వీరభద్ర విజయము/పీఠిక

వికీసోర్స్ నుండి


పీఠిక[మార్చు]

8-క.
శ్రీ రామాయణకథ భువి
వారక నిర్మించినట్టి వాల్మీకి మన
స్ఫారుఁ బరాశరనందను
శ్రీరమ్యుని వాయ కెపుడుఁ జింతింతు మదిన్.
9-సీ.
బాణు నంచిత శబ్దపారీణు, నసమాన: కవితాగుణావాసుఁ గాళిదాసు,
మాఘు వాక్యామోఘు, మణిభద్రు శివభద్రు,: రమణీయతరకవిరాజు భోజుఁ,
బ్రకటితవిమల ప్రభారవి భారవి,: నున్నతగుణధుర్యు నన్నపార్యు,
నేవితకవిరాజి శ్రీసోమయాజిని,: శృంగారకవినాథు రంగనాథు,
తే. నవని రెండవ శారదయై వెలుంగు
వైభవోద్దాము వేములవాడ భీము
నాదిగాఁ గల కవులను నధికభక్తిఁ
దలఁచి వర్ణించి తత్ప్రసాదంబు వడసి.
10-క.
భవిఁ జూడక భవిడాయక
భవుపదములు గొల్చి ఘోరభవభంజనులై
భవదూరులైన పుణ్యుల
భవు నర్చన చేసి వరము వడసిన వారిన్.
11-సీ.
శిరియాలుఁ గరికాలుఁ జేరమునుద్భటు: బాణుఁ గేశవరాజు బసవరాజుఁ
గన్నప్ప జన్నయ్య కరయూరచోడయ్య: కుమారగుండయ్య నెమ్మినాథుఁ
బండితారాధ్యుని భల్లాణునమినంది: మాహేశునుడివాలు మాచిరాజుఁ
చేరమరాజయ్య చిరుతొండనోహళి: సాంఖ్యతొండనిసురిచముడ దేవు
ఆ. వెలయ మఱియుఁ గల్గు వీరమాహేశ్వరా
చారపరుల వీరసత్యవ్రతుల
వీరసచ్చరితుల వీరవిక్రములను
బరగ మ్రొక్కి తలఁచి భక్తితోడ.
12-వ.
తత్ప్రాసాద కరుణావిశేష ప్రవర్థమాన కవితామహత్వ సంపన్నుండ నై మదీ యాంతరంగంబున.
13-సీ.
“ఏ పుణ్యకథ చెప్పి ఈ భూమితలములోఁ: బాప సంచయ మెల్లఁ బాయవచ్చు;
నేపుణ్యకథ చెప్పి యితరులు వొగడంగఁ: గోటి పుణ్యంబులు గూర్చవచ్చు;
నేపుణ్యకథ చెప్పి యితరలోకంబులోఁ: బరమ కళ్యాణంబుఁ బడయవచ్చు;
నేపుణ్యకథ చెప్పి యింద్రాది సురలచే: బొలుపార సత్పూజఁ బొందవచ్చు;
ఆ. నెట్టికథ రచించి యెవ్వరు నెఱుగని
యీశు నాదిదేవు నెఱుఁగవచ్చు;
నేమికథ యొనర్చి యిలలోన సత్కీర్తిఁ
దనరవచ్చు నంచుఁ” దలఁచి తలఁచి.
14-వ.
తదీయ విచారచిత్తుండ నై త త్కథారంభం బూహించుచున్న సమయం బున.
15-సీ.
పరమ భద్రాసన ప్రముఖ మార్గంబుల: యోగీంద్రు లితఁ డాదియోగి యనఁగ;
వీరవ్రతంబున వీరమాహేశులు: వీరమాహేశ్వరవిభుఁ డనంగ;
సంతతానుష్ఠాన సత్కర్మ నిరతిమై: బ్రాహ్మణు లుత్తమ బ్రాహ్మణుఁ డన;
వేదాంతసిద్ధాంతవిమలుఁడై చెలఁగుచో: జను లెల్ల ధర్మశాసనుఁ డనంగ
ఆ. వెలయు శంభుమూర్తి వీరమాహేశ్వరా
చారవిభుఁడు భక్తిసాగరుండు
యనఘుఁ డివ్వటూరి యారాధ్యచంద్రుండు
సోమనాథసముఁడు సోమగురుఁడు.
16-మ.
సరసుల్ పెద్దలు నీతిమంతులు కవుల్ జాణల్ బుధుల్ బంధువుల్
దొరలుం జాలఁ బురోహితుల్ హితులు మంత్రు ల్గాయకుల్ పాఠకుల్
సర్వవేదుల్ భరతఙ్ఞు లాశ్రితులు దైవఙ్ఞుల్ పురాణఙ్ఞులున్
నరనాథుల్ శివభక్తులు న్నిరుపమానందాత్ములై కొల్వఁగన్.
17-వ.
ఒక్కనాఁ డసమానమానసుం డై యగమ్య రత్నాంచిత మగు వేదికా తలంబున సమున్నత కనకాసనంబున సుఖం బుండి శైవపురాణ ప్రసంగాంతరంగుం డై నన్ను రావించిన.
18-ఆ.
భయము సంభ్రమంబు భక్తియుఁ గదురంగ
నతని పాదయుగము నల్లఁ జేరి
పాణియుగము ఫాలభాగంబుఁ గదియించి
ముదముతోడ నేను మ్రొక్కియున్న.
19-వ.
అ య్యవసరంబున సోమశేఖరుం డి ట్లనియె.
20-సీ.
“సమయంబు లాఱును చర్చించి చర్చించి: చదువులు నాల్గును చదివి చదివి;
బహుపురాణంబులు భాషించి భాషించి: యితిహాసముల నెల్ల నెఱిఁగి యెఱిఁగి;
కావ్యంబు లెన్నేని ఘర్షించి ఘర్షించి: యఖిలవిద్యలు నాత్మ నరసి యరసి;
ఘనులతో సద్గోష్ఠిఁ గావించి కావించి: సకలకృత్యంబులు జరిపి జరిపి;
ఆ. యున్న నిప్పుడు మా కెల్ల నూహలోన
వింతపండువు బోలెను వీరభద్ర
విజయ మెల్లను వినఁ గడువేడ్క యయ్యె
నది దెలుంగున రచియింపు మభిమతముగ.
21-ఆ.
పిన్నవాఁడ ననియుఁ బెక్కు సంస్కృతులను
విననివాఁడ ననియు వెఱపు మాను
మత్ప్రసాద దివ్యమహిమచే నెంతైన
కవిత చెప్ప లావు గలదు నీకు.
22-వ.
అదియునుం గాక. నీకు వీరభద్రేశ్వరప్రసాదంబుఁ గలదు. కావున వాయుపురాణ సారం బగు నీ కథావృత్తాంతం బంతయు దెలుంగున రచియింపు” మని యానతిచ్చిన మద్గురుని మధురవాక్యంబులకు నత్యంతానురాగ సంతుష్టుండనై తదీ యానుమతంబున మదీయ వంశావళి వర్ణనం బొనరించెద.