రాజా బహద్దరు వేంకట రామారెడ్డి జీవితచరిత్ర/రెండవ ప్రకరణము
రెండవ ప్రకరణము
విద్యాభ్యాసము.
మహబూబునగరము జిల్లాను పూర్వము పాలమూరుజిల్లా అనేవారు. ఆజిల్లా లోనిదే వనపర్తి సంస్థానము. ఆ సంస్థానములోనిది రాయణి పీట గ్రామము. ఈ గ్రామమే వెంకట రామారెడ్డి గారి యొక్క తల్లి గారి పుట్టినిల్లు. ఆయమ్మ పేరు బారమ్మ. బారమ్మగారి అన్న విలియం వహబు. వీరిరువురి తల్లి దండ్రులు కిష్టన్ము,రాయిరెడ్డి అను వారు. విలియం వహబు గారి తల్లియుగు కిష్టమ్మ వనపర్తి సంస్థానాధీశ్వరులును బహుయుద్ధములందు ఆరి తేరిన వారును, 1895 వరకు వనపర్తి సంస్థానమును పరిపాలించిన వారును, అగు సనై రాజా (ప్రధము) రామేశ్వర రావు బహద్దరుగారి సొంత చెల్లెలు. అనగా ప్రధమ రామేశ్వర రాయలవారి మేనల్లుడు విలియం వహబు గారును, విలియం వహబుగారి మేనల్లుడు మన వేంకటరామా రెడ్డిగారును అని విశదమయ్యెడి.
విలియంవహబు అను పేరును గురించి చాలమందికి ఆశ్చర్యము కలుగవచ్చును. అతడు రెడ్డియే. అతని మొదటి పేరు శాయిరెడ్డి. ప్రధమ రామేశ్వర రాయలవారిలో ఆ కాలమందే ఆంగ్ల సంస్కృతి బాగుగా అతికి పోయెను. అందుచేత వారు ఏడ్గురు రెడ్డి బాలురను తన వద్ద నేముంచి పెంచుకొని యుండిరి వీరికందరకును విద్యాభ్యాసము చేయించుచుండిన ఒక ఇంగ్లీషు ఫాద్రిగారు. వీరికి విలియం, హెన్రీ మున్నగు మారు పేరులు పెట్టి యుండిరి. ఈ ఇంగ్లీషు పేరులును ముసల్మాను పేరులగు వహబు అను పేరులును ఈ ఏడుగురికిని ఏర్పడిపోయెను. అందరకును వహబు అను పేరు మాత్రము సమానమే అయినను, ఇంగ్లీషు పేరులుమాత్రము భిన్న ముగానుండెను. ఈ విధముగా ఛార్లస్ వహబ్ , ఏడ్వర్డ్ వహబ్, హెన్రీ వహబు మున్నగునవి.
విలియం వహబుగారి చెల్లెలగు బారమ్మను గద్వాల నగరములో పటేలును, చుట్టు 7 - 8 గ్రామములలో పటేలు తనమును పొందిన వారును, సంపన్నులును, అగు కేశవ రెడ్డి అను వారికిచ్చి వివాహము చేసిరి. కేశవ రెడ్డి గారు ఆ కాలములో మంచి ధనికులుగా పరిగణింప బడియుండిరి. వారుగోపాలు పేట సంస్థానము వారికికూడ సుమారు 60 వేలకు పైగా అప్పుయిచ్చియుండిరి. కాని అది తర్వాత వసూలుకాక మునిగియేపోయెను. ఇట్టి పుణ్యదంపతుల కుమారుడే వెంకటరామా రెడ్డిగారు. వీరు
తమతల్లిగారి పుట్టినింటిలో రాయణీ పేట గ్రామములో జనన మందిరి. జనన మొందినట్టి సరియైన తేది మనకులభించుట లేదు. కాని వారి ఉద్యోగపు కవిలెలో, వారుజనస మొందిన తేది 19 అర్ది బెహిష్త్ 1276" ఫసలి అని యుండుటచే అదియే మన మంగీకరించవలసి యుండును. జనన మొదిన మూడవదిన సమే వీరితల్లిగారు గతించుటచేత, తల్లితల్లిగారగు కిష్టమ్మగారు వీరిని పెంచుచు వచ్చిరి. తర్వాత బారమ్మగారి సొంత చెల్లెలగు జానమ్మ అనునామెను కేశవ రెడ్డి గారు వివాహమాడిరి.
వేంకటరామా రెడ్డిగారి యింటి పేరు " పాశము" వారు. వేంకటరామారెడ్డి గారి వంశీయులగు పాశము వారుకొందరు ఇప్పటికి గద్వాలలో గ్రామాధి కారులుగా నున్నారు. వీరి గోత్రము పేరు “ముదునోళ్ళ'. గోత్రము. ఈ గోత్రమ వారే 'మోటాటి శాఖలో బహుళముగా నున్నారు. గోత్రమనగా సాధారణముగా ఋషిగోత్ర మనియే హిందువుల అభిప్రాయము. కాని రెడ్లలో నెందును ఋషి గోత్రములు కానరావు. వీరి గోత్రము లన్నియు విచిత్ర నామములతో కూడి యున్నవి. కమ్మ వెలమ వారలలోను నిదే వ్యవస్థగానున్నది. కొన్ని గోత్రములు ఈ మూడు శాఖలలో నొకటిగా కనబడుచున్నవి. ఇది పరిశోధీనీయాంశముగా నున్నది. కొందరి యభి ప్రాయమున ఈగోత్రములు గ్రామమముల పేరులనుబట్టి వచ్చినవట. కాని తెనుగు
దేశములో నెందునూ ఈ గోత్రములకు సరిపోవునట్టి గ్రామములు లేవు. ఈ గోత్రములన్నియు శివసహస్ర నామావళి లోని శివనామముల అపభ్రంశ రూపములని కొందరి యభిప్రాయము. ఉండవచ్చును. రెడ్లు మొదలు జైనులుగా , నుండి యుందురు. తరువాత ఓరుగల్లు చక్రవర్తుల కాలములో శైవులె యుందురు. అప్పుడు శివదీక్ష పొంది, శివనామములనే గోత్రములుగా నేర్పాటు చేసికొని యుండవచ్చును. ఈవాద మెంత వరకు నిలుచునో బాగుగా పరిశోధించిన కాని నిష్కర్షగా చెప్పుటకు వీలు లేదు.
రెడ్లలో అనేక శాఖలు ప్రాచీనములో సీమా భేదము లనుబట్టి యేర్పడెను' అందుపాక నాటి, మోటాటి, పంట, గోనె, గుడాటి, ఎరవాటి మొదలగునవి విశేషముగా కనబడు చున్నవి. రెడ్లు మొదట ఉత్తర దేశమునందుండి రనియు, తర్వాత దక్షిణము నకు వలస వచ్చిరనియు, అట్లు వచ్చిన వారిలో “ మొదటవచ్చినవారు మోటాటి వారు" అనియు చెప్పుచుందురు. మోటాటివారిలో 360 గోత్రముల వారున్నారనియు, పాకనాటిలో 120 గోత్రముల వారున్నార నియు చెప్పుదురు. రెడ్లను, ఆశ్రయించి, బ్రతుకునట్టి “పిచ్చుకుంట్ల” వారు అనునొక తెగ వారు, జంగము కథారూషముగా ఈ వలస యొక్క కథను; గోత్రముల వివరములను ఆ గోత్రములవారి యింటి పేగులను, ద్విపదలలో నేటికిని గానముచేయు చుందురు. "మోటాటి” అనుపదము యొక్క సరియగు రూపమును ఎవ్వరును తృప్తి కరముగా నిరూపించ లేదు. శబ్దరత్నాకర నిఘుంటు కారులు మోటాటి అను పదమునకు అర్ధము వ్రాయుచోట "మోటనాడు" అను సీమా భేదము అని వ్రాసియున్నారు. ఎన్ని యోసీమల పేరుల మనము వినియున్నాము కాని "మోటనాడు" అనుసీమ పేరు విననందున అదిసరియైన యూహ కాదనవలెను యథార్థ మేమన ఈ మోటాటి పదము “మటెవాడ" అను పదమునుండి వచ్చినది. సుమారు 70 సంవత్సరములకు పూర్వము ఆలం పూరుసీమలో రాజ్యము చేసిన బిజ్జుల తిమ్మారెడ్డి అనువారు తాము రచించిన అనర్ఘ రాఘవమను తెనుగు ప్రబంధములో తన జాతిని గురించి యిట్లు వ్రాసిరి.
“అట్టి గంగకు తోబుట్టువగుచతుర్థ
“జాతియందు నితాంత విఖ్యాతిదనరు
“చున్న మొటవాడకులమున నొప్పుమీరె
“చాల బిజ్జుల దాదభూపాలమౌళి.”
ఇతనిచేతను, ఇతని వంశీయుల చేతను ఇనాములు పొందిన వారి సనదులలో "మటెవాడకాపు లైన", ఫలాని వారికి, ఫలాని భూములినాముగా నియ్యబడిన వని వ్రాసి యున్నారు. ఇట్టి నిదర్శనములను బట్టి చూడ, మోటాటి జాతివారు మటెవాడ సీమవారనియు, ఈ మటె నాడ సీమ ఓరుగల్లులోని ప్రస్తుతపు మటెవాడయే యనియు, నిశ్చయ మగును. నిజాము రాష్ట్రము లోనే మోటాటి కాపులు సమృద్ధిగా నుండుటయున్ను ఇతర శాఖల వారు ఏకొలదిమందియోతప్ప విశేషమగా కాన రాకుండుటయు, పై నిర్ణయమును బలపరచు చున్నది.
వేంకటరామారెడ్డిగా రిట్టి మోటాటి శాఖకు చెందిన రెడ్లు. తల్లి చనిపోయినందునను, అవ్వ కిష్టమ్మచేత పెంచ బడుచుండుట చేతను, ఈ బాలుడు రాయణి పేట గ్రామములోనే తన బాల్యమును గడపుచు తొమ్మిది సంవత్సరముల ఈడు వచ్చు వరకందే యుండెను. 60 సంవత్సరముల క్రిందట నిజాం రాష్ట్ర ములో విద్యావ్యాపక మన్న మాటయే లేదు. ఈనాడే నూటికి అయిదుగురే చదువ నేర్చిన వారున్నారనిన, ఆనాడెందరుండిరో యూహింప వచ్చును. ఇంగ్లీషుగాని ఉర్దూగాని రాష్ట్రమందు ప్రచారముల లేకుండెను. తెనుగుబడు లందందు గ్రామస్థుల చేతనే స్థాపించుకొన బడి యుండెను. అట్టిబడులలోను పటేలు పట్వారీలపిల్లలును, బ్రాహ్మణ వైశ్య బాలురును సంబి, జంగము పిల్లలును, తప్ప యితరజాతుల వారికి విద్యతో అవనర మేకాన రాకుండెను. బడిపంతులు సాధారణముగా భట్రాజో, నంబియో, చాత్తానియో, జంగమో, యుండుచుండెను. బడిసమయములు చీకటిలోఁ 5 గంటలకు " తెల్లవారెను మేలుకొలుపులు" అను భూపాళ రాగముతో మొదలై 8 గంటల వరకును, 8 గంటల నుండి 9 గం|| వరకు " అంబళ్ల" కై సెలవును, 9 నుండి 12 వరకు మరలబడియు, 12 నుండి, 1 గంటవరకు భోజనము సకై సెలవును, 1 నుండి సాయం కాలము 6 వరకును మరల బడియు, తర్వాత దీపాలు పెట్టి నప్పుడు “దీపంజ్యోతి పరబ్రం హ్మం" అని పాట బాడి పిల్ల లిండ్లకు పోవుచుండి”. అష్టమి సగము దిసము సెలవు. చతుర్దశియు, అమావాశ్య పూర్ణ మలును సెలవులు. ప్రతి చతుర్దశి నాడు “పలక పూజ" చేసి పిల్లలిండ్లకు పోవుచుఁడిరి. ఇక బడిలోని పాఠప్రణాళిక; ఓ న మా లు, కాకున్నము, ఎక్కాలు, బొట్ల వెరసులు, గిద్దల, వెరుసులు, చెప్పిన పద్యము వ్రాయుట, పెద్ద బాలశిక్ష, సుమతి శతకము, సృసింహశతకము, భాగవత భారతములు చదువుట వ్రాయట, లెక్కలు కూడుట తీసి వేయుట, వడ్డీ లెక్కలు వేయుట, ఉత్తరములు చదువుట, దీనితో విద్యా సమాపి.
పై విధముగు బడిలో పైపాఠ ప్రణాళికను రెడ్డిగారు తన తొమ్మిదవ సంవత్సరము వరకు పూర్తి చేసినారు. ఆకాలములో బాలుకు వ్రాయు సాధనములు రెండు. ఒకటి కట్టె పకలపై బొగ్గుపొడిని ఆకుపసరును కలిపి పూసి రాతి బలపములతో వ్రాయుట. రెండ వది పెద్ద పెద్ద జిల్లేడు ఆకులను తెచ్చు కొని జొన్నదంట్లను కలములుగా చెక్కి బియ్యపు బొగ్గుపొడిని,
గోందును, కలిపి చేసిన మసితో వాటి పై వ్రాసికొనుట. ఆకాలములో మహబూబు నగరు జిల్లాలో చేరిన కోయిలకొండ అను ప్రసిద్ధ స్థలములో కాగితములు సిద్ధము చేయబడు చుండెను. కాని అవి అందరి యందు బాటులో లేకుండుట చేత, గ్రామాధి కారులు ముఖ్యా వసరములకు మాత్రమే వాడుకొనుచుండిరి. మన రెడ్డిగారు తమ బాల్యములో జిల్లేడు ఆకులపై స్వదేశీ మసితో స్వదేశీ దంటు కలము పుల్లలతో వ్రాసి విద్య నేర్చుకున్న వారు.
రెడ్డిగారు ఉర్దూలో ప్రవీణులనియు, తెనుగు మాత్రము సరిగా తెలియని వారినియు, చాలమంది అపోహపడు చుందురు. కాని రెడ్డి గారు చిన్నప్పుడు బాగుగా భాగవత భారతములను చదివిన వారు. భాగవత మందలి కొన్ని పద్యములు కూడ వారికి బాగుగా జ్ఞాపక మున్నవి. వారు తెనుగు జాబులను పొంకముగా వ్రాయుదురు. చిన్నతనములో నేర్చికొనిన తెనుగు, తర్వాతికాలములో మరల వృద్ధి చేసుకొనుట కవకాశములు లేకున్నను, నేటి వరకును ఏమియు మాయనిదై యున్నది.
రెడ్డి గారు తమ తొమ్మిదవయేట రాయణి పేటకు ఇంచుమించు 2 'మైళ్లదూరముననుండు వనపర్తికి, విద్యాభ్యాసనిమిత్తమై వెళ్లిరి. వనపర్తి సంస్థానములో రాజవంశ మందు మార్పులు కలిగి యుండెను. రెడ్డి గారి మేన మామయొక్క మేన మామయైన రాజా (పధమ) రామేశ్వర రాయలు క్రీ. శ. 1895 లో చనిపోయిరి. వారియనంతరము వారి భార్య యగు రాణీ శంకరమ్మగారు రాజా రామకృష్ణారావు అను వారిని దత్తుగా స్వీకరించిరి. ఆదత్తు కుమారుడు తన 16 వ ఏట గుర్రము స్వారిచేయుచు దాని పైనుండి పడి చనిపోయెను. మరల రెండ కుమారుడు ఒక బాలుని దత్తుగా తీసుకొనిరి. అతనికి (ద్వితీయ రాజారామేశ్వర రావు బహద్దరు అని పేరిడిరి. మన వేంకటరామారెడ్డి గారును ఈ ద్వితీయ రామేశ్వర రాయలును వనపర్తి లో సహాధ్యా యులుగా నుండిరి. వనపర్తిలో రెడ్డిగారు తెనుగు విద్యను అభ్యసించుచు దానితో పాటు ఉర్దూ భాషను ప్రారంభించిరి. తొమ్మిద వసువత్సరము నుండి 16 వ సంవత్సరము వరకు ఉర్దూలో “పహిలీ. మొదలుకొని " వృద్ధి చేసుకొ నుచు ఫార్సీలో "కరీమా" అనుచిన్న గ్రంధమును పూర్తి చేసిరి. వీరికి చదువు చెప్పు మౌల్వీసాహేబు చండప్రచండుడు. వారికి బాల యొక్క లాలనములో కించిత్తుకూడ విశ్వాసము లేదు. ఎంత బాగుగా వీపుపై మోదిన అంత గట్టిగా బాలురలో విద్య అతికి పోవునని వారికి సంపూర్ణ విశ్వాసము. మౌల్వీగారి బడి తెనుగుబడితో కొంచెము భిన్నించుచుండెను. బెత్తము బరిగెలతో అల్లిన చాపపై విద్యార్థులు పద్మాసనముతో కూర్చుని శివము పట్టిన వారినలె వెనుకముందు కూగుచు గట్టిగా రంతులు పెట్టుచు, పాఠముల నొఱలు చుండువారు. పాఠములు చదువు టలో తప్పులు దొరలిన గోరంట చెట్లబరిగెలతో వీపులపై వాతలు పడ మోదుచుండెడి వారు. ఈ విధముగా రెడ్డి గారి విద్యా భ్యాసములో రెండవఘట్టము ముగిసెను.
వీరిజీవితమిట్లు గడుచుచుండ వీరి మేనమామగారగు విలియంవహబు గారు పోలీసు శాఖయందు ఉద్యోగులై తమ శక్తి సామర్ధ్యములచే క్రమముగా జిల్లా పోలీసు ప్రధానాధికారి (సదరు మొహతెమీం), పదవినిపొందిరి. వహబుగారప్పుడు రాయచూరులో జిల్లా పోలీసు అధికారిగా పనిచేయుచుండిరి. అప్పుడు వారు తన కుమారునితో పాటుగా చనువుకొనుటకై తన మేనల్లుడగు వేకటరామా రెడ్డిని , వనపర్తి నుండి రాయచూరునకు స్వయముగా పిలుచుకొనిపోఁయిరి. వీరు రాయచూరులో తమ 12 వ సంవత్సరమునుండి 19 వ సంవత్సరము వరకు విద్యాభ్యాసము చేయుచుండిరి. అచ్చట ఊర్దూ ఫార్సీ భాషలలో పాఠములు చదివినారు. వీరివిద్యకై ఒక మౌల్వీయున్ను తెనుగు చెప్పుటకై ఒక భట్రాజున్ను నియుక్తులై యుండి*. రాయచూరులో ఇంచుమించు నాలుగుసంవత్సరములు బాల్య మందు గడపుటచేత రెడ్డిగారికి అచ్చటి కన్నడ భాషయు మరాటీ భాషయు అలవడెను. ఇట్లు సక్రమముగా నెమ్మదిగా, సుఖప్రదముగా రెడ్డి గారి జీవితము గడుచుచుండగా తటాలున పిడుగువంటి విపత్తు వీరి కుటుంబమున సంభవించెను. వీరిని ప్రేమించి, పోషించుచు వచ్చిన మేనమామ, అకాలముగా మృత్యువు వాతబడిరి. కుటుంబ వ్యవహారము లంతయు కల్లోలములలో బడెను. ఈదుర్వార్త విన్న తర్వాత వహబు గారి అన్న గారును, తల్లియగు కిష్టమ్మగారును, మామయగు రామన్న అను వారును రాయచూరుకు వచ్చి వహబుగారు చేసినకొన్ని బాకీల క్రిందికి గాను వారి సామానులనమ్మి, మిగతవానిని బండ్ల పై నెక్కించి రాయణి పేటకు పంపిరి. కుటుంబము వారి నందరిని కూడ రాయచూరు నుండి తరలించిరి. వేంకటరామా రెడ్డి గారిని కూడ వెంట తీసుకొనిపోవువాడై యుండిరి. కాని దైవఘటన ఇంకొక విధమ గానుండెను. అచ్చట ఆనాడు జరిగిన చిన్న ఘట్టమే వేంకటరామా రెడ్డిగారి జీవితమును పూర్తిగా నింకొక మార్గములో నడిపించెను.
- [1]ఈ ప్రకరణమ'ను ముగించుటకు పూర్వము, హైద్రాబాదు రాజ్యములో విలియం వహబుగారి కాలములో పోలీసుశాఖలోని ఏర్పాటులను, వారిపరిపాలన, దేశ పరిస్థితులు, ఎట్లుండెనో సంగ్రహముగా తెలిసికొనుట అవసరము. అప్పుడు అనగా సుమారు 20 - 20 సంవత్సరముల క్రిందట, సర్ సాలార్జంగు గారు ప్రధానమాత్యులుగా నుండిరి. వారి కాలములోనే
సిన, వాగెక్కడ బసచేసిన అక్కడకే రైతులు, క్రింది అధికారులు, తండోపతండములుగా వచ్చుచుండిరి. కాని వారు రైతులను విచారించు దోషమున కొడికట్టుగొనకుండిరి. క్రింది అధికారులను దేశకాలము లెట్లున్నవి అని బుద్ధిపట్టిన విచారించెడివారు.
“సర్కార్ ఏమి చెప్పవలే. తమరి అనుగ్రహము చేత అంతయు క్షేమము. రైతులు బలిసిపోయినారు. వారు వీధులలో వెండి బంగారము విసరి వేసినను ఏదుర్మార్గుడును కన్నెత్తియైననుచూడడు” అని క్రింది అధి కారులు చెప్పేడి వా రు. “వాహవా, వాహ్ వా"అని అధికారియు, తమ అధీనులను ప్రశంసించి వ్యవహారమును ముగించు వారు. ఆకాలములో డాకాలు (బం పోట్లు ) పట్టపగలే జగెడివి. విశేషముగా ఈ పనులను అరబ్బులు, రోహిలాలు, నేరములు చేయుజాతుల వారును, తుపాకులు కత్తులు ధరించి చేయుచుండిరి. రాత్రికాలములో డాకాలుచేసిన దివిటీలు వెలిగించి, గ్రామము లోదూరి, ధనికుల ఇండ్లను పగులగొట్టి, యజమానులను పట్టుకొని, వేళ్లకు వత్తుల టించి, ఘోరముగాకొట్టి, కొన్ని సమయ ములలో చంపి, స్త్రీల నవమానపరచి, వారు దాచిన తావులను తెలిసికొని దోచుకొని పోవుచుండిరి. ఇక ఈ దొంగలను పట్టు కొనుటలోను విచిత్రములే జరిగెడివి. పోలీసువారు అస్సలుదొంగలను పట్టుకొనక గ్రామములోను చుట్టుపట్టులందును నుండు మంచి మంచి ధనికులను, వీరే దొంగలని, పట్టుకొని కొట్టి బెదరించి, దొరికినంతవరకు వారివద్ద లంచములులాగి వదలి పెట్టెడి వారు. ఒక వేళ దొంగలే మూర్ఖులై పోలీసు వారివలలో పడిరా, వారివద్ద దొరకిన దానిలో సగము ముప్పాతిక పోలీసువారే మాయముచేసి, మిగిలినదియే దొరకినట్లుగా వ్యవహారములు చేసెడివారు. కొంతమంది అధికారులకు చదువను వ్రాయను కూడ రాకుండెను.అచ్చటచ్చట కొందరు పోలీసు అమానులు దొంగల గుంపుల తమవశములో నుంచుకొని, వారిచేత ప్రక్క తాలూకాలలో దొంగతనములు చేయించి తెచ్చిన వాటిలో ఒక భాగము వారికిచ్చి మిగతదంతయు తామమభవించుచుండిరి. ఎవడైన దిక్కు లేని వాడు చచ్చిన, ఆనాటి రాత్రియే వానిశవమును త్రవ్వించి ఒక ధనికుని యింటిముందు ఉరి వేసుకున్నట్లుగా పడవే యుచుండిరి. ప్రొద్దుననే ధనికుని కట్టుకొని చాలినంత లాగు కొనిమరల ఆశవమును పూడ్పించుచుండిరి.
ఆకాలములో ఖుఫ్యా (సి. ఐ. డీ) పోలీసు మొహతె మీం ఒకడుండెను. అతడు దౌరా కేవలము దొంగలకొరకే చేయుచుండెను. దొంగలవద్దను, నేరములజాతులవద్దను, మను ష్యునికింతయని యేర్పాటుచేసి ప్రతి సంవత్సరమును మామూలు వసూలు చేసికొని వచ్చుచుండెను. విలియం వహబ్ గారి కాలములోనే కర్నల్ లడ్లో, అను ఇంగ్లీషువారు పోలీసుశాఖ యొక్క డైరెక్టర్ జనరల్ పదవి పై వచ్చిరి. వారుమంచి వారైనను, తమశాఖలోని లోపములను అణచి వేయునంతటి సామర్థ్యము లేనివారై యుండిరి. వారి కచ్చేరీలోని సిరప్త దారున్ను యిద్దరు గుమాస్తాలున్ను వారికి నమ్మకము కలిగించిరి, ఉద్యోగములను అమ్మజూపుచుండిరి. 500 రూపాయీలు మొదలు 5000 రూపాయీలవరకు లంచముల, తిని ఉద్యోగముల నిప్పించు చుండిరి.
ఇట్టి షరిస్థితులుండిన కాలములో విలియం వహబుగారు ఉద్యోగము చేయుండిరి. కాని విశేషమేమున, వీరు ఈ మలిన వాతావరణములో కొట్టుకొని పోయిన వారు కారు. మంచి సంపన్న కుటుంబము వారు. వారి కేమియు కొదువ లేకుండెను. రాజబంధువులును, మత్తె దారులును, గొప్ప భూస్వాములను నైయుండిరి.
అయితే చిత్రమేమనగా విలియం వహబు గారికి ఇంగ్లీషు బాగుగా మాట్లాడుటకు పచ్చియుండెను. కాని వ్రాయను చదువను రాకుండెను. సంతకము మాత్రము ఇంగ్లీ షులో చేయునంత మాత్రము నేర్చుకొని యుండిరి. ఆ కాలములో ఫార్సీ భాషయే కచ్చేరీ భాషగా నుండెను. అందుకూడ వానికి మాట్లాడు ప్రవీణత మాత్ర మేయుండెను. ఇంగ్లీషును ఫార్సీని
యితరులతో చెప్పి వ్రాయించెడి వారు. ఇక మాతృభాష యైన తెలుగు పాండిత్యము కూడ పై భాషలవంటిదే. వారది కూడ నేర్చుకున్నవారు కారు. వారు చాలన్యాయము గాను, ప్రజాను రంజకము గాను, తమ ఉద్యోగ ధర్మమును నెరవేర్చిన వారని ప్రతీతి. రాయచూరు మహబూబునగరము జిల్లాలలోని వృద్ధ జనులు నేటికిని వారి సౌజన్యమును గురించి చెప్పుకొను చుందురు.
- ↑ వివరములకై మిర్ విలాయతు హసేను గారు వ్రాసిన పోలీసు డిపార్టుమెంటు చరిత్రను చూడుడు.