శుకసప్తతి/పదమూఁడవకథ

వికీసోర్స్ నుండి

తే. అనినఁ జిలుకఁ జూచి యాప్రభావతిచెల్ల
నే నెఱుంగ నయ్య యిట్టి నేర్పు
లిద్దఱగుట వార లింత చేసిరి గాని
యొకతె కెట్లుగూడు నో శుకేంద్ర. 355

మ. అని యక్కోమటికొమ్మ దేవనిలయప్రాంచన్మహామర్దల
ధ్వనిచే వేగు టెఱింగి యత్తఱి నిశాంతం బొంది యాసంజసం
జనితానంగశరార్తి వేఁగుచుఁ దమిస్రస్ఫూర్తి వీక్షించి త
జ్ఞానపాలాయతనంబుఁ జేరఁజనుచో శౌకేశ్వరం బిట్లనున్. 356

పదుమూఁడవకథ

ఉ. అక్క పరాకు నీకుఁ బ్రమదాప్తి ఘటింపఁదలంచి పల్కు దే
నొక్కకథోత్తమంబు విను ముజ్జయినీపురి నొక్కజెట్టివాఁ
డుక్కునఁ దీరినట్లు కఠినోగ్రశరీరముతోడ మీఱు నే
దిక్కునమాఱులేక బలదేవుఁ డనం బలుపేరు దాల్చుచున్. 357

సీ. శీర్షవర్తులశిలాస్థిరమైన కేకినాఁ
జిన్నారిపొన్నారి సిగపొసంగఁ
దనుమేరుగిరిమీఁది తరుణాతపంబునాఁ
బలుచని మట్టిదుప్పటి యెసంగఁ
గమనీయముఖచంద్రుఁ గబళించుచిల్వనా
డంబైన బవరిగడ్డము చెలంగ
బాహుభుజంగమపతినాలుక యనంగఁ
జేత సాణాకత్తి చెలువుమీఱ
తే. మ్రోల వీణయు సాధన మురువునడలు
బిరుదు టందియ వెంబడి పిల్లజెట్లు

నమర దొరకొల్వు చేసి గేహమున కేగు
మత్తరిపు శైలదంభోళి మల్లమౌళి. 358

క. ఘనశ్రీ బొందియు నాతఁడు
దినదినమును గొంతకొంత దిరుగుచురాఁగాఁ
దనవారు శత్రులై రట
గనుగొనఁగా వానిలక్ష్మి కడచనిపోవన్. 359

సీ. ధనవారములు చోరతతులపా లయ్యెను
సొమ్ములు కుదువను సొగిసి చనియె
గాదెలధాన్య మెల్కలకయ్యె గుత్తకై
యెనసిన గ్రామంబు లెల్లనెండె
నప్పులిచ్చినచోట నటమటించిరి డాఁచి
కొనినపత్రంబులు చినిఁగిపోయె
వాడకంబులు గొన్నవార లేగిరి తోఁట
లెల్లను బరులచేఁ గొల్లవోయెఁ
తే. గప్పడంబెల్ల గాలిచేఁ గదిలి యురియు
నింట దొర్లెడు కుండలు నినుపకట్ల
మానిముంతలు నిలిచె నమ్మల్లపతికి
వార్ధికన్యాకటాక్ష మవ్వలికిఁ జనిన. 360

వ. ఇవ్విధంబున నక్షుద్రదరిద్రత్వంబు వహించియు నతండు కుటుంబభరణాదరుండై. 361

ఉ. మాసిక వైచికుట్టినరుమాలును జాలనిదట్టిబట్టయు
న్మాసినయెడ్డెదుప్పటి దనర్పఁగఁ గోమటివారిఁ జేరి శం
కాసమవాప్తి నొల్లమనఁగాఁ దనుమర్దనమాచరించుచుం
గాసును గీసు దూసికొనుగాని విడం డతఁ డేమి చెప్పుదున్. 362

ఉ. కూలికి నూనె లంటి కలగూరలకై పొలమెల్లఁ జుట్టి పా
ల్మాలక యాత్మబంధుజనులన్ దరియం జని ప్రాఁతబట్టకై
కూళతనంబునం బ్రభులకుం దనుమర్దన మాచరించుచున్
వ్రాలుడుప్రొద్దుతోడ గృహవాటికిఁ జేరు నతండు నిత్యమున్. 363

క. ఈరీతి నుండు నాతని
గారాబు మిటారి తలిరుకైదువుల దునే
దారి కటారి సులక్షణ
పేరింటి వధూటి లేమి [1](బిమ్మిటి) గొనుచున్. 364

తే. కుడువఁ గూడును గట్టుకోఁ గోక లేక
యితని కిల్లాలినై యుండనేల యనుచు
సొగసు గనిపింప వల్లంబుఁ జూపి నిలుచు
జారులకు నయ్యొయారి యాస్పద మొసంగి. 365

ఆ. కలిగినప్పుడెల్లఁ జెలువుని చెంగట
నడఁగి మడఁగి యుండు టరిది గాదు
చేరి లేమి యప్పు దారీతి నుండెనా
యది పతివ్రతాజనాగ్రగణ్య. 366

క. ఈలీల జారరతివాం
ఛాలాంఛన మొంది పింఛసమకచ వికచ
ల్లోలస్వాంతత సద్గుణ
శీలుం బ్రేమ గల మగనిఁ జేకొన కలరున్. 367

సీ. చేయప్పు లడికి తెచ్చెదనంచుఁ జని కాంచుఁ
గోడెమిండని తప్పుకోలు మ్రొక్కుఁ
జెఱువులో నీళ్ళు తెచ్చెదనంచుఁ జని తెల్పు
నుపభర్త కాత్మవియోగవహ్నిఁ

జీర చాకింటఁ దెచ్చెదనంచుఁ జనిచేరుఁ
దరుణపల్లవుఁ డున్నతాపిచోటుఁ
జిక్కంటె యెరవు దెచ్చెదనంచుఁ జనియిచ్చు
గమనాతురున కింపు కౌఁగిలింపు
తే. నిట్లు జారోపభుక్తయై యేగుదెంచి
మగఁడు వినలేమి చెంగట మందిరంబు
వెడలి తిరుగాడవలసె నివ్వీట విధిని
దూఱవలదా యటంచుఁ గన్నీరునించు. 368

చ. పురమిది చూడనింత చెడిపోయె నయో మఱి యాఁడుతోడఁబు
ట్టరె ననువంటిసాధ్విని బడాపగలం గనుగొండ్రు జారు లె
వ్వరు గనుఁగొన్న లేమిఁ దలవంచి రయంబున వత్తునమ్మ యో
పొరుగుపొలంతియంచుఁ బువుఁబోఁడి యను న్విభుఁ డాలకింపఁగన్. 369

క. పడియుండఁ గంటి నని యీ
యెడల న్మామేనమామ యిచ్చెనటంచున్
బడఁతి యుపనాథుఁ డొసఁగిన
తొడవులు చీరలు ముదంబుతో ధరియించున్. 370

తే. నీవు మఱియింటిలోన గుండ్రించుచున్న
గడుపునిండునె దొరఁ జేరి గ్రాసమడుగు
పొమ్మనుచుఁ బల్కు నాథు నప్పొలఁతి జార
కాంతుఁ బొందుటకై సందు గలుగవలసి. 371

క. ఈగతి మెలంగునంగన
లా గాబలదేవుఁ డెఱిఁగి లలనా రావే

బాగాయెంగద చిన్నెలు
నీగరితతనంబుఁగంటి నే నివ్వేళన్. 372

ఉ. ఓసి గయాళికాన నను నుగ్రు నెఱుంగవె రోసమెత్తినం
దోస మెఱుంగ వీటఁ గలతొయ్యలులెల్లను గుంపుగూడి సం
త్రాసము చెంద నీగళము రాట్నమునం బిగియించి యొంతునో
కోసుకతిందునో యనినఁ గోమలి నిశ్చలధైర్యధుర్యయై. 373

ఉ. గొంటుఁదనంబునం గులుకుగుబ్బలపయ్యెద చక్కఁ జేర్చి యే
మంటివి నన్ను వంటి సుగుణాకర కాచెడుబుద్ధి లెస్సగాఁ
గంటివి గాక నాదునడక ల్కలగంటివొ కల్మివోవ వె
న్వెంటనెపోవునే మఱి వివేకము లోకములోనివారికిన్. 374

ఉ. లేవడిమీఁద బానిసలు లేనికతంబున నూరకుండినం
బోవమి నప్పుసప్పులకుఁ బోవుట వేఱుగఁ దోఁచె నేమొకో
కావలె నట్టులైన నవుఁగా దననేటికి నేఁటినుండి నా
థా వెలికేగఁ బ్రాణవిభుఁ డల్గినకార్యము సేయవచ్చునే. 375

తే. ప్రతిన వలికెద నేను నీపాదమాన
యకట మోసంబు లేదు కొండంతపనికి
నైన బతిమాలి నీవు పొమ్మన్న వెడలి
పోవ నూరక యుండు మీపోరుచాలు. 376

క. అన విని ముదితల హృదయము
గని యెఱుఁగమి నతఁడు నిజముగా నెంచెం ద
ద్వనితయును మదనవేదన
దినశేషము దీర్చె యుగముఁ దీర్చినరీతిన్. 377

చ. లకుచకుచాలలామ శుభలక్షణలక్షితకౌతుకప్రదా

యకమగు జారుగోరు దరహాసము మీసము మీఁది కేలు నా

త్మకుఁ దమినించు మ్రొక్కు పగతక్కులు చెక్కులు లేనిమోహమూ
రక కలహించి మించు పెనురాపులు చూపులు నేచ నెమ్మదిన్. 378

ఉ. ఎప్పుడు పోదుఁ బోయి హృదయేశ్వరుమాటలు వాని కెప్పుడేఁ
చెప్పుదుఁ జెప్పి వాని మదిఁ జిత్రపుమోహముచేత నెప్పుడే
గప్పుదుఁ గప్పి వానియెద గబ్బిచనుంగవచేత నెప్పుడే
గుప్పుదుఁ గుప్పి వాని రతికోరుట యెప్పు డటంచు నెంచుచున్. 379

వ. ఇవ్విధంబున నూహించుచు నాచంపకగంధియు నొక్కయుపాయంబు పెంపున.
380

ఉ. ముంగిటనిల్చి యో పొరుగుముద్దియ నాపతి నెత్తిమాసి నే
సంగడి కేగ లేనిపు డహర్ముఖమౌతఱిఁ దెచ్చి యిచ్చెదం
జెంగటిగోడఁ జేరి యొకచిట్టెడునూనె యొసంగలేవె య
భ్యంగ మొనర్తునం చడిగి యాకె యొసంగఁగఁ దెచ్చి వేడుకన్. 381

మ. తలమాసెం గద రంగదాప్తకులయూథానాథ నాధన్యతా
కలనాధర్మముచే నసంఖ్యముగఁ బ్రేంఖద్వైభవారోగ్యముల్
గలుగం గాంతునె యంచుఁ దేనియలు చిల్కంబల్కి యక్కల్కి వె
న్నెలలో నాయకు నుంచి నిల్చి తలయంటెం దాళమానంబులన్. 382

తే. ఇట్లు తలయంటి యటకలి యిడి సులక్ష
ణాసరోజాక్షి యిఁక నెట్లు నాథ జలము
తెరలియున్నది దొరలింపఁ దెచ్చికొనఁగ
బాగుగా దూరి యవ్వలిబావినీళ్లు. 383

క. ఏ నరుగరాదు గద నీ
పై నానలు పెట్టుకొనుటఁ బడుపాటులుగా

కేనాఁటివారికైనం
గానీ గేహమున బావి గలుగ న్వలదే. 384

క. అన విని బలదేవుం డో
వనితా యానలకు నేమివచ్చెంబో వే
కొనితేవే జలములు గ్ర
క్కున నీచలిచేత నిలువఁగూడ దటన్నన్. 385

క. ఓనాథ సతులగుణముల
నేనాఁటికిఁ బురుషు లెఱుఁగ రే నెచ్చటికిం
బోనేల నీకుఁ గోపము
రానేల యటంచు నదిపరాకై యున్నన్. 386

క. బలదేవుఁ డబల నాపై
జలమా నానేరమెల్ల సైరించి జల
ములు దెమ్ము వేగఁ బొమ్మని
పలుమఱు వేడుకొనఁ గపటభయ మెనయంగన్. 387

ఉ. మంచిది నీవు పంప ననుమాన మిదేటి కటంచుఁ బల్కి య
క్కాంచనగాత్రి రజ్జుఘటకమ్రకరాంబుజయుగ్మయై కటా
క్షాంచలచంచలాలత యొయారపుఁగొప్పు మెఱుంగునుబ్బుల
న్మించఁగ నేగె ముద్దునడ నీటునఁ గూపసమీపభూమికిన్. 388

మ. చని యాచేరువఁ జారుభూరుహలతాసంతానతంతన్యమా
ననవీనాఖిలసూనసౌరభనిశాంతంబైన పూఁదోఁటలోఁ
దనమేకోలున వచ్చియున్న యుపనాథప్రౌఢు నాఢౌకమా
ననిరూఢద్రఢిమానురాగ మిగురొందంగూడి క్రీడింపఁగన్. 389

తే. అలరె వేగుఁజుక్క యది చూచి భయమందఁ
దనరెఁ బక్షిరుతము దాని వినుచు

దిగులుపడఁగఁ దూర్పు తెలతెల గావచ్చె
వారి కిట్లు తెల్లవాఱె నంత. 390

క. విను మో ప్రభావతీ సతి
తన నేరం బెట్లు తప్పదాట న్వలయున్
మనమున దీని కుపాయము
గననేరని నారి జార గారాదుసుమీ. 391

క. అని పలుకు చిలుకపలుకుం
గనుఁగొని వైశ్యాంగనాశిఖామణి యిచ్చో
నను నడుగు టుడుగు బెడఁగుగ
ననఘగుణా నీవె నొడువు మవ్వలికథయున్. 392

ఉ. నావిని కీర మిట్లను ఘనాఘనవేణి సనాతనప్రవీ
ణావలిఁ గేరు నీకుఁ దెలియంబడకున్నదె యైన మద్వచః
శ్రీ వెలయింపఁ గోరి తిఁకఁ జెప్పెద నప్పగిదిం బ్రభాతవే
ళావిభవంబు మీఱుఁడుఁ గలంగుచు జారుఁడు లేచిపోయినన్. 393

ఉ. అచ్చపలాడి యింటిమగఁ డంపఁగ నిప్పుడె బావినీటికై
వచ్చితి వచ్చి జారరతివాంఛల నుండితి నింతలోనఁ దా
నెచ్చటనుండి వచ్చె రవి యీతని కెక్కడఁ బ్రొద్దువోదు నా
యిచ్చ గలంగసాగెనిఁక నేమని యేను గృహంబుఁ జేరుదున్. 394

వ. అని వితర్కించి ధైర్యం బవలంబించి యొక్కకార్యంబుఁ గాంచి యీయుపాయంబున కీయుపాయంబ యుచితం బని తలంచి నిశ్చయించి కుంభంబు జలపూర్ణంబు గావించి సరజ్జుకంబుగా దిగవిడిచి తానును మెట్లవెంబడిఁ గూపంబులోనికిం డిగ్గి కటీదఘ్నంబు లగుజలంబులం గలపడుకు లూఁది ప్రభాతసమయోచితంబుగా వికసించు కమ్మనితమ్మియుం బోలె నెమ్మొగం బెగయించి మీఁదఁ జూచుచు దృశ్యంబగు భయపారవశ్యంబున నున్న యవసరంబున. 395

ఉ. ఒక్కకృషీవలాచలపయోధర నాయకుప్రక్క నిద్రకుం
జిక్కి విహంగమధ్వనులచే వెడ మేల్కని తాఱుమాఱుగాఁ
గ్రక్కునఁ గట్టుకొన్న చిటికమ్ముల చీర తగంగఁ దత్కటీ
భాక్కుచకుంభ కుంభమునబాగొనరం జనుదెంచె నూతికిన్. 396

తే. వచ్చి జలములు చేఁద నవ్వామనయన
యాసనాబ్దంబు వాంచి నిజాధినాథు
తోడిపొలయల్కఁ దోయంబుఁ దొలఁగివచ్చు
వరుణసతివోలు నమ్మల్లతరుణిఁ గనియె. 397

క. కని మొఱపెట్టినఁ జెంగటి
జనులొక్కట మూఁగ వారి సందడిపలుకు
ల్విని యాడువారు సేరం
జను దెంచెం జెట్టి దట్టిచల్లడములతోన్. 398

తే. వచ్చి నిజభార్య చేసిన వగలు గాంచి
దిగులుపడి మున్నుగా నరుదెంచి యున్న
దాని యుపభర్తతోడుగాఁ బూని వెడలఁ
దిగిచి తోడ్కొనిపోయె నమ్మగువ నతఁడు. 399

క. ఏవంవిధ చాతుర్యము
నీ వెఱిఁగితివని మేదినీవరుఁ జేరం
బోవచ్చుఁ బోయి క్రమ్మర
రావచ్చుఁ బ్రభావతీ పరాకా యనినన్. 400

క. నా కేమి తెలియు నని య
క్కాకోదరవేణి కమలగంధాంధమరు

త్పాకము రాకనిశీథిని
పోకఁడ గని యంత నంతిపురమున కరిగెన్. 401

క. చని దిన మను వననిధినీఁ
దినయదియై రాత్రి పేరి దీవిం గని య
వ్వనజాక్షి యూఱడిలి నృపు
నెనయం జనుదేఱఁ జిలుక యిట్లని పలికెన్. 402

శా. కాంతా సంతసమయ్యె నామది వధూకందర్పుఁడౌ నద్ధరా
కాంతుం జేరఁగ నుత్సహించియును మద్గాథాసుధాలోలుప
స్వాంతత్వంబునఁ జేరవచ్చెదు భవత్సౌలభ్యసాద్గుణ్య మే
నెంతంచు న్గొనియాడ నేర్తు మఱి నీవే నీకు జో డిమ్మహిన్. 403

క. [2]క్రమ్మఱ నొకకథఁ దెలిపెద
ధమ్మిల్లోత్ఫుల్లకుసుమధామంబులపై
దుమ్మెదలు చిమ్మిరేఁగం
గొమ్మా తలయూఁచి మెచ్చికొమ్మా పిదపన్. 404

పదునాలుగవకథ

చ. అని తెలుపందొడంగె విను మంబుధి మోహపురాణివాసమై
తనరెడు కృష్ణతీరమునఁ దామ్రపురం బనుకాఁపుటూరు భూ
వనరుహగంధి నెమ్మొగము వైఖరిమీఱు విశేషకాంతి వ
ర్తనము వహించి మించు విదితంబుగఁ జూపఱ కిం పొనర్చుచున్. 405

చ. కొలుచు సమగ్రభంగి నొనగూడ దివాణపువారిచేతికాఁ
కలుహుసివోవఁగాఁ గఱవుకాల మెఱుంగక పూసబొట్టులం

  1. ఁబిమ్మట (పూ)
  2. ఇది హంసవింశతిలోగూడ గలదు.