Jump to content

వీరభద్ర విజయము/చతుర్థాశ్వాసము/బ్రహ్మ వీరేశ్వరునకు రథము తెచ్చుట

వికీసోర్స్ నుండి


బ్రహ్మ వీరేశ్వరునకు రథము తెచ్చుట.

143-సీ.
లలిత నానాయుధాలంకార మగుదాని
గోరాజుపడగచేఁ గొమరుదాని
అనిల వేగములగు హరులు గట్టినదాని
నమరాద్రియునుబోలె నమరుదాని
దినపబింబముభంగిఁ దేజరిల్లెడుదాని
మహనీయకాంచనమణులదాని
దుందుభి ఘంటికా తూర్య ధ్వనులదాని
దృగ్గోచరంబు నై తోఁచుదాని
143-తే.
నొక్కరథము శంభుఁ డుగ్రతఁ బుత్తేరఁ
బద్మభవుఁడు వీరభద్రుకడకుఁ
దెచ్చి కేలుమొగిచి తివిరి యిట్లని విన్న
వించె భక్తితోడ వెఱవుమెఱయ.
144-శా.
“ ఓ! వీరాగ్రణి! యా తపోవనములో నున్నాఁడు శంభుండు యా
దేవిం దాను సురవ్రజంబు గెలువన్ దేరిప్డు పుత్తెంచె రా
జీవాక్షుండును వీఁడె కయ్యమునకుం జేరెన్ రథారూఢుఁడై
వేవేగన్ రిపు గెల్తు గాక కడిమిం వీరప్రతాపాంబుధీ!
145-ఉ.
రాజధరుండు తొల్లి ద్రిపురంబులపైఁ జనునాఁడు వేదముల్
వాజిగణంబు లై పఱవ వారక రొప్పుటఁ జేసి దైత్యు ఘో
రాజిని గెల్చె నీశ్వరుఁడు రమ్యత నీకును నేఁడు దేరికిన్
వాజులు రొప్పెడిం గడిమి వైరుల గెల్వుము వీరవారిధీ!
146-వ.
దేవా! యీ దివ్యరథారూఢుండ వై సమరకేళీవిహారంబు సలుపుదువు గాక” యని విన్నవించిన “నగుం గాక” యని యుదయ ధరణీధర శిఖరంబు ప్రవేశించు దినరాజు చందంబునఁ దన మనోరథంబునకు హితమైన దివ్యరథం బెక్కి యుక్కుమిగిలి గుణయూథంబు లిరుగెలంకుల యందును నందంద వీరభేరీ మృదంగ శంఖ కాహళ నిస్సాణాది వాద్యంబులు చెలంగ నిలింపశ్రేష్ఠుం డగు పరమేష్ఠి దనకు సారథియై చరియింప నకంపిత విక్రముం డై ప్రళయకాల భైరవుండునుం బోలె సింహనాదంబులు సేయుచు దేవగణంబుల మనంబులు వ్రయ్యలై పగులునట్లుగా శంఖంబు వూరించి కుంభినీధరంబుపైఁ గవయు దంభోళిధరుని చందం బై పురందర గోవిందాదులం గదిసి వీరభద్రేశ్వరుండు.
147-ఉ.
తన్ననిలోనఁ దాఁకి ఘనదారుణబాణము వేయు వెన్నునిం
గన్నుల నిప్పు లొల్కఁ గని గర్జితసింహకరాళమూర్తి యై
యెన్నఁగ నొక్కవింట వడి నెక్కడి టంకృతి చేసి బాణముల్
పన్నగశాయిపైఁ బఱపె భాసురసంగరకేళి నొప్పుచున్.
148-ఉ.
గ్రక్కున విష్ణుఁడుం గదిసి కయ్యమునన్వెనువెంట నార్చుచున్
బెక్కుశరావళుల్ దొడిఁగి బింకముతో గణనాథు నేనెఁ బెం
వెక్కి గణాధినాయకుఁడు నేసెను వెన్నుని నంత లోపలన్
జిక్కినలావుతో మెఱసి శ్రీపతి నేసిన నేనె వెండియున్.
149-మ.
హరి మున్నేసిన కోపమంది వితతాహంకారుఁ డై బాణముల్
పొరి సంధించి లలాట మేనె నతనిన్ బుంఖానుపుంఖంబులై
దొరఁగన్ దీవ్రత నేనె నేనె హరియుం దోర్దండ శౌర్యోన్నతిన్
బెరయన్ భద్రుభుజంబు బాణమున నొప్పించెం సురల్ పొంగఁగన్.
150-వ.
అంత.
151-క.
వీరావేశముతోడను
బోరున రుద్రుండు విష్ణుభుజములు గాఁడన్
ఘోరశరంబులఁ బఱపిన
బీరంబులు మాని దేవబృందము స్రుక్కెన్.
152-వ.
మఱియు నయ్యవసరంబున జగంబులఁ బెన్నుద్దులైన బలుమింటి జోదు లిద్దరు నొండొరులం గైకొనక గెలుపు తలంపులు గైకొని మదంబునఁ దమతమ లాఘవంబుల మెచ్చక మత్సరంబులు రెట్టించి బెట్టిదంబు లగు పంతంబులు పలుకుచు; నగణితగుణఘోషంబుల దిగంతరాళంబులు దిగులు కొలుపుచు గుడుసువడి యుండఁ; గోదండంబులఁ దెగటార్చుచు సుర సిద్ధ సాధ్య సంఘాతంబులకు భయంబు బుట్టించుచు; మహితమార్గంబు నిండ నభోమండలంబున మంట లెగయించుచు మర్మంబులు గాఁడిపార ననేకదివ్యబాణంబులు పఱపుచు సంహరించుచు నన్యోన్య శరీరజాలంబులు తుత్తుమురు సేయుచు నిప్పునిప్పును గరిఁగరియును ధరణిధరణియును మహార్ణవము మహార్ణ వంబును గిరీంద్రము గిరీంద్రంబును బ్రహ్మాండము బ్రహ్మాండంబునుం దాఁకి తనివి చనక పోరాడు చందంబున సములై యసమాన రణవిహారంబులు సలుపుచు; కాలసర్పంబులుం బోలె మ్రోగుచు కంఠీరవంబులుం బోలె గర్జించుచు జలధరంబులుంబోలె శరజాలంబుల భూమండలంబుఁ గప్పుచు కాలరుద్రులుంబోలె నడరుచు; ధారధరంబులుంబోలెఁ గప్పుచుఁ; దారౌటఁ దెలుపుచుఁ; బరస్పరభల్లభగ్నాంగు లై మూర్ఛిల్గుచుఁ; దెలియుచు; సింహనాదంబులు సేయుచు; బిట్టల్క నట్టహాసంబు సేయుచు; నార్చుచు; నిజపాయకంబుల నభోభాగ భూభాగంబులు వెల్లి విఱియించుచు; నజాండభరితంబు లగు హుంకారంబు లొనరించుచుఁ; దుహినదహనవరుణాంధకార గంధవాహంబు లనంగల ఘోరశరంబులు ప్రయోగించుచు; నిరువురుఁ గరలాఘవంబులఁ బరిభ్రమించుచుఁ; బుంఖానుపుంఖంబుగా వేయుచు నదల్చుచు; నతిభయంకరంబుగా సంగరంబు సేయుచుండి రయ్యవసరంబున.
153-క.
నలి నంపకయ్య మప్పుడు
సొలయక బలుమేటివింటిజోదులు వెలుచన్
సలుపఁగ నెచ్చెలువమునకు
వెలయగఁ బెల్లార్చిరపుడు వేలుపు లెల్లన్.
154-క.
దేవత లార్పులు పొడఁగని
వావిరిఁ గోపించి కడఁగి వాఁడిశరంబుల్
వేవేగ భద్రుఁ డేసిన
నావిష్ణుని యురము గాఁడి యవనిం బడియెన్.
155-మ.
పడియున్ వేగమె తేరి శౌరి పఱుపన్ బాణంబు లెన్నేనియున్
నడుమం ద్రుంచె గణాధిపుండు కడఁకన్నారాయణాస్త్రంబుఁ దాఁ
గడిమిన్ మాధవుఁ డేసె నేయుటయు వేగన్ వీరభద్రాస్త్రమున్
వెడలించెన్ వడిఁ ద్రుంచి వైచెఁ బొడిగా వీరుండు దద్బాణమున్.
156-మ.
మఱియుం భద్రుఁడు తీవ్రబాణతతులన్ మానాథుకోదండమున్
విఱిచన్ దార్క్ష్యుని ఱెక్కలన్ దునిమినన్ విష్ణుండు రోషించి య
త్తఱి నత్యుగ్రుల శంఖచక్రధరులన్ దర్పాఢ్యులన్ వీఁకఁ గొం
దఱఁ బుట్టించె దహించె వారి శిఖనేత్ర జ్వాలలన్ భద్రుఁడున్.
157-స.
అయ్యవసరంబున.
158-క.
ఆహవమున నిజచక్రము
బాహాటోపమున భద్రుపై నటువైవన్
సాహసమున భద్రుండును
ఆహా యెట వైచె దింక ననవుడు భీతిన్.
159-ఉ.
ఏపున నేయఁగా వెఱచి యెత్తిన చక్రముతోడ భీతి ల
క్ష్మీపతి సింహమున్గదిసి చిక్కిన యేనుఁగుఁ బోలె నేలపైఁ
జూపులు చేర్చి చేడ్పడినఁ జూచి దిగీంద్రులు డాయకుండఁగాఁ
గోపము నొంది భద్రుఁడును క్రూరశరంబుల నేసె నుగ్రుఁడై.
160-వ.
మఱియు నయ్యవసరంబున నిర్వికారనిశ్చేతనుండై విరథుండై యున్న మాధవుం జూచి యవ్వీరుండు తన బాణజాలంబుల నతిని ప్రాణంబులు గొన సమకట్టి, యీశ్వరప్రియుం డని మనంబునం దలంచి, ప్రమథగణంబులచేత నచ్చక్రంబు నులిమి తెప్పించి తదనంతరంబ.