లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/అలంకార విభాగము
అలంకార విభాగము
శబ్దాలంకారము
1. వృత్యను ప్రాసా లంకారము
2. ఛేకానుప్రాసము
3. లాటానుప్రాసము
4. యమకము
5, ముక్త పదగ్రస్తము
6. అంత్యప్రాసము
అర్ధాలంకారము
(1) ఉపమాలంకారము
(2) రూపకాలంకారము
(3) అనన్వయాలంకారము
(4) ఉపమేయోపమ
(5) అతిశయోక్తి
(6) దృష్టాంతరము
(7) స్వభావోక్తి
(8) అర్దాంతరన్యాసాలంకారము
(9) శ్లేషాలంకారము
(10) ఉత్ప్రేక్షాలంకారము
(11) క్రమాలంకారము
(12) కారణమాలాలంకారము
(13) భ్రాంతి మదాలంకారము
(14) పరిణామాలంకారము
(15) ఉల్లేఖాలంకారము
(16) దీపకాలంకారము
(17) వ్యతిరేకాలంకారము
(18) నిదర్శనాలంకారము
(19) తుల్యయోగితాలంకారము
(20) వ్యాజస్తుతి
(21) అప్రస్తుతప్రశంస
(22) కావ్యలింగము
(23) వికస్వరాలంకారము
(24) సారాలంకారము
(25) సమాసోక్తి
అలంకార పరిచ్ఛేదము
హారములు మొదలగునవి, మానవునకు సౌందర్యమును కల్గించును. అట్లే గద్య -పద్యాత్మకమైన కావ్యములకు ఈ అలంకారములు సొగసు కలిగించి, ఆహ్లాదమును గూర్చును.
అలంకారములు రెండు విధములు. అవి 1) శబ్దాలంకారములు 2) అర్ధాలంకారములు.
శబ్దమాత్ర ప్రధానమైనవి శబ్దాలంకారములు. అర్ధవిశేషమును బట్టి వచ్చునవి, అర్ధాలంకారములు.
1. వృత్యను ప్రాసా లంకారము:
ఒక హల్లు, అనేక పర్యాయములు, వచ్చునట్లు రచించిన, అది వృత్యను ప్రాసా లంకారము.
1) పుండరీక, షండ మండితంబు.
2) వెడవెడ, బిడిముడి, తడబడ, నడుగిడు.
3) విష్ణు, రోచిష్ణు, కృష్ణు, సహిష్ణు,కృష్ణు
మొదటి ఉదాహరణములో, బిందు పూర్వక డకారము, రెండవ దానిలో డకారము, మూడవ దానిలో 'ష్ణు'వర్ణము పలుమారులు ఆవృత్తములైనవి.
2. ఛేకానుప్రాసము:
రెండేసి హల్లులు, అర్ధభేదము కలిగి వ్యవధానము లేకుండ, ప్రయోగించబడినచో, ఛేకానుప్రాసము అందురు. 1) కందర్ప దర్పహరులగు, సుందర దరహాసరుచులు,
2) సుధాహరున్, హరున్.
రసాను గుణమగు ప్రకృష్టవర్ణ విన్యాసము అనుప్రాసమున నొప్పును. పలుకు కమ్మదనము నెరిగినవారు ఛేకులు. అట్టివారి కిష్టమైనది, కనుక నిది ఛేకాను ప్రాసము.
ఇందు దర్పదర్ప - దరదర అను వ్యంజనముల జంట అవ్యవధానముగా, ఆవృత్తమైనది.
3. లాటానుప్రాసము:
తాత్పర్యవిశేషము తోచుచు, శబ్దార్ధములు పునరుక్తములైనచో, నది లాటాను ప్రాసము. నేటి గుజరాతులోని, మధ్యదక్షిణ ప్రాంతములు, పూర్వము లాటదేశమని, పిలువబడుచుండెను. ఆ దేశీయులకు, ఈ అలంకారము ఇష్టము. అందువల్ల ఈ అలంకారమునకు, ఈ పేరు కలిగిన దని కొందరు పండితుల అభిప్రాయము.
ఉదా : కమలాక్షు నర్చించు, కరములు, కరములు
శ్రీనాధు, వర్ణించు, జిహ్వ జిహ్వ
రెండవ కరములు - జిహ్వ శ్రేష్ఠత్వమును దెలుపుచున్నవి.
ఆతని గుణములు గుణములు
ఆతని యా కీర్తి కీర్తి, అమలంబగు, నా చాతురి చాతురి, యందురు.
ఖ్యాతయశుండైన, రుద్రుగాంచు కవీశుల్.
రెండవసారి ప్రయోగింపబడిన గుణములు, కీర్తి - చాతురి, యుత్కృష్ట సూచకములు.
4. యమకము :
అర్ధ భేదముగల, అక్షరముల సముదాయము (అచ్చులు - హల్లులు కూడ) మరల మరల ప్రయోగించబడిన యెడల, యమకమనబడును.
(I) ఆమనికిన్, మనికియైన, యారామమునన్.
(II) లేమా ! దనుజుల గెలువగ
లేమా ! నీవేలకడిగి లేచితి, విటురా
లేమాను, మానలే, నౌ
లేమా ! విల్లందు కొమ్ము లీలంలన్.
(I) ఇచట పురము - మనికి అను అక్షరములు సమూహము, అర్ధభేదముతో మరల వాడబడుట చేత నిది యమకాలంకారము.
(II) ఇందు లేమా, అను అక్షరముల సమూహము, అర్ధభేదముతో, మరల మరల, ప్రయోగించుట చేత యమకాలంకారము.
ఛేకాను ప్రాసమునకు - యమకమునకు, భేదమేమన, యమకమున అక్షరముల సమూహము మరల మరల వచ్చుటలో వ్యవధానముండ వచ్చును. ఛేకాను ప్రాసమున నట్టి వ్యవధానము పనికిరాదు.
5, ముక్త పదగ్రస్తము :
ఉదా : సుదతీ సూతన మదనా !
మదనాన, తురంగపూర్ణ మణిమయ సదనా !
సదనామయ, గజరదనా,
రదనాగేంద్ర నిభ కీర్తి, రస నరసింహా !
ఇందు - మదనా - సదనా - రదనా అను పదభాగములొక పదమున, వదలబడి, తరువాత పదమున, అవ్యవధానముగా గ్రహించబడినవి.
6. అంత్యప్రాసము :
పదాంతమున ప్రాసమున్న అంత్యప్రాసాలంకారము.
శ్రీరఘురామ ! చారుతులసీ దళధామ ! శమక్షమాది శృం
గారగుణాభిరామ ! త్రిజగన్నుత శౌర్యరమా లలామ ! దు
ర్వారక బంధరాక్షస విరామ ! జగజ్జన కల్మషార్ణవో
త్తారక నామ ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ !
పదాంతమందున్న రామ - ధామ - అభిరామ - లలామ - విరామ - నామ - ఇంతవరకొక అంత్యప్రాసము
దాశరథీ ! కరుణాపయోనిధీ ! ఇది యొక అంత్యప్రాసము.
అంత్యప్రాసమున్నదని పద్యమున, కుండవలసిన ప్రాసమును తొలగింపరాదు.
అర్ధాలంకారములు
(1) ఉపమాలంకారము (semile)
లక్షణము : ఒక వస్తువును, మరియొక ప్రసిద్దమైన వస్తువుతో, పోల్చినచో, ఉపమాలంకారమగును.
లక్ష్యము : ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగా నున్నది.
ఉపమాలంకారమునందు నాలుగు అంశములుండును.
1. ఉపమేయము.
2. ఉపమానము
3. సమానధర్మము
4. ఉపమావాచకము.
మనమేవిషయమును గురించి చెప్పుకొనుచుంటిమో, అది ఉపమేయము,
ఆమె ముఖము = ఉపమేయము
మనమే ప్రసిద్ధమైన వస్తువుతో పోల్తుమో అది ఉపమానము.
చంద్రబింబము.
ఆమె ముఖమునకు - చంద్రబింబమునకుగల
సమానగుణము - సమానధర్మము
ఉపమా వాచకము - వలె
ఉపమానపదములు - వలె - రీతి - వగిరి - వంటి - చందము - మొదలైనవి. ఈ నాల్గింటిలో ఏ ఒక్కటి లోపించినను లుప్తోమమాలంకారమగును. లోపించుట అనగా చెప్పు వాక్యము నందు లేకుండుట.
ఆమె చిగురుంకేలు నంటుకొంటివి.
చిగురువలె మెత్తని, కేలు (చేయి అని అర్థము) ఇందులో
(2) రూపకాలంకారము (Metaphor)
లక్షణము : ఉపమాన, ఉపమేయములు, రెండింటికి భేదమున్నను, భేదములేనట్లు చెప్పుట - (లేక) ఉపమేయమునందు ఉపమానధర్మమును ఆరోపించుట, రూపకాలంకారము.
లక్ష్యము : లతాలలనలు రాజుపై కుసుమాక్షితలు చల్లిరి.
ఇందు లతలుపమేయము. లలన లుపమానము. కుసుమము లుపమేయము. అక్షతలు ఉపమానము. అక్షతలు చల్లుట ఉపమానములగు స్త్రీల ధర్మము. ఆపని ఉపమేయములైన లతలు చేసినట్లు వర్ణింపబడినది. రాజు ఉద్యానవనమునకు పోయినపుడు, లతలనుండి పువ్వులాతనిపై రాలినవని సారాంశము.
మరి కొన్ని ఉదాహరణలు : -
నీ వాగమృతమును కర్ణపుటము లంద్రావితిమి
ఈ కవి సాగరుని యందు సూక్తి రత్నములున్నవి
విద్యాధనమును చోరులు దొంగిలింపలేరు.
(3) అనన్వయాలంకారము.
లక్షణము : ఒక పదార్ధమునే యుప మేయముగను ఉపమానముగను చెప్పుట. లక్ష్యము : చంద్రుడు చంద్రుని వంటివాడు.
ఆకసమాకసము వంటిది.
(4) ఉపమేయోపమ.
లక్షణము : ఉపమానమును, ఉపమేయముగను, ఆ ఉపమేయమునే, ఉపమానముగను చెప్పుట.
లక్ష్యము :
1. ధర్మము అర్ధము వలెను, అర్ధము ధర్మము వలెను, అలరారుచున్నది.
2. కొండవలె ఏనుగును, ఏనుగునట్లు కొండయు, నుండ, వాగువలె మదధారయు, మదధారవోలె వాగు నొప్పుచున్నవి.
(5) అతిశయోక్తి (Hyper bole)
లక్షణము : లోక ప్రసిద్ధమైయున్న వస్తువు స్థితిని, అతిక్రమించి చెప్పుట అతి శయోక్తి అలంకారము. కవి ప్రౌడోక్తియే దీనికి జీవనము.
లక్ష్యము : ఆ పురము నందలి సౌధములు మిన్నంటియున్నవి.
సౌధములు మిక్కిలి యున్నతములై యుండవచ్చును. అంతియేగాని మిన్నంటి యుండుట పొసగని కార్యము. కవి ప్రౌడోక్తిచే, వస్తువు స్థితి అతిక్రమించి చెప్పుచున్నాడు.
(6) దృష్టాంతరము.
లక్షణము : ఉపమేయముతో ఉపమానమును బింబ ప్రతిబింబ భావముతో, దృష్టాంతీకరించుటయే, దృష్టాంతాలంకారమనబడును. ఇందు రెండు వాక్యములుండును. లక్ష్యము : గుణము తెలియకుండినను సుకవి వాక్యము కర్ణ రసాయనముగానుండును. (ఉపమేయము) పరిమళమును ఆఘ్రాణింపకుండినను మాలతీ కుసుమ మాలిక నేత్రపర్వముగా ఉండును గదా ! (ఉపమానము)
ఈ రెండు వాక్యములందును కర్ణరసాయనముగా ఉండుట - నేత్రపర్వముగా నుండుట అనునవి విభిన్నధర్మములు. సహజముగా భిన్నములైన వానిని, ఇట సాదృశ్యముచే అభిన్నముగా వేర్వేరుగా చెప్పిరి.
దీనినే బింబప్రతిబింబ భావమందురు.
(7) స్వభావోక్తి (Nature description)
జాతి, గుణ, క్రియాదులు, ఉన్నవియున్నట్లు మనోహరముగా, వర్ణించి చెప్పుట స్వభావోక్తి.
ఆ ఉద్యానవనమున, లేళ్లు చెవులురిక్కించి, చంచల నేత్రములతో, నిటునటు గంతులిడుచున్నవి.
ఇందు లేళ్లయొక్క స్థితి, మనోహరముగా, ఉన్నదున్నట్లు, వర్ణింపబడినది.
(8) అర్దాంతరన్యాసాలంకారము (Corroboration)
విశేషమును సామాన్యముచేగాని, సామాన్యమును విశేషముచేతగాని, సమర్దించినచో అర్దాంతరన్యాసాలంకారమగును.
సామాన్యము = లోకోక్తి లేక లోకప్రసిద్ది ధర్మము.
విశేషమును సామాన్యముచే సమర్దించుట.
సత్యభామ శ్రీకృష్ణుని శిరమును దన్నెను.
కోపించిన స్త్రీలు ఉచితానుచితములను జూడరుగదా.
సామాన్యమును విశేషముచే సమర్దించుట.
మంచివారల సంపర్కమువలన, అల్పవస్తువులు కూడ, గౌరవమును పొందుచున్నవి.
పూవులతో కూడిన దారము కూడ శిరమున ధరింపబడుచున్నదికదా.
(9) శ్లేషాలంకారము (Poronmasia)
అనేకార్దములు గల పదముల, నుపయోగించి చెప్పిన శ్లేషాలంకారము.
- రాజు కువలయానంద కరుడు.
ఇచ్చట రాజు శబ్దమునకు - చంద్రుడు - రేడు అనుధర్మములు కలవు. కువలయ శబ్దమునకు కలువ - భూమి అను అర్దములు కలవు. రాజు భూమికి ఆనంద కరుడు; చంద్రుడు కలువలకు ఆనందకరుడు అని అనేకార్దములు వచ్చునట్టి పదములనుపయోగించి చెప్పుటయే, శ్లేషాలంకారము.
(10) ఉత్ప్రేక్షాలంకారము (Poetical fancy)
ఉపమానము యొక్క గుణక్రియాదులు, ఉపమేయము నందు కనబడుటచేత, ఉపమేయమును ఉపమానముగా నూహించుట ఉత్ప్రేక్షాలంకారము.
- ఈ చీకట్లను చక్రవాకాంగనల విరహాగ్ని ధూమముగా దలచుచున్నాను. ఇచ్చట ఉపమేయమైన చీకటికి నల్లదనము, కన్నులు కనపడకుండ చేయుట, వ్యాపనము, అను గుణములు గలవు. ఉపమానమైన ధూమమునకును ఈ గుణములు గలవు. చీకటులు చక్రవాక స్త్రీల విరహాగ్ని ధూమముగా నూహింపబడెను.
మరి కొన్ని ఉదాహరణములు :
- 1) ఈవెన్నెల పాలవెల్లయో అనునట్లున్నది.
- 2) క్రోధతామ్రాక్షుడైన శ్రీరాముడు ప్రళయకాలరుద్రుడో యనునట్లున్నాడు.
(11) క్రమాలంకారము :
మొదట చెప్పిన వస్తువుల క్రమమునకు, భంగము లేకుండ, అనుగుణముగా తరువాత వస్తువులంజెప్పిన క్రమాలంకారము.
ధనమును, విద్యయు, లక్ష్మీ సరస్వతులిత్తురుగాక.
ధనమిచ్చునది లక్ష్మి - విద్యనిచ్చునది సరస్వతి. అందు వల్ల ఒకే క్రియ ఇరువురికి అన్వయించినది.
"కసవుచే - నీటిచే - మోద కలవచేత
బ్రదుకు మృగ - మీన - సజ్జన ప్రకరములకు శబర కైవర్త సూచకజనులు జగతి
కారణము లేని పగవారు కారెతలవ."
గడ్డిచే బ్రదుకుచున్న లేళ్లకు బోయవాండ్రును నీటిచే బ్రదుకుచున్న చేపలకు బెస్తవాండ్ర వల్లను ఆనందముచే బ్రదుకు సజ్జనులకు కొంటెవాండ్రను కారణము లేని శత్రువులు. ఇట్లు క్రమముగా అర్ధము స్వీకరింపవలెను.
(12) కారణమాలాలంకారము :
ఒకదానికొకటి, కారణముగా వర్ణించిన, కారణమాలాలంకారమగును.
విద్యయెసగును వినయంబు, వినయమునను బడయు పాత్రత, పాత్రతవలన ధనము, ధనమువలనను ధర్మంబు, దానివలన యైహికాముష్మిక సుఖంబులందు నరుడు.
(13) భ్రాంతి మదాలంకారము :
ఉపమానము ఉపమేయముగా గాని, ఉపమేయము ఉపమానముగా గాని భ్రమించుట.
శ్రీరాముని కీర్తి లోకమున వ్యాపింప చంద్రకాంత శిలలు జలము లూరు చున్నవి.
ఇందు కీర్తి యందు చంద్రుడని భ్రాంతి కల్గినది
(14) పరిణామాలంకారము :
ఉపమానము ఉపమేయముగా మారి క్రియను నిర్వర్తించిన, పరిణామాలంకారము.
ప్రసన్న మగ, ధృగబ్జమున హరిమిమ్ము వీక్షించును.
ఇందు దృక్కు అబ్జముగా (మారినను) ఆరోపింపబడినను, వీక్షించుట అబ్జమునకు సంభవింపదు. కాన ఉపమేయమగు దృక్కుగా మారి క్రియను నిర్వర్తించినది.
(15) ఉల్లేఖాలంకారము :
అనేకులు అనేక విధముగా గాని, విషయమును బట్టి ఒకడే అనేక రూపములుగా గాని, ఆరోపింపబడిన ఉల్లేఖాలంకారము.
- స్త్రీలు కాముడనియు, యాచకులు కల్పవృక్షమనియు, రిపులు యముడనియు, ఈ రాజును దలంతురు.
- మాటలలో గురువు - కీర్తి యందర్జునుడు - శరాసనమున భీష్మడనియు నీతని దలంతురు.
(16) దీపకాలంకారము :
ఉపమానమునకు, ఉపమేయమునకు, అనేక ధర్మములు చెప్పుట, దీపకాలంకారము.
- మదముచే, కలభమును, ప్రతాపముచే సూర్యుడును ప్రకాశింతురు.
ప్రకాశించుట అను ధర్మము ఉపమేయమగు కలభమునకు, ఉపమానమగు సూర్యునకు చెప్పబడినది.
- మదముచే కలభము రాణించును.
ప్రతాపముచే సూర్యుడు ప్రకాశించును అని పదావృత్తి యున్న ఆ వృత్తి దీపకము.
(17) వ్యతిరేకాలంకారము :
ఉపమాన, ఉపమేయములకు, భేదము చెప్పుట వ్యతిరేకాలంకారము.
- శ్రీరాముడు కల్పవృక్షమేకాని భూమిలో ఉన్నది.
- ఇనుము విరిగిన నదుకును, మనసు విరిగిన నదుకదు.
(18) నిదర్శనాలంకారము :
ఉపమాన ధర్మము ఉపమేయగతముగ చెప్పుట నిదర్శనము.
- దాతకు సౌమ్యతయన చంద్రునకు కళంకము లేకుండుట.
ఇచ్చట సౌమ్యత అను ఉపమేయ ధర్మము అకళంకితయను ఉపమాన ధర్మముగ చెప్పబడినది. హరిని వదలి అన్యులు గొల్చువాడు, కామధేనువును వదలి కాసరమును బిదుకును.
(19) తుల్యయోగితాలంకారము :
కేవల ప్రకృతమునకుగాని, కేవల అప్రకృతములకు గాని, ఏక ధర్మమును చెప్పుట తుల్యయోగిత.
- కలువలును - కాపురుష హృదయములును వికసింపనీ రాజు దయించెను.
కలువలు - కాపురుష హృదయములును, ప్రకృతములు - వానికి ఉదయించుట అను క్రియాయోగము చెప్పబడినది.
- పామునకు పాలు పోసినను, విషము పోసినను ఫలమొక్కటియే.
(20) వ్యాజస్తుతి :
స్తుతిచే నిందను గాని, నిందచే స్తుతిని గాని తెల్పుట వ్యాజస్తుతి.
- ఆర్యా ! నీవు మహనీయుడవు, పర ధనమును స్వధనముగా జూతువు.
- శ్రీరామా ! ఏమి నీ ఘనత. పాపులకు కూడ పరమపదము నిచ్చితివి.
(21) అప్రస్తుతప్రశంస :
అప్రస్తుతముచే, ప్రస్తుతము తోచుట, అప్రస్తుత ప్రశంస.
- సతీ ! నీవేల పతిని వదలి పరుల ప్రశంసింతువు ?
ఇట రాముని వదలి అన్యునికొల్చువారి నింద ప్రస్తుతముగా దోచును. అట్లే -
- అధికారుల ద్వారముల కాచియుండక ఆకలముల కాలము గడుపు చుండుటచే, హరిణమే ప్రశంస నీయము.
(22) కావ్యలింగము :
సమర్ధింపదగిన దాని, సమర్ధించుట కావ్యలింగము.
- నా హృదయమున నీశ్వరుడు కలడు. కాముని గెల్చుటెంత ఘనకార్యము?
కాముని గెల్చుట ఈశ్వరుడు హృదయమున నుండుటచే సమర్దితము.
(23) వికస్వరాలంకారము :
విశేషమును సామాన్యముచే సమర్ధించుచు దానిని సమర్ధింప విశేషమును గూర్చుట.
- హిమాలయము రత్ననిలయము, దానికి హిమము కళంకము నీయదు. ఒక దోషము చంద్రమండలములో కళంకమట్లు గుణములలో లీనమగును.
హిమాలయము విశేషము. ఒక దోషము సామాన్యము. చంద్రమండలమున కళంకమట్లు అనునది తత్సమర్ధక విశేషము.
(24) సారాలంకారము :
ఉత్తరోత్తర ఉత్కర్ష వర్ణనము సారాలంకారము.
- తేనె తీపి - తేనెకన్న అమృతముతీపి - అంత కన్న హరినామము తీపి.
(25) సమాసోక్తి :
ప్రస్తుత విశేషణ సామ్యముచే అప్రస్తుతము తోచుట సమాసోక్తి.
- సూర్యుడు నిస్తేజుడై అస్తగిరి గుహ, నణగు చున్నాడు.
ప్రస్తుతము కధకు సంబంధించినది. అప్రస్తుతము కధకు సంబంధింపనిది. ఇట రాజవృత్తాంతము అప్రస్తుతము తోచుచున్నది.
- సూర్యుడు అనురక్తుడై పశ్చిమాశాముఖమును చుంబించుచున్నాడు.
ప్రశ్నలు
- సూర్యుడు అనురక్తుడై పశ్చిమాశాముఖమును చుంబించుచున్నాడు.
1.శబ్దాలంకారము లెన్ని రకములు? అవియేవి?
2. ఛేకాలంకారము - లాటానుప్రాసమును సోదాహరణముగా దెల్పుము.
3. అర్ధాలంకారము లనగా లేమి?
4.(1) అతిశయోక్తి (2) రూపకాలంకారము (3)శ్లేష (4) రూపకాలంకారము (5) ఉల్లేఖాలంకారము -వీనిని సోదాహరణముగా దెల్పుము?