శుకసప్తతి/అయిదవకథ

వికీసోర్స్ నుండి

మ. ప్రకటాకాశవిభుం డహర్ప్రభుని మత్ప్రాప్తైకనక్షత్రమా
లిక నీ వేటికి దాఁచినా వనుచు హాళిం బల్కుచో నాతఁడ
త్యకలంకస్థితి నగ్నితప్తచటులం బౌలోహఖండంబు సా
త్వికరీతిన్ వెసనెత్తినట్లు రవి ఠీవిం బ్రాగ్దిశం దోఁచినన్. 503

క. అంతటఁ దననగరుకుఁ జని
కాంకాతిలకంబు ప్రొద్దుగడువమి నెంతో
చింతిలుచు నుండునెడ భా
స్వంతుఁడు పశ్చిమపయోధి వడిఁ గ్రుంకుటయున్. 504

క. కలధౌతరత్నరశనా
కలితబహుక్షుద్రఘంటికాతతి మెఱయన్
వలఱేని భద్రగజమనఁ
జెలి యా రాచిల్కచెంతఁ జేరినయంతన్. 505

చ. కనుఁగొని యోసఖీజనశిఖామణి నేఁడొక గాథఁ దెల్పెదన్
విని చను మన్యనాయకుని వేడ్క మెయి న్రమియింపఁబోవుచోఁ
బెనిమిటిఁగన్నయంత నొకబింబఫలాధర ధైర్యవర్తనం
బసువుపడంగఁ దెల్పు టరయ న్వివరింతు నటంచు నిట్లనున్. 506

అయిదవకథ

క. [1]కనువిందై యొక పురవర
మనువందున్భువి మదేభహయభటరథ రం
జనమై యఖర్వరిపుభం
జనమై పొలుపారుచు న్విశాలం బనఁగన్. 507

క. ఆనగరీవర మేలు మ
హానటనిటలస్థలీబృహద్భానుమహా
శ్రీనిర్జితసమదరిపు
క్ష్మానాథుఁడు భీమసేన జనపతి కడఁకన్.509

క. ఆ రాజు రమ్ము పొమ్మని
గారా మొనరించి మనుపఁగా మోహనుఁడ
న్పేరుగలవాఁడు తగుగుణ
వారిధియగు నొక్కబచ్చువాఁ డవ్వీటన్. 509

ఉ. మైనపుటంటు పల్వగలమచ్చులచా లొరగల్లు కట్టెలుం
దూనిక నాలుగేన్బొరలతోఁ దగువట్రములోననున్న నా
నానగరోద్భవంబులగు నాణెము లుండెడుసంచిఁ గొంచు బే
రాసకువచ్చు నన్నయధురంధరుఁ డంగడికిం గణింపఁగన్. 510

తే. [2]అతని కనుకూలవతి రూపవతియునైన
భామినీమణి దనరు సౌభాగ్యసీమ
యాత్మనాయకపాదసేవాభిరామ
నవ్యగుణవతి శుభవతీ నామ యొకతె. 511

ఉ. ఆలలితాంగి పుష్పవతియై దివసత్రయముం గ్రమించినన్
నాలవనాఁడు దాగురుజనంబులు కుంకుము సంకు పొంకముం
బోలెడు చల్వయుం బసుపుముద్దయుఁ గైకొని తోడరా మహా
కేళిరథాంగయైన నదికిం జని మజ్జనమాడి వేడుకన్. 512

ఉ. అత్త యొసంగ నొక్కకబళాన్నముఁ గైకొని వీటికారుచుల్
క్రొత్త మెఱుంగులీను రదకోరకము ల్గబళించి ఱేని ప
ల్లొత్తులు బట్టబైట నిడనోపుచు వాతెఱ నీనె గట్టఁగా
నత్తరలాక్షి చూపులు నిజాంఘ్రుల నిల్పుచు వీథి నేగఁగన్. 513

వ. ఆసమయంబున. 514

చ. చిటిలిన గంధముం దళుకుచెంపను వ్రేలురుమాలు జాఱుదు
ప్పటియును నిద్రదేఱుముఖపదము చెక్కిటికాటుమూఁపు చెం
గట నులిగొన్న జన్నిదము కన్నులకెంపు లతాంతవీటికా
పటిమ రహింపవచ్చె వరభద్రుఁడు నావిటుఁ డొక్కఁ డత్తఱిన్. 515

ఆ. వచ్చి మదికి మెచ్చువచ్చు నచ్చెలి బడా
పగలఁ జూచి వింత పదము వాడి
కేకరించి కొన్నిపోకలఁ బోయి య
చ్చేటెచూపు దన్నుఁ జేరకునికి. 516

క. నొగులుచు మరుబరిగోలలఁ
బొగులుచు నయ్యిందువదన పొందునుగూర్పం
దగువారు లేరు దీనికి
నగువారేకాక యని ఘనం బగుచింతన్. 517

సీ. తనమాట యే మెఱుంగనియంగనకు జార
మమకార మొనరించు మందు గాఁగఁ
దనప్రౌఢి సందు గానని సుందరికి గోడ
చివ్వున దాఁట నిశ్రేణి గాఁగఁ
దన నేర్పు గురుభీతతతనితంబకు సాహ
సక్రియ కభయహస్తంబుగాఁగఁ

దనబుద్ధి బొంకనేరని పంకజాక్షికి
ధవునివాకట్టు మంత్రంబుగాఁగ
తే. నమరు నవ్వీట నన్నపూర్ణాభిధాన
మదనమాయామహాస్థానమంత్రసాని
దానితో మాటలాడి చూతము విచార
మేల యని వేళగని దాని యింటికడకు. 518

చ. చని వరభద్రుఁ డల్ల గుణశాలిని జూచుటఁ దెల్పి దానిమో
హనమగు రూపమెంతకొనియాడెద నేడు దురంతకంతుకుం
తనిహతిఁజింతవంతఁబడితాంతలతాంతము చంద మొందె నా
తను విదె చూడు వేఁడుకొనెదన్ననుఁ గూర్పుము దాని నేర్పునన్. 519

క. నాకనఁగాఁ గనకము భౌ
మాకనుఁగొనఁ జిల్లపెంకు మాత్రము దానిం
జేకూర్చిన నాతనునిదె
నీకుం గైవస మొనర్తు నీతోడు సుమీ. 520

మ. [3]అని సూచించిన మంచిదంచు విని యయ్యబ్జాక్షినిం గూర్ప నా
తనికిం బాసయొసంగి వీడ్కొలిపి తత్కార్యార్థ మూహించి మో
హనుగేహంబునకుం బ్రయోజనశతవ్యాపారముల్ దెల్పికొం
చు నిరూఢంబగు రాకపోక లొనరించు న్మాయ డాయింపుచున్. 521

క. అంతట నాశుభవతి కది
యంతింతనరాని యంతరంగంబున నా
ద్యంతమధురోక్తచాతురి
సంతతము న్వింతసంతసం బెసంగించున్. 522

క. ఆలలనామణి కాగ
య్యాళి యొకానొక్కవేళ నక్కఱతో సు
వ్వాలున్శోభనములు ధవ
ళాలు న్మొదలైన పాటలం దగ నేర్పున్. 523

చ. వనజదళాయతాక్షి మగవాఁడు పరాంగనపొందుఁగోరువాఁ
డని వినవేమొ యట్టిచవు లంటినచో మఱిచౌక సేయఁడే
నిను నటుగానఁ బూని మగనిం బెఱత్రోవలఁ బోవనీకు నే
ర్పుననని బుద్ధిగాఁగఱపు ముద్దియ సందియమందకుండఁగన్. 524

క. అంతట నొకనాఁ డొక వెల
యింతియు మోహనుఁడు నప్పులిచ్చినపనికై
మంతనమాడఁగ నమ్ముది
జంతయు వెసఁబోయి వానిసతికిం జెప్పెన్. 525

తే. చూపి యిన్నాళ్ళు నిటువంటి సుద్దిగాదు
కాదటందువు గద దానికాళ్ళమీఁద
సాగఁబడి మ్రొక్కి యిల్లాలిఁ జక్కఁజూడఁ
గావుమని బాసలీయఁగాఁ గంటి నేను. 526

ఉ. బిడ్డయొ పాపయో చిదిమి పెట్టిన కైవడినున్న నిన్నుఁ దా
సడ్డయొనర్పకవ్వలఁబిశాచమువంటి గరాసుఁగూడె నీ
యెడ్డెఁడు గుట్టుతోడ నిఁకనేనియు నాపలు కాలకించు నే
నొడ్డెద దీనికిం దగినదొక్కయుపాయము తోయజాననా. 527

క. తిట్టిన మెట్టినకైవడి
సెట్టింగని పొడిచినట్లు చేకూడమఱిన్
నెట్టుకొని నేఁటినుండియు
గట్టిగ వేఱొకనిఁ గూడఁగావలె నీవున్. 528

చ. తెలియదుగాక నీకు సుదతీ రతినైపుణిఁ జూపవచ్చునో
కలకల నవ్వవచ్చునొ వికాసపుముచ్చటఁ దెల్పవచ్చునో
బలువగ పారువాపలుకు పల్కఁగవచ్చునొ కుల్కవచ్చునో
చెలువుని చెంగటం బరునిచెంగటఁ బోలెఁ గురంగలోచనా. 529

క. కొసరువగమాట లలుకలుఁ
గుసిగుంపులు తిట్లు మోరికొట్టులు జారుం
డసమసుఖంబుగఁ గైకొను
బసవెద్దగు మగఁడు మండిపడుఁ గుసుమాంగీ. 530

తే. నోరెఱుంగనియట్టి జంతువులుసైత
మంబుజానన యిచ్ఛావిహార మందు
బ్రతుక నేర్చిన తనువొక్కపతి కొసంగి
బంగరమువంటి మనసుఁ గెంటంగ నేల. 531

క. అని చెలి పుడకలు విఱిచినఁ
గనుఁగొని యది క్రొత్తగుమ్మ కావున మనసొ
గ్గిన నదియును నేనొక్కనిఁ
గొనివచ్చెద నూరిబైటి గుడికడ కనుచున్. 532

క. చింతాకు ముడుఁగుతఱిఁ ద
త్కాంతంగొని తెచ్చి మేరుకార్ముకగేహో
పాంతమున నిల్పి మఱితా
నంతన్ వరభద్రుఁ బిలువ నరిగె న్వేగన్. 533

తే. అరిగి యతఁడింట లేకున్న నాత్మఁబొగిలి
కొదవవచ్చె నటంచు నమ్ముదిపిసాలి

తిరిగి చనుదెంచుచోఁ గాంచెఁ దెరువులోన
వానిఁబోలిన నెఱనీటుకాని నొకని. 534

క. కని పొలిపోవనిమగనా
లిని గూర్చెద నీకుఁ జాలలేవడిఁ బాల్మా
లినయది యనుచుం బిలిచినఁ
జని యాతఁడు కాంచె నాబిసప్రసవాస్యన్. 535

క. కనుఁగొని తనయిల్లాలని
మనమున నతఁ డెఱిఁగె నంత మగువయు నాథుం
డని తెలిసెం దత్సమయం
బున నాశుభవతి మఱెట్లు బొంకఁగవలయున్. 536

క. తెలిసిన నేగుము తెలియని
యలవైనం బోకు కొంచెమా పరపురుషుం
గలయుటలు నిలువనాడం
గలదానికిఁ జెల్లుఁగాక కరివరగమనా. 537

ప. అని యివ్విధంబునం గీరసునాసీరుండు పలికి యూరకుండిన నవ్వ్వైశ్యాదృశ్యమధ్య యతిధ్యానాధీనయై యలక్ష్యనిక్షిప్తవీక్షణంబున నున్న మితభ్రూలతంబుగాఁ గొంతతడవు విచారించి భూతలాధిపానీతయగు రాజదూతిం గనుంగొని యిందేమైననుం దెలియునె యనియడిగి ముఖవికారంబునం దానియజ్ఞానం బెఱింగి రెండవచంద్రమండలంబునుం బోని తనముఖం బెత్తి చిగురాకుమఱుఁగునం బొడము మొగ్గయుంబోలె మధురాధరంబు చాటునఁ దలసూపుదరహాసకందళంబుతో నచ్చిలుక కిట్లనియె. 538

తే. అరయ నిక్షేప ముంచినయట్టివారె
తెలియవలెఁగాక యొకరికిఁ దెలియఁదగునె
యింత యేమిటి కిపుడు నీయిడినచిక్కు
నీవె విడిపింపు మన శుకం బిట్టులనియె. 539

ఉ. అప్పుడు తద్వధూటి చలితాధరయై వరుఁ గుప్పుతెప్పునం
జప్పుడుగా నదల్చి పరసారసగంధులఁ బొందనంచు నా
కొప్పని బాస నిచ్చితి నహోయిటు లెంతకు నెత్తుకొంటి విం
కెప్పని కైన నమ్మఁదగునే ననుఁ జంపఁగఁ జూతు వింతటన్. 540

ఉ. నీమదిఁ జూడఁగోరి తరుణీ జనధర్మము గాక యున్నచో
నేమని దీనిచేత నిటకేఁ బిలిపించిన వచ్చి తన్యభా
మామతి నిప్పుడిట్లు పరమానినియైన రమింపవచ్చి నా
తో మదిమోహమగ్నుగతిఁ దోపఁగ నుండుట కిచ్చగించితో. 541

క. చుట్టాలకుఁ దెల్పుదు మది
దొట్టినకినుకం దలార్లతోఁ జెప్పుదుఁ గూ
పెట్టుదు దొరముందఱ నను
బట్టకు మని పఱవ నతఁడు బరువగుభీతిన్. 542

తే. పాదముల వ్రాలి నే నేమిపాప మెఱుఁగ
నీమహాదేవునాన పూర్ణేందువదన
రవ్వయొనరింపవలదంచు రమణిఁ దోడు
కొనుచు గుట్టునఁ దనగృహంబునకుఁ జనియె. 543

క. అని చిలుక పలుకఁ గుతుకం
బున నౌరా యెంతబొంకు బొంకెను మృగలో
చన యని ప్రభావతీసతి
యనుపమ మతి మెచ్చుకొనియె నవనీనాథా.544

వ. అనిన నద్ధరాకాంతుండు తదనంతరగాథాప్రకారం బెవ్విధం బని యనుడు. 545

శా. విశ్వామిత్రమనఃప్రియంకరకరావిర్భూతదానక్రియా
శశ్వత్తోషితధారిణీసుర సురేశస్తుత్యశౌర్యాతిల
బ్ధైశ్వర్యోజ్జ్వలవైభవోన్నతనతాయాసాపహృధ్వీమహో
క్షాశ్వాస్త్రాసవిరామ రామబలగర్వారంభనిర్వాపణా. 546

క. ధారాధరవర్ణ సుధా
ధారాపరిపూర్ణవాక్యధారావిబుధా
ధారానిజకౌక్షేయక
ధారాదళితాహితవసుధాధరధారా. 547

మాలిని.—
జలధరనిభదేహా సజ్యకోదండబాహా
ఖలదనుజవిదారీ కంధిదర్పాపహారీ
కులగిరిసమధైర్యా కుంభినీనాథవర్యా
సలలితగుణజాలా జానకీకేళిలోలా. 548

గద్యము. ఇది శ్రీమత్ఖాదిరీనృసింహకరుణాకటాక్షవీక్షణసమాగతకవితాధార పాలవేకరికులకలశాంభోనిధిసుధాకర తాడిగోళ్లకరియమాణిక్యనృపహర్యక్షపౌత్ర పవిత్రచరిత్ర కదురధరామండలాఖండలపుత్ర విద్వత్కవిరక్షణానుసంధాయక ఖదిరీపతినాయక ప్రణీతంబైన శుకసప్తతియను మహాప్రబంధంబునం బ్రథమాశ్వాసము.

  1. కనకాంగీ కనకస్థల
    మనఁగా నొకపురము గరము నలరును హర్మ్యా
    గ్రనిహతహరిమణితిమిరో
    జ్జనితరహఃకేళిసౌధజాలం బగుచున్. అని పా.
  2. అతనికులకాంత నవమోహనాంగవిజిత
    కాంతరతికాంత రుచిరరేఖానిశాంత
    వఱలు వరపాదకమలసేవానిధాన
    నయగుణవిధేయ శుభవతీనామధేయ.
  3. అని తెల్పన్విని మంచికార్యమని పాఠాంతరము.