వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/హిందూ వివాహము-సంతానము

వికీసోర్స్ నుండి

హిందూ వివాహము-సంతానము


జాతీయ సభ్యత దేశంలో అభివృద్ధి కావటానికి రాజకీయవేత్తలూ, మతప్రవక్తలూ, సంఘ సంస్కర్తలూ, తదితరులూ తలా ఒక పథకాన్ని అమలు చేస్తుంటారు. ప్రతివారికీ వారి పథకాన్ని అమలు పరిస్తే అభ్యుదయం చేకూరుతుందనే నమ్మకం గాఢతరంగా ఉంటుంది.


దేశీయాభ్యుదయ మంటే - ఆ దేశంలో నివసించే స్త్రీ పురుషుల మానసిక, నైతిక, శారీరకాభ్యుదయం అని అంగీకరించవలసి ఉంటుంది. సంతాన శాస్త్రము దీనిమీదనే ఆధారపడ్డది. సంతాన శాస్త్రమంటూ పుట్టి ఇంకా పాతిక సంవత్సరాలు పైబడలేదు. కానీ అది నేటి సభ్యప్రపంచంమీద ఎంతో భావవ్యాపనం చేసింది. అత్యుత్తమ శ్రేణికి చెందిన మానవ నిర్మాణానికీ, తన్మూలంగా మానవ సంఘనిర్మాణానికీ ఈ శాస్త్రం ఎంతగానో ఉపకరించింది. ఉత్తమ సంతానాన్ని పొందే విధానాన్ని నిరూపించేది సంతానశాస్త్రమని దానిని కొందరు నిర్వచించారు. అది అత్యంత ప్రాధాన్యం కలది కాదు.


ఈ శాస్త్రం, జంతుపాలకుడు వాటిని అభివృద్ధి పొందించటానికి ఏ దృక్పథంతో వర్తిస్తాడో అదేరీతి, మానవాభివృద్ధిని కోరేవాడు మానవజాతిని దర్శించవలసినదని కోరుతుంది. వివాహమన్నా, సంతానమన్నా లోకంలో పాదుకోబడి ఉన్న కొన్ని అభిప్రాయాలను దూరంగా ఉంచమని కోరుతుంది.


ఉదాత్తులుగానో, నీచులుగానో, బలవంతులుగానో, బలహీనులుగానో ఆరోగ్యవంతులుగానో, అనారోగ్యవంతులుగానో వ్యక్తులను తీర్చిదిద్దేది ఏది? - అనే ప్రశ్న మానవుడికి సహజంగా కలుగుతున్నది. ఈ ప్రశ్నకు సక్రమమూ సమగ్రమూ అయిన సమాధానం కేవలం సంతానశాస్త్రం తప్ప మరొకటి ఇవ్వలేదు.


జన్మించి జీవించే ప్రతిప్రాణికీ ఏర్పడుతూ ఉన్న ప్రతి లక్షణానికీ, ప్రతిగుణానికీ ఈ శాస్త్రం రెండు కారణాలను చెపుతుంది. దీనిలో మొదటిది ప్రకృతి (Nature) రెండవది పెంపకము (Nurture). జననకాలంలో ప్రాణికోటికి అబ్బే సమస్తమూ ప్రకృతి తరువాత పోషణ విధానంలో కలిగే వాతావరణమూ, శారీరక సాంఘిక విజ్ఞానాదికాలు అన్నీ పెంపకానికి సంబంధించినవి. తల్లిదండ్రుల శుక్లశోణితాల సంయోగం వల్ల మాతృగర్భంలో ఒక చిన్న అండం ఏర్పడుతుంది. మనస్సు ఊహించలేనన్ని శక్తులు దానికి అప్పుడే సంక్రమించి ఉంటవనీ, ఆ సమయంలో ప్రకృతి భవిష్యత్తులో ఆ అండం వల్ల జన్మించబోయే బిడ్డ భవితవ్యాన్ని సమస్తమూ నిరూపించే సంతానశాస్త్రం పలుకుతూ ఉన్నది. అందువల్ల వంశపారంపర్యంగా వచ్చే ప్రకృతి శక్తికి ప్రాథమిక ప్రాధాన్యత ఉన్నదని మనకు అవగతమౌతున్నది. శుక్ల శోణిత సంయోగం ఏర్పడే అండానికి ప్రకృతితః కలిగే గుణాల ననుసరించే బిడ్డ పాలు తాగటమూ పెరిగి పెద్దది కావటమూ జరుగుతుంది. అది కారణంగా కొందరు శాస్త్రవేత్తలు పుట్టుకను గర్భధారణకు ముందే పరిగణిస్తారు.


వ్యక్తులకు వైజ్ఞానికంగానూ, మానసికంగానూ, శారీరకంగానూ పుష్టిని కలిగించడంలో వంశపారంపర్యమైన ముఖ్యమైన ప్రకృతిశక్తి గొప్పదా, లేక వాతావరణ శక్తి గొప్పదా, అనే అనుమానం అప్పుడప్పుడూ అందరికీ కలుగుతుంది. అటువంటి ప్రశ్న కలగటం, సమంజసం కూడాను. అయితే దానికి తగిన సమాధానం ఇంతవరకూ రాలేదు. లోకంలో ఏ సాంఘిక చట్టము వచ్చినా వాతావరణానికే విశేష ప్రాధాన్యం ఉన్నదనే నమ్మకంతో వస్తున్నది. రాజకీయవేత్తలూ సంఘసంస్కర్తలూ దానికే విశేష ప్రాముఖ్యం ఉన్నట్లు పరిగణిస్తున్నారు.


"ప్రకృతి పోషణలో ఒకదానిని మించాలని ఒకటి ప్రయత్నిస్తే - రెంటికీ సమాన బలం ఉన్నప్పుడు కూడా ప్రకృతి జయించి తీరుతుంది. పోషణ ఓడిపోతుంది. అయితే ఏ ఒక్కటీ యథాతథంగా మానవజాతినిగానీ తదితర ప్రాణికోటిని గానీ అభ్యుదయ పథంలో నడిపించటానికి తమంతట తాము స్వయంశక్తాలైనవి కావు. ప్రకృతి శక్తి చాలా గొప్పదైనా క్రమమైన వాతావరణం లేకపోవడం వల్ల అది లోపించవచ్చును. అంతేకాదు. ప్రకృతి, సహజంగా ఉన్న పాశవృత్తినీ, శారీరకమైన అర్భకత్వాన్నీ బలహీనమైన మానసిక వృత్తినీ, వాతావరణం పోషణతో ఎంత ప్రయత్నించినా పూర్ణంగా మార్చలేవు" అనిఒక శాస్త్రవేత్త అభిప్రాయ మిచ్చినాడు. ప్రకృతి శక్తి (వంశ పారంపర్యశక్తి) పోషణశక్తి కంటే అయిదు మొదలు పదిరెట్ల వరకూ శక్తిమంతమైనదని సంతాన శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

'లోకంలో శక్తిమంతమైనది మాత్రమే నిలుస్తుంది; అదే నిలవవలె' నని డార్విన్ మహాశయుడు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే ఆ సిద్ధాంతం లోకంలో జరిగే సమస్త హింసాకాండనూ ప్రతిఘటించకుండా చూస్తూ ఊరుకోమని కోరుతుంది.

ఆ సిద్ధాంతాన్ని అనుసరించే జీవ శాస్త్రజ్ఞులు (Biologists) కొందరు బయలుదేరినారు. అశక్తత వల్ల మరణించబోయే పసిపిల్లలకు పోషణ అనవసరము; వారు చనిపోవుటయే లోకానికి శ్రేయస్సు అని వారి అభిప్రాయం. కానీ లోకములో ప్రాణికోటి ముఖ్యంగా -మానవుడు, అనంతమైన మానసిక పరిణామాన్ని పొందినాడు. ఇటువంటి ఘాతుక కృత్యాలకు అతను పూనుకోలేడు ఆ అనాగరక స్థితిలో అతడు నిలువలేడు. కేవలం ప్రకృతి చేసే హింసావిధానాన్ని విప్లవ తత్త్వంతో ఎదుర్కొని అరికట్టకుండా దాసోహం చెయ్యలేడు.


ప్రకృతి సహజమైన ఎన్నిక చేయగలిగేమాట వాస్తవము. కాని క్రొత్తవాటిని సృజించే శక్తి దానికి లేదు. వాతావరణానికే ఈ శక్తి వున్నది. ప్రకృతి త్రోసి పారవేసిన వాటికి ప్రాణం పోసే శక్తి దానికున్నది. మెండల్ మహాశయుడు ఉద్భవించి పై జాతికి చెందిన జీవశాస్త్రజ్ఞుల దృక్పథాన్ని మార్చినాడు. వాతావరణానికి కూడా అనంతమైన శక్తి ఉన్నదనీ, దానిమూలంగా ప్రాణులు నూతన గుణాలను కొన్నింటిని సంపాదించుకుంటున్నవనీ నిరూపించి శాస్త్రజ్ఞులోకానికి చూపించినాడు.


ప్రాణిలోకంలో గుణాలు సుస్థిరంగా ఉండవనీ, మార్పును పొందుతూ ఉంటవనీ శాస్త్రజ్ఞులు అభిప్రాయము నిచ్చినారు. కొన్ని గుణాలు కొన్ని కాలాలలోనే వుండి తదుపరి మార్పు పొందుతవని వారి ఉద్దేశ్యము. వీటిని శాస్త్రవేత్తలు 'మ్యుటేషనులు' అన్నారు.


అది కారణంగా వృక్షజాతుల ఋతు కాలములో ప్రాణాండాలు (Germ - Cell) ఏకమైనప్పుడు మొదటి జాతికంటే భిన్నమైన జాతి లక్షణాలేర్పడవచ్చునని మెండల్ మహాశయుడు పరిశోధనల మూలంగా నిరూపించినాడు. అంటే వాతావవరణం వల్ల ప్రాణికోటిలో దాగి ఉన్న కొన్ని శక్తులు బహిర్గత మౌతవని తాత్పర్యార్థము.


అది సాంఘికం కావచ్చును. లేదా రాజకీయం కావచ్చును. వైజ్ఞానికమూ కావచ్చును. ఏ పథకానికైనా ఒకటే ఆదర్శం. ఉదాత్తమూ, ఉత్తమమూ అయిన మానవ సమాజాన్ని సృజించుకుంటూ పోషించుకోవటము దాని ధర్మమై ఉంటుంది. ఈ దృష్టితోనే ఏ జాతి పుక్కిటి పురాణాలైనా, అర్థం బద్ధం కనుపించని ఏ దేశంలోని ఆచార వ్యవహారాలనైనా శీలసంపత్తులనైనా విమర్శించవలసి వుంటుంది. ఏ జాతి ఐనా ఎంతమంది ఉత్తమ మానవులను సృజించింది. వారి గుణగణాలేమిటి? ప్రపంచాభ్యుదయానికి ఆ జాతి చేసిన దోహద సేవ ఏమిటి? అనే ప్రశ్నలు.


హిందూజాతి, సంతానాన్ని - దాని లక్షణాన్నీ, బాగా అవగతం చేసుకున్నది. అధునాతన కాలంలో పుట్టిన సంతాన శాస్త్రంలోని ధర్మసూక్ష్మాలన్నీ హిందూజాతి

వివాహ విధానంలో గోచరిస్తున్నవి. హిందువుల గృహ్య సూత్రాలూ, స్మృతులూ ఇందుకు ప్రబల సాక్ష్యాలు. హిందువుల ధర్మంలో సాంఘిక జీవితం సమ్మేళనాన్ని పొందింది. ధర్మాన్నీ, స్మృత్యాదులనూ పాటింపకుండా చరించినవారికి శిక్ష 'పాపకూపం' అనే బెదిరింపు, లేదా సంఘ బహిష్కృతి. ఇందులో మొదటిది ప్రాచీన కాలంలో బాగా పనిచేసింది. నేటి ప్రజాపరిషత్తులో జరిగే చట్టాలమీదకంటే వాటిమీదనే లోకానికి భయం విశేషంగా ఉన్నట్లు అవగతమౌతున్నది. నాలుగు వేల సంవత్సరాల నుంచీ నానావిధాలైన రాజకీయాలకూ, దండయాత్రలకూ, సాంఘిక జీవన విధానంలో పరప్రభావాలకూ గురియౌతూ వచ్చినా విశేషమైన మార్పులు హిందూ జాతి ధర్మాలలో కలగకపోవటం విశేషమైన ఆశ్చర్యం కలిగిస్తున్నది. అంతేకాకుండా హిందూజాతి స్మృతి, గృహ్యసూత్రాదుల ఆధిక్యమును వేనోళ్ళ చాటుతూ ఉన్నది.


ఈ గృహ్య సూత్రాలు గానీ, స్మృతులు గానీ మొదట కొద్దిపాటి సమాజాన్ని ఉద్దేశించి పుట్టినవి. తరువాత అనేక కారణాలమూలంగా అనేక జాతులు వచ్చి హిందూజాతిగా ఏర్పడ్డవి. ఆర్యావర్తపు టెల్లలు హిమాలయాలు మొదలు కన్యాకుమారి వరకూ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చినవి. అయినా సాంఘిక స్థితిలో - లోపాలు లేవని కాదు - విశేషమైన మార్పులు కలగకపోవటానికి స్మృతికర్తల మేధావిశేషమే కారణమని ఒప్పుకొని తీరాలి.


యజుర్వేదంలో "పశ్యతి పుత్రం, పశ్యతి పౌత్రం, ప్రప్రజయా పశుభిః మిథునైర్జాయతే యస్యైవం విదుషాగ్ని హోత్రం జుహ్వతి” అని పరాయిత బ్రాహ్మణం పలుకుతున్నది. వివాహం ఎందుకోసం? సత్సంతానం కోసం. అందుకనే మహాకవి కాళిదాసు రఘువంశాన్ని వర్ణిస్తూ 'ప్రజాయై గృహమేధినాం' అని అన్నాడు.


'అపుత్రస్య గతిర్నాస్తి' అనే ఆర్యోక్తి లోక ప్రసిద్ధమైనదే. అంటే భారతీయ వివాహం పాశవ ప్రేమకోసం కాదు, ఉత్తమ గతికోసం. అభ్యుదయం కోసం. సంతాన శాస్త్రం కూడా వివాహం అత్యవసరంగా చేసుకొని తీరవలెనని చెపుతున్నది. ఆర్యధర్మము కూడా భంగ్యంతరంగా వివాహం చేసుకోవలసినదేనని విధిస్తూ ఉన్నది. స్త్రీ పురుష సంయోగానికి ఫలితాంశం సంతానం. సంతానంలేని దాంపత్యం పరిహాస పాత్రమౌతూ ఉండటమూ, బేలతనాన్ని వహించటమూ ఇందుమూలాననే.


కుమారుడు కలగటమంటే ఆర్యులకు ప్రజాపతిత్వం వహించటమన్నమాట! ప్రజాపతి కరుణాప్రసాదాన్ని పొందటమన్నమాట!! అందువల్ల నిత్యబ్రహ్మచర్యాన్ని వారు గర్హించారు. నాడు 'ఘోటక బ్రహ్మచారి' అనే పలుకుబడిలో న్యూనత గోచరిస్తుంది.

నిత్యబ్రహ్మచర్యమంటే కేవలం ఆత్మ స్వరూపాన్ని చంపుకోవటమనీ, అది అవమానకర కృత్యమనీ ఆర్యుల తలపోత. అది కేవలమూ మాతాపితృత్వాన్ని (Parenthood) వహించటానికి జంకటం తప్ప అన్యం కాదని వారి అభిప్రాయం.


ఆర్యధర్మ శాస్త్రవేత్తలు పితృదేవతలను తృప్తి పొందించటానికి సూనుడు (పుత్రుడు) అవసరమన్నారు. వారి నిత్యనైమిత్తిక తర్పణాలకు సూనుడు అత్యవసరము. 'సూను' శబ్దానికి మొగ్గ అని అర్థం. ప్రాణాంశాల సంయోగం వల్ల ఈ మొగ్గ కలుగుతుంది. తండ్రే మాతృగర్భాన్ని చేరి కుమారుడుగా పుట్టి ప్రజాతంతువును పొడిగిస్తూ, జీవ ప్రవాహానికి దోహద సేవ చేస్తాడని వారి నమ్మకం. పితృదేవతలు ఈ ప్రాణసూత్రం తెగిపోకుండా చూచుకోటానికి సృష్ట్యాది నుంచే వస్తూ ఉన్న వ్యక్తులు. దీనినే ఆధునిక పరిభాషలో చెప్పితే 'వైమనిజమ్' అనవచ్చును.


'జీవం ఒక ప్రాణాండం నుంచి మరొక ప్రాణాండానికి ప్రవహించే నది వంటిది' అని బెర్గసన్ అనే శాస్త్రవేత్త నిర్వచించాడు. అయితే ఆయన ఆర్యులు చెప్పినట్లు దానిని అడ్డుకోటం పాపం అని అనలేదు. శరీరము భగవత్ప్రసాదం, సృష్టికర్తృత్వాన్ని ప్రసాదించే శక్తిని ఉపయోగించుకోకపోవటము తెలివి తక్కువ. పూర్వులు లేకుండా తానింతవాడు కాగలడా? పితృభక్తి ఉన్నవాడు ఆర్యధర్మాన్ని అనుసరించి వివాహం చేసుకోవలసినదే; పితృఋణం సంతానముఖాన తీర్చుకోవలసినదే.


సాంఘికవ్యవస్థ ననుసరించి పరిగణించినా పుత్రుడు కలగటం కేవలము విజయంగా కనిపిస్తుంది. ఆ పుత్రుడు తనంతటి వ్యక్తి అయి లోకంలో తన్ను మరపింపజేస్తూ ఉంటే ఆనందించని పితృహృదయం, ఏ దేశంలో వుంటుంది? కుమారుడు లేని స్త్రీ భర్త మరణానంతరం ఒక అబీజ. 'పుత్ర' శబ్దంలో మరింత విశేషార్థం గోచరిస్తూ ఉన్నది. వ్యక్తి తన జీవిత కాలంలో తీర్చుకోలేని కోరికల నన్నిటినీ తీర్చేవాడు పుత్రుడు. అతడు ఏ పాపాలు చేసినా తిరిగీ కుమారుడి కడుపున పుట్టి పాపాన్ని పాపుకుంటాడు. కుమారుని కనటం భారతీయునికి కేవలం పితృదేవతల కోసం కాదు; తనకోసం కూడాను. 'ఆత్మజ' శబ్దంలో నా వల్లనే పుట్టినవాడు; అన్యుడు కాడు అనే అర్థం అవగతమౌతున్నది. పితృదేవతాపూజనం అంటే ఏమీ వింత విశేషం గాదు. లోకంలో అంతర్వాహినిగా అనంతకాలం నుంచీ వస్తూ ఉన్న జీవనదిని దర్శించి ధ్యానించడం. ఆర్యసంఘానికి అనార్య సంపర్కమూ కలిగింది. అందుమూలంగా అనేక విలోమ జాతులు ఏర్పడ్డవి. ఒకానొక కాలంలో వర్ణాంతర వివాహాలున్న ఆర్యజాతి లక్షణాలను మార్చుకొని ఏ వర్ణంవారు ఆ వర్ణంలో వివాహం చేసుకోవాలి అని నియమించుకున్నది. అయితే ఏ వర్ణం వారైనా వారి వారి గోత్రంలో నుంచి కన్యకలను వివాహం చేసుకోకూడదనే నిర్ణయించినారు. అంటే ఆర్యవివాహంలో ఒక విధమైన కూటాంతరత (Exogamy), కూటబాహ్యత (Endogamy) రెండూ ఉన్నవన్నమాట!


ఉత్తమ జాతులు (వర్ణాలు) అనిపించుకున్నవారు అనులోమ వివాహపద్ధతి మూలంగా తక్కువ వర్ణాలవారిని వివాహం చేసుకోవచ్చుననే నియమం ఆచారంలోకి వచ్చినది. ఎక్కువ జాతికి చెందిన తండ్రికి కలిగిన కుమాళ్ళు ప్రాచీనకాలంలో ఎక్కువ జాతివారై తదనుగుణమైన జననాదికసంస్కారాలను పొందేవారు. కానీ తక్కువజాతి తండ్రికి పుట్టినవాడు మాత్రము తల్లిజాతికి రావటానికి వీలులేదు. దీనిని ఆధారం చేసుకునే మనుధర్మశాస్త్రంలో అనులోమ విలోమ జాతి నిర్ణయం జరిగింది. వర్ణధర్మానికి మూలసూత్రం కులక్రమాగతశక్తి (Heredity). దానిని నిలపటానికే హిందూ ధర్మశాస్త్రజ్ఞులు ప్రయత్నించారు.


అయితే - భార్య ఎప్పుడూ తండ్రివైపు ఏడు తరాలలోనూ, తల్లివైపు 5 తరాల లోనూ ఉండకూడదు. ఈ నియమమూ కాలాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, సందర్భాలను బట్టీ మార్పు పొందినట్లు కూడా నిదర్శనాలు లేకపోలేదు. తండ్రివంశములో నుంచి వివాహం చేసుకోవటమనే ఆచారం క్రమక్రమంగా నశించి నిర్మూలితమై ఉంటుంది. హిందూ సంఘానికి చతుర్వర్ణాలు ప్రథమ విభాగం. అందులో ప్రతివర్ణములోను కొన్ని అవాంతర భేదాలు. ప్రతి అవాంతర జాతిలోనూ గోత్రవిభాగం ఏర్పడ్డది. ఇందులో కొన్ని వర్ణాల వారికి మొదట గోత్రాలు లేకపోయినా లేకపోవటానికి కారణం అనాదినుంచీ ఆర్యులు కాకపోవటమేమో - తరువాత పురోహిత గోత్రాలను స్వీకరించి నారు. అందువల్ల అలా ఏర్పడ్డ వంశాలలోనూ పూర్వం ఒకవేళ అవకాశం ఉన్నా తరువాతి కాలంలో పితృపక్షం నుంచి భార్యను స్వీకరించే అవకాశం తప్పిపోయింది.

- వెనుకటి కాలాన్ని గానీ, సాంఘిక స్థితిగతులను గానీ నేటి దృక్పథంతో విచారించడము శాస్త్ర సమ్మతము కాదు. ఆర్యజాతిలో విశిష్ట మేధాసంపన్నులు జన్మించి, జాతి విశిష్ట ధర్మాలకు దెబ్బ తగలని రీతిగా కొన్ని కట్టుబాట్లు ఆలోచించి, స్మృతులమూలంగా నిబద్ధం చేశారు. మొదట్లో వర్ణాంతర వివాహాలు కొన్ని విరివిగా జరిగి ఉండి ఉంటవి. వర్ణాంతర వివాహమంటే సంతనా శాస్త్ర రీత్యా పలికితే కృతక - సంతాన ప్రాప్తి (Inter - Breeding) అని చెప్పవచ్చును. లేదా, మిశ్రమ - సంతాన ప్రాప్తి వల్ల ఆర్యులకు కొన్ని దోషాలు పొడకట్టినట్లు అవగతమౌతూ ఉన్నది. ఆయా వర్ణాలలోనూ, వంశాలలోనూ కనుపట్టవలసిన పావిత్య్రయము మాట అటు ఉంచినా,

కొన్ని శారీరక విపత్తులు గూడా ఏర్పడి ఉంటవి. ఆ పద్ధతిని మరింతకాలం అమలులో ఉంచితే వర్ణాలలో విశేషంగా వంధ్యత్వము (Sterility) ప్రబలిపోతుంది. అలా జరిగితే సంతాన రహితత కలుగుతుందనే అభిప్రాయాన్ని నేటి సంతాన శాస్త్రజ్ఞులు అంగీకరిస్తూ ఉన్నారు.


ఈ సందర్భంలో ఒక శాస్త్రవేత్త ఏమంటున్నాడో గమనించండి. 'యూరప్ దేశంలో కూడాను ఉత్తమ శ్రేణికి చెందిన వారిలో కంటే తక్కువవారిలోనే సంతానాభివృద్ధి ఎక్కువ. అందువల్ల లోకంలో ఎప్పుడు పుట్టినా మొత్తం మీద చూస్తే యోగ్యమైన సంతానం కంటే అయోగ్యమైన సంతానమే విశేషంగా కలుగుతుంది' అన్నాడు ఆయన. ప్రాచీన హైందవ సామాజిక స్థితి వర్ణభేదం మీద ఆధారపడిన మాట వాస్తవము. దాని కారణం నేటి సంతాన శాస్త్రజ్ఞులు పలుకుతూ ఉన్న అభిప్రాయాలకు మూలమైన విజ్ఞానమే. మిశ్రమ సంతానం వల్ల ప్రయోజనం లేదని వారు గ్రహించారు. అందువలన ప్రత్యేక వైవాహిక నియమాలను అనుశాసించారు. మెండల్ మహాశయుడు 'లోకం చెప్పుకునే వర్ణాంతర వివాహాలకూ, జాత్యంతర వివాహాలకూ తగిన ప్రకృతి మూలం లేదని అభిప్రాయ పడుతున్నాడు.,


అయితే కులతత్త్వం విపరీత మార్గాలను పట్టి, చాలా సంకుచిత దృష్టి కాలక్రమేణా వహించిన దన్నమాట అందరూ అంగీకరించి తీరవలసినదే. అందుమూలంగా కూడా వివాహానికి ప్రధానాశయమైన 'సత్సంతానానికి' ఎంతో దెబ్బ తగిలిన మాటా వాస్తవము.


హిందూ వైవాహిక ధర్మంలో యోగ్యమైన కన్యకను మాత్రమే వివాహం చేసుకోమనేది మంచి నియమం. ఈ విషయాన్ని ప్రతి జాతీ పాటిస్తుంది.


వేదయుగం అంటూ ఒకటి చారిత్రక సత్యమైనట్లయితే ఆ కాలంలో వివాహం బాగా యుక్తవయస్సులోనే జరిగినట్లు నిదర్శనాలున్నవి. వారి వారి మానసిక వికాసాలను అనుసరించి ఒకరినొకరు అన్యోన్యం ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. కాని తరువాతి కాలంలో మార్పు వచ్చింది. భర్తకంటే భార్య మూడు వత్సరాలకంటే చిన్నదై ఉండరాదని వాత్స్యాయనాదులు చెప్పినారు. సంతాన శాస్త్రజ్ఞులూ (Eugenists), మానసిక తత్త్వవేత్తలూ (Psychologists) ఇద్దరు కామోద్రేకులూ (Sexual Neurotics), అసామాన్య కామమార్గావలంబులూ (Abnormal Sexes) అయినవారి మధ్య జరిగే వివాహాలలో సంతానం చాలా దెబ్బతింటుందని అభిప్రాయమిస్తున్నారు. అందుమూలంగానే అనాదికాలంలో

అందరియెడా సర్వసామాన్యంగా ఉన్న గాంధర్వ వివాహ పద్ధతి కేవలమూ క్షత్రియుల విషయంలోనే ఆచారమై నిలచింది. మిగిలిన జాతులన్నిటికీ ప్రాజాపత్యమే ధర్మబద్ధమైన వివాహమైనది. ప్రస్తుతపు హిందూ వివాహ ధర్మం అది ఒక్కటే.


కన్యావివాహాలు కేవలం బ్రాహ్మణజాతికి మాత్రమే సంబంధించిన వేమో ననిపిస్తుంది. ఇందులో కన్యకకంటే వరుని వయస్సు మూడు రెట్లు అధికంగా వుండాలనే నియమం ఉన్నది. ఇది వారి విద్యావిధానం మీదా ఇతర కారణాల మీదా ఆధారపడి ఉంటుంది.


భార్యాభర్తల మధ్య అంతరాన్ని గురించి హిందూ వైద్యశాస్త్రజ్ఞులు ఏం పలుకుతున్నారో ఈ సందర్భంలో గమనించవలసి ఉంటుంది. సుశ్రుతుడు ఇరువది ఐదేండ్ల పురుషుడు పన్నెండేళ్ళ కన్యకను వివాహం చేసుకోవాలన్నాడు. వాగ్భటుడు పురుషుని వివాహ వయస్సును ఇరువది ఒక్క సంవత్సరానికి తగ్గించినాడు. అంతేకాకుండా పదునైదు, పదహారు సంవత్సరాలకు పూర్వమే స్త్రీకి గర్భధారణం జరిగితే పిల్లలు అతిబలహీనంగా ఉండటమో, మరణించటమో జరుగుతుందని సుశ్రు తుని అభిప్రాయము. అంతేకాకుండా వెనుకటి హిందూజాతి కన్యకలు పుష్పవతులయ్యే వయస్సు ఈ నాటికంటే మించి ఉండి ఉంటుందని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడినారు. ఆ నాడు కన్యావివాహాలని చెప్పినవన్నీ గృహస్థ ధర్మాన్ని నెరపే వివాహాలు కాకపోవచ్చును. కావు కూడాను.


యువకుల వివాహ వయస్సును ప్రాచీన హిందువులు ఎందుకు పెంచవలసి వచ్చింది? భార్యాభర్తల మధ్య ఉండే అంతరం మూలంగా బలకరమై పూర్ణాయుర్దాయాన్ని పొందే సంతానం కలుగుతుందనే నమ్మకం మీదనా? లేక, స్త్రీ కంటే పురుషునిలో ఏదో ఆధిక్యము ఉన్నదనే నమ్మకం మీదనా?


సుశ్రుతాచార్యుని అనుసరించి స్త్రీలలో ఋతుధర్మం పన్నెండవ ఏట ప్రారంభించి ఏబదియవ సంవత్సరం వరకూ ఉంటుంది. పదునైదవ సంవత్సరము మొదలు వారు దరిదాపు నలువది ఐదు సంవత్సరాలవరకూ సంతానాన్ని పొందటానికి శక్తిగలవారుగా ఉంటారు. అందువల్ల యువకుడు ముప్పదియవ ఏటా, స్త్రీ పన్నెండవ ఏటా వివాహం చేసుకుటే ఇరువురికీ క్రమమైన సత్సంతానం కలుగుతుందని ప్రాచీన హైందవులు నమ్మి ఉంటారు. అంతవరకూ సంతానానికి మూలకారణుడైన పురుషుడు అంతర్ముఖమైన సృజనాశక్తితో బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తాడు.

మరియొకరు ఈ వివాహ వయస్సు కేవలము ప్రాచీనార్య విద్యావిధానం మీద ఆధారపడి ఉంటుందనీ, ఆ నాటి యువకుని విద్యాపరిపూర్తికి ఇరువది నాలుగు, ముప్పది రెండు సంవత్సరాలు పట్టేదనీ అభిప్రాయపడినారు. మానవ జీవిత ప్రమాణమని చెప్పుకుంటూ ఉన్న నూరు వత్సరాలనూ మూడుభాగాలుగా విభజించి, మానవుడు ఒక్కొక్క విభాగాన్ని త్రివర్గాలకూ క్రమంగా ఉపయోగించవలసి ఉంటుందని వాత్స్యాయన ఋషి పలికినాడు. మనువు నాలుగు భాగాలుగా విభజించి ఒక్కొక్క పాదమునకు పాతిక వత్సరాలని నియమించాడు.


రాముని వివాహ సమయానికి అతని వయస్సు 16 సంవత్సరాలు, సీతకు 6 సంవత్సరాలు. (బాలకాండ 17 అరణ్యకాండ. 47) చాణక్యుడు ప్రతిక్షత్రియ కన్యకనూ 16వ ఏట వివాహం జరిగి తీరాలని నీతిశాస్త్రంలో నియమించాడు. కన్యక వయస్సును గురించి లక్షణాలు నానారకాలుగా కనిపిస్తున్నవి.


కన్యకను వివాహం చేసుకోటంలో ఓ అంతరార్థమున్నది. అందు మూలంగా ఆమె భర్తృ గృహవాతావరణాన్ని పొంది గృహస్థ ధర్మాన్ని నెరపే సమయానికి స్వేచ్ఛగా ప్రవర్తించే వీలు కలుగుతుంది.


హిందూ వివాహంలో యువతీయువకుల ప్రమేయం తక్కువ. యువకుల ఉద్రేకోత్సాహాలను అరికట్టే ప్రయత్నము ఇందులో కనిపిస్తుంది. కాని హిందూజాతి వివాహంలో జాత్యభ్యుదయమే ప్రధాన ధర్మమైనట్లు సుస్పష్టంగా గోచరిస్తుంది. వధూవరుల కన్యోన్యమూ అనురాగం లేని వివాహం నిష్ప్రయోజనమైనదనే మాట నిజమే. కాని కాలక్రమేణా కలిగే మానసికమైన అసంతృప్తి శారీరకమైన అసంతృప్తి అంతకంటే గొప్పవి.


వరణమంటూ హిందూ వివాహంలో ఒక తంతు ఈ నాడు కనిపిస్తుంది. పూర్వము ఆచారంగా కూడా ఉండి ఉంటుంది. అయితే ఇది అన్యదేశాలలో వలె లింగ సంబంధమైనది (Sexual) మాత్రము కాదు. సంతాన శాస్త్రజ్ఞులు పాశ్చాత్య దేశాలలో జాత్యభ్యుదయాన్ని మనస్సులో పెట్టుకొని రక్షకభటవర్గం చేత బలవంతంగా యువతీయువకులను భార్యాభర్తలు కాదగ్గవారిని ప్రభుత్వమే ఎన్ని వివాహం చేయటము మంచిదని అభిప్రాయపడ్డారు. జంతుకోటిలో ఈ రీతిగ బలవంతంగా ఎద అయ్యేటట్లు చేయించటం వల్ల మంచిజాతి జంతువులు పుడుతున్నవి. హిందువులు సంతాన శాస్త్ర సూక్ష్మాలను ఏ నాడో గ్రహించిన వారు కావటం చేత యువతీయువకుల తాత్కాలిక ఉద్రేకోత్సాహాలకు వివాహ సంస్థను ఒదిలిపెట్టి భగ్నం చేయలేదు.

వివాహ విషయంలో ఆర్యుల గృహ్య సూత్రాలు ఏమని చెప్పుతున్నవో ఈ సందర్భంలో పరిశీలించటం సమంజసము. వివాహం చేసుకునే వారు తల్లివైపూ, తండ్రివైపూ వంశ చరిత్ర జాగ్రత్తగా పరిశీలించటం అవసరమంటున్నారు. కన్యకను తల్లిదండ్రులు, యువకుడూ, మేధాసంపన్నుడూ అయినవాడికి ఇచ్చి వివాహం చెయ్యటము ధర్మమనీ, యువకుడు శుభలక్షణాంగిని సద్వంశజను, నచ్చిన కన్యకను, ఆరోగ్యవంతురాలిని వివాహంచేసుకోవలసి ఉంటుందనీ ఆశ్వలాయనగృహ్య సూత్రాలు చెపుతున్నవి. ఈ అభిప్రాయాలనే ఆపస్తంబాది ఇతర సూత్రకారులూ, పురాణ కర్తలూ బలపరుస్తున్నారు.


వరాహ పురాణంలో కన్యా లక్షణాన్ని గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయమే ఉన్నది. అందులో కన్యక రూపమూ, అవయవ లక్షణాలూ విపులంగా చర్చితాలైనవి. ఇవన్నీ సంతాన శాస్త్రజ్ఞులు అంగీకరించే విషయాలు. వాత్స్యాయనుడు కన్యావరణాధ్యాయంలో ఈ విషయాన్ని కామశాస్త్రానుగుణంగా పరిశీలించాడు. మానవ, గంధర్వ, యక్ష, దేవ, సత్త్వాదుల క్రింద స్త్రీ పురుష జాతులను రెంటినీ విభజించి, ఆయా జాతివారికి వివాహం జరిగించటం యుక్తమని మన శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఆ కాలంలో మాటికులనే పేరుతో వంశ సంబంధాలూ, బంధుత్వాధికాలూ, సత్త్వాధికాలూ గ్రహింపగలిగిన వారు వివాహ బంధాలను కుదురుస్తూ ఉండేవారు. అంతేకాకుండా జ్యోతిష శాస్త్రాన్ని వారు ఆధారంగా స్వీకరించేవారు.


మనువు ఒకచోట “ఒక యువకుడు, గుణసంపన్నుడూ, సుశరీరుడూ, రూపసీ దొరికితే పుష్పవతికాని కన్యకనైనా యిచ్చి వివాహం చెయ్యవచ్చు" నని అభిప్రాయ మిచ్చినాడు. కొన్ని కొన్ని కుటుంబాలలో వివాహాలు పనికిరావనీ, ధన ధాన్యాది సంపత్తిని జూచి మోసపోవద్దనీ, సద్గుణ సంపత్తి లోపించిన వారితో వివాహ బంధం పనికిరాదనీ ఆయన అభిప్రాయపడినాడు. బొల్లి, నంజు, కుష్ఠు, మొదలయిన వ్యాధులు వంశంలో ఉంటే వారికి పిల్ల నివ్వకూడదన్నాడు. జుట్టు విశేషంగా ఉన్నవారితో సంబంధం పనికిరాదన్నాడు. మనుధర్మశాస్త్ర వ్యాఖ్యాత అయిన కుల్లికుడు ఆ జబ్బులు సంతానానికి కూడా కలుగవచ్చునని అభిప్రాయమును వ్యక్త పరిచాడు. అయితే ఒకొక్కప్పుడు ఆ పారంపర్య దోషం సంతానానికి కలుగకపోవచ్చును. కాని మనువు ప్రధానోద్దేశం సత్సంతానము. అందువల్లనే వివాహం మంచి కుటుంబాల మధ్యనే జరగవలెనని అభిప్రాయం.

కానీ మనువు చెప్పిన సూత్రాలనన్నిటినీ తూచా తప్పకుండా అనుసరిస్తే లోకంలో వివాహం కాని వాళ్ళు అనేకమంది మిగిలిపోతారు. చాలామంది బ్రహ్మచారులూ, సన్యాసులూ, జోగులూ - ఉభయ జాతుల్లోనూ ఉంటారు.

ప్రపంచంలో ఉత్తమ కోటికి చెందిన మహా మేధావులును అనేకులను సృజించినది హిందూజాతి. ఏ వ్యక్తి ఐనా స్వయంవ్యక్తిగా నిలవటానికి కారణాలు అతను కొన్ని గుణాలతో పుట్టటమే. అవి వాతావరణం వల్ల అభివృద్ధి పొందుతవని భారతీయ విశ్వాసము. మానవుడు పురుషోత్తమత్వస్థితిని పొందటానికి మూలాలు రెండు.

1. దైవ సంపద, 2. పురుష కారము అని పెద్దలంటారు. ఇందులో మొదటిది అతని పుట్టుకనూ, గుణగణాలనూ, జీవిత ప్రమాణాన్నీ తదితరాలనూ నిర్ణయిస్తుంది. పురుష కారము కేవలము వాతావరణానికి సంబంధించినది. ఈ రెండూ మానవాభివృద్ధికీ, సత్సంతాన ప్రాప్తికీ ఆవశ్యకాలని హిందూతత్వ వేత్తల అభిప్రాయము.

బీజ క్షేత్రాలలో బీజమే విశేషశక్తి కలిగినది అని మనువు. లోకంలో ఏ ప్రాణిలోనూ బీజానికి భిన్నమైన ప్రాణి జనించదు. మానవులలోనూ అంతే పురుషుడు బీజము. స్త్రీ క్షేత్రము. స్త్రీలో ఉండే ప్రాణాండము బీజమును వహిస్తుందనీ ఆయన అభిప్రాయము. అందువల్లనే ఆయన ఏకవర్ణ వివాహాలు (Intra - O caste Marriages) అంగీకరించి, వర్ణాంతర వివాహాలు (Iner O caste marriages) తిరస్కరించినాడు. ఏకవర్ణ వివాహాలు శారీకంగానూ, మానసికంగానూ, దైనందిక వ్యవహారోచితంగానూ 'సరిసాటి' మీద ఆధారపడినవి. మనువును అనుసరించి సరిసాటి వారికి సంపర్కం ఉండకూడదు. ఆయనే ఒకచోట ఏ విధంగానైనా ఏడు తరాల వరకూ ఉత్తమ సంపర్కం కలిగితే, అధమవర్గానికి కూడా కలిగే సంతానం ఉత్తమస్థితికి చేరుకుంటుందని అన్నాడు. ఇందులో గర్భితమైన ముఖ్యసూత్రాన్ని సంతాన శాస్త్రజ్ఞులు అంగీకరించారు.

కన్యావివాహాన్ని గురించి మరోమాట. హిందువులకు స్త్రీ సంతానం కంటే పురుష సంతానం మీద విశేషాసక్తి. వారు ఉత్తమ లోకాలకూ పనికి వస్తారని వారి నమ్మకం. స్త్రీ సంతానం కేవలమూ పరలోకానికే పనికివస్తారు. అందువల్లనే హిందువులు కన్యను, దానయోగ్యమైనను ప్రధాన వస్తువుగా భావించి ఈ దానం మూలంగా ప్రజాపతి చేయబూనిన సంతాన సృష్టికి తాము తోడ్పడుతున్నామని భావిస్తారు. అటువంటి సందర్భంలో దానం కళంకరహిత మైనదై ఉండాలి. లేకపోతే పాపం చుట్టుకుంటుంది. అందువలన ఆమెను కన్యకగా ఉన్నప్పుడే కాళ్ళు కడిగి దానం చేస్తారు. అసత్సంతానం (అధర్మ సంతానం కలిగితే అందరూ అసహ్యించు కుంటారు, ప్రపంచంలో వారి వారి వివాహ నియమాలు ఎంత నీరసాలైనా సరే. అందుకనే ఏ లోపమూ లేని కన్యకను దానం చెయ్యడం. ఇటువంటి హిందువులు ఒకానొక కాలంలో 'దేవర న్యాయాన్ని' అంగీకరించారంటే గమనింపదగ్గ విషయం. ఇది కేవలమూ వంశరక్షణ సూత్రం మీద ఆధారపడి ఉంటుందని గమనించాలి. ఒక మగవాడు నష్టపడితే వంశానికీ, దేశానికీ, జాతికీ భంగపాటుగా వారు భావించి ఉంటారు. ఒకానొక కాలంలో పాశ్చాత్య దేశాలలో వచ్చిన చట్టం (Leverite Law) ఇటువంటిదే. ఈ చట్టము ఆ సంతానాన్ని అంగీకరించదు గానీ మఠాధిపతి అనుజ్ఞతో అన్యుని వల్ల సత్సంతానాన్ని పొందటానికి అంగీకరిస్తుంది. ఇది కేవలమూ సంతాన ధర్మాలను మనస్సులో ఉంచుకుని చేసినదని వేరే చెప్పవలసిన పనిలేదు.


హిందూ వివాహం కామతృప్తి కోసం కాక సత్సంతానాని కోసం అది శారీరకావసరమని (Biological Necessity ) శాస్త్రజ్ఞులు గుర్తించకపోలేదు. మనువు దీనిని బట్టే ప్రమాణంలో వ్యభిచారాన్ని ఖండించాడు. ఏ విధంగా జింక మొదట కొట్టినవాడిదే ఔతుందో అదేవిధంగా సంతానం భర్తది అన్నాడు. సుశ్రుతాచార్యులు తరువాత కలగబోయే సంతానానికి కావలసిన సమస్తమూ శుక్లంతో ఉన్నదని నాల్గవ అధ్యాయంలో వాక్రుచ్చాడు. అది లింగ శరీర రూపంతో ఉంటుందని అన్నాడు. అయితే వైయక్తిక భేదాల మాటేమిటని చరకాచార్యుడు ప్రశ్నించుకొని, మూడవ అధ్యాయంలో అంధత్వము వికలత్వము మొదలైనవి బీజానికున్నా, గర్భాదాన ఉల్బణకర్మ కలిగేటంతవరకూ ఆ గుణా లంటవని సమాధానం చెప్పినారు. అది కేవలము శరీరమొక్కటే కాదు. ఆత్మ మరొకటున్నదని వారి అభిప్రాయం.

సారాంశము. హిందూ వివాహానికే సత్సంతానము లక్ష్యము. దానికి యువతీ యువకులు తమ బ్రహ్మచర్యాన్ని కొంత కాలం అవలంబించవలసి ఉంటుంది. బ్రహ్మచర్యంలోనే గార్హస్థ్య స్థితికి అత్యావశ్యకాలైన లక్షణాలన్నీ ఉన్మీలితాలై ఉన్నవని హిందూవేత్తల అభిప్రాయం.

(ఆంధ్రపత్రిక -1948 మార్చి, 24వ తేది)