శుకసప్తతి/పదియవకథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తోడుగా

మది గణియించిరో చెలి సమర్పణమయ్యెనె వానినైపుణుల్. 196

క. అననం బ్రభావతి యిదిగా
దనవచ్చునె పురుషులే యుపాయపరుల్ వా
రిని గెలువఁ దరముగా దని
యినుఁ డుదయింపంగఁ బడుకయింటికి నరిగెన్. 197

క. అంతఁ గ్రమంబున నలినీ
కాంతుం డపరాబ్ధి మునుఁగఁగాఁ బుణ్యజనా
త్యంతార్తికరణపాపం
బంతయు వెడలె ననఁ దిమిర మడరెం దఱచై. 198

చ. అనుపమలీల నప్పు డసితావరణాంబరదీప్తిగుప్తయై
తనులత మబ్బులోని తెరతళ్కులమించు నదల్చుదూలిఁ దో
డ్కొని చనుదేరవచ్చునల కోమటికోడలికొమ్మఁ జూచి యి
ట్లను శుక ముత్పలాశముకుళాంచలచంచలచుంచుచంచువై. 199

చ. పనివడి రాజుఁ జేరఁ జలపట్టినదానవు చేరకుందువే
విను మఱి రాచవారు మదవిహ్వలు లించుక నేరకున్నఁ గో
పనియతిచేత మొక్కపఱపం దమకింపుదు రట్టులైన నా
థునియెడ బొంకఁగా వెరవు దోఁచినఁ బొమ్ము సరోజలోచనా. 200

పదియవకథ

తే. అమ్మ దీనికి నొకయితిహాస మలరు
వినుము ధనపాలుఁ డను రాజు పెనుప వెలయు
మేదురోద్భటభటసింహనాదచలిత
దిగ్గజవరంబు పద్మావతీపురంబు. 201

క. అందు సువేషుండను ధృతి
మందరనిభుఁ డొక్కఁ డమరు మరుక్రొవ్విరితూ
పుందెగడి సుమతియనుపే
రందినసతి యందగత్తెయై వర్తింపన్. 202

తే. ఆతఁ డిల్లాలిపై మోహ మతిశయిల్లఁ
బెల్లుగాఁ జెల్ల విడిచి వర్తిల్లు కతన
నరయఁ బాటించుకొని గణనాథుఁ డనెడి
బంటువానికి మానముఁ బ్రాణమిచ్చు. 203

తే. కూర్మిఁ జూపట్టుఁ జేపట్టుఁగుంచ మగుచు
వాడు వర్తింప నెఱనీటు పగలుపూన
నెంచి యించుక యైన నాసించ దొరుని
రతుల కాసించ దాచేడె ప్రాణవిభుని. 204

క. తలనొప్పి కడుపుకుట్టుం
బలుగురుపుం గాళ్లుతీపు పాటించుచు న
చ్చెలి మూల్గుఁ బాన్పుమీఁదం
జెలువుఁడు దత్తచ్చికిత్స చేయన్నగుచున్. 205

క. [1]మున్నె కొలువున్నవానికి
జన్నె విడిచి యన్నెలంత చక్కనివరు నే
మన్నా రావన్నా పో
వన్నా యనుఁగాని యోయి యన దెంతైనన్. 206

క. కనుచాటుతిండి నడిపిన
పనులం గండలును బెరిఁగి బకుతండ్రిహిడిం

బుని కొడుకన గణనాథుఁడు
ఘనబలమున బిరుదుజెట్టి కైవడి మెలఁగున్ . 207

సీ. చెప్పనిపని నీళ్లు చేఁదెదనని పోవు
సంతకుఁ బొమ్మన్నఁ జింతసేయుఁ
జేఁటఁ గైకొని యాళ్లు చెరిగెదనని పోవు
దండు వొమ్మన్న సంతాపమందు
వలదన్నఁ గందులు గొలిచిచూడఁగఁ బోవు
నగరికిఁ బొమ్మన్న దిగులుపడును
నొనరవేఁపగ నెండుసెనఁగ లెత్తఁగఁ బోవు
నూరికిఁ బొమ్మన్న నులుకుఁ జెందు
తే. నింటిలోపలి పనుల నెన్నైనఁ జేయుఁ
గడపదాఁటెడు పనియైనఁ గళవళించుఁ
బెట్టుపోఁతల సొగసాని సెట్టిసాని
యింటికడనుండి నఱ్ఱాడు బంటువాఁడు. 208

క. యిది యేమి సెట్టి యెఱుఁగఁడె
కద పెంచినచనువుబలిమి కడఁబనిముచ్చై
యెదురాడుచున్నవాఁ డని
మది నెంచుచుఁ బొడము కినుక మగుడ నడంచున్. 209

తే. అంత నయ్యూరిదొర ముత్తియములఁ జూచి
తెమ్మని సువేషు దవ్వులదీవి కేగు
మనుచుఁ గట్టడసేయఁగా నతఁడు వచ్చి
పయన మెఱిగింప సుమతి సంభ్రమము నొంది. 210

సీ. [2]మలయుచో మధురాతిమధురాధరలవాఁడి
చిన్నారిగోరు నీచెక్కుమీఁద
నానుచో రంగస్థలాబ్జగంధులగుబ్బ
మెఱుఁగుఁజందోయి నీయురముమీఁద
మించుచోఁ గాంచికాచంచలాక్షుల ముద్దు
మొనపంటినొక్కు నీమోవిమీఁదఁ
జేరుచో నెల్లూరు నారీమణుల కెంపు
పసమించు టడుగు నీనొసటిమీద
తే. [3]నింటనుండిన నీసౌఖ్య మేల కలుగు
ననుచుఁ గన్నుల నూరార్చి యక్కుఁ జేర్చి
మోవిచిగురంట నొక్కి తాంబూల మొసఁగి
పోయిరమ్మని పనిచె నప్పూవుఁబోఁడి. 211

తే. అంత బుడిబుడి యేడ్పుతో నడలుదాని
బుజ్జగించి సువేషుఁ డప్పుడె ప్రయాణ
భయసముత్కంపితగ్లాని బంటువాని
నింటికడ నిల్పి పైనమై యేగుటయును. 212

చ. ఇపుడుగదా తపంబు ఫలియించెనటంచు మహానురక్తిభా
వపరత రేఁబవళ్లు తలవాకిలి వేసినయట్టులుండ స
న్నపువిరిదమ్మితేకువసనస్మరుతూపులఁదుప్పు మించఁగా
సపరిమితప్రమోదరసులై రమియించిరి వారలిద్దఱున్. 213

క. ఇంటి మగఁ డయ్యె దానికి
బంటుతనం బుడిగి వాఁడు బానిస యయ్యెన్
నంటున బోఁటియు వానికి
నింటన్ మేలువడి సాఁగ నిచ్చం బరఁగున్. 214

క. ఈరీతి మెలఁగువారల
దారు ల్విని రాజుకొడుకు ధవళాఖ్యాకుం
డౌరా గగ్గోలుగన
న్నారిపయింబడుదు నని ఘనం బగుప్రేమన్. 215

క. ధనముల జాలెలు రతనపు
బనితగు నొకవరుససొమ్ముఁ బనిచిన గణనా
థున కీవచ్చుఁగదా యవి
యని కోమటికొమిరె వాని యప్పనఁగొనుచున్. 216

ఉ. అమ్మకచెల్ల నేను వెలయాలనొ త్రిమ్మరినై పురంబునం
దిమ్మరఁ జూచెనో తనకుఁ దేటమిటారపునిండుఁబ్రాయపుం
గొమ్మలు లేరొ నాముదుకగోకయుఁ గోమటియెడ్డెవీఁకయున్
సమ్మతమయ్యెనే యని యసత్యపుఁదక్కులుతక్కి వెండియున్. 217

క. రమ్మను మిచ్చటి కిది
కానిమ్మని యనకున్న నగరమేలెడిదొర దా
నెమ్మదిఁ గనలుచు దండుగఁ
దెమ్మనిన న్సెట్టి యేడఁ దెచ్చు న్వెఱతున్. 218

క. అని పనిచిన దూతికయుం
జని తెలుప న్రాజసుతుఁడు చరమాంబునిధిన్
మునుఁగ రవి నెఱయుచీఁకటి
గనుఁగొని కేలుట్టిపడఁగఁ గట్టాయితమై. 219

చ. తలవరు లింతనంత వెడదాఁటులతో గగనంబు చించులీ
లలవిలసిల్లి వెంటఁ బదిలంబుగ రాఁ జని యూడిగంబులన్
వెలుపల నిల్పి తానొకడ వేగ నగారము సొచ్చి యోరవా
కలియయియున్న తల్లలితకేళినిశాంతముఁ జేరి యచ్చటన్. 220

క. కనియెం బాన్పునఁ గినుకం
బెనఁగొని కొట్లాడుపికిలిపిట్టలచందం
బున సుమతియు గణనాథుఁడు
మనసిజరణకరణకేళిమగ్నత నుండన్. 221

క. కనుఁగొని యిది ననుఁ బిలువం
బనిచియు వేఱొకనిఁ గూడఁ బాడియెయని యె
ఱ్ఱనికనుఁగవతో ముడిచిన
కనుబొమ్మలతోడఁ జేరఁగాఁ జని వేగన్. 222

క. బెడిదపుటడిదముఁ గైకొని
గడితపుటొఱడుస్సి వాఁడిఖడ్గము చేతం
దడఁబడ మొదలంటంగా
జడఁగోసి యతండు వేగఁ జనియె లతాంగీ. 223

క. అమ్మఱునాఁడె సువేషుఁడు
క్రమ్మరి యయ్యూరియేటికడ నుండి ప్రమో
దమ్మునఁ దనరా కనుగుం
గొమ్మకుఁ దెలుపుమని బంటుకొడుకుం బనిచెన్. 224

ఆ. వాఁడు వచ్చి మగఁడు వచ్చినాఁ డనువార్త
దెలిపినపుడె భీతిఁ గలఁగె సుమతి
నెఱులపోకకింక వరునితో నేమని
బొంకవలయుఁ దెలుపు పువ్వుఁబోఁడి. 225

చ. అనినఁ బ్రభావతీరమణి యడ్డార యయ్యెడ బొంకు టెట్లు నే
కనినదిగాదు విన్నదియుఁగా దది తెల్పినఁ దెల్పు లేకయుం
డిన మఱియూరకుండెదవు నేనిటువంటి వెఱుంగఁజాలు చాల్
దినమును రాజుఁ జేరఁజనఁదీరక నీకథ వించునుందునే. 226

మ. అనినం గీరము కోపమేల వినవమ్మా కొమ్మ యమ్మాడ్కిఁదె
ల్పినబంటుంగని యూరుజాబ్జముఖి మే ల్వేయేండ్లు వర్ధిల్లు చ
క్కనినానాథుఁడు వచ్చెనంచు మునుగల్గన్వచ్చి యామేలువా
ర్తనిజంబొందఁగఁ దెల్పితంచు మది మేరల్మీఱుధైర్యంబునన్. 227

తే. కాకి కఱ్ఱనెఁ దోడనె గౌళి పలికెఁ
బొలిచె నట్టింటఁ గుమ్మరిపుర్వు మెలఁగి
యిన్నియును గల్ల గాకుండ నేగుదెంచె
హృదయనాయకుఁ డోయన్న యిదియె చాలు. 228

క. అని పతితో నేనటకుం
జనుదెంచినదాక మీరచటనే యుండం
బనిగలదనుమని పనిచినఁ
జనియె న్వాడంత నవ్విశాలేక్షణయున్. 229

క. ఇల్లలికి మ్రుగ్గువెట్టి మ
హోల్లాసము పల్లవింప నొక్కమెఱుగుం
బళ్లెమునఁ గోసివైచిన
యల్ల జటాఖండ మిడియు నలరులతోడన్. 230

ఉ. ఐదువరాండ్లతోఁగదలి యాత్మమనోవిభుఁ డాయఁబోయి య
ప్పైదలివేణితోఁ జెలఁగుపళ్లెర మారతిభంగిఁ ద్రిప్పి యా
మోదముఁజూపె నాతఁడది ముందఱఁ దెల్పుమటంచు వేఁడఁగా
నాదయితుం గనుంగొని దృగంచలమం దుదయించు సిగ్గునన్. 231

చ. చెడుకల గాంచి దానిఁ జని చెప్పితిఁ బెద్దలతోడ వారల
య్యెడ ననుఁ జూచి నీదుహృదయేశుఁడు వచ్చె నటంచు విన్న నె
క్కుడు నెనరొందఁ గీలుజడఁ గోసి నివాళి యొనర్పు మప్పుడే
కడమయు లేదటంచనిరి కావున నిత్తఱి నట్ల చేసితిన్. 232

క. నెఱు లనఁగ నెంత ఱేపే
పురిగొని తెగబారెఁడేసి పొడమెడు మీరే
మురువుగ జడ యల్లెదరీ
కరణి న్మీ రరుగుదేరఁగాంచుట చాలున్. 233

చ. అన నతఁ డింతభక్తిగలయంగన యింట వసించి నాకు శో
భనములు గోరఁగాఁగద యపాయము చెందక క్షేమలాభము
ల్గని యిలు చేరుటంచును దలంచి వధూమణియుక్తుఁడై నికే
తనమున కేగె వింటివి గదా సుమతీస్ఫుటచాతురీస్థితుల్. 234

చ. అనవుడుఁ జిల్కఁజూచి వణిగగ్రణిరాణి సుపాణిముత్తెపు
న్మినుకులు రాల నవ్వి యొక నీరజలోచన యట్లొనర్చినన్
వనితల కెల్ల వచ్చు నపవాదశతం బని పల్కునంతలో
నినుఁ డుదయింపఁగాఁ బడుకయింటికి నేగె నసిద్ధయత్నయై. 235

ఉ. అంతఁ గ్రమంబున న్రవి నిజాంతరశౌరిని మామగారిగే
హాంతముఁ జేర్చుదారి నపరాంబుధిఁ గ్రుంక నవారితోత్సుక
స్వాంత ప్రభావతీవికచవారిజలోచన చేరి నిల్చినం
గంతుపఠాణియుం గతలకారితనంబున మీఱి యిట్లనున్. 236

క. చనియెద వక్కఱతో న
య్యినుప్రక్కకుఁ ద్రోవ నొక్క యిక్కట్టైనం
గని మొక్కవోక గ్రక్కున
జనుదేఱ నుపాయ మెఱుఁగఁజాలుదె బాలా. 237

వ. ఏతదర్థసమాయాతం బగునొక్కపురాణవృత్తాంతంబు గలదంచు మాటలఁ బీఁటవెట్టి యాసెట్టిపట్టితోఁ జలపట్టి పచ్చచట్టుపలపిట్టదిట్ట యిట్టనియె. 238

పదునొకండవకథ

క. [4]నలినావాసం బనఁగాఁ
గల దొకపుర మబ్ధికన్యకామణికిం దా
వలమై మదసారంగో
జ్జ్వలఘీంకారవిదళితదిశాభాగంబై. 239

క. ఆనగర మేలు దుర్దమ
సేనుం డనునృపతి యతనిచెంతను శూరా
ఖ్యానుఁ డనునొక్కరౌతు మ
హానతరిపుభీతిహేతు వై వర్తిల్లున్. 240

సీ. గీఱునామము చిన్నికోరమీసలు చెంప
బనిమట్టుసిక బొందు పట్టునూలు
వెనుకకట్టురుమాలు వెడఁదగాయపుఁగాయ
దారిఁ గాన్పించు గందంబుఁబూఁత
కమ్మిపంచెయు గట్టికమ్మిదుప్పటి వల్లె
వాటు కెంగేలిలో వంకవంకి
పట్టుచేనపరంజిపరుజుతోఁ దగుకత్తి
పలుచని బచ్చెనపావుకోళ్లు

 1. తిన్ననిప్రాయమువానికి
 2. ఈపద్యమే 39వ పుటలో వాడినాఁడు
 3. నింట నేయుండఁ బెఱమచ్చెకంటినంటఁ
  గూడకల్లాడు నీ కనుకూలుఁ డయ్యె
  నృపతి పయనంబు చెవ్వుట నీవుగోరు
  పోడుములు గల్గు నిఁక నేమి పోయిరమ్ము.
 4. క. గంగాతీరముచెంతను
  బొంగెడుసంపదలచేతఁ బూర్ణంబగుచున్
  శృంగారఖనియొ యిదియనఁ
  జెంగల్వపురంబు పేరఁ జెలఁగుచునుండున్.