Jump to content

శారద లేఖలు (మొదటి సంపుటము)/అభిప్రాయము

వికీసోర్స్ నుండి

"శారద లేఖల”ను గుఱించి నా యభిప్రాయము

(రాయసం వెంకటశివుఁడు, గుంటూరు.)


ఆంగ్లసారస్వతమున స్త్రీహృదయ మంతగ ప్రస్ఫుటమగుచుండ లేదని యొకశతాబ్దము క్రిందట ఇంగ్లీషురచయిత జాను స్టువర్టుమిల్లు మొఱపెట్టెను. -ప్రశ్తు తాంధ్రవాఙ్మయమున నట్లే స్త్రీ రచనావిషయిక మగు కఱవు మిక్కుటముగనున్నది. మనదేశమున నిదివఱకు పురుషుఁడే, స్త్రీ స్వభావమునుగుఱించి పుస్తకరచన చేసెను; స్త్రీల హక్కులను గూర్చి సభలలోఁ బ్రసంగించెను; వార్తాపత్రికలలో వ్యాసరాజములు వ్రాసెను. ఇపుడు స్త్రీలు ముందడుగువేసి, తమ సంగతులు తామె ప్రస్తావించుకొనుచున్నారు. శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మగారు శారద లేఖలు తెనుఁగుసారస్వతమందలి యీకొఱఁతను గొంత తీర్చుచున్నవి. ఆంగ్లవిద్యనేర్చి పట్టపరీక్షలందు జయమందకున్నను, వరలక్ష్మమ్మగారు, పాశ్చాత్యవిద్యావిధానముల చొప్పుననె చదువుకొని, ఇంగ్లీషు నభ్యసించిన యువతులకు సామాన్యముగ సాధ్యముగాని పాండిత్యప్రకర్షయు వివేచనా శక్తియును సంపాదించి, తేటతెలుఁగున రమ్యగ్రంథరచన యలవఱచుకొనిన సాధ్వీమణి.

శారదాకల్పలతల మధ్య నడచినలేఖలను పేరుతో, శ్రీమతి వరలక్ష్మమ్మగారు ప్రస్తుతకాలమందలి ముఖ్యవిషయములు చర్చించి లిఖించిన వ్యాసావళియె యిది. ఇవి స్వల్పసంగతులనియు, ఇవి మహద్విషయములనియు, శారద విచక్షణచేయదు. సంక్రాంతి ముగ్గులవలెనే సరోజినీ దేవి యుపన్యాసమును, కన్నప్పకథయు, గౌరవబిరుదములవలెనే శారదా శాసన చర్చయు స్త్రీల నాటకరంగప్రవేశమును, శారదకు లేఖావిషయ లగుచున్నవి ! పుస్తకరచనమున ప్రాఁతదారి త్రొక్కి పురుషుల యభిప్రాయములె చిలుక పలుకులవలె శారద, యేకరువు పెట్టునదికాదు. స్త్రీజన సహజమగు సదయహృదయత, స్వభావసారళ్యమును, పుస్తకమందలి ప్రతిపుటయందును ప్రతిబింబితమగుచున్నవి. ఆంధ్రవాఙ్మయమున నీపుస్తకమునకు గౌరవస్థాన మొనఁగూర్చుట కిది యొకటియె చాలును. పరదేశ మందున్నను, రెయిలుపయనము చేయుచున్నను, పుణ్యతీర్థసందర్శనమందున్నను స్త్రీలసభలోఁ బాల్గొనుచున్నను, శారద యూహలు, పలుకులు హిందూయువిదవియె ! భావముననెగాక భాషయందును ఈ లేఖావళియందెల్లెడలను స్త్రీస్వభావము చిప్పిలుచున్నది! 'ఊరుగాయజాడీలకు పచ్చడి బానలకు మాత్రమె రెయిలులో నొక పెట్టెయు, ఇంటియం దొకగదియు మనకుఁ గావలయును! ఈ మధ్య మన ప్రాంతములనుండి యొక రీ గ్రామమున కుద్యోగసందర్భమున నేతెంచిరి. వారి సామాను నాలుగైదు బండ్లు నిండియుండెను. ఐదారు మంచములుగూడ తెచ్చిరి. ఈ ప్రాంతమున మంచములు వాడుకొను అభ్యాసములేదు!' అని శారద, తన తెలుఁగు చెలికత్తెలను మెత్తని యెత్తిపొడుపుమాట లనుచున్నది! కాళహస్తిలో దొరకు కొయ్యదువ్వెనలు నల్ల గాజులును శారదకు మిగుల ప్రియము. ఈ దువ్వెనలను నిరాకరించి, విదేశపు మెఱుఁగు దువ్వెనల కెగఁబడు తెలుగుమగువలమీఁద, స్వదేశవన్తుప్రియయగు శారద, కోపానల మిట్లు కురియుచున్నది 'మెఱుఁగే మన కనులలో కంపకొట్టుచున్నది. దువ్వెనలకు మెఱుఁగు, గాజులకు మెఱుఁగు, గుడ్డలకు మెఱుఁగు, మొగములకు మెఱుఁగు! ఈ విదేశపు మెఱుఁగులు మన మెఱుఁగును రూపుమాపు చున్నవి!' 'సిగనిండ పువ్వులు దుఱుముకొని, యొడలినిండ నగలుపెట్టుకొని, వన్నెవన్నెల విలువ చీరలు ధరించి, ప్రతి చిన్నహరికథకును తండోపతండములుగ వచ్చెడి బెజవాడపుర వనితలు' ఇటీవల నచట జరిగిన ఆంధ్ర మహిళాసభపై 'శీత కన్నువేయుటకు' శారద మిగుల కనలెను. అచట జరిగిన యింకొక సభలో స్త్రీలు నలువైపులదిరిగి గలగల మాటలాడుట చూచిన శారదకు, ‘ఆనాఁడు మన స్త్రీల అశిక్షితవ్యవహారము బాగుగ విశదమయ్యెను.' శారదాచట్టము చర్చకువచ్చినప్పుడు, 'ఇచ్చవచ్చినట్లు స్త్రీలు సభలో కేకలుపెట్టిరి. అంతతోఁబోక, వీధిపొడుగునను, నోటికి తాళముదీసి, బారలుసాచిరి !'

పూర్వాచారమను పేరుతో ప్రజానుమోదమువడసిన ప్రాఁత చెడుగులవలెనే, నవనాగరకపుముసుఁగుతో నిర్భయముగ నడయాడు నూతన దురభ్యాసములును, శారదకుఁగంటకసదృశములె! శారదాశాసన చర్చ సందర్భమున గ్రంథకర్త్రికిఁగల చక్కని స్వతంత్రబుద్ధి సునిశిత మేధాశక్తియు వ్యక్తమగుచున్నవి. దక్షిణాదినుండి తనతో రెయిలు ప్రయాణముచేసిన తరుణులనోటనే శారద యీచర్చ సాగించెను. బాల్య వివాహానర్థముల వాతఁబడిన ముగ్గురు ముదితలుచెప్పిన తమ దైన్యవృత్తాంతములవలననె యచటి స్త్రీ జనమునకు శారదాచట్టము సమ్మతమయ్యెను. స్త్రీలు నాటకరంగ మెక్కవచ్చునను లక్ష్మీదేవమ్మగారి వాదనను, శారద తన దీర్ఘ లేఖావాక్యములచే తుత్తునియలుచేసెను. ‘తలిదండ్రు లెవరి కొసఁగిన వారినే పరదైవము గా నెంచి ప్రేమించి గౌరవించెడి హిందూ స్త్రీలు, చిత్తమొకనికి శరీరమొకనికి నొసంగుచున్నారని నీవు వ్రాసిన వ్రాత మిక్కిలి యనుచితము * * నీమతమే నిజమగుచో, మన తల్లులు, పుత్రికలు, * * వేయేల భారతమహిళలెల్లరు, చెడ్డవారే యనవలసి వచ్చును. సోదరీ! మన వివాహసంస్కారమునందు లోపములున్న సంస్కరింపనగును గాని, నీనాటకరంగప్రవేశోద్యమ సమర్థనముకొఱకు, స్త్రీల నెల్లర కట్టగట్టి, యిట్టి హేయమగు నిందకు గుఱిసేయుట కడుంగడు సాహసము, అక్రమము!' శారదతీవ్రతర్కమునకు లొంగని ప్రతిస్పర్థులవాదమును బూర్తిగ ఖండింపఁగల చమత్కృతి యామె పరిహాసమునకుఁగలదు! 'ఆపద్ధర్మముగా ఈ సంస్కారమునకు (అతిబాల్య వివాహములకు) శాస్త్రమొప్పినదట! పాపము, మనశాస్త్రములు చాలమంచివి. ఎవరి కేవీలుకావలెనో దాని కనుగుణ్యమగు నుదాహరణ శ్లోకమునుజూపి పూర్వాచారపరాయణులను రక్షించును. ఆకల్పవృక్షముప్రాపున వారుచేయని సాహసములేదు. పసిబాలలకు పరిణయము చేసిరి. కసుగందులను గూర్చుండబెట్టి గర్భాధాన మంత్రములు వల్లెవేయించిరి! * * రాళ్లు దేవుళ్లయిన రాసులు మ్రింగవా యని వేమన యోగీంద్రుడు సందేహించినట్టుగానే, యీశిశువివాహములలో దేవుళ్లు రాళ్ళయినారు. లేకున్న, ఆయాస్వాములసన్ని ధానమున తలిదండ్రు లిట్టి యక్రమవివాహములు జరుపఁగలిగియుందురా?'మగడు చావగనే మగువవాంఛ లేవిధముగా నడుగంటిపోవునో, మగువచావగనే మగవానికోరిక లావిధముగా నీరికలెత్తుచుండును. భర్తృవిహీన పసిదే యగుగాక యామె వాంఛ లడవిపువ్వులవలె నిరుపయోగముగ రాలిపోవలెను. * * ఆపసిదానిమోమున భస్మ రేఖలును, ఈముసలివాని మోమున చాదుచుక్కయునా!'

మనుజులవర్ణనమునందు - ముఖ్యముగ స్త్రీస్వభావమును చిత్రించుట యందు - శారదకరము ప్రకృతి కద్దముచూపించుచుండును. 'శారద పెండ్లిండ్ల' సందర్భమున కొన్నియేండ్లక్రిందట దేశమున పెండ్లిండ్లమీఁద పెండ్లిండ్లు జరిగెనుకదా. ఒక యూరేగింపులో 'పెండ్లికూతురు మూడేండ్లు నిండియు నిండని పసికూన, కట్టుకొనిన క్రొత్తపరికిణి యెత్తియెత్తి దులుపు కొనుచును, తొడుగుకొనిన పట్టుచొక్కాను పట్టి పట్టి చూచుకొనుచును, బొమ్మల పెండ్లిండ్లలోని బొమ్మవలె కూర్చున్నది. పెండ్లికొడుకో పదేండ్లవాడు, నిద్రచే తూగుచున్నాడు.' ఇంకొక యూరేగింపులో, 'పిల్లకొక పెద్దచీర చుట్టపెట్టి, పొదలకమ్మవలె కూర్చుండబెట్టినారు. ఆబాలిక యా చీరలోపడి, చిక్కములో పిట్టవలె గొట్టుకొనుచున్నది.' * * * 'మళయాళస్త్రీలు సాధారణముగా నగలు ధరింపరు. రంగువస్త్రములు కట్టరు. వారి కట్టుబట్ట యాఱుమూరలె * * కేరళ కాంతలు చక్కగ జారుముడివైచుకొందురు. * సహజ దంతధవళిమయు నధరరక్తిమయు కేరళవనితల వదనారవిందములకు చెలువుగూర్చుచుండును. * దక్షిణ హిందూస్త్రీలలో కేరళస్త్రీలే చక్కనివారు.'

ప్రకృతి సౌందర్యవర్ణనమందు శారద యసమానప్రజ్ఞ యని చెప్ప నొప్పును. 'అపుడు మధ్యాహ్నమై, సూర్యుఁడు తీక్ష్ణముగా నెండగాయుచున్నను, మాబాటల కిరుప్రక్కలనున్న యెడతెగని వృక్షపంక్తుల ఛాయలచే, మే మెండకన్నెఱుఁగని శుద్ధాంతజనముల భాతినైతిమి ! * * కల్పలతా ! ఆపడమటికనుమలభాగ్య మేమని చెప్పుదును? సమస్త పాదపములు, అఖిలలతావితానములు సర్వగుల్మములు, వానిసొత్తు. * కుంకుమరాసులు పోసిన ట్లొకచోటను, పసుపుకుప్పలుపోసిన ట్లొక చోటను, నీలాంబరముగప్పిన ట్లొకచోటను, వెల్లముసుఁగువేసిన ట్లొక చోటను, వివిధ వర్ణపర్ణ విరాజితమై, యాకనుమలయందలి వృక్షవల్లరులు సొంపునింపుచుండెను!'

కాంచీ మధురా రామేశ్వరాది పుణ్యక్షేత్రదర్శనముచేసి వచ్చిన శారదకు మంచిభక్తి చేకూరెనని మనము సంతసింపవచ్చును. కాని యందందు కానవచ్చిన పీడలు నక్రమముల నామె మనస్సునఁ గొంత కలవరము నసహ్యతయును బుట్టించెను. గుళ్లలోని యర్చకుల చర్యలు పొడ గాంచిన శారద, 'సంపత్తిగలవారికే స్వామిదర్శనముగదా !' యని యాశ్చర్యపడెను.' ‘ఈవిధమున దేవతలు నేడు దౌర్జన్యపరులగు మానవుల చేతిలోఁజిక్కి, భక్తజనసులభులు గాకున్నారు!' అని యామె, వెతనందెను. ఐనను, ఆమె యాస్తిక్యబుద్ధిని దృఢపఱుచు ననుభవములును లేక పోలేదు - నేపాళమునుండి సేతువుచూడవచ్చిన యొక వృద్ధాంగనయందు ద్యోతకమయిన మతవిశ్వాసము పుణ్యకాంక్షయు శారద కద్భుతజనకములయ్యెను - 'మతసూత్రమె యావద్భారతీయులను ఐక్యపఱుచుచున్నది - మతము మానవునకు ప్రాణముకంటె నుత్కృష్టము!' అని శారద నిశ్చయము చేసికొనెను.

శారద సంతానవతియై, విద్యాభాగ్యములం దింకను వన్నెగాంచి యుండెనేని, ఆమెయనుభవము మఱింతవిస్తరించి యీరచయిత్రి, భాగ్యవతుల బాధ్యతలను, కనిపెంచెడి యిల్లాండ్ర కష్టసుఖములనుగూడ బాగుగ విమర్శించి యుండెడిదని పాఠకలోక మాశింపవచ్చును. కాని, యాపరిస్థితులలో మొదలు శారద గ్రంథరచనమునకె మోసము గలిగెడిదేమో ! కావున చదువరులకును సంతృప్తియె శ్రేయోదాయకము. శారదముద్దు పలుకులు, శారద నిష్కపటహృదయము, శారద యవ్యాజసౌజన్యమును, పాఠకావళి హృదయములు రంజింపఁజేసి, వారినీ లేఖల ద్వితీయభాగమున కెదురుచూచునట్లు చేయఁజాలియున్నవి