వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/చంద్రోదయ వర్ణనము

వికీసోర్స్ నుండి


చంద్రోదయ వర్ణనము

122-సీ.
మఱిఁగిన విరహుల మానంబు లెడలించి
యిరవైన చీఁకటియిండ్ల కనిపి
మఱిఁ గోకముల నెల్ల మఱువులుగాఁ దోలి
నీలోత్పలంబుల మేలుకొలిపి
వెలయఁ జకోరకావలికి విందులు వెట్టి
నీరజాతంబుల నిద్ర పుచ్చి
వనధుల నుబ్బించి వలరాజ నెగయించి
మందమారుతము కానంద మొసఁగి
ఆ.
తనదు తెలుపుచేతఁ దలకొని నిఖిలంబు
తెలుపుఁ గాఁగఁ దూర్పుదిక్కు నందుఁ
జల్లదలము చూపి జగము లన్నింటికి
మామ యనఁగఁ జందమామ వొడిచె.
123-వ.
మఱియుఁ దదీయసాంద్ర చంద్రికా వితానపట పరిభ్రమణ సంభ్రమణంబు నభినవ వితాన విరాజితం బై చకోర సముదయ సామ్రాజ్య వైభవంబై కుసుమశర భుజబలాతిశయాభిరామ హేతుభూతం బై విరహిణిజన నికర హృదయ విహ్వలీ కృతాకారం బై జగన్మోహనం బై యొప్పుచుండె నంతఁ గ్రమక్రమంబున.