శుకసప్తతి/నాలుగవకథ
క. ఓనీలవేణి మదిలో
మానవుఁ డొక్కటి తలంప మఱిదైవము తాఁ
బూనుఁ బెఱకార్య మొక్కటి
కానఁ దదీయాజ్ఞవలయుఁ గార్యార్థులకున్. 435
వ. అత్తెఱంగునం బ్రవరిల్లనియట్లయినం దొల్లిటిసమయంబున గుణవల్లభుండను మహీసురవల్లభుండు భల్లూకనఖభల్లహతుండైన యట్ల యగు నది యెట్లనిన వివరింతు నాకర్ణింపు మని యిట్లనియె. 436
నాలుగవ కథ
సీ. అప్రతిమప్రభుం డగణితైశ్వర్యధు
ర్యత్వసాక్షాన్మహారాజరాజు
రూపరేఖామన్మథోపమానాంగుండు
ధరణీధరోద్దండధైర్యశాలి
యార్తరక్షణుఁడు సత్కీర్తికల్లోలినీ
డిండీరితశుధాంసుమండలుండు
నత్యుద్ధతప్రభావాంకుండు సకలస
జ్జనవర్ణనీయశోభనచరిత్రుఁ
తే. డలరు నొకరాజు కర్ణాటకాంగవంగ
నృపమకుటఘర్షితాంఘ్రినీరేరుహాగ్ర
నఖరశిఖరుండు భువిఁ గీర్తిముఖుఁ డనంగఁ
దనరి యంశుమతీపురాధ్యక్షుఁ డగుచు. 437
తే. అతఁడు కమలాక్షియను ప్రియురాలివలనఁ
గన్న లీలావతీనామకన్య నెలమిఁ
బ్రోదిసేయంగ నలయించుఁబోణి వెలయు
మలయుపరువంపు జవ్వనం బలము కతన. 439
క. చిత్తరువు ప్రతిమయో తెలి
ముత్తియమో కమ్మపైఁడి బొమ్మయొ యన న
మ్మత్తచకోరాక్షి శుభా
యత్తమతిన్మోహనాంగియై యుండునెడన్. 439
చ. చెలి నునుగబ్బిగుబ్బలకు సిబ్బెపు తళ్కొకవన్నె వాలుగ
న్నులకు మిటారిచూ పొకవినోదము గెందలిరాకు మోవికిం
గలికితనంపున వ్వొకచొకాటము మేని మెఱుంగు తీఁగకుం
దలఁపు వహింపఁజేయు నెఱతావి యొకానొకవింతయై తగున్. 440
వ. ఆసమయంబున. 441
తే. అన్నగరమందు నెపుడు పురాశ్రితుండు
పల్లవాగ్రేసరుఁడు గుణవల్లభుఁడను
పేరు గలవాఁడు గలవాఁడు ధీరజనవి
రోహితుం డగు నొక్కపురోహితుండు. 442
వ. వెండియు నతండు. 443
ఉ. శాంతు లొనర్చి గండకలుషంబుల నెల్ల నడంచు శత్రుకా
లాంతకరూపమైన జపమాచరణం బొనరించీ యమ్మహీ
కాంతునకు న్శుభంబు లెసఁగన్ జయమున్ సమకూర్చుసారసి
ద్ధాంతి యితం డటంచు విబుధప్రకరంబు మదిన్ గణింపఁగన్. 444
క. అలకాలజ్ఞకులాగ్రణి
యెలమిం దద్రాజకన్య నేలాగుననో
కలఁగన్నయట్టు లొకనాఁ
డలవోకం జూచి మన్మథాజ్ఞావశుఁ డై. 445
క. అందనిమ్రానిఫలం బిది
యందుకొనుట యెట్టులొక్కొ యనుచు మనమునన్
దుందుడుకుచే ధరామర
కందర్పుం డతఁడు మేలు గలవాఁ డగుటన్. 446
తే. అంత నత్యంతకాముకుం డగునతండు
ఛాందసుఁడు గానఁ దనమనస్తాప మెల్లఁ
దెల్లమి యొనర్పఁ దగదంచుఁ దెలియనేర
కల్ల నగరింట నొకదాది ననుసరించె. 447
ఉ. ఈనరనాథకన్యపిఱుఁ దించుక ముట్టఁగనిచ్చి మేనునా
మేనున నంటఁ జేర్చి రుచిమించినమోవి యొసంగెనేని భూ
దానహిరణ్యదానఫలదానము లిచ్చినయట్ల విప్రుం డెం
తైనను దానయోగ్యుఁడుగదాయని నన్బ్రతికించునావుడున్. 448
తే. అది దిగుల్పడి యెట్లు నోరాడె నౌర
పలుక నీరీతి నోవెఱ్ఱిబాఁపనయ్య
ముక్కఱయుఁ గమ్ములును దాల్చి మురియుచున్నఁ
జూడఁజాలక యిట్లాడినాఁడవేమొ. 449
క. అన విని తత్పదయుగళం
బునఁబడి నీధర్మసత్రపుం బ్రాహ్మణునిన్
నను మన్నించిన నిఁక నే
నొనరించిన ధర్మ మెల్ల నొసఁగెద నీకున్. 450
తే. అనుచుఁ గడతేఱి పోవుచో నజ్జడాత్ముఁ
డన్యభామారతోత్సాహు డగుటఁ జేసి
లీలలీలావతీకన్యకాలలామ
నెత్తెఱంగునఁ జేకొందు నెట్లుమందు. 451
క. ఇవ్విధమునఁ దలఁచుచు నత
డువ్విళ్లూరంగ శుభముహూర్తపుఁదరి నా
పువ్వుంబోఁడికి బాల్యము
జవ్వాడి తొలంగునంత సమరతపొడమెన్. 452
మ. అపు డాకీర్తిముఖుండుఁ దత్సతియు నత్యానందసంధానతన్
నృపకాంతాజనము ల్మహీసురపురంధ్రరత్నము ల్గొల్వఁగా
రపణం బుప్పతిలం దదంతవిభవారంభంబుఁ గావించి య
చ్చపలాక్షామణికి న్వివాహ మొనరించంగార్యమూహించుచున్. 453
తే. రాజమౌళియుఁ దత్సతీరత్న మపుడు
తగుకులస్థుఁడు రూపకందర్పుఁ డైన
వరుఁ డెవఁడొకో యటంచు భావమున నెంచు
నంతఁ గపటాత్ముఁడైన సిద్ధాంతి యనియె. 454
క. ఈబిడ సుముహూర్తకళా
ప్రాబల్యమునం జనించు భాగ్యంబున సు
శ్రీబలముఁ జెంది నీగృహ
మాబలజిద్భోగసమధి కాస్పద మయ్యెన్. 455
వ. తదనంతరంబ.456
తే. బాలదుష్టవేళఁ బ్రథమరజస్వల
యయ్యెఁ గాన దీని యవగుణమున
రాజ్యలక్ష్మిఁ బాసి ఱంపిల్లు నీయిల్లు
కలిమి పెంపుఁ బాసి పొలియు ననఘ. 457
క. అనవిని గుండియ యదర
న్మనుజేశ్వరుఁ డాప్తులైన మంత్రులతో ని
ట్లను నే నేర్పునఁ దీర్చెద
రనవుడు నద్దుష్టమంత్రు లవివేకమునన్. 458
తే. సీత పుట్టి లంక చెఱచినచందానఁ
బుట్టఁదగనిముద్దుపట్టి యైన
బాలికాగ్రగణ్యలీలావతీకన్య
యిల్లు చెఱపఁ బొడమె నేమొ యనుచు. 459
చ. మును వెనుకేనియుం గనక మోసమునం గడుకార్యభంగమౌ
ననక సుకీర్తిహాని పద మంచుఁ దలంపక కన్ కామణి
న్వనధిపరీతయై పొదలు వాహినిలో నొకమందసంబునం
దునిచి రయంబున న్వెడల నొత్తుట నీతి యటంచుఁ దెల్పినన్. 460
క. కీర్తిముఖనృపవరుం డప
కీర్తి జనించునని మిగుల ఖిన్నతనపు డ
వ్వార్త వినలేక బహుళత
రార్తి న్నిజకామినీసహాయత వనటన్. 461
క. కడుపు చుమ్మలు చుట్టఁగాఁ గన్నకన్నె
చిలుక నెడఁబాసి యేరీతి నిలుచువాఁడ
నెక్కడివివేకమున మంత్రు లెల్లఁ గదిసి
కువలయేంద్రునితో గువ్వకోలుగొనుచు. 462
మ. మునుగుంతీసతి కూర్మినందను మహాంభోవాహినిం జేర్పదో
మనువంశాంబుధిచంద్రుఁ డాదశరథక్ష్మాభర్త శ్రీరామునికిన్
వనవాటి న్విహరింపఁ బంపఁడొ కృపాస్వాంతైకవాత్సల్యవ
ర్తనముల్ చూడఁగ రాజనీతియె నరేంద్రాయంచు బోధించుచున్. 463
తే. [1]మానుమీ మోహమని తెల్పి మానవేంద్రు
చిత్త మొగ్గించి యొకమాటఁ జేసి రాచ
కొమిరె నిదురించుతఱి మందసమున నుంచి
వీడువెడలించుకొని తెచ్చువేళ నెదుట. 464
సీ. కలశోద్భవానీతకలితపుణ్యసమేత
యఖిలజగత్పూత యైనమాత
జడధినాయకు నేలుబడి గన్నయిల్లాలు
నిఖిలపుణ్యపుఁజాలు నిలుచుప్రోలు
ఆభ్రఘట్టనఖేలనాభీలకల్లోల
యఘతూలికాజాల మడఁచు కీల
ఫణిలోకవిజ్ఞానపాటవాంతర్మీన
వినుతసత్యవితానమునకు సోన
తే. యధిపతి సమాగమార్థప్రయాణసమయ
సమధికోత్తుంగభంగసంచారజనిత
ఘనగరుధ్వానపటపటాత్కారసార
భూరిసితపక్షభేరి కావేరి వెలయు. 465
ఉ. ఆవరవాహినిం గని దురన్వయు లచ్చటి మంత్రు లెల్ల
లావతియున్న పెట్టియ నలంఘ్యతరం బగు తజ్జలంబునం
బోవిడిపించి భూవిభునిపొంతనె యెప్పటియట్ల యుండి రా
హా వివరం బెఱుంగని దురాత్ములకృత్యము లట్టివేకదా. 466
వ. కావున. 467
క. నృపతి యగువాఁడు విద్యా
నిపుణున్ బహుకార్యభారనిర్వాహకు శాం
తపరజనమర్మభేదన
కపటమతి న్మంత్రిఁ జేయఁగానగు నబలా. 468
వ. అది యెంతైనం గల దత్తెఱంగునకు నిమిత్తం బేమి యట్లుండనిమ్ము తదనంతరవృత్తాంతంబు వినిపింతు నని యి ట్లనియె. 469
క. జనకుఁ డగువార్ధి రాజుం
గనుప్రేమం దల్లియైన కావేరికడం
జనుకమలపాణి యనన
వ్వనజాయతనేత్ర యేఁటివడి నేగుటయున్. 470
చ. తను మునుజూచి మోహపరితాపము గన్న పురోహితుండు గ్ర
క్కున నిది వేళ యీకుసుమకోమలితో రతికేళివైభవం
బనువుగఁ గోర్కి దీర్చుకొన నంచు మనంబున నెంచి తత్తటీ
వనతలకుంజమంజులనివాసము న న్వెస నొంటి నుండఁగన్. 471
వ. ఆసమయంబున. 472
తే. ఒదిఁగి యలమందసములోన నున్న రాజ
కన్యకామణి మేల్కాంచి కలవరించి
బహువిధంబుల విలపించెఁ బంజరమునఁ
జిక్కువడియున్న క్రొత్తరాచిలుకవోలె. 473
సీ. జనకు నెమ్మనము వజ్రప్రాయ మాయెఁగా
మాయగావించి యీమాడ్కిఁ బనుపఁ
దల్లికి వీను లెంతయుఁ జల్లనాయెఁగా
నాయగాధప్రయాణంబు విన్న
దాదియపఖ్యాతిఁ దలఁపలేదాయెఁగా
దాయగాఁబోలు నింతయు సహింప
నాళీజనశ్రేణి కాత్మ కింపాయెఁగాఁ
బాయఁగారాని యీబారినొంద
తే. నకట! నాయీడు రాచకన్నెకల కెల్లఁ
గడఁగి నన్నాడుకొన నోరు గల్గె నేమ
నందు నిఁక నెందుఁజొత్తు నాహావిధాత
వ్రాఁత యవిలంఘ్యమనియెంచు వడిఁ దపించు. 474
శా. అన్నీలవేణి యివ్వగ
నున్నంత సమీపభూమి నొక రాజు శుభా
భ్యున్నతుఁడు రశికశేఖరుఁ
డెన్నఁగ హిమథామనాముఁ డేపు దలిర్పన్. 475
తే. అతులితోత్సాహమున వేఁటలాడియాడి
కడఁగి యచ్చోటనే వీడువిడిసెఁ గానఁ
గర్ణయుగమునఁ దత్కన్యకాప్రలాప
కలకలధ్వను లాలించి జలదరించి. 476
మ. ఇదియేమో మనపాళెమెల్ల వగ న ట్టి ట్టై వెతం జెంద ని
న్నదిలోన న్విననయ్యె నాఁడు మొఱ కాంతారత్న మిం దెవ్వతో
మది నూహింపఁగరాని దుర్దశ వహింపంబోలు నేఁ డీవిప
త్పద మేమో వివరించుఁ డంచుఁ గరుణాపారీణచేతస్కుడై. 477
ఉ. భూరిజలప్రచారులగు బోయలఁ బంపిన వారలాపయః
పూరమున నెలంగు కలముం బలె నుండెడు మందసంబు న
త్తీరము సేర్చి యందు సుదతీమణి యుండు టెఱింగి యద్ధరి
త్రీరమణుం గనుంగొని విధేయతఁ దత్క్రమ మెల్లఁ దెల్పినన్. 478
క. విని యప్పు డానృపాలుఁడు
కనుకనినమ్మందసమునఁ గలకలవాణిన్
మన మలరఁ దోడి తెండని
తనదాదులఁ బంపె నోసుధాకరవదనా. 479
ఉ. అంత నతిత్వరైకమతి నజ్జరఠాంగన లేగి యమ్మహీ
కాంతుననుజ్ఞఁ బెట్టెఁ బిగఁగట్టుల నెల్ల సడల్ప రోహిణీ
కాంతుని రేఖఁ గ్రొమ్మెయిలు గప్పుటఁ బాసి రహించినట్లు త
త్కాంతతనూవిలాసరతికాంత తళుక్కనఁ జెంతనిల్చినన్. 480
క. కని యత్యంతకుతూహల
మున నజ్జరఠాంగనాసమూహము వెసన
వ్వనితారత్నము కులగో
త్రనిరూపణము న్వచింపఁ బ్రార్థించుటయున్. 481
చ. కరతలసక్తగండఫలకస్థలయై చిగురాకువంటి వా
తెఱవసివాఁడ ముద్దువగఁ దిన్నని మో మరవాంచి దీనతన్
సురసురస్రుక్కి యుస్సురనుచుం దనవర్తన మెల్లఁ దెల్పినన్
సరసతఁ గొందఱందు నృపు చక్కటి కుధ్ధతి నేగి వేడుకన్. 482
క. ఓరాజకులశిఖామణి
యారాజీవాక్షి చెల్వ మతిచిత్రము శృం
గారవతి యువతినృపక
న్యారత్నము దానిఁబోల నతివలుగలరే. 483
చ. చిఱుదొడలంద మాచికిలిచెక్కుల చొక్కట మామెఱుంగువా
తెజసొబ గావినీలమణిదీధితుల న్నునుఁగొప్పుచంద మా
గురుతరజాతకుంభమయకుంభకుచంబులగుల్కుబింక మా
తెఱువకె యొప్పు నత్తెఱవ దేవరకే తగనొప్పు భూవరా. 484
క. అనీ తెలిపి రాజు చిత్తము
కని క్రమ్మఱి రాజకన్యకం దెచ్చుటకై
వినయోక్తుల నంతయెల
ర్చినఁ జింతాజలధిమగ్నచిత్తాంబుజయై. 485
సీ. ముకురద్యుతికపోల మకరికాలతలతో
గమ్మకస్తురి చిత్రకమ్ము చెదర
వక్త్రగంధానుధావన్మిళిందములతో
గప్పుపెన్నెఱికొప్పు కంప మొందఁ
గర్ణికాకుసుమరింఖనర్మదంబుతో
నిడువాలుఁగనుదోయి నీరు చిలుక
గళదనర్గళఘర్మకణపరంపరలతో
నఱుతముత్తెపుసరు ట్దొరసి యాడఁ
తే. బీనవక్షోరుహమును లేఁగౌను ఘనని
తంబ మలరఁ బదంబు లందంద వడఁక
నడఁకువదలిర్ప నన్నరేంద్రాగ్రగణ్యు
కెలని కేతెంచె నలరాచకలువకంటి. 486
క. వచ్చుటయు రాజు చూచి వి
యచ్చరవరకన్య యేమొ యని మెచ్చుతఱిన్
మచ్చరమున నమ్మదనుఁడు
పచ్చని విలుఁబూని పంటఁబగవట్టెఁ జెలీ. 497
తే. ప్రేమ నవ్వేళ నేకాంతసీమ కరిగి
సరసుఁ డైనట్టి యమ్మహీశ్వరవరుండు
లీలదళుకొత్త లీలావతీలతాంగి
నించువిలుకానిరాజ్య మేలించి మఱియు. 488
క. ఆరామయండఁ బాయక
యారాజనరుండు నిజపురాంతఃపురముం
జేరి సుఖంబున నుండె ను
దారతరోత్సాహుఁడై సుధాకరవదనా. 489
మ. అని రాచిల్కలఱేఁడు పల్కునెడ నుద్యద్ఘోరగాఢాంధకా
రనివృత్తిన్ జగ మొప్ప నూరుజవధూరత్నంబు వీక్షించి యొ
య్యనఁ గేళగృహసీమ కేగి రవియస్తాద్రిప్రవేశంబునం
దినవేళం దమి రేఁగి భూవిభుని నర్థింజేరఁ జారు క్రియన్. 490
క. శృంగారరస మెసంగన్
బంగారపుబొమ్మవంటి బాలిక యపు డ
య్యంగజరాజతురంగము
చెంగటి కేతెంచి వాగ్విచిత్రప్రౌఢిన్. 491
క. శుకసార్వభౌమ నేఁ డీ
సకలజ్ఞుండైనగాజు చక్కటికరుగన్
సుకరమయి యున్న దీదిన
మిఁక వేగమ తెల్పు మవలి యితిహాసంబున్. 492
మ. అనుచుం జిల్కలకొల్కివల్క విని యత్యానంద మింపొంద ని
ట్లనియెం గీరకులప్రభుండు హిమధామాఖ్యుండు తా నూరికిం
జనుచో నెచ్చెలియున్న మందసములోనం గ్రూర
సక్రోధచం
డ నిరాతంకము నొక్క భల్లుకము నుండం జేసి గర్వోన్నతిన్. 493
తే. అమ్మహావాహినీజవాభ్యంతరమున
విడిచి చనెఁ గాన నది నీటివెంట నరుగఁ
దొలుత నమ్మందగమన పై వలపుఁ జెంది
పొంచికొనియున్న యవ్విప్రపుంగవుండు. 494
క. కనుఁగొంటి నదె నిధానము
గనుఁగొన నొక మాళ్లబిందె గలిగెఁ గదా యే
మనవచ్చు దైవయత్నం
బని తలఁచుచు మోహవశత నవ్యగ్రమతిన్. 495
మ. తనశిష్యు ల్వెనువెంటరా నడిచి యుద్దండస్థితిం దన్నదీ
వనమధ్యస్థలినున్న మందసము ఠేవం దెచ్చి తత్తీరమం
దునవీనద్రులతానికుంజమున మెచ్చు ల్గుల్కుచో నుంచి య
త్యనురాగంబునఁ గామినీగమనమోహానూనచేతస్కుఁడై. 496
సీ. వలుదలై మెఱయు పార్వణపుముద్దలవంటి
వలిచన్ను లెన్నఁడు వ్రచ్చికొందుఁ
బుణ్యాహపల్లవంబులఁబోలు కెమ్మోవి
గడువేడ్క నెన్నఁడు గఱచికొందుఁ
గొనలు గల్గిన దర్భకోటి నేలెడునెఱు
ల్గట్టిగా నెన్నఁడు పట్టుకొందుఁ
బంచామృతముఁ గ్రిందుపఱచు వాక్సుధ చెవు
ల్తనివంద నెన్నఁడు ద్రావికొందు
తే. ననుచు నేఁగోరికొని యుందు నట్టితలఁపు
లన్నియు ఫలించెఁగా నేఁటికని తలంప
వీని జన్మంబు కిష్కింధలోన నేమొ
కావలయునంచు శిష్యవర్గము గణింప. 497
క. వేదము చదివినఫలమున్
వాదించినఫలము సంధ్య వార్చినఫలముం
బైదలి నీకు నొసంగెదఁ
గాదనినం బ్రహహత్యఁ గట్టుదుఁ జుమ్మీ. 498
తే. అని యనన్వయరీతి నెన్నైన వదరి
పదరి యొక్కింతయును నీతి మది గణింప
కతనుఁ డనుమృత్యు వెసకొల్ప నల్లమంద
సమునఁ గల చీలలన్నియు సడలఁజేసి. 499
[2]సీ. అవునషే నను వివాహముగమ్ము విద్వాంసు
రాల వయ్యెదవు శీతాంశువదన
వివరింతు నొక పిన్న విన్నపం బాలింపు
మభిమతార్థంబు నీకగు మృగాక్షి
యలయింపనేటికే యకట నీశిష్యప్ర
శిష్యుండ నగునన్నుఁ జిగురుఁబోఁడి
పంచాస్త్రుఁ డిదె నేఁడు బాధించుచున్నాఁడు
బ్రదికింపవే నన్నుఁ బంకజాక్షి
తే. బ్రాహ్మణోత్తము నిపు డింత భంగపఱచు
టెంతయు నధర్మ మని చెంత కేగునంత
నుల్ల మగలంగ నయ్యుగ్ర భల్లుకంబు
గుటగుట యటంచు రొప్పి యక్కుటిలుఁ గదిసి. 500
క. మెడఁబట్టుకొని తనూలత
జడియం గుదియించి నేలఁ జదికిలఁబడి య
మ్మడియఁడపు డెంత పొరలిన
విడువక మృత్యువు కొనర్చె విందు లతాంగీ. 501
క. అని కీరకులశిఖామణి
యనుగాథ కృతావధాన యై విని యయ్యం
గన యిది విచిత్రతరమౌ
ననుచుం దరహసితవదనయై యుండు తఱిన్. 502
మ. ప్రకటాకాశవిభుం డహర్ప్రభుని మత్ప్రాప్తైకనక్షత్రమా
లిక నీ వేటికి దాఁచినా వనుచు హాళిం బల్కుచో నాతఁడ
త్యకలంకస్థితి నగ్నితప్తచటులం బౌలోహఖండంబు సా
త్వికరీతిన్ వెసనెత్తినట్లు రవి ఠీవిం బ్రాగ్దిశం దోఁచినన్. 503
క. అంతటఁ దననగరుకుఁ జని
కాంకాతిలకంబు ప్రొద్దుగడువమి నెంతో
చింతిలుచు నుండునెడ భా
స్వంతుఁడు పశ్చిమపయోధి వడిఁ గ్రుంకుటయున్. 504
క. కలధౌతరత్నరశనా
కలితబహుక్షుద్రఘంటికాతతి మెఱయన్
వలఱేని భద్రగజమనఁ
జెలి యా రాచిల్కచెంతఁ జేరినయంతన్. 505
చ. కనుఁగొని యోసఖీజనశిఖామణి నేఁడొక గాథఁ దెల్పెదన్
విని చను మన్యనాయకుని వేడ్క మెయి న్రమియింపఁబోవుచోఁ
బెనిమిటిఁగన్నయంత నొకబింబఫలాధర ధైర్యవర్తనం
బసువుపడంగఁ దెల్పు టరయ న్వివరింతు నటంచు నిట్లనున్. 506
అయిదవకథ
క. [3]కనువిందై యొక పురవర
మనువందున్భువి మదేభహయభటరథ రం
జనమై యఖర్వరిపుభం
జనమై పొలుపారుచు న్విశాలం బనఁగన్. 507
- ↑ ‘మంత్రులందఱుఁగూడి యామానవేంద్రు’ అని పాఠాంతరము.
- ↑ రాజాపేఁటదగ్గఱ మద్దిరాలలోఁ దెచ్చిన ప్రతిప్రకారము.
సీ. అవునషే నను వివాహముగమ్ము విద్వాంసురాలవయ్యెదవు శుభ్రాంశువదన
అవునషే నను మనోభవకేళి నేలవే సోమిదమ్మవుదువె కోమలాంగి
అవునషే నామాటలాలింపవే పురోహితురాల వౌదువే యిగురుఁబోణి
అవునషే ననుబొందు మనిరళశ్రాద్ధాలయామాశనము తిందు వబ్జవదన
తే. యేల నన్నింత యేచఁ నేల వినుము
వనిత నీధర్మసత్రపు బ్రాహ్మణఁడను
మనల నమ్మినవాఁడు బ్రాహ్మణుఁడటంచు
నేటి కైనను దయఁజూడు నీరజాక్షి.
వ. అని మఱియును.
సీ. గోదాన ఫలదాన భూదానఫలములు చేరునంతటికైనఁ జేరుఫలము
వివరించి తెల్పెద విన్నపం బాలింపు మభిహితార్థంబు నీ కగు మృగాక్షి
అలయింపనేఁటికే యకట నీశిష్యుండ నగు నన్నుగాఁ జూడు మిగురుఁబోఁడి
పంచాస్త్రు డిదె నేఁడు బాధించుచున్నాఁడు బ్రతికింపవే నన్నుఁ బంకజాక్షి
తే. బ్రాహ్మణోత్తము నిపు డింత భంగపఱచు
టంతయు నధర్మమని చెంత కరుగునంత
యుల్ల మలరంగ నయ్యుగ్రభల్లుకంబు
గుటగుట మటంచు రొప్పి యక్కుటిలు నొరసి.
- ↑ కనకాంగీ కనకస్థల
మనఁగా నొకపురము గరము నలరును హర్మ్యా
గ్రనిహతహరిమణితిమిరో
జ్జనితరహఃకేళిసౌధజాలం బగుచున్. అని పా.