వీరభద్ర విజయము/ద్వితీయాశ్వాసము/శంకరుఁడు వెలఁది యై శీతాచలంబునకు వచ్చుట

వికీసోర్స్ నుండి

శంకరుఁడు వెలఁది యై శీతాచలంబునకు వచ్చుట

166-ఆ.
గౌరిమీఁదఁ బ్రేమ కడు నంకురింపంగ
సమ్మదంబుతోడ సంభ్రమించి
అద్రిరాజు వీటి కరుగుదునో యని
తలఁచె దృఢము గాఁగ మలహరుండు.
167-వ.
ఇట్లు తలంచి.
168-క.
ఏ వెంట నరుగవచ్చును
యే వెంట లతాంగిఁ జూతు నిందువదనతో
నే వెంట మాటలాడుదు
నే వెంట మృగాక్షిఁ గదియ నెంతయు నొప్పున్.
169-వ.
అని విచారించి.
170-సీ.
కాకోదరాధీశ కంకణంబులు దాఁచిశంఖ కంకణములు చాలఁ దొడిగి;
సామజదనుజేంద్ర చర్మాంబరము దాఁచి కమనీయ కనకాంబరమును గట్టి;
గంగా నిశానాధ కలిత జూటము దాఁచి కుఱువెండ్రుకలు గల కొప్పువెట్టి;
పావకరాజిత ఫాలభాగము దాఁచి తిలకంబుతో ఫాల మలరుఁ జేసి;
ఆ. భూతి దాఁచి పసపు పూసి త్రిశూల హ
స్తంబు దాఁచి చేత సజ్జ యమర
వెలఁది మేనఁగల్గు వీరుఁడు వెలఁది యై
యెఱుక యెఱుక యనుచు నేఁగుదెంచె.
171-వ.
మఱియను.
172-సీ.
కడు నొప్పు దిశ లెల్ల గనకంబు గావించు తాటంకరోచులు దనరు చుండ
చనుదోయిపైఁ గ్రాలు శంఖహారవళి పయ్యెదలోపల బయలుదూఁగ
సందిట నిఱికిన సజ్జయ రమ్య మై రత్న పేటికభంగి రమణ మెఱయ
యన్నువ యగు మధ్య మల్లల నాడంగ నడుగిడ యానంబు తడబడంగ
ఆ. చిలుకపలుకు లొప్ప సేసముత్యము లొప్ప
నతివరూపు దనకు నచ్చుపడఁగ
మంచుకొండపురికి మలహరుఁ డేతెంచె
మింతులార! యెఱుక యెఱుక యనుచు.
173-వ.
ఇట్లు మాయా వేషధారి యై హిమవంతుఁ బట్టణంబున కరుగు దెంచి యందు.
174-క.
మహిలో జనములు వొగడఁగ
బహువిధముల నెఱుక చెప్పి ప్రౌఢతనమునం
దుహినగిరి కరిగి చేరువ
విహితంబుగ నెఱుక యనుచు వెలఁది చెలంగెన్.
175-ఉ.
చంచలనేత్రి గౌరి యొక సౌధముపై చెలిఁగూడి తా వినో
దించుచు నయ్యెలుంగు విని తేటపడంగ సఖీలలామతోఁ
బంచశరారిఁ గూడఁ గను భాగ్యము నాకు లభించు నట్లు గా
వించునొ చూత మీ యెఱుక వల్లభ నే నడుగంగఁ బోలునే.
176-వ.
అని విచారించి.
177-ఉ.
సమ్మదముం గుతూహలము సంభ్రమముం జనియింప న వ్వినో
దమ్ములు గౌరి మాని యొక తన్వి కరాబ్జము వట్టి తద్గవా
క్షమ్ముల వెంటఁ జూచి రభసంబునఁ జేరువ రాజవీధులం
గ్రుమ్మరు ప్రౌఢ నా యెఱుకఁ గోరికఁ గన్గొనియెన్ లతాంగి దాన్.
178-వ.
అట్లు గాంచి.
179-ఉ.
ఈ ముఖపంకజంబు రుచు లీ నయనోత్పలపత్ర నిర్మలం
బీ మెయిచాయ లీ నగవు లీ మురుపెంబులు నీ విలాసమున్
గామినులార! యెందు మఱి కల్గఁగ నేర్చునె తొల్లి బాపురే
సామజయాన యీ యెఱుకసానికిఁ దాఁ జెలుఁ వింత యొప్పునే.
180-క.
పిలువుఁడు ప్రౌఢ నిచటికిన్
గల సందేహముల నడుగఁగావలయు వెసన్
గలుగుట లేకుండుట నీ
వెలఁది గదా మన తలంపు వివరము సేయన్
181-వ.
అని మఱియు ని ట్లనియె.
182-క.
వాలాయము పిలిపింపుఁడు
నీలాలకలార! రండు నేరుపుతోడన్
శైలేంద్రుఁ డెఱుఁగకుండగ
నీ లలనామణిని గొనుచు నిచటికి వేగన్.
183-చ.
అనవుఁడు నెందఱేని గమలాక్షులు వేగమ పోయి వీధికిన్
జని “గిరిజాత యో యెఱుకసాని! నినుం బిలువంగఁ బంచె వే
పనివిను” మన్న సందియము వల్కుచు నేఁగిన గౌరి పంపునన్
గొనకొని కన్యకామణులు గొందఱు డగ్గఱ నేఁగి యి ట్లనున్.
184-మత్త.
“ఏల పోయెదు నిల్వవో ధరణీధ్రకన్యక పిల్వఁగాఁ
బోలునే యిటు ద్రోచిపోవఁగ బోకు మొక్కటి చెప్పెదన్
చాలు నంతయు నీవు కోరిన సంపదన్ గరుణించు నీ
కాలు నొవ్వఁగఁ బ్రోలిలోఁ దిరుగంగ నేటికిఁ జెప్పుమా.”
185-వ.
అనవుడు న క్కపట గామిని యి ట్లనియె.
186-ఉ.
“రాజగృహాంతరంబులను రాజతనూజ కెఱుంగఁ జెప్పఁగా
రాజును రాజసుందరియు రాజనిభాననలార! నన్ను నే
యోజఁ దలంతురో యనుచు నూరక పోయెదఁ గాక గౌరి నం
భోజదళేక్షణన్ గదియు పుణ్యము చాలదె వేయు నేటికిన్.”
187-వ.
అని మఱియు నరుగుదెంచు సమయంబున.
188-చ.
“వెఱవగ వద్దు నీకు నరవిందనిభానన! యేను బిల్వఁగా
వెఱవక రమ్ము నా తలఁపు వేగమె చెప్పిన మెచ్చు వెట్టెదన్
మఱియు నభీష్ట సంపదలు మానుఁగ నిచ్చెద నిశ్చలంబుమై
నెఱుకలసాని! ర” మ్మనుచు నెంతయుఁ బ్రేమ భవాని పిల్వగన్.
189-వ.
అరుగుదెంచి తదీయ హర్మ్యస్థానంబునకుం జని పార్వతీదేవిం గనుంగొని నిలిచి యున్న యనంతరంబ.