వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/బహు భర్తృత్వం-బహు భార్యాత్వం
బహు భర్తృత్వం - బహు భార్యాత్వం
అనాది కాలంలో వివాహమనే వ్యవస్థ ఏ విధమైన శాస్త్రాన్నీ అనుసరించి ఏర్పడ్డది. కాదు. స్త్రీ పురుష జాతులు రెంటికీ మధ్య ఏర్పడ్డ శారీరక సంబంధం దీనికి మూలమైన ఆధారం. అది క్రమక్రమంగా పరిణామ రూపాన్ని పొందుతూ నేటి వైవాహికసంస్థగా పరిణమించింది. ఆదిలో అది కేవలము శారీరక సంబంధము మాత్రమే. ఈ సంబంధం వల్ల స్త్రీ పురుషులు ఇరువురకూ సంతానం కలగటమూ, కుటుంబాలు ఏర్పడటమూ జరిగింది. అదే తరువాత సభ్య ప్రపంచంలో అనేక నిబంధనలతో ఆచారంగా పరిణమించింది.
అందువల్ల ఎలెన్ కీ మహాశయురాలు అన్నట్లు 'వివాహము చరిత్రాత్మకమైన
సత్యము. ఏ నాడది చరిత్రాత్మక సత్యముగా నిలిచిందో ఆ నాడు ఆ వివాహ వ్యవస్థ
శాస్త్రీయ మనిపించుకున్నది. సంఘం నిలవటానికి, వివాహ నియమాన్ని అత్యవసరంగా
పరిగణించ వలసి వచ్చినది. మతము దానికి ప్రోత్సాహమిచ్చి సుస్థిరం చేసింది.”
ప్రపంచంలో ఉన్న వివాహ విధానాలను గమనిస్తే ఈ అంశాలు వ్యక్తమౌతవి.
ఒకానొక కాలంలో వివక్షారహితమైన కామోపభోగం (Promiscuity) లోకంలో ఉండి
ఉండవచ్చునని శాస్త్రజ్ఞులు అభిప్రాయమిస్తున్నారు. అటువంటిస్థితిలోనుంచి మానవజాతి
బృందవివాహము (Group-Marriage) అమలులోకి తెచ్చుకున్నది. దాని పరిణామ
రూపంగా దాంపత్య వివాహము (Pairing Marriage) ఏర్పడ్డది. నిలకడ లేని ఈ
దాంపత్యంలోనుంచీ అంతకంటే సుస్థిరమైన ఏకగామిత్వ (Monogamy)
వివాహవిధానం ఆధునిక ప్రపంచంలో సర్వజనాంగీకృత వివాహ విధానంగా నిలచి
ఉన్నది. ప్రణయ వివాహము (Love Marriage) ఇంతకంటే అత్యుత్తమమైనదని నేటి
సభ్య ప్రపంచంలో విశేష ప్రచారం జరుగుతూ ఉన్నది. దాని మంచిచెడ్డలూ ఇంకా
పరీక్షితాలు కావలసి ఉన్నది.
లోకంలో అనేక దేశాల్లోనూ అనేక జాతుల్లోనూ బహు భర్తృత్వమూ
(Polyandry), బహు భార్యాత్వమూ (Polygamy) సకృత్తుగా కనిపిస్తున్నవి. ఈ వివాహ
విధానములు మానవజాతిలో దాంపత్య వివాహం, బృంద వివాహమూ, అమలులో
వున్న సంధికాలంలోనే ఏర్పడి ఉంటాయని కొందరు శాస్త్రజ్ఞులు చెపుతున్నారు.
అయితే ఈ రెండు వివాహవిధానాలూ జాతులకు సర్వసామాన్యమైన వివాహ
విధానాలు మాత్రం కావు. ఇవి బానిస విధానానికి జాతులలో చిహ్నాలుగా నిలచిన
రూపాలని చెప్పవచ్చును. ప్రజాసామాన్యంలో ఏకపతి పత్నీత్వము (Monogamy)
మాత్రమే వివాహ విధానంగా కనిపిస్తుంటే, కొందరిలో మాత్రం ఇవి ఆచారాలుగా
ఉండటమే వీటి బానిస విధాన లక్షణాన్ని నిరూపిస్తున్నవి.
బహుభార్యాత్వం ముఖ్యంగా బానిస విధానం వల్ల ఏర్పడినదేనని చెప్పవచ్చును.
కానీ ఇది కొన్ని కొన్ని ఉద్యోగాలు చేసేవారి విషయంలో మాత్రమే అంగీకారాన్ని
పొందింది. పితృస్వామికవిధానం (Partriarchical family System) అమలులో ఉన్న
జాతుల్లో కులంపెద్ద, అతని పెద్దకుమాళ్ళు ఒకరిద్దరు తప్ప ఇతరులు అనేకమంది
భార్యలను వివాహమాడటం కనిపించదు. జనసామాన్యము ఏకగామిత్వాన్నే
అనుసరిస్తుంది. అంటే సామాన్య ప్రజ ఏకపత్నీత్వాన్నే వివాహ ధర్మంగా అంగీకరించి
ఆచరిస్తుందన్నమాట! ధనాఢ్యు లైనవారూ, ఉత్తమ కులాల్లో జన్మించామనుకునేవారు
బహు భార్యాత్వాన్ని ఆదరిస్తారు. అందులో వారికి భార్యలయ్యే స్త్రీలు బానిసలుగా
విక్రీతలైన వారై ఉంటారు. ఒక్కొక్కప్పుడు కొందరు తల్లిదండ్రులు కులగౌరవాన్ని
ఆశించో, లేకపోతే తమ మనమళ్ళకు రాజ్యాధికారం రావాలని కోరుకొనో,
ఇతఃపూర్వము అనేకమంది భార్యలున్న వానికే కుమార్తెలను ఇచ్చి వివాహం
చేస్తుంటారు.
బహు పత్నీత్వ విధానాన్ని పోలినదే బహు భర్తృత్వం (Polyandry) కూడాను.
దీని పుట్టుక కూడా బృందవివాహం (Group Marriage) నుంచే వచ్చి ఉంటుందని
శాస్త్రజ్ఞులు ఊహ చేస్తున్నారు. 'ఏంజల్సు' మహాశయుడు ఈ విధానాన్ని గురించి ఇలా
అన్నాడు :
"ఈ విధానాన్ని గురించి ఊహిస్తే చాలా భయంకరంగా కనిపించవచ్చును.
కాని ఇది కొన్ని కొన్ని దేశాలలో - ముఖ్యంగా ముసల్మాను రాజ్యాలలో, కనుపించే
జనానా జీవితాలకంటే భయంకరంగా ఉండదు" అని.
బహుభర్తృత్వం అనేది ప్రపంచంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నది. ఈ వివాహ విధానంలో ఒక స్త్రీ అనేకమంది భర్తలతో కాపురం చేస్తుందని వెనుక తెలుసుకున్నాము. ఈ బహుభర్తృత్వానికీ, బృంద వివాహానికి విశేషమైన తారతమ్యం ఉన్నది. బృందవివాహంలో ఒక జాతిలోని స్త్రీలందరూ ఆ జాతిలోని పురుషులకు, వివాహమాడినా ఆడకపోయినా భార్యలు. ఇందులో మరీ కొన్ని అనాగరక జాతుల్లో అమ్మ, అక్క, చెల్లెలూ - తండ్రి, అన్న, తమ్ముడూ అనే వివక్ష కూడా ఉన్నట్లు కనపడదు. ఈ వివాహ విధానం దక్షిణ అమెరికా ఇండియన్లలోనూ, అలాస్కా జాతుల్లోనూ, కొన్ని ఆఫ్రికా జాతుల్లోనూ నేటికీ కనిపిస్తున్నది. తిబ్బెత్తు దేశంలోనూ, కాశ్మీరములోనూ, హిమవన్నగప్రాంతాలోని కొన్ని కొండజాతుల్లోనూ, తోడాలలోనూ, కూర్గులలోనూ, నాయర్లలోనూ ఇటువంటి వైవాహిక సంబంధం ఉన్నట్లు సాంఘిక శాస్త్రజ్ఞులు గమనించినారు.
అమెరికా ఇండియన్ జాతుల్లో క్రీ.శ. 1402 ప్రాంతంలో ప్రతి స్త్రీకి తప్పకుండా
ముగ్గురు భర్తలుండేవారట! ఆమె నెలల వారీగా ఒక్కొక్క భర్త యింటికి వచ్చి కాపురం
చేస్తుండేదట!
మెడగాస్కరు, మలై ఆర్చిపెలగోలలో ఈ ఆచారం నేటికీ సకృత్తుగా కనిపిస్తున్నది.
మార్షలు ద్వీపాలలో ఈ ఆచారము విపరీతంగా గోచరిస్తుంది. ఇక్కడ జాతులు
వైవాహికాచారాన్ని అనుసరించి భర్తలు రెండు రకాలు. ఒకడు ప్రధాన భర్త. ఇతరులు
అప్రధాన భర్తలు. అంటే ఉపపతులన్నమాట! శాస్త్రోక్తంగా వివాహమాడిన భర్త
సోదరులు ద్వితీయ శ్రేణికి చెందిన భర్తలు. అంతేకాకుండా ఆమె చెల్లెళ్ళందరూ
భర్తకు ద్వితీయ శ్రేణికి చెందిన భార్యలు. వాళ్ళకు పెళ్ళిళ్ళు కాకపోతే ఇతరులను
చేసుకోవచ్చును. అప్పుడు వారు వివాహమాడే వ్యక్తులు ప్రధాన భర్త లౌతారు. దీనిని
బట్టి ఒక స్త్రీ భర్తలందరూ తప్పకుండా ఏకోదరులు కావలెననిగానీ, ఒక పురుషుని
భార్యలందరూ ఏక గర్భజనితలు కావలెననిగానీ నియమం లేదు.
కాశ్మీర సంస్థానంలో ఉన్న 'లొడకల్' అనే జాతిలో ఈ వివాహ విధానం ఇంకా
చిత్రంగా కనిపిస్తుంది. ఒక కుటుంబానికి చెందిన పెద్దకొడుకు ఒక స్త్రీని వివాహం
చేసుకుంటాడు. అతని భార్యద్వారా యావదాస్తీ వస్తుంది. అతడే మిగిలిన కుమారుల
నందరినీ పోషించవలసి ఉంటుంది. కేవలం పోషణతో నిలువదు. ఆమె
అన్నదమ్ములందరికీ సమాన ప్రతిపత్తి గల వ్యక్తి; భార్య, అంతేకాకుండా ఆమె
కోరుకుంటే మరికొంతమంది ఇతరులను కూడా వివాహం చేసుకోవచ్చును. అయితే
వారికి ఆమె ఆస్తి పాస్తులలో హక్కు కలగదు. ఆ వివాహం కేవలమూ శారీరకభోగం
కోసమే.
హవాయి ద్వీపంలో స్త్రీకి తప్పకుండా ఇద్దరైనా భర్తలుండాలి. లేకపోతే సంఘంలో
ఆమెకు గౌరవం లేదు. ఆమె భర్తలందరితో ఏకకుటుంబంగా జీవిస్తుంది. ఆమె అందరికీ
సమానమైన భార్య. వీరి ఆచార వ్యవహారంలో ఒక స్త్రీ భర్తలందరూ తప్పకుండా
ఏకోదరులు కావలెననే నియమం ఉన్నది.
తూర్పు హిమాలయ ప్రాంతంలో 'తెప్పాలన్' అనే జాతివారున్నారు. వారిది
ఆటవిక జీవనం. వారిలో బహుభర్తృత్వ మున్నదని ప్రతీతి. కాని ఒక భార్యతో
ఇద్దరన్నదమ్ములూ ఏకకాలంలో కాపురం చెయ్యరు. ఒకరు ఊళ్ళో లేనప్పుడు మరొకడు
ఆమెకు సాంసారిక సౌఖ్యాన్ని కలిగిస్తుంటాడు. ఈ జాతిలో భార్య ముఖ్యంగా
మొదటివాడినే పెళ్ళాడుతుంది. దీనిని బట్టి ఈ విధానం బహుసోదరభర్తృత్వం
(Adelphic Polyandry) అని చెప్పవచ్చును. ఈ జాతిలో స్త్రీ ఒక వ్యక్తిని వివాహం
చేసుకున్నా అతని తమ్ములందరితోనూ కామ సంబంధం కలిగి ఉంటుంది.
అంతేకాకుండా ప్రతి మగవాడూ అన్న భార్యతోనూ, ఆమె చెల్లెళ్ళతోనూ మిథునక్రీడ
సలుపుతూ ఉండే స్వేచ్ఛ కలిగి ఉంటాడు. వారికి పెళ్ళి అయినా సరే, కాకపోయినా
సరే.
కానీ మరొక చిత్రం గమనించవలసి ఉన్నది. ఒక కులంలో పెద్దవాడు తమ్ముళ్ళ
భార్యలతో శారీరక సంబంధం కలిగి ఉండటం ఆత్మబంధు ప్రణయము (Incest) గా
భావిస్తారు. తమ వంశంలోగానీ, కుటుంబంలో గానీ పుట్టిన స్త్రీతో సంభోగ సంబంధం
కలిగి ఉంటే ఎంతో తప్పిదంగా భావించి, కులంలోనుంచి బహిష్కరిస్తారు.
టర్కీ దేశంలో ఒకానొక కాలంలో బహు భర్తృత్వం తప్ప మరో వైవాహిక
విధానం లేదని మెసగటీ అనే చరిత్రకారుని వ్రాతలవల్ల తెలుస్తూ ఉన్నది. అయితే
భార్యకు ఎవరివల్ల సంతానం కలిగినా, ఆ సంతానం మీద హక్కు మాత్రం పెద్ద
అన్నది. పిల్లలందరికీ తండ్రి అతడు మాత్రమే. మిగిలిన వారు పినతండ్రులు. పిల్లలు
అతనిని ఒక్కడినే 'నాన్నా!' అని పిలుస్తారు. భార్య గర్భిణిగా ఉంటే
ప్రసవించేటంతవరకూ ప్రథముని దగ్గిరనే ఉంటుంది.
దక్షిణ భారతదేశంలో నాయర్ జాతిలో ముగ్గురు నలుగురు పురుషులు సమష్టిగా
ఒక స్త్రీని వివాహమాడుతారు. వారిలో ప్రతి ఒక్కరూ మరి ముగ్గురితోనో, నలుగురితోనో
కలిసి మరొక భార్యను వివాహం చేసుకుంటారు. అదేరీతిగా మూడవభార్యనూ, నాల్గవ
భార్యనూ, ఐదవ భార్యనూ - ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చును. ప్రతి స్త్రీకి
మొదట్లో ఒక పురోహితుడు మంచి ముహూర్తాన తాళికట్టి మొదట తాను వివాహం
చేసుకున్న తరువాత ఈ విధంగా జరుగుతుంది.
మెక్లినన్ అనే శాస్త్రకారుడు ఈ వివాహం బహుభర్తృత్వ విధానం క్రింద చేరదని అభిప్రాయపడినాడు. 'గిరాడ్-ట్యూలన్' అనే శాస్త్రజ్ఞుడు చెప్పినట్లు ఇది ఒక విధమైన సమితి వివాహము (Club - marriage) అని అనవచ్చును. ఇది గుంపు పెళ్ళిలోనే ఒకవిధమైనదని అతని అభిప్రాయము.
బహుభర్తృత్వవిధానంలో పురుషులందరూ బహుభార్యాత్వాన్ని - అంటే బహు గామిత్వాన్ని (Polygamy) పొందుతారు. స్త్రీలు బహుభర్తృత్వాన్ని అంటే బహుగామిత్వాన్ని (Polyandry) వహిస్తారు. బహుభర్తృత్వవిధానం ముఖ్యంగా మాతృస్వామిక (Matriarchical Family System) సంఘ నిబంధనల వల్ల కలిగి ఉంటుందని ఊహించటంలో విప్రతిపత్తి అణుమాత్రమూ లేదు.
ప్రపంచ వివాహ చరిత్రకారుడు వెస్టర్ మార్కు మహాశయుడు ఈ వైవాహిక
విధానాన్ని గురించి ఇలా వ్రాసినాడు :
‘బహుభర్తృత్వ బహుభార్యాత్వాలనే రెండు తెగలకు చెందిన వైవాహిక విధానాలనూ
రూపుమాపవలెనంటే, బహుభర్తృత్వాన్ని కోరే స్త్రీల దగ్గిర భర్తలను తీసుకోవచ్చి
బహుభార్యాత్వం కోరే పురుషుల దగ్గిర ఉన్న స్త్రీలకు వివాహం చేస్తే సరిపోతుందేమో
కానీ అది అసంభవము. ఆయా జాతుల స్త్రీ పురుషుల సంఘాలపై ఆధారపడి
ఉంటుంది. ఒక జాతిలో స్త్రీలు తక్కువగా ఉండి, పురుషులు ఎక్కువ ఉండటం వల్ల
ఈ వివాహం అమలులోకి వచ్చి అటువంటి పరిస్థితులలో ఇటువంటి వ్యవస్థను
సంఘం అంగీకరింపలేకపోయింది.'
ఈ వివాహ విధానానికి ఆర్థికావసరాలు కూడా మరో కారణం. దేశంలో
ఆస్తిపాస్తులు స్త్రీల పరమైనప్పుడు ఏ స్త్రీ దగ్గర ఆస్తి ఎక్కువగా ఉంటుందో ఆమెను,
ఆమె ధనాన్ని అనుభవించ వచ్చుననే కారణంతో ఎక్కువమంది పురుషులు ఏకకాలంలో
వివాహమాడటం మూలంగా కూడా, ఇటువంటి విధానం ఆచరణలోకి వచ్చి
ఉండవచ్చును.
బహుభర్తృత్వం ఒక విధమైన సంతాన నిరోధక మార్గము. ఒక స్త్రీకి అనేకమంది
భర్తలున్నప్పుడు ఒక భర్త వల్లనే విశేష సంతానం కలుగదు. ఇందు మూలంగా
ఆస్తిపాస్తుల విభజన కూడా 'సాముదాయిక జీవనం' చేయడానికి అవకాశమున్నది.
కొన్ని కొన్ని జాతుల్లో భార్యకు చెల్లించటానికి కావలసిన కన్యాశుల్కం (Bride
Price) సంపాదించుకునే అవకాశం లేకపోవటం వల్లనూ బహుభర్తృత్వం అవలంబించి
ఉండే అవకాశమున్నదని వెస్టర్ అభిప్రాయము.
అయితే - మనం బహుభర్తృత్వం ఉన్న జాతుల్లో పురుషులు ఎక్కువగా ఉంటారనీ
స్త్రీలు తక్కువని గానీ నిశ్చయించడానికి వీలుండదు. ఈ వివాహ విధానం స్త్రీ, పురుషుల
ఆర్థిక ప్రతిపత్తిని బట్టీ, సాంసారిక విధానాన్ని బట్టీ ఏర్పడినది. తరువాత సంఘ
ఆచారంగా పరిణమించినది.
కేవలం ఆర్థిక ప్రతిపత్తి మూలంగా ఈ బహుభర్తృత్వ విధానం ఏర్పడుతుందని చెప్పటానికి వీలు లేదు. ఈ విషయం బహుభార్యాత్వ విధానాన్ని పరిశీలిస్తే వ్యక్తమౌతుంది.
ఆస్ట్రేలియా అనాగరిక జాతుల్లోని 'బుష్ మన్'లలో ఎంతటి పేదవారికైనా నలుగురైదుగురు భార్యలుంటారు. ఆ జాతిలో కొద్దిపాటి సామంతుడికి పదిమందికి తక్కువ కాకుండా భార్యలుంటారు. 'చెనిక్' జాతి రాజుకు భార్యలని చెప్పుకున్నవారు ఎందరుండేవారో చెప్పలేకున్నారట! కొందరు ఆరువందలన్నారు, మరికొందరు వేయిమంది అనీ, కొందరు వీరిని అయిదువేల వరకూ పెంచినారు. ధర్మశాస్త్రం రాజయినవాడు 8888 మంది కంటె ఎక్కువ భార్యలను వివాహమాడకూడదని ఉన్నదట. ఉగాండా రాజుకు, ఆయన పేరు మొటిస్సా ఏడు వేలమంది భార్యలుండేవారట! పదహారువేలమంది గోపికలూ చరిత్రాత్మక వ్యక్తులైనట్లయితే మన కృష్ణభగవానుని మించినవాడు ఎవరూ ఇతః పూర్వం పుట్టినట్లు కనిపించటం లేదు. ఇకముందు పుట్టే అవకాశం కూడా లేదనవచ్చును.
ఈ రాజులు ఇంతమంది భార్యలనూ వివాహమాడినారా? అనే ప్రశ్న కలగక
మానదు. అయితే వీరిలో ఎక్కువభాగం ఉంపుడుకత్తెలై ఉంటారు. వారికి కూడా
భార్య అనే పేరు ఉండేది. ఒక చారిత్రికుని లెక్క ప్రకారము శ్రీకృష్ణరాయలకు
నాలుగువేల నూట ఒక్కమంది భార్యలున్నట్లు తెలుస్తున్నది. కానీ ఆయన చిన్నమదేవీ
జీవిత నాయకుడు; తిరుమలదేవీ, వరదాంబికలను అగ్నిసాక్షిగా ఆయన
వివాహమాడినాడు. మిగిలిన వారి కందరికీ ఆ నాడైనా సంఘంలో విశేష గౌరవం
ఉండేది కాదు. భర్త అని చెప్పుకోదగ్గ వ్యక్తిమీద శారీరకమైన హక్కు కూడా ఉండేది
కాదు.
పూర్వం చైనాలో రాజు న్యాయసమ్మతంగా ఒక భార్యకంటే ఎక్కువమందిని
వివాహం చేసుకోవటానికి వీలు వుండేది కాదు. ఉపపత్నిని మరొకదానిని
స్వీకరించటానికి ధర్మశాస్త్రమే అంగీకరించేది. ప్రథమ భార్యకు ఉంపుడుకత్తెమీద
విశేషమైన అధికారం ఉండేది.
ఈజిప్టు దేశంలో బహుపత్నీత్వాన్ని ధర్మశాస్త్రం అంగీకరించింది. కానీ ఆచారంలో
ఆ వైవాహిక విధానం కనిపించదు. అయినా అది రాజవంశాలలో తప్ప సామాన్యజాతి
వివాహ లక్షణంగా ఉండేది కాదు.
బాబిలోనియా దేశంలో హమ్మరీబాయి ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఏకపత్నీ
వివాహమే - అంగీకృత వివాహము. కానీ భార్యకు రుగ్మత ఏర్పడినప్పుడు మరొక
భార్యను వివాహం చేసుకోవచ్చును. లేదా ఉపపత్నిని స్వీకరించవచ్చును.
హిబ్రూ జాతిలో రెండవభార్య పనికిరాదు. అయితే ధర్మశాస్త్రంలో భార్యల మధ్య
భర్త ఎటువంటి విభేదాన్నీ పాటింపరాదని కనిపిస్తున్నది. అందువల్ల ఈ భార్యలెవరు
అనే శంక కలుగుతుంది. ఆ దేశంలో పురుషుడు సంతానం లేని అన్న భార్యను
గానీ, తమ్ముని భార్యను గానీ విధిగా వివాహమాడక తప్పదు. ఇతఃపూర్వము ఆ
వ్యక్తికి పెళ్ళి కావచ్చును లేదా కాకపోవచ్చును.
ఇస్రలైటు జాతిలో ఇంతమంది భార్యలు మాత్రమే ఉండవలెననే నియమం
లేదు. సోలమన్ రాజుకు ఏడువేలమంది భార్యలట! కానీ టాల్మడ్ అనే వారి గ్రంథం
నలుగురికంటే ఎక్కువమందిని వివాహమాడరాదని అనుశాసిస్తున్నది.
అరేబియా దేశంలో మహమ్మదు నలుగురు భార్యలకంటే ఎక్కువమందిని వివాహం
చేసుకోరాదని ఆజ్ఞాపించాడు. కానీ ఆయన అమీరులు ఎంతమందినైనా ఉపపత్నులను
ఉంచుకొని అనుభవించవచ్చునని అనుజ్ఞ ఇచ్చినాడు. వారికి తోడు ఎంతమంది
బానిస స్త్రీలనైనా అనుభవించవచ్చు నన్నాడు. ప్రవక్త ఎంతమందినైనా వివాహం
చేసుకోవచ్చునట! ఈ కారణంవల్లనే మధ్యయుగంలోనే జ్యూజాతిలో అంతరించిన
బహుపత్నీత్వ విధానము, మహ్మదీయ దేశాలలో ఉన్న జ్యూజాతులో నేడు కూడా
కనిపిస్తున్నది.
భారతదేశంలో మహమ్మదీయ రాజులు పరిపాలించిన కాలంలో అమీరులు
నలుగురు భార్యలను తప్పకుండా వివాహం చేసుకునేవారట! దానికి బైరంఖాన్ చేసిన
క్రింది అనుశాసనం గమనించదగ్గది.
'ఫర్మాయే కర్తే థే కి అమీర్ కేలియే చార్ బీబియాఁ చాహియే. ముసీబత్ ఔర్
బాతోం చీతోం కేలియే ఇరానీ, ఖానా సమాడే కేలియే ఖేర్ సానీ, సేజ్ కేలియే
హిందుస్థానీ, చయే తుర్కిణీ, ఉషైహార్ వక్త్ మార్తే దాంతే రహైకి ఔర్ బీబియాఁ దరత్
రహే
ఈ నలుగురు భార్యలలో సౌందర్యోపాసనకూ, సంభాషణకూ ఇరానీ స్త్రీ, వంటకు
ఖేర్సానీ, శయ్యకు హిందుస్థానీ, తుర్కీ భార్య ధర్మానికి, ఇంకా తన్ననూ కొట్టనూ
తిట్టనూ అనేకమంది స్త్రీలను పొందవలసిందని బైరంఖాను అభిప్రాయము.
హిందూదేశపు క్షత్రియులలోనూ, మరి కొన్ని కొండ జాతుల్లోనూ బహుపత్నీత్వం పూర్వంనుంచీ వస్తూ వున్న ఆచారం. పూర్వపు గ్రీసుదేశంలో ఏకపత్నీత్వమే చట్టసమ్మతమైన వివాహ విధానం. కానీ 'ప్రియామన్' రాజుకు అనేకమంది భార్యలున్నట్లు చరిత్రలు చెపుతున్నవి. రోమక న్యాయ శాస్త్రం కూడా ఏక పత్నీత్వాన్నే అంగీకరించింది. రెండవ పెళ్ళి చట్టసమ్మతం కాలేదు. అంతేకాకుండా చట్ట సమ్మతమైన “ఎంపికను” (Lawful Concubinage) అంగీకరించింది.
క్రైస్తవ మతము ఏకపతిపత్నీత్వాన్నే ఆదర్శవివాహ విధానంగా అంగీకరించింది.
కాని బహుపత్నీత్వాన్ని అంగీకరింపకపోలేదు. బిషప్పులు, డేకనులు బహుపత్నీత్వాన్ని
వహింపకూడదని శాసించింది.
పదునారవ శతాబ్దం మధ్యభాగంలో ఐరిష్ రాజు 'డయార్మైట్కు' ఇద్దరు భార్యలూ,
అనేకమంది ఉంపుడు కత్తెలతో పాటు ఉండేవాళ్ళు. లూథరన్ చర్చివారు ఇచ్చిన
అధికారంతో చార్లమెన్ చక్రవర్తి ఇద్దరు భార్యలనూ అనేకమంది ఉంపుడు కత్తెలనూ
స్వీకరించాడు.
అంతేకాదు, చక్రవర్తుల విషయంలోనే కాదు - కొందరు మతబోధకుల విషయంలో కూడా బహుభార్యాత్వం అమలులో ఉండినట్లు తెలుస్తున్నది. తరువాత కాలంలో హెస్సీ దేశానికి చెందిన ఫిలిప్పు, రష్యాదేశ చక్రవర్తి ఫ్రెడరిక్ విలియము లూథరన్ చర్చివారి అనుమతితో ఇద్దరు భార్యలను స్వీకరించారు. ప్రాత నిబంధన కొన్ని సందర్భాలలో బహుపత్నీత్వాన్ని అంగీకరించినట్లు తెలుస్తున్నది.
క్రీ.శ. 1680 ప్రాంతంలో అనేకమంది యుద్ధభూమిలో చనిపోయినారు. ఆ ముప్పది మూడు సంవత్సరాల యుద్ధానంతరము వెస్టఫేలియా సంధి జరిగింది. నూరెంబర్గు ప్రాంకిష్ ప్రతివ్యక్తీ ఇద్దరిని తప్పకుండా వివాహం చేసుకోవలెనని తీర్మానించుకున్నాడు. అప్పుడు కొన్ని క్రైస్తవ సంఘాలు బహుభార్యాత్వాన్ని ప్రచారం చేసినవి. క్రీ.శ. 1631 ప్రాంతంలో నిజమైన క్రైస్తవుడు కావాలంటే అతడు అనేకమంది భార్యలను వివాహం చేసుకోవలెననే ప్రబోధ నినాదాలు వినిపించినవి. ఎనిమిదవ హెన్రీ ఒకరి తరువాత ఒకరిని క్రమంగా ఎనిమిది మందిని వివాహమాడటం చరిత్రాత్మకమైన విషయము. సోలమన్కు ఎంత మంది భార్యలున్నారో చెప్పటం చాలా కష్టమని స్మిత్మైనర్ అనే చరిత్రకారుడు చెపుతున్నాడు.
అలీబాబా అంతఃపురంలో మూడువందల అరవై అయిదుమంది భార్యలు కాపురం చేసేవాళ్ళట! మొరాకో పూర్వరాజు ముల్లా ఇస్మాయెల్ కు 40 మంది భార్యలుండేవారట.అతడు చనిపోయేనాటికి 548 మంది కుమారులూ, 340 మంది కుమార్తెలూ ఉన్నట్లు వింతల చరిత్ర (History of odd things) వల్ల తెలుస్తున్నది.
ఈజిప్టు చక్రవర్తి రెండవ రామేసస్ కు మరణ సమయానికి 111 మంది మగపిల్లలూ, 51 మంది ఆడపిల్లలూ 'తండ్రీ' అని పిలిచేవాళ్ళు ఉండేవారు.క్రీ.శ. 1910వ సంవత్సరములో చనిపోయిన సయామ్ రాజు చేలారాముకు 3000 మంది భార్యలు, సంతానం 370 మంది - 134 మగవాళ్ళూ, 236 మంది ఆడవాళ్ళా
రాజుల మాటెందుకు? సామాన్యుల విషయంలోనూ అంతే. 'రేయిజ్ పలి' అనే హంగేరీ దేశ వైణికునికి 48 మంది కుమారులు.'టుటుచ్చి' బెల్జియమ్ బిషప్పుకు 61 మంది కుమాళ్ళు. రిరిలాల్ అనే రష్యాదేశ వర్తకునికి భార్యలు 72 మంది అని చరిత్ర వల్ల తెలుస్తున్నది.
బహుపత్నీత్వం అమలులోకి రావటానికి కారణము స్త్రీ పురుషుల జనసంఖ్య.యుద్ధాల కారణంగా అది తారుమారు పొందటం వల్ల ఈ వివాహ విధానం అమలులోకి వస్తూ ఉంటుంది. అంతే కాకుండా కొన్ని దేశాలలో స్త్రీ జనసంఖ్య విశేషంగా కూడా ఉంటుంది.
అందువల్ల మగవాళ్ళూ ఆడవాళ్ళూ జన సంఖ్యలో సరిసమానంగా ఉన్నంతమాత్రాన ఏకపత్నీత్వం అమలులో ఉంటుందని చెప్పలేము. జనసంఖ్య సరిసమానంగా ఉన్నంత మాత్రాన 'ఏకగామిత్వాన్ని' మాత్రమే చట్ట సమ్మతమైన వివాహ విధానంగా శాసించటానికి అవకాశం ఉండదు. అనాగరకజాతుల్లో స్త్రీలు విశేషంగా ఉండటం వల్ల బహుపత్నీత్వం అమలులో ఉంటుందని శాస్త్రకర్తల అభిప్రాయం.
ప్రపంచ వివాహ చరిత్రకారుడు వెస్టర్ మార్కు మహాశయుడు బహు భార్యాత్వానికి ఈ క్రింది కారణములను చూపినాడు. 1. జన సంఖ్య - పురుషులకంటె ఒక జాతిలో గాని దేశములోగాని అధికముగా ఉండటము, 2. స్త్రీ పురుష గృహజీవన విధానంలో శారీరక (Physical) ఉద్వేగ (Emotional)) వైజ్ఞానిక (Intellectual) ప్రతిపత్తులలో సామ్యం లేకపోవటము 3. స్త్రీలలో సహజలక్షణాలైన ఋతుధర్మము, గర్భధారణమూ కారణముగా పురుషుడు అనేకమందిని వివాహమాడటమూ. తన తృప్తికోసము అనేకమంది వ్యక్తులతో ఏకకాలంలోనే కాపురం చేయవలెననే కోరిక వల్ల పురుషునిలో కలిగే దక్షిణ నాయక లక్షణమూ, నవతాప్రియత్వమూ. 4. సంతానమూ, ఆస్తిపాస్తులు.
ప్రాచ్యదేశాలలో ‘ఆస్తి’ ముఖ్యంగా బహు భార్యాత్వానికి దారి తీస్తుంది. ఆత్మబీజ జనితునికే ఆస్తిని సంక్రమింపచేయవలెననే ఆకాంక్ష ప్రాచ్యజాతుల్లో విశేషము. జపాను దేశంలో ఉంపుడు కత్తెవల్లనైనా కులధర్మాన్ని నిలపటానికి సంతానాన్ని పొందవచ్చును. సంతానం కోసం ఎందరినైనా వివాహం చేసుకోవటం ప్రపంచంలో అనేక జాతుల్లో ఆచారంగా నేటికీ కనిపిస్తూ వున్నది.
బహుభార్యాత్వ వివాహానికి భౌతికమైన లాభం కూడా మరొక కారణం. అనేకమంది భార్యలను వివాహం చేసుకోవటం వల్ల పూర్వకాలంలో రాజుల ప్రాపకం అభివృద్ధి పొందింది. అంతేకాదు, ఒక గౌరవనీయమైన రాజవంశంలో జన్మించినవానికి తాను నాల్గవ భార్య ఐనా గౌరవ ప్రదంగానే భావించేది స్త్రీ. అతని ఆస్తిపాస్తులను అనుభవించటానికి అవకాశం కలుగుతుందనే దృష్టి కూడా ఇందులో ఇమిడి లేకపోలేదు.
లోకంలో ప్రకృతి సహజమైన వైవాహిక ధర్మము (Natural Instindct)బహుగామిత్వము (Polygamy). అనేకమంది భార్యలను వివాహం చేసుకోవటం వల్ల సగటున సంతానం పెరుగుతుందనీ, దానిమూలంగా భౌతిక లాభం చేకూరుతుందనీ అనుకోవటం కూడా పొరబాటు. బహుపత్నీత్వం విశేషంగా ఉన్నా, బహుభార్యాత్వము విశేషంగా ఉన్నా సంతానం అభివృద్ధి పొందదు.
పెద్ద పెద్ద సంసారాలుండటం గొప్పగా భావించే కొన్ని అనాగరిక జాతుల్లో నేటికీ బహుపత్నీత్వం విరివిగా అమలులో కనిపిస్తుంది. వారి విషయంలో ఆర్థికమైనఅభ్యంతరాలు లేవు. ఆర్థికంగా నిలవలేని స్థితిగల జూలూ దేశస్థుడయినా తప్పకుండా ముగ్గురినైనా వివాహ మాడతాడు. పూర్వ మధ్య ఆఫ్రికా జాతుల్లో మగవానిని భార్యలే కూర్చోబెట్టి పోషిస్తారు. అతనికి కూలీ ఖర్చు లేకుండా అన్ని పనులూ వాళ్ళే చేస్తారు.
పూర్వం రష్యా దేశంలో మరొక ఆచారం ఉండేదట. రష్యా దేశస్థుడు వ్యక్తుడుగాని కుమారుని కోసం ఒక కన్యకను తానే వివాహ మాడి అతడు పెద్దవాడైన తరువాత అతనికి ఒప్పచెప్పేవాడట. అంటే - ఆ రైతుకు ఆమె ఖర్చులేకుండా 'కూలి మనిషి’అన్నమాట. ఆమెవల్ల అతడు సంతానం కనవచ్చును. కుమారుడు పెద్దవాడయిన తరువాత ఆ బిడ్డలను కుమారుని సంతానంగానే వ్యవహరిస్తారు. అతిథి పూజనము కోసం అనేకమంది భార్యలను చేసుకోవటము జాతిలో కనిపిస్తుంది.
అనాది మానవ సంఘంలో స్త్రీ పురుషులకు సమానత్వ ముండేది. కాని మానవ ఆటవిక జీవితంలో సంసారానికి తగినంత ప్రాధాన్యం లేకపోవటం వల్ల స్త్రీలకు స్వాతంత్ర్యం గానీ, స్వామిత్వం గానీ అబ్బలేదు.
కాలక్రమేణా కొన్ని జాతుల్లో సాంఘిక ప్రాధాన్యం సంక్రమించి నప్పుడు ఆర్థిక ప్రాభవం గల స్త్రీలను ఆర్థిక ప్రాపకం కోసమూ, సంఘ ప్రాధాన్యతం కోసమూ అనేకమంది పురుషులు వివాహమాడే ఆచారం వచ్చింది. దానినే శాస్త్రం బహు భర్తృత్వం(Polyandry) అన్నది. ఈ నాటికీ ప్రపంచంలో అక్కడక్కడ అనాదిగా కొన్ని అనాగరక జాతుల్లో బహుభర్తృత్వ వివాహ విధానము అమలులో ఉన్నది.
పురుషుడికి ప్రాధాన్యం లభించే స్వామిత్వం కాలక్రమేణా స్త్రీలందరూ అతని బానిసలు కావడం ఆరంభించారు. ఆర్థిక సంపదను చూచో, సంపన్నతను చూచో,సాంఘిక ఔన్నత్యాన్ని చూచో ఒక పురుషునికే అనేకమంది భార్యలుకావటము గౌరవప్రదమని భావించేవారు. దానిని ఒకానొక వివాహ సంస్థగా పరిణమించిన తర్వాత శాస్త్రకర్తలు దానినే బహుభార్యాత్వ వివాహమన్నారు.
ప్రపంచ తాత్త్విక భావసంఘంలోని మహారచయిత బెర్నార్డ్ షా ఈ వివాహ విధానాలను గురించి ఇలా అభిప్రాయపడ్డాడు.
'బహుపత్నీత్వం మీదగాని బహుభార్యాత్వం మీద గానీ అసహ్యం కలిగేలా లోకంలో ఏకగామిత్వము (Monogamy) ఆచరణలోకి వచ్చిందని అనుకోవటం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం - స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్య దరిదాపు సరిసమానం కావటంతో, ఎక్కువమంది భర్తలున్న స్త్రీకంటే తక్కువమంది భర్తలున్న స్త్రీకే విశేష సంతానం కలుగుతుంది.
‘ప్రతి మగనాడూ ఇద్దరు భార్యల కంటే ఎక్కువ భార్యలుంటే కామశక్తిని గురించిన కొలమానాన్ని దూరంగా ఉంచినా, అతని రాబడి, మూడురెట్లు పెరగవలసి ఉంటుంది.ఆర్థికంగా ఆలోచిస్తే లోకంలో ప్రతి ముగ్గురికైనా ఇద్దరు భార్యలు ఉండే అవకాశం లేదు.
'స్త్రీలు బహు భర్తృత్వాన్ని ఎందుకు వద్దనుకుంటారు, ఇందుకు కారణం? ప్రతి స్త్రీకీ భర్త దొరికే అవకాశం లేకుండా భర్తలుగా పురుషులనందరినీ కొందరు స్త్రీలే ఉంచుకునే అవకాశం ఉండటం వల్ల. పురుషులు బహుభార్యాత్వాన్ని నిరసిస్తారు.ఇందుకు కారణం ప్రతి పురుషుడికీ భార్య లభించే అవకాశం లేకుండా ఉంటుంది.కాబట్టి. అందువల్ల సర్వసామాన్యులైన స్త్రీ పురుషులిద్దరూ ఏకగామిత్వాన్నే(Monogamy) కోరుకుంటారు. అందువల్ల బహుభార్యాత్వాన్ని నెత్తికెత్తబోతే సామాన్యమైన పురుషులు వ్యతిరేకిస్తారు. అదేవిధంగా బహుభర్తృత్వాన్నీ సామాన్య స్త్రీలు వ్యతిరేకిస్తారు.
ఉత్తమ శ్రేణికి చెందిన స్త్రీలు గానీ పురుషులు గానీ లేకపోవటం వల్లనే బహుభార్యాత్వం, బహుభర్తృత్వమూ లోకంలో ఆచరణలో నిలవక తప్పటం లేదు.లోకంలో ఏ పురుషుడూ కూడా తన శక్తిని మించినంతమంది భార్యలను పోషించలేడు. కాబట్టి చట్టసమ్మతంగా బహు భార్యాత్వాన్ని రద్దు చేయవలసిన అవసరం అగత్యమైంది. ఆ విధానం కొలదిగా ఏ మూలనో ఉన్నా విశేష ప్రమాదం లేదు.
(ఆంధ్రపత్రిక 1948, ఏప్రిల్28)