Jump to content

వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/హిమవంతుపురంబు నలంకరించుట

వికీసోర్స్ నుండి


హిమవంతుపురంబు నలంకరించుట

112-ఉ.
భూరివిలాసుఁ డై త్రిదశపుంగవసంగతసంగుఁ డై జటా
భారసుధామరీచి మన పార్వతి వెండ్లికి వచ్చుచ్చున్న వాఁ
డారయ నీక్షణం బనుచు నందము గాఁ దన యున్న ప్రోలు శృం
గారము సేయఁ బంచె శుభకౌతుకచిత్రవిభూతి నొప్పఁగన్.
113-వ.
ఇట్లు పురంబు శృంగారంబు చేయం బంచిన.
114-క.
మణులను గనకంబుల ద
ర్పణముల నవ పల్లవముల బహువస్త్రములన్
బ్రణుతగతిని నెత్తిరి తో
రణములు పురవీధు లందు రచ్చల యందున్.
115-సీ.
మృగనాభిజలములు ముంగిళ్లఁ జల్లిరి
ముగ్గులు దీర్చిరి ముత్తియములఁ
దనర నంగళ్లఁ జిత్తరువులు వ్రాసిరి
హేమకుంభము లెత్తి రిండ్ల నెల్లఁ
బహుమార్గముల నంది పడగలు గట్టిరి
కీలించి కట్టరి మేలుకట్లు
కమనీయగతుల వాద్యములు మ్రోయించిరి
యెలమి శృంగారించి రెల్లచోట్లఁ
ఆ.
బరఁగ సకలలోకపతికి సమర్పింప
నాయితములు చేసి రఖిలమణులు
సర్వజనులు మిగుల సంపద నొందిరి
భూధరేంద్రుఁ డేలుపురమునందు.
116-వ.
మఱియు ననేకప్రకారంబుల నాదిమపురుషుఁ డగు విశ్వకర్మచే నిర్మితం బైన యోషధిప్రస్ధపురంబు శృంగారంబు చేయించి తన పర్వతంబునం గల బిలంబులు కొలంకులు పానుదేశంబులు నలంకరించె నగ్గిరీంద్రుం డంత.
117-సీ.
తారకాసురుచేతి దారుణకృత్యముల్
మానుగ నిటమీఁద మాను ననియుఁ
దారలదీధితి తలకొని మాయించు
టెంత యింతటఁ గరుణింతు ననిము
హరు పెండ్లి చూడ రండని మేరుగిరి చాటు
వారికీఁ జెప్పఁ బోవలయు ననియు
గౌరీవివాహలగ్నం బెల్లి ప్రొద్దునఁ
దిరిగి తూర్పునఁ బొడతెంతు ననియు
ఆ.
సంభ్రమించి పెండ్ల సాటించి యవ్వలి
దిక్కు మొగము చేసి తీవ్రగతుల
సకల జారిణీ వ్రజంబులు హర్షాబ్ధిఁ
గ్రుంకె నపరవార్ధిఁ గ్రుంకె నినుఁడు.
118-క.
కమలారి పనుపుగూఢ
క్రమమున జని వేగుచూచు కాలరులక్రియన్
గమలములరాజు గ్రుంకిన
క్రమమున నొక్కొక్క చుక్క గానంబడియెన్.
119-ఉ.
చీఁకటి గప్పె నాకసము జీఁకటి గప్పె దిగీభకుంభముల్
చీఁకటి గప్పె భూతలముఁ జీఁకటి గప్పెఁ జరాచరాదులన్
జీఁకటి గప్పె దంపతుల చిత్తపయోజవనాంతరంబులన్
జీఁకటి గప్పె లోకములు చీకులు సేయుచు నంతకంతకున్.
120-వ.
ఇట్లు నిబిడాంధకార బఁధుర పటలంబున నందంబులై భూతజాలంబు సుప్తంబునుం బొంది యున్న సమయంబున.
121-సీ.
రత్నాకరము ద్రచ్చ రాజుపుట్టెడువేళఁ
దొడఁగిన యమృతబిందువు లనంగ
కమలవైరిని రాహు గబళింప నంతంతఁ
దొరఁగు వెన్నెలరేని తునుక లనఁగ
నాకాశలక్ష్మి దా హరుని పెండ్లకి నిరు
కేలఁ బట్టిన సేసఁ బ్రా లనంగ
నిఖిలేశునకు బ్రహ్మ నీలాంబరమున మే
ల్కట్టు కట్టిన మౌక్తికంబు లనఁగ
ఆ.
వీధు లేర్పడంగ వెలుఁగు మెఱుంగుల
చిదుపలమరుభంగిఁ జెలువు మిగిలి
గగనవీధినుండి ఘనతర నిబిడాంధ
కారమనియఁ దారకంబు లొప్పె.