శృంగారనైషధము/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శృంగారనైషధము

షష్ఠాశ్వాసము

శ్రీగురుశంకరమౌనిద
యాగౌరవనిత్యవర్ధితాన్వయ! కరుణా
సాగర! విజయరమైకస
మాగమలీలానుషంగ! మామిడిసింగా!

1


నలమహారాజవరణము

వ.

చిత్తగింపుము.

2


ఉ.

మానితలీల నల్లన విమానము డిగ్గి వినూత్నరత్నసో
పానపరంపరాసరణి భారతిహస్తము గేల నూఁది పం
చాననమధ్య కాంచనమయం బగుమంచక మెక్కి చేర్చె
మ్మానవనాథుకంఠమున మంగళనవ్యమధూకదామమున్.

3


వ.

ఇట్లు దమయంతీకరార్పితంబై దూర్వాంకురాలంకృతంబును మకరాంకపాశసంకాశంబును మధుపఝంకారసంకులంబును నుదారతారకానికరాకారంబును నై.

4


తే.

ధారుణీపతినిద్దంపుఁ బేరురమున
నమరెఁ బ్రతిబింబమును దాను నలరుదండ

బాహ్యమునఁ గొంత కొంత యభ్యంతరమునఁ
గీలుకొని యున్నమదనబాణాళివోలె.

5


క.

తెఱవ పులకాంకురంబులు
గిజికొన నవ్వేళఁ జూడ్కికి ముదం బెసఁగెన్
గిఱుకుఁబువుమొగ్గతూపులు
గిఱికొన్నమనోజశరధికిం బ్రతినిధి యై.

6


చ.

ధరణిపుచక్కికట్టెదురఁ దామరసాక్షికిఁ జేష్ట నష్టతం
బొరసె మనోనురాగపరిపూర్తి నొకించుకసేపు నిర్భర
స్మరశరపుంఖసంఘటితషట్చరణప్రమదాగరుచ్చటా
స్ఫురదనిలావతారమున బోరనఁ దా మొదలెత్తెనో యనన్.

7


ఉ.

ఆహరిణాక్షి యిడ్డయలరారెడుపువ్వులదండ జాతకౌ
తూహలతన్ స్పృశించునెడఁ దోఁచెఁ కరంబున ఘర్మబిందుసం
దోహము ఱేని కవ్విధము దోఁపఁగఁజేసె నెఱిన్ భవిష్యదు
ద్వాహమహోత్సవంబునకు దర్పకుఁ డిచ్చిన హస్తతోయమున్.

8


ఉ.

చిత్తజుపువ్వుఁదూపుల రచించినతుమ్మెదఱెక్కగాలిచే
నత్తఱి నేకువత్తి యగునంగన దూలినఁ దూలెఁ గాక య
త్యుత్తమధీరతాగుణసమున్నతి మేరుమహీధరంబు భూ
భృత్తిలకుండు నైషధుఁడు బిట్టు చలించెఁ గదా తదాహతిన్.

9


క.

బిట్టు ఘనస్తంభంబుసం
గట్టువడె న్నిషధరాజు కామునిచేతం
బిట్టుఘనస్తంభంబున
గట్టువడం దగును రాజు గజరాజువలెన్.

10


వ.

ఇవ్విధంబున.

11

ఇంద్రాదులు నలదమయంతులకు వరంబు లిచ్చుట

తే.

పెద్దకాలంబునకు మనోభీప్సితంబు
సఫలమగుటయు నత్యంతసమ్మదమున
సొంపుదళుకొత్త నున్నయాదంపతులకుఁ
గరుణ దీవనలిచ్చె నిర్జరగణంబు.

12


వ.

వెండియు నిషధమండలాధీశ్వరుండు దమకుం జేసిన దూతకృత్యంబునం గానంబడిన చిత్తశుద్ధికారణంబుగా నమ్మహీపతికి నమరపతి ప్రత్యక్షం బైనయాకారంబుతో యాగంబులయందు హవిర్భాగంబు భుజియించువాడయ్యె. హుతవహుం డిచ్ఛానురూపంబునం బ్రభవింప ననుమతించె. ధర్ముం డక్షయప్రహరణంబులును ధర్మైకనిరతబుద్ధియు నొసంగె. వరుణుండు దలంచినచోటం జలంబులు సంభవింపను ధరియించిన పుష్పంబులు వాడకుండ ననుగ్రహించె. అప్పుడు భారతీదేవి నానాభువనసమాగతానేకభూవరవర్ణనాప్రసంగోచితం బైనమానుషాకారంబు మాని వీణాపుస్తకపాణియు రోహిణీరమణచూడామణియును గుందేందుతుషారహారధవళంబును నగుదివ్యరూపంబు ధరియించె. నందఱు దమయంతి నుద్దేశించి.

13


ఉ.

ఆదిమశక్తి యైనతుహినాచలరాజతనూజ వోలె ము
తైదువవై నిజేశ్వరునియర్ధశరీరము పాలుగొమ్ము
పాదసరోరుహంబు లతిభక్తి భజింతురు గాక యెఫ్టు బ్ర
హ్మాదికదేవతాసదృశు లైనమహామహిమండలేశ్వరుల్.

14


మ.

అని వైదర్భిఁ బ్రసాదగర్భమధురవ్యాహారసందర్భసం
జనితానందనుఁ జేసి నెయ్యమున నాశక్రాదిబృందారకుల్

వనితారత్నముచేతఁ గైకొనిరి సేవాహస్తపదాంజలుల్
ఘనరత్నాంచితహేమకంకణఝణత్కారంబు తోరంబుగాన్.

15


సరస్వతి నలునకుఁ జింతామణిమంత్రం బుపదేశించుట

వ.

అనంతరంబ నిషధమహీకాంతునిం గనుంగొని సరస్వతీదేవి యిట్లనియె.

16


ఉ.

నేమముతోడ విశ్వధరణీ భువనాధిప! సంతతంబుఁ జిం
తామణిమంత్రరాజము ప్రధానము మంత్రకదంబకంబులో
మామక మమ్మహామనువు మానితభంగి భజింపు మీవు చిం
తామణి కామధేనువిబుధద్రుమసన్నిభ మాశ్రితాళికిన్.

17


మ.

సకలం బై హిమరుక్కళాభరణ మై సవ్యాపసవ్యార్ధయు
గ్మకరూపం బయి శైవమై గతకళంకం బై శివం బై యుపా
సకచింతామణి యై ప్రసిద్ధిభగవచ్ఛబ్దాభిధేయార్థమై
యొకమంత్రంబు మదీయ మొప్పు నది నీ కుర్వీశ! యే నిచ్చితిన్.

18


వ.

ఇది చింతామణిమంత్రం, బేతదుద్ధారప్రకారంబు రహస్యంబుగా నిప్పు డుపదేశించితి. గురుపరంపరాసంప్రదాయక్రమంబున సకీలకంబుగా సిద్ధసారస్వతసంసిద్ధికారణం బైనయిమ్మహావిద్య నెఱింగికొనుము.

19


క.

ఆచారపరత వేకువ
లేచి పఠింపుము కుమారలేఖర్షభ! యీ
శ్రీచింతామణిమంత్రము
ప్రాచికి నభిముఖుఁడవై శుభం బొడఁగూడున్.

20


శా.

సర్వాంగీణరసామృతస్తిమితవాచావీచివాచస్పతుల్
గర్వోన్నద్ధవిరోధిరాడుదధివాగ్గాంభీర్యకుంభోద్భవుల్

స్వర్వామాసదృశాంగనాజనమనస్సంచారపంచాస్త్రు లం
తర్వాణుల్ నృప! యస్మదీయ మగుచింతారత్నవిద్యాధరుల్.

21


సీ.

కబరికాభరముపై గన్నెగేదఁగిపువ్వు
        ఱేకుతోగూడ రేఱేనిఁ బొదివి
లలితకస్తూరికాతిలకమధ్యంబున
        సొబగొందుముత్యాలచుక్క నిలిపి
కుదురు నిండినమించుగుబ్బచన్నులమీద
        జిలుఁగుదువ్వలువ గంచెలయు దొడిఁగి
యచ్చవెన్నెలచాయ నవఘళింపఁగఁ జాలు
        నింపు వెలికట్టు నెఱిక గట్టి


తే.

యంచకొదమలఁ బూన్చినయరద మెక్కి
యుపనిషద్వీథి విహరించుచున్న నన్ను
మహితచింతామణీదివ్యమంత్రమూర్తి
దలఁప సారస్వతం బయత్నమునఁ గలుగు.

22


క.

ఎంత జడుఁ డైనఁ గానీ
చింతామణిమంత్రరాజసేవాపరుఁ డ
భ్రాంతంబునఁ గవితాసి
ద్ధాంతరహస్యోపనిషదుపాధ్యాయుఁ డగున్.

23


క.

వైదర్భివోలెఁ గవితా
వైదర్భి నరేంద్ర! నీకు వశ మయ్యెడు సూ
ర్యోదయవేళ జపింపు కృ
తాదరమున నస్మదీయ మగుమంత్రంబున్.

24


సీ.

కలియుగంబునయందుఁ గాశ్మీరభూమిలో
        మత్పీఠమున ధరామరుఁడు పుట్టు

శ్రీహీరుఁ డనఁగ శేషాహియంగంబున
        నతఁడు మామల్లదేవ్యాఖ్యయైన
తనభార్యయందుఁ జింతామణీమంత్రచిం
        తనఫలంబుగ నొక్కతనయుఁ గాంచుఁ
గల్పించు నతని కాకాశవాగ్దేవి తా
        శ్రీహర్షుఁ డనియెడు చిహ్ననంబు


తే.

వాని కీరేడువిద్యలు వచ్చియుండు
వాఁడు ఖండనకారుండు వాఁడు సుకవి
కావ్యముఖమున వానిచేఁ గలుగు నీకు
నిర్మలం బైనసత్కీర్తి నిషధరాజ!

25


క.

నిను దమయంతిని ఋతుప
ర్ణునిఁ గర్కోటకుని నెవ్వరు దలంతురు మే
ల్కనునప్పు డుషఃకాలం
బున నృప! కలికల్మషములు వొందవు వారిన్.

26


వ.

హరియునుంబోలెఁ గలికలుషహారిగుణసంకీర్తనుండవు పుణ్యశ్లోకుండవు నగుము. పోయివచ్చెదను. పునర్దర్శనం బయ్యెడు నని పలికి యద్దేవి దమయంతిం జూచి దేవతలుం దానును మఱియును.

27


సీ.

సకలపుణ్యాంగనాజనశిరోమణి వైన
        నీకు పాతివ్రత్యనియతిఁ జేసి
సాధింపరానియాశాస్యంబు గలుగునే?
        యైన దేవతల మైనట్టిమాకుఁ
బ్రత్యక్షమై మనోరథ మీక పోరాదు
        మర్త్యుల కటుగాన మగువ! వినుము

నీదుపాతివ్రత్యనియమంబునకుఁ దప్పు
        ఖలుఁడు భస్మంబవుఁ గాత యపుడ


తే.

కామరూపుల మగుమమ్ముఁ గాంచి నీవు
డెందమునఁ జాల నాశ్చర్యమంది తిపుడు
నిక్క మీది యాది గాఁగ నో నీరజాక్షి!
కామరూపిణి వగుము మాకరుణఁజేసి.

28


వ.

అని పలికి పలుకుబోటియు హరికృపీటభవశమనశంబరపతు లంబరంబునకు జాంబూనదవిమానారూఢులై యెగసిరి. సమయసముత్థానంబునం గ్రందుకొనురాజునందనుల యందియలమొరపంబులతోడ గెడబెరసి దేవదుందుభిధ్వానంబు రోదసీకుహరంబునం దీటు కట్టె. విద్యాధరహస్తముక్తం బైనపుష్పవర్షంబు హర్షోత్కర్షంబు నాపాదించె. అప్పుడు కల్యాణవిభవలక్ష్మీప్రతిష్ఠాసమానుం డగునిషధరాజు నిజశిబిరప్రతిష్ఠాసమానుండయ్యె. దమయంతియుఁ గన్యాసహస్రంబు గొల్వ నాత్మమందిరంబునకుం జనియె. ననంతరంబ.

29


మ.

తమయంశం బగు మేదినీరమణునిన్ ధాత్రిన్ విసర్జించి యా
యమృతాశుల్ గడు విన్ననై చనిరి ముక్తాంశత్వభేదంబునన్
మమతాసంపద యెట్టిదో యెడ నెడన్ వక్రాననాంభోజయై
దమయంతిం గనుగొంచు నేఁగె వినతాంతర్వాణి శ్రీవాణియున్.

30


నలుఁడు విడిది కేగుట

ఉ.

మంచకవాటికాశిబిరమధ్యమునందు ధనార్థికోటిపైఁ
గాంచనవర్షముల్ గురిసెఁ గంఠవిలోలమధూకమాలికో

దంచితుఁ డోషధీపతికులాగ్రణి వందిజనంబులో విశే
షించి విదర్భజాస్తవనశీలుర మిక్కిలి గారవించుచున్.

31


వ.

అప్పుడు గొంద ఱసూయాపరాయణులైనరాజు లారాచకుమారుం జూచి చూపోపక 'యత్యుచ్ఛ్రయః పతన హేతు' వనెడువారు 'నతి సర్వత్ర గర్జిత' మనెడువారును 'కాముకస్య కుతో లజ్జా' యనువారును 'సంగమో విప్రయోగాంత' యనువారును నై యుండి రప్పుడు.

32


ఉ.

నైషధుఁ డంతరంగమున నవ్వుచునుండు విరోధు లాడుదు
ర్భాషణముల్ విని విననిభంగి న దట్టిద విద్విషన్మృషా
దోషగుణాధిరోపణ మదోషతఁ దెల్పుచు సుండుఁ గానఁ ద
ద్దూషణ మెఫ్టు విన్నఁ బరితోషముఁ బొందు మనీషి యాత్మలోన్.

33


క.

క్రించు లగురాజతనయులు
వంచింపక యాడు దురపవాదోక్తులలోఁ
గొంచు నృపాలునిమ్రోలను
బంచమహాశబ్దములును బహుళము లయ్యెన్.

34


వ.

ఇవ్విధంబున నిషధరాజు శిబిరంబు ప్రవేశించె నట విదర్భమహీవల్లభుండును.

35


సీ.

కార్తాంతికులఁ బిల్చి కర్పూరసమ్మిశ్ర
        తాంబూలదానపూర్వంబు గాఁగ
జాంబూనదాంబరస్రక్చందనంబులఁ
        బూజించి భూపాలపుంగవుండు
'సర్వలక్షణకళాసంపూర్ణమై యుద
        యాస్తనిర్దోషమై యతిశయిల్లు

శోభనాంశము మీరు శోధించి చెప్పుఁడా’
        యని పల్క వారును నట్టిలగ్న


తే.

మరసి చేపట్టి ‘యాసన్న మయ్యె
శుభముహూర్తంబు గాలసంశుద్ధి లెస్స
పిలువఁ బంపుము వేవేగఁ బెండ్లికొడుగు’
ననిన ‘నట్లనే కా’ కంచు నాప్తజనుల.

36


దమయంతీకళ్యాణనేపథ్యము

వ.

అంతఁ గుమారునిం దోడ్తేర నియమించె నట మున్న కన్యాంతఃపురంబున.

37


తే.

కువలయాక్షులు ముత్యాలచవికలోన
జలక మార్చిరి నిజకులాచారసరణిఁ
బసిఁడిపీఠంబుపై నుంచి పద్మనయనఁ
జెలువ మగగన్నెరాకమ్ము సేతి కిచ్చి.

38


తే.

గంధజలపూరితంబులై కమలముఖుల
కరములం దున్నమణిహేమకలశములకుఁ
జెలువ మగుభీమకన్యచన్నులకు నోడి
దాస్యమున నీళ్లు మోచుచందంబుఁ గలిగె.

39


తే.

చెలువ నిర్వృత్తసలిలాభిషేచనయును
చంద్రికాపాండుపరిధానశాలినియును
సగుచు వర్షాశరత్తులయంతరమున
నొప్పుసంధ్యాధిదేవత కుద్ది యయ్యె.

40


క.

సమధికచామరనిర్జయ
సముపార్జితవిమలకీర్తిశౌక్తికముక్తా

సముదయశంక ఘటించెన్
గమలాసన చికురవారికణకోరకముల్.

41


క.

నునుఱాఁత మెఱుఁగువెట్టిన
కనకశలాకయునుబోలెఁ గన్నియ యొప్పెన్
దను వగుతడియెుత్తుమణుం
గున నొయ్యన మేనితడి యిగుర్పఁగ నొత్తన్.

42


ఉ.

వాసన కేతకీదళము వంకఁ గళంకము లేనిపైఁడి య
భ్యాసము చేసెనేని యగు నప్డు సమానము గంధసారచ
ర్చాసురభీకృతం బగుచుఁ జారుతటిల్లతికామతల్లికా
భాసురవర్ణమైననరపాలసనూభవదేహయష్టితోన్.

43


వ.

తదనంతరంబ కనకవేదికాంతరంబునం బసిండిపీఠంబున నునిచి ప్రతిప్రతీకంబును బ్రతికర్మనిర్మాణకర్మఠం బైన సైరంధ్రికాజనం బప్పురంధ్రీరత్నంబుం బ్రయత్నంబున నలంకరింపం దొణంగె, నందొకముద్దియ మదనాంధకారపటారంభణతంతుసంతతియగు కుంతలమంజరికి నధివాసధూపధూమం బొసంగె, నొక్కయలివేణి పెన్నెఱివేణిపై నెగయుచున్న ధూపధూమాంకురంబు గనుంగొని కుటిలకచచ్ఛటాబ్రాంతిం గొనగోళ్ల దువ్వంబోయినఁ జెలులు నవ్విరి, యొక్కయిందువదన గళిందకన్యకాభంగభంగురం బైననెఱితుఱుమునం జెంగలువలు దురిమె, నొక్క కుటిలాలక లలాటపట్టంబునం గేశాంబుదవిద్యుద్దండంబుగాఁ బసిండిపట్టంబు గట్టె, నొక్కవరవర్ణిని చూర్ణాలకంబులను నీలకజ్జలంబులకు దీపజ్వాలంబుగా మనశ్శిలాచిత్రకంబు నొసలన్ హత్తించె నొక్కతన్వంగి యనంగలీలావశంబున నపాంగ

ప్రాంగణంబులకు నిగుడుకనీనికానీలమణులకుం గిరణకందళీక లనుసందేహంబు నాపాదింపంజాలునట్లుగా నీలాంజనరేఖలు వాలారుంగలికికన్నులకొలుకుల వెడలం దీర్చె నొక్కబోఁటి తాటంకమణిమహఃకలాపంబులను మరుపలాశకుసుమచాపంబులకుఁ దూపులుంబోలె నిందీవరావతంసంబులు చెవులం బొందుపఱిచె, నొక్కవిలాసిని నాసాతిలప్రసూనంబునం బ్రసూనశరగుళికాశరంబునుం బోనిముక్తాఫలకలాపంబుఁ దాపించె, నొక్కనితంబిని యధరబింబంబున యావకం బమర్చె, నొక్కకలకంఠకంఠి కంఠకందళికయందు గంటసరి దొడిగె, నొక్కయెలనాఁగ వక్షోజభాగంబునం బద్మరాగపతాకంబుఁ బదిలపఱిచె, నొక్కలేమ హేమమయమేఖలాదామంబు జఘనసీమంబునం గట్టె, నొక్కపూఁబోణి పైఁడియందియలు చరణారవిందంబులం దగిల్చె, నొక్కమత్తకాశిని యడుగునెత్తమ్ములం క్రొత్తలత్తుక హత్తించె, మఱియు సాంగోపాంగంబుగాఁ బ్రత్యంగంబు నంగనలు ముత్యాలజల్లి చెందిరంపుఁజేరుచుక్క చిన్నిపూఱేకులు బాలికలు మకరికాపత్రభంగంబులు హారంబులుం గేయూరంబులుం గంకణంబులు మట్టియలు వీరముద్దియలు పాయపట్టంబులాదిగాఁ గలయలంకారంబుల నలంకరించిరి. ఇవ్విభూషణంబులచేత భాగ్యంబుచేత నీతియు ధర్మంబుచేత విభూతియు వితరణంబుచేత విఖ్యాతియుంబోలె నన్నాతి యతిశయిల్లె. నయ్యవసరంబున.

44


ఉ.

అంతర మెట్టిదో యని నిజాస్యముతోఁ బ్రతివెట్టి రోహిణీ
కాంతుఁ బరీక్ష సేయుటకుఁ గా నటు పట్టినభంగి లీల న

య్యింతి ధరించె భూషణము లెల్ల వహించినయంతమీఁద శు
ద్ధాంతవధూటి యొక్కతె ప్రియంబుననిచ్చినమించుటద్దమున్.

45


తే.

నవచతుర్విధశృంగార మవధరించి
యమ్మహాదేవి విప్రపుణ్యాంగనలకు
సకలపూజలు వేడ్కతో సరగఁ జేసి
మోడ్పుఁగేలెత్తి ఫాలంబు మోపి మ్రొక్కె.

46


ఉ.

అంతర మొప్ప శోభనసమాగతబాంధవభూమిపాలశు
ద్ధాంతనితంబినీనివహ మప్డు ప్రణామ మొనర్చె భీమభూ
కాంతునికూర్మికన్యకకుఁ గౌతుకభూషణభూషితాంగి క
త్యంతఝణత్క్రియారవణహాటకనూపురపారిహార్యమై.

47


నలునికల్యాణనేపథ్యము

వ.

అటం గుమారుఁడును మంగళాభిషేకానంతరంబ యాకల్పకల్పనాశిల్పపారగ లగు ప్రౌఢాంగనాజనంబులవలన వివాహోచితం బగుశృంగారం బంగీకరించె నప్పుడు.

48


తే.

అభినవోచితతాలవృంతానిలమున
నల్లనల్లనఁ దడి యార్చి యతివ యోర్తు
ధారుణీనాయకునికేశభారమునకు
నగరుధూపాధివాసనం బాచరించె.

49


ఉ.

వెన్నెలకుప్పసంబిడిన వింతవిలాసము వాసి కెక్కఁగాఁ
గిన్నరకంఠి యోర్తు మరుకీర్తియుఁ బోనిపటీరపంకము
న్విన్ననువొప్పఁగా నలఁదె నిద్దపుఁజాయమెఱుంగునం బదా
ర్వన్నెపసిండితోడ నొర వచ్చునృపాలునియంగకంబులన్.

50


చ.

లలితకలాపకోమలకలాపికలాపకలాపనవ్య పే
శలమృదుకేశమంజరులు సన్నపుగోళ్లను జిక్కు వాపి చెం

గలువలు జాజులుం గలయఁ గమ్మనిపువ్వులసేసకొప్పు దా
పలి కొరుగంగఁ బెట్టె నొకభామిని నైషధభూమిభర్తకున్.

51


ఉ.

రాజనిభాస్య యోర్తు నవరత్నకిరీటము సంఘటించె ని
ర్వ్యాజమనోజ్ఞ మైనమహివల్లభుమూర్ధమునందు నప్పు డా
రా జనుకల్పశాఖి కది రత్నమయం బగుపువ్వుగుత్తివే
రోజ వహించి కన్నులకు నుత్సవముం బొనరించె నెంతయున్.

52


మ.

పదియార్వన్నె పసిండిపట్ట మననీపాలావతంసంబు నె
న్నుదుటం గట్టె లతాంగి యోర్తు కడవీను ల్సోఁక నేర్పొప్పఁగా
నది లీలాపరివేషచక్రవలయార్ధాకారతం బొందె న
ప్డదసీయాననచంద్రమండలము చంద్రాధిక్యముం బొందుటన్.

53


శా.

భామాయోజితకుండలాభరణము ల్భామావలంబంబు లై
భూమీవల్లభుసూనువ్రేలుచెవులం బొల్పారె గండస్థలీ
సీమాంతప్రతిబింబమండలయుగశ్రీసంవిభాగంబుతోఁ
గామస్యందన హేమచక్రయుగయుగ్మంబున్ విడంబించుచున్.

54


ఉ.

ఇందునిభాస్య యోర్తు గదియించెఁ గుమారుని పేరుంబునం
గందక యాణి పాణియును గల్గినతోరపుఁదారహారమున్
జిందిలిపాటు లేక యదసీయముఖేందువినిర్గళత్సుధా
తుందిలబిందుబృందములు తోయముఁ గైకొని యుండెనో యనన్.

55


తే.

తరుణసైరంధ్రికాప్రయత్నమునఁ జేసి
యతనివ్రేళ్లు సముద్రంబు లయ్యె నపుడు
ఘనసమూహంబు కమలాభికాంక్షఁ జేసి
తద్వితీర్ణికి జను టన్వితంబు గాఁగ.

56


క.

అలవరిచె నృపతికరముల
నలికుంతల యొకతె కంకణాభరణంబుల్

నలహస్తకల్పకములకు
వలయములవి యాలవాలవలయము లయ్యెన్.

57


మ.

భుజదండంబున నొక్కభామ దొడిగెన్ భూభర్తకున్ భూరిది
గ్విజయారంభవిజృంభణార్చితమహాకీర్తిప్రతాపప్రభా
వ్రజశంకావహనూత్నవజ్రమణిరుగ్వ్యాపారదుర్వారమున్
ద్రిజగల్లోచనసర్వదానకలనాధీరంబుఁ గేయూరమున్.

58


వ.

అట్లు శృంగారం బంగీకరించిన.

59


ఉ.

ఔచితి గావున న్నిలువుటద్దమునందు నిజాస్య బింబమున్
జూచెనె కాని మున్న యతిశోభనరూపనిలాసపుష్పనా
రాచుఁడు రా జలంకృతివిరామమునందు నిజాభిరామ్యమున్
జూచినవాఁడు భూషణపుశుద్ధమహామణిమండలంబునన్.

60


తే.

రాజు దొడిగినదివ్యాభరణచయంబు
నెల్లవారును రతిఁ జూచు టేమి చెప్ప
నొరిమ నొండొంటిఁ జూచునాభరణములును
విమలహరినీలమణివిభావీక్షణముల.

61


నలుఁడు కల్యాణమంటపంబున కేతెంచుట

వ.

అనంతరంబ వార్ష్ణేయనియంతృకం బైనరథం బెక్కి యమ్మహారథుండు జిష్ణుండును గిరీటియును విజయుండును నగుటం జేసి ధనంజయుం డనం బొలిచి రాజమార్గంబునం జనునప్పుడు పౌరాంగనలయందు.

62


తే.

తమ్ములము సేయుచో నొక్కతలిరుఁబోణి
రాకుమారునిఁ జూచుపరాకుకతన

మఱచి తాంబూలపత్రంబు మాఱుగాఁగఁ
గఱచెఁ గెంగేలినడికేలికమలదళము.

63


మ.

జవరా లోర్తు ప్రియోపనాయకభుజాసంశ్లేషలీలాసుఖ
వ్యవసాయంబు సమాజసంకటమునం బ్రార్థించి కైకొంచు భూ
ధవదేవేంద్రునిఁ జూచె హేమకలశద్వైరాజ్యసంపత్తివై
భవశుంభత్కుచకుంభపీఠిఁ బులకప్రారంభ మేపారఁగన్.

64


తే.

ఒక్కతరలాక్షి యప్సరోయువతివోలె
జూచెఁ గనుఱెప్ప వెట్టక రాచవాని
రాజసంబున వలరాచరాచవాఁడు
తేఁటిఱెక్కలగఱియమ్ముఁ దీడుకొనఁగ.

65


తే.

ఎల్ల చిగురాకుఁబోండ్లకు నెంత వేడ్క
యంత వేడుక దనలోన నతిశయిల్ల
నొక్కగుబ్బలకొమరాలు చక్క వచ్చి
కనియె నొడలెల్లఁ గన్నులై మనుజవిభుని.

66


మ.

జిలుగుంబయ్యెద జీరువాఱి యెడలన్ శృంగారపత్రాంకురం
బులతో నొక్క చకోరలోచనకుచంబుల్ పూర్ణకల్యాణమం
గళకుంభంబులు నూత్నపల్లవవిభంగశ్రీసమేతంబు లై
న లలిం జెన్నెసలారె నైషధమహీనాథావలోకంబునన్.

67


సీ.

కలికిచూపులు రత్నకలికాకలాపంబు
        గుబ్బచన్నులు హేమకుంభవితతి
మెఱుఁగుఁజక్కులు క్రొత్తమించుటద్దంబులు
        పాణియుగ్మంబులు పల్లవములు
వెలఁదిమందస్మితంబులు కమ్మఁబువ్వులు
        పలుకులు వల్లకీకలకలములు

పరిపాటలోష్ఠబింబములు జుంటియతేనె
        తనుకాంతియోలగందంపుఁబసపు


తే.

గాఁగ సౌభాగ్యవివిధమంగళపదార్థ
వర్గములు గ్రంతనడచుభావంబు దోఁచెఁ
బౌరకాంతలు రాజకుమారదర్శ
నోత్సవంబున కేతెంచుచున్న యపుడు.

68


స్రగ్ధర.

ఈతండే పాడిజాణం డితఁడె మగలరా జీతఁడే ధీరుఁ డంచుం
జేతోమోదంబునం జూచిరి పురయువతుల్ చిత్తసంజాతమూర్తిన్
జ్యోతిష్టోమాదియజ్ఞశ్రుతఫలనిఖలక్షోణిసామ్రాజ్యలక్ష్మీ
పాతివ్రత్యైకదీక్షాపణితు నిషధభూపాలు దిక్పాలుమిత్రున్.

69


వ.

అప్పుడు పౌరాంగనలు దమలోన?

70


మ.

తనకుం దాన పురందరాదిదివిజేంద్రవ్రాతముం దెచ్చి ని
ల్చిన సంప్రీతి వరాటకన్యక వరించెం గావునన్ ఫాలలో
చనకోపానలదగ్ధమన్మథమహాసామ్రాజ్యకంఠీరవా
సన మెక్కం దగు వీఁ డకుంఠితవిలాసప్రౌఢభావంబునన్.

71


సీ.

సుద్యుమ్నుఁ డనురాజు సుగతియై యెవ్వానిఁ
        బ్రథమసీమంతగర్భమునఁ గాంచె
గ్రహరాజుగారాపురాణివాసం బైన
        గంధర్వ యెవ్వారిఁ గన్నతల్లి

యిన్నూఱు మున్నూఱు నేనూఱు కన్నులు
        గలవేలు పెవ్వానిఁ గన్నతండ్రి
రజతాచలం బేలురాజుపట్టపుదేవి
        గోరి యెవ్వనిఁ గాంచె గొడ్డు నీఁగి


తే.

యాపురూరవుఁ డాదస్రుఁ డాజయంతుఁ
డాపులస్త్యజుమనుమఁ డీయధిపుతోడ
సాటి యగుదురె నిఖిలవిశ్వంబులోన
జ్ఞానసమ్మోహనాతిసౌభాగ్యరేఖ?

72


మ.

సమయోత్కంఠితకంఠలోలవరణస్రగ్భూషణుం డైనయీ
దమయంతీవరుఁ జూచి తాదివికి సుత్రాముండు వోకుంట పంతము
నిర్లజ్జతఁ బోయె నేఁ దను నిరర్థప్రార్థనున్ దొంటినె
య్యమునం జేరఁగ నేల యిచ్చు శచి యాత్మాంతపురోద్దేశమున్?

73


మ.

విబుధేంద్రావరణప్రసాదితశచీవిశ్రాణితాశీర్వచ
స్స్తబకవ్రాతములున్ దిగీశపురుషార్థప్రక్రమోపార్జిత
ప్రబలఖ్యాతియుఁ బూఁటకాఁపులు సుఁడీ భావించి చూడంగ ని
య్యబలరత్ననృపాలరత్నములనిత్యైశ్వర్యసంపత్తికిన్.

74


శా.

చేసెం గావలయున్ విరించి నిఖిలస్త్రీపుంససంయోజనా
భ్యాసప్రౌఢి ప్రకాశ మొందఁ గడువియ్యం బైనసంసర్గ మి
ట్లాసంసారపురంధ్రిపూరుషమిథోహర్షోదయప్రేమలన్
జోసెం గావలయున్ మరుండు హృదయాంభోజంబుల న్వీరికిన్.

75


శా.

వైదర్భీబహుజన్మనిర్మలతపోవర్ధిష్ణుతల్లోచన
స్వాదుప్రౌఢవిలాసుఁ డీవసుమతీచక్రేశపుష్పాయుధుం

డాదిత్యాలయసార్వభౌమసుకృతాహంకారదుష్ప్రాపభై
మీదాంపత్యమునం జిరాయు వయి నేస్తంబొందుఁ గా కెంతయున్.

76


శా.

సంబంధం బిటుగూడునే రమణికిన్! క్ష్మాభర్తకు న్నేత్రప
ర్వంబై యుండె స్వయంవరం బసితగౌరస్మేరదృగ్రోచులన్
బింబోష్ఠీనివహం బమోఘకుతుకప్రేమంబులన్ వీరి మా
ఘం బాడించె నఘా౽తిఘాతియమునాగంగౌఘయోగంబునన్.

77


తే.

దివిజపతిఁ బొందెనేని రెండవశచి యగు
ధరణిపతిఁ బొంద దమయంతితనము చెడదు
తివిరి శచి యౌట దమయంతి యవుటఁ బోల
దింతి యీ తారతమ్య మెట్లెఱిఁగె నొక్కొ?

78


శా.

స్వారాజప్రముఖామరప్రవరులన్ వర్జించి లజ్జాపరీ
హారంబుం బొనరించె రాజులకు సంప్రార్థించి తా దేవస
త్కారంబై యితని న్వరించినవివేకప్రౌఢిఁ దద్దేవతా
హ్రీరోషాపయశఃప్రమార్జన మొనర్చెన్ భైమి మే లెంతయున్.

79


వ.

అనుచు నీచందంబునం గ్రందుకొని యిందీవరాక్షులు డెందంబు లానందజలధిం దేలియాడం గొనియాడుచు సందర్శనోత్సవం బనుభవింపం గుమారబృందారకుండు కురువిందకందళితసందోహసుందరకరుం డగుటను సుహృదయానందుం డగుటనుఁ బొడముచందురునిం దొరయుచుఁ బురందరహరీక్రీడామందిరం బగు నుదయగిరికందరంబునుం బోని కనకస్యందనంబుపై హరిద్రాభంగరంగంబుల భంగింప నంగలించునఖిలాంగకంబులం దొడిగినమంగళాభరణంబులం

గీలింపంబడినయింద్రనీలంబుల మెఱుంగుల చెఱంగులు పౌరాంగనాపాంగదృక్తరంగంబుల నాలింగనంబు సేయం గంకణఝణఝణత్కారంబు తోరంబుగాఁ బంకజాక్షులు వీచువీచోపులం బొడముసన్నకరువలిపొలపంబుల నున్నంబులై యున్నకురులు పొలుపార మందగమనంబున వందిసందోహసంకీర్తనంబును మాగధమధురగానంబును పాఠకపఠనరవంబును మనంబు రంజింపంజేయ ముందఱం జనుమూర్ధాభిషిక్తులమణికిరీటంబు లనునడదివియలవోడం గూడి గంధతైలధారాసిక్తప్రదీపితంబు లగుకరదీపికాసహస్రంబులు నాసీరగతతుక్ఖారఖరఖురఘట్టనంబులం బుట్టినధరణీపరాగంబున దట్టంబైనసంధ్యాంధకారంబు దూరంబు సేయం గరిఘటాకంఠగ్రైవేయఘంటికాటంకారంబులఁ బ్రోదిసేయుచుఁ బుంఖానుపుంఖంబుగా శంఖకాహళభేరీమృదంగవేణువీణానినాదంబులు రోదసీకటాహంబు నుద్ఘాటింపం బటత్పట్టపతాకాభిరామంబును సముత్తంభితరంభాస్తంభసంభారంబునుఁ గర్పూరపాంసువిరచితగంగవల్లీమతల్లికావేల్లితప్రాంగణంబును కస్తూరీకర్దమాలిప్తవితర్దికాద్వితయోపశోభితంబును పుణ్యాంగనాకరకిసలయావలంబితచూతపల్లవలాజాక్షతాదిశోభనపదార్థసార్థంబును నైనరాజమందిరంబు చేరం జనుదెంచునప్పుడు.

80


ఉ.

చేరెను లగ్నవేళ యతిశీఘ్రము రమ్మని విన్నవింప బు
త్తేరఁగ సంతనంతఁ జనుదెంతురు కుంతలగౌడచోళగాం
ధారముఖావనీశులు విదర్భనరేంద్రునియాజ్ఞఁ బాదసం
చారమునన్ శశాంకకులసంభవుపాలికి భక్తినమ్రులై.

81

సీ.

యామవేగండకర్ణానిలస్ఫాలన
        విలసితభ్రూవల్లి వేల్లనముగఁ
దోరణమాలికాహీరాంకురచ్ఛాయ
        వెలఁది లేఁజిఱునవ్వు మొలక గాఁగఁ
బ్రోదిరంభాస్తంభములమోసుటాకులు
        లలిఁ బచ్చపట్టుచేలంబు గాఁగ
వీతెంచుమృదువేణువీణానినాదంబు
        కలికితియ్యనినున్నపలుకు గాఁగఁ


తే.

బేరఁటాం డ్రురుహస్తపంకేరుహములఁ
బూఁచి యెత్తినకనకంపుఁబూజెకుండ
లున్నతస్తనములు గాఁగ నొప్పుమిగిలెఁ
దరుణియునుబోలె నృపగృహద్వారభూమి.

82


ఉ.

శంబరవైరిమూర్తి జలజద్విషదన్వయచక్రవర్తి ర
మ్యంబగు మందయానమున నర్థిమెయిం జనుదెంచెఁ గేతుచీ
నాంబరవల్లి వెల్లనవిహారతరంగితవారివాహమా
ర్గం బగు రాగమందిరముప్రాంగణభూమికి సమ్మదంబునన్.

83


తే.

ఎదురుగా నేగుదెంచుచో నింట్రమయ్యెఁ
బెండ్లి యిరువంకచుట్టంపుఁబెద్దలకును
నాభిముఖ్యౌచితీసమ్యగర్హణార్హ
భాషణాలింగనాదిసంభావనముల.

84


మ.

దమయంతీప్రియసోదరుండు దముఁ డాద్వారప్రదేశంబు నె
య్యమునం గాల్నడ నేఁగుదెంచెఁ బరిచర్యాయుక్తి గారాపు
వియ్యముఁ దోడ్కొం చరుగంగఁ గంచుకపరీహారంబునం దారహా

రము దోరంబుగ బేరురంబున విహారక్రీడ వాటింపగన్.

85


తే.

సైన్యముల నెల్ల వెలిసుండ జాటఁ బనిచి
వలయుపడవాళ్ల రాకుమారులను దొరల
నిషధరాజును గొలిచిరా నియతిఁ జేసె
ననుఁగు మొగసాల గ్రథకైశికావనిపుఁడు.

86


వ.

అనంతరంబ యభ్యంతరకక్ష్యావిభాగంబున నరదంబు డిగ్గి పుణ్యాంగనావిహితనీరాజనాదిమంగళోపచారుండై గారాపువియ్యంపుముంజేయి కరతలంబున నవలంబించి యల్లనల్లన నడిచి బంధుజనపరంపరాపరివేష్టితంబై పురోహితబ్రాహ్మణసహితంబై పురంధ్రీనికురంబసంబాధభరితం బయిన వివాహమంటపంబు చేరం జనుదెంచి దూరంబున నెదురుగా వచ్చుభీమభూపాలునకు నభివాదసంబు సేసి యతం డునుప సమున్నతకనకాసనంబున నాసీనుండై.

87


నలదమయంతీపరిణయము

ఉ.

పారణ చేసె రాజు మధుపర్కపుఁదేనియ మామ భీమధా
త్రీరమణుండు మంత్రసముదీరణపూర్వము గాఁగ నీయఁ ద
త్పారణ భోజభూపతిసుతామధురాధరచుంబనక్రియా
పారణకు న్నిదాన మయి భావము లువ్విళు లూఱఁ జేయఁగన్.

88


చ.

సకలధరాధినాథునకుఁ జంద్రనిభాస్యకు గేలుఁదామరల్
ప్రకటము గాఁగఁ గట్టువడెఁ బావనకౌతుక సూత్రరక్షచే
నొకటి పరోపఘాతకర మొక్కటిపంకజకాంతితస్కరం
బొకమరి యేల కట్టువడ కుండు మహీపతియాజ్ఞ గల్గినన్?

89

తే.

నృపతిచేతికి మీఁదుగా నెలఁతచేయి
గీలుకొనఁజేసె నొకపేరఁటాలపడఁతి
యదియుఁ బుణ్యాహవాచనావాప్తియయ్యె
భావియగునంబుజాక్షిపుంభావమునకు.

90


వ.

అనంతరంబ.

91


ఉ.

వాసికి నెక్కుకూర్మి జనవల్లభుఁ డిచ్చెను వైరసేని క
బ్జాసనవంద్య దుర్గ తన కర్థి పరంబుగ నిచ్చె నెద్దియ
క్కాసరరక్తబీజమధుకైటభశుంభనిశుంభచండముం
డాసురకంఠఖండనవిహారమహోగ్రము మండలాగ్రమున్.

92


క.

సంతోషంబున ధరణీ
కాంతుం డల్లునకు నిచ్చె గారా మారం
జింతామణిదాయకమున్
జింతితకామప్రదానశిక్షాక్షమమున్.

93


తే.

జమునినాలుకతో నెకసక్క మాడఁ
దమకపడుక్రొత్తపైఁడిమోళముగటారి
భీమనృపుఁ డిచ్చె గారాపుఁబెద్దపెండ్లి
కొడుకుఁగుఱ్ఱకు నైషధక్షోణిపతికి.

94


తే.

వీరమాహేశ్వరాచారపారగునకు
దనకు శశిమౌళి యిచ్చినకనకరథము
కామగమనంబు నైషధక్ష్మావరునకు
మామ యిచ్చెను మా యని మహి నునింప.

95


క.

అల్లునికి నిచ్చె ధాత్రీ
వల్లభుఁ డనురక్తి నమరవల్లభుహరితో

నుల్లస మాడం జాలెడు
తెల్లనియొకకత్తలానితేజీహయమున్.

96


తే.

ప్రథమజామాత కిచ్చె భూపాలతాలకుఁ
డగ్నిశోభంబు లైనదివ్యాంబరములు
సౌహృదంబు ఘటింప వైశ్వానరుండు
దనకు నెయ్యవి పుత్తెంచెఁ దాను మొదల.

97


తే.

మలఁచి యేకాండముగ నొక్కమానికమున
వేడ్క నెద్దాని నిర్మించె విశ్వకర్మ
యట్టిదేవేంద్రదత్తమహార్ఘనూత్న
వీటికాపేటి మామ భూవిభున కొసఁగె.

98


మ.

పవనాహారవిషంబు సోఁకదు యదౌపమ్యంబునం గేకిఁ గే
కివిలాసంబునఁ దాండవారభటి సంక్రీడించుటన్ క్ష్వేళ మ
భ్యవహారించెఁ గపాలియన్న మఱి యేలా చెప్పఁ దచ్ఛక్తి? య
న్నవగారుత్మతభుక్తిపాత్ర యొసఁగెన్ రాజాత్మజాభర్తకున్.

99


చ.

గరిమవరాటరాజు దనగాదిలియల్లున కిచ్చె ఘోటికా
కరటిపటీపటీరగణికామణికాంచనముఖ్యవస్తువుల్
పరిణయదక్షిణార్థ మయి ప్రౌఢత మీఱఁగ నప్పదార్థముల్
సరిఁ బరిపాటి నెన్నఁగ నశక్యము గీష్పతియంతవానికిన్.

100


సీ.

భక్తిఁ బ్రదక్షిణప్రక్రమంబులఁ జేసి
        రాశుశుక్షణికి నుపాసనంబు
నంశుకగ్రంథికల్యాణక్రియాచార
        మాచరించిరి మందహాస మెసఁగ
నఱ్ఱెత్తి చూచిరి యాకాశమండలా
        స్థానరత్నంబు నౌత్తానపాదిఁ

ద్రైలోక్యపతి దేవతాఫాలతిలకంబు
        దివిరి యరుంధతీదేవిఁ గనిరి


తే.

బ్రాహ్మణోత్తమఃపుణ్యపురంద్రివర్గ,
మంగళాశీర్వచోయుక్తమహితశోభ
నాక్షతారోపణంబుల నాదరించి
కంబుజాక్షియు నిషధదేశాధీపతియు.

101


ఉ.*

కంకణనిక్వణంబు మొగకట్టఁగఁ గౌ నసియాడ రత్నతా
టంకవిభూషణంబులు వడంకఁ గుచంబులు రాయిడింపఁగాఁ
బంకజనేత్ర గౌతమునిపంపున లాజలు దోయిలించి ధూ
మాంకునియందు వేల్చె దరహాసము ఱెప్పలలోన దాఁచుచున్.

102


సీ.

చెక్కుటద్దములపైఁ జెఱలాడునప్పుడు
        కస్తూరికాపత్రకములఁబోలె
శ్రవణపాశములలో జాఁగి పాఱెడునప్డు
        లలితతమాలపల్లవముఁబోలె
గలికికన్నులలోనఁ బొలుపారునప్పుడు
        నవలీలనీలాంజనంబుఁబోలె
ఫాలభాగంబు పైఁ బఱతెంచునప్పుడు
        కమనీయచూర్ణాలకములఁబోలె


తే.

నప్పు డావర్జితాజ్యధారాభిఘార
పరిమిళల్లాజనవళ మీపల్లవాగ్ర
హుతహుతాశనజిహ్వాసముత్థ మగుచు
హోమధూమంబు బాలపై నొయ్యఁ బొలసి.

103


ఉ.

కాంచనముద్రికామణినికాయకరాళవలస్మయూఖరే
ఖాంచలచక్రచుంబితనఖాంకుర మైననృపాలుచెట్టఁ బ

ట్టించెఁ బ్రమోదసంపద ఘటిల్లఁగ నొక్కపురంధ్రి నవ్యరో
మాంచము గ్రొత్తలేఁజెమరు నయ్యిరుగేలను సంభవింపఁగన్.

104


వ.

ఇట్లు పాణిగ్రహణం బొనర్చి పురంధ్రీజనవిలోకనార్థంబు సహస్రరంధీకృతంబుగాఁ జేయంబడిన కౌతుకాగారంబుఁ బ్రవేశించి.

105


తే.

దశశతాక్షుఁడు దొడుగుకుందనపుఁబైఁడి
కంకటముఁబోలు వేజాలకములయింటి
మధ్యభాగంబునందు శ్రీమంచ మెక్కి
రంబుజాక్షియు నిషధదేశాధిపతియు.

106


వ.

అనంతరంబ భోజకులాభరణంబు లగుదమదమను లిరువంకఁ బెండ్లిచుట్టంబులకు భోజనంబులు వెట్టం గట్టడచేసి రప్పుడు.

107


బువ్వపుబంతి

సీ.

పట్టాంశుకములపైఁ బన్నీరుఁ బ్రోక్షించి
        జేయార్చి చేపట్లు సేయువారు
మక్కళించినఠావు మంజిళ్ల పెందెర
        లుంగరంబులఁ బట్టియొత్తువారు
నగరుధూపము వెట్టి యభ్యంతరం బైన
        గగనావకాశంబుఁ బొగపువారు
వెండియెడ్డెనలపై వెలచి తెచ్చినపైఁడి
        పళ్లెంబు లాయత్తపఱుచువారు


తే.

రంకుమృగరోమకృతనూత్నరత్నకంబ
ళాదినానావిధాభ్యర్హితాసనములు
పెట్టువారుసు నై రిందుబింబవదన
లుభయబాంధవభోజనోద్యోగవేళ.

108

క.

ప్రయ్యవడకుండ నాడిరి
వియ్యపుమేలంబు లుభయవిధబాంధవులున్
నెయ్యంబునఁ దియ్యంబున
నొయ్యనఁ జతురాక్షరాధికోక్తి ప్రౌఢిన్.

109


సీ.

సర్వతోముఖపిపాసకుఁ దప్పిఁ బడియెదు
        కామమోదనము నిక్కముగ వలయు
నీముఖంబున మాకు నెఱయంగ సుఖమబ్బు
        గాంచుఁ గావుత నిన్నుఁ గమలయోని
యనులోమమున లేస్సపనిఁ జేసికొం టిప్డు
        భగవదారాధనప్రాప్తినిధివి
విద్వజ్జనులు నిన్ను విషయించి వత్తురు
        కలమధురములు నీగళరవంబు


తే.

లనుచు నెయ్యంపువియ్యంబు లల్లనల్ల
సరసనర్మోక్తిఁ జాతుర్యసౌష్ఠవముగ
గోష్ఠి సలిపిరి దమలోనఁ గొంతప్రొద్దు
భోజనాగారపర్యంతభూములందు.

110


చ.

లలన యొకర్తు వగ్గుకృకలాసముఁ జేరఁగ దెచ్చి వంచనన్
నలునకుఁ గుంచెవట్టు నెలనాగ పదద్వయమధ్యమంబునన్
నిలిపినఁ గాలు ప్రాఁక నది నీవియు వీడఁగఁ దోడిభామినుల్
గలకల నవ్వ నూడ్చె నది గట్టినపుట్టముపాయ శూన్యతన్.

111


చ.

అలికులవేణి యోర్తొకనిహస్తముల న్ముఖమజ్జనాంబువుల్
గలఁతియ యెత్తిపోయ నవి గార్చుచునుండె నతండు దోయిటన్
నెలకొని దానిక్రొమెఱుఁగునిద్దపుఁజెక్కులు ముద్దువెట్టుకోఁ
గెళవులవారిచూపు గిలిగిళ్లు మొఱంగఁగ వేళఁ గోరుచున్.

112

ఉ.

అవ్వలిదిక్కు మో మయి ప్రియంబున నొండులతోడ ముచ్చటల్
ద్రవ్వుచు నొక్కకోమలి పరాకున నుండఁగ ధూర్తుఁ డొక్కరుం
డివ్వల వచ్చి వంచనమెయిన్ నునుమించు మెఱుంగుటద్దము
న్నవ్వుచుఁ బట్టే దాని చరణంబులకు న్నడు మైన మేదినిన్.

113


తే.

‘ఓమెయేమె యిదేమేమె లేమ! యేమె
మేఘపుష్పంబుఁ దే?’ వంచు మేలమాడ
‘మేమె మే మేలు దఱ చయ్యె మేలు మేలు
మేఁక మేఁ’ కన సభవారు మిగుల నగిరి.

114


ఉ.*

లాలనఁ గ్రొత్తబెబ్బులికళాసము వెట్టిరి యాసనంబుగా
గోలయు సాధు వైనయొక కోమటికిన్ నిషధేంద్రబచ్చుకున్
మేలపుమైవడిం దమసమీపఫుధూర్తులు తత్పురస్స్థలాం
గూలత యవ్వణీక్కునకుఁ గోశవిజృంభణశంక సేయఁగన్.

115


తే.

పెడమరలి చూచె నొకచంద్రబింబవదన
వేడ్కదళుకొత్త నొకరాజవిటకుమారుఁ
బెడమరలి యేసె వాని నప్పుడ మరుండు
సానఁబెట్టిన మోహనాస్త్రంబుఁ దొడిగి.

116


ఉ.

ఇంచినభక్తి నొక్కతరళేక్షణ నైషధభూమిభర్త మ
న్నించువరూధినీపతికి నేరుపు మీఱఁగ వట్టివేళ్ళఁ గా
వించిన తాళవృంతమున వీచుచునుండెఁ జెమర్చుచుండె నా
చంచలనేత్ర క్రొమెఱుఁగుఁజన్నులబింకముఁ జూచి యాతఁడున్.

117


వ.

ఇట్లు హస్తపాదప్రక్షాళనగండూషముఖమజ్జనంబు లాచరించి బంధువులు తమ తమ నిర్దిష్టంబు లగు నర్హాసనంబుల

గూర్చుండి చతుర్విధాహారంటులు భుజియింపం దొణంగి రప్పుడు.

118


మ.

నివసద్భాష్ప మఖండితాఖలము నిర్ణిక్తం బసంత్యక్త మా
ర్దవ మన్యోన్య మసంగతం బహృతసారస్యంబు గౌరం బగౌ
రవ మామోదనమోదనం బమృతపర్యాయంబు సంబంధిబాం
ధవభూపాలసుతుల్ భుజించిరి వయోదర్పానురూపంబుగన్.

119


సీ.

గోధూమసేవికాగుచ్ఛంబు లల్లార్చి
        ఖండశర్కరలతోఁ గలపి కలపి
గుజ్జుగాఁ గాఁచినగోక్షీరపూరంబు
        జమలిమండెఁగలపైఁ జల్లి చల్లి
మిరియంబుతోఁ గూడ మేళవించినతేనె
        దోరంపులడ్వాలు దోఁచి తోఁచి
పలుచఁగా వండిన వలి పెంపుఁజాఁపట్లు
        పెసరపప్పులతోడఁ బెనఁచి పెనఁచి


తే.

గోవజవ్వాదిఁ గస్తూరిఁ గొఱఁతపఱుచు
వెన్నపడిదెంబు జొబ్బిల విద్రిచి విద్రిచి
వారయాత్రికు లనుమోక్షవంతు లగుచు
వలచి భుజియించి రొగిఁ బిండివంటకములు.

120


చ.

తరుణులు చంచలాలతలు తత్కరభాండనికాయ మంబుదో
త్కరములు పాలుఁదేనెలు ఘృతంబులు వాన లఖండఖండశ
ర్కరలును ద్రాక్షపండ్లు వడగండ్లును శోభనభుక్తివేళఁ దొ
ల్కరిసమయంబు పేరెలమిఁ గైకొనకుండునె భోక్తృసస్యముల్?

121

తే.

పచ్చఱామానికంబులపళ్లెరములఁ
బచ్చ గందనికూర లేర్పడమిఁ జూచి
పెట్ట రని పెండ్లి పెద్దలు పెడము వెట్టఁ
బెట్టుటకును నంగనలకుఁ బట్టెఁ దడవు.

122


క.

అరుదుగ నపు డొక్కొకయెడ
మరకతమణిపాత్ర గగనమండల మయ్యెన్
జిరువడములపాసెము శశ
ధరుఁ డయ్యెం జుక్క లయ్యె ద్రాక్షఫలంబుల్.

123


సీ.

అమృతరసోపమం బైనకమ్మనియాన
        వాలపాయసము జంబాల మయ్యె
మంచులప్పల మించు మండెంగమడుపులు
        పొరలి తెట్టునగట్టు నురువు లయ్యెఁ
గప్పురంబులయొప్పుఁదప్పుపట్టఁగఁజాలు
        ఖండశర్కరలు సైకతము లయ్యె
గరుడపచ్చలచాయఁ గలపచ్చగందని
        కూరలు శైవలాంకురము లయ్యె


తే.

నొలుపుఁబప్పులతీరంబు లురలఁబడగఁ
బూరియలు లడ్డువంబులు పొగలి పాఱ
విమలశాల్యోదనంబుపై వెల్లి సూపు
నాజ్యధారాప్రవాహసాహస్రములకు.

124


ఉ.

ఆదరణంబుతో నభినవాజ్యవిపాండురఖండశర్కరా
క్షోదసమన్వితంబుగ విశుద్ధహిరణ్మయభాజనంబులం
బైదలు లర్థిమై నిడఁగ బంధుజను ల్భుజియించి రన్నపూ
రాదరహాసచంద్రకిరణంబులఁ బోలెడుపాయసాన్నముల్.

125

తే.

ఆరగించి రసాధారణానురక్తి
వారయాత్రికులును బెద్దవరుసవారు
దివుట శశిలాంఛనక్రవ్యతేమనంబు
నసమశరకేతనవ్యంజనామృతంబు.

126


క.

సేవించి రొకటి దొలఁగం
ద్రోవక జంబీరరసముతో నూనియతో
నావం బెట్టినకిటిము
ద్రావలయము లమృతమధుర రసఖండంబుల్.

127


క.

ఆమిష మనామిషముగ న
నామిష మామిషముగాఁ గుహకమార్గకళా
సామర్థ్యంబునఁ జేసిన
తేమనములు మనములం బ్రతిష్ఠించె రుచుల్.

128


చ.

అసమసుధారసహ్రదమునందలిరొంపు లనంగ మంచునం
బిసికినపంచదార లనఁ బేరినమీఁగడతో మనంబులం
బసిగొనఁ జేయువాహరిపుబష్కయణీదధిపిండఖండముల్
మెసవిరి కంఠదఘ్నముగ మిక్కిలివేడుక వారయాత్రికుల్.

129


తే.

మిసిమి గలపుల్లపెరుఁగుతో మిళిత మైన
యావపచ్చళ్లు చవి చూచి రాదరమునఁ
జుఱ్ఱుమని మూర్ధములుదాఁకి యొఱ్ఱఁదనముఁ
బొగలు వెడలింప నాసికాపుటములందు.

130


చ.*

ఱవికయుఁ బట్టుపుట్టము చెఱంగు మఱుం గయి యున్కిఁజేసి గౌ
రవపరిమాణముం దెలియరామికి ముచ్చిరుచున్న యొక్కప
ల్లవునకుఁ జూపె నొక్కతె విలాసముతోఁ దనతోరపుంజనుం

గవపొడ వింత పొ మ్మనిన్నకైవడిఁ బానకహేమకుంభమున్.

131


ఉ.

ఎట్టివినీతుఁడో యొకరుఁ డేణవిలోచన బంతిపట్టి మా
ర్వెట్టగ దానివక్త్రశశిబింబముఁ జూడఁగ నోడి తాల్మిమైఁ
బట్టముఁ గట్టెఁ దచ్చరణపద్మయుగాంతరచంద్రమశ్శిలా
కుట్టిమభూమిభాగమునకుం దనమంజులదృష్టిపాతమున్.

132


చ.

ఒసపరి జాణఁడొక్కఁ డొకయుగ్మలిచేరువ మాఱువెట్టఁగాఁ
బసనికురంగికాపలలఫాలి నిజాధరపల్లవంబుపైఁ
బసిగొని చేరఁబట్టి మునిపండుల నొయ్యన నప్పళింపఁగా
ముసిముసినవ్వు నవ్వె నది మో మొకయించుక యోరసేయుచున్.

133


క.

[1]చలివాలు నవ్వు లడ్డువ
ములు చన్నులు పనసతొలలు మోపులు మండెం
గలు చీరలుగ భుజిక్రియ
వలపించెం బెండ్లివారి వనితయుఁ బోలెన్.

134


తే.

పద్మకోశాభినయహస్తపల్లవంబుఁ
జూపె నొకమచ్చెకంటికి సొబగుఁ డొక్కఁ
డంతయోగిర మడిగెనో! యంతలేసి
కొమరుఁబాలిండ్ల నడిగెనో! రమణి నతఁడు.

135


తే.

చూచె నొకఁడు వయోవశస్తోక వికచ
కుచసమున్మేష యగునొక్కకువలయాక్షి
నుభయదోర్మూలకూలంకషోరుకఠిన
లలితవక్షోజ యగులేమ లజ్జఁ బొంద.

136

తే.

ఉష్ణశీతాన్నకబళంబు లొకఁడు సూపఁ
బవలొ రాత్రియొ గెడ గూడ నవసర మని
దానికుత్తర మొకలతాతన్వి యిచ్చె
నధరబింబంబు విడిచి సంధ్యాగమ మని.

137


ఉ.

నాన దొఱంగి చుంబన మొనర్చుటె కాదొకఁ డొక్కచంద్రబిం
బానన మోముఁజంద్రుఁ జషకాంతరబింబితునిం బునఃపునః
పానకపానకర్మమునెపంబునఁ జేసి తదోష్ఠపల్లవం
బానుచు నాచరించెను సమంచితసీత్కృతచూత్కృతంబులన్.

138


ఆ.

పంచదారఁ బొరపి భక్షింపఁగా నెత్త
భావదుష్ట మనుచు బావ నగిన
దొలఁగఁబెట్టె రోషకిలకించితంబుతో
గొమ్మనరఁటిపండ్లు గూర్మి మఱది.

139


వ.

ఇవ్విధంబున శుచియు మృష్టంబును బథ్యంబును నగుభోజనంబు నేసి పెండ్లిదొరలు సుగంధోదకంబులం జేతులు తొడసి వార్చి ముఖవాసనంబు గైకొని కర్పూరతాంబూలంబులు పరిగ్రహించి దమదమనులప్రియోక్తులకు హర్షించుచు నిజనివాసంబుల కరిగి రప్పుడు.

140


చ.

కలికివరాటరా జడప గప్పురవీడెము వెట్టె నవ్వుచు
న్నలునడపంబువానికి ఫణాధరవల్లిదళాంతరంబునన్
బలితపుఁదేలు మైనమునఁ బన్ని యతం డది చూచి భీతిఁ ద
మ్ముల మిల వైచిన న్నగిరి మూఁగినరాజకుమారు లందఱున్.

141


మ.

మృదుమృష్టాన్నము లీప్రకారమువ నెమ్మి న్వారు ముప్ప్రొద్దుఁ గొ
న్ని దినంబు ల్భుజియించుచుండిరి సమున్నిద్రానురాగంబుతో
బదియాఱేఁడులపువ్వుబోండ్లనునుపుంబాలిండ్ల కాఠిన్యసం

పదతో రాత్రులు మల్లుసాము మదనోన్మాదంబునం జేయుచున్.

142


వ.

నిషధమహీవల్లభుండును దమయంతీపరిణయమహోత్సవం బివ్విధంబున ననుభవించి దివసచతుష్టయానంతరంబున.

143


ఆశ్వాసాంతము

శా.

నారీచిత్తసరోమరాళ! నయచాణక్యా! విరించాన్వయ
క్షీరాంభోధిసుధామయూఖ! కవితాసిద్ధాంతసర్వజ్ఞ! జం
భారాతిద్విపహస్తకాండనిభబాహాఖడ్గధారాపయో
ధారాశాంతవిరోధిభూధవమహోదగ్రప్రతాపానలా!

144


క.

అరివీరబసవశంకర!
శరణాగతరక్షణానుసంధానధురం
ధర! సచివగంధసింధుర!
ధరణీభరణైకదక్షదక్షిణహస్తా!

145


మాలిని.

ధరణిభరదిధీర్షాధఃకృత స్తబ్ధరోమ
ద్విరదకమఠరాజోర్వీధ్రదర్వీకరేంద్రా!
హరచరణరిరంసావ్యంజితానందసాంద్రా!
పరిహృతమతితంద్రా! భాగ్యసంపన్మహేంద్రా!

146


గద్యము.

ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సకలవిద్యాసనాథ శ్రీనాథప్రణీతం బైనశృంగారనైషధకావ్యంబునందు షష్ఠాశ్వాసము.

  1. తెలిపాలు అని పాఠాంతరము.