శుకసప్తతి/పదునొకండవకథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వ. ఏతదర్థసమాయాతం బగునొక్కపురాణవృత్తాంతంబు గలదంచు మాటలఁ బీఁటవెట్టి యాసెట్టిపట్టితోఁ జలపట్టి పచ్చచట్టుపలపిట్టదిట్ట యిట్టనియె. 238

పదునొకండవకథ

క. [1]నలినావాసం బనఁగాఁ
గల దొకపుర మబ్ధికన్యకామణికిం దా
వలమై మదసారంగో
జ్జ్వలఘీంకారవిదళితదిశాభాగంబై. 239

క. ఆనగర మేలు దుర్దమ
సేనుం డనునృపతి యతనిచెంతను శూరా
ఖ్యానుఁ డనునొక్కరౌతు మ
హానతరిపుభీతిహేతు వై వర్తిల్లున్. 240

సీ. గీఱునామము చిన్నికోరమీసలు చెంప
బనిమట్టుసిక బొందు పట్టునూలు
వెనుకకట్టురుమాలు వెడఁదగాయపుఁగాయ
దారిఁ గాన్పించు గందంబుఁబూఁత
కమ్మిపంచెయు గట్టికమ్మిదుప్పటి వల్లె
వాటు కెంగేలిలో వంకవంకి
పట్టుచేనపరంజిపరుజుతోఁ దగుకత్తి
పలుచని బచ్చెనపావుకోళ్లు

తే. చికిలిచౌకట్టు సరిపెణ ల్రక మెసంగు
నుంగరంబులు నొకవింత యొఱపు నెఱప
నేలి నాతనికొలువున కేగుదెంచుఁ
జూపఱు నుతింప నయ్యాయుధోపజీవి. 241

క. అతనికిఁ గలహప్రియ యను
సతి గల దయ్యతివ నడచుచందము లెల్లన్
మతినరయ నతనిపాలిటి
ప్రతిబంధపుఁ బేరఁటాలు పంకజవదనా. 242

క. ఆరమణినడత యొకటియుఁ
బేరొకటియుఁగాక యుండఁ బెనుదుఃఖముగాఁ
బోరాడ విసివి వేసరి
శూరుఁడు స్త్రీహత్యఁ జేయఁ జూడనికతనన్. 243

తే. వెడలనడిచినఁ బ్రతిరాజవీర మనెడి
పురమునందున్న పితృగేహమునకుఁ బోవఁ
దలఁచి యయ్యింతి డింభకద్వయముతోడ
నరిగెఁ బథికులచే మార్గ మరసికొనుచు. 244

వ. ఇవ్విధంబునం గతిపయప్రయాణంబుల నరిగి యొక్కనాఁటి పయనంబున నది మార్గంబుదప్పి కాలిత్రోవంబడి యక్షుద్రనిద్రావిరామసమయసముదితహర్యక్షకిశోరక్షుధారావసమాకర్ణనాతిభీతగర్భస్రవదర్భకానవలోకిపలాయమానధేనుకావితానంబును, దదీయశ్రవణపవనచలితకీచకాన్యోన్యకర్షణజనితధనంజయశిఖాభిముఖధావనాశార్దూలంబును, దదీయభీషణాకారవికారావలోకనమాత్రత్రస్తతటాకగాహనపరాయణవరాహంబులును, దదీయపతనచలితజలజాగ్రసము త్పతద్రథాంగసముత్తుంగపక్షపుటపటకటాత్కారసంభ్రాంతసకలశకుంతంబును, వెండియు వలీముఖపరికంపితశాఖాగళితకుసుమరసవిసరంబులపై ముసురుకొనునసమభసలంబుల వినీలంబైన నేలయుఁ గురంగనాభికాసద్యస్స్రుతమృగమదపంకిలం బైనభూమియు నభేదత్వంబుఁ జూపం బరిస్రుతప్రసవపరాగంబును, సప్తచ్ఛదరంభాస్తంభపతితరజోవ్రజంబును వేఱు లేక మీఱఁ దరణీకిరణవిదారితవేణుముక్తముక్తామణులును నచిరప్రసూతకుండలివనితాండంబులు నఖండంబులై మెండుకొనఁ గాసరంబులకు వాసరంబులును, గవయంబులకు నిలయంబులును, దుప్పులకు నెప్పును, జమరవాలంబులకు విభ్రమస్థానంబును, భల్లుకంబులకు నుల్లోకంబును, ఖడ్గసంతానంబునకు నిశాంతంబును, మయూరంబులకు జయారంభస్థానంబును నై సురసరణ్యానీతాగ్రయగు నొక్కయరణ్యానిం బ్రవేశించి కించిచ్చలనంబులేక యయ్యాకాశమధ్య యభ్యగ్రఝరీమధ్యంబునం గూర్చుండి మార్గాన్వేషణంబు సేయుచున్న సమయంబున. 245

తే. చెంతబారెడులో నికుంజాంతరమున
నొక్కబెబ్బులి యుండి యయ్యువిదఁ జూచి
కూర్చె నాహార మాఁకలిగొన్ననాకు
దైవమని యంతలో వేఱుతలఁపు వొడమ. 246

క. ఇదినాపద మిదినానద
మిదినాపొద చేర వెఱతు రెవ్వరు నేఁ డీ
మదవతికి నెన్నిగుండెలొ
కదలక నే యున్నయునికి కార్య మెఱుంగన్. 247

ఉ. ఈవన మెల్ల నేలెఁడు మృగేంద్రుఁడుసైతము సాపరాధుఁడై
సేవకుఁ డార్తినా మఱుఁగుఁ జెందినచో మదనుజ్ఞమీఁద సం
భావితుఁ జేసి వాని బహుమానముతోఁ గొనిపోవుఁగాని తే
జోవిభవంబు చూప వెఱుచుం బలవంతుఁడ నేను గావునన్. 248

తే. అట్టి నన్నునుఁ జేరి భయంబు లేని
పొలుపుతోనున్న దీపువుఁబోణి చెంత
ననుచుఁ గవుకునఁ బట్టరా దరయవలయు
యోజన యొనర్చి సేయుట రాజనీతి. 249

క. కార్యాకార్యము లెఱిఁగిన
యార్యుఁడు నామంత్రి జంబుకాగ్రేసరుఁ డా
ధైర్యనిధి సుమతినాయకుఁ
డర్యమపదభక్తుఁ డెచటి కరిగెనొ యెఱుఁగన్. 250

తే. అతని రావించి నావిచారానువృత్తి
జెప్పుదునొ దీని నేటి విచార మింకఁ
గమిచి నా మేనిరక్తమాంసములఁ బీల్ప
సాఁగె నతిగాఢతరలుఠజ్జాఠరాగ్ని. 251

క. అని తెంపు చేసి కనకనఁ
గనుఁగొనల న్నిప్పు లురలఁగా వాలము భూ
మినిఁ దాటించుచుఁ దద్గళ
మును జూచుచు గుఱక యుఱుకఁ బోనటు లున్నన్. 252

క. అబ్బెబ్బులిఁ గన వచ్చెం
దబ్బిబ్బు లిఁకేమినేయుదాన ననుచు న
బ్బిబ్బోకవతి మనంబున
నబ్బురమును భయముఁ ద్రొక్కులాడఁగ నుండెన్. 253

క. ఆకలహప్రియ పులిచే
నేకరణిం బ్రదికి యూరి కేగఁగవలయున్
రాకేందువదన తెల్పఁగ
దే కందముగాని నీయతిస్థిరబుద్ధిన్. 254

క. అనినఁ బ్రభావతి యిఁక నే
మని తెల్పుదు నాకుఁ జూడ నగపడియెన యా
వనితపులివాతి; కేగతి
వినిపించెదొ దాని బ్రదుకువిధ మిఁకమీఁదన్. 255

ఉ. నావుడుఁ జిల్క పల్కు లలనా విను మత్తఱి నవ్వధూటి ప్ర
జ్ఞావతియౌట నిప్పులి నిజంబుగ నన్గనుఁగొన్నయప్పుడే
చేవదలిర్పఁ బైఁబడక చింతయొనర్చుచుఁ బేలుపోయె నే
నేవగదాననో యనుచు నీయెడ భీతియుఁ జూపఁగాఁదగున్. 256

క. అనుచుఁ దనూజులనిద్దఱ
గొనగోటంగిల్లి వారు కోయని యేడ్వం
గనుఁగొని యూరార్చువిధం
బున నిట్లను విసివినట్టిపూనిక దోఁపన్. 257

తే. ఏల యేడ్చెద రాఁకటి కేమియొల్ల
కకట పులిమాంసమేకాని యన్నలార
మీకొఱకు వ్యాఘ్రములఁ జంపిమీఱుకతన
దూఱుమఱివ్యాఘ్రహంతయ నేర్పుఁగంటి. 258

క. ఇలువాసి మీకు గ్రాసపు
పొలవాసిం గూర్ప రోసి భువిఘోరమృగా
వలికిందలఁకక యడవిం
బులికిం బులినగుచుఁ దిరిగి పులిపులినైతిన్. 259

తే. ఐన నేమయ్యె నిచ్చోట నరయుచున్న
దానఁ బులులున్నవో యని కాన నింక
రెండుగలిగిన మాయిద్దఱికిని జాలుఁ
గాక యొకటుండినం జెఱిసగంబు గలదు. 260

క. అని పలుక జళుకు మదిఁ బెనఁ
గొనఁగా మేనెల్ల ముచ్చికొనుచుం బులి మె
ల్లనె యవలికిఁ జని వెసఁ జం
గున నచ్చటిలతలు ద్రెంచికొనుచుం బాఱెన్. 261

క. అనినఁ బ్రభావతి మదిఁబ
ర్విననివ్వెఱ ముక్కు మీఁద వ్రేలిడి తలయూఁ
చి నిజంబుగ మగువలెపో
ఘనసాహస లనుచుఁ బ్రొద్దుఁగని పల్లవితోన్. 262

క. కనుఁగొంటివె యదిచక్కన్
మనసిజనృపకీర్తిరుచిసమాజపుమొక్కన్
మినుకులకులములయిక్కన్
వినుచక్కింజొక్కమైనవేగుంజుక్కన్. 263

తే. అనుచుఁ గేళిగృహంబున కరిగె మఱి గ్ర
మక్రమంబునఁ దరణిబింబంబు వ్రాలె
నపరవారాశిఁ దనుఁజూచి యచటిమీన
కోటిపలలం బటంచు ముక్కులను బొడువ. 264

మ. తన మేనం దగఁదోఁచుసొమ్ము లయినం దజ్జ్యోతి లోఁగొంచు న
ల్లని మేలౌ బురునీసుకప్పడము చాల న్మించ నేతెంచెఁ బ
చ్చనివిల్కానిజయాస్పదం బగుజిరాసంజోకతేజీవిధం
బున నవ్వేళఁ బ్రభావతీసుదతి చూపు ల్వన్నెలంబర్వఁగాన్. 265

క. చనుదేరఁ జిల్క తత్కర
మున వ్రాలి మెఱుంగుబోఁడి ముక్కుకొనఁ జుఱు
క్కున గీరి కడమకథయున్
విని పోయిన లెస్స గాదె విమలేందుముఖీ. 266

వ. అని పలికి రాజసంభోగసమారంభవిజృంభమాణాధీనం బగునమ్మానవతీమానసంబుఁ ద్రిప్పి చెంగటం జెలంగు మెఱుంగుటపరంజిపీఁటపయిం గూర్చుండిన యక్కురంగనయన తరంగితనిజవాంఛాఫలరసవీచికలం బ్రార్థింప నింతింతతరితీపు చూపుచుఁ గీరపుంగవం బిట్లనియె. 267

మ. విను మారీతిఁ బదాభిఘాతపతితోర్వీజాతమై భీతివీ
డని శీఘ్రంబున దూర మేగి దగదొట్టన్ వ్యాఘ్రమాదండ ను
న్ననిగండోపల మెక్కి యక్కలికి యందం బందు నల్దిక్కులం
గనుపింప న్వెడగుండెకాయ లదరం గాలూఁద లేకున్నెడన్. 268

తే. కనియెఁ దన్మంత్రి యైనసృగాలమౌళి
సుమతినామకుఁ డారీతిఁ జూచి యచట
కేమిటికి వచ్చెనో వానినేలినాతఁ
డనుచుఁ జెంగటిపొదఁ జేరి యాత్మలోన. 269

సీ. తనయున్కి యెఱుఁగ కుద్ధతిఁ జెంతఁ జను లేటి
కొదమపైఁ బెట్టదు క్రూరదృష్టి
దగ్గఱ గంతులు తగవేయుచున్నట్టి
కుందేళ్లఁ బట్టని యందమేమొ
చెంగటఁ దిరుగుచుఁ జెంగున దాఁటెడు
దుప్పులఁ బట్టక తప్పెనేమొ

మొక్కలంబునఁ జేరి సొక్కుచుఁ దిరుగాడు
మనుబోతుఁ బట్టంగ మఱచెనేమొ
తే. యనుచుఁ దనలోన నూహించి యాత్మఁ జెదరి
చూచి ధైర్యంబు వదలక చోద్య మంది
చెంతఁ జేరఁగ భయమంది చాలఁ గలఁగి
తఱుచు భ్రమవొంది యంతటఁ దానె తెలిసి. 270

ఉ. నాలుక వ్రేలవైచి వదనంబు వివర్ణవిధంబుఁ జెందఁగా
మ్రోలఁ జెలంగియాడెడు రురుప్రముఖంబులమీఁద నేమియున్
వ్రాలనిచూడ్కి గుండెయదర న్నిలుపోపక యున్న యట్టిశా
ర్దూలకులేంద్రుఁ జూడ భయదోషముఁ జెందినరీతి గన్పడన్. 271

క. నాయంతమంత్రి యుండి య
పాయం బగునట్టి వేళ నధినాథుసుఖ
శ్రీయుతుఁ జేయక యుండుట
నాయమె యిదిపోదు పతిమనంబలరింతున్. 272

క. అని తలఁచి సుమతి చేరం
జని పులికిం గేలు మొగిచి సవినయముగ న
వ్వనినుండి యుబుసుపోకం
జనుదెంచితి రేమొ యిచటిజాడలు చూడన్. 273

క. దొరయైనయతఁడు మఱచియుఁ
బరభూమికిఁ బోవరాదు పనిగట్టినచో
నురుతరనిజభటయుతుఁడై
యరుగందగు లేకయున్న నాపద లొదవున్. 274

క. అసహాయశూరులరు గను
క సముత్సాహంబు వొడమఁగా వచ్చితిరి
వ్వసుధయును గంటిరేకద
వసతికిఁ బోవుదము తడయవల దిచ్చోటన్. 275

చ. అనఁ బులి యాతఁ డచ్చటిమృగాక్షికఠోరవచోవిశేషముల్
వినినది లేదు గాన బహువింతలు తెల్పేద వంచు నెంచి నె
మ్మనమునఁ దోచుభీతిని నమందతరస్వర మొప్ప నాతనిం
గనుఁగొని పల్కు దైన్య మధికంబుగ దిక్కులు పాఱఁజూచుచున్. 276

క. విను తల్లికి నే మరలం
జనియించితి నేఁడు నీదుసల్లాపకథా
వనధిం దేలఁగఁ బుణ్యం
బునికిం బ్రదికితిని కీర్తిభూషణమూర్తీ. 277

ఉ. సిగ్గులచేటుసు మ్మది వచించిన నాప్తుఁడ వౌట నీకు నే
నిగ్గురుభీతిహేతు విపుడింతయుఁ దెల్పెద నన్యు లెవ్వరీ
డగ్గఱ లేరుగా మనదిటంబుఁ గనుంగొన నంచు మెల్ల నే
యగ్గజయాన పల్కిన మహాకటుభాషలు విన్నవించినన్. 278

క. ఆఁటదిగా దది మృగముల
వేఁటాడ న్వచ్చుమృత్యువే తప్పదు నో
రాట మిదియేల యిచ్చట
నేఁటి కెడయొనర్చుకొనుట నీతియు కాదో. 279

క. అని పలుక సుమతి యెంతయు
విని యకటా యెవ్వతెయొ వివేకవిహీనుం

డని యితని బేలుపఱిచెం
జనదు గదా పిఱికిదొరల సరసం గొలువన్. 280

క. పతికి భయమడరుచో నది
యతిశయముగఁ జేసి మాన్యుఁడై బ్రదుకుం గు
త్సితమంత్రి యతనిఁ గైకొను
నతిదుర్మతి యైన నాథుఁ డాప్తుఁడు గాఁగన్. 281

వ. కావున నేకాచారంబగు నమాత్యపథంబునం బ్రవరిల్ల నాకు నకారణభయభ్రాంతుండైన యతని కనుగుణంబుగా నడుచుట కర్తవ్యంబుగాదు బహుకాలం బేతదర్థంబునఁ బోషితుండనై యుండి యివ్వెరవుఁ దెలుపకుండిన సామాన్యులలో గణ్యుండనగుదు నితండు మదీయవచనంబులు వినియెనేని
మే లట్టు గాక దుర్బుద్ధియై మదీయస్థానహానిపర్యంతంబుఁ దలంచినఁ దలంపనిమ్మని నిశ్చయించి యాసృగాలంబు శార్దూలంబున కిట్లనియె. 282

తే. ఎలుఁగులకు వేరువిత్తు దుప్పులకు గండ
మేదులకు మిత్తి లేళ్లకు నెదురుచుక్క
కాసరంబులపాలిటి కంటినొప్పి
యసదు గాదుగదా భవదన్వయంబు. 283

చ. అలవి యెఱుంగ కొక్కపులి కల్గినవాఁడయి భీతిఁ జెందయ
క్కొలపగఁదీర్చుకోఁదలఁచి కోడెవయాళివజీరుఁ డెప్పుడున్
మెలఁగెఁడు వ్యాఘ్రచర్మమను మీనెఱడాగు ధరించి శూరతా
కలన భవత్కులంబునకుఁ గల్గదు జోడు మృగాన్వయంబునన్. 284

క. భిన్నేతరమగు సకలస
మున్నతవిభవాభిజాత్య మున్నదె కద ని

న్నెన్నుతఱిఁ గొంచగాఁడవె
యన్నన్న నఖాగ్రనిర్జితారివి గావే. 285

తే. ఇట్టినీ వొక్కభామ యేమేమొ పలికె
ననుచు వెఱచితి ననుటెల్ల నరయ నాకు
బుద్ధి శోధింపఁగాఁ బోలుఁ బొసఁగ దొరలు
తలఁప సేవకహృదయభేదకులు గారె. 286

తే. కాక వెఱచినమాట నిక్కంబ యేని
నేఁడు నీవంక శార్దూలనికరమునకుఁ
జెల్లఁబో మాంసకబళంబు బెల్లమయ్యెఁ
బ్రాఁతపరివారముల నోట బగ్గిపడియె. 287

క. మనుజాంగనయఁట తనయుల
కనవరతము పులులఁ ద్రుంతు ననెనఁట యిదియే
వినినంత శరీరముతోఁ
జనుదెంచితె యకట నీదుశౌర్యము గూలన్. 288

తే. రమ్ము నా వెంటఁ గొంతదూరముననుండి
దంటతనమున నను వెన్నునంటి చూడు
నీకుఁ గైకాన్కఁ జేసెద నేఁడు దానిఁ
దత్తనూజులకంఠరక్తంబుఁ గ్రోలు. 289

క. అన విని శార్దూలం బను
విను మిచ్చటఁ బ్రేలవచ్చు వెస దానిఁ గనుం
గొననంత మాట వెడలునె
నినుఁబోఁటికి నే నెఱుంగనే నీబలమున్. 290

క. తగిలించుకొన్నపిమ్మట
నిగిలించుటె కాని కార్య మే మున్నది యా

మగువఁ జననిమ్ము పోవుద
మగునె యసాధ్యమున సాహసాదృతి సలుపన్. 291

క. చలమున నది పైఁబడినం
జులుకనివాఁడ నని యుఱుకఁజూతువు మఱి మాం
సలదేహుఁడ ధావనచే
నలసితిఁ బరువెత్తఁజాలనౌ నిటమీఁదన్. 292

క. నావుడు గోమాయు వనున్
నీవిటు తప్పించుకొన గణించెదు కాయం
బీవగల డాఁచికొని యా
హా విను మెన్నేండ్లు బ్రదుకుదయ్య మృగేంద్రా. 293

క. బలవన్మృగమంత్రులయెడఁ
దలవంపుల కోర్వలేక తఱిమెద మదిలోఁ
దలఁపకు బహుభీతిని లె
మ్మలఘుపరాక్రమ మొనర్ప నందుం గీర్తుల్. 294

క. నను నమ్మవేని యిచ్చటి
వనితీఁగెలు చుట్టి పెనఁచి నాకున్నీకుం
బెనవైచికొమ్ము రమ్మిక
నిను జూచిన నవ్వధూటి నేలం గూలున్. 295

తే. అనుచు నక్క నిజాధీశు నతులశౌర్య
మెనయ బోధించి పెనవై చికొనుచుఁ దెచ్చెఁ
గురుబలావళిఁ జేర నుత్తరుని ధైర్య
శోభితుని జేసి తెచ్చు నర్జునుఁడు వోలె. 296

క. ఈలీల వచ్చు నాశా
ర్దూలసృగాలముల భయముతోఁ గనఁ జేయం

జాలుట గలహప్రియ కిం
కేలాగునఁ గలుగవలయు నిందునిభాస్యా. 297

తే. అనుచుఁ జిలుక పలుక నాప్రభావతి యిట్టి
యవగడంబు మాన్ప నది యెఱుంగు
నిపుడు నీ వెఱుంగు దింతియే కాని యీ
తెంపువగలు మాకుఁ దెలియ వనిన. 298

శా. కీరం బిట్లను నట్లు ఘోరతరభంగిక వ్యాఘ్రగోమాయువుల్
చేరన్రా దిలకించి యవ్వనిత కించిద్భీతియు న్లేక ధై
ర్యారూఢిన్ మృగధూర్తముం బలుకు నాహా సత్యవాక్యత్వ మీ
డేఱం దబ్బఱకాఁడ వైతి గద యింకేరీతి సైరింపుదున్. 299

తే. పులుల రెంటిని దెత్తు నీపుత్రయుగళ
మునకు నని నమ్మిక లొసంగి పోయి యిప్పు
డొక్కశార్దూలమును దెచ్చి యొప్పగించె
దొల్లఁబో కాననేఁడు నీయుసుఱుఁ గిసురు. 300

మ. అనుచుం దిగ్గునలేచుదానిఁ గని యవ్యాఘ్యేంద్ర మౌరౌర ఛ
ద్మననేసం గద నక్క యెక్కరణి నమన్వచ్చు నంచున్భయం
బున దాని న్వెస నీడ్చికొంచుఁ బఱచెన్ భూభాగ మల్లాడఁగాఁ
దనకంచుం బరువెత్తుచోఁ గలవె కాంతావంచనాసంపదల్. 301

క. అనఁ జిలుక కాప్రభావతి
మునుపటి వగకన్న నధికముగ వెఱపించెన్
వినుమా కలహప్రియ యిం
తనిరూఢంబైన నేర్పు దానికె చెల్లున్. 302

వ. అని పలికి విరహిజనమథనంబున మనసిజుండు పట్టించు [2]ధర్మదారోదయంబునుంబోలి మిక్కుటంబగు కుక్కుటారవంబున నరుణోదయం బగుట యెఱింగి యక్కురంగనయన యంతఃపురంబునకుం జనియెఁ దదనంతరంబ. 303

క. వనజరుచిఁ గొనఁగ సమయం
బనుచోరుఁడు రోదసీగృహముఁ జొచ్చి భయం
బునఁ బఱవ నడఁచుదీపం
బునఁ బోల్పంబడుచుఁ బ్రొద్దు పొటుకునఁ గ్రుంకెన్. 304

చ. ప్రవిమలమౌక్తికంబుల తురాయి నిగన్నిగల న్మెఱుంగు చ
నవ మనుగెంపుదండల దగద్ధగలం బయలొందనీక నీ
లవసనపున్ముసుంగు పొదలంగఁ బ్రభావతి వచ్చె నత్తఱిన్
గవిసెన లోకలం జకచకల్గల దర్పణలక్ష్మి గేరుచున్. 305

క. వచ్చుటయు నిచ్చలంబున్
బచ్చలపంజరము వెడలి పడఁతీ యిదె యే
నిచ్చట నున్నానని యను
పచ్చనివిలుకానితేజిఁ బరికించి వెసన్. 306

క. నిన్నఁటికథ మఱి యింకను
నున్నదియో యుండెనేని యుచితవచస్సం
పన్నతఁ దెలిపెదె గ్రక్కున
నన్నరపతిపొందు నేఁటికైన న్వలయున్. 307

క. అన శుక మిట్లను గుతుకం
బునఁ గథ కొదవ యన నెంత మూఁడేమాటల్

వినిపొమ్ము పోయి యచ్చట
జనపతి రతిఁ జొక్కి తామసము చేయకుమీ. 308

మ. అని యాశావశఁ జేసి యాశుకసుధాశాధీశ మీశానశీ
ర్షనదీశోభికుశేశయాంతరరసశ్లాఘావిశేషాపనో
దనశీలావిశాలశీతలగుణోదారోక్తిధారానిగుం
భనగంభీరము గాఁగ నిట్లనుచుఁ దెల్పంజొచ్చె నచ్చెల్వకున్. 309

క. కాంతా వింటివెకద వి
భ్రాంతపుఁబులి నక్కఁ గొనుచుఁ బఱచుట మునుపే
యంతం గలహప్రియ త
త్కాంతారము వెడలి తల్లిదండ్రులఁ జేరెన్. 310

శా. నిర్దాక్షిణ్యమనస్క యవ్వనిత యంటె న్వెంటనే యంచుఁ ద
చ్ఛార్దూలం బతిభీతిఁ బాఱెను లతాసంబంధమౌట న్మహా
దుర్దాంతోగ్రశిలాభిఘాతవిగళద్ఘోరాస్రధారాతిస
మ్మర్దాధ్వంబగు నక్క నీడ్చుకొని సంభ్రాంతాన్యజంతుత్వరన్. 311

క. ఈరీతిఁ బఱచి పరచిం
తారంభము మఱచి ధావనాయాసమునన్
నోరెండ నిలిచె నొకకాం
తారమునం బిఱికిగుండె తటతట నదరన్. 312

క. నిలిచి దగదీర్చుకొని హె
చ్చిలుకోపముతోడ నింతచేసినదీనిం
దలవ్రచ్చుక మ్రింగెద నను
తలఁపున జంబుకముఁ గ్రూరతరముగఁ జూచెన్. 313

క. అప్పుడు సృగాల మద్దెసఁ
దప్పించుకొనంగ నేమి తలఁపఁగ వలయుం

జెప్పుము ప్రభానతీ యన
నప్పులుఁగున కాసుధాకరానన పలికెన్. 314

తే. కాలిసంకెల లతికానికాయబంధ
మప్పులి యటన్న నాగ్రహవ్యగ్ర మింక
జాఱిపోరాదు సాంత్వనసరణిఁ గూడ
దెట్లు తప్పించుకొను నక్క యిట్టియెడను. 315

వ. కావున సృగాలంబునకు శార్దూలవదనగహ్వరంబె యవశ్యంబు భావ్యంబని తలంచెదఁ గాని తత్ప్రాణగోపాయనంబునకు నుపాయంబు దోపదు మదీయశేముషీవిశేషం బింతియ, యనంతరకథావృత్తాంతంబుఁ దెల్పు మనినఁ గీరం బిట్లనియె. 316

క. ఇది తెలియకున్న బుద్ధికిఁ
గొదవనుట ల్గాదు జారుఁ గూడఁగఁ జనుతో
యదకచ కిట్టి విపద్దశ
యద నెఱిఁగి యడంపవలయు ననియనుట చుమీ. 317

క. అవ్వలి కథ వినుమా యెల
జవ్వని యారీతిఁ జూచుశార్దూలపతిన్
నివ్వెఱఁ గనుఁగొని జంబుక
మవ్వేళకు నొకనుసాయ మాత్మందోఁపన్. 318

మ. పులికిం గేలు మొగిడ్చి పల్కు విను మంభోరాశిగంభీర నా
పలుకు ల్ద్రోహ మొనర్చెరా యనుచు నాపైఁ గోపమే కాని రాఁ
గలకార్యం బెఱుఁగంగలేవు సముదగ్రక్రోధయై యావధూ
తిలకం బిచ్చటి కేగుదెంచుఁ దనుజోద్రేకక్షుధల్ మాన్పఁగన్. 319

క. మన మున్నచో టెఱుంగునె
యని తలఁప న్వలవ దుపలహతి గళితాస్మ
త్తనురక్తధార త్రోవం
గనుఁగొని యదె యడవిజాడఁగాఁ బఱతెంచున్. 320

క. మున్నొనరించిన నేరం
బెన్నకు తత్ఫలముఁ గంటినేకద యిఁకమీఁ
ద న్నీకు శుభ మొనర్చెద
న న్నరయకు మింక వంచనాపరుఁగాఁగన్. 321

క. పెనఁ ద్రెంచి యెచటికేనియుఁ
జనుమా శార్దూలహంత్రి జాడ మెయిం గ్ర
క్కున వచ్చిన నినుఁ బొరిగొను
ననఘా జైవాతృకత్వ మందుము నీవున్. 322

క. అని పలికినపుడె నఖములఁ
బెన పటుకునఁ ద్రెంచివైచి బెబ్బులి పఱచెం
జనియె న్నక్కయు వేఱొక
వనమునకున్ దెలియ వింటివా తెలిగంటీ. 323

క. అనినఁ బ్రభావతి నివ్వెర
గున మ్రాన్పడి యుండి తెలిసికొని చిలుకా యీ
యనపాయోపాయస్థితి
నను నడిగిన నాకుఁ దెలియునా యెంతైనన్. 324

క. అని యంతఁ దెల్లవాఱుటఁ
గని యంతఃపురము సేరెఁ గాంతామణి యా
దినకరబింబము గ్రుంకిన
దనుకాకీరమణి యొప్పిదంబున నుండెన్. 325

క. అంతటఁ జీఁకటి గని య
క్కాంతామణి నృపతిఁ జేరఁగాఁ బోవుతమిం
జెంతకుఁ జేరినఁ గనుఁగొని
కంతునినెఱతేజి ముద్దుగాఱఁగఁ బల్కెన్. 326

తే. ఎంతవేగిర మమ్మ పూర్ణేందువదన
మాటుమడిగినఁ జనుమ యమ్మనుజవిభుని
ధామసీమకు నిపుడు నందాఁక నొక్క
యమలతరమైన కథ వినుమనుచుఁ బలికె. 327

పండ్రెండవకథ

క. ధరపై రాజపురంబునఁ
బరఁగెడు నొకరెడ్డి గలఁడు పరిహితనామ
స్ఫురితుఁడు కృషికార్యధురం
ధరుఁ డలరున్ హాళికావతంసుం డగుచున్. 328

క. ఆరెడ్డి కిద్దఱాండ్రు ప
యోరుహబాణుని శరంబులో యనఁగా శృం
గారిణియు సువేషయు నను
పేరుల మెలఁగుదురు సొంపు బెంపెసలారన్. 329

తే. చెలువుఁ డెప్పుడుఁ బగలెల్లఁ జేసి పనులు
కోరి మెలఁగుట రేలెల్లం గుంభకర్ణ
నిద్రఁ బాల్పడి రతికి సంధింపకునికి
వార లిద్దఱుఁ గడిదేఱి జార లైరి. 330

ఉ. చామనిమేనులు న్ననుపుఁ జల్లెడుమోములలోనఁ గల్గుబల్
గోములు మానపుం బొడవులుం బిడికింట నడంగుకౌనులుం

  1. క. గంగాతీరముచెంతను
    బొంగెడుసంపదలచేతఁ బూర్ణంబగుచున్
    శృంగారఖనియొ యిదియనఁ
    జెంగల్వపురంబు పేరఁ జెలఁగుచునుండున్.
  2. ధర్మదార=యుద్ధము మాన్పుటకై పట్టించుకాహళధ్వని