వీరభద్ర విజయము/దక్షుఁడు రజతగిరి కరుగుట
దక్షుఁడు రజతగిరి కరుగుట
[మార్చు]81-క.
ఘనుఁ డగు శంభుఁడు గొలు వయి
తనరుట విని మునులు గొలువ దక్షుఁడు వేగన్
జనియె రజతాద్రి శిఖరికిఁ
దనయంతనె యజనాధు దర్శింపంగన్.
82-క.
చని గిరిమందిరు సన్నిధి
వినయంబున నిల్చియున్న వేడుక నతఁడున్
మునులను సంభావించిన
యనువునఁ దనుఁ గారవించె నప్పుడు కరుణన్.
83-వ.
ఇ ట్లఖిల భువనాధీశ్వరుండు గారవించిన.
84-ఉ.
“అద్దిర శంకరుండు వినయంబున నా కెదు రేగుదెంచి నా
పెద్దతనం బెఱింగి తగఁ బెద్దఱికం బొకయించు కైనఁ దా
గ్రద్దనఁ జేయఁడయ్యె మఱి గౌరియు మన్నన సేయ దయ్యె నీ
పెద్దలు నవ్వ లాతిమునిబృందము చాడ్పునఁ జేసి రిమ్మెయిన్"
85-క
అని తన పాలిటి కర్మము
పెనఁగొని తనుఁ జుట్టుముట్టి ప్రేరేపంగాఁ
జెనఁటి యగు దక్షుఁ డప్పుడు
మనమున గోపంబు నొంది మలహరు విడిచెన్.
86-వ.
ఇట్లు దేవదేవుని మహత్వంబుఁ దెలియక వృధావైరంబున దక్షుం డటువాసి చనియె, నంత న మ్మహేశ్వరుఁ గొల్వవచ్చిన దేవేంద్రాది బృందారక సంఘంబులు పునః పునః ప్రణామంబు లాచరించి చనిరి తదనంతరంబ.
87-క.
అక్కడ దక్షుం డరుగుచుఁ
బొక్కుచు స్రుక్కుచును సిగ్గు వొందఁగఁ గోపం
బెక్కువ గా నంతంతటఁ
జిక్కుచుఁ దలపోతఁ నొంది చిత్తము గలఁగన్.
88-క.
“నాకులు వచ్చిన నిచటికి
నాకును రానేల నేఁడు నా కిందులకున్
రాకున్న నేమి కొఱఁ తగుఁ
బ్రాకటముగ ధిక్కరింపఁ బడితిం గాదే.
89-క.
దేవత లందఱుఁ దమ కొక
దేవతవలె నంచుఁ దన్ను దేవర యంచున్
వావిరిఁ గొలిచిన నా కీ
దేవర వల దనుచు మాఱు తెచ్చెద” ననుచున్.
90-ఆ.
జాలిఁబడుచు నలఁగి లోలోనఁ గుందుచుఁ
జిన్నవోయి మొగము జేవురింప
నింటి కరిగి యున్న నీక్షించి యి ట్లని
పలికె దక్షుఁ జూచి భార్య ప్రీతి.
91-క.
“మన యల్లుని మన బిడ్డను
గనుగొంటిరె మంగళంబె కరుణ న్వారే
మని మిమ్ము గారవించిరి
వినిపింపుఁడు వీనులలర వినియెద” ననినన్.
92-వ.
దక్షుం డి ట్లనియె.
93-మత్త.
“మాకు మామ గదా యితం డని మన్ననల్ దగఁ జేయఁ డే
లోకనాథుఁడ నంచు గర్వము లోలతం బడి యున్నవాఁ
డీ కతంబుల నేమి చెప్పుదు నింతిరో విను నాకునున్
నీకుఁ గూఁతురు నైన గౌరియు నిక్క మేమియుఁ బల్కదే.
94-మత్త
కాన నింకను దీనికిం బ్రతీకార మే నొనరించెదన్
బూని చేసెద మేటియఙ్ఞముఁ బూజ చేసెదఁ గేశవున్
మౌనులున్ వసువుల్ దిగీశులు మర్త్యు లుండఁగ నొప్పుఁగాఁ
మానినీ చనుదెంతు రిచ్చట మాటమాత్రనఁ బిల్చినన్.
95-మత్త.
పిలుతు దివ్యుల నందఱిన్ వెలిబెట్టు దిప్పుడు భర్గునిన్
వెలయ నిశ్చయ మిట్టి దంచును” వేదవేద్యు మహత్వమున్
దలఁ పగోచర మైనఁ దొట్టిన దామసంబునఁ బొంగి యా
ఖలుఁడు దక్షుఁడు పాపచక్షుఁడు కర్మదక్షుఁ డదక్షుఁడై.