లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/దోష విభాగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

(7) దోష విభాగము

1) అక్షర దోషములు

2) పద దోషములు

3) వాక్య దోషములు

దోష పరిచ్ఛేదము


సామాన్య దోషములు

1. య - యి - యె - యేలును - పు - పూ- నొ - నో, లును ణ-‌ళ లును ఆచ్ఛిక పదముల మొదట నుండవు.

తప్పు - ఒప్పు
యతడు - అతడు
యేమి - ఏమి

యితడు - ఇతడు
వొకటి - ఒకటి
వున్నవి - ఉన్నవి
వోడ - ఓడ
వూరు - ఊరు
ళక్క - లక్క
యెవడు - ఎవడు
ణళుసు - నలుసు

2) వట్రుసుడికి బదులు క్రావడిని - క్రావడికి బదులు వట్రుసుడిని వ్రాయరాదు

తప్పు - ఒప్పు
కృరము - క్రూరము
వ్రుతము - వృతము
క్రుష్ణుడు - కృష్ణుడు
ద్రుఢము-దృఢము
దృతము -ద్రుతము
వ్రుత్తాంతము - వృత్తాంతము
వ్రుత్తము - వృత్తము
అద్రుష్టము - అదృష్టము
క్రుప - కృప
ప్రభ్రుతులు - ప్రభృతులు
మ్రుగము - మృగము
స్రుష్టి - సృష్టి
త్రుటి - తృటి
ద్రుష్టి - దృష్టి
విక్రుతి - వికృతి
క్రుషి - కృషి
మ్రుత్యువు - మృత్యువు
త్రుతీయము - తృతీయము
శ్రుంగారము - శృంగారము
న్రుసింహుడు - నృసింహుడు
క్రుతి-కృతి
శతృవు -శత్రువు
మితృ‍డు - మిత్రు‍డు
శ్రుంగము - శృంగము
ప్రుధివి -పృధివి
జ్రుంభణము - జృంభణము
ధృవము - ధ్రువము
దురద్రుష్టము - దురదృష్టము
మ్రుదులము -మృదులము
న్రుపాలుడు - నృపాలుడు
వ్రుద్ధి - వృద్ధి
అపహ్రతము - అపహృతము

3) చై - జై వర్ణము లాదియందుగల, ఆచ్చికశబ్దము లుండవు.

తప్పు - ఒప్పు
చయిత్రము - చైత్రము
జయిత్రము - జైత్రము
చైదము - చెయ్దిము
చైవులు - చెయువులు

4) శ - ష - స లు తారుమారు చేసి వ్రాయరాదు.

తప్పు - ఒప్పు
సిరస్సు - శిరసు
కసాయము - కషాయము
శీత - సీత
శెలవు - సెలవు
శైన్యము - సైన్యము
ప్రకాసించు - ప్రకాశించు
ఓశి - ఓసి
అభ్యశించు - అభ్యసించు
శీతారామయ్య - సీతారామయ్య
విసాధము - విషాదము
సిష్యులు - శిష్యులు
నివశించు - నివసించు
సీతలము - శీతలము
వ్రాశినాడు - వ్రాసినాడు
కస్టము - కష్టము
ముస్టి - ముష్టి
నస్టము - నష్టము
అస్టావధానము - అష్టావధానము

5) సాధారణముగా 'స' కారము క్రింద నుండునది 'థ' కారమై యుండును.

తప్పు - ఒప్పు
స్దానము - స్థానము
స్దిరము - స్థిరము
వ్యవస్ధ - వ్యవస్థ
ఆస్దానము - ఆస్థానము
సంస్ధ - సంస్థ
స్ధూలము - స్థూలము

6) శబ్దాది యందు ధకారమే యుండును.

తప్పు - ఒప్పు
థనము - ధనము
థృతి - ధృతి
థవళము - ధవళము
థనువు - ధనువు
థన్యుడు - ధన్యుడు
థమ్మిల్లము - ధమ్మిల్లము
థట్టివి - ధట్టివి
థూపము - ధూపము
థాన్యము - ధాన్యము
థార - ధార
థీరుడు - ధీరుడు
థారాళము - ధారాళము
థీమంతుడు - ధీమంతుడు
థనంజయుడు - ధనంజయుడు
థరణి - ధరణి
థర - ధర

7) సాధారణముగా 'ద'కారము క్రింద, 'ధ'కారమే యుండును.

తప్పు - ఒప్పు
బద్దము - బద్ధము
యుద్దము - యుద్ధము
సన్నద్దము - సన్నద్ధము
రుద్దము - రుద్ధము
సిద్దము - సిద్ధము
సిద్దాంతము - సిద్ధాంతము

8) సాధారణముగా 'త' కారము క్రింద 'ద', కారమే యుండును.

తప్పు - ఒప్పు
అశ్వత్థామ - అశ్వద్దామ
ఉత్దితము - ఉత్ధితము
ఉత్దానము - ఉత్ధానము
ఉత్దము - ఉత్ధము

9) థ - ధ లకు భేదము గుర్తించవలెను.

'థ' గల పదములు

కథ - పథము
ప్రథమము - రథము
అర్థము - అర్థి
చతుర్థము - అర్థకము
తిథి - సార్థకము

'ధ'; గల; పదములు

అంధుడు - అధముడు
బధిరుడు - అర్ధము (సగము)
సుధ - బుధుడు

10) ఒత్తులు తార్మారు చేయరాదు.

తప్పు - ఒప్పు
భేధము - భేదము
భంధువు - బంధువు
భాద - బాధ
సంబందము - సంబంధము
బోదించెను - బోధించెను
భొద - బోధ

11) ఖ _ ఘ లను తారుమారు చేయరాదు.

తప్పు - ఒప్పు
ఘరము - ఖరము
నఘరము - నఖరము
మేఖము - మేఘము
సంఖము - సంఘము
సుఘము - సుఖము
లేఘ - లేఖ
ఖనము - ఘనము
శంఘము - శంఖము

12) వచ్చు - వెళ్ళు మొదలగు హలాదులను అజాదులుగా వ్రాయరాదు.

తప్పు - ఒప్పు
వాడొచ్చెను - వాడువచ్చెను
వీడెళ్లెను - వీడువెళ్లెను
అతడొంపెను - అతడుపంపెను
అతడినెను - అతడువినెను

13) ద్రుతప్రకృతికముపై యకారాగమము చేయరాదు.

తప్పు - ఒప్పు
వానిని యెందువలన - వానినెందువలన
అంతయొకనాడు - అంతనొకనాడు
తరువాతయనెను - తరువాతననెను
వనమునయుండెను - వనముననుండెను

14) ఉకారముపై యకారము కూడదు.

తప్పు - ఒప్పు
వాడు యుండెను - వాడుండెను
రాముడుయనెను - రాముడనెను

15) కళలపై నకారమురాదు :

తప్పు - ఒప్పు
చూచినడిగితి - చూచియడిగితి
చదివి నుంటివి - చదివి యుంటివి
చదువక నుండెను - చదువక యుండెను

15A) ఇంకన్ - చాల - వీనికి దీర్ఘమిచ్చి వ్రాయరాదు.

ఇంకా నిన్ను కూడా చాలా తిట్టెను (తప్పు)
ఇంక నిన్ను కూడ చాల తిట్టెను (ఒప్పు)

16) సముచ్ఛయము ద్విత్వముగా వ్రాయరాదు

నేనున్నూ - రాముడున్నూ - చూచితిమి (తప్పు)
నేనును, రాముడును చూచితిమి (ఒప్పు)

17) దుష్టహల్సంయోగము కూడదు.

తప్పు - ఒప్పు
తత్చమము - తత్సమము
ఉప్పాతాలు - ఉత్పాతాలు
ఉచ్చాహము - ఉత్సాహము

18) ప్రత్యయములు ఇష్టమువచ్చినట్లు చేర్చరాదు.

తప్పు - ఒప్పు
వాడికి - వానికి
వీడికి - వీనికి
రాముడికి - రామునికి
ఎవడికి - ఎవనికి
వాటికి - వానికి
రాముణ్ణి - రాముని
ఎవణ్ణి - ఎవనిని
ఇతణ్ణి -ఇతనిని
వాడిని - వానిని
రాముడితో - రామునితో
ఎవడియొక్క -ఎవనియొక్క
వాణ్ణి - వానిని
వీటికి - వీనికి

19) ప్రధమా ప్రత్యయము మార్చరాదు.

తప్పు - ఒప్పు
అతను - అతడు
ఇతను - ఇతడు
ఈతను - ఈతడు
వనం - వనము
ధనం - ధనము
పుస్తకం - పుస్తకము

20) క్రియలను ఇష్టము వచ్చినట్లు వ్రాయరాదు.

తప్పు - ఒప్పు
అంటాడు - అనును
వస్తాను - వచ్చెదను
చెప్పుతుంది - చెప్పుచున్నది
ఎగురుతవి - ఎగురును
వెళ్తాడు - వెళ్లగలడు
వ్రాస్తున్నాడు - వ్రాయుచున్నాడు.

21) ఔప విభక్తికములను సామాన్య శబ్దములుగా, వాడరాదు. ఇ - తి - టి చేర్చక వాడరాదు.

తప్పు - ఒప్పు
నేయితోకల్పుము - నేతితోకలుపుము
ఇల్లునుచూడుము - ఇంటిని చూడుము
కాలుతోతనెను - కాలితో తన్నెను

22) లింగవచన విరోథము కూడదు

లింగవిరోధము -
గోపాలుడింటికి వచ్చు చున్నది (తప్పు)
గోపాలుడింటికి వచ్చు చున్నాడు (ఒప్పు)

ఆవు పాలిచ్చును - ఆమెకు మేత వేయుము (తప్పు)
దానికి మేత వేయుము (ఒప్పు)

చెట్టు కాయు చున్నది. వానికి నీరు పోయుము (తప్పు)
దానికి నీరు పోయుము (ఒప్పు)

వచన విరోధము : -

రాముడు వచ్చుచున్నారు - రాముడు వచ్చు చున్నాడు
జనులు వచ్చెను - జనులు వచ్చిరి.

23) విశేషణ విశేషలింగ విరోధము కూడదు

తప్పు - ఒప్పు
దుష్ట యగుసుయోధనుడు - దుష్టుడగు సుయోధనుడు
మనోహరమగు బాలుడు - మనోహరుడగు బాలుడు
ప్రియమగు పుత్రుడు - ప్రియుడగు పుత్రుడు

24) ప్రార్ధనార్ధక - మువర్ణము అచ్చు పై లోపింపదు.

ఒప్పు - తప్పు
చూడు మనియె - చూడనియె
నడువుమనుచు - నడువనుచు
కొట్టుమిపుడు - కొట్టిపుడు

25) ధాతువునకు - కామపరమైన యు కారమునకు సి ఆదేశముగ వచ్చును.

తప్పు - ఒప్పు
చేయుకొను - చేసికొను
వ్రాయుకొను - వ్రాసికొను
మోయుకొను - మోసికొను

26) పురుషదోషములు కూడవు.

తాము గెలిచెనని తెలిసి కొనెను (తప్పు)
తాము గెలిచితిమని తెలిసికొనిరి (ఒప్పు)

మీరు ఎపుడు వచ్చిరి? (తప్పు)
మీరు ఎప్పుడు వచ్చితిరి (ఒప్పు)

27) పునరుక్తి దోషము :

తప్పు - ఒప్పు
హిమాలయ పర్వతము - హిమాచలము
అగ్గినిప్పు - అగ్గి (లేక) నిప్పు

28) ప్రార్ధనార్ధక క్రియలు వ్యతిరేకార్ధమిచ్చునట్లు వాడరాదు.

తప్పు -ఒప్పు
చేయమనియె - చేయుమనియె
వెళ్లమనియె - వెళ్లుమనియె
ఒసగమనియె - ఒసగుమనియె
ఆడమనియె - ఆడుమనియె

29)ఐకారమును, తావత్తును తార్మారు చేయరాదు.

పెత్తెనము - పెత్తనము
క్తెక - కైక

30) రెండు రేఫములుండు చోట శకట రేఫమే వాడవలెను.

గుర్రము - గుఱ్ఱము.
గొర్రె - గొఱ్ఱె
బర్రె - బఱ్ఱె
కర్ర -కఱ్ఱ

31)శకటరేఫ ఇంకొక హల్లుతో కూడియుండదు.

తప్పు - ఒప్పు
గుఱ్తు - గుర్తు
మాఱ్పు - మార్పు
కూఱ్పు - కూర్పు


ప్రశ్నలు

ఈ క్రింది వాని దోషములను సరిదిద్దుము.

(1) వున్నవి (2) ద్రుఢము (3) ప్రుధివి (4) చయిత్రము (5) సిరస్సు (6) థనము (7) భేధము (8) సుఘము (9) వాడొచ్చెను (10)చూచినడిగితి (11) ఉచ్ఛాహము (12) వాటికి (13) ఈతను (14) ఇల్లును చూడుము (15)క్తెక (16) బర్రె (17)గుఱ్తు (18) హిమాలయ పర్వతము. (19) ఆ‍‍డమనియె(20) వెళ్తాడు.