వీరభద్ర విజయము/దేవతా ప్రార్థన

వికీసోర్స్ నుండి

వీరభద్ర విజయము
ప్రథమాశ్వాసము

దేవతా ప్రార్థన[మార్చు]

1-మ.
శ్రీ లలితంపు భూతియును శేష విభూషణమున్ శిరంబు పై
వేలుపు టేరు పాపటను వెన్నెల పాపఁడు మేన గొండరా
చూలియుఁ గేల ముమ్మొనల శూలము నీలగళంబు గల్గు నా
వేలుపు శ్రీమహానగము వేలుపు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.
2-చ.
సిరియును, వాణి, గౌరి యను జెన్నగు కన్యకు మేను, వాక్కుఁ, బె
న్నురమును నుంకువిచ్చి ముదమొప్ప వరించి జగంబు లన్నియుం
దిరములు సేయఁ, బ్రోవఁ, దుది దీర్పఁగఁ ద్ర్యష్ట యుగేక్షణుండునై
హరి, విధి, శంభుమూర్తి యగునాఢ్యుడు మాకుఁ బ్రసన్నుఁడయ్యెడున్.
3-వ.
అని నిఖిలదేవతా ప్రార్థనంబుఁ జేసి.
4-సీ.
భవభక్తు లగువారిఁ బాటించి చూచుచోఁ: జల్లని సంపూర్ణచంద్రుఁ డనఁగ;
శరణార్థు లగువారిఁ జాల రక్షించుచో: సలలితవజ్రపంజర మనఁగ;
బలుశివద్రోహుల భస్మీకరించుచో: నద్భుత ప్రళయకాలాగ్ని యనఁగ;
బ్రహ్మాండముల నంటఁబట్టి ధట్టించుచో: నడరి విజృంభించు హరుఁ డనఁగ;
ఆ. వెలయునట్టి దేవు వీరభద్రేశ్వరు;
నఖిల దేవ గర్వ హరణ శూరు
నాత్మఁ దలఁచి మ్రొక్కి యద్దేవు కరుణ నా
మనములోన నమ్మి మహిమతోడ.
5-చ.
కరతల మల్లఁ జూచి పులకండము నెయ్యియుఁ బిండి యుండ్రముల్
పొరిఁబొరిఁగళ్ళు సేయుచును బుగ్గలఁ బెట్టుచుఁ బావుకొంచు న
చ్చెరువుగ లీలతో నమిలి చిక్కుచు సొక్కుచు గౌరి ముందఱన్
గురువులువారు వ్రేఁగడుపుఁ గుఱ్ఱఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడిన్.
6-సీ.
కల్పవల్లియుఁ బోలు కౌఁదీఁగె నునుకాంతి: మెఱుఁగుఁదీగెలతోడ మేలమాడ;
పసిఁడికుండలఁ బోలు పాలిండ్లుకవకట్టు: చక్రవాకములతో సాటిసేయ;
గండుమీనులను బోలు కన్నుల చెలువంబు: నీలోత్పలంబుల గేలిసేయ;
నిండుచందురుఁ బోలు నెమ్మోము దీధితి: కమలపత్రంబుల కాంతి నవ్వ;
ఆ. మొనసి నిఖిలభువనమోహనలక్ష్మియై
పరఁగుచున్న పద్మపాణి వాణి
నన్ను నమ్మినారు నావారు వీ రని
వాకు లిచ్చుగాత మాకు నెపుడు.
7-వ.
అని యిష్టదేవతాప్రార్థనంబు సేసి.