వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/బ్రహ్మాదులు నమస్కరించి మన్మథుని వృత్తాంతముఁ దెల్పుట

వికీసోర్స్ నుండి


బ్రహ్మాదులు నమస్కరించి మన్మథుని వృత్తాంతముఁ దెల్పుట.

185-క.
దేవతలు మునులు బ్రహ్మయు
దేవేంద్రుఁడు గూఁడి మ్రొక్కి ధృతి నవనతులై
“ భావజసంహరణ! మహా
దేవా! యవధారు దేవదేవ! మహేశా!
186-సీ.
ఈశాన! మే మెల్ల యీ మంగళము చూడ
భావించి రప్పించి పంచబాణుఁ
బుత్తేరఁగా వచ్చె భూతేశ! మీ యెడ
నతఁడు భక్తుండు మీ యడుగులాన
కాము చేసిన తప్పు గౌరీశ! మమ్మును
మన్నించి సైరించి మానితముగఁ
గంతు నాకారంబు కఱకంఠ కృపచేసి
యి” మ్మని మ్రొక్కిన నీశ్వరుండు
ఆ.
భక్తవత్సలుండు పార్వతికన్నియ
మోము చూడఁ బుట్టె కాముఁ డంత
నాగధరుని పెండ్లి నాలుగు దినములు
ప్రీతితోడ నుండెఁ బెంపు మిగిలి.
187-వ.
అయ్యవసరంబున.
188-ఉ.
అమ్మరునాఁడు రేపు తుహినాచలనాథుఁడు కూతుఁ బార్వతిన్
రమ్మని చేరఁ బిల్చి నిను రాజకళాధరు కిచ్చినట్టి భా
గ్యమ్ము ఘట్టించె నంచుఁ బులకల్ మెయి నిండఁగ నంత బాష్పముల్
గ్రమ్మ శిరంబు మూర్కొనుచు గౌరతమై కురు లెల్ల దువ్వుచున్.