వీరభద్ర విజయము/నగజను శివునికి శుశ్రూష చేయ నప్పగించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నగజను శివునికి శుశ్రూష చేయ నప్పగించుట[మార్చు]

221-మ.
అవధా రీశ్వర! విన్నపంబు మదిలో నాలించి రక్షింపుమీ
యువిదారత్నముఁ బెట్టి పోయెదను మీ యొద్దన్ భవద్ధాసి యై
తివుటన్ వర్తన సేయుచుండెడిని ప్రీతిం దీని రక్షింపుడీఁ
యవిరోధంబున లీలఁ బంపి పరిచర్యల్ చాల సేయింపుఁడీ.
222.క.
కొండిక బాలిక యెఱుఁగదు
సుండీ యెంతయును ముగుద సుండీ” యనుచున్
ఖండేందుబింబమౌళికిఁ
గొండలరా జప్పగించెఁ గూఁతుం గౌరిన్
223-వ.
ఇ వ్విధంబునం బరమేశ్వరునకుఁ బరిచర్యలు సేయ న మ్మహాదేవిని సమర్పించి యతం డ ద్దేవునకు వెండియు దండప్రణామంబు చేసి తన మందిరంబునకుఁ జనియె నంతఁ.
224-మ.
శివుఁ జూచుం దమకించి సిగ్గు నగుడున్ జిక్కం గరంగున్ మదిన్
భవుఁ జేరం గమకించుఁ జంచలపడుం భావించు నెంచున్ వడిం
గవయంగాఁబడు నాథుఁ గౌఁగిటను సింగారింతునో యంచు నో
శివ రమ్మా యని పిల్తునా యనుచు రాజీవాక్షి సంరబ్ధయై.
225-సీ.
పరమేశు రూపంబు పలుమాఱు నందంద: వాడిచూపులఁ జూచు వాని మిగులఁ
బులకించు దలఁకించుఁ బొలఁతి విచారించుఁ: జేరి పూవులఁ బూజసేయు నబల
పంపక యటమున్న పరిచర్య లొనరించుఁ: దరిమిన చిత్తంబు తరగఁబట్టు
దేవర మనసు దాఁ దెఱఁగొప్ప వర్తించు: గడు నప్రమత్త యై కన్య మెలఁగు
తే. కాముతాపుల ధాటికిఁ గాక శంభు
నంటి యొక్కొక్క మాటొత్త నప్పళించుఁ
దెంపు సేయంగ వెఱచు న ద్దేవి యిట్లు
శివుని కెప్పుడు పరిచర్య సేయుచుండె
226-ఉ.
ప్రొద్దున వచ్చి నిచ్చలును బొల్పగు శీతశిలాతలంబునం
గ్రద్దన నిల్చియుండి కఱకంఠుఁడు యోగసమాధినిష్ఠ మైఁ
బెద్దయుఁ బ్రొద్దు నిల్చుటయుఁ బిమ్మట గౌరియు నిర్మలాత్మ యై
ప్రొద్దున వచ్చి వల్లభుని పూజలుసేయు ననేక భంగులన్.
227-క.
విడువక పూజలు సేయఁగ
నుడుగక యోగంబుమీఁద నుండఁగఁ దలఁపు
ల్పొడముటయ కాని కానం
బడ దెంతయు సంగమంబు పతికిన్ సతికిన్.
228-వ.
ఇ వ్విధంబున గొంతకాలంబు దేవి దేవరకుం బరిచ్రయలు సేయు చుండె నని చెప్పి"