వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/వివాహము-స్త్రీ పురుషులు
వివాహము - స్త్రీ పురుషులు
న్యాయతః వివాహం లేకుండానే స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యం ప్రేమించుకుంటూ
కాపురం చెయ్యవచ్చును. సంఘానికి గానీ ప్రభుత్వానికి గానీ వారి జీవన విధానంతో
ఎటువంటి జోక్యమూ అవసరం లేదు.
స్త్రీ పురుషులిద్దరూ ఒక సంఘంలో నివసిస్తున్నారు, కాబట్టిన్నీ, ఒక ప్రభుత్వానికి లొంగి ఉన్నారు కాబట్టిన్నీ, సంఘానికీ వారికీ ప్రభుత్వానికీ కొంత సంబంధం ఉన్నది. అందువల్ల ప్రణయ విధానాల్లో స్త్రీ, పురుషులిద్దరూ వ్యక్తిగతమైన వారి స్వేచ్ఛను కొంతగా అరికట్టటము అవసరం వచ్చింది. ఈ సంఘ నియమాలు వైవాహిక విధానంలోనూ ప్రణయ విధానంలోనూ నాగరిక అనాగరక సంఘాలు రెండూ అవలంబిస్తున్నవి.
నియమాలంటూ లేని దేశంగాని, జాతిగాని లేదు. అన్నివేళలా అడవి
జంతువులను వేటాడి పొట్ట బోసుకునే ఆటవికుల్లోనూ ఈ నియమాలున్నవి.
పశుపాలనం వృత్తిగా పెట్టుకొని దేశ దిమ్మరులుగా జీవించే జాతుల్లో కూడ
ఈ నియమాలున్నవి. పట్టణాలలో నిరంతరము యంత్ర కర్మాగారాల్లో నివసించే
పారిశ్రామిక జీవులకు గూడా ఈ నియమాలున్నవి. మానవుడు ఎటువంటి అనాగరిక
స్థితిలోనూ నియమరహితమైన ప్రవృత్తి (Sexual Promiscuity) తో జీవించాడని
చెప్పటానికి అవకాశం లేదు. అట్లాకాకుండా ఏ కాలంలోనూ, ఏ జాతిలోనూ కామక్షుత్తు
(Sexual appetite) ఇష్టం వచ్చినట్లు తీర్చుకునే అవకాశము ఏ నాడూ మానవుడు
అవలంబించలేదని నిర్ధారణ చేసి చెప్పవచ్చును.
కామతృప్తి కోసం ప్రతిజాతీ ఏర్పరుచుకున్న మూలాధార మేమిటి? సంసారమనేది,
సంఘానికి పునాది. అందువల్ల ఈ నియమాలు సంసారాన్ని ఆధారం చేసుకుని,
ఏతద్రక్షణార్థంగా నానా విధానాలైన మార్పులను పొందుతూ ఉన్నవని చెప్పటంలో
అసంబద్ధత అణుమాత్రంగా ఉండటానికి అవకాశం లేదు.
కామానికి గానీ, కామశాస్త్రానికి (Sexual Science) గానీ సంబంధించిన
నియమాలు అన్నిజాతుల్లో ఒకరీతిగా ఉండవని చెప్పడానికి అవకాశం లేదు. కానీ
ప్రతి జాతి ఒక విషయాన్ని అంగీకరిస్తుంది. ఏ జాతిలోనూ స్వబంధు ప్రణయము
సంస్కృతి
(Incest) కనుపించదు. తండ్రికీ కుమార్తెలకూ, తల్లికీ కుమాళ్ళకూ, ఏకగర్భజనితులైన అన్నచెల్లెళ్ళకూ, అక్క తమ్ములకు కామ సంబంధం ఏ జాతీ అంగీకరించదు. ప్రాచీన కాలంలో ఈజిప్టు, పెరూ దేశాల రాజవంశాలలో ఇటువంటి ఆత్మబంధు సంబంధమున్నట్లు చరిత్రవల్ల గోచరిస్తున్నది. దేవాంశ సంభూతులు కావటం చేత సామాన్య ప్రజలకు వారితో వైవాహిక సంబంధం, ముఖ్యంగా కామసంబంధం ఉండటానికి అంగీకరించకపోవటం వల్ల ఇది ఏర్పడినది. అయితే ఆ దేశాలలోనూ ఆ ప్రాంతాలలో సామాన్య ప్రజలలో ఇటువంటి సంబంధం కనిపించదు.
ఆత్మబంధు ప్రణయ రహితత - అనేది ఒక నియమము (వైవాహిక నియమము)
అని తెలుస్తున్నది. దీనికి కారణమేమిటి? జాతికే ఆధారభూతమైన ఈ సంసారం
(Family) విచ్ఛిత్తి కాకుండా ఉండటమేనని మనము ఊహించ వచ్చును.
స్వీయబంధు ప్రణయం మూలంగా సంసారాలు నానారకాలైన మానసిక
ఆవేదనలు కలిగి కుటుంబానికి ప్రమాదం తీసుకువచ్చే స్థితి ఏర్పడడం జరుగుతుంది.
అందువల్ల కుటుంబేతరమైన వివాహవ్యవస్థ అమలులోకి వచ్చి ఉంటుందని
శాస్త్రకారులు ఊహిస్తూ ఉన్నారు.
జంతువుకు సంతానం కలిగితే వాటిని పోషించే భారం విశేషంగా తల్లిదండ్రుల
మీద ఉండదు. గుంపులో చేరి వాటి ఆహారాన్ని అనే తెచ్చుకుంటూ ఉంటవి. సంతాన
విషయంలో మానవజాతి అలా బాధ్యతారహితంగా ఉండే అవకాశం లేదు. మానవ
సంతానానికి స్వతంత్ర జీవనం చేసే శక్తి వచ్చి సాంఘికంగా స్వతంత్రతను పొందే
స్థితి ఏర్పడటానికి ఎంతోకాలం పడుతుంది. అటువంటి స్థితి రావటానికి తల్లి దండ్రులు
ఎంతో శ్రమించవలసి ఉంటుంది. వైవాహిక బంధం (Social Contract) అందువల్లనే
వారిరువురికీ అత్యవసరమైంది. 'సంతాన రక్షణమే' ఈ వైవాహిక బంధానికి ప్రధాన
కారణమంటే తప్పులేదు.
ఈ వైవాహికబంధం కేవలము కామోద్వేగము (Sexual Passion) మీద ఏర్పడ్డ
వారియెడకంటే 'సంతాన ప్రాప్తి- రక్షణ'ల మీద ఆసక్తి ఉన్నవారియెడ ఏర్పడేది
సుస్థిరంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడుతూ ఉన్నారు. అందుమూలంగానే
సంతానం కోసమని ఏర్పరుచుకున్న వైవాహిక స్త్రీ పురుష సంబంధాన్ని సంఘమూ,
మతమూ ఆమోదించటమూ జరుగుతున్నది. అందువల్ల 'వివాహం' అనే విధానము
స్త్రీ పురుషులు కామతృప్తి కోసం ఏర్పడ్డ సంస్థ కాదు; సత్సంతానప్రాప్తి, పోషణ,
కానీ కాలం మారిపోయింది. వివాహం కేవలము సంతానం కోసమని అంగీకరిస్తే నేటి ప్రపంచ రాజకీయ పరిణామ స్థితిలో వివాహమే అనవసర మనిపిస్తుంది. స్వేచ్ఛా ప్రణయాన్ని అనుసరించి కలిగిన సంతానాన్ని ప్రభుత్వానికి (State) ఒప్పచెప్పితే సరిపోదా అనే ప్రశ్న ఉదయిస్తుంది.
ఈ సిద్ధాంతాన్ని గురించి సమర్థించినవారు కూడా లేకపోలేదు. ప్రభుత్వం
ఆధునిక కాలంలో, అనాదికాలంలో తండ్రి వహించిన అనేక బాధ్యతలను వహిస్తూ
ఉన్నది. అదే రీతిగా తల్లి భారాన్ని కూడా నేటి ప్రభుత్వం వహించవలసి ఉంటుందని
వీరి అభిప్రాయము. అంటే సంతానరక్షణ విషయం వ్యక్తిపరము కాకుండా
ప్రభుత్వపరము కావలెనని వీరి భావము.
ఈ విధంగా వాదించే వారు ఒక ప్రధాన విషయాన్ని మరచిపోయారని అనవలసి
వస్తుంది. తల్లిదండ్రులు బిడ్డలకు ఆహారమూ, కట్టుగుడ్డ, వుండటానికి మంచి ఇల్లూ
ఉండటంతో తృప్తి పడలేరు. ఇవన్నీ ఇవ్వకలిగినవాళ్ళుంటారు. లేనివాళ్ళూ ఉంటారు.
కానీ అనురాగంతో చూచుకోని తల్లిదండ్రులు అరుదు. ప్రభుత్వం కంటే ఒకొక్కప్పుడు
విద్యావిహీనులైన తల్లిదండ్రులుండ వచ్చును. అటువంటి సందర్భంలో సంతానాన్ని
ప్రభుత్వపరం చెయ్యవలసిందని వారిని శాసనమూలంగా బలాత్కరించటము ఎంత
ఘోరంగా ఉంటుందో, వారికి అటువంటి ప్రభుత్వ విధానం మానసికంగా ఎంత
బాధ కలిగిస్తుందో ఆలోచించవలసి ఉంటుంది.
'వివాహ సంస్థ' అనాది కాలం నుంచీ లేదని గానీ, నాగరికత అభివృద్ధి
పొందుతూ ఉన్న కొద్దీ మానవుడు కృత్రిమ రూపంతో దీన్ని కల్పించుకున్నాడని గానీ
భావించటానికి అవకాశం లేదు. అంటే ఏ నాడో మానవసంఘం ఏర్పాటు చేసుకున్న
వివాహ సంస్థకు మార్పు రాదని అనుకోటానికీ వీలులేదు.
ఏ ధర్మంగానీ, ఏ సంస్థగానీ నిలువవలెనంటే కాలంతో పాటు మార్పు పొంది
తీరవలసిందే. మానవుడు వివాహం కోసం పుట్టలేదు. వివాహమే మానవుడి కోసం
పుట్టింది - అన్న విషయం కూడా మరచిపోకూడదు.
వెనుకటి జీవన విధానం మారిపోతున్నది. అన్ని దేశాలూ క్రమక్రమంగా
పారిశ్రామిక దేశాలుగా మార్పు పొందుతున్నవి. అందుమూలంగా జీవనము
భారమైపోతున్నది. యువతులూ, యువకులూ ఈ వివాహ భారాన్ని నెత్తిమీద
కెత్తుకోవటానికి జంకుతూ ఉన్నారు. యుక్త వయస్కులై స్వశక్తి మీద సంసారం
చేయగలిగిన శక్తి కలిగేటంత వరకూ వారు వివాహం మాట తలపెట్టటం లేదు.
నేటి ప్రపంచ సభ్యతా సంస్కృతులను గమనిస్తే ముందు వివాహ సంస్థ
నిలవటానికి అవకాశం లేదని అవగతమౌతున్నది. వెనుకటి స్వామిత్వం నశిస్తున్నది.
సామ్యత్వం వస్తున్నది. సంసార మన్న తరువాత స్వామిత్వం కష్టసాధ్యము. వివాహ
సంస్థను రక్షించదలచుకుంటే ఈ నాడు మన సంస్కృతిలో ప్రవేశిస్తున్న మార్పులను
గమనించి తదనుగుణంగా వివాహ ధర్మాన్ని మార్చుకోవలసి వస్తుంది. అలా
చేయకపోయినా, చేయలేకపోయినా సంఘంలో స్తిమితత ఉండదు. సంఘం పతన్మోఖమై
క్రమక్రమంగా బ్రద్దలైపోతుంది.
కేవలం ఆర్థిక సమస్య ఒక్కటే కాకుండా మరికొన్ని క్లిష్ట సమస్యలు కూడా
వివాహ సంస్థను నేడు ఎదుర్కొంటూ ఉన్నవి. పాశ్చాత్య దేశాలలో ముప్పది ఏండ్లలోపల
ఎవరూ వివాహాన్ని చేసుకునే స్థితిలో లేరు. దీనికి ముఖ్యమైన కారణాలలో సంతాన
నిరోధక ద్రవ్యాలను విరివిగా ఉపయోగించటం ప్రథమమని చెప్పవచ్చును. ప్రపంచానికి
ఈ నిరోధక (Contraceptives) ద్రవ్యాలు కొత్తవి కావు. అనాదినుంచీ ఉంటూ ఉన్నవి.
కానీ అవి ఈ నాడు ఉపయోగంలో ఉన్నట్లు పూర్వకాలంలో లేవు. జనసామాన్యానికి
ఆ నాడు అందుబాటులో కూడా లేవు.
వివాహమంటే సంతాన రక్షణ కోసమూ శ్రేయస్సుకోసమూ భార్యభర్తలిద్దరూ
ఏర్పరుచుకునే బంధమని వెనుక చెప్పి ఉన్నాము.
అటువంటి సందర్భంలో పిల్లలు లేనప్పుడూ అనవసరమైనప్పుడూ వివాహంతో
సంబంధం లేదు కదా? - అనే ప్రశ్న ఉదయిస్తుంది; దానిని అనుసరించి ఆ స్థితిలో
వివాహంతో పనిలేదు. దానిని పాటింపనవసరంలేదు; మానవులకు కామము
శారీరకనైజగుణము (Biological Necessity) అని వాదించవచ్చును. ఈ వాదం
స్థూలదృష్టికి సమంజమైనది అని కూడా అనిపించవచ్చును. తర్కశాస్త్రానుసారంగా
పరిశీలిస్తే ఇంతకంటే నీచాతినీచమైన వాదం మరొకటుండదని వ్యక్తమౌతుంది.
వివాహ ధర్మానికి వ్యతిరిక్తమైన స్త్రీ పురుష సంబంధాన్ని అంగీకరించిన కొద్దీ
వివాహ సంస్థకు దెబ్బ తగులుతుంది. తన్మూలంగా సంఘ శక్తి, స్తిమితత, పవిత్రత
రూపు మాసిపోతవి. వైవాహిక నీతినియమాలు ఎటువంటివైనా వాటికి భిన్నంగా
కనిపించే కామోపభోగాన్ని ప్రతిజాతీ, ప్రతిసంఘమూ ఆ నాటికాలంనుంచీ నిరసిస్తూ
వస్తున్నది.
నేటి నాగరికత సభ్యతలో స్త్రీ పురుష సంబంధాన్ని మరింత క్లిష్టం చేస్తూ ఉన్నది
స్త్రీల సమాన ప్రతిపత్తి, వారి సంపూర్ణ స్వేచ్ఛ. వెనుకటి కాలంలో స్త్రీ వివాహం
చేసుకుంటే గాని జీవనోపాధి దొరికేది కాదు. ఈ రోజుల్లో పురుషుడితోబాటు సమాన
ప్రతిపత్తి చేకూరుతున్నది. చేకూరుతుంది. పురుషులవలె స్త్రీలు కూడా స్వతంత్ర జీవనం
చెయ్యగలరు. స్వతంత్ర గృహనిర్మాణం చేసుకొనగలరు. భోగభాగ్యాలను
అనుభవించగలరు. జీవితానికి ఆనందానుభవాన్ని కలిగించేది బిడ్డలు ఒక్కరే కాదు.
విశాల విశ్వంలో పురుషుడికి ఎన్ని ఉన్నవో స్త్రీకీ అన్ని మార్గాలున్నవి.
నిత్యమూ ప్రపంచంలో ఏదో మూలనుంచి కామతంత్రాన్ని మూసి పెట్టకూడదు.
స్త్రీ పురుషులు యావన్మందీ ప్రత్యేక శాస్త్రంగా దీన్ని పఠించి తీరాలి; ఇందులో
సారస్యాలను గ్రహించి అనుభవించాలి అనే వివాదాలు వినిపిస్తూ ఉన్నవి.
అంతేకాకుండా పురాతన కాలంలో వలె ఎబ్బెట్టులేకుండా అసభ్యతగా పరిగణించ
కుండానే స్త్రీ పురుషులు ఒకచోట చేరి కామశాస్త్రరహస్యాలను బహిరంగంగా
చర్చించుకుంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో చలనచిత్రాల మూలంగా జాతిశాస్త్ర (Sexual
Science) విజ్ఞానం వెదజల్లటం జరుగుతున్నది. మున్ముందు ప్రాచ్యదేశాలు కూడా
దృశ్య విద్య (Visual Education) మూలంగా ఈ విధానాన్ని అనుసరిస్తవి. అందులో
అణు మాత్రము సందేహము అనవసరము.
కొంతకాలం బ్రహ్మచర్యాన్ని గడిపినా కామము విషయము ఏమి చెపుతావని
ప్రశ్నించేది నేడు యువకుడొక్కడే కాదు, యువతి కూడాను. ఏనో నిష్ప్రయోజకాలైన
వైరాగ్యోపన్యాసాలిచ్చి ఆమె మనస్సును త్రిప్పటానికి ప్రయత్నించడం వల్ల విశేషమైన
ప్రయోజనం ఉండబోదు, ఉండదు. ఇటువంటి సమస్యను సహజమైన ఆర్ద్రదృష్టితో
ఎదుర్కోటం వ్యక్తిపరంగానూ, సాంఘికంగానూ శ్రేయస్కరము.
సమాజం నుంచి మరికొందరు మరొక ప్రశ్న వేస్తున్నారు. తల్లికి పిల్లవాడిని
పెంచుకునే ఆర్థికశక్తి స్వతంత్రంగా ఏర్పడ్డప్పుడు పొందే హక్కు న్యాయశాస్త్ర మూలంగా
ఎందుకు ఉండకూడదు అని. అప్పుడు వారికి వివాహబంధం ఎందుకు? అది
కేవలమూ స్త్రీని పురుషునికి బానిసగా జేయటంతప్ప అన్యమౌతుందా? ప్రభుత్వంగానీ,
సంఘంగానీ భర్తను కోరే యువతికి భర్తను చూపలేకపోవటం వల్ల శక్తిమంతమైన
మాతృత్వం ఉన్న స్త్రీ వ్యభిచరించటం దోషమా? - అయితే ఈ తప్పు సంఘానిదా?
ప్రభుత్వానిదా? వ్యక్తిదా?
పురుషులకంటే స్త్రీలు విశేషంగా ఉన్న దేశంలోగానీ, జాతిలోగానీ, సంఘంలో
గానీ, స్త్రీలందరికీ భర్తలు దొరకటం చాలా కష్టం. వివాహ విషయంలో ఆధునిక
మానసికస్థితి లోతెరిగిన ఒక వేత్త కొన్ని అభిప్రాయాలిచ్చాడు. "వంధ్యాత్వం
చట్టసమ్మతము చేయవచ్చును. స్త్రీలోనూ మానసికాభివృద్ధికి మాతృత్వాన్ని కావాలని కొందరు కోరుకుంటారు. కొందరు భర్త అంటే మనస్సు అంగీకరించకపోయినా పిల్లలమీద అపేక్షవల్ల వివాహం చేసుకుంటారు. పిల్లలు కావాలని ప్రతి స్త్రీ కోరుతుంది. కానీ అందుకోసం పురుషుడికి దాస్యం చేయటానికి అంగీకరించదు” అని.
అయితే పిల్లలు ఎలా వస్తారు? పెంచుకోవచ్చును, లేదా మరో స్త్రీ పిల్లలను దొంగిలించవచ్చును. ఇతరుల పిల్లలను పెంచుకున్నా, దొంగిలించినా తృప్తి కలుగకపోవటము మానవ లోకానికి సహజగుణం. ఇందులో రక్తసంబంధం కనిపించదు. ప్రసవ వేదన లేదు. ఆత్మీయత లేదు. ఏమి సంతృప్తి? ఎక్కడి సంతృప్తి?
లోకంలో కొందరికి సహజంగా కామోద్రేకం ఎక్కువ. కొందరికి తక్కువ. కొందరిలో కామం మధ్యేమార్గాన్ని అనుసరిస్తుంది. ఎవరిలో కామం తక్కువగా ఉంటుందో వారిని జాతి శాస్త్రజ్ఞులు ఊనకాములు (Infra-sex) అని వ్యవహరిస్తారు. ఇటువంటివారికి కామోద్రేకం విశేషంగా ఉన్నవాళ్ళను చూస్తే ఈర్ష్య కలుగుతుంటుంది. అందువల్ల దాన్ని తగ్గించటానికి ఎంతో తంటాలు పడతారు. లోకంలో స్త్రీ పురుష సంబంధంలో వచ్చే నిబంధనలూ, తప్పులూ, పుక్కిటి పురాణాలూ అన్నీ ఈ ఊనకాముల మూలంగా కలిగేవేనని ఒక మతం వారి అభిప్రాయం. అంటే కామానికి సంబంధించిన విధినిషేధాలు పనికిరావని అభిప్రాయం కాదు. ఊనకాముల అశక్తత వల్లకూడా లోకానికి కొంత మేలు కలిగింది.
పూర్వకాలం మతప్రవక్తలు గుర్తించినట్లు కామశక్తిని గమనించిన వాళ్ళు అరుదు. విచ్ఛేదన (Divorce) మాట ఎత్తకుండానే ఎన్నో ఆటంకాలు కల్పించారు. జీవన విధానంలో అనేక నిష్టానియమాలను ఏర్పరచి నేడు విచ్చలవిడిగా తాండవించే కామానికి కళ్ళాలు బిగించినారు. కామశక్తిని సమస్తమూ భగవంతుని మీద కేంద్రీకరించే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృజించారు.
క్రైస్తవ మతం పావిత్య్రాన్ని ప్రథమంలో అంగీకరించిన కేవల నీతివాదులు ఏమంటున్నారో గమనిద్దాము. వివాహ విధానాన్ని సంపూర్ణంగా మార్పు చేయటం కంటే ఏ కొద్దిమంది వ్యక్తులో మిగిలిన సంఘం కోసం బలి కావడం మంచిదని వారు అభిప్రాయ పడుతున్నారు. సంఘానికి శ్రేయస్సు అందువల్ల లభించేటట్లయితే కొందరిని త్యాగం చెయ్యమని కోరటంలో తప్పుండదు.
అయితే అప్పుడు మరో ప్రశ్న బయలుదేరుతుంది. జీవిత పర్యంతమూ బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏమన్నా ప్రమాదం సంభవిస్తుందా? అని. ఇటువంటి ప్రశ్న ఒక శతాబ్దానికి పూర్వం కలిగినట్లయితే దానికి 'ఏ ప్రమాదమూ లేదని వెంటనే సమాధానం వచ్చి ఉండేది.
ఇది కేవలమూ శాస్త్రీయ యుగము. ప్రాచీన యుగంలో మతవక్తలు సంఘంలో
ఉచ్చస్థితిని పొంది ఉన్నారన్న సంగతి లోక ప్రసిద్ధము. నేడు ఆ ఆ స్థితిని - - ప్రజాయుగంలో
- వైద్యులు పొందినారు. యథాతథంగా బ్రహ్మచర్యం వల్ల ఎటువంటి ప్రమాదమూ
లేదు. కానీ కొందరికి ఉపకరిస్తుంది. కొందరికి ఉపకరించదు. - అని వైద్య శాస్త్రజ్ఞులు
చెపుతున్నారు. కామశక్తి విశేషంగా లేనివాళ్ళు బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తే ప్రమాదం
లేదు కాని, వ్యతిరేకులు స్త్రీ సంభోగాన్ని అరికట్టితే కామోన్మాదులు (Sexual Neurotics)
అయినా అవుతారు లేదా ముష్టిమైథునానికి అలవాటు పడతారు ఇది వైద్యుల
అభిప్రాయము. అందుకే బ్రహ్మచర్యం అందరికీ మంచిదని గానీ, చెడ్డదని గానీ
నిర్ణయించడానికి అవకాశం లేదన్నమాట.
అంతేకాకుండా, స్త్రీ సంబంధం లేనంత మాత్రాన ఒక వ్యక్తి కామ రహితుడు
కాదని బ్రహ్మచారి అనిగానీ అనటానికి వీలు లేదని జాతి శాస్త్రజ్ఞులంటున్నారు. ప్రాచ్య
గ్రంథాలు కూడా అదేవిధంగా పలుకుతున్నాయి. బ్రహ్మచర్యావలంబకులకు
కామసంబంధమైన భావనలూ, కాముక స్వప్నాలూ రాకూడదు. నిజమైన బ్రహ్మచర్యము
కేవలము శారీరక భోగంతో ఆగిపోదు. అంటే బ్రహ్మచారి మనస్సులో ఏ విధమైన
కామమూ ఉండకూడదు.
హేవ్ లక్ ఎల్లిస్ మహాశయుడు బ్రహ్మచర్యాన్ని గురించి వ్రాస్తూ ఇలా అన్నాడు.
“సామాన్యంగా 'చేస్టిటీ' (బ్రహ్మచర్యం) అనే శబ్దం శారీరక సంభోగాన్ని గురించి మాత్రమే
లోకంలో వాడుకలో ఉన్నది. కానీ ఆ శబ్దం అంతమాత్రంతో ఆగిపోదు. అంతకంటే
ఆనంతమైన అర్థాన్ని ప్రతిపాదిస్తుంది” అని. అందువల్ల మత, ధర్మ, వైజ్ఞానిక వివక్ష
లేకుండా బ్రహ్మచర్యం ఒక గుణంగానే పరిగణిత మౌతూ ఉన్నది. పూర్వకాలపు
మతధర్మాల మీద విప్లవం జరిపి స్వేచ్ఛను పొందినానని భ్రమపడే నేటి సభ్యప్రపంచం
బ్రహ్మచర్యం మీద దాడి చేస్తూ ఉన్నది. అందుచేత ఒక వంక నుంచీ బ్రహ్మచర్య
మేమిటి? మానవులకు కామేచ్ఛ సహజం, దాన్ని తీర్చుకోవలసిందే ననీ, వివాహాది
నియమాలను త్రోసిరాజనవలసిందేననీ వినిపిస్తున్నది. ఏ దేశంనుంచైతే ఈ నినాదాలు
వినిపిస్తున్నవో పూర్వం ఆ దేశంలోనే కామోపభోగానికి కొన్ని నియమాలున్నట్లు
తెలుస్తున్నది. అయితే - కామేచ్ఛను తీర్చుకునే ఇతర అవకాశాలూ కనిపిస్తున్నవి.
కానీ విప్లవం చేసి సాంఘిక ఆర్థిక రాజకీయ స్థితుల్లో మార్పునూ, స్వేచ్ఛనూ పొందిన
ఆ దేశం నేడు కామస్వేచ్ఛ (Sex-licence) కోరుతున్నది.
సామాన్య స్త్రీ పురుషులలో మిగిలిన అన్నిటితో పాటే కామమూ సామాన్యంగా
ఉంటుంది. దానివల్ల ఎటువంటి ప్రమాదమూ లేదు. వైజ్ఞానిక, మానసిక వికాసాల
విషయంలో కలిగే తృష్ణ వలెనే అదీ పనిచేస్తుంది. అత్యద్భుతాన్ని తెలుసుకోవలెననే
ఆసక్తి ఎటువంటిదో కామమూ అటువంటిదే.
నీతిశాస్త్రజ్ఞుడు సంఘం అంగీకరించిన మార్గాలలోనే కామతృప్తిని పొందటమే
స్త్రీకి గానీ, పురుషునికి గానీ శ్రేయస్కరమని అభిప్రాయమిస్తాడు. అటువంటి మార్గాన్ని
అనుసరించలేని వ్యక్తి దానిని చంపుకోవటం గానీ, లొంగదీసుకోవటం గానీ
మంచిదంటాడు. అయితే అటువంటి విధానాన్ని అనుసరించటము ఎంత వరకు
సాధ్యము? అనేది ప్రశ్న.
మనస్సును మార్చుకున్నా - లేక స్నాయువులకు నిస్సత్తువ కల్పించుకున్నా
కామము నశించదు. కామాన్ని చంపుకునేందుకు కొందరు కొన్ని క్రీడలు కనిపెట్టారు.
దానివల్ల కూడా విశేష ప్రయోజనం కనిపించలేదు. పరిపూర్ణమైన అలసట
(Exhaustion) కలిగేదాకా క్షుద్బాధగాని, కామక్షుత్తుగానీ నిర్మూలితం కాదు. మత
విషయకమైన మనస్తత్త్వం కొంతగా ఉపకరించవచ్చునేమో గాని, అది లేనివాళ్ళకు
కామాన్ని లొంగదీసుకోవటమనేదే లేదు. అటువంటివారు, సంఘం వారి
ఆనందానుభవాన్ని అరికట్టితే, స్వీయ - కాములు (auto-erotic) గా పరిణమిస్తారు.
దానివల్ల లోకానికీ, సంఘానికి మరింత తీరని ప్రమాదం సంభవిస్తుంది.
ఉదాత్తమైన ఒక ఆదర్శం ఉంటే కామం లొంగక పోదు. ఆదర్శవిహీనంగా
కామాన్ని లొంగదీసుకోటానికి యత్నిస్తే అందువల్ల ప్రయోజనం కంటే ప్రమాదమే
విశేషము.
(ఆంధ్రపత్రిక-28-1-48, వారపత్రిక)