వాసిష్ఠరామాయణము (ద్విపద)/చతుర్థప్రకరణము

వికీసోర్స్ నుండి

202

వాసిష్ఠరామాయణము

చతుర్థప్రకరణము


శ్రీతారకోల్లాస! - శేషాద్రివాస!
శ్రీతరిగొండ నృ - సింహ! ధూతాంహ!

విన్నవించెద నిదీ - వినుము వాల్మీకీ
నన్నసైగల నువ - శమనక్రమంబు

తనియఁ జెప్పఁగ, భర - ద్వాజుండు మరల
ననియె ని ట్లని 'యో మ - హా గురుదేవ!

చిరకృప నమ్మౌని - శ్రీరాఘవునకు
మఱి యేమి చెప్పె స - మ్మతముగా?' ననుచు

నడర భరద్వాజుఁ - డాసక్త్‌ నవల
నడుగ, వాల్మీకి యి - ట్లనె 'నోకుమార!10

శ్రీరఘుపతిని వ - సిష్ఠుఁడీక్షించి,
యారూఢకరుణ ని - ట్లనియె నోరామ!

వెలయ వేఁజెప్పిన - వివిధార్థములకు
వలనైన ఫలము జీ - వన్ముక్తి యగును,

నమరు దేహంబులం - దహమిక ద్యశ్య
సమితి యా త్మనుచును - జపలాకరముగ

నెందాఁకఁ ద్రవ్యాళి - నెనసి వర్తింపు
నందాఁకఁ జిత్తంబు - నందు విభ్రాంతి

తఱచగు చుండు, నం - తర్ముఖుం డగుచు,
మురువు చూపెడి జగం - బులను జిదగ్ని20

యందె తృణములట్ల - నాహుతిచేసి,
సందేహ ముక్తుఁడై - శాంతాత్ముఁ, డగుచుఁ!

బట్టుగాఁ దను దాను - భావింపుచుండి,
నట్టి సంయమిచిత్త-మందు విభ్రాంతి

కలుగ దెన్నటి' కన్నఁ - గాకుత్ స్థతిలకుఁ
డలరి వసిష్ఠ సం-యమి కిట్టు లనియె:

సద్గురువర్య! మీ - సత్కటాక్షమునఁ
జిద్గగనానంద - సీమలోఁ జేరి,

వసుధపై నేను జీ-వస్ముక్తి పదము
పసమీఱ బొందితిఁ; - బ్రాణధారణము 30

సేయు నుపాయంబుఁ - జెప్పవే!' యనిన
నా యతీశ్వరుఁ డిట్టు - లనియె' నో రామ!

వినుము చెప్పెదను నది - విశదంబు గాఁగ
ననిలధారణ మంచు - నన్నది యొకటి,

ఘనతరజ్ఞాన యో-గం బన నొకటి
యనువొందఁగాఁ గల వని మున్ను నీకు

బోధించియుంటి, ని-ప్పుడు నేను మరల
నా ధారణాయోగ -మమరఁ జెప్పెదను

తడఁబడు దేహశో ధనఁ జేసి మలము
కడిగి, రేచక, పూర-కములు, కుంభకము 40

గావింపుచునికి యో-గంబగు, సాత్మ
నేవేళ భావించి - యెఱుకకు నెఱుక

గాను దలంచి య-క్కడ సుఖించినదె
జ్ఞాన యోగంబగు; - శంభుండు మున్ను

అనిలధారణ చేయు - టతికష్ట మనుచు
ఘనమనో ధారణా • క్రమమున సిద్ధి

గలుగుటన్ జ్ఞానయో-గము సూక్ష్మముగను
విలసిత సూక్తుల - విరచించి యుంచె;;

తగునధికారి భే-దముల నారెండు
నగు యోగముల ధన్యు - లభ్యసింపుదురు; 50

అనిలధారణ చేయు-నపుడు లక్ష్యమున
మన మొప్ప నిలిచి సమ్మతిఁ బొందుచుండుఁ,

దలకొని ఘనమనో-ధారణ చేయ
నలరి మనముతోడ - ననిలంబు నిలుచు;

వాయుధారణ సేయు-వానికి ధరణి
నాయువు బహువృద్ధి - యగుచుండుఁ దొలుత

సాధించునపుడు క-ష్టం బగుఁగాన,
భూధవ! నీకు నే-ర్పుగను విజ్ఞాన

యోగంబుఁ జెప్పితి: - యుక్తితో దీని
బాగొప్ప సాధించి - పరమాత్మ వగుము. 60

రహిమీఱఁ బ్రాణధా-రణఁ జేయువారి
మహిమంబుఁ జెప్పెద - మది నిల్పి వినుము!

* భుశుండోపాఖ్యానము *



పాలుపొందు మేరువు - భూరిశృంగమునఁ
గళగల పద్మరా-గపుఝరీం గల్ప

తరు వొప్పుచుండు వి-స్తారమై, యందుఁ
గరమొప్ప దక్షిణ - స్కంధమధ్యమున

గురుతరంబుగ నొక్క - కోటర ముండు;
నిరవొంద దానిలో - హేమవల్లరులఁ

జాపట్టు నింట భు-శుండుఁ డన్ ఘనుఁడు
తాపస శ్రేష్ఠుండు, - త త్త్యార్థ విదుఁడు, 70

వీతరాగుఁడు, కాల-వేది, శ్రీమంతుఁ,
డాతత విశ్రాంతుఁ, - డధిక శాంతుండు,

ఆయువుగల పుణ్యు.. - డనఘవర్తనుఁడు
వాయస శ్రేష్ఠుండు - వసియించి యుండు.

అతనిఁ జూచుటకు నే - నరుగఁగా, నెదుట
నతిశయ్య వృక్షమం - దల్లి దట్టముగఁ

దెఱఁగొప్ప బంగారు - తీఁగెల కొనల
సరసంబులైన పు-ష్ప ఫలంబులందుఁ

గలకల ధ్వనులతోఁ - గలసి క్రీడించు
లలిత విహంగ జా-లములఁ జూచుచును, 80

అలఘు సహస్ర ద-శాబ్దనాళములఁ
జెలరేఁగి మెక్కుచుఁ - జిందు ద్రొక్కుచును,

వనజాతభవునకు - వాహనం బగుచుఁ
దనరారుహంస సం-తతులఁ జూచుచును,

నటుచనఁ జన నంజ-నాద్రి సమాన
వటుతర దేహంబు, - పక్షయుగంబు,

ఘనతీవ్రతుండంబు - గలి, గిరువంక
లను వృద్ధకాక జా-లంబులు గొలువ,

నచట సుఖాసీనుఁ-డైన భుశుండు
నచలాత్ము నీక్షించి - యంచుకుఁ బోయి 90

నిలిచిన, ననుఁజూచి - నెనరుతో లేచి,
నలువొప్ప విహితాస-నమున న న్నుంచి,

యుచితవృత్తిని నిల్చి-యుండగా, నట్టి
యచలితాత్మునిఁ గాంచి - యచటఁ గూర్చుండ

నియమించి, యాఘను - నెమ్మోముఁ జూచి,
దయపుట్ట వాయసో-త్తమున కిట్లంటి;

ఓ కాకపుంగవ! - యోపుణ్యచరిత!
యేకాలమందు నీ - విలను బుట్టితివి?

నీకుఁ దత్త్వజ్ఞాన - నిష్ఠ యె ట్లబ్బె?
నీ కాయు వెంతయ్య - నెఱి నేటివఱకు? 100

నీ కాంచనాద్రి యం-దిర వెవ్వఁ డిచ్చె?
నే కార్యములను నీ - వెఱిఁగి యుండుదువు?

ఆ కథ లెల్ల నీ - వరమర విడిచి
నాకుఁ దెల్పు' మటన్న-నగి' భుశుండుండు

పలికె నిట్లని 'ముని - ప్రవర! నా చంద
మెలమి నెట్లనిన మీ - కెఱిఁగింతు వినుడు!

అల పూర్వకాల మం-దంబికావిభుని
విలసితోత్సవము సే-వించు వేడుకలఁ

గర మొప్పుచుండెడి - కైలాసగిరికి
సరసమానసలైన - సప్తమాతృకలు 110

మనము లుప్పొంగఁగా - మచ్చికల్ మీఱఁ
జను మార్గమున సర-స్వతివాహ మగుచుఁ

బొలుచు హంసికకునుఁ - బొరి నలంబుసకు
నలరార వాహనం - బగు కాకమునకుఁ

బుట్టితి, పుట్టిన-ప్పుడె నన్నుఁ జూచి,
పటైన కరుణ నా - భారతీదేవి

యిట్టి బ్రహ్మజ్ఞాన - మిచ్చి రక్షించె;
నట్టికాలంబునం- దలరి మాతండ్రి

యీ కొటరమున న-న్నిరవుగా నుంచె;
నాకాలమున నుండి - యమర నిచ్చోట 120

నిలిచి యుండంగ న-నేక కల్పాంత
ములు, బహుమను కాల-ములు పోయె' ననిన

విని యిట్టు లంటి నే - వెఱఁగొంది యంత
'మునులు, యోగులువైన - మొనసి కల్పాంత

సమయంబులం దుండ - శక్తులుగారు,
విమలాత్మ! యెట్లు జీవించితి వీవు

అనిన భుశుంఠుఁ డిట్లనియె మునీంద్ర!
జననుతచరిత! యీశ్వరశాసనంబు

గడవ నెవ్వరికి శ-క్యముగాదు గనుకఁ
గడనుఁ గల్పాంతర -కాలంబులందుఁ 130

బొలుచు పృథివ్యాది - భూతజాలముల
నలఘురుద్రుండు ల-యముఁ జేసినపుడు

అతులిత తేజోమ-యంబైన భూత
వితతియం దేను ప్ర-వేశించి, యవల

మొనసి యాయారూప-ములను ధరించి,
యొనర నానందింపు - చుందు నెమ్మదిని'

ననిన నే నప్పు డి-ఒంటి భుశుండ!
వీను నీవు పరతత్త్వ • విదుఁడవు గాన

ఆ విలయంబులం-దణఁగి పోకుండి
యేవేవి చూచితి? - వెఱంగిపు' మనిన 140

సురుచిరాత్మకుఁ డా భు- శుండుఁ డిట్లనియె:
వరమునివర్య! త-ద్వార్తలు వినుము!

అరయఁగాఁ బెక్కేఁడు - లవనీతలంబు
నరశూన్యమై యుండె - నానాముఖముల,

మురు వొప్ప వన శైల-ములు భస్మమయ్యె,
నరుదుగా సూర్య చం-ద్రాగ్ను లణంగె.

మూఁడు లోకములను - ముంచెఁ దోయంబు,
క్రోడమై హరి మహా - క్రూరుఁ డైనట్టి

హేమాక్షు నణఁగించి - యిల నుద్ధరించె,
నీ మహామహిమంబు - నేను బాల్యమున 150

గనుఁగొనుచుంటిఁద-క్కక, యిదిగాక
గొనకొని మున్నేడ-గురు వసిష్ఠులను,

చెలువొప్ప నేను వీక్షింపుచుండితిని,
సొలయ కష్టమ పసి-ష్ఠుఁడవైన నిన్నుఁ

గనుగొంటినొకమాఱు - గగనంబునందుఁ,
బనిఁబూని యొకమాఱు - పవనంబు నందు,

ననువొంద నొక్క మా -ఱనలంబు నందు
నొనరంగ నొక్కమా-ఱుదకంబు నందు,

నొకమాఱు ధరణియం.- దొకమాఱు మఱియుఁ
బ్రకటమై తగు మహా - పర్వతమందు. 160

మొనన్ మహత్తత్త్వ - మున నొకమాఱు,
ననఘాత్ముఁడగు బ్రహ్మ - యం దొకమాఱు,

నురుతరప్రజ్ఞతో - సుద్భవం బొంది,
చరియింపుచుందువు - సకలలోకముల,

నరయ నీ జన్మంబు - లద్భుతలీల,
లరు దవి యటు లుండె, - నవిగాక నేను

అల చక్రి నూఱు బు-ద్ధావతారములు,
నలరార నూఱు క-ల్క్యవతారములును

ధరియించినవి గంటి, - ధ్వర నిదిగాక
తెరలి ముప్పదిమార్లు - త్రిపురముల్ గూలె, 170

దక్షమహాధ్వర - ద్వంసం బణంగె,
నక్షరకలిత వే-దావళు లరిగె,

బహుశాస్త్ర వితతులు, - బహుపురాణములు,
బహుళేతిహాసముల్ - పరువడి నేఁగె,

నలువొప్ప రామాయ-ణములు పె క్కరిగె,
సలలిత మోక్ష శా-స్త్రములగు గ్రంథ

లక్షలు నుదయించె, - లలిని వాల్మీకి
శిక్షచే, నితరుల - శిక్షచే, వ్యాస

మౌనిచే ఘనులైన - మనుజులచేతఁ
బూని రామాయణం - బులు, భారతాది 180

వరకథ లుదయించె - వసుమతి మీఁదఁ,
దరమిడి రామావ-తారంబు లెన్నఁ

బరఁగ భవిష్యదు-ద్భవముతోఁ గూడ
నరయఁ బండ్రెం డయ్యె, - నదియునుఁగాక

యిరవొంద శ్రీ విష్ణు! - డింక మీఁదటను
ధరియింపఁదగు నవ- తారంబుతోడ

రహినిఁ గృష్ణావతా-రములు పదాఱు
సహజంబుగా నగు - సంయమి శ్రేష్ఠ!

ఇట్టి జగద్భ్రాంతి - కేనాఁటి కవధి
పుట్ట, దేనేమి చె-ప్పుదు నింకమీఁద? 190

నీ వడిగిన వెల్ల - నిశ్చయంబుగను
నే వినిపించితి, - నీ వింక నేమి

వినవలతు?' వటన్న - విశ్వాస మొదవ
నొనర నే నీ ట్లంటి - 'నో వాయ సేంద్ర!

'పరఁగఁ బుట్టుచు గిట్టు - ప్రాణు లేరీతిఁ
జిరజీవు లగుదురు? - చెప్పవే! తెలియ'

నన వాయ సేంద్రుఁ డి-ట్లనె 'మునినాథ!
వినుము చెప్పెద నిది - విశదంబుగాను,

అరయఁగా దోషంబు - లను మౌక్తికముల,
నఱిముఱి వాసన- లను తంతువులను 200

వరుసగాఁ గూర్చి, య-వ్వలఁ గూర్చుసరణి
మఱచి యూరక - యున్న మదిగలవాని

బట్టదు మృత్యు వే - పట్టుననైన,
నట్టి చందం బెట్టు? - లనినఁ జెప్పెదను.

వినుము పావనమును, - విమలం బనేక
మును, చిన్మయము, సౌ-ఖ్యమును నైన పరమ

పదమునం దెవ్వని - భావనచేతఁ
గుదిరి చిత్తము గరం-గుచు నుండు, నట్టి

వాని నమ్మృత్యు దే-వత పట్ట వెఱచుఁ,
బూనిన సంసార - భోగవిచార

కర్మమూలములైన - కామాదిరిపుల
మర్మముల్ గని, వాని - మర్ధించి విడిచి,

తనువులోఁ బ్రాణ చిం-తనఁ జేయుచున్న
ఘనుల మృత్యువు పట్టఁ-గా నోడి యుఱుకు,

మొనసిన బహుదుఃఖ-ములను హరించు
తనప్రాణ చింతనే - తనసఖి యగుచు

నానంద మొందించు - నటువంటి సరణి
నేను చెప్పేద నది - నెలవుగా వినుము!

పాదుగా నుండెడి - ప్రాణంబు వెలిని
ద్వాదశాంగుళులంత - తరలి యడంగు, 220

నిదె రేచకంబగు - నిదె నిశ్చలతను
గదియ బహిః కుంభ-కం బగుచుండు,

నదియె క్రమ్మఱ హృద-యంబులోఁ జొచ్చి,
కదలకుండినఁ బూర-కంబగు నదియె.

ఘనతరాంతర కుంభ- కత్వంబు నొంది,
తనియని భంగి వాం - తర్యమం దనిల

చింతనం బది ప్రాణ - చింతనం బగుచు
సంతోషకరమగు - సహజంబుగాను,

నిందె చలింపక - యెవ్వరు నిలిచి
యుందురో వారు మ- హోన్నతు లగుచు

నతిశయశుద్ధ బు-ద్ధాత్మ లభిన్న
మతులై యెఱుక గల్గి - మనియుందు రిలను, 230

గన బహిరంతర్ము - ఖములందుఁ బ్రాణ
మునునై, యపానంబు - మొనసి వర్తించు,

నట్టి రెంటినిఁ గూర్ప - నా రెంటినడుమ
నెట్టనఁ జిత్తంబు - నిలిచియుండినదె

గుఱియైన కేవల - కుంభకం బనుచు
వరయోగు లగువారు - వచియింతు రిలను,

మఱియుఁ బ్రాణము పొద-మక యపానంబు
నఱిముఱి నణఁగంగ - నపు డెద్ది ప్రబలి

సత్తుగా నిలుచుఁ దద్ - జాసస్వరూప
ముత్తమోత్తమముగా - నూహించి, దాని 240

యం దైక్యమై, నిశ్చ-లానందపదము
నొంది, యందుఁ జలింప-కుండు మనంబు.

అట్టి ప్రాణసమాధి - యం దంటి, సతత
మట్టిట్టు చనక చి-దాకాశమందె

శాంతిచేఁ జిత్త వి-శ్రాంతినిఁ బొంది,
యాంతర్యసౌఖ్యంబు - ననుభవింపుచును

వసుధ భూతము, భావి - వర్తమానముల
విసువక కర్తనై - వీక్షింపుచుందు;

నలఘు సుఖంబులం - దాపదలందుఁ
గలుగు సౌఖ్యమును దు:-ఖమును బొందకను 250

సరవి నెన్నఁగ సర్వ - సముఁడనై మఱియు
వరసత్వభావభా-వనుఁడనై యెపుడు

చిరజీవినై ప్రకా శించి యిం దుందుఁ
బరమ మునీంద్ర! నా - బ్రతు కిట్టి దనిన

విని భుశుండునిఁ జూచి - 'విమలాత్మ! నీవు
ఘనకాలవేదవి - గాంభీర్యమతివి

పరతత్త్వరతుఁడవు - పావనాత్ముఁడవు
నిరతసంతోషివి - నీ చరిత్రములఁ

దలపోయ నతివిచి-త్రములు గావునను,
సలలిత విశ్వభూ-షణముగా నమరి, 260

తనివి, బొందుచు సదా-త్మసుఖాతిశయము
ననుభవింపుచు నుండు-మయ్య! నీ వీచట'

ననుచు వాయసయోగి - నచ్చట వీడు
కొని నేను వచ్చితిఁ - గుతలంబునందు

నానందముగ భుశుం - డాఖ్యాన మెవరు
పూని విన్నను వారు - భూరిచిత్పదము

నందుఁ బొందుట కర్హు-లగుచు జీవింతు,
రిందుకు సందియం - బించుక లేదు.

అలభుశుండునివలె - ననిలధారణము
చెలఁగి చేసినఁ జిరం-జీవు లయ్యెదరు. 270

మే నుండు యోగమున్ - మెచ్చక కొంద
ఱానందకరమగు - నట్టి విజ్ఞాన

యోగసాధనముఁ జే-యుదు, రందువలన
రాగదోషములు దూ-రము లగుఁ గానఁ,

గాయంబుపై నాశ - గలుగ, దందులను
వాయుధారణఁ - జేసి వసుధ జీవింప

నాస కొందఱు ప్రాజ్ఞు-లదియేల? యనినఁ
గాసెల వచ్చి యె-క్కడనైన నరుఁడు

అలసి నిద్రించి లిం-గాంగంబుతోడఁ
గలలను జెంది సు-ఖంబు, దుఃఖంబు 280

బొరిఁ బొరి ననుభవిం-పుచు దిశలందుఁ
జరియించు, నొకదిక్కు - శాశ్వతంబుగను

నిలువలేఁ,డాజీవు-నికి సంస్మరణము
దలఁప మనోభ్రాంతి - దము, మది దీర్ఘ

రమణమై తగుచిత్త - రాజ్యం బటంచు
నమర భావించు మీ - వంతరంగమున,

నిలలోన నీ స్థూల - మిరవుగా నుండ
వలె నంచు మదిలోన - వాంఛింపనేల?

జనియించువా రెల్లఁ - జచ్చుట నిజము,
కనుకఁ జచ్చుటకు దుః-ఖము నొందవలెనె? 290

అల రాగదోషంబు - లనెడి భుజంగ
ములు మనోబిలములో - మొనసి వసించి

కలచఁగా, మోక్షమా-ర్గంబు చొప్పడక
చలియింపుచుందురు - చాల మానవులు.

సరసులై సకలశా-స్త్రంబులు చదివి,
సరవిని రాగరో-షముల నణంపఁ

జాలని వాఁడు సు-స్వాదు వస్తువుల
నోలి మోయుచు గంధ - మూహింపలేని

ఖర మనఁదగు, వానిఁ - గాల్పనే తండ్రి!
అరయఁగా నటుగాన - నతిభయదంబు 300

ఘన ధైర్యఘాతి, మం-గళ రహితంబు
ననఁబడు హృత్పిశా-చావేశ మణఁచి,

యేనాఁడు చెడక య - హీనమౌ చిన్మ
యానందమునఁ బొందు - మయ్య! శ్రీరామ!

వాయసేంద్రునివలె - వాయుధారణముఁ
జేయుట విజ్ఞాన - సిద్ధియౌ టరుదు,

కావున నిర్వాణ - గతి నీయఁదగిన
దేవతార్చన రీతిఁ - దెల్పెద వినుము!'

అని యావసిష్ఠ సం-యమి రాఘవునకు
వినిపించి, క్రమ్మఱ - వేడ్క ని ట్లనియె: 310

* శివపూజోపాఖ్యానము *



'అనఘ1 గంగాతీర - మందు నేఁ జేరి,
యనలాంబకుని భక్తి - నాత్మ నర్చించి,

కనువిచ్చి చూడ శం-కరుఁడు సాముంద
రనె నిల్చియుండె, నా - రాజశేఖరునిఁ

బ్రత్యక్షముగఁ - జూచి, ప్రాంజలి నగుచు,
నత్యంత భక్తి ని-ట్లంటి 'నో దేవ!

హర! మంగళప్రద, - మజ్ఞానదోష
హరణ మైనట్టి దే-వార్చన సరణిఁ

దెలుపు' మన్నను మహా" దేవుఁ డిట్లనియె;
విలసితయుక్తిచే - విను మోమునీంద్ర! 320

కలిగిన హరిహరుల్ - గారు దేవతలు,
తెలిసి చూచినఁ జిత్త-దేహరూపులును

గా, రకృత్రిమము, న-ఖండ, మద్వయము
నై రమ్యమగు వస్తు-వగు తొలివేల్పు,

ఆకాశమునఁ బుట్టి - నట్టి భూతము ల
నేకముల్ గాఁగ నం-దే యకల్పితము

గాక, యంతట సదా - ఖండమైనట్టి
శ్రీకర చిత్సత్త - శివుఁ డన నొప్పు:

నామూల మెఱుఁగక - యజ్ఞానులైన
పామరులాకార - భావపూజలను 330

అరసి చేయుచు నుందు - రామడదూర
మరుగంగ లేక యా - ఱామడపోయి

నిలిచి, యావలఁ జన - నేరనివాని
వలె ఘనభక్తి భావను-లయ్యు, మరల

నపరిమితపరాత్ము - నరయ నోపకను
చపలులై దారు పా-షాణాది వివిధ

రూపపూజలు చేతు-రు ధరిత్రి మనుజు,
లా పరబ్రహ్మంబు - నాత్మ భావించి

తెలియ; రా బ్రహ్మమం- దే సర్వభూత
ములు బుద్బుదములు స-ముద్రంబులోను 340

గలిగి యణంగిన - కరణి రూపములు
చెలఁగి పుట్టు నణఁగుఁ - జిద్వస్తునందె,

గానఁ దద్వస్తు వా-కారంబు గాదు:
లేని రూపములు గల్గిన రీతిఁ దోఁచు,

నరయ ననంత కల్పాంతరతతులు
తెరలి యా వస్తువం-దే లయ మొందు;

నంతటఁ జిత్సత్త - నర్చించుటకును
శాంతిబోధయు, సర్వ - సమత పుష్పములు

గా సమర్పించి, య - ఖండభావనను
వాసిగా నర్చించ- వలె నంతెగాని, 350

యాకార పూజ లా-త్మార్చనం బగునె?
ప్రాకటంబుగఁ బరా - త్పరము, నద్వయము,

ననుపమంబు, నబాహ్య, - మమల, మచ్యుతము
ననఘ, మఖండంబు, - నానంద మొందు.

రహిని బాహ్యయు నాంత- ర యనంగఁ బూజ
విహితంబుగా రెండు - విధములై యుండు,

నిందు బాహ్యార్చనం - బెట్ల నటన్న
నందెన్న సర్వ భా-వాంతరస్థయును

శమితకళయు సద - సత్తు లనంగ
నమరు సామాన్యస-తైనసంవృత్తి 360

సత్తయొక్కటి మహా-సత్త్వ భావంబు
నత్తఱిఁ బొంది తా-నయ్యె దేవుండు,

మౌనీంద్ర! బహుశక్తి - మయుఁ డయ్యె నతఁడు
గానఁ దచ్ఛక్తి త-క్కక యాదినుండి

విదిత ప్రవృత్తి ని -వృత్తులఁ బొందు
నది పరాశక్తియు - నాదిశక్తియును

దెలివియ జ్ఞాన శ-క్తియుఁ, గ్రియాశక్తి,
యలరు నిచ్ఛాశక్తి, - యాకర్తృ శక్తి

యాదిగాఁ గలుగు న-నంత శక్తులును
బ్రోదియై జగములఁ - బుట్టించె, నందుఁ 370

జపలయై యుల్లాన - శక్తి సంసార
మపరిమితముఁ జేసి - యాడుచునుండు,

సరవి నంత నిరోధ - శక్తి సంసార
మురు పరాక్రమమున - నుపసంహరించి,

యట్టి కృత్యంబుల - కాధార మగుచుఁ,
బట్టుగా భాసకా - భాసకం బగుచు,

నగుణంబు సంవిస్మ-యంబు ననంగఁ
దగి నిండియుండు నం-తశ్చిత్ప్రకాశ

మే పూజ్యమై తాను - మెఱయుచునుండు
నా పరమాత్మ స-ర్వాత్మ యెట్లనినఁ 380

గడలేని తత్పరా-కాశ కందరము
నడతారఁగా నాసి - కాదికాకాశ

కోశాంఘ్రితలము ది-క్ఫూర్ణంబులై ప్ర
కాశించు బాహసం ఘంబు లనేక

వనజజాండములన- వారిగా దాఁచ
సనుకూలమైన మ-హాకుక్షి గలిగి,

వెలుఁగు నద్దేవుండు - విశ్వరూపకుఁడు
సలఘు సంవిన్మయుం- డఖిల పూర్ణుండు

నైన దేవున కుప-హారముల్ వలదు,
ధ్యానంబు శీతల-త్వము నమృతంబు 390

తెలివి, తదేక బు-ద్ధియు, బ్రమోదంబు,
చలన రాహిత్యంబు, - సత్త్వంబు ననెడి

యాత్మీయదివ్య పు-ష్పార్చన సేయ
నాత్మ సంతుష్టుఁడై - యానంద మొందుఁ:

బరమధర్మం బిది - పరమయోగంబు
పరమాత్మ నీరీతి - భావించి చూడ

నెఱుకకు నెఱుకయై - యెల్ల దేహములఁ
బరీపూర్ణుఁడై నిండి - బహుశబ్దములను

విలసితప్రజ్ఞచే - వినును, శీతోష్ణ
ములఁదాఁ దెలియుచుండు, - మొనసి రూపములఁ 400

గనుఁగొనుచుండు, త-క్కక షడ్రనములఁ
గొను, గంధములను మూ-ర్కొను, నిద్రఁ జెందు,

మరల మేల్కొనుఁ బల్కు - మైత్రిని నెఱపు,
నిరవొందు నియతాత్మ - నే వేళ మదినిఁ

బూని ధ్యానించుటే - పూజ; తదన్య
మైనట్టి పూజ యే-లా చిదాత్మునకు?

అలపూజ పదియు మూఁ-డైన నిమేష
ముల యంతకాల మి-మ్ముగఁ జేసినట్టి

ధ్యానశీలునకు గో-దాన ఫలంబు
మానితంబుగఁ గల్గు, - మఱియొక్క దినము 410

పరిపూర్ణముగఁ జేయు - పావనాత్మకుఁడు
పరమధామమునందుఁ - బ్రాపించియుండు;

భావింప నిది యెల్ల - బాహ్యపూ జగును.
తావలమైన యం-తఃపూజ వినుము!

నిత్యంబు, నచలంబు, - నిర్వికారంబు,
సత్యంబు, సగుణంబు, - సర్మాత్మకంబు,

అమిత, మాకాశశి - వాత్మకం బజము,
విమలంబు, పరమ సం-విన్మయ పూర్ణ

లింగంబు నర్చించు - లీల యె ట్లనిన
మంగళప్రద చిత్ప-మాధి సౌఖ్యమును 420

తాను పొందినది. యం-తః పూజ యగును.
మౌనీంద్ర! యిఁక నొక్క - మర్మంబు వినుము!

స్థితుఁడు, నిర్గతుఁ డుదా-సీనుండు, జడుఁడు,
గతభోగి, యోగి, య-ఖండ సుషుప్తి

యుతుఁ డవ్యయుం డద్వ-యుం, డజరుండు,
నతి జాగరూకు,ఁడ - నాచారుఁ డజడ

సత్తాస్వరూపుఁ డెం-చఁగ నేనె, నాకుఁ
జిత్త దృక్ఛక్తులు - సేవించుసతులు,

అలఘు విశ్వంబు నా-కర్పించు మనము
తలఁపులచే నొప్పు - దౌవారికుండు: 430

వెల యఖండజ్ఞాన - వివిధపృత్తులును
పాలుపొలదు నాకు స-ద్భూషణావళులు,

అమితంబులగు నా గృ-హంబుల కెల్ల
నమరియుండు దశేంద్రి - యములు వాకిండ్లు,

ఆరీతి నారూప-మగు నీకు నాకు
వేఱుగా దాత్మ బా-వించి చూచినను,

గావున సమబుధ - గలవాఁడ వగుచు
నీవు న న్నర్చించు - నిస్పృహత్వమున,

వట్టి మదర్చన - కన్యంబు లగుచుఁ
బుట్టి యుండెడి ద్రవ్యపుంజ మేమిటికి? 440

నలరగా గ్రామనం బను పూజ యొకటి
కలదు, చెప్పెద నది - క్రమముగా వినుము!

పరమాత్మనగు నన్ను - భావించి మదికిఁ
బరఁగఁ దోఁచిన పుష్పభక్త్యాన్నపాన

వితతులు కల్పించి, - విశ్వాస మొదవ
ప్రతిదిన మర్పింప - భావనాసిద్ధి

యగుచుండు, నిట్టి యా-త్మార్చనార్హంబు
లగునట్టి భక్ష్య భో-జ్యాది వస్తువులు

సమబుద్ధి శాంతర • సముచేఁ దిరస్కృ
తములగు నటుగానఁ - దత్త్వార్థ మెఱిఁగి, 450

కలనాకలిత దేశ • కాలకర్మముల
వలనఁ బ్రాప్తములైన - వస్తువులందుఁ

దలఁగని యాశ చే-తను, సుఖదుఃఖ
ములచేత విభ్రమం -బునఁ బొందకుండు!

తెలిసి జ్ఞానార్చిత - దేహ నాయకుఁడ
వలరి నీ వగుచుండు - మమలాంతరంగ!

భూమిలో నిటువంటి పూజలు సేయు
నామహాత్మునకు నే, నఖిల దేవతలు

నొనర సేవకులమై యుందు. మాఘనుఁడు
తనుఁ దా నెఱిఁగి, పర తత్త్వంబు నొందుఁ; 460

గలమాడ్కి లేనిదై - కలిగిన ట్లెప్పుడు
బలముగాఁ దోఁచు ప్రపంచ మంతయును

దఱచి యుభాసమా-త్రంబుగా నెఱుఁగు,
మఱి యది యెట్లన్న - మరు మరీచికల

యం దుదకం బుండీ నటు దోఁచి, లేని
చందంబుగాఁ బ్రపం చం బంత్యయందుఁ

గనిపించినట్లుండుఁ - గడను లేకుండు,
ననిశ మజ్ఞాని యై-నటువంటి వాఁడు

మొనసి తద్భ్రాంతిలో - మునుఁగుచునుండుఁ,
గనుక మూఢాత్ముఁడై - కష్టదేహముల 470

ధరియించు, విడుచుఁ, ద-త్వము గనలేఁడు,
పరికింప నటువంటి - భ్రాంతచిత్తునకు

దెలివిగా నాత్మో ప-దేశంబు సేయఁ
దలఁచు టె?ట్లనిన ని-ద్రను గలయందుఁ

గనిన పురుషునకుఁ - గన్యక నిత్తు'
నని తలంచుట గాదె? - యని యవ్విధమున

నెనసి నా కుపదేశ - మిచ్చి రక్షించి,
మొనసి తిరోధాన-మును బొందె శివుఁడు.

ఈ రీతి హరుఁ డాన - తిచ్చిన పూజ
లారూఢులైన సం-యములును, నేను 480

జిరతర నిష్ఠతోఁ - జేయుచునుందు,
మరయఁ బ్రాప్తములగు - నర్చనంబులకు

బొరిబారి విఘ్నముల్ • పొసఁగినవాని
మెరమెరఁ బడరాదు, - మిక్కిలి పూజ

యదియంచు దృఢనిశ్చ-యంబుతో నున్న,
బదపడి తద్దోష - పటలం బణంగుఁ:

జెలువొప్పుచుండెడి - జీవులయందుఁ
గలుగు గ్రాహ్య గ్రాహ - కత్వముల్ రెండు

సరియగు యోగ పూజలు సల్పుచుండు
మిరవందు సుజ్ఞాన - మినకులాధీశ!' 490

యని రఘువరున కా-త్మార్చన క్రమము
పనుపడ నమ్మౌని - పతి సత్కరుణను

నెఱుకగా సుపదేశ - మిచ్చి యాసరణి
మఱువ వద్దనుచుఁ గ్రమ్మఱ నిట్టు లనియె::

తగ విను రామ! యం తర్భావితంబు
లగు సకలార్థంబు - లందుఁ గల్గినది,

యద్వయ చైతన్య - మగు దీనిసరణి
సద్వివేకంబుతోఁ - జక్కఁగా వినుము!

లలిమీఱఁ బ్రాప్త కాలమునందు ద్రవ్య
ములు గల్గు, నొక కాల-మున లేకపోవు, 500

కలిమి లేములకు సు-ఖంబు, దుఃఖంబు
నిలను బొందుచునుంచు - రెల్లమానవులు

గౌరవార్ధంబుగాఁ గామింతు, రట్లు
కోరినంతనె సమ-కూడునే తమకు?

విను మట్టి వాసనా - విరహితేంద్రియము
లను గూడి సుఖదుఃఖ - లాభ లోభముల

యం దంటి యంటక - యఖిల కార్యముల
సందేహ మొందక - సల్పుచునుండు,

మగణితంబు సదేక, - మద్వయ, మాద్య
మగు బ్రహ్మ మొక్కటె - యఖిలమై యుండు, 510

నంతియె కాని త-దన్యమైనట్టి
వింతవస్తువు లేదు - వెదకి చూచినను,

ఇనకులాధీశ్వర ! - యీ యర్థమందు
ననువొంద బిల్వ ఫ-లాఖ్యాన మొకటి

కల దది చెప్పెదఁ - గ్రమముగా విసుము !

బిల్వఫలాఖ్యానము

సలలితమైయుండి - సాహస్రసంఖ్య

గలయోజనముల దీ-ర్ఘ ముగ నొప్పుచును,
చలనమొందక యుగ - సాహస్రములకుఁ

బొలియ కెప్పుడు మహా-భూతమై యెపుడు
వెలుఁగుచు, విమలమై - నిస్ఫుటం బగుచు, 520

మహిమమీఱఁగ నొక్క - మారేడుపండు
తహపొంది యంతటన్ - దానిండియుండు:

నది పురాతన మయ్యు - నమృతాంశుకరణి
సదమలమై ప్రకా-శంబుగా నుండు:

వడివీచు కల్పాంత - వాయువేగమున
కడఁగక, కదలక - యచలమై యుండుఁ;

జాలుగాఁ గోటియో - జనసంఖ్య నమరు
మూలాళితోడ ని-మ్ముగ జగంబులకుఁ

దానె సంతతము నా-ధారమై యుండు:
దానిచుట్టు నజాండ - తతు లవేకములు 530

పాలుపొంద విశ్రమిం పుచునుండు ననుచుఁ
బలికిన విని రామ-భద్రుఁ డిట్లనియె:

వరమునివర్య ! బి-ల్వ ఫలం బటంచు
నిరవొంద మీరు నా-కెఱుఁగఁ జెప్పినది

యాచిన్మయాత్మస - త్తనుచు నామదికి
దోఁచుచున్నది, దాని , తుద మొదల్ దెలియ

నానతీయుఁ డటంచు - నడుగ, వసిష్ఠ
మౌని సంతోషాబ్ధి - మగ్నుఁడై రామ !

వినుము చెప్పెద సర్వ - విశ్వంబు చిత్త
మున, నయ్యహంకార - మునఁ గల్గి, చాల 540

వెలయుచు వేవేళ - వివిధభేధములఁ
జలియించు టది చిత్త - చపలత గాని,

యరయ నన్యంబుగా-దని నీవు దెలియు
కొఱకు బిల్వఫలంబు - గుఱుతుఁ జెప్పితిని;

నిరతంబు పరసత్తు - నిర్వికల్పయును,.
గరమొప్పు నట్టి య- ఖండైకరసయు,

నగణితం బగునట్టి - యర్ధంబు విశద
ముగఁ జేయుటకు మది - ముదము రెట్టింప

భాసురంబుగు శిలో-పాఖ్యానసరణి
వాసిగాఁ జెప్పెద - వసుధాతలేంద్ర ! 550

పావనం బతిగోప్య - పద మదే గనుక
సావధానముగాను - జక్కఁగా వినుము !

మహాశిలోపాఖ్యానము



అది యె ట్లనన్న మ-హామృదులంబు,
నదమల తేజ, మా- శ్చర్యకరంబు,

పారి పరంధ్రయును, సం- పూర్ణయు నగుచుఁ
జిరతరంబై యొక్క - శిల యుండు' ననిన

విని రాముఁ డనియె నో - విమలమునీంద్ర !
పెనుపొంద మీరు చె-ప్పినది చిత్పదము

ఘనము, శిలయు, నేక - కళయు, నరంధ్ర
మును దా నగుచునుండి - మొనసి లోకముల. 560

నిరతంబు తనలోనె - నిండించు కొనుచుఁ
బొరి నాకసంబు గా-డ్పును నాఁచి కొనిన

పగిది నాకాశాది - పంచ భూతముల
నగణిత బహుపద్మ - జాండ కోటులను

ఆ మహాశిలలోని - కాకర్షణంబు
వేమఱు సేయుచున్ - విడుచుచునుండుఁ,

దా నరంధ్రయు నభే-ద్యం బగుచుండు,
నేనాఁడుఁ గనినఁదా-నేకమై యుండు,

జలజగదాశంఖ - చక్రాది చిహ్న
ములతోడఁ బరిపూర్ణ-ముగ నిండియుండుఁ, 570

దెలివియై తా సుషు-ప్తినిఁ బొందుచుండు.
నలఘు పరబ్రహ్మ - మదియే యటంచు

నగణితప్రజ్ఞతో - నా రాఘవుండు
విగతసంశయుఁడై, వి-వేకియై నిజముఁ

జెప్పిన విని యావ సిష్ఠుండు లోన
నుప్పొంగి, హర్షాశు - లుబ్బుచుండఁగను

పరమసంతోష ని-ర్భరమానసుఁడును
గరమొప్పఁ బులకిత - కాముండు నగుచు,

గద్గద కంఠుఁడై - కరములు మొగిచి,
చిద్గగనరహస్య - శిల కర్థ మిట్లు 580

చెప్పిన రాము నీ-క్షించి, తా మెచ్చి,
యప్పు డి ట్లనియె 'మా-యప్ప! శ్రీరామ!

యోహో హో! నీ నిమ్మ- హోరు రహస్య
మూహించి చెప్పితి - వున్న దున్నట్లు,

అల పరబ్రహ్మ మీ - వైతి, నటంచుఁ
బలికి, క్రమ్మఱ రామ- భద్రు నీక్షించి,

సమ్మతంబుగఁ జాల - సంస్తుతిఁ జేసి,
యమ్మునివర్యుఁ డి-ట్లనియెఁ గ్రమ్మఱను.

అర్జునోపాఖ్యానము



విను రామచంద్ర! వి-వేకి యైనట్టి
జనపతి కదనాది - సకలక్రియలను 590

సలుపుచుఁ జిత్త వి-శ్రాంతి వహించు,
నిలను బద్ధుండుగాఁ, - డీయర్థమందు

బలముగా నర్జునో-పాఖ్యాన మొకటి
కలదు చెప్పెద నది - క్రమముగా వినుము!

ఇట మీఁద జముఁడు తా-నెల్ల దేహములఁ
బటురోష మెసఁగఁ జం-పను రోసి, తపము.

తా నాచరించి భూ-తలబాధ యుడుపఁ
గా నోపునటువంటి - ఘనశౌర్యధనుల

సగధీరులగు నర - నారాయణులనఁ
బొగ డొందఁ దగినట్టి పుత్రులఁ గాంచుఁ, 600

బరఁగ నయ్యిరువురు - బదిరి కాశ్రమము
నిరవు సేసికొని య- హీనతపంబు

పాసఁగఁ జేయుచునుండి. భూభారముడుప
నసహాయశూరులై యదుకులములను

నారాయణుఁడు జన-నంబగుఁ, దోడ
భూరి కౌరవ వంశ-మునఁ బుట్టునరుఁడు,

అలఘు మైత్రినిఁ గృష్ణుఁ - దర్శనుం డనఁగ
బొలుపొందుచుందు, ర-ప్పుడు కౌరవులకుఁ

బాండవులకు దొడ్డ - బవరంబు గలుగు,
నండయై శ్రీ కృష్ణుఁ - డప్పు డర్జునునకు 610

ననుగుణ సారథి యై యుండు, నిట్లు
మొనయు భారత యుద్ధమున నాదియందు

సదయుఁడై జ్ఞాతులఁ - జంప నొల్లకయ
విదితుఁడై పార్థుండు - వెఱచుచుండఁగను.

నాపార్థు నా కృష్ణుఁ - డాదరింపుచును
దీపితతత్త్వోప - దేశంబుఁ జేయు:

నది యెట్టు లనిన నీ వాలించి వినుము!
చెదరక యుండెడి - చిద్రూప మెపుడు 620

చెడదు. దృశ్యంబులే - చెడిపోవు చుండు,
నడర నే నెవ్వఁడ - నని యంటివేని

నిజము భావించిన - నీవు నిర్జరుఁడ
డజుఁడవు, నిత్యుండ, - వాత్మవు గానఁ

బుట్టువు. చావు నె-ప్పుడు నీకు లేదు;
నెట్టన నీరీతి నిఖిలజీవులకుఁ

జావు, పుట్టువు లేదు - చర్చించి చూడ,
నేవేళ నయ్యాత్మ - యిరవుగా నుండు.

ఇట్లగుచుండఁగా - నిది యది యనుచు
మాట్లాడఁగూడ, దా-త్మపరాత్మ సర్వ 630

మయుఁడు, శాశ్వతుఁడు, చి-న్మయుఁ డటుగాన,
భయము లే దాత్మ కే పట్టుననైన,

జడములు దేహముల్ - జలబుద్బుదములు
పొడమి యణంగిస - పోలికగాను

ఆయాత్మయందు దే-హము లుద్భవించి,
మాయగా నణఁగు, నా-త్మ చరింపకుండుఁ

గనుక జడములైన - ఘట్టములఁ ద్రుంపఁ
జనుభీతి నీకేల? - యరి సమూహములు

మొనసి నీతో యుద్ధ-మును జేతు మనుచుఁ
జనుదెంచినపు డీవు , శాంతిఁ బొందుదువె? 640

శౌర్యకలితరాజ - జన్మంబు నెత్తి.
కార్యంబు మొనసిన - కాలంబునందు

ఘనశూరుఁడై యుండి - కాని చందమున
వెనుక ద్రొక్కునె యెంత - వెఱ్ఱివాఁడైన?

తనుబాధ లెందు నా త్మను బొందకుండు.
నని నిశ్చయించి యో-గాత్మ బుద్ధినను

అన్ని కృత్యములు బ్ర-హ్మార్పణం బనుచు
నున్న, నా బ్రహ్మంబు - నొందెద వీవు,

లోకులలో నింత . లోఁగిపో నేల?
ప్రాకటంబుగఁ జేయు - భండనం బిపుడు 650

విలయ వాయువు వీచ - వింధ్యపర్వతము
చలియించినను సుశా-స్త్రము లలంఘ్యములు,

అటుగాన మనుజుల - యప్రభోధమునఁ
బటు దేహవాసనల్ - ప్రబలంబు లగుచుఁ

బొలుచు, నాత్మజ్ఞాన - బుద్ధిచే వాన
నలు క్రమక్రమముగా , నాశంబు నొందు'

నని యనేకములుగా - నాకృష్ణుఁ డర్జు
నునకు బోధింప, న-నూన విజ్ఞాన

కలితుఁడై పార్థుఁడ-క్కడ ఘోరసమర
మలరి యనాసక్తుఁ-డై చేసి గెలుచు 660

నటుగాన నీవు ని రాసక్తిఁ బొంది,
ఘటికుఁడ వై సర్వ కార్యముల్ నడుపు!

మఱి జంతువులకు జన్మపరంపరలను
బొరిఁబొరి సంకల్ప - పూర్వకంబులుగఁ
 
బరఁగుచుండెడిది విభ్రాంతియే కాని,
నెరసి భావించిన - నిలుకడల్ గావు

అని యివ్విధంబుగా - నారాఘవునకుఁ
బనుపడ నర్జునోపాఖ్యాన సరణి

వినిపించి క్రమ్మఱ - విశ్వాస మొదవ
మునివర్యుఁ డవల రా-మున కిట్టు లనియె 670

నరుదగుచుండు నీయర్థంబునకును
సరియైన శతరుద్రచరితంబు వినుము

శతరుద్రోపాఖ్యానము

ఒక్కనాఁ డొక చోట • నొక్కభిక్షుండు
చక్కఁగాను సమాధి - సలుపుచున్నపుడు

తొలఁగి, యా చిత్తవృత్తులు లోనఁ బొడమి
గలిబిలిఁ జేయఁగాఁ - గర్మాశ్రయమునఁ

జింత సేయుచుఁ గొంతసే పూరకుండె,
నంతలో వింతగా - నతని చిత్తమున

బలిమి నాత్మను ప్రతి-భా సవిశేష
కలనముల్ పొడమఁగాఁ - గామేచ్ఛలోన680

జనియింప సామాన్యజనభావకాంక్ష
నొనరంగఁ గూడ వే-ఱొక నరుఁ డయ్యె.

అతఁ డంత జీవలుఁ డను పేరుతోడఁ
బ్రతిభాసఁ బొంది స్వప్నపురంబునందుఁ

దా విహరించి మ-ద్యము ద్రావి, నిదురఁ
బోవుచు విప్రుఁడై - పుట్టి, యా కలను

నెఱి నన్నము భుజించి - నిద్రించి కలను
మరల నం దొక్క సామంతుఁడై పుట్టి

తెఱఁగొప్ప నన్నంబు - తిని నిద్రవోయి
విరివిగాఁ గలను భూవిభుఁడై జనించి690

పూలపాన్పున నిద్రఁ బొంది స్వప్నమున
నాలో సురాంగను యై జనియించి

యలఘురతిశ్రాంత యగుచు నిద్రించి
మెలపుగాఁ గల నొక్కమృగియై జనించి

పరఁగ నిట్లుగ స్వప్న - భవపరంపరలఁ
బొరిఁ బొరి ననుభవిం-పుచు నుండి, తుదను

నలఘు రుద్రుండు తా-నైతి నటంచుఁ
గలఁగాంచి సంతోష - కలితుఁడై లేచి,

యా కలలోఁ గల - లాత్మ భావించి
ప్రాకటాశ్చర్య సం-భరితాత్ముఁ డగుచు, 700

శివుని రూపును గలన్ - జెందినకతన
నవిరళవిజ్ఞాని-యై మది నిట్లు

దలఁచె నీ స్వప్న శ-తంబులు మాయ
వలన గల్గి నిజంబు - వలె దోఁచె మదికిఁ

జెదిరెడి మరుమరీ- చికలయం దెపుడు
నుదకంబు లేకుండీ, - యుండిన ట్లుండు,

ఆకరణిని బ్రహ్మ-మందు విశ్వంబు
లేకుండి యుండిన - లీలఁగా దోఁచు

నట్టి సంసార మా - యారణ్యమందుఁ
బుట్టిన స్వప్నాంగ-ముల ననేకములఁ 710

గనుచుండఁగానె యు-గములు పెక్కేఁగె
నని తనలోన దా-నాశ్చర్యపడుచు,

నరిగి యత్యాది దే-హము లున్న జాడ
నరయుచు, దొలిభిక్షుఁ డగుచుఁ దానున్న

తనువు నీక్షించి, చై-తన్యంబు దాని
కనువంద నీయఁగా - నది రుద్రుఁ డయ్యె,

నారుద్రుఁ డీరుద్రుఁ - డందుండి పోయి,
గౌరవంబుగఁ జిదా-కాశ సంస్కృతిని

జెందిన జీ వటుఁ - జేరి ప్రాణముల
సందీయఁగా రుద్రుఁ -డయ్యె జీవటుఁడు 720

మొనసి య ట్లవ్విప్ర-ముఖ్య దేహములఁ
గని ప్రాణముల నియ్యఁ-గా, వారలెల్ల

మురువుగా శతరుద్ర-మూర్తులై రనఘ!
గరిమ నాభిక్షు సం-కల్పంబు లట్ల

తొలఁగక జీవ టా-దుల రూపు లగుచు
సలలిత సంవిదం-శంబులై తోఁచి.

నిలుకడ లైనట్ల-నే యుండె నన్ని
యలఘు మనోమాయ' - లని శతరుద్ర

జననక్రమముఁ జెప్పి - సంయమీశ్వరుఁడు
మనము రంజిల్లఁగా - మరల ని ట్లనియె 730

వినురామ! యిఁక నొక్క - వృత్తాంత మమర
ననఘ సుషుప్తమౌ - " నాఖ్యానసరణి,

ఘనమది యెట్లన్నఁ - గాష్ఠతాపసుఁడు
ననఁగ, జీవన్ముక్తుఁ - డన రెండుగతులు

గల, వందు నిస్సార - కర్మకర్తృత్వ
ముల వీడి యింద్రియ-మ్ముల నణఁగించి,

కనుమూసి నిదురించు - గతి నున్నవాఁడు
ఘనుఁ డతఁ డెవఁ డన్నఁ గాష్ఠతాపసుఁడు;

అదియుఁ గాక విరక్తి - నాత్మ యందుంచి
మొదట యుక్తాయుక్త-ములను దా నెఱిగి, 740

ఘనతర సచ్చిదే - కరసంబునందు
మనము నెల్లప్పుడును - మగ్నంబు చేసి,

యజ్ఞానజనులలో - నఖిలకృత్యములఁ
బ్రజ్జతో నడిపించు - పావనాత్మకుఁడు

వంతుకెక్కిన సుజీ-వన్ముక్తుఁ; డిట్టి
శాంతు లీయిరువురు - సము లెట్టు లనిన

సరిగాను చిత్తని-శ్చయరూపమైన
పరమాత్మ సత్తాను-భవమె మౌనంబు,

మొనయు తన్మౌనంబు - మూఁడుచందముల
నొనరు న దెట్లన్న - నూహతో వినుము! 750

ఊరక మాట్లాడ-కున్న చందంబు
నారయ వా జ్మౌన -మగు, నింద్రియముల

మద మణంచుట యక్ష - మౌనమౌ, నెపుడు
నిదురించు విధముగా-నే పరాత్పరము

ననుభవసరణిగా - నంతరంగమునఁ
గనుచుండినదియె పో-కాష్ఠమౌనంబు,

అలర నీ మౌనత్ర-యమునందుఁ జూడ
నలువొందు కాష్ఠ మౌనంబు మే, లదియె

ధన్యం, బనాయాస-దము, సదాద్యంత
శూన్యయు నైన సు-షుప్తి చిత్సత్త 760

మదిని ధ్యానించి త-న్మయుఁడైన నదియె
కదలని మౌననం-గతమైన మబ్బు,

పరఁగఁగా నాత్మ వి-భ్రాంతి ప్రపంచ
మరసి, యస్థిర మని - యా యర్థమందుఁ

గుదిరిన మౌనమే - గూడ సుషుప్తి,
యరియు నెన్నఁగ నేక-మై, యనేకముగ

విమలమై వెలుఁగు సం-విద్రూప మదియె
నమల చైతన్యాంశ - మదియేను ఎఱుక,

మతి నిల్పినను సుషుప్తి - మౌనమై యుండు,
నతిశయమైన స - మ్యక్‌జ్ఞానపటిమ770

చే నిరతసమాధి-సేయు ధన్యుండు
జ్ఞానయోగి యనాఁ బ్ర-శస్తుఁడై యుండు,

వరకాష్ఠమునికి, జీ-వన్ముక్తుఁడైన
పురుషున కనుభవం-బుగ నుండి, చాల

నొనరు సంవిత్తత్వ - మొకటియై యుండుఁ;
గనుక నయ్యిరువురిగతు - లేక మగును.

అది యెట్లయనిన దే-హాదీవాససలు.
మదియును, బ్రాణముల్ - మగ్నమై యచట

గుఱుతు దప్పక యణం-గుచు నుండునదియె
పరమపదం బండ్రు - పండితోత్తములు. 780

బేతాళోపాఖ్యానము



అరయ సంసార మ-హాస్వప్న మందుఁ
బరఁగెడి బేతాళు-ప్రశ్న వాక్యములు

ఉన్నవి చెప్పెద - నొప్పుగా' ననుచు
నన్నరపతి కిట్టు లనె వసిష్ఠుండు:

విను రామ! కర్కటి - విధముగా జ్ఞాన
ధనయుక్తుఁడైన బే-తాళు ప్రశ్నములు

గల, వవి యెటులన్నఁ - గ్రమముగా విమము!
పాలుచు బేతాళుండు - భూతలమందు

దిట్టఁడై నడిరేయిఁ - దిరుగుచు నుండు,
నట్టివాఁ డొక్కనాఁ- డందొక్కపురిని 790

నడిరేయి నొక నర-నాథు నీక్షించి
పెడ బొబ్బలిడి వెఱ-పించి యిట్లనియె

ఒక్కడవే చిక్కితి-వో రాజచంద్ర!
ప్రకటంబుగాఁ బట్టి - భక్షింతు నిన్ను,

బ్రదికెదవేని నా - ప్రశ్నోత్తరములు
విదితంబుగాఁ దత్త్వ - వేత్తవై తెలుపు ?

పరఁగ నే రవిరశ్మి-పరమాణువులును
గురుతర బ్రహ్మాండ కోటులై యుండుఁ

తనియక యే మారు-తము వీచుచున్న
నొనరుగాఁగను రేణు-వులు మింట నెగరు? 800

కల నుండి కలకుఁ ద-క్కక పోవుచుండి
యలఘు తేజోమయ-మగు నాత్మరూపు

విరివిగా విడుచుచున్ - విడువఁ డెవ్వండు?
అరటికంబం బయ్యు - నాకులు, పొరలు

నగుచున్న కరణి నే-యణు వతివృద్ధి
యగుచుండు నెప్పుడు?, - నణుతను విడని

పరమాణువునకు నే-ర్పడ 'నణువైన
ధర మేరు గగన ప-ద్మభవాండ సమితి

మురువొప్పు నవయవం- బులు లేక యెపుడు
పరమై వెలుంగు నే-పరమాణు శిఖరి! 810

శిలలోఁ గలుగుచుండు-సృష్ట్యాదు లెపుడు?
తెలియఁజెప్పుము నీవు-తేటగా.నిపుడు'

అని ఝంకరించి యి-ట్లడుగఁగా నగుచు,
విని యానృపాలుండు-వెఱవ కిట్లనియె

బేతాళ! నీవు సం-ప్రీతితో వినుము!
భూతాదియై పరి పూర్ణుఁడై నట్టి

యతఁడు సంవిత్సూర్యుఁ - డఖిలరూపముల
క్షితిమీఁద వెలిఁగించుఁ - జిత్ప్రభయందుఁ

ద్రన రేణువులు జగ-త్రయమునై యెపుడు
రసయుక్త విజ్ఞాన-రవిచే వెలుంగు; 820

ఆకారపత్త, య-నాకారసత్త,
ప్రాకటంబుగఁ బరి-స్పందసత్తయును

ఖ్యాతిగా నొప్పు చి-దానందశుద్ధ
చైతన్యసత్తయీ-సర్వంబు నొక్క

పరమాత్మ యనుచుఁ జె-ప్పందగుచుండు
మెఱయు తస్మాయా స-మీరకంపమున

జగము లనెడి మహా-స్వప్న జాలమున
నగణిత స్వప్నంబు-లరుదుగాఁ గాంచు,

నది పరబ్రహ్మమౌ,- నా బ్రహ్మ మెపుడు
పదిలమౌ శాంతి సం-పన్నమైనట్టి 830

పరమనిజస్వరూ-పము. వీడకుండు
నరఁటికంబము చుట్టు-నాకులుఁ, బొరలు

బుట్టుచు లయమునుం-బొందుచునుండు
నట్టిచందంబుగా-నా బ్రహ్మమందుఁ

బొరలు, వృత్తము, పఱ-పును గల్గి, విశ్వ
మరుదుగాఁ గల్గుచు-నణఁగుచునుండు

మొగి నలభ్యము, సూక్ష్మ-మును, విమలంబు
నగుపరమాత్మరూ-పణు వగు నదియె

అగణిత శక్తి న-నంత ప్రకాశ
మగుటను గనకాచ-లాదులై యొప్పుఁ 830

బరువడిగా దీని పరమాణు వితతు
బరయఁగా మేరు సూ-ర్యాదులు నయ్యెఁ,

బర్వి యొప్పుచు నుండు-పరమాణు వితతి
సర్వపూరక మహా - శైలమై వెలసె .

అది మహాజ్ఞప్తి మ-యంబై మనమును
గదియఁగా దాని మ-గ్నం బయ్యె జగము,

తనియు విజ్ఞాన మాత్రం బీప్రపంచ'
మని యా నృపాలుఁ డి-ట్లనుభవసరణి

గా తగన్ వినిపింపఁ - గాను మోదించి
భేతాళుఁ డతని సం--ప్రీతితో మెచ్చి, 840

యతని వీడ్కొని చని-యాహార ముడిగి,
మతిమంతుఁడై చిత్స-మాధియం దుండెఁ

దనమందిరమున కా-ధరణీంద్రుఁ డరిగె?
ననుచు భేతాళ వృత్తాంతంబు రామ

భూపాలునకుఁ జెప్పి, బుద్ధి విశ్రాంతి
నీపగిదిని బొందు-టిల దుర్లభంబు,

అతిసులభంబుగా-నవని నింకొకఁడు
హితమొప్ప సాధించు-నిట్టి విశ్రాంతి

మురునొప్పు నీయర్థ-మున నితిహావ
మెఱిఁగింతు' నని యమ్ము-నీంద్రుఁ డిట్లనియె 850

భగీరథోపాఖ్యానము

అనఘ! భగీరథుఁ డను మహారాజు
పనుపడ భూమినిఁ బాలింపుచుండి,

మనుజులు సంసార-మాయాబ్ధిలోను
మునిఁగిపోయెడి చంద-ములను భావించి,

మొనసి పశ్చాత్తా-పమును బొంది, యపుడు
తనమదిలోఁ దానె - తలఁచె నిట్లనుచుఁ

గటకటా! మానవుల్ - కష్టసంసార
మటమటమని వీడ - కాశచేఁ జిక్కి,

కాఁపురంబులు సేసి - కడుపటఁ జచ్చి,
పాపకూపములలోఁ - బడిపోదు; రిట్టి 860

హింసాస్పదంబును, - హేయంబునైన
సంసార మే నొల్లఁ - జాలు, నివెల్లఁ

దలఁప నిస్సార కృత్యంబులే కాని,
యలఘుసారములుగా, - వాయు వహములు,

రాత్రులు జరిగి తే-రకుఁ బోవుఁ గనుకఁ,
బుత్ర మిత్రాదుల - పొత్తు నా కేల?'

యని గాఢవైరాగ్య - మగ్గలింపఁగను
జని, త్రితలుండను - సద్గురుఁ జేరి,

తన యభిప్రాయ - మంతయుఁ దెల్పి మ్రొక్కి,
కనుల నీరొల్క గద్గద కంఠుఁ డగుచు 870

వివిధ కుసంసార - విషమరోగమున
కవధి యెన్నఁడు గల్గు? - నానతిం' డనినఁ

ద్రితలుఁ డిట్లనె రాజ! - దీనికి నవధి
యతులిత చిన్మాత్ర - మగు నాత్మ నాత్మఁ

దలఁచి నీవది యైనఁ - దద్రోగ మణఁగు,
నలఘుతరారోగ్య - మబ్బు, నీకనిన

విని నృపాలుఁడు పల్కె - విమలచిన్మాత్ర,
మనుపమం, బచ్యుత - మని మీ కరుణను

దోఁచు చున్నది; యందుఁ - దొలఁగక చిత్త
మే చందమున నిల్చు? - నెఱిఁగింపుఁ డనిన 880

విని యా త్రితలుఁడు భూ-విభున కి ట్లనియె:
అనఘ! సంసారమ-హారోగమునకు,

మొనయు రాగ ద్వేష - మోహవ్యధలకు
ఘనతారౌషధ మహం-కార శోషణము;

కావున నిపు డహం-కార బీజమును
నీవు సుజ్ఞాన వ-హ్ని జ్వాల యందు

వెరవరివై కాల్చి - విడిచితివేని
మరల దేహంబున - మాయాంకురంబు

పుట్ట, దప్పుడు ముక్తిఁ - బొందుదు వీవు.
నెట్టన నామాట - నిజముగా నమ్ము!' 890

అని త్రితలుఁడు పల్క - నా భగీరథుఁడు
మనమున నూహించి మరల ని ట్లనియె:

'వరగురు స్వామి! ప-ర్వతముపై వృక్ష
మఱలేక పుట్టియు-న్నట్టి చందమునఁ

దనువం దహంకృతి - తా నుదయించి
మనములో నెలకొని , మమకారములను

బొడమింప, నెట్టి నే-ర్పున దానిఁ గొట్టి
పడవైతు?' ననఁగ నా - భక్తునిఁ జూచి

తిరమైన దయతోడఁ ద్రితలుఁడిట్లనియె:
'ధరణీశ! నీవు చి-త్తంబు నడంచి, 900

సకలంబు వర్ణించి - శాంతి వహించి,
యకలంక హృదయుండ-వై, భీతి విడిచి,

తలకొని యీషణ - త్రయమును గెల్చి,
యలరు నింద్రియమనో-హంకారములకు

శత్రుండవై, శాంతి - శమదమంబులకు
మిత్రుండవై, మాస -మీపంబు నకును

రాక, యేవేళఁ బ-రస్వరూపంబు
వేకాగ్రబుద్దీతో - నెపుడు చూచుచును,

బొరిఁ జిత్తవిశ్రాంతిఁ - బొందిన దనుక
నరయ భిక్షాహారి-వై, దీనదశను 910

పాంది నిస్పృహుఁడవై - భూమి పైఁ దిరుగు;
మందుచే ముక్తుండ - వయ్యెద' వంచుఁ

ద్రితలుఁ డీగతి నుప-దేశించినట్టి
యతులితోక్తులు విని - యా భగీరథుఁడు

ఆ మీఁద నిజరాజ్య మంతయు విడిచి,
కామాది శత్రు వ-ర్గమును బోనడఁచి,

సర్వసన్న్యాసభా - స్వర నిష్ఠఁ బూని,
సర్వదేశములందు - సంచరింపుచును,

భిక్షాశనుండై, య-భేదభావమున
నక్షీణవిశ్రాంతి - ననుభవింపుచును, 920

సరసుఁడై కొన్ని వ-త్సరములు ధరను
జరియించి, మార్గవ శంబుగాఁ దనదు

పురిఁ జేర వచ్చిన, - పురవాసు లతని
నరుదుగాఁ జూచి, ని-జాలయంబునకుఁ

దాము దోడ్కొని పోయి - తగఁ బూజఁ జేసి,
ప్రేమాతిశయమున - భిక్షలు పెట్టి,

యాదరింప్పుచునుండి; - రతని రాజ్యంబు
ప్రోదిగాఁ బాలించు - పుణ్యాత్మకుండు

రయమున నాభగీ-రథు చెంతఁ జేరి,
భయభక్తు లెసఁగఁగాఁ - బ్రణమిల్లి పలికె: 930

'ఓ మహాయోగీంద్ర! - యో కృపాసాంద్ర!
నామీఁద దయయుంచి, - నాఁటి చందమున

నిలను జరింపఁగా - నేల? యిచ్చోట
నిలువవే నన్ను మన్నించి' యటంచు

నతఁడు ప్రార్థింపఁగా - నా భగీరథుఁడు
హిత మొప్ప దద్రాజ్య - మేల నొల్లకను,

మఱి యందు నిల్వ కు-న్మత్తుని పగిది
సరగునఁ జని భూమిఁ - జరియింపుచుండి, 940

మార్గవశంబుగా - మఱియొక్క చోట
భర్గుఁడో యన నొప్పు - వరమదేశికుని

కడ కేఁగి మ్రొక్కి, య-ఖండాత్మబోధ
విడువక తా ననుభ వించిన రీతి

వినిపించి, త్రితలుని - వీడ్కొని వేగఁ
జని, భగీరథుఁడు భూ-చక్రంబునందుఁ

దిరుగుచుండఁగఁ, దన దేశంబు మున్ను
పరిపాలనము సేయు - ప్రభువు నశించి

పోవఁగా, నప్పుడు త-ద్భూమికి రాజు
కావలె నని మంత్రి - గణములు గూడి 950

చని, యా భగీరథు - జగతి పై వెదకి,
కని మ్రొక్కి ప్రార్థించి, - క్రమ్మఱ నతనిఁ

దొడుక వచ్చి, పొందుగ రాజ్యపదము
నడరఁ బాలించుట - కపుడు పట్టంబు

గట్టఁగాఁ, బూర్వ ప్ర-కార మారాజు
నెట్టన నందుండి - నిస్పృహుండగుచు,

మొనసి సప్తసముద్ర - ముద్రిత ధరణి
నొనరంగఁ బాలింపు చుండి శమంబు,

దమమును, పరమశాంత-ము, శత్రుమిత్ర
సమదర్శనత గల్గి - శాంతినిఁ బొంది, 960

యరయ జీవన్ముక్తు-డై యుండె' ననుచుఁ
బరఁగ భగీరథో-పాఖ్యాన మమరఁ

బట్టుగా బోధించి, - ప్రతిబంధకములు
నెట్టనఁ బాయక - నే యెవరికైన

నిలువ దాత్మజ్ఞాన - నిష్ఠ యెన్నటికి,
నెలమి నీ యర్థమం-దిల శిఖిధ్వజుని

చరితంబు చెప్పెద - సావధానముగ
నరలేక విను మంచు - నావసిష్ఠుండు

సచ్చరిత్రుండైన - జానకీపతికి
మచ్చికతోఁ జెప్పి, - మరల ని ట్లనియె: 970

శిఖిధ్వజోపాఖ్యానము

'అనఘ! శిఖిధ్వజుఁ డను మహారాజు
పనుపడ భూమినిఁ - బాలింపుచుండె,

నతని భార్యామణి-యైన చూడాల
హిత మొప్పఁ బతిభక్తి - నెనయుచునుండె;

నా దంపతులు వృద్ధు-లై యటమీఁద
వేదాంతశాస్త్రముల్ - విన నిశ్చయించి,

వైరాగ్యకలిత భా-స్వర వివేకమున
సారజ్ఞుఁడైనట్టి - సద్గురు చెంతఁ

జేరి శుశ్రూషలు - చేసి మెప్పించి
భూరిసద్భక్తితోఁ బొసఁగ వేఁడినను 980

నాగురుం డిరువుర - కప్పు డధ్యాత్మ
యోగక్రమము లన్నియును కృపమీఱఁ

దెఱఁగొప్పఁగా నుప-దేశంబుఁ జేసి
యరిగె: శిఖిధ్వజుం డా యాత్మబోధ

మఱచి యెప్పటిరీతి - మహి నేలుచుండె
సురుచిరయుక్తిచేఁ - జూడాల గురుని

పదభక్తి మఱువక, - పరమార్థసరణి
మదిని భావించి సమ్మతి నిట్లు దలఁచె-

ధీరుఁడై గురుఁ డుప-దేశించి నట్టి
సారార్ధసరణి విచారించి చూడఁ 990

బంచభూతములచేఁ - బ్రభవించి ధరను
మించి నటించు ని-మ్మేను నేఁ గాను;

అందుఁ బుట్టు దశేంద్రి - యాళి తద్విషయ
బృందంబు గాను, హృ-త్ప్రేరితంబైన

తనువు సలిల బుద్బు-దంబు చందమునఁ
బెనుపొంద నుదయించి, - పెరిఁగి, నటించి,

వంచించు నక్కాల - వశమునఁ దుదను
పెంచు కైవడి పడి - భిన్నమై పోవు,

నటుగాన నేను దే-హం బనుమాట
సట యగున్: ప్రాణపం-చకము నే ననిన 1000

నది సూక్ష్మ దేహాంగ - మస్థిరం బగుట
నిదియును నేను గా - నెఱిఁగి చూచినను,

మది నే ననిన మహా - మాయతో నెపుడు
కదిసి సంకల్ప వి - కల్ప జాలములఁ

బొరిఁ బొరి నూరకే - పుట్టింపుచుండు,
నరయ సంశయ చంచ-లాత్మకం బగుచు

మొనసి తా నణుమాత్ర-ముగ సంచరించుఁ
గనుక మానస మేను-గా నెన్నటికిని:

నిలుకడ యగు బుద్ధి - నే నంటినేని
నలరారఁగా నిశ్చ యాత్మక వృత్తి 1010

కలది తానై, యహం-కార భావమున
కెలమిని నిరతంబు - హేతువై యుండుఁ

గాన, వే నాబుద్ధి-గా నహంకార
మే నని చూచిన - నిలను బాలకునిఁ

బట్టిన భూతంబు - పగిది జీవంబు
నట్టిట్టు జరుగ నీ -యక చుట్టి పట్టి,

సత్తను మఱపించి, - జడత నొందించి,
చిత్తవృత్తులఁ బెంచి - చేష్టింపుచుండుఁ

గావున, నే నహం-కారంబు గాను;
జీవంబు నే నని - చింతింతు ననిన 1020

మాయచేతను బ్రాణ-మయమై కలంక
మే యెడలను వీడ కెనయుచు నుండు

మదియదే నేఁ దీని - మర్మంబుఁ గంటి,
నదియు నేఁ గాను; మ-హాసుకుమార

మగుచిత్తు సర్వంబు - నణఁగిన వేళ
మిగిలి తా నన్నింటి - మీఁద వెలుంగు;

నీ రహస్యము నేఁటి - కెఱుకకు నెఱుక
గా రయంబున నేను - గంటిఁ జిత్తమునఁ,

బ్రతిఫలించిన చిదా భాసతో భూత
వితతు లెల్ల ననేక - విధములుగాను 1030

సమలచిత్సత్తచే - నలరి జీవించు.
రమణీయమగు సూది-ఱాతి చెంగటను

దొరకొని యినుప సూదులు సంచరించు
కరణి జడములైన - ఘనభూతములును

నెరయు చైతన్య సా-న్నిధ్యంబునందుఁ
జరియించు నీ రహ-స్యము నేను గంటి,

నా చిదాత్మేనైతి: - నఖిలేంద్రియములు
వాచెంత నటియించు - నానావిధముల,

విని కన నేర్చు సం-విత్‌జ్ఞాన పటిమ
[1]ఘన కపటాజ్ఞేయ - కలనచే, జిక్కి, 1040

జడత నొందుచును ని-జస్వరూపంబు
నడరార మఱచి, మా-యలకు లోనగుచుఁ

బుట్టి గిట్టుచునుండు - పోల్కినిఁదోఁచు,
నిట్టి జగద్భ్రాంతి - యెఱుకయం దణఁగు;

నింతకాలంబున - కెఱిఁగితి, నాత్మ
చింతింప నంతయుఁ - జిద్విలాసంబు.

అని పెక్కుగతుల వేదాంతార్థములను
మననంబు చేసి స-మాధి నేమఱక

చిరనిష్ఠతో నభ్య-సింపుచుండఁగను
గురుకటాక్షంబునఁ - గుదురైన బుద్ధి 1050

చెదరకుండఁగ యోగ-సిద్ధి లభించె
ముదిమి దొలంగె, న మ్ముదిత దేహమున

నలువొప్ప నవయౌవ-నంబు ప్రాపించెఁ;
జలనరాహిత్యంబు, - సర్వశాంతంబు

మొదలైన సుగుణ స-మూహ మాయింతి
యెద నుదయింపఁగా - నింపు సొంపెనఁగ

సంతోషభరిత సు స్వాంతయై యుండి.
యంతలో నొక్క నాఁ-డాత్మేశుచెంతఁ

జేరి నిల్చినఁ, జూచి చిఱునవ్వు నవ్వి
యా రాజు పల్కె నెయ్యమున ని ట్లనుచు 1060

చూడాల! నీకు భా-సుర యౌవనంబు
పోఁడిమి నే రీతిఁ - బొడమె వింతగను?

ముదిమి యెక్కడ డాఁగె? - మోహనతేజ
ముదయించి నీ మేన - నొప్పుచుండుటకు

హేతువే? మా చంద - మెఱిఁగింపు మనిన
భూతలేశ్వరున క-ప్పొలఁతి యిట్లనియె:

'నరవర! యీ యౌవ-నంబుఁ, దేజంబుఁ
బరభూమి కరిగి సం-పాదింప లేదు,

వినుము, తొల్లిటి మేను - విడుచుట లేదు.
జననాథ! క్రమ్మఱ - జనియింప లేదు, 1070

ఇది నాకు సహజమై-యే యున్న దిపుడు,
కుదురుగా మనల కా-గురుఁడు సత్కృపను

నుపదేశ మిచ్చిన - యుచితవాక్యముల
నెపుడుఁ దలంపుచు. - నెఱుక నేమఱక.

యీ సర్వమును బాసి, - యేకమై నిలిచి,
తా సర్వమగు పర-తత్త్వంబుఁ గనుచు,

నల గగనసమాన-మగు మదిలోనఁ
దలఁగక నిస్సంగ తను నే రమింతు;

లే దుదయంబును, - లేదు నాశమును
లేదు లేనిది, యాత్మ - లీలఁ గల్గినది 1080

యనుభూతి యనుభూత - మనుచు సుఖింతు;
జననాథ ! దోష, రో-షము లాత్మ కిపుడు

దోఁపకున్నవి మహా తుర్యభావమున
కాపట్య కలిత జ-గజ్జాలమునకుఁ

బ్రభువునై యిహమును - బాసి, పాయకను
శుభదృష్టి నను నేనె - చూచి చొక్కుదును;

మొనయు రాగద్వేష - ముఖ్య శత్రువులఁ
దునుమాడి, చిత్తవృ-త్తుల పొత్తు వీడి,

సరస సద్గురువాక్య, - శాస్త్రదృష్టములు
కర మర్థితో నన్నుఁ - గలిసి మెలంగ, 1090

నే నాత్మతత్త్వంబు - నిశ్చయించుకొని,
యానంద మొందుదు; - నాయాత్మ కెపుడు

అదిరూప, మిదిరూప - మని చెప్పఁగూడ,
దది సర్వవిషయేంద్రి - యాళి నీక్షించుఁ

గాని, దానిని నివి - గనుఁగొనఁ జాల;
వా నిర్మలాత్మత-త్త్వానుభవంబు

గలిగియున్నది; సదా - ఖండ లక్ష్యమున
నిలిచి, చలింపక - నేను నే నైతి'

ననుచుఁ జూడాల ని-జాత్మానుభవము
వినిపింప, నంతయు - విని శిఖిధ్వజుఁడు 1100

ఆ యింతి పలుకుల - కప్పు డర్థంబు
చేయనేరక రాజు - చిడిముడి ననియెఁ

'జూడాల! నీ వవి - చోద్యంబు దోఁప
నీడ వచించితి - వింతియే గాని

అర్థమే గాని నీ-యనృతోక్తులందు
సార్ధకం బున్నదే - చర్చించి చూడఁ?

బడుచుఁదనంబుచేఁ - బలికితి విన్ని
పడఁతి! నీ కిటువంటి ప్రౌఢోక్తు లేల?

చాలించు' మని రాజు - చపలాత్ము డగుచుఁ
దా లేచి పోయె, న-త్తరుణి చూడాల 1110

తనమదిఁ దా నిట్లు - తలంచె 'నీ నృపుని
ఘనముగాఁ జుట్టిన - కర్మబంధంబు

తెగిపోవుదనుక ము-క్తిని నమ్మలేఁడు,
తగ దిప్పు డితని కీ-తత్త్వంబుఁ దెలుప'

ననుచుఁ దాను సమాధి - సభ్యసింపుచును
దనయింటిలోనే స్వ-స్థంబుగా నుండి,

ఘనయోగ మొనరించి - గగనయానదు
లనెడు సిద్ధులఁ బొంది - యానంద మొంది, 1120

జనకుఁ డర్భకునకుఁ - జాలుగా విద్య
లనువొంద బోధించు - నట్టిచందమునఁ

దననాథునకు సతి - తత్త్వార్ధములను
పనిఁ బూని కొన్ని య-ర్దములు దెల్పఁగను

వినినందుచేత వి-వేకంబు కొంత
జనియించె నృపున కా-సమయంబునందు,

విసువక యేవేళ - వేదార్థములను
వసుధామరుఁడు. శూద్ర-వానికిఁ దెల్పు

పగిదినిఁ జూడాల - పామరుండైన
మగనికి యోగక్ర-మముఁ దెల్పుచుండె' 1130

నని శిఖిద్వజుని వృ-త్తాంత మమ్మౌని
వినిపింప రామభూ-విభుఁ డిట్టు లనియె;

గురుచంద్ర! యా రీతి - గురుతరార్ధముల
నరమర లేక నె-య్యంబు రెట్టింప,

గెంట కా సిద్ధయో-గిని శిఖిధ్వజున
కంటి బోధించు వే-దాంతార్థములను

నతఁడె తెలియకుండె - ననిన నిం కెవరు
ప్రతిభతోఁ దెలుతు రా - పరమార్థములను?

ఆ దంపతులకు మ-హాకృప మీఱ
వేదాంత సూక్తుల • వినిపించుగురుఁడు 1140

ఒక్కఁడై, యుపదేశ - మొకటియై యుండి,
యెక్కువై చూడాల - యెఱఁగిన దేమి?

ఇది యాశిఖిధ్వజుఁ - డెఱుఁగని దేమి?
అది తెల్పుఁ' డని రాముఁ డడుగ వసిష్ఠ

ముని యిట్టు లనియె 'న-మ్ముదిత చూడాల
మునుపటి సంభవం-బుననుండి ముక్తిఁ

గామించి భూమికల్ - క్రమముగాఁ గడచి,
యా మీఁదఁ జరమ దే-హంబు ధరించి

యున్నందుచే గురుఁ - డొకమాఱు తనకుఁ
బన్నుగాఁ జెప్పిన - పరమార్థ సరణి 1150

మననంబుఁ జేసి స-మ్మతిఁ బొందె నపుడు,
జననాయకుఁడు పూర్వ జన్మంబులందు

రమణీయముక్తిఁ గో-రక, సుకర్మముల
నమరఁ జేసి నరేంద్రుఁడై జనియించి,

చూడాలతోడ భా-సురతత్త్వ సరణి
వేడుకగాఁ దాను - వినుటయే కాని,

తరుణిరీతినిఁ బర-తత్త్వచింతనముఁ
జిరనిష్ఠ నొంది చేసినవాఁడు గాఁడు;

కావున నజ్ఞాన - కలితుఁడై, తత్త్వ
మేవిధంబున విన్న - నెఱుఁగలేకుండె. 1160

నరనాథ! యెవరికై-నను గురుఁ డొక్క
గుఱిఁ జెప్పు: నాగుఱి - గొప్పగా నెంచి,

విని యది నమ్మి వి-వేకియై, కష్ట
మున కోర్చి తత్త్వార్థ-మును విచారించు.

వానికి దొరకు జీ-వన్ముక్తి సౌఖ్య:
మే నిందు కితిహాస - మెఱుఁగఁ జెప్పెదను.

చక్కఁగా విను రామ-చంద్ర!' యటంచు
మక్కువ నమ్మౌని - మరల ని ట్లనియె:

కిరాతోపాఖ్యానము



విని రాఘవేశ్వర! - వింధ్యాద్రిమీఁద
నొనరఁ గుటుంబియై - యొక కిరాటుండు 1170

నుండి ధనాసక్తి - నుండిన చోట
నుండక, వనములం - దొంటిగా మౌని

కరణినిఁ దిరుగ జాం-గల దేశమందు.
మెఱుఁగైనగవ్వ స-మీపంబుగాను

గనిపింప 'నది వెండి - గాఁబోలు' ననుచుఁ
జని చాలవెదుక న-చ్చట గవ్వ తనకుఁ

గనఁబడకున్నఁ ద-త్కాంక్షను విడువ
కను వాఁ డచట నున్న - కసవెల్లఁ బెఱికి,

యారాడ వైచుచు - నలయుచు నందె
మూఁడుదినంబు లి-మ్ముగ గవ్వమీఁది

యాస వీడక చూడ - నమరరత్నంబు
వాసిగా దొరకఁగా - వాఁడు మోదించి,

దానిఁ గైకొనిపోయి - ధనవంతుఁ డయ్యె
నోనరనాథ! వాఁ -డొక్కటి వెదకి 1180

యొకటిఁ గన్నట్లు గు-రూపదేశార్థ
మొక కాలమునఁ దోఁచ- కుండినఁ గాని

వేసటఁబడి దాని - విడువ 'కాత్మార్థ
మాసక్తితోఁ జూతు'- నని మానసమునఁ

బుట్టిన సంశయం-బులను ఖండించి,
పట్టుగా మనమందె - భావించెనేని

అమరసన్మణి వాని - కబ్బిన రీతి
రమణీయ సుజ్ఞాన - రత్న మీతనికి

సరగున దొరకు, మో-క్షధనాఢ్యుఁ డగును,
పరిపూర్ణ శాంతి సం-పన్నుఁ డౌ' ననిన 1190

తాపసోత్తమ! శిఖి-ధ్వజుఁడు మోక్షంబు
నేపగిదినిఁ బొందె? - నెఱిఁగింపుఁ డిపుడు '

అనిన వసిష్ఠు డి-ట్లనె రామచంద్ర!
విను మా శిఖిధ్వజు - వృత్తాంతమతఁడు

చూడాలసుజ్ఞాన - సూక్తు లాలించి
యాడ కాడకు మోక్ష - మం దాశ నుంచి,

పరమాత్మతత్త్వాను-భవము గాకున్నఁ
బరితాపమును బొంది - పట్టణమందు

నిలువ సైరింపక - నిఖిలతీర్థములఁ
బొలుపొందఁ గ్రుంకుచు - భూప్రదక్షిణముఁ 1200

గావించి వచ్చెదఁ గా కని-పోయి,
తా వేగఁ బుణ్యతీ-ర్ధములందుఁ గ్రుంకి

క్రమ్మఱ వచ్చి చ-క్కఁగఁ జిత్తశాంతి
నమ్మహీపతికి లే-కారటమొంది,

వైరాగ్యమున రాజ్య - వైభవంబులను
దా రోసి విడిచి యం తఃపురమందుఁ

జూడాలయుండిన - చోటికిం బోయి,
పోఁడిమి నాపతిన్ - బుజ్జగింపుచును

ప్రియము మీఱ నిజాంక - పీఠంబు మీఁద
దయ నుంచుకొని మహీ-ధవుఁ డిట్టు లనియె: 1210

వినుము చూడాల! వి-వేకివి నీవు
గనుకఁ జెప్పెద నొక్క - కార్య మే మనిన

ఈ రాజ్య మొల్ల, నే - నేలి తీరాజ్య .
భారంబు నీ వింక • భరియింపవలయు.

సుతుఁడు లేకుండఁగాఁ - జూడాల! నీకు
హిత మొప్ప నీ రాష్ట్ర - మింపొంద నిచ్చి,

పోయెద నేను తపోవనంబునకు,
నాయజ్ఞ మీఱక - నా మేలు గోరి

భామ! నీ వీ భూమిఁ - బాలింపుచుండు!
కామాది శత్రు వ-ర్గంబు నణంచి 1220

సారవిహీన సం-సారంబు విడిచి,
సారాత్మతత్త్వ విచారంబుఁ జేసి

సలలితచిత్త విశ్రాంతిఁ బొందెదను.
వెలఁది! నీ నిందుకు - విఘ్నంబు చేయ

వల' దన్నఁ జూడాల - వరుసకు మ్రొక్కి,
పలికె నిట్లని ' మహీ - పాలక! విన్ను

వనవాసములయందు - వర్తింపఁ బనిచి
జనులలో నేను రా-జ్యముఁ జేయఁదగునె?

ఎలమి నే కాలమం-దేపని సేయ
వలయునో యది చేయ - వలె' సదె ట్లనిన 1230

సహజవృక్షములు వ-సంతకాలమున
రహిమీఱఁ బూచి శ-రత్కాలమందు

ఫలియించు నీరీతిఁ - బటు యౌవనమున
నలరుచు భోగంబు - లానందముగను

ననుభవింపుచునుండి, - యధికమౌ ముదిమి
తనువులన్ బొందిన - తఱి వనంబులకుఁ

బోవఁగావలయు, ని-ప్పుడు నన్ను విడిచి
పోవుదురే? పురం-బున నిల్చియుండి

తఱిమి కామాది శా-త్రవులఁ బోఁగొట్టి,
పరమ సుజ్ఞానాను-భవము సేయుచును 1240

నన్నిటియం దంటి - యంటక రాజ్య
మున్నతమతిఁ జేయు- చున్నను నీకుఁ

గొదువ లే, దమల ము-క్తుండ వయ్యెదవు;
సదమల చిత్త, వి-శ్రాంతినిఁ బొంది

నిలువు నీ విచ్చట-నే' యంచు నింతి
పలుకఁగా విని మహీ - పాలుఁ డిట్లనియె:

'మగువ! నామాటకు -మాఱు మాటాడఁ
దగదు, నీ వెఱుఁగని - ధర్మంబు గలదె?

ఏ పుణ్యమహిమనో - యిపుడు నీ మేన
దీపించె యౌవన - దివ్యతేజంబు, 1250

వెలఁది! నే నిప్పుడు - వృద్ధుండ నైతి
నల భోగభాగ్యసౌ-ఖ్యముల నేనొల్ల,

నతిపతివ్రతవు నీ-వైనందువలన
నతివ! నిన్నిం దుంచి - యరిగిన నాకు

మదిలోఁ గొదువ లేదు - మహి నెల్ల నీవు
పదపడి నీ రీతిఁ - బాలింపుచుండు!

క్షితి నేలుచుండి నేఁ - జిత్త విశ్రాంతి
హతమొప్పఁ జెందలే - నెన్నాళ్ళ కైన

బరఁగ బ్రహ్మేంద్రాది - పదములం దున్నఁ
జిరముగా నిల్వదు - చిత్తవిశ్రాంతి, 1260

కావునఁ దపమునే - గహనంబులందుఁ
గావింపవలయు ని-ష్కర్షగా ననుచుఁ

బలికి చూడాలకుఁ బట్టంబు గట్టి,
వెలయు రాజ్యము నేలు- విధముల నెల్లఁ

జెప్పి చూడాలచే - సెలవంది. నృపతి
యుప్పురం బెడఁబాసి - యా రేయి వెడలి,

దూరాటవుల నొక్క దుర్గస్థలంబుఁ
జేరి యందుఁ దపంబుఁ - జేసెద నంచుఁ

దలఁచి, జితేంద్రియ-త్వంబుచే ముక్తి
వలనుగాఁ దాఁ బొంద -వచ్చు. గా కనుచుఁ 1270

బోఁడిమి నందున్న - పుణ్యతీర్ధమున
మూఁడు కాలములందు - మునిఁగి లేచుచును

జెలఁగి దర్భలు, నార - చీరలు, జడలు,
పొలుచు రుద్రాక్షలు - భూతి ధరించి,

యొసరఁ గమండల-మును, జపమాల
యును, బూలపుట్టిక-యును, మృదువైన

హరిణాజినము, దృఢం-బగు నాగబెత్త,
మురుపాదుకలు గల్గి యుండఁగా నతఁడు

చిరనిష్ఠచే బద్ద - సిద్ధాసనమున
నిరవొందఁ గూర్చుండి - యెండ వానలకుఁ 1280

దాను చలింపక - ధైర్యగుణంబు
నూని తపముఁ జేయు -చుండి నా నృపుఁడు.

ఇచట చూడాల తా-నెల్ల రాజ్యంబు
ప్రచురశక్తినిఁ బరి-పాలింపుచుండి

అష్టాదశాబ్దంబు - లరిగిన మీఁద
శిష్ఠుఁడై తప మొప్పఁ - జేయు నాయకుని

నిష్టంబుగాఁ జూడ - నిచ్ఛఁ జింతించి
యష్టసిద్ధులు తన - కబ్బియున్నందు

వలన నాథునిమీఁది - వాంఛతో లేచి
కలకంఠి గగనమా-ర్గంబున నరిగి, 1290

తపముఁ జేసెడి శిఖి-ధ్వజుని వీక్షించి.
యపరిమితార్తి ని- ట్లని మది నెంచె.

'అజ్ఞానమున నీతఁ -డానంద మిచ్చు.
విజ్ఞాన మెఱుఁగక - వెఱ్ఱి చందమున

వరరత్న భూషణా-వళిఁ దాల్చువాఁడు
తఱచు రుద్రాక్షలు - ధరియించినాఁడు,

భూరి హేమాంబరం-బులు దాల్చువాఁడు
నార చీరలు దాల్చి - నవయుచున్నాఁడు,

తలకొని స్వాదుగం-ధ మలందువాఁడు
పొలుపులేక విభూతిఁ - బూసికొన్నాఁడు, 1300

మొగి మణి మందిర-ముల నుండువాఁడు
వగ చెడి యడవిలో- వసియించినాఁడు

సుకరమైనటువంటి - సుజ్ఞాన మెఱుఁగ
కకట! కర్మాసక్తు డగుచు నున్నాఁడు,

స్త్రీరూపమున నేను - చెప్పినమాట
లీ రాజు నమ్మలే, - దిపుడైన నేను

మునికుమారక రూప-మును దాల్చియైన
జననాయకునిచిత్త - సంశయంబులను

దీర్చి తత్త్వార్థంబు - దెలిపెద నేను,
నేర్చి యూరకయుండ - నీతిగా దింక 1310

నని నిశ్చయించి యం-దద్భుతంబైన
పనిఁబూని పురుష రూ-పంబు ధరించె.

అది యె ట్లనిన హే-మాభ-దేహమున
సదమలధౌతవ-స్త్రములు ధరించి,

పరిమళ గంధ లే-పము వక్షమందు
విరివిగా యజ్ఞోప - వీతంబు మెఱయఁ

గర మొప్పఁగా శిఖా - కలికయందమరి
విరిదండ సారెకు - వెనుక నటింప,

ఘనకమండల మొక్క - కరమునఁ బూని,
జనపతికడ బ్రహ్మ-చారిచందమునఁ 1320

బుడమికిఁ జెయ్యెత్తు - పొడవుగా నిలిచి
పొడచూపఁగాఁ జూచి - భూపాలమౌని

యేదేవుఁడో వచ్చె - నిచటి 'కటంచుఁ
బాదుకల్ కడమీటి - బహుతీవ్రగతిని

నెదురేఁగి తోడ్తెచ్చి - యిష్టాసనమునఁ
గుదురుగా నతని దాఁ గూర్చుండఁ బెట్టి,

పనిఁబూని యం దర్ఘ్య -పాద్యాది విధుల
మొనసి పూజలొనర్చి - మ్రొక్కఁగా, నృపుని

వీక్షించి 'శ్రీరస్తు - విజయో-స్తటంచు
నక్షీణకరుణతో - నా బ్రహ్మచారి 1330

దీవించె నపుడు, పృ-థ్వీపతి యతని
భావించి' యో ముని-ప్రవర! యిచ్చటికి

నామీఁద దయయుంచి-నా చెంత కిపుడు
ఏమి కార్యార్థమై - యేతించినారు?

తలిదండ్రు లెవరు? మీ - స్థల మెద్ది?' యనిన
సలలితుఁడగు బ్రహ్మ-చారి యిట్లనియె:

'విను పుణ్యచరిత! నా వృత్తాంత మెల్ల,
ననిమిష మునిచంద్రుఁ-డగు నారదుండు

కర మొప్పుచున్న గం-గానది చెంత
గిరికందరమునందు - గెంటక తపము 1340

సలుపుచు నుండఁగా - జాహ్నవీతటినిఁ
గలకలధ్వను లెసఁ -గంగ నమ్మౌని

విని, యిదేమో? యని - వింతగా నటకుఁ
జని, యందు జలకేళి - సల్పు సుందరులఁ

గనుఁగొన, వారి చ-క్కఁదనంబు లెల్ల
మనమున నాట న-మ్యౌనివీర్యంబు

పడిఁ జాఱె మెఱుపుకై - వడి ధాత్రి మీఁదఁ
బడఁగ, నమ్ముని దాని - స్ఫటికకుంభమునఁ

బెట్టి యుండఁగ నది - పిండమై యుండె;
నట్టి పిండంబునం - దవయవంబులును 1350

బొడమఁగా దద్ఘటం-బున నుండి నేను
వెడలిన, మాతండ్రి - వేడ్కగాఁ బెంచి,

విమల కుంభమునుండి . వెడలితిఁ గాన
నమరగా ననుఁ గుంభుఁ డను పేరఁ బిలిచి,

సకల విద్యలు నాకు - సాంగముల్ గాను
ప్రకటంబుగాఁ జెప్పి - బ్రహ్మచెంగటికి

నన్నుఁ దోడ్కొని పోయి - నాచే నజునకుఁ
బన్నుగా మ్రొక్కించి - పలికె 'నో తండ్రి!

వీడు మీ పౌత్రుండు - వీని మన్నించి
వేడుకన్ యజ్ఞోప వీతంబు నిచ్చి 1360

తెలివిగా నాత్మోప-దేశంబు సేయ
వలె నన్న ననుఁ జూచి - వనజసంభవుఁడు

నలువొప్ప నుపనయ-నంబును జేసి,
విలసిత వేదాది - విద్యలు నేర్పి,

సారతత్త్వోపదే శముఁ జేసి 'ధరణి
నారూఢ విజ్ఞాని-వై సంచరింప

నీవు పొమ్మనఁగ నే-నిర్మలతత్త్వ
భావుండనై భూమి పైఁ - జేరి, బ్రహ్మ

చారినై విహరింతు - సర్వస్థలముల,
నారీతి యిది నీకు - వాటఁ జెప్పితిని. 1390

వరపుణ్యచరిత! యె-వ్వఁడ వీవు? వింధ్య
గిరిచెంత నొంటిగా - గెంటక నిలిచి

యేమి గోరి తపంబు - నిపుడు చేసెదవు?
నీ మదియందున్న - నిశ్చయం బేమి?

యా విధ మెఱఁగింపు' - మన శిఖిధ్వజుఁడు
తా వినయోక్తి న-త్తపసి కి ట్లనియె:

వరముని! నే శిఖ-ధ్వజుఁడను వాఁడ
నరనాయకుఁడను పు-నర్భవదుఃఖ

భయమున రాజ్యంబుఁ - బరిహరించుకొని,
జయకారణంబైన - శాంతిఁ బొందుటకు 1400

విపినంబులోఁ జేరి - విశ్రాంతిఁ గోరి
తపము సేయఁగ, నమృతము విషంబైన

గతిఁ దపశ్చరణంబు -కష్టమై తోఁచు.
నతిచాపలము పుట్టు-నందుచే మదికి

నే నశక్తుఁడ నైతి - నిఁక నేమిసేతు?
దీనవత్సల! నాకుఁ దెలుపవే!' యనిన

నరనాథు నీక్షించి - నవ్వి యమ్మౌని
కరుణ నిట్లనె 'మహీ - కాంత! నీరీతిఁ

దెలిసితి నాయోగ దృష్టి నె ట్లనినఁ
దెలియఁ జెప్పెద నీ స-తీసమేతముగ 1410

నొక్కట గురువుచే - నుపదేశ మైతి,
వక్కడ నీ బుద్ధి - కాత్మానుభవము

దొరకకుండఁగ వచ్చి - దూరాటవులను
స్థిరబుద్ధి లేక కృ-శింపుచున్నావు..

నీ పత్ని గురుభక్తి - నిలిపియున్నందు
చే పరాత్మ సుఖంబుఁ - జెంది, నెమ్మదినిఁ

బురమునం దున్నది - భూపాల! నీవు
పర మెఱుంగక కష్ట - పడియెద విందు'

అని పూర్వవృత్తాంత - మతఁడు తెల్పఁగను
విని శిఖిధ్వజుఁ డందు - వెఱఁగొంది పలికె: 1420

'విమలాత్మ! నీవు నా - విధముల నెల్ల
నమరఁ జెప్పితివి, నీ-యంత ధన్యుండు

దొరకఁడు నాకు, స-ద్గురుఁడవై నీవు
పర మెట్టిదో దానిఁ - బట్టి బోధించి

రక్షింపవలె నన్న - రాజు నీక్షించి,
యక్షీణ కరుణ ని-ట్లనే బ్రహ్మచారి

'ధీరాత్మ! గురుఁ డుప-దేశించినట్టి
సారాత్మ బోధ ని-శ్చయముగా మొదటఁ

జిక్కినప్పుడె దానిఁ - జేపట్టలేక,
అక్కడ మది సంశ-యంబును నొంది, 1430

నీ వెవ్వఁడై నట్టి - నిశ్చయార్ధంబు
భావింపనేరక? - బహుఘోరతపముఁ

జేసిన మోక్షంబు - సిద్ధించు ననుచు
గాసికి నోర్చి సం-కల్పవికల్ప

జాలంబులకుఁ జిక్కి - చపలచిత్తమునఁ
గాలంబు నూరకే - గడపుచుండితివి;

వాసవావశులైన - వారు కర్మముల
నాసక్తితోఁ జేతు - రజ్ఞాను లగుచు,

వసుమతీశ్వర! నీవు - వారిచందమున
పసలేని కర్మ ప్ర-పంచ వాసనకు 1440

లో నైతి విచట నా-లోకుల కరణి,
నానందకర మోక్ష - మబ్బునే దీనఁ?"

బ్రజాసాంగత్యంబుఁ - బరిహరించుకొని,
యజ్ఞాని వగుచు నిం-దడల నేమిటికి?

నిఁకనైనఁ బరతత్త్వ - మెఱిఁగితి వేని
సకలదుఃఖంబులు - సమయు నటంచుఁ

బలుకఁగాఁ గుంభుని - పాదపద్మముల
కలఘు భక్తిని మ్రొక్కి - యవనీశుఁ డనియె:

'గురుఁడవు నీవు నా-కు నిజంబుగాను,
పరులు లేరిఁక నెన్ని - భంగుల నైనఁ 1450

దిరముగా నాత్మోప-దేశంబు సేయ
దొరకొని ననుఁ గృతా-ర్థునిఁ జేయవలయు'

ననుచుఁ గన్నీరొల్క - నార్తుఁడైయున్న
'జనపతి మనము కా-షాయపక్వతను

బనుపడి యున్నది - పరమార్థవిద్య
నొనరంగ నితనికే - నుపదేశమీయఁ

దగు విప్పు' డనుచుఁ జిత్తమున సూహించి,
యగణితకరుణ ని-ట్లనియెఁ గుంభుండు:

ప్రియముతోఁ దండ్రి చె-ప్పిన విద్య సుతుఁడు
భయభక్తు లెసఁగఁ ద-ప్పక వినురీతి 1460

నామాట నీవు ని-ర్ణయముగా వినినఁ
బ్రేమతో నీకుఁ జె-ప్పెద నాత్మ విద్య,

మొదట నీ సంశయ-మునకు సాదృశ్య
మిది యనఁదగినట్టి - యితిహాస మొకటి

మదికిఁ దోఁచిన దిది - మనుజేంద్ర! తొలుత
విదితంబుగా నీకు - వినిపింతు వినుము!

చింతామణి ఉపాఖ్యానము



అది యెట్టు లనిన మ-హాశాస్త్ర విదుఁడు
సదమలుం డగు నొక - జగతీసురుండు

తనమదిలోనఁ జిం-తామణిఁ గోరి
ఘనతపం బొనరింపఁగా నది వచ్చి, 1470

యాభూసురుని చేతి కణికయై నిలిచె
నాభావ మెఱుఁగక - యా బ్రాహ్మణుండు

'తలఁచె నీరీతిఁ జిం-తామణి నన్ను
వలనొప్పఁగా మెచ్చి -వచ్చునే త్వరగ?

నెలమిఁ జింతామణి- నీయఁ జాలకయ
వెలయ వేల్పులు తపో-విఘ్నంబు సేయ

నీ రీతిఁ బంపినా-రీ గాజుపూస,
నే రీతిఁ గైకొందు -నిపు? 'డంచు మదినిఁ

దలఁచఁగా, నెగిరి చిం-తామణి చనియె.
నలవిప్రు డెప్పటి - యట్ల తపంబుఁ 1480

బనిఁబూని చేయఁగా, - బహువత్సరముల
కొనర ప్రత్యక్షమై - యొక గాజుపూస

తనచేతి కొదవఁ, జిం-తామణి దొరకె
ననుకొని తనయింటి - కరిగె విప్రుండు.

పాలుపొందు నాగాజు -పూస నానాఁట
మలినమై పోవ, బ్రా-హ్మణుఁడు చింతించె;

నారీతిఁ దొలుత నీ - కబ్బుచున్నట్టి
సారవేదాంత సు - జ్ఞాన రత్నమును

విడనాడి వచ్చి యీ - విపిన మధ్యమునఁ
గడగండ్లఁ బడుచును - గర్మముల్ చేసి 1490

కడతేరవలె నని - కాంక్షించినావు;
పుడమి నిందున ముక్తి - పొందునే నిన్ను?

విడువు నీవా భ్రాంతి - విమలాంతరంగ!
చెడిపోక నింక సు-స్థిరబుద్ధి నుండు!

ధరణీశ! నీవు త-త్త్వజ్ఞాని వగుచు
సరసచిత్తుండవై - సర్వకర్మములఁ

దలఁపకుండెడిది చిం-తామణిగాను
దెలియు, మీయడివి నా-ర్తిని వసించి

కర్మముల్ చేసి త-త్కర్మ ఫలంబు
నర్మిలి వాంఛించు-టది గాజుపూస 1500

గాను నీ వెఱుఁగు, దుః-ఖంబు నణంచి
యానందమున బొంద - నాత్మ నూహించి,

మా యాశ్రమమునఁ గ-ర్మతపంబు నిట్లు
సేయఁగా నిన్నుఁ జూ-చితిఁగాన, నీకుఁ

దత్త్వార్థ మెఱిఁగింపఁ - దలఁచితి, నీవు
సాత్త్వికబుద్ధితోఁ - జక్కఁగా వినుము!

నీవు చింతామణి-నే కోరి తపము
నీవిధంబునఁ జేయు - టింతియే కాని,

స్ఫటికోపలంబైనఁ - బ్రాప్తంబుగాదు;
కటకటా యిట్టి సం-కల్ప వికల్ప 1510

పటలంబులో నింకఁ - బడియుంటివేని,
చటుల మేఘము లాక-సంబును బొదువు

కరణి సంకల్ప వి-కల్పముల్ నిన్ను
మఱి మఱి పొదువు, స-మ్మతిఁ బొందనియవు;

గనుక సంకల్ప వి-కల్పంబులందు
మననంబు విడిచి, బ్ర-హ్మంబు నీ వనము.

'అదియెట్లు నే నౌదు? - నను సంశయంబు
హృదయమం దున్న నీ - కెన్నాళ్లకైన

దొరకదు ముక్తి, సంతో-షమొందునను
గరిమ సంశయము సం-కల్పమౌ దాని 1520

విడువుము! నీ వింక - విడువకుండినను
దడఁబడి గాజు ర-త్నమటంచు భ్రమయు

నవనీనురునిరీతి - హాస్యపాత్రుండ
వవుదువు గాన, నీ - యజ్ఞత విడిచి,

తరళత నణఁచి చి-త్తత్యాగి వగుము.
అరసి సర్వత్యాగి-వై యుంటివేని

యది పురుషార్థ స-మాప్తి తదన్య
మిది యది యనఁగ లే-దిరవు కొన్నట్టి

యజ్ఞానవైరి నీ-కగపడినపుడు
ప్రజ్ఞతో వానిఁ జం-పక వీడినందు 1530

వల్ల నీకిన్ని దుర్-వ్యధలు ప్రాప్తించె;
నల్లనాఁ డజ్ఞత - నణఁచియుండినను

ఎనలేని దుర్దశ - లేల నిన్ బొందు?
ననఘ! చిదానంద - మబ్బి నీజడత

విడిపించు' ననుచు భూ-విభున కేరీతిఁ
గడఁగి చింతామణి - కథ వినిపించి.

యాకుంభరూపిణి-యైన చూడాల
ప్రాకట కరుణతోఁ - బలికెఁ గ్రమ్మఱను:

'ఓ నరనాథ యిం-కొక యితిహాస
మేను చెప్పెద నది - యె ట్లన్న వినుము! 1540

గజోపాఖ్యానము



అలఘు వింధ్యారణ్య-మందొక్క గజము
గలదు హస్తిపుఁడు త-క్కక దానిఁ బొంచి

పట్టి గొలుసు దాని - పదమున నంటఁ
జుట్టి వృక్షమున క-చ్చుగఁ గట్టివేసి,

ఆ దాని ముందరి - తాఁటిమ్రానెక్కఁ
గా, దంతి దంత యు-గంబుతోఁ గాలి

గొలుసు గ్రక్కున నీడ్చి-కొని ఘీంకరింప,
నళికి హస్తిపుఁడు తా-నా మ్రాని మీఁద

నున్న నేనుఁగు మ్రాను - నురవడిన్ విఱిచి
తన్నుఁ జంపు నటంచుఁ - దరువుపై నుఱికి 1550

పడిన, నేనుఁగు వాని - భావించి చూచి;
పుడమిపై వ్రాలె నీ-పురుషుని నేను

జంపు టింకే? లంచుఁ జనియె నాదంతి:
కంప మొందుచు వాఁడు - క్రమ్మఱ లేచి,

చెచ్చెర నలఁత దీ-ర్చికొని తా నపుడు
నచ్చోట నుండక - యరిగి, కుంజరము

చనిన జాడను బోయి - సామజమున్న
యునికి పట్టు నెఱింగి, - యుపమగా దాని

చుట్టు నోదంబు హెచ్చుగఁ ద్రవ్వి, పైనఁ
గట్టెలు తీఁగెలు: కసపు నాకులును 1560

పఱచియుండఁగ గజ-పతి దానిమీఁదఁ
బరువెత్తి డిగజాఱి-పడి హస్తిపునకుఁ

జిక్కె నాదిని వాఁడు - చిక్కిన యపుదె
త్రొక్కి చంపకయున్న - దోషంబు చేతఁ

గరివాని చేతికే - క్రమ్మఱఁ జిక్కి,
యిర వెందుఁ దోఁచక - యేడ్చుచునుండె:

ఈ కథార్థంబు నీ-వెఱుఁగవు, నేనె
వీఁకతోఁ జెప్పెద - విను! వింధ్య భూమి

యనఁగ నీ రాష్ట్ర, మీ-వా గజేంద్రంబు
మొనసిన వైరాగ్య-మును, వివేకమును 1570

ఆలఘుదంతయుగంబు, - హస్తిపుఁ డనఁగ
బలియు నజ్ఞానంబు, - ప్రబలమైనట్టి

రాగశృంఖల మన - రహిఁ గరికాల
నాగతిఁ గట్టి యు-న్నటువంటి గొలుసు,

ఆ గొలు సూడ్చు టే-మన్నను నీవు
వేగ భోగేచ్ఛను - విడిచిన తెగువ,

తాటిపై వాఁ డుండి - ధరణిపైఁ బడిన
దేటి లక్షణమన్న - హెచ్చు రాజ్యంబు

నటు నీవు విడుచుటే - యజ్ఞాన మగును;
బటుతాళమున నుండి - భయమొంది నేలఁ 1580

బడినవాఁ డెవఁ డన్నఁ - బరఁగ నీమదినిఁ
బొడమినట్టి విరాగ-మును వివేకమును,

రదనద్వయంబుచే - నాగశృంఖలము
నదిమి ఏకొను నీ - యట్టహాసమును

గనుఁగొని నీ మస్త-కంబు పై నుండి
యొనర నీకన్న మ-హెన్నతం బగుచు

సరియైన యజ్ఞాన - మందుండ వెఱచి,
యురికి కూలిన వేళ • నుర్విపైఁ ద్రొక్కి ,

చంపక యడవిలోఁ - జంరియింపఁ జనఁగఁ
దెంపుతో మరల న -దే నిన్నుఁ బట్టి1590

పడఁ ద్రోసెఁ గర్మ ప్ర-పంచజాతమున,
జడిసి చిక్కినవేళఁ - జంపని దేమి?

యనినను ఫలపరి-త్యాగిగా కెపుడు
ననువొందఁ గర్మ క్రి-యాభిమానంబు

దానిఁ జంపకయున్న - దయ యనంబడును,
దానిచేఁ గ్రమ్మఱ - లేచి మించి

వరరాజ్యమును వీడి - వచ్చు నీతోడ
వెఱవ కజ్ఞానంబు - వెంటనే వచ్చి,

జవనాథ ! కర్మవా-సన యనుఖాత
మున నిన్నుఁ బడఁ ద్రోసె-మోసంబు చేసి, 1600

పరఁగ నోదంబుపైఁ బఱచిన లతలు
దొరకను నీ తపో-దుఃఖంబు లగును,

అల కరిపరివార-మనుమానములును
వెలసిన నీమనో-వృత్తులే, మఱియుఁ

గరి కూలఁగాఁ బైనఁ గప్పిన దుమ్ము
నరయ నీకర్మ మో-హాంధకారంబు,

చలచిత్త! నీవిట్టి-సామజేంద్రంబు
చెలువున నూరకే- చెడితి వటంచు

నాగజోపాఖ్యాన-మా శిఖిధ్వజున
కా గుణశాలియై-నట్టి చూడాల 1610

పురుషాభిమానియౌ- భూపాలకునకుఁ
దరుణియై తాఁదెల్పు - తత్త్వార్థమందు

గుఱిని నిల్వఁ డటంచుఁ -గుంభాభిధాన
పురుషుఁడై జ్ఞాన మొ-ప్పఁగఁ జెప్పెననుచు

ముని రామునకుఁ జెప్పి-మోహం బడంచి,
మనము రంజిల్లఁగా - మరల ని ట్లనియె:

'వినురామ! యెంతటి-విద్వాంసుఁడైనఁ
దనియఁ దనంతనే- తత్త్వశాస్త్రములు

చదివి తపం బెంత-సల్పినఁగాని,
మది సంశయంబులు-మానవు, చిత్త 1620

చలపత్వ మణఁగదు-శాంతి లభింప,
దపరిమితానంద-మబ్బదు గాన,

గురుని సంపాదించు-కొని కొల్చి, యతని
కరుణకుఁ బాత్రుఁడై-కడ తేరవలయు;

నటు సేయలేక దే-హాభిమానమునఁ
గుటిలాత్ముఁడగువాఁడు కొన కెక్కలేఁడు,

ఎలమి శాస్త్రజ్ఞాన-మెంతైన గురుఁడు
కలుగకున్నందునఁ -గడముట్ట కణఁగు'.

అని వసిష్ఠుడు మ-హాకృప మీఱ
మనుకులోత్తముఁ జూచి మరల ని ట్లనియె: 1630

అలకుంభరూపిణి-యైన చూడాల
వలనొప్పఁగా శిఖి-ధ్వజుని వీక్షించి,

'మొనసి సర్వత్యాగ-మును జేయు 'మనిన
జననాథఁ డా బ్రహ్మ-చారికి మ్రొక్కి,

యడర ని ట్లనె 'నో మ-హా గురుస్వామి!
పుడమి రాజ్యము, గృహం-బులు, భోగములను

విడిచి, యిల్లాలిని -విడిచి నేవచ్చి
యడవిలోఁ దప మిప్పు-డాచరించెదను,

ఇనకోటినిభతేజ! యిపుడింతకన్న
నెనయు సర్వత్యాగ-మెటువంటి?' దనినఁ 1640

గుంభుఁ డి ట్లనియె మ-క్కువ నీ తపంబు
దంభమే కాని, త-త్త్వజ్ఞాన మగువె?

ఒనర నన్నియు వీఁడి- యొంటిగా వచ్చి
వనవాసి వగుట స-ర్వత్యాగ మగునె?

బడలినఁగాని త-పంబుపై నాశ
విడువలే వనుచు భూ-విభుని చెంగటనె

తా నుండి, యతని దు-స్తరతపశ్చరణ
మూని చూచుచునుండి - యొకకొన్ని నాళ్ళు

జరిగిన వెనుకఁ దాఁ-జాలిని బొంది,
యరమర లేక యి ట్లనియెఁ గుంభుండు: 1650

'ఓ మహారాజ! యీ-యుగ్రతపంబు
నీ మాడ్కిఁజేసి నీ వెంత[2] పెంచినను

నరయ సర్వత్యాగ-మబ్బదు నీకు
మఱియెట్టు లనిన నీ-మానసగ్రంథిఁ

దెగఁద్రెంచివైచి ము-క్తినిఁ బొందవలయుఁ;
దగు జగంబులకుఁ జి-త్తము బంధకంబు,

గాన దానిని ముందు-గా ద్రుంచితేని
దాన సర్వత్యాగ-ధన్యత నీకుఁ

గలుగు'నన్నను మహీ-కాంతుఁ డా కుంభు
నలర వీక్షించి యి-ట్లనియెఁ 'జిత్తంబు 1660

ఎట్టిది? దాని నే-నెటు తుంపవచ్చు?
నట్టి చందముఁ దెల్పుఁ' - డనినఁ గుంభుండు

పలికె నిట్లనుచు. 'నో-పార్థివాధీశ
యల వేదనాత్మ కా-హంకృతి చిత్త

బీజంబులోపల- బెరసిన రూప
బీజం బనఁగ నొప్పుఁ, - బెమపొంద దాని

లీలచేఁ జాలఁ గ-ల్గిన యనుభూతి
లాలితంబైన ప-ల్లవము తద్ద్వృద్ధి

నెఱయు నిరాకార-నిశ్చలాత్మికయు,
మురువొప్పు సంకల్ప-మూర్తియు ననఁగఁ 1670

దగు బుద్ధి, దాని భే-దము మానసంబు
నగుఁజేతనంబునం-దతివృద్ధిఁ బొంది,

చేకొనఁగారాని-చిత్తవృక్షమును
గూఁకటివ్రేళ్లైన-గుణములతోడఁ

బడద్రోయు' మనిన భూ-పతి కుంభుఁ జూచి
'యడరఁ జిత్తమ్మున-కహమిక మూల

కారణంబైనది-కావున దాని
పారంబు భావించి-భస్మంబు సేయఁ

దగు నగ్ని యెద్ది? సి-ధ్ధంబుగా నాకు
నగణితకృపను మీ-రానతిం' డనిన 1680

విని కుంభుఁ డనియె 'నో-విమలాంతరంగ!
తనురూప పంచభూ-తములు నేఁ గాను,

అలరు నీవిషయేంద్రి-యములు నేఁ గాను,
జెలఁగి మనోబుద్ధి-చిత్తముల్ నేను

గా, నహంకృతి నేను-గాను, మఱెవ్వ.
డే ననెడి విచార -మెప్పుడు నీకు

జనియించు నపుడు సు-జ్ఞానపావకుఁడు
పెనఁగు నహంకార బీజంబు నంటి

చెచ్చెర భస్మంబుఁ-జేయు' నటంచు
నచ్చుగాఁ దెల్పఁగా-నవనీశ్వరుండు 1690

బుద్ధి నూహించి కుం-భుని మోముఁ జూచి,
'సిద్ధంబుగా మీరు-చెప్పిన రీతి

గానే భావించితిఁ-గాను దేహంబు
గాను గోచరములు-గా నింద్రియములు

గాను మనంబును-గాను బుద్ధియును,
గాను జిత్తంబును గా-నహంకృతియుఁ,

నని రాజు పల్కఁగా-నా బ్రహ్మచారి
మనుజేంద్రుఁ జూచి స-మ్మతి నిన్ని నేను

గాను, గా నంటివి-గద! మ ఱెవ్వఁడవు?
పూని దెల్పు మటన్న-భూపాలుఁ డనియె; 1700

'సక లేంద్రియాదులు-జడములై పోఁగ
నకలంక మజడమై.-యుమలమై, యెఱుక

యగుచుఁ జావును, బుట్టు-వను రెండులేని
యగణిత చిన్మాత్ర-మగుదును నేను,

ఇటువంటి నన్ను నే-నెఱుఁగంగనీక
పటుతరాహంకృతి-భ్రాంతిఁ బుట్టించి,

బెట్టుగాఁ దాఁ జిత్త-బీజమై నిలిచి
నట్టు పడంచేసి-న న్నేఁచి యేఁచి,

పూని నే నెంత త-పోనిష్ఠ నున్నఁ
గాని న న్నూరకే- గాసింపుచుండు, 1710

దీనితోఁ బోరుచు-దిక్కేమి దోఁచ
కే నశక్తుఁడ నైతి-నిఁక నెట్టు? లనుచుఁ

బలుకఁగాఁ గుంభుఁ డా-పార్థివేశ్వరుని
సులలిత కరుణతోఁ జాచి కారణము

వలనఁ గార్యము పుట్టు-వసుధేశ?' యనఁగ
నలనరేశ్వరుఁడిట్టు-లనె 'గురుదేవ!

దొరకొన్న తొల్లిటి-దోష మీవ్యధల
కరయ కారణ మయ్యె-నటుగాన, దీనిఁ

బొరిగొని నను మీరు-ప్రోవఁగావలయు,
నుఱుకు చిత్తంబు చి-తోన్ముఖిగాఁగ 1720

నురురీతి నహమిక-యుదయించి మించి
పొరిఁబొరి వేదనల్-పుట్టించె' ననిన

నల కుంభుఁ డిట్లనెఁ 'నట్టివేదనల
కిలను గారణ మెద్దిఁయెఱిఁగింపు' మనిన

జననాథుఁ డనియె నో-సద్గురుస్వామి!
యనలవేదన కన్య-మై ప్రకాశించి

మొనయు సత్తా మాత్ర-ముననె వేదనలు
జనియింపుచుండుఁ ద-త్సర్వదుర్వ్యధల

నలఁగెడి చిత్తంబు-నకు విత్తుగాఁగ
నల యహమిక వేద-నాత్మకం బయ్యె' 1730

ననినఁ గుంభుఁడు పల్కె- నటువంటి కార్య
మునకుఁ గారణ కార్య-ములు రెండులేవు,

భ్రమయు భ్రాంతినిఁ ద్రాటఁ బామున్నరీతి
నమరఁగాఁ గనిపించి-యరసి చూచినను

పా మందు లేకున్న పగిది బ్రహ్మమునఁ
దా మించి సకలభూ-తప్రపంచంబు

భ్రాంతిచే నుండిన-భంగి గన్పించు,
వింతగా నందె భా-వించి చూచినను

మెఱయు ప్రపంచంబు-మిథ్యయై పోవు.
నెఱయు చిద్ర్బహ్మమే-నిత్యమై నిలుచు; 1740

నట్టి మిథ్యా రూప-మగు ప్రపంచంబు
పుట్టిన కారణం-బుగ నన్న నృపుఁడు

చెలఁగి యీసృష్టిఁ జే-సిన పద్మభవుఁడు
నెలమినిఁ గారణం బేల కాఁ?'డనిన

విని కుంభుఁడా భూమి-విభుఁ జూచి, శాంత
మనుపమంబగును బ్ర-హ్మంబు తదీయ

కలన మాబ్రహ్మకుఁ గారణం' బనుచుఁ
బలికిన విని మహీ-పతి 'కారణంబు

లేకయే బ్రహ్మ యే-లీల జనించె?
నాకుఁ దెల్పుఁ డటన్న -నగి కుంభుఁ డనియె: 1750

'ధరణీశ! విను మనం-తం బద్వయంబు,
పరమంబు, శాంతంబు పరిపూర్ణ, మజము.

అప్రతర్క్యం, బవ్య-యం, బమేయంబు
స్వప్రకాశంబును-స్వరూపంబు

నగుచు నవిజ్ఞేయ-మై, శుద్ధ బుద్ధ
మగుచు వెద్ది వెలుంగు-నయ్యాత్మ వలన

నా పద్మభవుఁడు తా-నై యుదయించె,
నాపట్ల సృష్టి త-దాత్మకం బగుచు

నెరసి తన్మాత్రమై-నెగడుచునుండుఁ ,
గర మొప్ప నటుగావఁ- గార్యంబు లేదు, 1760

కారణంబును లేదు-కావున నాకు
భూరి కర్తృత లేదు-భోక్తృత లేదు

అ పరబ్రహ్మమే-యఖిలమౌ టెరిగి
భూప! నీ యజ్ఞాన-బుద్ధి నణంచు,

నద్వయంబై పర-మామృతంబైన
సద్వస్తువునకు నా-శంబులే దెందు,

నట్టి బ్రహ్మంబు నీ-వై యుంటి వైన
గట్టిగా నిల్వ నె-క్కడఁ జోటు లేక

యజ్ఞాన మాత్మయం-దణఁగి నశించుఁ,
బ్రజ్ఞానమే పర-బ్రహ్మమై నిలుచు. 1770

నాదిదేవుఁడు తాఁ జి-దాత్మకుం డగుట
చే దివ్యమై ప్రకా -శించుఁ దనంత

నరయ భూసలిలాదు-లై పలుమాఱు
పరఁగెడు [3]శక్తి సం - పాత సంపాద

నాత్మలో నొంది తా-నన బ్రహ్మయనఁగ
నాత్మయే యుండుఁ- దదన్య సంవేది

మఱివేఱె లేదు బ్ర-హ్మమె సర్వ మనుచు
నెఱుకకు నెఱుకగా-నెఱుఁగు చైతన్య

సాన్నిధ్యమందెన్న-సకల ప్రపంచ
మున్న చందంబుగా - నుండు, లేకుండు: 1780

నున్నది సత్తయై - యుండు, లే దనుచు
నన్నది మాయమై-యణఁగు, బంగారు

రూప, నామముల చే- రూఢంబు లగుచుఁ
జూపట్టు భూషణ-స్తోమంబులట్ల,

నా పరబ్రహ్మమే-హరిహర బ్రహ్మ
రూపాదులగును వే-ఱుగ వొండు లేదు;

బంగారుగాక యా-భరణముల్ గాని
భంగి బ్రహ్మము గాక-ప్రత్యేకముగను

గలదె విశ్వం, బనఁ-గా భూవిభుండు
పలికె నిట్లనుచు 'నో--పరమమునీంద్ర! 1790

అరయ నా బ్రహ్మమే-యై ప్రపంచంబు
మెఱయుచుండఁగ మీరు-మి థ్యను టేమి?'

యనీనఁ గుంభు డిట్టు-లనియె నో నృపతి !
వినుము చెప్పెద నట్టి- వృత్తాంత మమర,

భర్మమం దొనర నా-భరణముల్ చిత్ర
కర్మ కల్పితములై-గనిపించి యణఁగు

చందంబుగా, బ్రహ్మ-సత్తాస్వరూప
మందు మాయా కల్పి-తా జ్ఞానరూప

వామక్రియాదులు నశియించిపోవు,
నామహాబ్రహ్మమే-యంతట నిండి 1800

తెలివియై యస్తిభా-తి ప్రియంబు లన
నలువొప్పు సచ్చిదా-నందమై యుండు ;

నామరూపంబులు నశియించుఁ గనుక,
నే మిథ్య యంటిని-నిఖిలవిశ్వంబు ;

నీవు నా వాక్యంబు-నిజముగా నెంచి
భావనాతీత స-ద్బ్రహ్మమే ననుచుఁ

జెప్పి చూపఁగరాని-చిద్వస్తువందుఁ
చెప్పునఁ బొందు ! సం-దేహంబు విడువు !

నామాట నిజముగా - నమ్ము! న' మ్మనిన
భూమీశ్వరుండు కుం-భుని పాదములకు 1810

మ్రొక్కి యి ట్లనియె నో-మునికులోత్తంస !
మిక్కుటంబైనట్టి మీబోధవలన

నెఱిఁగితిఁ దత్త్వం బ-దెట్లన్న వినుఁడు!
పరమాత్మయం దీ ప్ర-పంచ జాలంబు

చెలఁగెడి మరుమరీ-చికయందు జలము
గలరీతిఁ దోఁచిన -కైవడిగాను,

పరఁగ రజ్జువునందుఁ-బా మున్నరీతి,
నరయ స్వప్నపాయ-మగు ప్రపంచంబు

కర్త లేమినిఁ జేసి కలుగుట లేదు,
పూర్తిగా నుండుట-పోవుట లేదు, 1820

ఆదిమధ్యాంతంబు-లరయంగరాని
వేదాంత సారాత్మ-విమలమై నిండి,

ఇది యది యని చెప్ప- హేతువు లేక,
తుద మొదల్ గనరాక- తుర్యమై యున్న

యదియె సత్తామాత్ర మదియె నే నైతి;
నిది మిథ్య యనఁ గూడ-దీ చిత్సుఖంబు

మీ కటాక్షమున న-మేయానుభవము
నీకాలమునకు నే-నెఱిఁగితిఁ, దనువు

నే ననెడి యహంత- నీరసం బయ్యె;
నే నను తెలివిలో-నే యున్న గుట్టుఁ 1830

దెలిసితి, మీ యుప-దేశంబు నాకు
ఫలియించె' నని మ్రొక్కి పాషాణమటులఁ

గదలక చిత్తంబు-కనుదృష్టిలోనఁ
గుదిరియుండఁగ నట్ల-కొంతసే పుండి,

ముదమంది యట బహిర్ముఖుఁడైనఁ జూచి
'కొదవలే దిఁక నను కొని కుంభుఁ డనియె:

'క్రమ మొప్పఁగా మహి-కాంత! నీ విప్పు
డమలమై పరిపూర్ణ-మగు చిత్పదమునఁ

జెందితివే!? శాంతి-చిత్త విశ్రాంతి
నొందితి వే? 'యన్న-నుర్వీశు డనియె: 1840

ఓ గురుస్వామి! మీ-యురుకటాక్షమున
వేగఁ జిత్పదసౌఖ్య-విభవంబుఁ గంటి,

సాధుసాంగత్యంబు చపలాత్మునైన
బోధ సుధారసం-బున దేల్చు నింత

కాలంబు నా కీ సుఖము దోఁచకుండు
బేలొఁకో? యనఁ గుంభుఁ-డిట్లని పలికె:

'ధరణీశ! తెలియు మం-తః ప్రశాంతమునఁ
గురణాదివిషయ భో-గముల నణంపఁ

గోరినవాఁడు స-ద్గురువాక్య మాత్మ
నారూఢిగా నమ్మి-యనవరతంబు 1850

తక్కక గురుపద ధ్యానంబు సేయ.
నెక్కువయగుచు మ-హీజంబునందుఁ

గాలపాకంబునఁ గలిగిన పండ్లు
వ్రాలి నశించు కై-వడి లింగ దేహ

మాలిన్య మానాట-మ్రగ్గి నశించు;
నాలోన నుండు భేదాజ్ఞాన మణఁగు,

నజ్ఞాన మణఁగిన-నాత్మానుభవము
ప్రజ్ఞానమై నిండి-పండు, నంతటికి

సరస సద్గురు కటా-క్షము గల్గినట్టి
నరునకు సచ్చిదా-నందసౌఖ్యంబు 1860

దొరకు, చిత్త మణుంగుఁ -దుర్యసమాధి
యిరవగు చుండు, నీ-వీనాఁటి కట్టి

పరమ విజ్ఞాన సం-పన్నుండ వగుచుఁ
బొరిని జీవన్ముక్తిఁ బొందితి' వనిన

వసుధీశుఁ డనియె-నో వరగురుస్వామి!
వసుమతిమీఁద జీ-వన్ముక్తుఁడైన

నరుని చిత్తంబు వి-నాశ మొందినను
పరఁగఁ జిత్తములేక బ్రతికి యతండు

దరణిపై నుండు వి-ధం బెట్టు లనిన
గురుతర కరుణ నా కుంభుఁ డిట్లనియె; 1870

ఓ రాజ! విను పున-రుత్పత్తి వాస
నారూఢమై చిత్త-మజ్ఞుని యందుఁ

జలన మొందుచునుండు-సద్గురు కరుణ
వలన ముక్తుండైన-వరయోగియందుఁ

దరళిత మాని స-త్తా మాత్ర మగుచు
నిరుపమ చిత్తంబు-నిలిచియుండుటను

రహి నొప్పు సంకల్ప-రహిత మైనట్టి
సహజ కర్మంబున-సక్తుఁడై యతఁడు

గావింపుచున్న త-త్కర్మ మాయోగ
పావక ముఖమందు-భస్మమై పోవు. 1880

వరుసగా దాన జీ-వన్ముక్తుఁడైన
పురుషుండు క్రమ్మఱఁ బుట్టుట లేక,

తుదను విదేహము-క్తుండగు: నీవు
పొదువుగా శమదమం-బుల నొంది, సర్వ

శాంతుఁడవై సర్వ-సముఁడవై నిరత
మంతరంగ జ్ఞప్తి-నరయుచు నుండు,

వసుధఁ బ్రాప్తములైన వస్తుజాలములఁ
బొసఁగు నుదాసీన బుద్ధిచే నీవు

ననుభవించునుండు-మచలుండ వగుచు,
అనఘ! నిశ్చలచిత్తు లగు వారి కిలను 1890

దొడరు పునర్జన్మ-దుఃఖసంసార
ముడిగి నశించిపోవుచు నుండుఁగాన,

నీవు చలింపక - నిన్ను నీ విపుడు
భావింపు మనిన భూ-పతి కుంభుఁ జూచి

చలతాచలత్వముల్ సహజముల్ గాను
గలుగు, నారెంటి నే గతిని వారింతు?

నావిధమెఱిఁగింపు మనినఁ గుంభుండు
భూవరుఁ జూచి యో-పుణ్యాత్మ' వినుము!

పొగడొందు సలిల మం భోనిధియైన
పగిదిఁ బ్రపంచమే - బ్రహ్మమై యుండుఁ . 1900

గావున నీ వీయ-ఖండ లక్ష్యమున
భావింపు మా పర బ్రహ్మ మే ననుచు,

లలి నందుఁ జలతాచ-లత్వంబు లణఁగు,
బొలుచు రజ్జువు నందుఁ - బుట్టిన సర్ప

భయ మట్టిరజ్జువున్-భావింప మొదటి
భయము రజ్జువునందె - ప్రవిలీనమైన

పగిది బ్రహ్మమునఁ బ్ర-పంచ విభ్రాంతి
తగిలినప్పుడు పర-తత్త్వమై నట్టి

బ్రహ్మయందు లెస్స భావించి చూడ
బ్రహ్మయందే జగ -ద్భ్రాంతి లయించు; 1910

జననాథ! వేదాంత - శాస్త్రచింతనను,
ఘనతర సాధు సాం-గత్యంబు చేతఁ,

జిత్తంబు చల్లనై-శీతాంశు రీతి
సత్తాస్వరూపమై - శాంతినిఁ బొందు;

నా సత్తయే కేవలా-భాస మగుచు
భాసురమై స్వాను-భవముగా యోగి

వరులకుఁ. దోఁచు స-ర్వము బ్రహ్మ మనుచు,
మఱియెవ్వ రెఱుఁగరా - మర్మ' మటంచుఁ

దెలివిగా నిట్లుప-దేశింపఁగాను
వలనొప్ప నాశిఖి-ధ్వజు డందుఁ బూర్వ 1920

సందేహ ముక్తుఁడై , సతత సమాధి
యం దుండె; చూడాల - యపు డాత్మపురముఁ

జేరి మునుపటి రీతిఁ - జెలువొప్ప రాజ్య
భారంబు కొన్నాళ్ళు - భరియించియుండి,.

క్రమ్మఱ నాకాశ-గమనయై పోయి,
సమ్మతిగా నిజే-శ్వరు చెంతఁ జేరి,

కనుమూసి కధల క-క్కడ నున్న విభునిఁ
గనుఁగొని సంతోష - కలితాత్మ యగుచు

మురిసి నాథుని బహి-ర్ముఖునిఁ జేయుటకు
నరుదుగాఁ దాను సిం-హంబు చందమున 1930

ఘనగిరుల్ ఘూర్ణిల్ల - గర్జించె నపుడు,
వనచరుల్ బెదరి రా-వసుమతీశ్వరుఁడు

చలియింపకున్న నా-శ్చర్యంబు నొంది,
చెలరేఁగి మఱియు గర్జించి గర్జించి,

యలసినప్పటికైన - నవనీశ్వరుండు
వలనొప్ప మేరు ప-ర్వతముచందమునఁ

గదలక మెదల క-క్కడ సత్త్వనిష్ఠ
వదలకున్నటువంటి - వాని నీక్షించి,

యా రమణీమణి - యతని మేల్కొలుప
వేఱె యుపాయంబు - వెదకె నెట్లనిన, 1940

స్థూలాంగమం దుంచి - సూక్ష్మదేహమున
లాలితమతి నవ-లంభించి కొనుచు

ధరణీశు సత్త్వచి-త్తంబులోఁ జేరి,
సరగునఁ జైతన్య - చలన మొందించి,

జగముచందమున నా-కాశమార్గమున
కెగసి భూమికి డిగ్గి - యెప్పటివలెనె

చిలుక పంజరములోఁ - జేరినమాడ్కి
నలరుచు నిజదేహ - మందుఁ దాఁ జేరి,

నిలిచి చూచుచు నుండి - నృపుని చిత్తంబు
చలనంబు నొందగా - సామగానంబు 1950

కరణి సహస్రార - కమలమధ్యమున
సురుచిరమైనట్టి - సూక్ష్మ లక్ష్యమునఁ

దనరు వోంకార నా-దము మ్రోయ, దాని
వినుచుఁ జొక్కుచు మహి-విభుఁడు కన్నులను

దెఱచి, యా ముందర - దీపించి మున్ను
గురుఁడైన యట్టి య-క్కుంభు నీక్షించి,

యతని సద్భక్తితో - నర్చించి నిలిచి,
హిత మొప్పఁగా మ్రొక్కి - యెదుట నుండఁగను,

భూపాలుఁ జూచి కుం-భుఁడు సంతసించి
'యో పార్థివేశ్వర! - యోపుణ్యచరిత! 1960

వలనైన విమల జీ-వన్ముక్తి సుఖము
పొలుపొంద సుస్థితిఁ - బొందెనే నీకు?

పరమచిదానంద - పదవియం దిపుడు
సరససుబుద్ధి వి-శ్రాంతిఁ బొందితివె?

ఇది ఖేద, మిది మోద-మిది భేద మనుచు
మదిఁ దోఁచ కవి యెల్ల - మఱచితే? యిపుడు

కడలేని కర్మ సం-కల్ప జాలముల
విడిచితివే? జ్ఞాన -విభవ మొందితివె?

సర్వవైరాగ్యంబు - సర్వసౌమ్యంబు
సర్వశాంతము నీకు - సంభవించినది? 1970

యని పెక్కు విధముల - నడుగఁగా, నన్ని
విని కుంభునకు మహీ-విభుఁ డిట్టు లనియె:

'సద్గురువర్య! మీ - సత్కటాక్షమున
జిద్గగనానంద - సీమలోఁ జేరి,

సారవిహీననం-సారాంతమైన
భూరివిశ్రాంతినిఁ - బొందితి' ననిన

విని కుంభుఁ డనియె 'సం-విత్సుఖం బిచట
ననుభవింపుచు నుండు' - మని యొప్పఁ జెప్పి,

చాల సంతోషించి, - చని నిజభూమి
లీల దీపింపఁ బా-లింపుచు నుండె 1980

నన విని రాముఁ డి-ట్లనె ' నో మునీంద్ర!
ఘనశాంతిఁ బొంది య-ఖండాత్మ నిష్ఠ

నొంది యున్నట్టి యా - యుర్వీశుబుద్ధిఁ
జెంది. సత్త్వగుణంబు - శేషించి నిలిచి

యుండెనే?' యని వేడ్క - నొప్పుగా నడుగ.
నిండిన దయ నాము-ని ప్రభుం డనియె:

'విను రఘురామ! యా-వృత్తాంత మెల్ల
నెనయు ప్రబోధకు - హేతువై, యవని

మనము సత్త్యైక నిమ-గ్నమై యుండు,
ననువొంద నట్టి మ-హాత్ముని తనువు' 1990

సమయకుండఁగ శివాం -శంబై ధరిత్రి
నమలమై జీవించు' - నని చెప్పి, మరలఁ

బలికె నిట్లని ' రామ-భద్ర! చూడాల
విలసిత చరితమే - విను మ దె టనినఁ

బతిని వీడ్కొని నిజ - పట్టణమందు
హితమొప్ప రాజ్యంబు - నేలుచునుండి,

మఱి కొన్నినాళ్ళ కా-మనుజేంద్రుఁ జూడ
ముఱిసి కుంభుని రూప-మునఁ బోయి, ఖిన్న

వదనంబుతోఁ దల-వాంచి ఖేదంబు
మదిలోఁ బెనంగొను - మాడ్కిఁ గన్నీరు 2000

వెడలుచునుండఁగా, • వేఁడి నిట్టూర్పు
వెడలఁగా నమ్మహీ-విభుచెంత నిలిచె,

నా రీతి నిలిచి యు-న్నటువంటి బ్రహ్మ
చారినిఁ జూచి యా-జననాథుఁడనియె:

'సదమలచరిత! యో , సద్గురుస్వామి!
ఇదియేమి? యీ క్లేశ - మెందుకు వచ్చె?'

ననినఁ గుంభుం డిట్టు-లనె జననాథ!
నినుఁ జూడ నిచటికి-నేఁ బ్రేమచేత

వచ్చుమార్గమున దు-ర్వాసుండు నాకు
హెచ్చు కోపంబుతో - నెదురేఁగు దెంచి, 2010

తరమిడి 'నిర్నిమి-త్తంబుగాఁ బగలు
పురుషుఁడవై న-టింపుచునుండు! రాత్రి

పొలఁతివై నీ వుండు - పొమ్ము! పొమ్మనుచు
ఛలముతో నిటు ఘోర - శాపంబు నిచ్చెఁ ,

గావున మదికి దుఃఖము పుట్టె' ననిన
భూవిభుఁ డనియె ' నో , పుణ్యాత్మ! నీవు

ఆడల నేటికి? యెవ్వ-రైనను విధినిఁ
గడువలే' రని పల్క-గా, బ్రహ్మచారి

పగలెల్లఁ బురుషుఁడై - భావింప రాత్రి
మగవయై యిటు కొన్ని - మాసముల్ గడపి, 2020

తదనంతరమున భూ-ధవుని వీక్షించి,
పదపడి యొక రేయి - పల్కె ని ట్లనుచు:

'భామను నే నైతిఁ -బార్థివాధీశ!
భూమి నీ కనుగుణ - పురుషుఁడు లేఁడు,

కావున ననుఁ బొందఁ-గా వలె నింక
నీ' వని పల్కఁగా - సృపుఁ డందు కొప్పె,

నదిమొదటల్ రాత్రుల- యందు వేడుకగ

రమణీయకపటాను - రాగంబు మీఱఁ
గ్రమముగా గొన్నాళ్లు - కవ గూడి, యతని 2030

సకల సమత్వ భా-స్వర చిత్తశుద్ధి,
ప్రకటనిర్లేప స-ద్భావ నిశ్చయముఁ

గని మెచ్చి, యవల నొ-కానొకనాఁడు
పనిఁబూని " యామహీ- పాలు భోగేచ్ఛఁ

జెలు వొప్పఁగాఁ బరీ-క్షించెద' ననుచుఁ
దలఁచి యద్భుతమైన - తనయోగమాయ

చేత దేవేంద్రుని సృ-జియించె వేడ్క,
నౌతఱి నయ్యింద్రుఁ - డైరావతంబు

పై నెక్కి, సురసతుల్ - ప్రకటదేవతలు
నానాముఖంబుల పాటుగా గొలువ 2040

వచ్చి సురేంద్రుఁడా , వసుధేశు చెంత
నచ్చెరువుగ నిల్చె, - నాశిఖిధ్వజుఁడు

చూచి యాజిష్ణు న-చ్చోటఁ బూజించి
యీ చందమునను మీ-రిటకు వచ్చుటకు

హేతు?' వేమన నింద్రుఁ - డిట్లని పలికె:
'భూతలాధీశ! నీ - పుణ్యాతిశయము

మెచ్చి రంభాది కా-మినులు నీ పొందు
హెచ్చుగాఁ గోరి, యం-దెదురు చూచెదరు,

సకలభోగమ్ములా - స్వర్గలోకమున
సకలంకమతిని నీ-వనుభవింపుచును, 2050

నచ్చోట నిల్చి కల్పాంతంబుదనక
విచ్చలవిడిగాను - విహరింపువలయుఁ;

గావున నాకలో-కమునకు నీవు
రాపలె ననఁగ నా - రాజేంద్రుఁ డనియె:

'ఇంత మాత్రపుఁ బని - కింద్ర! నీ విటకు
దంత్రీందు నెక్కి రాఁ దగునె నన్ బిల్వ?

నీ వెంతఁ బిల్చిన - నే స్వర్గమునకు
రావలసిన దేమి? - రంభాదిపతుల

పొందు నే నొల్లఁ ద-ద్భోగంబు ----
నందించు నిండి' నే-నంతట నుండి, 2060

యరమర లేక బ్ర-హ్మంబునం దెపుడు
మెఱయుచు నేన ర మింతు, నీ స్వర్గ

భోగంబు నే నొల్లఁ - బొమ్మన్న నింద్రుఁ
డేఁగె మహిపాలుఁ - డిందుండె, నవలఁ

జూడాల మదిలోను - చోద్యమందుచును
బోఁడిఁమిఁ బతియందు - భోగేచ్ఛలేని

చందంబు భావించి - సంప్రీతి మెఱయ
నందుండి, కొన్ని నా-ళ్లరిగిన మీఁదఁ

గ్రమముగా నతని రా-గద్వేషయుగము
నమరఁ బరీక్షింతు - నని నిశ్చయించి 2070

యారూఢ యోగమా-యా ప్రభావమున
జారపురుషుని ము-చ్చటగా సృజించి

పగలు రాతిరిగాని - బలుసంధ్యవేళ
సొగసు లుప్పతిలంగ - జూతవృక్షంబు

క్రింద జారుఁడు తాను - గ్రీడింపుచున్న
సందడి నృపతి కా-శ్చర్యంబుగాను

వినిపింపఁజేసె, న-వ్విధము భావించి
మనమున హర్షించి - మచ్చికన్ వీర

లొనరంగఁ గ్రీడింపు - చుందురుగాక
యని సైగగా లేచి, " యందుండి యవల 2080

జనుచున్న యారాజ-చంద్రునిఁ, జూచి
తన మదిలో నిట్లు - తలఁచెఁ జూడాల

‘రాగరోషంబు లీ-రాజును విడిచె,
భోగేచ్ఛతోడనే - పోయె, నీ రీతి

సర్వసన్న్యాసియై - శాంతుఁడై పరమ
నిర్వాణపదమందు - నిల్చినా డహహ!

ఇఁకఁ బరీక్షింప -నేల? నా రూప
మంకితముగఁ జూపు - టర్హ మీమీఁద'

నని పతి చనుత్రోవ - కడ్డంబుపోయి,
నెనరుతో ముందఱ - నిలిచినఁ జూచి 2090

'యిందు బింబాస్య ! నీ-వెవ్వ? రిచ్చటికి
నెందుకు వచ్చితి ? - విపుడు నీమోము

చూచితే మద్భార్య చూడాలవలెనె
తోఁచుచున్న దిదేమి? - తోయరుహాక్షి!'

యనుచు రా జడుగఁగా - నయ్యింతి పలికె:
ననఘ ! చూడాల నే - నైనదే నిజము.

నెరయఁ దత్త్వార్థంబు - నీకు బోధించు
కొఱకుఁ గుంభుండనై - కొన వెళ్లఁ గాను

నద్వైత సారార్ధ-మై ప్రకాశించు
చిద్వస్తుతత్త్వంబుఁ - జెప్పి, పిమ్మటను 2100

బరఁగ దేవేంద్ర రూ-పంబును, జార
పురుష రూపంబు నొ-ప్పుగఁ దాల్చి, నేనె

పొందుగా నీ గుణం-బులు పరీక్షించి,
యిందు నా నిజరూప-మిపుడు చూపితిని;

'ధరణీశ ! యివి యెల్ల - దబ్బఱో, నిజమొ
తెఱఁగొప్ప నీయోగ - దృష్టినిఁ జూడు'

మనిన శిఖిధ్వజుఁ - డాత్మ భావించి,
మొనసి నన్నియు నిజం-బుగ మదినెంచి,

పలికె ని ట్లనుచు 'నో- భామాలలామ
పెలుచ నీ విపుడు చె-ప్పిన మాట లన్ని 2110

సత్యమౌ, వేదాంత - శాస్త్రార్థములను
నిత్యంబు నన్ను మ-న్నించి బోధించి,

వదలని నా కర్మ - వాసన నణఁచి,
చెదరని సుజ్ఞాన - సిద్ధిఁ బుట్టించి,

చెప్పి చూపఁగరాని - చిద్బ్రహ్మమందుఁ
దెప్పున నన్నుఁ బొం - దించితి వీవు.

కావున నిపుడు ని-ష్కర్షగాఁ జూడ,
నీవె నా గురుడఁవు - నీకె మ్రొక్కెదను:

అన విని చూడాల - యమ్మహీపతికి
మనము రంజిలఁ జెప్పి, - మరల నాఘనుని 2120

నిజపురిఁ జేర్చె: నా-నృపకులోత్తముఁడు
సుజనులు మెచ్చఁగాఁ - జూడాల, తాను

వదలక యమల జీ-వన్ముక్తు లగుచుఁ
బదివేలయేండ్లు భూ-పాలనఁ జేసి,

మొనసి యంత విదేహ - ముక్తినిఁ బొంది'
రనుచుఁ జూడాల వృ-త్తాంత మంతయును

జెప్పి, వసిష్ఠుండు - శ్రీరాముఁ జూచి
'యప్ప ! చిత్తత్యాగ - మైనదే శుభము,

ఎవరికైనను ధాత్రి - నిది నిక్క' మనుచు
నవిరళకరుణతో- - నా వసిష్ఠుండు 2130

ఘనమైన చూడాల - కథ రఘూత్తమున
కనువుగా బోధించె - ననుచు వాల్మీకి

తన శిష్యుఁడగు భర-ద్వాజ సంయమికి
వినిపించెఁ దత్కథ విశదంబుగాను.

ప్రకరణాంతద్విపడ



ఇది సోమనాథ వి-శ్వేశ్వరస్వామి
పదపద్మ భక్త సు-బ్రహ్మణ్య యోగి

చరణాంబుజాత ష-ట్చరణాయమాన
పరిపూర్ణ నిత్యస -ద్భావ నిమగ్న

మానసాంబుజ వెంగ-మాంబికా రచిత
మై, నిత్యమై, సత్య-మై ధన్యమైన 2140

సామార్థ సార సు-జ్ఞాన వాసిష్ఠ
రామాయణం బను - రమ్యసద్ద్విపద

యందు నెన్నఁ జతుర్థ-మగు ప్రకరణము.
అందమై విమల మో-క్షాకరం బగుచు

శ్రీ తరిగొండ నృ-సింహుంనంగ
ఖ్యాతిగా వెలయు వేం-కటరాయ ! నీదు

పదయుగళకి సమ-ర్పణమయ్యె, దీని
సదమలులై వ్రాసి - చదివిన, వినిన

నరులు తాపత్రయా-ర్ణవము తరించి,
పరమైన నిర్వాణ-పదము నొందుదురు;- 2150

భూచక్రమున నిది - పురుషార్ధ మగుచు
నాచంద్ర తారార్క -మై యుండుఁ గాత!

చతుర్ధప్రకరణము సమాప్తము

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. ఘనతరాజ్ఞాన సం-కలనచేఁ జిక్కి -వా.
  2. చచ్చినను-వేం.
  3. శక్తిసంభవిత -వా.