శుకసప్తతి/పండ్రెండవకథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

క. అంతటఁ జీఁకటి గని య
క్కాంతామణి నృపతిఁ జేరఁగాఁ బోవుతమిం
జెంతకుఁ జేరినఁ గనుఁగొని
కంతునినెఱతేజి ముద్దుగాఱఁగఁ బల్కెన్. 326

తే. ఎంతవేగిర మమ్మ పూర్ణేందువదన
మాటుమడిగినఁ జనుమ యమ్మనుజవిభుని
ధామసీమకు నిపుడు నందాఁక నొక్క
యమలతరమైన కథ వినుమనుచుఁ బలికె. 327

పండ్రెండవకథ

క. ధరపై రాజపురంబునఁ
బరఁగెడు నొకరెడ్డి గలఁడు పరిహితనామ
స్ఫురితుఁడు కృషికార్యధురం
ధరుఁ డలరున్ హాళికావతంసుం డగుచున్. 328

క. ఆరెడ్డి కిద్దఱాండ్రు ప
యోరుహబాణుని శరంబులో యనఁగా శృం
గారిణియు సువేషయు నను
పేరుల మెలఁగుదురు సొంపు బెంపెసలారన్. 329

తే. చెలువుఁ డెప్పుడుఁ బగలెల్లఁ జేసి పనులు
కోరి మెలఁగుట రేలెల్లం గుంభకర్ణ
నిద్రఁ బాల్పడి రతికి సంధింపకునికి
వార లిద్దఱుఁ గడిదేఱి జార లైరి. 330

ఉ. చామనిమేనులు న్ననుపుఁ జల్లెడుమోములలోనఁ గల్గుబల్
గోములు మానపుం బొడవులుం బిడికింట నడంగుకౌనులుం

గోమలబాహువు ల్మరులుకొల్పెడుచూపులు ముద్దుమాటలుం
గాముని కొక్కచేవ యెసఁగ న్విహరింతురు వార లిద్దఱున్. 321

సీ. గొంటుపూసలు రెండుగుండ్ల ముంగరలు మై
జారుచీరలు పెనసన్నగొలుసు
పెద్దమట్టెలు మట్టిపిల్లాండ్లు బొబ్బిలి
కాయ లొత్తులతోడి కడియములును
గప్పుపల్వరుస లుంగరములు తూలెడు
గొంగులు బలుచెంపకొప్పు లంచు
కమ్మగవ ల్సన్నకాటుకరేకలు
నాభినామంబులు నానుచుట్లు
తే. పసుపుఁబూఁతలు గుబ్బలబాగుదెల్పు
బిగువుఱవికెలు చిగురాకుఁ బెదవులంటు
వీడియపుఁగప్పు లెప్పుడు వెలయ రతుల
బేరమాడుచుఁ గాఁపుగుబ్బెతలజోడు. 332

క. పనుల కొడ ల్వంగక కా
మిను లిద్దఱుఁ గూడి గోళ్లుమీటుచు దాదుల్
దినదినము మిసిమియిడఁగాఁ
గనుపింతురు గున్నగచ్చగాయలకరణిన్. 333

చ. దిటమున రెడ్డి పాటుపడి తెచ్చి యిడంగను గూటిప్రొద్దు సం
కటితఱివెన్నమజ్జిగలు కంకటిపైఁ బవలింటి నిద్రలున్
బెటుకులుఁ జెల్లిరా సొగగు పెట్టుచు మన్మథకేళిమీఁద నె
క్కటివడి జారసంగమసుఖంబునకే తమకింతు రిద్దఱున్. 384

చ. పెనిమిటి చేని పాటుపడి పేర్చు శ్రమంబున నింటి కేగుదెం
చినతటి దాలితోఁకపయిఁ జేర్చిన కాఁగులనీరు మజ్జనం
బున కమరించి దేవతలపుట్ట మొసంగుచు బొడ్డుగిన్నెలో
మనుతురు రాగిసంకటి తలోదరు లద్భుతభక్తిఁ జూపుచున్. 335

ఉ. ఒక్కతె రెడ్డిప్రక్క వినయోక్తుల వింతలఁ గౌఁగిలింతలన్
జక్కిలిగింతల న్మెఱసి జంతతనంబునఁ బ్రొద్దుపుచ్చుచో
నొక్కతె జారుప్రక్క మెలుపొందిన టెక్కులఁజూపుచొక్కుల
న్మిక్కిలి చొక్కుచు న్మదనునిం జరితార్థునిఁ జేయు రాత్రులన్. 336

చ. చెలువునిముందట న్సవతి చిక్కునఁ బోరు ఘటించి లేని యీ
సులు ప్రకటించి మోసమునఁ జొచ్చెద రొండొరు మీఁది చాడి మా
టల మఱి మాటమాట జగడంబులు చూపి యతండు పోయినం
గలకల నవ్వుకొండ్రు తమ కౌశల మాతఁ డెఱుంగలేమికిన్. 337

క. ఈరీతినుండి యొకనాఁ
డారెడ్డన పసికిఁ దలుగు లమరించుటకై
నారలు గావలెనని పొరు
గూరికినై పోయి మఱ్ఱియూడలు దేరన్. 338

వ. తదనంతరంబ. 339

చ. చిటిపొటిమబ్బు లాకసపుసీమఁ గనంబడ గొప్పగొప్పలై
పటపట మ్రోయుచు న్నలినబాంధవబింబముఁ గప్పికొంచుఁ జీఁ
కటి ఘటియించి యధ్వగనికాయము బెండగిలం దటిల్లతా
కుటిలతఁ గొంచెపాటి చినుకు ల్దొరఁగించె ధరాతలంబునన్. 340

క. అనవధివనధివిహారం
బున నధికవ్యధల కార్శ్వమును బొందుతఱి

న్మనసిజుఁ డేయుశరంబుల
యనువున నవ్వేళఁ జినుకు లడరె న్నదులన్. 341

సీ. గొంగడిముసుఁగుతో గొల్లలు చట్రాతి
పైని బందారాకుఁ బఱచికొనఁగ
నాలమందలు మేఁత కరిగి యేతెంచి యం
భారవంబులతోడ మందగొనఁగఁ
బొదుగుదూటుల మాని యొదిఁగి క్రేపులగుంపు
జననీనికాయంబు చాఁటుఁ జేర
నొకటి నొక్కటి చూచి యుఱికి మేఁకలు చెట్టు
నీడలఁ గుమిగూడి నెమరువెట్టఁ
తే. దనరు నంబుదకాండవేదండయూథ
గర్జితోర్జితభూరిభూత్కారగళిత
వమధుశీకరవారదుర్వార మగుచుఁ
జలువతెమ్మెఱ లేతేర సన్నతూర. 342

తే. అప్పు డాకాపువలిగుబ్బలాండ్రు పథికు
లుసుఱుమన ముసురుకొన్న యమ్ముసురులోన
రాఁడు పతి యంచు నిర్భరరతులఁ దేల
మందిరమునకుఁ దెచ్చిరి మాఱుమగల. 343

తే. తెచ్చుకొని యిచ్చలోపల హెచ్చుకోర్కు
లెన్నిగల వన్నియును దీఱ నెనసి చతుర
రతుల కఱవునఁ బడినట్టు లతులసౌఖ్య
వారినిధి దేలుచుండిరి వారలంత. 344

క. పరహితుఁడు మిన్ను గనుఁగొని
దురుసౌ నిఁకమీఁద వానతూర ల్నిజసుం

దరు లెదురెదురే చూతురు
మరుబారికిఁ జిక్కి కాన మగుడన్వలయున్. 345

క. గ్రక్కునఁ జని యక్కఱతోఁ
జక్కెరవిలుకానికేళిఁ జతురుఁడనై నేఁ
డక్కాంతలనిద్దఱ నిరు
ప్రక్కలనునిచికొని మేలువడసెద ననుచున్. 346

క. తలపై నూడలమోపున్
మొలఁగత్తియు నింటిమీఁది మోహము మదిలోఁ
దలకొనఁ జలికిఁ జలింపక
బలుబూతమువోలి పెద్దపరువునవచ్చెన్. 347

తే. వచ్చి యాత్మీయమందిరద్వారసీమఁ
దెప్పునను మోపువైచిన చప్పుడు విని
నరకఁ డదె వచ్చెననుచు నొండొరులతోడ
గుసగుసలువోయి రాతని కూర్మిసతులు. 348

వ. ప్రభావతీ యనిర్గమసావకాశం బగునిజగృహంబునం దల్లడిల్లు నుపవల్లభుల నప్పల్లవాధర లెవ్వడువున వెడలింపవలయు నిది యెఱింగిన యంగనలకుం బరపురుషసంగమంబును బతిప్రమోషంబును సులభంబగునని పలికినం దెలుపనేరక వెలవెలంబాఱు నముద్దియనెమ్మొగంబుఁ గనుంగొని యయ్యనంగతురంగం బవ్విధంబును నేన తెలిపెదనని యిట్లనియె. 349

సీ. ఆరీతిఁ బతి వచ్చెనని వేగ శృంగారి
ణీవధూటి సువేషతో విచార
మేటికి నీవు కవాటంబుఁ దెఱిచి వా
డింటికి రాకుండ నేర్పుతోడఁ

గడప కడ్డముగాఁగఁబడి సివమాడుము
కొదవకార్యము చూచికొనఁగవచ్చు
సని యుపదేశింప నది యట్లసేయ వి
భ్రాంతుఁడై నిలిచినభర్తఁ జేరి
తే. మఱ్ఱియూడలనుండి యమ్మగువమీఁద
గాలిసోఁకెనొ యనుచు శృంగారిణియన
నంతలోన సువేషదంభాతిరోష
ఘోషయై వానిపైఁ బండ్లు గొఱికికొనుచు. 350

శా. ఓరీ నాపదమైనమఱ్ఱి మదరేఖోద్వృత్తి ఖండించి తీ
వేరా యిప్పుడె పోయి మ్రొక్కుఁబడిగా నీయూడలా చెట్టునన్
ధీరోదారతఁ గట్టి రార మదిలో దేవేరిపైఁ గోర్కె నిం
డారంగల్గిన న న్నెఱుంగవె పిశాచాధీశవిఖ్యాతునిన్. 351

క. అనవిని పరహితుఁ డాత్మన్
వనితామణి బ్రదికియుండినం జాలు వటా
వనిరుహము కడకు నిటపో
యిన నేమగుననుచు దాని కెరఁగి వినీతిన్. 352

క. ఇదె మఱ్ఱిమీఁద నిడి వ
చ్చెద నూడ ల్నేర కేను జేసినసేఁతల్
మది నుంచకు వటభూరుహ
విదితనివేశా పిశాచవిబుధాధీశా. 353

క. అని యతఁడు మఱ్ఱిపైఁ గ్ర
క్కున నిడఁజన మారుకేళి కొదవ ల్గీఱం
బనిచి రుపనాయకుల నం
గన లిఁక నిటువంటి నేర్పు గావలె నీకున్. 354

తే. అనినఁ జిలుకఁ జూచి యాప్రభావతిచెల్ల
నే నెఱుంగ నయ్య యిట్టి నేర్పు
లిద్దఱగుట వార లింత చేసిరి గాని
యొకతె కెట్లుగూడు నో శుకేంద్ర. 355

మ. అని యక్కోమటికొమ్మ దేవనిలయప్రాంచన్మహామర్దల
ధ్వనిచే వేగు టెఱింగి యత్తఱి నిశాంతం బొంది యాసంజసం
జనితానంగశరార్తి వేఁగుచుఁ దమిస్రస్ఫూర్తి వీక్షించి త
జ్ఞానపాలాయతనంబుఁ జేరఁజనుచో శౌకేశ్వరం బిట్లనున్. 356

పదుమూఁడవకథ

ఉ. అక్క పరాకు నీకుఁ బ్రమదాప్తి ఘటింపఁదలంచి పల్కు దే
నొక్కకథోత్తమంబు విను ముజ్జయినీపురి నొక్కజెట్టివాఁ
డుక్కునఁ దీరినట్లు కఠినోగ్రశరీరముతోడ మీఱు నే
దిక్కునమాఱులేక బలదేవుఁ డనం బలుపేరు దాల్చుచున్. 357

సీ. శీర్షవర్తులశిలాస్థిరమైన కేకినాఁ
జిన్నారిపొన్నారి సిగపొసంగఁ
దనుమేరుగిరిమీఁది తరుణాతపంబునాఁ
బలుచని మట్టిదుప్పటి యెసంగఁ
గమనీయముఖచంద్రుఁ గబళించుచిల్వనా
డంబైన బవరిగడ్డము చెలంగ
బాహుభుజంగమపతినాలుక యనంగఁ
జేత సాణాకత్తి చెలువుమీఱ
తే. మ్రోల వీణయు సాధన మురువునడలు
బిరుదు టందియ వెంబడి పిల్లజెట్లు