వాసిష్ఠరామాయణము (ద్విపద)/పంచమప్రకరణము

వికీసోర్స్ నుండి

తన శిష్యుఁడగు భర-ద్వాజ సంయమికి
వినిపించెఁ దత్కథ విశదంబుగాను.

ప్రకరణాంతద్విపడ



ఇది సోమనాథ వి-శ్వేశ్వరస్వామి
పదపద్మ భక్త సు-బ్రహ్మణ్య యోగి

చరణాంబుజాత ష-ట్చరణాయమాన
పరిపూర్ణ నిత్యస -ద్భావ నిమగ్న

మానసాంబుజ వెంగ-మాంబికా రచిత
మై, నిత్యమై, సత్య-మై ధన్యమైన 2140

సామార్థ సార సు-జ్ఞాన వాసిష్ఠ
రామాయణం బను - రమ్యసద్ద్విపద

యందు నెన్నఁ జతుర్థ-మగు ప్రకరణము.
అందమై విమల మో-క్షాకరం బగుచు

శ్రీ తరిగొండ నృ-సింహుంనంగ
ఖ్యాతిగా వెలయు వేం-కటరాయ ! నీదు

పదయుగళకి సమ-ర్పణమయ్యె, దీని
సదమలులై వ్రాసి - చదివిన, వినిన

నరులు తాపత్రయా-ర్ణవము తరించి,
పరమైన నిర్వాణ-పదము నొందుదురు;- 2150

భూచక్రమున నిది - పురుషార్ధ మగుచు
నాచంద్ర తారార్క -మై యుండుఁ గాత!

చతుర్ధప్రకరణము సమాప్తము

పంచమప్రకరణము

శ్రీ తారకోల్లాస - శేషాద్రివాస!
శ్రీ తరిగొండ సృ-సింహ! ధూతాంహ!

విన్నవించెద నది - వినుము వాల్మీకి
క్రన్నన చూడాల - కథ తెల్పఁగాను

తగవిని, యాభర - ద్వాజుండు మరల
నగణిత భక్తి ని -ట్లనె 'గురుస్వామి!

సురుచిరాత్ముఁడు వసి-ష్ణుఁడు రాఘవునకుఁ
జిరకృపన్ మఱి యేమి చెప్పె' నటంచు

నడుగ భరద్వాజు - నమ్ముని చూచి
యడరిన కరుణ ని-ట్లని చెప్పఁదొడఁగె 10

'ఆ వసిష్ఠుండు రా-మావనీశ్వరుని
భావించి క్రమ్మఱఁ - బలికె ని ట్లనుచు

'ధరణీశ! వినుము చి-త్త త్యాగ సరణి
వెఱిఁగి సేయందగు - నీ యర్థమందు

ఫలితార్ధమగు కచో-పాఖ్యానమొకటి
కలదు, చెప్పెద రామ! - క్రమముగా వినుము!

కచోపాఖ్యానము



అనిమిష దేశికుం-డైనట్టి గురుని
తనయుండు కచుఁ డాత్మ-తత్త్వంబుఁ దెలియు

కొఱకు దండ్రికి మ్రొక్కి - కొంక కి ట్లనియె:
'నరులకు సంసృతి - నశియించు విధముఁ 20

దెలుపు' మన్నను సుర - దేశికుం డనియె:
'వలనుగా వినుము స-ర్వ వివర్జనంబు

చేసిన సంసృతి - చెడు, నన్నఁ గచుఁడు
వాసిగా విని మ్రొక్కి - వనముల కేఁగి,

ఘనతర వైరాగ్య - కలితాత్ముఁడగుచు
నెనిమిదేండ్లు చరించి - యించుకంతైన

శమము నొందక, మదిఁ -జలన మొందఁగను,
అమర దేశికుపాలి - కరిగి కచుండు

'ఓ తండ్రి! మది శమ-మొందలే, దేమి
సేతు?' నటంచు వ-చింపఁగా, గురుఁడు 30

మది శమ మొందు మ-ర్మంబు లన్నియును
వదలక చెప్పి, సర్వ - త్యాగవిధము

నప్పుడు బోధించె, - నటమీఁదఁ గచుఁడు
తెప్పునఁ బటు విర-క్తినిఁ బొంది పోయి,

గతవల్కలుండై య-ఖండతపంబు
మతి నిల్పి చేసి, శ-మం బొం

మూఁడేండ్ల మీఁద ని-మ్ముగ !
యేడ నుండిన, దపం - బెంత చేసినను

జిత్తవిశ్రమ మెందుఁ - జిక్కలే దనఁగ
నత్తనయునిఁ జూచి - యనియె గురుండు 40

'ఎలమిఁ జిత్తత్యాగ - మెఱిగి చేసినను
వలనుగా నీకు సర్వత్యాగ మొదవు'

ననఁ గచుండనెఁ 'జిత్త - మనునది యెద్ది?
కని దానిఁ బట్టి త్యా-గము సేయు టెట్లు?

తెలుపుఁ డన్నను సుర - దేశికుం డనియె:
'నలువొప్పఁ జిత్త మ-నంగ వేఱొకటి

లే, దహంకృతియె; త-ల్లీలయే మనము,
పాదుగా నిదిలోన - భావించి తెలిసి

తత్త్యాగ మొనరించు - తనయ! నీ' వనఁగ
నత్యంత భక్తితో - నప్పు డా కచుఁడు 50

'ఏ రీతిఁ దత్త్యాగ - మేను గావింతు?
నారీతిఁ దెల్పవే!' - యన గురుండనియె:

నెలవొప్పఁ జిత్తమున్ - నిటల మందుంచి
తళుకుఁగన్నులు మూయు - తఱి మీఁదీకంట

మనమునఁ దోఁచు నా- త్మ ప్రత్యయమును
మనసు చేతనె లోన - మథియింపుచున్న

నదియె తారకయోగ - మగు; దృశ్యములను
చెదరఁ జూచినది నీ - చిత్త, మాచిత్త

మునకు దృశ్యములుగా - మొనసిన వెల్ల
నొనర నశ్యము లగు - చుండఁగా, నట్టి 60

దృశ్యంబులకు నగు దృక్కు చిత్తంబు
దృశ్యమౌ నీ, కాది - దృక్కువే నీవు;

పన్నుగా నిదిలోన - భావించి చూద
నన్నిటికిని ద్రష్ట - వయ్యెడ వీవె!

యనినఁ గచుం డిట్టు - లనియె 'నే నెవఁడ
నని చూతుఁ దెల్పవే! ' - యన గురుం డనియె:

'నా నోటనున్న దే-నాల్క?' యటన్న
వానిచందంబుగా - వచియించె దీవు,

క్రన్నన నాల్క లే-కయె 'నోట నాల్క
యున్నదో లేదొ మీ-రొగిఁ జూడుఁ డనెడు 70

పలుకు పుట్టునె? నాల్క - పలుక కుండినను,
కలిగిన నీవు లే-కయె నే నెవఁడను?

దెలుపు మనెడు వాఁడు - తేర కన్యుండు
గలుగఁడు, లోన ని-ష్కర్షగాఁ జూడఁ,

దెలుపు నా కిపు డన్న-దే నీవు సుమ్ము!
పొలుచు చైతన్య రూ-పుఁడ వైన నీవు

లేకయే నాల్క యే - లీల వచించు?
నో కుమారక! జడ - మూహింప జిహ్వ..

నీ వజడంబును - నిత్యంబు, నజము
పావనంబును, బరా-త్పరము, నద్వయము. 80

కావున ని న్నేఁచు - కాయాభిమాన
భావన నొందకన్ - బ్రహ్మమే నేను

అని నిగమాంత సి-ద్ధాంతసౌఖ్యంబు
ననుభవింపుచునుండు! - మదె చిత్సమాధి,

యేక, మాద్యంత ర-హిత, మవ్యయంబు,
నాకాశసదృశంబు, - నగుణ, మనంత

సచ్చిదానంద, మా-స్వానుభవంబు
నచ్చుగాఁ బొందు! నం-దడ్డమై నిన్నుఁ

బొదువు నహంకార - భూతంబు నణఁచి
కుదురుగా నిందుండు- కొడుక!' యటంచుఁ 90

జెప్పిన తండ్రి నీ-క్షించి కచుండు
'కప్పుచుండెడి నహం-కార మెచ్చోటఁ

బుట్టు? నెచ్చటఁ జెడి - పోవు? నా రీతి
దిట్టముగా నాకుఁ -దెలుపవే!' యనిన

విని యమరగురుండు - వేడ్క ని ట్లనియె:
'అనఘ! యహంకార - మాకాశమందుఁ

బుట్టు తోయదమట్లు - పొడము, నణంగు,
నట్టి మిథ్యారూప-మగు నహంకృతిని

నజ్ఞులు నిజముగా - ననుసరింపుదురు;
ప్రాజ్ఞుల కది వట్టి - భ్రాంతిగాఁ దోఁచి 100

విడిచిన, మాయ తా - విరిసి నశించు.
నడరఁగా నీవు, నే - నను ద్వైతబుద్ధి

మెఱసి, పిమ్మట నదే - మిథ్యయై పోవు.
నఱిముఱి స్వప్నంబు - లన్ని నశ్యములు:

కావున దిగ్దేశ. - కాల, కర్మములు
పోవఁగా నంతట • పూర్ణమై, పైన

మిగిలిన సద్రూప - మేనె యటంచు
జగదతీతంబై ప్ర-శాంతినిఁ బొందు

మపుడు సర్వత్యాగ-మగు నీ' కటంచు
సుపదేశ మిచ్చిన, - నూహించి కచుఁడు 110

సర్వశాంతినిఁ బొంది, - సచ్చిదానంద
నిర్వాణపద మందె - నిలిచె' నటంచుఁ

బావనంబగు కచో-పాఖ్యాన సరణి
నావసిష్ఠమునీంద్రుఁ - డా రాఘవువకు

వినిపించి, కల్పిత - విశ్వచిత్రంబు
మనమున భావించి - మరల ని ట్లనియె:
'
రామ! విచారింప - రమణీయ మగుచు
నామహానీయ చి-దానంద మొదవుఁ,

జక్కఁగా నాత్మ వి-చారింపకున్న
నిక్కి యహంకృతి - నేను, నే ననుచుఁ 120

జెలఁగి మమత్వంబు-చే విజృంభించి,
పొలుపార సుఖదుఃఖ-ములఁ బొందుచుండి,

యవల నిరర్థకం-బై చెడిపోవు:
నవిరళ చరిత! యీ-యర్థంబునందు

మిథ్యాపురుషాఖ్యానము



అలర మిథ్యా పురు-షాఖ్యాన మొకటి
కల దది యెట్లన్నఁ - గ్రమముగా వినుము!

కలఁడు మాయా యంత్ర - గతుఁడైన పురుషుఁ
డలరి యాకాశంబు - నార్జించి, దాని

దాఁచి పెట్టుట కిల్లు - తాను గట్టించి,
చూచుచుండఁగ నది - స్రుక్కి నశించె; 130

నా యింటి తోడనే - యాకాశ మణగి
పోయె నింకె? ట్లని - పొగిలి, పిమ్మటను

గగనమున్ రక్షింపఁ గావలె ననుచుఁ
బగటుమీఱఁగ నొక-బావిఁ ద్రవ్వఁగను

ఆ వాఁటి కా నాఁటి కా-బావి పూడె.
తా నందుఁ గూపగ-తంబైన నభము

పోయెనే హా! యని -పొరలాడి యేడ్చి
యా యాకసముఁ గావ - నటుమీఁద వాడు

కొండలు, మేడలు,- గొప్పలౌ నూతు
లొండొంటిఁ గట్టుచు - నుండఁగా, నవియు 140

నటు చెడుచుండఁగా, - 'నంబరం బణఁగె
నెటు చేతు?' ననుచు వాఁ డెలుఁగెత్తి యేడ్చు;

ననఘ! నీ కిప్పు డీ-యర్థంబు నేను
వినిపింతు నెట్లన్న - వినుము సర్గాది

యం దనంతంబు, శూ-న్యంబు, నాత్మగుచు
మందమైనటువంటి - మాయాంబరమున,

బొలుచు నహంకార - పురుషుండు గలిగి
యలరి యనాత్మ తా-నగుచు నుండియును

రహి మీఱఁగా నాత్మ - రక్షణ కొఱకు
బహుశరీరముల క-ల్పనములు చేసి, 150

యవి చెడుచుండఁగా - నా రీతిఁ జూచి,
యవిరళాత్మకు వచ్చె - హాని యటంచు

నూరకే తా నేడ్చు. - చుండు నజ్ఞుండు.
ధీరాత్మ! నీ విది - తెలిసి భూస్థలిని

ఘటమఠాద్యాకార-కములు నశించి
నటువంటి కాలంబు -లందు ఖేదంబు

మది నంటనీయక. - మాయగా నెఱిఁగి
కుదిరికగా నుండు - కోదండరామ!

అమితమౌ నభమున కన్న విస్తృతము.
నమలంబు. ఘన, మశూ-న్యం బచలంబు, 160

వ్యాకోచమైన చి-దాత్మయే గ్రాహ్య
మై కొనసాగఁగా, నాయాత్మయందు

మొనయు చిత్తాకాశ మున మేను లుబ్బి
చనఁగఁ, దదాత్మ నా-శము నొంది ననుచు

నజ్ఞాను లూరకె - యడలుచుండుదురు;
ప్రాజ్ఞు లందుకు దుఃఖ-పడ; రావిధమున

ఘటమఠాదులు చెడఁ-గా లోన నుండు
నటువంటి యాకాశ - మణఁగని మాడ్కి

దేహముల్ వరుసగాఁ - దెగిపోవుచున్న
దేహి నిర్లేపుఁడై - ధీరత నుండుఁ; 170

గావున శాంతం, బ-ఖండ, మద్వయము,
భావనాతీత మా-బ్రహ్మ మంతయును

నీవె యనుచు నెంచి - నీటుగా నాత్మ
భావింపు మోరామ-భద్ర! సంసార

విరహితుఁడై భేద - విభ్రాంతి మఱచి,
నెరసి బ్రహ్మంబు తా-నే నని చూచు

పురుషునకును లభించు - బుద్ధి విశ్రాంతి,
యరయఁగా నతఁడె మ-హా కర్త యగును;

అది యెటువలె నన్న - నఖిలచింతలను
మదిలో విసర్జించి - మాయాబ్ది దాఁటి 180

కొదుకక చిన్మాత్ర - కోటరపదవి
విదితంబుగాఁ బొంది - వేద్య నిర్ముక్త

నిరతసంవిత్తత్త్వ - నిష్ఠ నేమఱక
యెఱుకనే భావింపు, - మెల్ల దిక్కులను

వెలయుశబ్దములను - వినను, శీతోష్ణ
ముల నెఱుంగను, రూప-ములను గన్గొనను,

గోరి షడ్రసములఁ - గొ-------- దముల
మూరుకొనను యోగ్య-ముగ ---------తెలివి

యా పరమాత్మగా - కన్య మొం డొకటి
యేపట్లనైన లే - దెఱుకే పరాత్మ. 190

యా రహస్యాత్మ యం-దంట, కజ్ఞాన
కారణమై యహం - కార పూరుషుఁడు

తా నన్నిటికినిఁ గ-ర్త నటంచు మూఢ
మానవులను వృథా - మాయాబ్ధియందు

ముంచు సంతియె కాని, - ముక్తపూరుషుల
యంచున నిల్వలే -కణఁగు మిథ్యగుచు.

శ్రీరామచంద్ర! యా - చిద్బ్రహ్మమునకుఁ
బారంబు లే, దిట్లు - భావించినట్టి

యతఁడె మహాత్యాగి - యనఁబడు, మఱియు
నతఁడె మహాకర్త - యన నొప్పుచుండు,200

నతఁడె మహాభోక్త - యగుచుండు; దీని
కితిహాస మొక్కటి - యేను చెప్పెదను.

భృంగి ఉపాఖ్యానము



విను! భృంగి యొకనాఁడు - విశ్వేశుఁజేరి
ఘనభక్తితో మ్రొక్కి - కరములు మోడ్చి

'యో నాగభూషణ! - యో ధర్మనిపుణ!
యే నిశ్చయముఁబట్టి - యీ జగజ్జీర్ణ

గేహమందుండి యీ - క్లేశ సంసార
మోహబ్ది నెటు దాఁటి - ముక్తిఁ బొందుదును?

ఆవిధ మెఱిగింపుఁ - డనిన, సత్కృపను
పాపకాక్షుఁడు నవ్వి - పల్కె ని ట్లనుచు210

'ననఘ! భృంగీశ! మ-హా గోప్య మొకటి
వినిపింతు, నది నీవు - వేర్వేఱ వినుము!

తలఁప జన్మము మృతి, - ధర్మ మధర్మ
ములు లేవు, సుఖదు:ఖ-ములు లేవు తనకు'

నని ధృఢంబుగ నెంచి - నటువంటి పురుషుఁ
డసఘాత్ముఁ డగుచు మ-హాత్యాగి యగును;

సంతోషమున సర్వ - సమబుద్ధితోడ
శాంతుఁడై క్రోధ వా-సన నంట కెపుడు

తగు కోర్కెలను వీడి - తనకుఁ బ్రాప్తంబు
లగు పదార్థంబుల - ననుభవింపుచును220

విమలాంతరంగుఁడై - విహరింపుచున్న
నమరఁగా నతఁడె మ-హాభోక్త యగును;

పొలుచు ధర్మాధర్మ - ముల, సుఖదుఃఖ
ముల,రాగదోష, దు-ర్మోహ లోభముల

ఫల, ఫలాభావముల్ - భావించి మదినిఁ
దలఁప, కంతటఁ బర - తత్త్వమే చూచు;

నతఁడు మహాకర్త - యగు, దృశ్యకరణ
వితతిఁ దొరంగిన - విమలవర్తనుఁడు

నగును ఘహాభోక్త' - యని శంకరుండు
తగ నుపదేశింప - ధన్యుఁడై భృంగి230

యా రీతిగాఁ ద్యాగి-యై, కర్త, భోక్త
యై రాజయోగ సౌ-ఖ్యము నొందుచుండె.

నీవు నవ్విధమున - నిపుణుండ వగుచు
భావించి యానంద - పదమెదఁ బొందు;

మలరి యంతర్ముఖుం-డై బాహ్యమందు
వలనుగాఁ దాఁ జేయ-వలయు కార్యములఁ

జేయుచు నుండియుఁ - జిత్సౌఖ్యపదవి
నే యెడలను వీడ - కెనసి వర్తించు

నతఁడు శాంతుఁడు నిర-హంకారుఁ డగుచు
హితమొప్పఁ దన్నుఁదా - నెఱిఁగి మోదించు:240

అనఘాత్మ! విను మాయ-హంకార భావ
మున నాత్మ తత్త్వ మి-మ్ముగఁ బొందరాదు.

గురుఁడు చెప్పినమీఁద - గుఱుతుగా నాత్మ
నెఱిఁగి యహంకృతి - నెడఁబాయవచ్చు'

సనిన రాఘవుఁ డిట్టు-లనె 'నో మహాత్మ!
తనర నహంతాభి - ధానచిత్తంబు

గతమైన యప్పుడ-క్కడ సత్త్వగుణము
హిత మొప్ప నొక్కటె - యేరీతి నిలుచు?

నానతిం 'డనిన రా - మావనీంద్రునకు
మౌని యిట్లనియె - 'నోమనువంశతిలక!250

విలసిత ప్రజ్ఞతో - వినుము చెప్పెదను,
కలుషం బణఁగ నహం-కార మయంబు

గా నుండు చిత్తంబు - గతమైన వెనుక
నూని కామాదులం - దుదయింప కణఁగి

పోవు, సత్త్వగుణంబు • పొసఁగ శేషించి
యా విమలాత్మయం - వంటి విదేహ

ముక్తి పర్యంత మి-మ్ముగ నుండు, విషయ
రక్తిలోఁ జొరదు; వా-రక రక్తి మరలఁ

బొరిఁ గాలవశమునఁ - బుట్టినఁగాని
సరసిజంబును ముంపఁ -జాలని జలము260

కరణి నయ్యాత్మ న-క్కడ ముంపలేక
వెఱచి తొలంగు. నా - విమలవర్తనుని

వాసనాగ్రంథులు - వాఁడి నశించు,
భాసురశాంతి సం-పద చాల మించుఁ,

గోప మా నాఁట సం-కుచితమై పోవు,
దీపించు సుజ్ఞాన దృష్టి యంతటను;

పొలుపొంద నిటు సుల-భోపాయమైన
యలఘు సన్ముక్తి ప్ర-యత్నంబు సేయఁ

జాలక సంసార -జలధిలో మునిఁగి
యాలస్యమున మూర్ఖుఁ- డగువాని తనువుఁ270

గాలిచి చెప్పినఁ - గలుగునే జ్ఞాన?
మేల వానిఁ దలంప - నినకులోత్తంస?'

యని ముని భృంగీశ్వ - రాఖ్యాన మెల్ల
మను జేంద్రునకుఁ - జెప్పి మఱియు నిట్లనియె:

ఇక్ష్వాకూపాఖ్యానము



'అనఘాత్మ! యిక్ష్వాకుఁ - డను మహారాజు
మనువును జేరి స-మ్మతముగా మ్రొక్కి

పలికె ని ట్లని 'యీ ప్ర-పంచ మేరీతిఁ
గలుగు? నె ట్లణగు? నేఁ - గర్మ పాశమును

ఏరీతిఁ దేగఁద్రెంతు? - నిరవైనముక్తి
నేరీతిఁ బొందుదు? - నెఱిఁగింపుఁడనిన280

మను విట్టు లనియెఁ 'గు - మార! నీ బుద్ధి
యనఘమై దీపించె - నహహ! నీ ప్రశ్న

యనుపమంబగు, శరీ-రాది దృశ్యములు
గనిపించు మృగతృష్ణ - కైవడి నంతె,

కాని నిక్కముగా, ద-ఖండ చిద్గగన
మే నిత్య మగు, నది - మిథ్యగా దెపుడు;

జగము దుర్మోహాతి - శయ [1]'భావములను
నిగుడి యద్దములోని - నీడకైవడిని

భ్రాంత చిత్తులకు ని-బద్దిగాఁ దోచు;
నంతియె కాని ని-త్యంబుగా దెపుడు.290

రక్తిగా మాయాస్సు-రణచే ననేక
శక్తులె బ్రహ్మాండ -జాలంబు లగును,

పలుమాఱు బహు భూత -[2] భావన భావ్య
ముల నగు నాబ్రహ్మ-ము చలింపకుండు:

రమణీయ జలము త- రంగంబు లైన
క్రమమునఁ జిచ్ఛక్తి - కళ విశ్వమగును,

గావున బంధమో-క్షంబులు రెండు
లేవు. చలాచల - లీలాకలనలఁ

దలఁపక సర్వశాం-తమును వహించి
యెలమి నీ రాజ్యంబు-నేలుచునుండు!300

తనఱొమ్ముపై నున్న - తనయునిఁ దాను
గనక యెం దరిగెనో - గద! యని యేడ్చు

జనని చందంబున - జరయును, మరణ
మును లేక హృదయాబ్జ-మున వెలుంగుచును

నున్నయాత్మను గాన - కురుచింత నొంది,
విన్ననై యెచటనో - వెదకు మూడుండు:

తానె దేహం బని - తనువున కొక్క
హాని వచ్చినఁ దానె - యణఁగుదు నంచుఁ

దలఁకు చుండునుగాని,- తా నాత్మ ననెడి
తెలివి నొందఁగ లేడు - దేహాభిమాని;310

ఇట్టి మూఢాత్ముల-నేకులు ధరను
బుట్టుచుందురు ముక్తిఁ - బొందనేరకను,

అరయ నబ్ధులు బుగ్గ-లైన చందమున
సరవి నెప్పుడు చిత్త - సంకల్ప మహిమ

వలన నీ సృష్టి స-ర్వము నగుచుండుఁ,
దలఁపునఁ గదలి క-దలకుండు నాత్మ

సంకల్ప మది రాజ్య-సౌఖ్య మంతటను
పొంకమై యనుభవిం-పుచునుండు నెపుడు,

అరయఁ జిత్తము మాయ - యనుదానిచేత
నిరవంది సర్వమో-హిని యగుఁగాన320

ఘనతరంబుగ సర్వ - గతమగు నాత్మ
యెన లేని తన్నుఁదా - నెఱుఁగంగ లేదు,

అగణితంబగు సచ్చి - దాకాశమయము
జగ మని భావించు - శాంతవర్తనుఁడు

క్రమముగా సద్భ్రహ్మ - కవచుఁడై, సతత
మమితసుఖం బొంది, - యహమిక లేక

నంతయు చిద్భ్రహ్మ - మని సతతంబు
చింతించు పరయోగి - చిత్పద మొందుఁ;

గావున నీ వీజ-గద్భ్రాంతి విడిచి
పావన చిద్బ్రహ్మ - పదమందుఁ బొందు!330
యతియైన, గృహియైన - నతిశాంతుఁడైన
సతత మీ జ్ఞానమే సాధింపవలయుఁ
బూని పట్టుటయును - బోవుట, నీవు.
నే నను టాత్మలో - నిరసించి, మమత
వీడి [3]తనను దానె - వీక్షించుచున్న,
వాఁ డెటు లున్న జీవన్ముక్తుఁ డగును.
ఆసుదన మీ ధ్యాన - మభ్యసింపకయె
తనుసుఖంబును గోరు - తామసాత్మునకుఁ
దెలియఁజెప్పిన యుప-దేశవాక్యములు
మేలుగాఁ జవిటిభూమిని విత్తినట్టి340
విత్తుల వలెఁ బోవు - విఫలంబు లగుచుఁ
జిత్తశుద్ధుండైన - శిష్యోత్తమునకుఁ
దేటగా గురుఁ డుపదేశించినట్టి
మాటలు ప్రోదియౌ - మహిమీఁద నిడిన
ఘనబీజములరీతి - గాను ఫలించుఁ;
బనుపడ హరిహర - బ్రహ్మాదు లొనర
బహువిధలీల లేర్పడఁ జూపుచున్న
సహజమౌ చిద్విలా -సంబుగా నెఱుఁగు,
సలలిత సర్వద-ర్శనములయందుఁ
గల యర్థములను నిష్కర్షగాఁ జూచి350

యది భేదరహిత మ-హాబ్రహ్మ మనుచుఁ
జెదరక యాత్మలోఁ జింతించు వాఁడు

కుదిరికగా నిరం-కుశ తృప్తిఁ బొందుఁ,
జెదరిపోపుచునున్న - చిత్తలయంబుఁ

జేసిన వరయోగి - చిత్సౌఖ్యపటిమ
వాసిగా ధర - నెంతవారికి రాదు:

లలి ముక్తి దేశ కా-లములందు లేదు,
బలియు నహంకార - భావంబు నణఁచి

విడిచినదే ముక్తి - విమలాంతరంగ!
పుడమి నీయనుభవం-బును దృఢంబుగను360

దలఁపుచునుండు మం-తర్లక్ష్యమతిని;
అలపడు వర్ణాశ్ర-మాచారశాస్త్ర

వనధిఁదరించు నె-వ్వఁడు వాఁడు కర్మ
జనిత ప్రపంచపం-జరమును ద్రెంచి

యనముఁడై యిచ్ఛా వి-హారియై ముక్తి
కనుకూలుడై యుండు - నానంద మొందు.

లలితాత్మ! కర్మఫ-లత్యాగి నిలను
బొలుపుగా నంటవు - పుణ్యపాపములు.

కామకర్మంబులు - గావించువారు
పామరులై పుణ్య - పాపఫలముల370

ననుభవింపుచునుండు - రజ్ఞాను లగుచు,
ఘనతర జ్ఞాన మా-ర్గము నెఱుంగకను

తనువుల సకల తీ-ర్ధములలో ముంచి
పనివడఁ గష్టంబు - పాలు గావించి,

తుదను ముక్తినిఁ బొందు-దు మటంచుఁ దలఁతు,
రది యెట్టులన్న మ-హాతీర్థములను

శ్వానముల్ మునిఁగిన - చందంబు గాదె?
జ్ఞానంబు గలుగ నా - క్షణమాత్రమందె

యానందకరమగు - నమలసమాధిఁ
బూని జీవన్ముక్తిఁ - బొందఁగావచ్చు'380

ననఁగ నిక్ష్వాకుఁ డి-ట్లనె నింద్రియముల
కును, విషయంబుల-కును, బరాత్మకును

వేఱుగా కొకటి యౌ-విధము దోఁచినది.
యారీతిఁ దెలియు టె?-ట్లన మను వనియె:

'విను పక్షు లంబర - వీథిఁ జరించు
ననువున విషయేంద్రి-యము లాత్మయందు

వరుసగాఁ దమతమ - వ్యాపారములను
జరియించు, నాత్మ కా -సంగంబుం గలదె?390

గగనాంతరమునందు - గాలి చరింప
గగన, వాయువులకుఁ - గలదె సంగంబు?

ఆ చందమున సచ్చి-దాకాశమందుఁ
దోచుఁ బ్రపంచంబు - తుది నంటలేదు.

కనుకఁ బ్రపంచంబు - కల్లగా నెఱిఁగి
తనుతరశుద్ధ చై-తన్యంబు వెపుడు

గనుఁగొనుచుండు మ-ఖండ లక్ష్యమున'
ననఁగ నిక్ష్వాకుఁ డి-ట్లనియె 'నో తండ్రి!

త్రిగుణంబు లడ్డమై - త్రిమ్మరుచున్న
నగుణచైతన్యంబు - నరయు టె?ట్లనిన400

మను విట్టు లనియెఁ 'జి - న్మయమగు గుణము
ఘనమగు చైతన్య - గగన వస్తువును

గుణములచేఁ గనఁ - గూడునె?' యనిన
గుణవంత! విను కొండ - గుఱివెట్టినటుల

నంతయు బ్రహ్మమే - యని యఖండముగ
చింతించి పొందుమా! - చిత్పదమందె'

యని యుపదేశించి- యామను నరిగె.
ననఘుఁడై యిక్ష్వాకుఁ-డా జ్ఞాన మెఱిఁగి,

పొసఁగ జీవన్ముక్తిఁ - బొంది రాజ్యంబు
పన మీఱ ధీరుఁడై-పాలించుచుండె,410

ననుచు నిక్ష్వాకు వృ-త్తాంత మా మౌని
మనుజేంద్రునకుఁ జెప్పి - మఱియు నిట్లనియె:

శ్రీరామ! యిపుడు నేఁ -జెప్పినరీతి
నారూఢ విజ్ఞాని - యగువాని కిలను

లౌకికాచార జా-లంబులు తఱచు
లేక, ప్రపంచని-ర్లేపుఁడై యుండు'

నన విని శ్రీరాముఁ - డతనికి మ్రొక్కి
'మునీనాథ! జీవత్వ - ముక్తు లీయిలను

నాకాశగమనాదు - లైన సిద్ధులను
జోకగాఁ గోర రె-చ్చోటులనైన420

ననియంటి, రిఁక వారి - యధికత లెట్లు
గనవచ్చు?" నని పల్కఁ-గా నా వసిష్ఠ

ముని రాము నీక్షించి - మొనసి యిట్లనియె.
'ననఘాత్మ! విజ్ఞాను - లైనట్టివారు

ఆశయసిద్ధులం - దాసక్తిపడరు
ప్రతిభతో మంత్ర జ-పక్రియాథ్యాన
వరహఠయోగముల్ - వరుసగా సల్పు
పురుషి లా - సిద్ధులం - బొంది, లోకముల
సురుచిన మహిమముల్ - చూపుచు నుందు
రరుదుగా నందుచే - నధికత రాదు;430
అక్కజంబుగ జ్ఞాని - కజ్ఞానిలా కరయ
నెక్కువ తక్కువ - నేరీతిఁ దెలియ
వచ్చు? న టన్న సర్వప్రపంచంబు
మెచ్చి యిదంతను - మిథ్యగాఁ గనుట,
అన్ని కార్యంబులం - దాసక్తి విడిచి
మున్నడఁ బరమార్థ మూహించి కనుట.
త న్నొరుల్ తిట్టినఁ దాను వారలను
బనుఁగఁ దిట్టక - పటుశాంతుఁ డగుట.
పుత్రదారాడుల, భూప్రజాతతుల,
శత్రుమిత్రుల నొక్క - సమముగాఁ గనుట,440
పాలుచు నయాచితంబుగఁ బ్రాప్తమైన
యలఘు పదార్థంబు - లనుభవించుటయు,
లోకుల సందడిలోఁ దాను పడక
యేకాంతమున నాత్మ - నెనసి యుండుటయు.
లలిని నిందాస్తుతు లకు మానసమున
నెలమి దాఁ దగ్గక - హెచ్చకుండుటయుఁ,
బాయని ప్రారబ్ధ - పటిమచేఁ దాను
జేయఁగాఁ దగుపనుల్- సేయుచుండుటయుఁ

దొడరి వచ్చిన సుఖ-దుఃఖ జాలముల
నడర నిర్లేపుఁడై -యనుభవించుటయు,450


వాడ భేదములను - వడి మళ్లఁ బడక
యే దెఱుంగ నటంచు - నింట నుండుటయు


నరయ నిత్యాది క-ల్యాణ గుణములు
సరసాత్ముఁడైన సు-జ్ఞాని చిహ్నములు:

ఈ చిహ్నములకన్న - హెచ్చుకై సిద్ధు
లేచోటఁగోరఁ డ-హీన విజ్ఞాని.

అది యేల? యనిన మా-యా మహత్త్వములఁ
గదిసె నభోగమార్గ - గమనాదులైన

ఘన సిద్దు లా యహం - కారముం బెంచుఁ
గనుక, లోకులకు నె-క్కడనైన మహిమ460

చూప వేడ్క జనించుఁ.. - జూపిన యపుడె
కాపట్య జనుల సాం-గత్యంబు గలుగుఁ:

గ్రమముగా నట్టి సాం-గత్యంబువలన
విమలాత్మ తత్త్వంబు - వీక్షింప మఱచు.

నప్పుడు గుహ్య జి-హ్వాచాపలంబు
లుప్పొంగి పుట్టుఁ గా-వున సిద్ధులందు

నాసక్తి పడక, మా-యాతీతమైన
భాసుర చిద్బ్రహ్మ-పదమునం దంటి,

ప్రారబ్ధవశమునఁ- బామరులైన
వారిలో మెలఁగుచు - వాసిగా నుండి,470

ప్రాప్తపదార్థముల్ - భక్షించి యాత్మ
తృప్తిఁ బొందుదురు,వె-ల్తిని బొంద రెపుడు;

తొలఁగక నిందాస్తు-తులు వారి కిలను
గలుగుఁ, గలిగిన దు:-ఖసుఖంబు లాత్మ

యం దంటనీయక - యా శత్రుమిత్రు
లందుఁ, దమందుఁ జి -దాత్మనే గనుచు

శాంతి బొందుదు; రట్టి - జనుల సంతోష
మింతింత యని చెప్ప - నెవ్వరి తరము?

ఇటువంటి సంతోష - మెనయుట కన్న
బటు సిద్ధ మహిమ లే-ర్పడ గొప్ప లగునె?480

చూడాలమహిమలఁ - జూపుటే? లనినఁ
బోఁడిమిగాఁ దన - పురుషుని ముక్తిఁ

బొందింపవలె నని - బుద్ధి నూహించి
యం దన్ని తాల్చె మా- యావతారములు;

తన నాయకుఁడు పర - తత్త్వంబుఁ గనిన
వెనుక నమ్మహిమలు - వేడ్కగా నైనఁ

బరులకుఁ జూపక - పతితోడఁ గూడి
మురువుమీఱ విదేహ - ముక్తిని బొందె.

నణిమాదు లైనట్టి - యష్టసిద్ధులును
గుణములే గాని, -నిర్గుణ పరమాత్మ490

కా దందుచే జ్ఞాన - కలితుఁడై సిద్ధు
లాదరంబుగఁ జూడఁ - డాత్మ నతండు

సరవి నయ్యపగత - సంసృతి భ్రముఁడు
పరతత్త్వరతుఁడగుఁ - బరమయో గిలను.

మానరోష విషాద - మాత్సర్యములను
బోనాడి యుపశాంతిఁ - బొంది యుండినదె

శ్రీరాజయోగికిఁ - జిహ్నముల్ గాని,
వేఱె చిహ్నము లున్న-వే రామచంద్ర?

జీవులవిద్యచేఁ -జిక్కి కర్మముల
త్రోవలోఁబడి సుఖ-దుఃఖ వాసనలు500

ఊరక ప్రేరేపు - చుండఁగా నాశ
చే రాగ కలితులై, - చిత్పదంబునకు

దూరస్థు లగుచును - దుర్యమార్గమునఁ
జేరక, సృష్టిలోఁ - జిక్కుదు: రాశ

పడుటయే బంధంబు, - భావించి దాని
విడిచినదే ముక్తి - వేఱొండు గాదు;

కనుక గ్రాహ్యగ్రాహ-కముల నేమఱక
కనుచు సంకల్ప వి-కల్పముల్ విడువు!

ధరను దద్ జ్ఙ్ఞులు గతా-ర్థమునకు పగవ,
రరసి చూచి భవిష్య- దర్ధంబులకును510

పసచెడఁగాఁ జింత-పడి డస్సిపోరు;
వసుధఁ గ్రమప్రాప్త - వర్తమానార్థ

ములనే గ్రహింతు రి-మ్ముగ, నదిగాక
తెలియ జీవునకును - ద్రివిధరూపములు

గలవు స్థూలము, సూక్ష్మ, - కారణం బనఁగ,
నలరారునట్టి దే-హముల మూఁడిటిని

విడువు! పరముఁ బట్టు, - వివిధాంగములను
బొడము నీ స్థూలంబు - భోగధుర్యంబు;

జనవర! సూక్ష్మంబు - సంకల్పమూర్తి
యనఁబడుచుండు, - నయ్యాతివాహికము520


చెలువొప్ప నాద్యంత - చిన్మాత్ర మగుచు
నలువుగా నిత్యమై-న పరస్వరూపు

మూడవది యటంచు - మునినాయకుండు
వేడుకగాఁ దెల్ప, విని రాఘవుండు

మరల నాలోచించి - మౌని నీక్షించి
'సారిది జాగ్రత్స్వప్న - సుప్తి నిష్ఠంబు

గాని తుర్యమును త-క్కక తెల్పుఁ డనిన
మౌని రామునిఁ జూచి - మఱియు నిట్లనియె:

విహితంబుఁ జెప్పెద - విను మనుజేంద్ర!
యహమికాసహమీక - లాత్మఁ దోఁచకను530

సత్తు నసత్తను - సంజ్ఞలు మఱచి,
చిత్తవిశ్రాంతినిఁ - జెంది, నిర్మలుఁడు

సర్వశాంతుఁడునైయ-సక్తుఁ డైనదియె
నిర్వాణపదతుర్య - నిష్ఠ యౌ, నందుఁ

బొరిఁ బొరి సంకల్ప-ములు లేమి నదియె
పరసజాగ్రత్తయు - స్వప్నమున్ గాదు.

అరసి చూచినను జా-డ్యము లేనికతన
సురుచిరంబైన సు-షుప్తియుఁ గాదు,

నెఱయు నహంకార - నిరసనబుద్ధి
నఱిముఱి సమతోద-యంబగు నందుఁ540

జిత్తంబు విశదమై - చేష్టింపకుండు,
నత్తఱి నందుఁ దు-ర్యావస్థ పొడము;

భూనాథ! నీవు ప్ర-బుద్ధుండ విలను
గాన నీబోధ చ-క్కఁగ వృద్ధిఁబొందె.

నిటువంటి సద్బోధ - నెనసిన మౌని
పటునిశ్చలత్వంబు - భావించి వినుము!

ముని వ్యాధోపాఖానము



ఒక్క కాననములో - నొక్క కిరాతుఁ
డొక్క బాణముఁబూని - యొక్క మృగంబు

పై నేయఁగా, నేటు - పడి పోయె మృగము;
దాని వెన్నంటి య-త్తఱి బర్యువాఱి {{float right|550}

వ్యాధుఁ డయ్యాశతో - సరిగి యొక్కెడను
బోధనిమగ్నుఁడై - పూర్ణుఁడై యున్న

మౌని నీక్షించి 'యా-మార్గంబునందుఁ
దాను నాచే నొచ్చి - తరలిన మృగము

పచ్చెనే!" యనఁగ న -వ్వరముని వాని
నచ్చెరువుగఁ జూచి - యనియె నిట్లనుచు:

'సర్వసమత్వ భా-స్వరనిష్ఠఁ బూని
నిర్వాణపదమందు - నిలిచి యుండెదను.

ఏను నీ మృగము పో-యినజాడ నెఱుఁగ
బో నిషాదుఁడ!' యనెఁ - బూర్ణుఁడై నట్టి{{float right|560}

మునివాక్యముల కర్ధము- నెఱుంగ కతఁడు
తన యిచ్చ నరిగె; నత్త-పసి యందుండె.

'ఎందు కీకథ, జెప్పు-టెఱిఁగింపు' (డనిన
ముందర సరభసం-బుగఁ బోవుచున్న

మెకమునే చూడక - మిన్నంటియున్న
యకలంక తుర్య సౌ-ఖ్యం బిది యంచుఁ

దెలియఁ జెప్పితి, నిది - తెలిసి యందున్న
చెలఁగు తుర్యము నభ్య-సింపుచు నుండు!

మిట్టి ప్రశాంతాత్ము - లెందున్నఁగాని
గట్టిగా ముక్తులు - గాఁ జూడు'మనుచుఁ 570

గ్రమముగా వ్యాధుని - కథ వినిపింప,
నమలుఁడై శ్రీరాముఁ - డతని వీక్షించి

'మౌనీంద్ర! యిట్టి సమాధి నే రీతిఁ ,
బూనుచు నభ్యసిం-పుదు రార్యు' లనిన

విని యమ్మునీంద్రుండు - విజయరాఘవునిఁ
గని యిట్టులనియె 'నో కాకుత్‌స్థతిలక!

షడ్విధసమాధులు



సార వేదాంత వి-చారంబు చేసి
ధీరసమాధి సా-ధించు టె ట్లనినఁ

బరువడి బాహ్య ప్ర-పంచ దృశ్యముల
సరసి మిథ్య లటంచు - నన్నిటియందు 580

నున్న సద్రూపంబు - సూహింపుచున్నఁ
బన్నుగా సవికల్ప - బాహ్యదృశ్యాను

విద్ధ సమాధి యి-వ్విధ మగున్, జ్ఞాన
పద్ధతి మఱువక - ప్రణవంబు వలనఁ

గలుగు శబ్దం బనే-క ప్రకారములఁ
బలుక నవెల్ల శ-బ్ద బ్రహ్మ మనుచుఁ

దెలిసి, యా తెలిసిన - తెలివి నే ననుచుఁ
దలఁపుచునుండు చం-దంబు నూహింప

జనహిత! సవికల్ప - శబ్దానువిద్ధ
మనెడు బాహ్యసమాధి - యగు నవ్విధంబు,590

శాంతమై, స్వచ్ఛమై, - చలనంబు లేని
యంతరంగసమాధి - యను న దెట్లనినఁ

దెలిపెద హృదయమం-దే మానసమును
నిలిపి, లోలోఁ జూడ - నెఱసి కామాది

వృత్తు లనేకముల్ - విరివిగాఁ బొడము,
చిత్తంబు వాని నీ-క్షింపుచు నుండు,

ననఘమై చిత్త కా-మాది దృశ్యముల
కును ప్రకాశము నిచ్చు - గూఢచైతన్య

కళ యన్నిటినిఁ దాను - గనుఁగొనుచుండుఁ;
గళవళ మొంద క-క్కడ నిదానించి600

యమలమై తగు ప్రత్య-గాత్మ నే ననుచు
నమర భావింపుచు-న్నట్టి చందంబు

విను లోని దృశ్యాను - విద్ధసమాధి
యని చెప్పుఁదగుచుండు, - నదియునుంగాక

యరయ నిస్సంగంబు, - నద్వయం, బజము
పరమాత్మ యని సదా - బహువిధ శ్రుతులు

పలికెడి శబ్దార్థ - పటిమ నేమఱక
తలఁపుచున్నట్టి శ-బ్దజ్ఞానమందుఁ

గలసి మనంబు మ-గ్నం బైనరీతి
వెలయు లో శబ్దాను - విద్ధ సమాధి610

యగు దృశ్యశబ్దంబు - లందు లక్ష్యంబు
తగులక, తనుఁ దానె - దలఁపుచు నుండి,

యదియును మఱచి బ్ర-హ్మైక్య సంధాన
మొదవఁగా, నందు మ-నోన్మని నొంది,

యిది యది యనుట లే-కేకమై నిలిచి,
కదల కున్నది నిర్వి-కల్పసమాధి

యగు; మఱి జన్మ క-ర్మాదులు లేక
మిగులుచు వ్యాపక-మే స్వరూపముగా

గలుగ, నానందమే - ఘనశరీరముగఁ
గలుగగా మహదాది - ఘనతత్త్వములకు620

నాధారభూతమై - యవ్యయంబైన
బోధస్వరూప సం-పూర్ణచిద్రసము

లో లీనమగుచు బా-లుని మాడ్కి, జడుని
పోలిక, బలువేల్పు - పూనిన వాని

కరణి సంకల్ప వి-కల్పవృత్తులను
మఱచుచు దేహాభి-మానంబు లేక

యపు డనుభూతిర-సావేశ మెసఁగ,
విపులంబుగా బుద్ధి - విశ్రాంతి నొంద,

మురువొప్పఁగాఁ దుది - మొదలు దోఁచకయె
నెఱసి యంతట నిండి - నిదురించువాని630

పగిది నున్నది యసం - ప్రజ్ఞాత మనఁగఁ
దగిన సమాధియై - తనియుచు నుండు;

శ్రీరామ! నీకు నేఁ - జెప్పినరీతి
నాఱు సమాధు లి-ట్లభ్యసింపుచును

ననఘులై వర్తింతు - రార్యు లటన్న
మునిని వీక్షించి రా-ముఁడు పల్కె మరలఁ:

'బొలుపొందఁగా సప్త - భూమిక లేడు
గలవని మును చెప్పఁ-గా వింటి, నిపుడు

పొసఁగ సవిస్తరం బుగ మీరు మరల
విసువక తెల్పుఁడా - విధము' లటంచు640

నడుగ, వసిష్ఠుండు- నారాముఁజూచి
యడరిన కరుణ ని-ట్లని చెప్పుఁదొడఁగె:

సప్తభూమికలు



'మనుజేంద్ర! భూమికల్ - మణి య వెట్లనిన
విను ప్రవృత్తుండు, ని - వృత్తుం డనంగఁ

గల రాయిరువురందుఁ - గ్రతుకర్మయుతుఁడు,
పొలుపుగా స్వర్గాది - భోగంబులొందు,

వాని వృత్తుఁడు భోగ - మస్థిరం బనుచుఁ
దానిశ్చయించి త-త్పదలక్ష్యమందుఁ

బొందుఁ; బ్రవృత్తుండు - పుణ్యపాపంబు
లిందుఁ జేయుచును ద-న్నెఱుఁగక యుండి650

పొలియుచుఁ బుట్టుచుఁ - బుణ్యపాపముల
ఫలము లనుభవించుఁ, - బరఁగ నిందందు

నిలుక డెక్కడ లేక - నింగిని, నేల
నలయక యమిత దే-హములు ధరించి

తిరుగుచుండఁగఁ, గడ-తేరు కాలమున
వరయోగి జన సహ-వాసంబు దొరక

వారి సూక్తులు విన - వాంఛ జనించు,
వైరాగ్యమున మది . వర్తించు నవలఁ

గడలొత్తు నబ్దుల - కరడులలోనఁ
బడిన కూర్మము మేడ- పైకెక్కి నటుల660

పెక్కు జన్మంబుల - పిదప వివేక
మొక్కింత జనియింపు - చుండఁగా మదిని

సంసార సుఖముల - సారంబు, లధిక
హింసాస్పదము లని - యెఱిఁగి, కామాది

రిపులను ఖండించు - రీతులఁ గరుణ
నిపుడు నా కెఱిఁగించి, - యీ భవార్ణవముఁ

దరియింపఁజేసి, యా-త్మను జూపఁదగిన
గురుఁడు నా కెందుఁగ-ల్గు?నటంచు ధరను

గ్రమముగా వెదుకఁగాఁ - గర్మ వాసనలు
సమయుచునుండఁగా - సద్ధర్మ భక్తి670

వైరాగ్యముల మీఁది - వాంఛలు పొడము.
సారవిచార భా-స్వరనిష్ఠ గలుగుఁ,

గర్మాభిలాష త-క్కక వీడి, యాత్మ
మర్మశాస్త్రములఁ బ-ల్మఱుఁ జూడఁగోరు,

సదమల ధర్మ వి-చారుఁడై యుండు,
నది విచారాభిమా-నాత్మకం బగుచుఁ

బొలుపొందు నిదియాది- భూమికై యుండు;
నెలమి నీ భూమిక - నెక్కినవాఁడు

సారశ్రుతిస్మృతి - శాస్త్రేతి హాస
ధారణాయోగ త - త్త్వజ్ఞానగోష్ఠి680

గలిగినవాఁడై, య-ఖండ పాండిత్య
కలితులౌ పండితా-గ్రణులను జేరి

పంచమప్రకరణము

323



మొనసి దద్వ్యాఖ్యాన - ములుఁచేసి, బుద్ధి
తనియఁగాఁ బద పదార్థ - జ్ఞానసూక్ష్మ

భావజ్ఞుఁ డగుచు, లో-పలఁ బ్రవేశించి
యే వేళఁ దనుఁ బట్టి - యేఁచుచున్నట్టి

కామాది శత్రు వ-ర్గమును ఖండించి,
పాము పొరను వీడ్చు - పగిది నవిద్య

యను తెరం దెగఁద్రెంచి - యమలుఁడై నిలిచి
తనుఁదాను దెలియు త-త్వజ్ఞుఁడైనట్టి690

గురుసేవఁజేసి యె-క్కువ రహస్యముల
నెఱిఁగి, తదర్థము-న్నెపు డూనియున్న

బుద్ధియే రెండవ - భూమిక యంచు
సిద్ధాంతముగ బుధుల్ - సెప్పుచుండుదురు.

ఎలమి నీ భూమిక - నెక్కిన పురుషుఁ
డలరి యసంగమం - బనెడి తృతీయ

భూమికపై కెక్కి, - పూలపానుపున
సామోదచిత్తుఁడై - శయనించువాని

కరణిని సంతోష - కలితాత్ముఁడగుచు
నరుదుగా సుపనిష - దర్ధసారంబు700

మదియందు నిండఁగా, - మనుజసంగంబు
వదలి, యేకాకియై - వనగుహలందుఁ

జరియింపుచును, మహా - సంతోషి యగుచుఁ,
బరఁగ నాత్మానాత్మ - భావవివేక

కలితుఁడై కాలంబు - గడపుచుఁ, జిత్త
చలనంబు నణఁపుచు - శాంతుఁడై యుండు,

అతనికి దత్త్వ శా-స్త్రాభ్యాస పటిమ,
నతిశయమైన జ్ఞా-నానంద వస్తు

దృష్టి నానాటికి - దీపించి మించి,
యిష్టమై, యెఱుకకు - నెఱుకయై యుండు,710

అమాడ్కి నిస్సంగ - మనెడి తృతీయ
భూమిక ద్వివిధమై - పొలుచు నెట్లనిన

సామాన్యమును, విశే-ష మనంగ రెండు
గా మహి నుండు, నా - క్రమ మెల్ల వినుము!

ఘనపదార్థములందుఁ - గర్తయు, భోక్త
యును, బాధ్యుఁడును, మఱి-యును బాధకుఁడును

నిజముగాఁ జూచిన - నేనుఁ గా ననియు,
గజిబిజి సేయు సు-ఖంబు, దుఃఖంబు

తెలియ సర్వేశ్వరా - ధీనంబు లనియుఁ,
గలితభోగములు రో-గంబుల కనియు,720

మొనసిన సంయోగ-ములు వియోగముల
కనియు, నన్నియును గా-లాధీన మనియుఁ,

దొడరి యనేక వస్తువులయం దాశ
పడక, ప్రాప్తాశియై ' బ్రతికి యుండుటయు,

సరని సామాన్య ని-స్సంగమై యుండు.
మఱి విశేషాసంగ-మం బెట్టి దనిన

నవని దుర్జన దూరుఁ డగుచు వసించి,
ప్రవిమలాత్మను సదా - భావించుకొనుచుఁ

జిరశాంతి నిట్లభ్య-సించిన, నాత్మ
కరతలామలకంబు - గాఁదోఁచు; నపుడు730

పనుపడు సంసార - సారంబు సార
మన నొప్పు పరతత్త్వ - మందుఁ దాఁ బొంది,

యెపుడు సర్వం బీశ్వ-రాధీన మనుచుఁ,
గపటకారణపూర్వ - కర్మమే మనుట

మఱచి, శాంతిని లోనె - మౌనంబు పూని
మురిసి ప్రపంచ ని-ర్ముక్తుఁడై యున్న

నది నిశేషాసంగ - మన నొప్పు; మఱియు
విదితంబుగా లోను- వెలి, క్రిందు, మీఁదు,

దిక్కుల, గగనవీ-థినిఁ జేతనంబు
లెక్కువలై జాడ్య - హీనంబు లగుచు740

లలి వస్తువస్తుక-లన మొందకున్న
నలఘు చిదాభాస - లంబరాకృతులు

వెలుఁగుటలోన భా-వించి చూచినది
యల విశేషానంగ-మన నొప్పు; మఱియుఁ

బరఁగ సమ్మద సౌర-భము, చిత్తనాశ
కరము, సంసృతి పత్ర - కలితంబు, విఘ్న

విరహితంబైన వి-వేక పద్మంబు
మురువుగా నెదలోన - ముందుగా మొలిచి,

రహినిఁ దత్త్వవిచార - రవిరశ్మిచేత
విహితప్రబుద్ధమై - వృద్ధిఁ బొందుచును750

గుఱుతుగా నీయసం - గులకు ఫలంబుఁ
దిరముగా నిచ్చుఁ దృ-తీయ భూమికను.

జనునకు సజ్జన - సంగతి కర్మ
మునఁ గాకతాళీయముగ నుదయించు,

నాది భూమికయను - నమృతాంకురమున
కాదరంబుగ వివే-కాంబు సేచనము

సేయ సదంశంబు - చేఁ జిగుళ్లెత్తు;
నాయెడఁ గృషిసేయు - నతఁ డాది యందు

మొలుచు సస్యాళి ని-మ్ముగఁ బ్రోచుకరణి
నల యాది భూమిక - నరయఁగావలయు,760

నేమిటి కటు?' లన్న - నిటువంటి ప్రథమ
భూమిక తనమీఁదఁ - బొడము భూములకు

మనికిపట్టగుఁ గాన - మఱువక యాత్మ
మననఁ జేయుచు సద్వి-మర్శంబు నొంది

యామీఁద నిస్సంగ-మై యాతృతీయ
భూమిక యందు సొం-పుగ నొప్పుచుండు,

నిట్టి మూఁడవభూమి - కెక్కిన మీఁదఁ
బుట్టవు సంకల్ప - బుద్బుదావళులు."

అని వసిష్ఠుఁడు పల్క - నారామచంద్రుఁ
డనుపమభక్తితో - నప్పుడిట్లనియె:770

'మునినాథ! ధరణిపై - మూఢాత్ముఁడైన
జనుఁ డే విధంబున - సంసార జలధి

తరియించు? నట్టిచం-దము దెల్పవలయు,
మెఱవడి నేడు భూ-మికల యం దొక్క

భూమిక పై నెక్కి - పొలిసిన మనుజుఁ
డే మార్గమునఁ బోవు - నెఱిఁగింపు' (డనిన

విని వసిషుఁడు మహీ - విభుని వీక్షించి
'విను రామ! చెప్పెద - విశదంబుగాను

రూఢదోషుఁడు, భవ - రోగి, తామసుఁడు,
మూఢుండు నైనట్టి - మూర్ఖచిత్తుండు780

సంసారియై బహు- జన్మంబు లెత్తి
హింసలఁ బడుచుండు,- నెన్నటికైన

ఘనభవాంబుధి దాఁటి - గట్టెక్క లేఁడు;
మొనసి కర్మంబు లి-మ్ముగఁ జేయువాఁడు

భూరి వైరాగ్యంబు - పుట్టిన దనుక
ధారుణి జన్మ శ-తంబులు దాల్చి

యలసి, యావల నీశ్వ-రార్పిత కర్మ
ములఁ జేసి దుష్టాఘ -ముల వీడుచున్న

నప్పు డాపరమేశ్వ - రానుగ్రహంబు
తప్పక గల్గ, న-ద్వైత విజ్ఞాన790

వాసన పొడము, న-వ్వల విరాగంబు
వాసిగా నుదయించి - వాంఛల నణఁచు;

మెలుపగు నాది భూ-మిక యిదే యగును.
పొలుచు సంసార మీ - భూమిక యందు

సమయు; నిదే తత్వ -శాస్త్ర సమ్మతము.
క్రమముగా నీ భూమి-కను జేరియున్న

యతఁ డొక వేళ దే-హము వీడి చనిన
నతులిత భూమికాం-శాను సారమున

నమలమైన ప్రభాస- నమరలోకమునఁ
గమనీయ దేవతాం -గనలను గూడి800

యచట భోగంబుల - ననుభవింపఁగను
బ్రచుర సత్పుణ్య పా-పము లుడిపోవ,

నలరి యా పుణ్యాత్ముఁ - డవనిపై వ్రాలి
తొలఁగక భాగ్యవం-తుల యింట నైన,

వరయోగి యగువాని - వంశమందైన
నరయఁ బ్రజ్ఞాశాలి -యై యుదయించి,

వరుసఁ బూర్వజ్ఞాన - వాసనచేత
మెఱయు తదూర్ధ్వభూ-మికలను దాటి,

తదనంతరంబునఁ - దా బ్రహ్మ మగును.
మొదటి భూమిక నుండి -మూఁడు భూమికలు810

వ్యవహార మాత్ర భే-దాస్పదంబులుగ
నవని పైఁ దోఁపించు - నది జాగరంబు;

ఇట్టి జాగ్రద్బూమి - కెక్కినఘనుఁడు
పట్టుగా నార్యుఁడన్ - ప్రస్తుతి (బొంది

వర్తింపుచుండి స-ర్వప్రయత్నములఁ
గర్తయై కావించుఁ, - గర్త గాకుండుఁ;

దత్త్వశాస్త్రవిచార - తత్పరుం డగుచు
సాత్వికబుద్ధి నా-చార్యుఁడై యుండు.

నట్టి యాచార్యత్వ - మాది భూమికను
దట్టమైయంకురి-తం బగుచుండుఁ,820

దెఱఁ గొప్ప నదియె ద్వి-తీయభూమికను
విరివి (జూపట్నఁగా - వికసితం బగును,

తెప్పున నదియె తృ-తీయ భూమికను
తప్పక సంభావి-తం బగుచుండు;

అగతి నార్యుఁడై - యట మృతుండైన
యోగసత్పుణ్య సం-యుతసంచితంబు

సమసినదనుక నా-స్వర్గలోకమున
నమితభోగంబుల - ననుభవింపుచును

పెద్దకాలం బుండి, - పిమ్మట ధరను
తద్దయు విమలత - త్త్వజ్ఞుఁడై పుట్టి,830

సరసమౌ పూర్వవా-సనచేత మరలఁ
బరమ యోగాభ్యాస - పరుఁ డగుచుండుఁ;

బొలుచు నిట్టి తృతీయ - భూమికాభ్యాస
బలమున నజ్ఞాన - పటలంబు తెగును;

విమలమౌ చిత్తంబు - వృత్తులఁబాసి
యమరు సమ్యక్‌జ్ఞాన - మగుచు దీపించుఁ,

గడ నీఁ దృతీయ జా-గ్రద్భూమినుండి
తొడరి యామీఁదఁ జ-తుర్ధ భూమికను

సాత్వికుఁడై చేరి, - సర్వసమత్వ
తత్త్వజుఁ డగుచు ద్వై - తాభ్యాస మరసి,840

వదలక ద్వైత భా-వన నంటియున్న
నది యప్పు డిద్ధ స్వ-ప్నావస్థయగును,

నరయఁగా నట్టి స్వ-ప్నావస్థ యందు
శరదభ్రగతి బుద్ధి - సన్నమై యణఁగి,

యపుడు సత్తామాత్ర-మై శాంతిఁ బొంది,
యపగత ద్వైతమై - యన్నియు మఱచి,

యామీఁదఁ బంచమం-బైన సుషుప్తి
భూమికం బొంది సొం-పునఁ జిదానంద

లహరిలో మునిఁగి మె-ల్లన నటుమీఁద
సహజతుర్యాఖ్యమౌ-షష్ఠభూమికనుB50

జెంది యొప్పుచుఁ జిద - చిత్తుల డెంద
మందుఁ దలంపక, - యహ, మనహమిక

యను రెంటి నెడఁబాసి - యద్వయ, ద్వయము
ననుటయు మఱచి తా-నంతట నిండి

పెరుగు హృద్గ్రంథిని - భేదించి మించి
యరయ వివాససుం-డై శాంతిఁ బొంది,

నిర్విణ్ణుఁడై యోగ-నిద్రఁ బెంపెనఁగ
నిర్వాణరూపుఁడై - నిత్య దీపంబు

వలె నొప్పుచుండు జీ-వన్ముక్తుఁ డిలను,
దలకొని గగనమ - ధ్యస్థ కుంభంబు860

కరణిని వెలిని లోఁ గాను శూన్య మగుచు,
ధర జలరాశీ మ-ధ్యస్థ కుంభంబు రీతిఁ

బొలుపుగా వెలిలోను - బూర్ణమై నిండి
వెలుఁగుచునుండు; నీ - విధముగా యోగి

యగువాఁడు దేహము-న్నంత కాలంబు
జగతి మీఁదను సర్వ - సాక్షియై యుండి

ధన్యాత్ముఁడై దేహ -ధారణ కొఱకు
మాన్యుఁడై యజ్ఞాన - మనుజులలోను

చరియింపుచును క్షుత్తు-శాంతఁ బొందింప
నరుదుగాఁ బ్రాప్తాశి - యగుచుండి, తుదను870

ముదము మీఱ విదేహ - ముక్తినిఁ బొందు,
నదియె సప్తమభూమి - కాఖ్యయై యుండు.

మెఱయు నయ్యాఱు భూ-మికల కన్నిటికి
నరయ సీమాభూమి-కై యుండు నదియె;

యారూఢి వాఙ్మన - సాతీత మగుచు
సారమై యుండు నా - సచ్చిత్పదమును

కొందఱు శివుఁ డండ్రు, - కొందఱు విష్ణుఁ
డందురు, మఱికొంద - ఱజుఁ డండ్రు, మఱియు

నందుఁ గొందఱు శూన్య-మందురు, కాల
మందురు, ధరఁగొంద - ఱమరఁగాఁ బ్రకృతి880

పురుష సంయోగ వి-భూతి యటండ్రు.
పరఁగ నీవిధమున - బహుశాస్త్రవిదులు

అతిశయప్రజ్ఞచే - నందఱు నన్ని
మతములఁ బుట్టించి - మహిమఁ గల్పించి,

నామ, రూపంబు లె-న్నఁడు లేని యాత్మ
కీ మాడ్కి ధరణి న-నేకముల్ గాను

బనుపడ నామరూ-పములఁ గల్పించి
కొనియాడి కొనుచు నె-క్కువ తక్కువలుగఁ

దలపడి దేవతాం-తర భేదములను
గలుగఁ జేయుదు రా య-ఖండ భూమికకు,890

జననాథ! యిటువంటి - సప్తభూమికల
మొనసి సాధించిన - ముఖ్యాధికారి

భవపాశమును ద్రెంచి - పరమందుఁ బొందు,
నవిరళచరిత! నీ వా ప్రకారముగ

భూమికాభ్యాస మొ-ప్పుగఁ జేసి, శాంతి
నా మహాబ్రహ్మమై, - యన్నిటియందు

నీవంటి యంటక - నిస్పృహత్వమునఁ
బావనరాజ్యంబు - పాలించు' మనిన

జననాథుఁ డా మునీ-శ్వరుని వీక్షించి
మనమున నూహించి - మరల ని ట్లనియెఁ:900

'బొలుచు కారణ కార్య - భూతాళితోడ
బలసియున్నట్టి ప్ర-పంచ మంతయును

పరమైన నిర్గుణ - బ్రహ్మమం దైక్య
మెఱిఁగి కావించురీ - తెట్ల ?న్న మౌని

నరనాథు నీక్షించి - నగుమోము మెఱయ
నరమరలేక యి-ట్లని చెప్పుఁ దొడఁగె:

బ్రహ్మైక్యసంధానము



'ఇనవంశతిలక! నీ - వీ రహస్యంబు
పెనుము నేఁ - జెప్పెద విశదంబుగాను

పరఁగ జీవేశ్వరో - పాధుల కైక్య
మెఱుఁగకుండిన ధాత్రి - నెవ్వరికైన910

నరుదైన తత్త్వం ప-దార్దైక్యభావ
మరయ మనోరథ- ముగునంతె గానఁ

గరమొప్పు నీ కార్య - కారణైక్యంబు
నెఱుఁగంగవలె, నది - యెఱిఁగినయపుడె

తహపాంది పరమత - త్త్వంబు తా నొకటి
సహజంబుగా నిండి - శాంతమై యుండు,

జననాథ! యీశ్వరు - పర్వదేహాంబు
ననుపమ బ్రహ్మాండ - మగుచుండు, మఱియు

నెఱసిన జీవుని - నిఖిల దేహంబు
నరయఁగాఁ బిండాండ - మగు, నివి రెండు 920

ధర ముఖ్యపంచభూ-తంబుల చేతఁ
బరువడి నిర్మింపఁ-బడియుండుఁ గాన

మొనయు నీ బ్రహ్మాండ-మునకుఁ బిండాండ
మునకుఁ గారణ మిల - ముఖ్యభూతములు.

అలపద్మజాండ పిం- డాండముల్ కార్య
ములు, కార్యకారణ-ములకు భేదంబు

లేదు: కారణమిల-లేక కార్యంబు
లేదు, తంతుచయంబు , లేక వస్త్రంబు

కలుగ, దాచందంబు-గా నజాండంబు
కలుగక పిండంబు - గలుగ; దారెండు 930

కారణ, కార్యముల్ - గావున వాని
కేరీతినను భేద - మెన్నఁగా రాదు.

బాహుళ్యమైన యీ -పద్మజాండమున
కూహించి చూచిన - నుత్పత్త్యవస్థ.

మొనయు నీ పిండాండ మునకు భావించి
కనిన జాగ్రదవస్థ - గనుక, రెంటికిని

సరవితో నైక్యంబు - సహజమై యుండు;
మఱియు జాగ్రత కభి -మానియై పనులఁ

జేయించు నీశుండు - సృష్టికర్తైన
యాయబ్జజునీయంశ - ము ............ గనుక. 940

రమణీయ బీజాంకు-ర న్యాయ మొప్ప
నమర నయ్యిరుపుర - కైక్యంబు గలుగు,

ఘనత నొప్పు హిరణ్య-గర్భమై యీశ్వ
రుని లింగదేహ మౌ - రూఢిగాఁ జూడ,

నినుము కాలిచికొట్ట - నెగురుచుఁ జెదరి
కనిపించు విస్ఫు లిం-గంబుల మాడ్కిఁ

దెలియ నీశ్వరలింగ - దేహంబునుండి
గలిగె ననేకలిం-గ శరీరతతులు

గనుక, నీశ్వరుని లిం-గ శరీరమునకు
మొనయు నీ లింగాంగ-ములు వేఱుగావు;950

ఆరయ హిరణ్య గ-ర్భాంశమే యష్ట
పురి యయ్యెఁ, దత్సంగ-మున నాత్మ కిలను

మురియు గర్భావాస-ములు గల్గసాగె;
గరిమనొప్పు హిరణ్య - గర్భమన్ దాని

వరప్రతిపాలనా-వస్థాంశు పటిమ
నరయ దేవునికి స్వ-ప్నావస్థ యగును

గనుక, నారెంటి కై-క్యం బని యెఱుఁగు
మనఘ! యీలింగ దే- హాభిమానమున

వెలయు తైజసుఁడగు - విష్ణునంశంబు,
నల కార్యకారణ - న్యాయంబుచేత960

సలలిత విష్ణు తై-జసుల కిద్దఱికి
నలరార నైక్యమౌ, - నదియునుగాక

తగిలి వీడని మహా-తత్త్వ స్వరూప
మగు ప్రకృతాంశమే - యజ్ఞానశక్తి

యగుఁగాన నారెంటి - కైక్యమౌ టెఱుఁగు;
మగణిత సర్వ సం-హారరూపమున

నతిశయంబగు ప్రళ-యావస్థ చేతఁ
బ్రతిభతోఁ బుట్టింపఁ - బడియే సుషుప్తి,

అందుచే నారెంటి - కైక్యమౌ; మఱియు
నందు సంహార క-ర్తైన రుద్రాంశ970

మే మించి ప్రాజ్ఞుఁడై - మెఱయు, నీ రెండు
తామసాహంకార - తత్త్వమై యుండు,

నారెంటి కందుచే - నైక్యమౌ; మఱియు
సారజ్ఞుఁడైన యీ-శ్వరునిజశక్తి

యనెడు మాయకును జీ-వాత్మునిజ్ఞాన
మునకు చే ఱనువాడు - మూఢు,లీశ్వరుని

సర్వసాక్షిత్వ మెం-చంగ జీవునకుఁ
బర్విన లీలతోఁ - బ్రతిబింబమైన

యలఘు తుర్యావస్థ - యగు రెంటి కైక్య
మెలమిఁ గల్గుచునుండు, నీ ప్రకారముగఁ980

బరఁగ జీవేశ్వరో-పాధుల కైక్య
మిరవొందఁ గల్గఁగా - నీశ్వర జీవ

భేదంబు గల దంచు- బెట్టుగా నిలిచి
వాదించు టెట్లన్న -వసుధేశుఁడనియేఁ.

'బెలుచ జీవేశ్వర - భేదంబు వేద,
మలరి పల్కుట దేమి? - యానతిం' డనిన

మౌని యిట్లనియె 'రా-మ! తొలుత భేద
మూని చెప్పుకయున్న - నుర్విని జనులు

మొదట నభేద మి-మ్ముగ విచారించి
తుదముట్టఁ జాల, రం-దున దయచేత990

బెట్టుగా జీవేశ - భేదవాక్యములఁ
బుట్టించి యీశ్వర - పూజ గావించి,

తదనుగ్రహమున న-ద్వైతచింతనము
కుదిరికగాఁ జేసి - కొన్నాళ్లకైనఁ

బొసఁగ జీవన్ముక్తి - పొందెద రనుచు
విసువక భేద మా-వేదంబు పలుకుఁ

గావునఁ, బూర్వ-పక్షము నుద్ధరింపఁ
గావలెఁ దొలుత స-త్కర్మ పద్ధతిని

ఎఱిఁగిన యటువలె - నేతివాక్యాను
సరణంబుచేత దూ-షణసేసి విడిచి,1000

యామీఁద సిద్ధాంత-మైన యర్థమును
క్షేమంబుగాఁ బ్రతి-ష్ఠింపఁ గావలయు.

ఒనరఁగా నదియు వే-దోక్తమే గనుక
జననాథ! వేదశా-స్త్రము లివ్విధమునఁ

జెలరేఁగి భేదముల్ - చెప్పు, నవ్వలను
దొలఁగక యుపనిష-త్తులు నిదానముగఁ

గ్రమమొప్ప భేదవా-క్యముల ఖండించి
యమలమై యద్వయం-బైన బ్రహ్మమును

ఘనులకుఁ గనుసంజ్ఞ - గాఁ జూపుచుండు;
ఘనతకెక్కు హిరణ్య - గర్భంబు లింగ1010

తనువులు రెండు సి-ధ్ధముగ లేకున్నఁ
బెనుపు నొందు నజాండ - పిండాండములును

గలుగవు, కారణ - కార్యంబులైన
యలపద్మ జాండ పిం-డాండంబులకును

సహజ మైక్యము స్థితి - స్వప్నము యొక్క
విహితావయవములై - వెలయుచున్నట్టి

సృష్టి జాగ్రత లని - చెప్పఁగా నొప్పు,
నిష్టంబుగా విష-యేంద్రియంబులను

జెలఁగి కూడిన మన - స్సే స్వప్నరూప
కలితమై దినమును - గనిపింపుచుండు,1020

వేడుకగా నదే - విషయవాసనలఁ
గూడి బాహ్యేంద్రియ - గోళకంబులను.

వెలసి నిలిచిన బాహ్య - విషయకృత్యముల
సలువునదే యగు -జాగ్రదవస్థ,

గాన నా స్వప్నంబు - కారణం బగును,
దాని కార్యం బనఁ - దగును జాగ్రత్త,

యలరు నందున రెంటి - కైక్యమౌ మఱియు
వెలయఁ దైజసుఁడగు - విష్ణునంశంబు

కావున వారి కై-క్యము గల్గుచుండు
నా విశ్వుఁడగు - పద్మజాంశమందునను1030

నా యిద్దఱికిఁ గల్గు - నైక్యసౌఖ్యంబు
మాయచే నభిమాన - మగ్నుఁడై మొదట

సమరు నవ్యాకృత-మం దంకురించి
రమణీయమైన హి-రణ్యగర్భమును

నరయ నజ్ఞానాంశ - మగు లింగతనువు
నఱిముఱి నైక్యమౌ, - నవ్విధంబుగను

దనరు మాయకు నవి-ద్యకు నైక్య మొదవు,
సునిశిత ప్రళయ సు-షుప్తులు రెండు

కారణలౌ స్థిత-కలయు కార్యంబు(?)
లారయ నీయుభ-యముల కైక్యములు1040

కలిగినతఱి వేఱె,- కారణం బొకటి
వలవ దోశ్రీరామ! - వసుధాతలేంద్ర

సరవి నావిశ్వ తై-జసులపుట్టువులు
పరఁగ రుద్రునివల్లఁ - బ్రాజ్ఞునివలనఁ

గలిగె, రాజససాత్త్వి-కంబులు రెండు,
నలఘుత్వతామ సా - హంకారమందుఁ

బొలుపులేక యణంగి - పోవుచునుండు;
నలరు నజ్ఞానంబు - నవ్యాకృతంబు

మఱచు నాత్మజ్ఞాన - మాయలనుండి
యరుదుగా నుదయించు - నం దైక్య మొందుఁ .1050

దొలి సర్వసాక్షిత్వ - తుర్యంబులందుఁ
బ్రళయ సుషుప్తులు - ప్రభవించి యచటఁ

గరమర్ధిఁ గారణ - కార్యభావనను
బరఁగ నైక్యము నొందుఁ - బార్థివాధీశ!

తలకొని మఱియు రు-ద్రప్రాజ్ఞు లిర్వు
రల యీశ్వర, ప్రత్య-గాత్మల వలనఁ

గలిగిరి, వారిక-క్కడ నైక్యమొదవు;
నెలమి నేదేది యే-యే కారణమునఁ

గలుగు నా కార్య మా - కారణంబునకుఁ
దలఁచి చూచినను భే-దంబు గాకుండుఁ;1060

గుదిరి సర్వంబును - గుణసామ్య మెందుఁ
బొదువుగాఁ బలుమాఱు - పుట్టు, నణంగు,

రూఢిగా మాయా స్వ-రూపమైనట్టి
గాఢమై తగు కార్య - కారణైక్యంబు

గలుగఁగాఁ దత్కార్య - కొరణోపాధు
లెలమినిఁ గల్లు జీ-వేశ్వరైక్యంబు

నిత్యసిద్ధం బయ్యె - నేఁ జెప్ప నేల?
ప్రత్యక్ష మీ యను-భవము భావించు!

తలఁపఁగాఁ 'దత్పద - త్వంపద శబ్ద
ముల కైక్యమగు రీతి - మొనసి చెప్పితిని.1070

సరస జీవేశ్వర - చైతన్యమునకుఁ
బరమైన 'యసిపద' - భావన చేతఁ

బరఁగ నైక్యంబు చె-ప్పకయే లభించు
టెఱుఁగఁ జెప్పితి; నిది- యిటు లుండనిమ్ము!

అగణిత బ్రహ్మంబు - నందు వికర్త
మగు గుణసామ్యాది - యఖిల విశ్వంబు

నరయఁగా వేఱుగా - దా బ్రహ్మమునకు,
వరగుణసాంద్ర! స-ర్వము బ్రహ్మమగును.

భ్రాంతిచే రజ్జువుఁ -బా మని చూచి
నంతటనే రజ్జు-వగునె సర్పంబు?1080

బ్రహ్మమున్ జూచి ప్ర-పంచ మటన్న
బ్రహ్మ మీ మిథ్యా ప్ర-పంచ మే లగును?

జలమే తరంగముల్, - శబ్దముల్, సుడులు,
నల బుగ్గలై తోఁచి-నట్లు పరాత్మ

భ్రాంత చిత్తులకుఁ బ్ర-పంచమై తోఁచు,
నింతీయే కాని లే-దీ ప్రపంచంబు.

తలకొన్నఁదత్త్వ ని-ర్ధారణ చేతఁ
జెలఁగి విచారణ - చేసి చూచినను

అల బ్రహ్మమే, విశ్వ-మై కనిపించుఁ;
బొలుపొందు నిటువంటి - పూర్ణానుభవము1090

గలిగిన ధన్యుఁ డా-కారంబు లేని
యలఘు పరబ్రహ్మ - మనుచు భావించు.

మాయాశరీరాభి -మానంబు లేక
నా యమల బ్రహ్మ-మగు యోగివరుని

డెంద మెందెందు వాఁ- డిగఁ బోవుచున్న
నందందు బ్రహ్మమే - యగపడుచుండుఁ

గాని, విశ్వము వేఱు-గాఁ గానరాదు.
కాన సమాధియే-కాంతమం దుండి

కావింతు ననెడి సం-కల్ప మేమిటికి?
నే వేళ నిన్ను నీ వెఱుఁగుచు భూమిఁ1100

బాలించు' మన రామ-భద్రుండు పలికె:
'నో లలితమునీంద్ర! - యుర్వి నేలుచును

నే నసంప్రజ్ఞాత - నిర్వికల్పంబు
లూని యేకాంతమం-దుండక, వినుట,

కనుట, మాట్లడుట - గలిగి యుండుటను
మన మాత్మతత్త్వంబు - మఱువదే?' యనిన

నరపతి నీక్షించి - నగి యావసిష్ఠుఁ
దఱలేని నెనరుతో - నమర ని ట్లనియె:

'విను రామ! జనక భూ-విభుఁ డాత్మ తత్త్వ
మొనర నీక్షింపుచు - నుండి, విశ్వంబు1110

ఉన్నటు లుండఁగా - నూహించి మించి
పన్నుగాఁ దాఁబర - బ్రహ్మంబు నంటి,

పొసఁగ జీవన్ముక్తి - బొంది రాజ్యంబుఁ
బసమీఱ ధీరుఁడై - పాలింప లేదె?

ఘనతనుప్రారబ్ధ - కర్మవాసనలు,
ననుపమాజ్ఞానంబు - నర్ధక్షణంబు

342

వాసిష్ట రామాయణము



చెనఁటులై యావరిం-చిన మాత్రముననె
యనఘుఁడై బ్రహ్మవే-త్తై ధన్యుఁడైన

వానిమోక్షమునకు " వచ్చునే హాని?
పూని స్వప్నంబులో - భూరిదుఃఖంబు1120

ననుభవింపుచు నుండి - యపుడె మేల్కొనిస
వెనుక దుఃఖము వాని - వేధింపఁగలదె?

ఆ ప్రకారంబుగా - నధ్యాత్మనిష్ఠు,
డై ప్రపంచము మిథ్య - యనుచు భావించు

జ్ఞాని యొక్కొక వేళఁ - జపలసంసార
మూని కావింపుచు - నున్నమాత్రమున

నతనికా సంసార - మంట దెన్నటికి
నతఁ డిల నిర్లేపుఁ - డఖిలపూజ్యుండు,

సర్వస్వతంత్రుండు - సర్వశాంతుఁడు
సర్వపూర్ణుఁడు సర్వ-సముఁ, డటుగాన1130

వాఁ డెటు లున్న జీ-వన్ముక్తుఁ డగుచు
వేడుకగాఁ జూచు - విశ్వచిత్రముల,

అంతా పరబ్రహ్మ - మని తోఁచినపుడు
వింత సంసారంబు - వేఱయెందుండు?

భావింపు మీ యను - భవమాత్మయందు
నీ వసంప్రజ్ఞాత, - నిర్వికల్పముల

సాధింపనేల? వి- శ్రాంతిచే నాత్మ
బోధానుభవ మొంది - పూర్ణుండ వగుము!

పంచమప్రకరణము

343



ముఱపు ని న్నంటదు - మనువంశతిలక!
పరమహంసున కసం-ప్రజ్ఞాతనిష్ఠ1140

తగు, గృహస్థున కది - తగ; దందువలన
జగతి నేలుచు నుండు - జనకుఁ,డా రీతి

నిరుపమప్రజ్ఞతో - నిఖిలరాజ్యంబు
పరుఁడవై లీలగా - బాలింపుచుండు!

పరమహంసుని కమ్ర-పదము నొందెదవు,
నరనాథ! నిజముగా - నమ్ము నా మాట.

చెలఁగు చుండెడి జగ-జ్జీవేశ్వరులకుఁ
గలుగు నీ వ్యాపార - గౌరవస్థితులు,

అవియెల్ల సగుణమా-యా చిద్విలాస
సవరణంబులు గాని, - సత్యముల్ గావు;1150

సత్యంబు నీవైన - సత్పదవస్తు
వత్యంత నిర్మల, - మగుణ, మద్వయము.

ఆ జగజ్జీవేశ్వ-రాధార, మజము,
రాజయోగానంద-రససముద్రంబు

కావున, నీవె య-ఖండచైతన్య
భావన నొంది స-ద్భ్రహ్మమై యుండు'

మని యుపదేశింప, - నా రాఘవుండు
కనుఁగవ మోడ్చి చి-ద్గగనంబు నంటి

344

వాసిష్ట రామాయణము


తనుఁదాను భావించి - తన్మయుండగుచు,
ననుభూతిరసమగ్నుఁ-డై కొంత తడవు1160

మనుజేశ్వరుఁడు చిత్స-మాధి సౌఖ్యంబు
ననుభవించి, కృతార్థుఁ-డై కనుల్ దెఱచి

యా గురునకు మ్రొక్కి - యంచున నిలువఁ
గా, గురుఁడమ్మహీ-కాంతు నీక్షించి

'యన్న! శ్రీరామ! బ్ర- హ్మైక్య సౌఖ్యంబు
చెన్నొంద ననుభవిం-చితివే?' యటంచుఁ

గరుణతో నడుగ ను-త్కంఠ దీపింపఁ
గరములు మొగిచి రా-ఘవుఁ డిట్టు లనియె:

ఓ గురుచంద్ర! మీ-యుపదేశ మహిమ
చే గుఱిగా జగ-జ్జీవేశ కార్య1170

కారణైకత్వ ప్ర-కాశమర్మముల
ధారాళముగఁ గంటి, - ద్వైతం బడంగె:

నహహ! మహాద్వైత - మాదిమధ్యాంత
రహితమై, యమితమై, - రమ్యమై, యెఱుక

యై, సచ్చిదానంద-మై, నిర్విశేష
మై, సర్వపరిపూర్ణ - మయ్యె: నే నదియె.

ఇటువంటి యనుభూతి - నిదమిత్థ మనుచుఁ
బటిమతోఁ జెప్పి చూ-ప నశక్యమయ్యె;

నతిశయజ్ఞానర-హస్యవాక్యముల
హిత మొప్ప మీరు నా-కెఱిఁగించుకతన1180

పంచమప్రకరణము

345


సన్నిటికి నతీత - మగు పదమందుఁ
బన్నుగాఁ బొందితి, - భవభయం బణఁగెఁ;

దల్లివి, తండ్రివి, - దైవము, గురుఁడ
వెల్లభంగులను నా - కెవ రింక మీరె;

కావున మీ పద - కమలయుగ్మంబు
భావించి నిర్వాణ- పదము నొందితిని',

అని పల్కి భక్తితో - నంజలిఁజేసి
వినుతింప, రామభూ - విభుని వసిష్ఠ

మౌని ప్రేమను జూచి - మరల నిట్లనియె:
'మానవాధీశ! బ్ర-హ్మంబు నీ వయ్యు,1190

నారాయణుఁడ వయ్యు - నన్ను మన్నించి
సారవేదాంతశా-స్త్రము నేను దెలుప

విశదంబుగా నీవు - వినినందువలన,
దశరథాత్మజ! నేను - ధన్యుండ నైతి'

నని పెక్కువిధముల - నా రఘూత్తమునిఁ
గొనియాడి, పూజఁ గై-కొని వసిష్ఠుండు

అంతరంగంబునం-దా రాము మెచ్చి,
సంతసింపుచు నిజా - శ్రమభూమిఁజేరె;

* శ్రీ మద్రామాయణ కథాసంగ్రహము

అంత నా శ్రీరాముఁ - డాత్మార్థ మెఱిఁగి,
వింతగాఁ దనుఁ దాను - వీక్షించుకొనుచు1200

సలలిత విమల సు-స్వాంతుఁడై లేచి
చెలువొప్ప దశరథు - చే సెలవొంది,


346

వాసిష్ట రామాయణము


యా రాముఁ డపుడు వి-శ్వామిత్రు వెంట
సారజ్ఞుఁడైనట్టి - సౌమిత్రితోడ

శరచాపములు పూని - చని యరణ్యమునఁ
దిరుగు తాటకను మ-ర్దించి, పిమ్మటను

నతివేగ మారీచుఁ -డను వానిఁ దఱిమి,
ప్రతిభ దీపింప సు-బాహునిఁ ద్రుంచి,

కరుణతో గాధేయు - క్రతువు రక్షించి,
పరఁగ సహల్య శా-పంబును దీర్చి,1210

గరళకంఠుని కార్ము-కంబు ఖండించి,
సురలు మెచ్చఁగ మహీ- సుతను వరించి,

పరశురాముని బాహు -బలము నణంచి,
ధరణిజతో నయో-ధ్యాపురిఁ జేరి,

మెఅయుచు సీతాస-మేతుఁడై యచట
సురుచిరలీలల - సుఖియింపుచుండె.

మఱి కొన్నినాళ్లకు - మంథరవలన
దురుసుగాఁ గైకకు - దుర్బుద్ధి పొడమ

రామచంద్రుని మహా-రణ్య భూములకుఁ
దా మించి పొమ్మన్న, - దశరథేశ్వరుని1220

యనుమతిఁ గైకొని - యతిశాంతుఁ డగుచు
జనకజా సహితుఁడై - సౌమిత్రి తోడ

నా రాముఁడడవుల - కరుగగా, సీత
నా రావణాసురుఁ - డపహరింపఁగను

శ్రీరాముఁ డచ్చటఁ - జింతించి, పంపఁ
జేరి, సుగ్రీవుతో - స్నేహంబు చేసి,

వనచరోత్తముఁడైన - వాలినిఁ ద్రుంచి,
యినసూనునకు రాజ్య-మిచ్చి, యంగదుని

యువరాజుగాఁ జేసి - యుంచి, యామీఁదఁ
బవనాత్మజుని భక్తి - భావన మెచ్చి.1230

యతని చేతికి సీత - కానవా లిచ్చి,
ప్రతిభతోఁ బంప, న - ప్పవననందనుఁడు

లవణాబ్ది లంఘించి - లంకలోఁ జొచ్చి
యవనీతనూభవ - నచ్చోటఁ గాంచి,

శ్రీ రామచంద్రుఁ డి-చ్చిన యుంగరంబు
గౌరవంబుగ సీత - కరములం దుంచి,

చెచ్చెర సీత యి-చ్చిన మానికంబు
నచ్చుగాఁ గైకొని - యందుండి కదలి.

వనపాలకుల నొంచి, - వనము మాయించి ,
ఘనశూరుఁడైన య-క్షకుమారు నణఁచి.1240

లంకాధిపతిని ని -ర్లక్ష్యంబు చేసి.
లంకఁ గ్రక్కునఁ గాల్చి, - లవణాబ్ధిఁ గడచి,

రామున కా శిరో -రత్నంబు నిచ్చె;
నా మీఁద రఘువరుఁ - డఖిలవానరులఁ

గూడి తోయధిని మి-క్కుటముగాఁ గట్టి,
పోడిమి లంకకుఁ - బోయి శౌర్యమునఁ

గడఁగి రావణకుంభ- కర్ణాదులైన
చెడుగు రక్కసులఁ గూ-ల్చి విభీషణునకుఁ

బని బూని లంకలోఁ - బట్టంబుఁ గట్టి,
జనకజన్ దోడ్కొని - సౌమిత్రతోడ ,1250

348

వాసిష్ట రామాయణము


వానరాదులతోడ - వరపుష్పకంబు
పై నెక్కి, సాకేత - పట్టణంబునకు

వరశక్తి దీపింప - వచ్చి, లక్ష్మణుఁడు,
భరతశత్రుఘ్నులు - పవననందనుఁడు

తనుఁజేరి కొలువగా, - దగిన వేడుకల
మొనసి వసిష్ఠాది - మునులకు మ్రొక్కి,

సీతతోఁ బట్టాభి-షిక్తుఁడై, సురలు
ఖ్యాతిగాఁ బొగడ, ను-త్కంఠ దీపింప,

గురుతరకల్యాణ - గుణగణుం డగుచుఁ
బరమాత్ముఁడై, తాను - భావ మేమఱక1260

పరిపూర్ణ భావసం-పన్నుఁడై ప్రజలఁ,
బరమ శాంతాత్ముఁడై - పాలింపుచుండె.

అని భరద్వాజ సం-యమికి వాల్మీకి
ఘనతరజ్ఞాన యో-గ ప్రకారంబు

పినిపింప, నంతయు-విని భరర్వాజుఁ
డనఘుఁడై వాల్మీకి - కంజలిఁజేసి,

కొనియాడి యచ్చట - గురుభక్తి మెఱయ,
ననుపమ విజ్ఞాని-యై శాంతిఁ బొంది,

శమదమ ప్రముఖ భా-స్వర సద్గుణముల
నమర జీవన్ముక్తుఁ డగుచు సుఖించి.1270

పంచమప్రకరణము

349


* ప్రకరణాంతద్విపద *



ఇది సోమనాథ విశ్వే-శ్వర స్వామి
పద పద్మ భక్త సు-బ్రహ్మణ్యయోగి

చరణాంబుజాత ష-ట్చర ణాయమాన
పరిపూర్ణ నిత్య స-ద్భావ నిమగ్న

మానసాంబుజ వెంగ-మాంబికారచిత
మై, నిత్యమై, సత్య-మై, ధన్యమైన

సామార్థ సార సు-జ్ఞాన వాసిష్ట
రామాయణంబను-రమ్యసద్ద్విపద

యం దంత పంచ-మంబగు ప్రకరణము
నందమై విమలమో-క్షాకరం బగుచు1280

శ్రీ తరిగొండ నృ-సింహుండనంగ
ఖ్యాతిగా వెలయు వేం-కటరాయ! నీదు

పదయుగళికి సమ-ర్పణ మయ్యె: దీని
సదమలులై వ్రాసి-చదివిన, వినిన

వరులు తాపత్రయా-ర్జవము తరించి,
పరమైన నిర్వాణ - వదము నొందుదురు.

భూచక్రమున నిది - పురుషార్ధ మగుచు
నా చంద్ర తారార్క-మై యుండుఁగాత!

- : వాసిష్ఠరామాయణము సంపూర్ణము :-


This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. 1. భారములను - వేం.
  2. 2. భావాన్య భావ - వేం.
  3. తన్నే తాను - వేం.