్వయవాది! త్రయీవిదూర!
యనవగీతచతుర్విధఖ్యాతిమార్గ!
పంచబాణారి! పడభిజ్ఞ! పరమపురుష!
బుధ్ధ! సంపత్పరంపరావృద్ధి నొసఁగు.
| 138
|
తే. |
బుద్ధ! నీగట్టిహృదయసంపుటము దాఁకి
కుంఠితము లయ్యె మరునంపకోల లెల్ల
మొద్దువోయికదా యిప్డు మురవిరోధి!
యలరు లెల్లను వర్తులాస్యంబు లయ్యె.
| 139
|
తే. |
ముఖ్యచతురాననుఁడ వీవు మునిశరణ్య!
గౌణచతురాననుం డలకమలభవుఁడు
|
|
|
నీవు సర్వజ్ఞుఁడవు బుద్ధదేవ! నిజము
శంభు సర్వజ్ఞుఁ డగుట లాక్షణికవృత్తి.
| 140
|
తే. |
జ్ఞానకర్మేంద్రియోపాధిసంప్రభూత
దశమహాకల్కనీహారదశశశాంక
దళమదివ్యావతారు నత్యంతనియతిఁ
గల్కిదేవుని నినుఁ గొల్తుఁ గైటభారి!
| 141
|
క. |
విశ్వవ్యాప్తయశోని
త్యైశ్వర్యసమృద్ధి విష్ణుయశుఁ డనునామం
బీశ్వర, కల్కిసమాహ్వయ
నిశ్వసదర్థ మయి చెల్లు నీజనకునకున్.
| 142
|
క. |
కురువీరపంక్తికంధర
హిరణ్యకశిపుల జయించి తీ వంబురుహో
దర! మూఁడవతారంబుల
నరహరిలీలావిడంబనప్రౌఢుఁడ వై.
| 143
|
తే. |
అర్జునచ్ఛేద మొనరించి తర్ధచక్ర
సన్నిభం బైనశితపరశ్వధముచేత
పర్వలోకేశ! సంపూర్ణచక్రధార
బాణభంజన మొనరింపఁ బరువె నీకు?
| 144
|
తే. |
ప్రథమపరమేష్ఠి వైననీప్రకృతియందు
శేషఫణిరాజ వైననీశిరసునందుఁ
గపటబాలుండ వైననీకడుపునందు
విశ్వములు నుండు నని నాథ! విందు శ్రుతుల.
| 145
|
క. |
సంసారినికరమానస, సంసద్భవనావకరరజశ్శోధని యో
కంసారి! నీపదాబ్దని, నంసాపరిశుద్ధి బుద్ధినైపుణిఁ దలఁపన్.
| 146
|
తే. |
ధర్మబీజవియన్నదీతాతపాద!
కామితార్థప్రదైనైక కల్పవృక్ష!
కామజనక! చిదాత్మప్రకాశరూప!
కమలనాభ! చతుర్వర్గగతివి నీవ.
| 147
|
తే. |
విశ్వరూప భవద్భూరివిభవమహిమ
యెంత వర్ణింపఁ జాలు మాయీమనంబు?
ప్రాఁతపైచీరచెఱఁగున బడుగువాఁడు
హేమశైలంబు చిదిపి ఱా లెన్ని ముడుచు!
| 148
|
వ. |
అని యనేకప్రకారంబులం బ్రస్తుతించి నమస్కరించె, నివ్విధంబున దేవతార్చనం బొనర్చి భోజనకార్యంబులు దీర్చి విజితవైజయంతం బగుశుద్ధాంతకేళీసౌధం బెక్కి విహితకులదేవతాభక్తియుం గృతభుక్తియు నగుదమయంతీమహాదేవితోడం గూడె ననంతరంబ.
| 149
|
శా. |
ఆరామారమణుల్ రమాసతియు దైత్యారాతియుంబోలె శృం
గారక్రీడలఁ బొద్దు పుచ్చిరి వధూగంధర్వకన్యాకళా
కీరాలాపకలాపకోకిలకుహూకేళీమయూరాంగనా
చారీమండలతాండవారభటికాసంరంభసంభావనన్.
| 150
|
తే. |
గగనహరినీలశైలశృంగమున నుండి
డొల్లిపడెఁ బ్రొద్దు జేగురుఁ గల్లువోలెఁ
చన్ని పాతసముద్ధూతధాతుధూళి
చందమునఁ దోచె దివసావసానసంధ్య.
| 152
|
ఉ. |
కోమలతామ్రచూళికలక్రొవ్వెఱసంజకుఁ బ్రోదివెట్ట ని
స్సీమకఠోరతారరుతిఁ జెట్టుప లార్చుచు నఱ్ఱులెత్తి వి
శ్రామమ పోలెఁ గూసె విలసచ్చరమాచలకూటపక్కణ
గ్రామటికాకుటీరశిఖరంబులం గుక్కుటచక్రవాళముల్.
| 153
|
చ. |
తలఁ బ్రతిబింబభానుమణిఁ దాల్చి విహారవనాంతరంబునన్
మలఁగి మలంగి పెంజిలుమునాగువుభంగి నవీనసారణీ
సలిలభరంబు దోలుకొని చయ్యన వచ్చినఁ జూచి భీతి బి
ట్టులియుచుఁ బోయె నత్తటి వియోగముఁబొంది రథాంగదంపతుల్.
| 154
|
శా. |
రశ్మిగ్రాహిగరుత్మదగ్రజకరారబ్ధావిరామభ్రమిం
గాశ్మీరాభనవేష్టకారుచిరరాగంబున్ సహస్రాంశుశా
ణాశ్మంబున్ గదియించె ధాత సవసంధ్యాఖడ్గము న్వేదనా
వేశ్మస్వాంతరథాంగదంపతిచమూవిచ్ఛేదలీలార్థ మై.
| 155
|
తే. |
సలిలనిధిసార్వభౌమకాష్ఠాపురంధ్రి
యోలగందంపుఁబసుపాడెనొక్కొ యనఁగఁ
గమలకింజల్కరేణుసంకాశ మగుచు
నింగి నెఱసంజకెంజాయ నివ్వటిల్లె.
| 156
|
క. |
కుసుమం బద్దినవిధమునఁ
బసుపున హత్తించినట్లు బంగారమునం
బస నిచ్చినగతి సంధ్యా
వసరంబున నిరిగి యరుణవర్ణం బయ్యెన్.
| 157
|
క. |
అభినవసంధ్యాతాండవ
రభసరయచ్ఛిన్న హిమధరాధరకన్యా
|
|
|
ప్రభుహారాస్థులభంగిన్
నభస్స్థలిం దారకాగణంబులు వొడిచెన్.
| 158
|
మ. |
చరమాశానికషోపలాంచలమునన్ సంధ్యాప్రకాశోదయం
బొరఁ గావించి విరించిచేఁ గొనినసూర్యుం డన్పదార్వన్నెబం
గరపుం బూదియకై వియద్విపణి వేడ్కం గాలమన్బచ్చు చె
చ్చెరఁ జెల్లించినగవ్వచౌక మన మించెం దారకాచక్రముల్.
| 159
|
మ. |
నభ మెల్లం గలయంగ నిండఁ బొడిచె న్సంధ్యావశేషాదృతా
రభటీడంబరతాండవభ్రమరికారంభంబున న్శాంభవీ
ప్రభుపాదాహతి మీఁదికి న్నెగయుచున్ బ్రహ్మాండగోళంబుతో
నభిసంబద్ధము లయ్యెనో రజతశైలాశ్మంబు లన్నట్టుడుల్.
| 160
|
సీ.* |
చుక్కలో యివి? గావు పురలోకవాహినీ
విమలాంబుకణకదంబములు గాని
తారలో యివి? గావు తారాపథాంభోధి
కమనీయపులినసంఘములు గాని
యుడుపులో యివి? గావు మృడునంబరంబున
దాపించినట్టిముత్యాలు గాని
రిక్కలో యివి? గావు రేచామ తుఱుముపైఁ
జెరివినమల్లెక్రొవ్విరులు గాని
|
|
తే. |
యనుచు లోకంబు సందేహమందుచుండఁ
బొడిచె బ్రహ్మాండపేటికాపుటకుటీర
చారుకర్పూరఫాలికాసంచయములు
మెండుకొని యోలి నక్షత్రమండలములు.
| 161
|
చ. |
హటదురులీల నిర్జరులు నచ్చరలేమలు వేల్పు టేట నొ
క్కట విహరింప సందడికిఁ గాక తొలంగి చరించుమీనక
ర్కటమకరంబు లొక్కొ! యనఁగా గగనాగ్రమునందు మీనక
ర్కటమకరంబు లెంతయుఁ బ్రకాశము నొందె నిశాప్రసంగతిన్.
| 162
|
మ. |
విపులాకాశనిపాతభీతికలనావిన్యస్తదుర్వర్ణకీ
లపరిస్ఫూర్తినిశాలతాకుసుమముల్ భాసిల్లె బ్రహ్మాండమం
టపకాష్ఠామలకీటరంధ్రరజముల్ నాకాపగాచక్రవా
కపురంధ్రీనయనాశ్రుబిందువులు నక్షత్రగ్రహగ్రామముల్.
| 163
|
ఉ. |
కాలకిరాతపాదతలఘట్టనఁ జేసి వియద్వనీమహా
కాలఫలంబు భాస్కరుఁడు గ్రక్కున నస్తమహామహీధర
స్థూలశిలాస్థలిం బడియెఁ దోరము లైనతదీయబీజముల్
నీలరుచుల్ వడిం జెదరె నింగి ననచ్ఛతమశ్ఛలంబునన్.
| 164
|
తే. |
పగలు బ్రహ్మాండభాండకర్పరమునందు
గగనమణిదీపమున నైనకజ్జలంబు
రాలెనో కాక యంధకారంబుపేరఁ
గాలవాతూలహతి నిశావేళయందు.
| 165
|
వ. |
అంత నమ్మహీకాంతుం డట మున్న నిశాముఖోచితక్రియాకలాపంబులు నిర్వర్తించుటం జేసి క్రీడాసౌధంబు నేడవనిలువునకు దమయంతీసమేతంబుగా నరిగి యచ్చోట శుద్ధాంతకాంతాజనంబు పరివేష్టింపం గొలువుండె, నప్పుడు పొడుపు గుబ్బలిమీఁదం బొడతెంచుపూర్ణచంద్రబింబంబుం బొడగని యంగన కిట్లనియె.
| 166
|
తే. |
శుద్ధకాంచనపిండంబు సూర్యఁ దిగిచి
పూర్ణశశిపూఁతబంగారుపుటము నొసఁగి
సాయ మనుధూర్తు వంచించె జగమునెల్ల
దెల్లఁబాఱెడునదె చూడు తెఱవ! విధుఁడు.
| 167
|
సీ. |
ఇందుకాంతంబుల నెబ్భంగి వడిసెనో
నిష్యందకీలాలనిర్ఝరములు?
చక్రవాకముల లోచనయుగ్మకముల నె
ట్లుబ్బెనో విరహబాష్పోదకములు?
చంద్రాతపమున నే చందాన గురిసెనో
ధారాళ మగుచు నీహారవృష్టి?
విపినవీధికల నే విధమునఁ గాఱెనో
శేఫాలికాపుష్పసీధుధార?
|
|
తే. |
యన్ని ముఖముల నభివృద్ధి యెసఁగ దేని
యొదిఁగి పవలింటియట్లన యుండుఁగాక
యూర కేల విజృంభించు నుదధు లేడు
నుత్పలేక్షణ! యీశశాంకోదయమున.
| 168
|
క. |
లీలావతి! యామవతీ
కాళిందీసైకతంబు గగనోదన్వ
ద్వేలాడిండీరము చం
ద్రాలోకం బింత యొప్పునా యివ్వేళన్!
| 169
|
ఉ. |
దేవి! తమోమషీరసము తేటఁ బొసంగఁగ గట్టివెట్టి యం
కావళి వ్రాయఁగాఁ దొడఁగె నంబరసంపుటకాంతరంబునం
|
|
|
బూవిలుకానిశౌర్యగుణముల్ హరిణాంకుఁడు ముత్తియంబులం
దావడముల్ రచించిన విధంబున రుక్ఖటికాముఖంబులన్.
| 170
|
తే. |
చామ! యీశానమౌళి నీచందమామ
కొంచెమైయుండునవయవాంకురముకంటె
డాసి గ్రహముండమాల్యమండలమునడుమఁ
గీల్కొనిన రాహువక్త్ర మీక్షించి యొక్కొ?
| 171
|
క. |
శివునకుఁ జకోరమునకున్
దివిజులనుసు నిచ్చఁ దుహినదీధితి యీతం
డవయవము రుచుల నమృతము
సువిద! తగుం గల్పతరుసహోదరుఁ డగుటన్.
| 172
|
ఉ. |
అంగద నంకవర్తి హరిణాభ్యవహారవిలోలబుద్ధి యై
మ్రింగు విధుంతుదుం డనెడుమేటిభుజంగమ మీశశాంకుసా
రంగముఁ బాయఁ డీయవసరంబున మేలని మెచ్చియో సుమీ
మ్రింగియుఁ గ్రాయు నచ్చిలువ మెల్త! విధుం గసుగందకుండఁగన్.
| 173
|
తే. |
లతలక్రీనీడఁ దిలతండులితము లగుచుఁ
గాంత! యీనిండురేఱేనికరము లమరు
నంగుళీకీలితేంద్రనీలాంగుళీయ
కంబులునుఁ బోలె లీలావనంబునందు.
| 174
|
తే. |
తండ్రి కంభోధికినిబోలె ధవళనేత్ర!
హానివృద్ధులు గల వీశశాంకునకును
|
|
|
రాజబింబనిభాస్య! కారణగుణంబు
గార్యమున సంక్రమించుట గలద కాదె?
| 175
|
తే. |
వహ్ని మొదలై యఖిలదైవతగణంబు
దృప్తిఁ బొందుదు రీసుధాదీప్తియందు
మహితపుణ్యాత్ముకళ్యాణగృహమునందుఁ
బొలఁతి! యభ్యాగతులు దృప్తిఁబొందునట్లు.
| 176
|
తే. |
ప్రవహవాయుకురంగ మంబరమునందు
డప్పిగొని యీసుధాంశుమండలము సొచ్చి
యమృతపంకంబులో నంఘ్రు లణఁగుటయును
వెడలలేకున్న యదిచూడు విద్రుమోష్ఠి!
| 177
|
సీ. |
ఓషధీసందేశభాషాప్రణిధి యైన
మృగము గాఁబోలు నీ మృగము దరుణి!
రుద్రాగ్రహత్రాసవిద్రావితం బైన
మృగము గాఁబోలు నీ మృగము దరుణి!
ప్రవహనామకమహాపవనవాహన మైన
మృగము గాఁబోలు నీమృగము దరుణి!
రోహిణీశుద్ధాంతగేహవర్ధిత మైన
మృగము గాఁబోలు నీమృగము దరుణి!
|
|
తే. |
సతతసేవాసమాయాతసకలభువన
భవ్యవిపినౌషధీలతాపల్లవాగ్ర
భక్షణక్షీబ మై సుధాపాయి యగుచు
మగువ! యీచంద్రునందు నీమృగము బ్రతికె.
| 178
|
తే. |
కంతుఁడును నీవిధుండు నొక్కంతవారు
సఖ్య మీయిద్దఱకు నొప్పుసదృశులగుట
ముదిత! యొక్కండు హరునినెన్నుదుటికంట
నొకఁడు కంసారికుడికంట నోహటిలిరి.
| 179
|
ఉ. |
బాలిక! యిసుధాకరుఁడు పంకజనాభునివామభాగదృ
గ్గోళక మైననాఁడు నవకోమలబాలతమాలకందళీ
కాళిమ గేలి సేయునడుకం దిది తన్నయనాంతరంబున
న్నీలకనీనికామఘవనీలమణిత్వము నొందకుండునే?
| 180
|
ఆ. |
కమలవిపినదాహకంఠోక్తపటుతీవ్ర
శక్తి యగుహిమాగ్ని సంగమమునఁ
గందఁబోలు శిశిరకరుడెంద మీభంగి
నాఁతి! యొండు కారణంబు లేదు.
| 181
|
క. |
హరితచ్ఛాయాచ్ఛలమున
భరఖేదము వాయ నమృతపానీయసరో
వర మగునీశశియందుం
దరుణీ! యోలాడుచున్న ధరణిం గంటే?
| 182
|
తే. |
జనకుఁ డగుదుగ్ధవార్ధి కుచ్చైశ్శ్రవంబు
గలిగె రావణంబును గలిగె నట్టి
తనకు గారాబుఁబట్టికి వనజవైరి
కొక్కకుందేలు గలుగుట యువిద! యరుదె?
| 183
|
తే. |
జ్యోత్స్ననాఁగఁ దమిస్రనానుభయభార్య
లుడుపతికినందు నొకతె దె ల్పోర్తు నలుపు
|
|
|
తాను వారికి మెచ్చుగాఁ దాల్పఁ బోలుఁ
దెలుపునలుపును నగుమేను నెలఁతి! యితడు.
| 184
|
మ. |
గణుతింపంగ నితండు పాల్కడలిన్ గారాపుఁబుత్రుండు బ్రా
హ్మణరాజోషధిభర్త నెట్టుకొని సంపాదించినన్ బ్రాఁతి యౌ
మణిమంత్రౌషధము ల్పురావిహితకర్మం బెట్టిదో కాక ల
క్షణకాలుష్యము రాజయక్ష్మమును జిక్కం బెట్టలేఁ డయ్యెడున్.
| 185
|
క. |
కాలతమతిమిరనీలీ
కాలాగురుసమకళంకకజ్జలపంక
క్షాళనగోక్షీరము లివె
ప్రాలేయకరాంశు లంబరము శోధించన్.
| 186
|
తే. |
జలదకాళిమఁ బాపంగఁ జాలెఁ గాని
సహజకాళిమఁ బాపంగఁ జాల దయ్యె
శారదారంభవేళ యీచందురునకు
నతివ! యయ్యెడి దౌఁ గానియదియుఁ గాదు.
| 187
|
తే. |
అస్తమించినయప్పు డీయమృతకరుని
కళలు పదునొక్కఁ డెక్కు రుద్రులశిరంబు
లసమబాణునిదొనఁ జొచ్చు నైదుకళలు
కాంత! యిది సూవె పదియాఱుకళల లెక్క.
| 188
|
తే. |
అమృతజంబాలముల సందు లదికి యదికి
వేయునక్షత్రముల నొక్కవిధమువానిఁ
|
|
|
జేర్చి విధి చందురునిఁగా నొనర్చెనేని
లలన! నీమోముసరి సకళంకుఁ డితఁడు.
| 189
|
తే. |
చంద్రమండల మిది పితృస్థాన మగుట
జనసమావర్జితస్వథాసలిలతిలలు
మంత్రబలమున నెక్కె నీమధ్యమునకుఁ
జంద్రబింబాస్య! లాంఛనచ్ఛాయ గాదు.
| 190
|
మ. |
ఇదే వీక్షింపు చకోరశాబకనిభాక్షీ! దీర్ఘికాహంసి యి
ప్డుదకాంతఃప్రతిబింబితుం గగనమధ్యోపస్థితుం జంద్రునిన్
మది దర్శించి నిజాధినాథుఁ డనుచున్ వాత్సల్య మేపారఁగా
జదురొప్పంబరిచుంబనంబొనరుచుం జంచూపుటాగ్రంబునన్.
| 191
|
మ. |
అకలంకాఖిలదీర్ఘికాజలతపస్యత్కైరవశ్రేణికా
ముకుళీభావసమాధిభంగకలనాముగ్ధాప్సరఃకామినీ
వికచాస్యాంబుజ మీనిశాకరుఁడు దేవీ! చూడు మీసాంద్రచం
ద్రిక లేతద్దరహాసచంద్రికలు సందేహంబు లే దెంతయున్.
| 192
|
మ. |
నవలావణ్యరసంబు పళ్లెరములోనం బోసి యగ్రంబునన్
భవదీయాస్య మొనర్చి యార్చి పిదపం బ్రాలేయరుఙ్మండలం
బు వినిర్మించె విరించి యచ్చిలుమువో పూఁబోఁడి యాచిహ్న మం
బువులం దాతఁడు చేఁ దొలంచు మిసిమిం బుట్టెన్ సరోజాతముల్.
| 193
|
శా. |
ఛాయామార్గభుజంగహారమును జంచత్తారకామండల
స్ఫాయద్దివ్యకపాలభూషణము జ్యోత్స్నాభస్మగౌరంబునై
యీయాకాశము శంభుమూర్తి యగు త న్నేర్పాటునం దెల్పెడుం
|
|
|
ద్రైయక్షాణిమభూతి సూక్ష్మతరమధ్యా! దేవి! వీక్షింపుమీ.
| 194
|
మ. |
అలరుంబోఁడి! సహస్రపత్రతులనాహంకారలీలావిశృం
ఖలసౌభాగ్యకళాకలాప మగునీకాంతాస్యముం బోలఁగా
వలదా యీశశికిం గళంకికి మృగవ్యాధోత్తమాంగస్థలీ
వలదాకాశధునీతటావనివనీవానీరకోయష్టికిన్.
| 195
|
క. |
దేవి! యితఁడు హర్యక్షీ
భావము భజియించి యుండఁ బ్రకృతివిరోధం
బేవెంటఁ గలిగే నొక్కో
కావలమున నకట! సింహికాసూనునకున్.
| 196
|
స్రగ్ధర. |
నానాధావళ్యసంతా
నములకును నిదానంబు నా నొప్పు నీరా
కానక్షత్రేశుమేనం
గలదె యొకకళంకంబునుం గాకతాళీ
యానన్ బైత్రోవ రాఁగా
హరిహయనగరీహస్తిరాడ్గండపిండ
స్థానాపాదానదాన
ద్రవనవలవముల్ దాఁకెఁగా కభ్రవీథిన్.
| 197
|
మ. |
ఉడువీథీహరినీలరత్నమయపాత్రోత్సంగభాగంబునం
గడుగారా మొనరన్ ఝషాంకునకు నంకచ్ఛాయ యన్ కమ్మనూఁ
బిడితోఁ గూడ సుధాంశుబింబ మనునేయిం బాయసాహారముం
|
|
|
గుడువంబెట్టెనొ బంతికూళ్లకును జాకోరంబు లేపారఁగాన్?
| 198
|
శా. |
అభ్రాంతంబున సింహికాతనయదంష్ట్రాంకూరయంత్రోద్భవ
శ్వభ్రాళీపతయాళుదీధితి సుధాసారచ్ఛటావాహియై
శుభ్రాంశుండు సహస్రధారకలశస్ఫూర్తిం బ్రవర్తిల్లె హే
లాభ్రాజిష్ణురతిస్మరోద్వహనకల్యాణార్థసంసిద్ధికిన్.
| 199
|
క. |
పదియేనుదినంబులకుం
బదియే న్గళ లెక్క మేను పరిపూర్ణముగా
బదియాఱవకళ యితనిది
మదిరాక్షి! వృషధ్వజుండు మౌళి ధరించున్.
| 200
|
సీ. |
ముక్కంటితలపువ్వు మున్నీటిలేఁబట్టి
కైటభారాతిడాకన్నుదమ్మి
గగనలక్ష్మికి దంతకాండతాటంకంబు
కలువలవిందు జక్కవలగొంగ
వలరాజు వెల్లెల్లి వనజబాంధవునుద్ది
శిశిరాంశురత్నంబుచేఁదుమందు
గన్నులపండువు గ్రహసార్వభౌముండు
సురలయాఁకటిపంట యిరులదాయ
|
|
తే. |
శ్రీమహాలక్ష్మిసైదోడ శేషభువన
సౌధకలధౌతకలశంబు చందమామ
రాజవదన! కల్యాణపరంపరాభి
వృద్ధి గావించుఁగాత మీవిశ్వమునకు.
| 201
|
వ. |
అనుచు నిజవంశమకుటమాణిక్యం బైనరోహిణీరమణునకు రమణీసమేతంబుగాఁ బుష్పంజలి సమర్పించి యంగుళీయకమణిప్రభాసందోహంబు చంద్రికావాహంబుపై వెల్లిగొన భూవల్లభుండు పాణిపల్లవంబులు మొగిడ్చి ఫాలభాగంబునం గీలుకొలిపె. నివ్విధంబున నాదంపతు లనురాగసంపద పొంపిరివోవం బ్రాజ్యంబు లగు రాజ్యసుఖం బనుభవించుచుండిరి!
తత్కాలంబునం జాతుర్వర్ణ్యంబు నిజధర్మంబుఁ దప్పక మెలంగె. వాతజ్వరాగ్నిక్షుత్పిపావ్యాధితస్కరభయంబు లుడిగెఁ; బర్జన్యుండు గాలంబు దప్పక వర్షించె. దేశంబులు ధనధాన్యసమృద్ధంబులయ్యె; సురభు లమృతంబులు గురిసెఁ; దరుపులుపుటకపుటకంబున మధుస్యందంబుఁ జెందె; సకలజనంబులు పరమానందంబు నొందిరి. మామల్లదేవీనందనుండును శ్రీహీరరోహణాచలరత్నప్రరోహంబును జింతామణిమంత్రచింతనఫలంబును గన్యాకుబ్జరాజస్థానరంగమంగళాభరణంబుసు గౌడవిజయకావ్యకర్తయు గవిచక్రవర్తియు ఖండనగ్రంథకారుండును వైతండికకమలషండవేదండంబును నగు భట్టహర్షమహాకవీశ్వరుండుఁ గవికులాదృష్టాధ్వపాంథుం డొనర్చిననైషధశృంగారకావ్యం బాంధ్రభాషావిశేషంబు నశేషమనీషిహృదయంగమంబుగా శబ్దం బనుసరించియు నభిప్రాయంబు గుఱించియు భావం బుపలక్షించియు రసంబు పోషించియు నలంకౌరంబు భూషించియు నౌచిత్యం బాదరించియు ననౌచిత్యంబు పరిహరించియు మాతృకానుసారం
|
|
|
బునఁ జెప్పఁబడి యీభాషానైషధకావ్యం బాపస్తంబసూత్ర! భారద్వాజగోత్ర! యుభయకులపవిత్ర! దానవిద్యాసత్త్ర! నెల్లూరితూర్కరాజపౌత్త్ర! మామిడి పెద్దనామాత్యపుత్త్ర! పెదకోమటివేమభూపాలకరుణాపాత్ర! వినయవివేకసాహిత్య! సింగనామాత్య! నీవు కృతినాయుకుండవుగాఁ బుణ్యశ్లోకుండు నలుండు కథానాయకుండుగా విలసిల్లు నాచంద్రతారార్కంబు.
| 202
|
సీ. |
నలచక్రవర్తి పుణ్యశ్లోకుఁ డగుటను
దమయంతి పతి దేవతావతంస
మగుట నప్పరమభవ్యపురంధ్రిపురుషుల
చరితంబు సత్కావ్యసరణిఁ గూర్చి
చింతామణీమంత్రసిద్ధుం డుపాధ్యాయ
భట్టహర్షుండు వాక్ప్రౌఢి మెఱయఁ
జెప్పిననైషధశృంగారకావ్యంబు
దెలియఁ జెప్పితి నాంధ్రదేశభాష
|
|
తే. |
నిమ్మహాకృతిఁ బఠియించు నెవ్వఁ డేని
యాతఁ డపగతకలిదోషుఁ డగుచుఁ గాంచు
నాయురారోగ్యవిమలవిద్యావివేక
భాగసౌభాగ్యవైభవప్రాభవములు.
| 203
|
శా. |
ఆలంకాపురశంకరాచలమహీవ్యాపారపారంగత
ప్రాలేయద్యుతికీర్తిమండల! కృపాపాథోనిధీ! దానవి
|
|
|
ద్యాలంకార! కరాళహాలహలజిహ్వాభీలనిస్త్రింశ! లో
కాలోకోపరిభాగసంతమససంహారప్రతాపాతపా!
| 204
|
క. |
హాటకరత్నమయతులా
కోటిఝళంఝళకఠోరకోలాహలవి
స్ఫోటితకుటిలమహీభృ
త్కోటీకఠినాంతరంగ! తులితానంగా.
| 205
|
మాలిని. |
జగదవనధురీణా! సాధురక్షాప్రవీణా!
నగపతిసమధైర్యా! నందితాచార్యవర్యా!
యగణితగుణభద్రా! త్యాగముద్రాసముద్రా
విగతసకలదోషా! విశ్వలోకైకభూషా!
| 206
|
గద్యము. |
ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సకలవిద్యాసనాథ శ్రీనాథప్రణీతం బైనశృంగారనైషధకావ్యంబునందు అష్టమాశ్వాసము.
|
|
శృంగారనైషధకావ్యము సంపూర్ణము.