రాజస్థాన కథావళి/పద్మిని
పద్మిని.
పూర్వకాలమున మేవారుదేశమునకు వైభవమున సాటిలేని చిత్తూరు నగరము రాజధానియై యుండెను. ఆనగరము చుట్టుపట్ల నలుదెసల బయలగు నేల నొకచదరపు గొండపైఁ గట్టఁబడి దుర్గమములగు కోటగోడలు, నున్నతములగు దేవాలయములు రమ్యములగు మేడలు, మనోహరములగు పూఁదోటలు, శూరులగు రాజకుమారులు గలిగి రాజసంస్థానమున కలంకారమై యుండెను. ఆకొండమీఁదనే వెలసిన యొకదేవత యానగరమును గాపాడుచుండెనని యానాఁటివారు నమ్మియుండిరి. పడుమూడవ శతాబ్దాంతమున మేవారుదేశమునకు లక్ష్మణసింగను నొకబాలుడు రాజయ్యెను. ఆతఁడు రాజ్యభారమును వహించుటకుఁ దగని బాలుఁడగుటచే నాతని పినతండ్రి యగు శూరశిఖామణి భీనుసింగు సంరక్షకుఁడై రాజ్యతంత్రమును నిర్వహించుచుండెను. భీమసింగు సింహళద్వీపరాజపుత్రియు నసమానలావణ్యవతియు నగు పద్మినిం బెండ్లియాడెను. ఆదేవి చక్కఁదనమును సౌకుమార్యమును నెఱజవ్వనమునుఁ బట్టి భూలోకమున నిట్టి సౌందర్యవతి లేదని యాకాలపుజనులు చెప్పుకొన దేశమంతట నామెకీతి౯ వ్యాపించి యప్పటి ఢిల్లీచక్రవర్తియు నధమాధముఁడునగు నల్లాయుద్దీను చెవినిఁబడెను. ఈచక్రవతి౯ పరమదుర్మార్గుఁడు, చిన్నటనుండియుఁ దన్ను పెంచిన పినతండ్రిని జలాయుద్దీను చక్రవతి౯ని విశ్వాసఘాతకుఁడై చంపి సింహాసన మెక్కెను. గద్దెయెక్కినది మొద లతఁడు ప్రజలను మంగలములోబెట్టి వేచినట్లు పలువెతల గుడివెను. ఆచక్రవతి౯ తనయాగ్రహమునకుఁ బాత్రులగు మందభాగ్యులనుఁ గన్నులు బొడిపించియు ధనము హరించియుఁ జెఱఁబెట్టించియుఁ జంపించియు నాలుబిడ్డల బిచ్చగాండ్రఁ జేసియు ననేక చిత్రవధల పాలుఁజేసి కలియు రావణుఁ డయ్యెను. అతఁడు తనపై దండెత్తి వచ్చిన పగఱఁ 'బారదోలుటలోను పరరాజుల దేశముల నాక్రమించుటలోను పితూరీల పేరైన 'లేకుండ నడచుటలోను సాటి లేని చండశాసనుఁ డగుటచే వాని రాజ్యము సకలైశ్వర్యముల కునికీపట్టయి విలసిల్లెను. ఆతని క్రౌర్యము నిరంకుశమై నేరములు చేసిన వారియెడలనేగాక నిరపరాధులగు వారి యాలుబిడ్డల పై సైతము జూపఁబడుచు వచ్చె. ద్రోహులగు పురుషుల దండించిన రాజు లనేకు లుండిరి కాని యేపాప మెఱుఁగని పసిబిడ్డలను బడఁతులను గ్రూరశిక్షల పాల్గావించు నీచు నితనిఁ దక్క మఱోకని నెఱుఁగము ప్రజల హింసించుటలో నతనికి హిందువులు మహమ్మదీయు లను భేదము లేదు. స్వమతస్థు లగు తురకలు సయితము వాని సెలవు లేక యొకరిదర్శన 'మొకరు చేయరాదు. విందులకుఁ బోరాదు. పదిమంది చేరి మాటాడరాదు. వేయేల! తనపాలనకు లోఁబడిన యానాఁటిహిందువుల నితఁడు కడుపునిండ దిననీయక కంటినిండ నిదురఁ బోనీయక పన్నుల వేసి బందెల ద్రోసి పీడించుటచేఁ దల గోకికొనుట కైనను వారికి స్థిమితము లేకపోయె నని యొక చరిత్ర కారుఁడు వ్రాసి యున్నాడు . అట్టి యీమహాపాతకుఁడు, పద్మినీ దేవి సౌందర్యాతిశయములను వీనుల విందుగా విని యామెను జేకోనఁగోరి మహాసేనం గూర్చు కోని యడవులు గొండలు నేఱులు దాఁటి మీవారు దేశము జోరఁబడి చిత్తూరునగరపుఁగోట యెదుట నిలిచి పద్మినీదేవిని తనకుం గానుకగ నడిగెను. రాజపుత్రులు నింద్యమగు తనకోరికను నిరాకరించుట చేతను నగరపు రాతికోట తనకు దుర్భేద్య మగుట చేతను జక్రవర్తి తన యాట లచ్చట సాగిరావని తెలిసికొని బింకము వదలి సామవాక్యములకుం జొచ్చి పద్మినీదేవి తన కక్కర లేదనియు నామె చక్కదనము తాను వినినంత జగన్మోహనముగ నుండునో లేదో యెఱుంగఁ గగోరి వచ్చితిననియుఁ బద్మినీ దేవి రూపప్రతిబింబము నొక యద్దము లోఁ దనకుఁజూపిన తాను రాజపుత్రుల బాధింపక సంతసించి పోవుదు ననియు భీమసింగునకు వర్తమాన మంపెను. తనపగతుఁడు తనవలె మాటదప్పని మనుష్యుఁ డనుకొని భీమసింగు వానికోరికఁ దీర్చుట కియ్యకొనెను. అలాయుద్దీను పరమానంద భరితుఁడై స్వల్ప పరివారముతోఁ జిత్తూరుకోటకుం జని రాచనగరుఁ బ్రవేశించి యచ్చట నోక నిలువుటద్దములోఁ బద్మినీరూప ప్రతిబింబమును జూచి కృతార్థుడై భీమసింగున కెన్నియో సలాములు చేసి కోట విడిచిపోయెను. అంతటి చక్రవర్తి తనయింటికి వచ్చినప్పుడు కొంతదూరము వానిని సాగనంపక పోవుట సదాచారము కాదని యెంచి రాజపుత్రశూరుఁడు కోట విడిచి కొండ దిగి చక్రవర్తి వెంట శిబిరమునకుఁ బోయెను. పద్మినీ దేవి సొగసులుగులుకు తమ్మికొలను కెలఁకున నొక మేడలో నుండి ప్రాణేశ్వరునిరాక కెదురుచూచుచు నెంత సేపటికి నతఁడు రామి కలవలపడఁ జొచ్చెను. మానధనుఁ డగు భీమసింగు తన్ను సాగనంపుటకుఁ తప్పక వచ్చునని యెఱింగి కఱకుతురక తనశిబిరము చెంత నొక గుట్టచాటున నాయుధహస్తు లగుభటులను దాఁచినందున రాజపుత్రుఁడు చక్రవర్తివద్ద సెలవుం గైకొని కోటకుం బోవ మఱలిన తోడనే తురక జోదులు వానిపైఁ బడి పట్టుకొని శిబిరమునకుం గోని పోయి యజమానుని యానతిం, జెరఁబెట్టిరి. చక్రవర్తి యుఁ దనకావించిన గొప్పపనికి సంతసించుచుఁ బద్మినీదేవిని నాకుం గానుక గా సమర్పింపక పోయిన పక్షమున భీమసింగు నింక' విడుచువాఁడఁ గా' నని ప్రతినఁ జేసెను.
ఇంతలో నేవకులు పరుగుపరుగున వచ్చి యాయశుభవార్త దెలిపి దేవిని రాజబంధువులను దుఃఖనుగ్ను లం జేసిరి. తక్షణమ రాజపుత్ర నాయకు లందఱును గర్తవ్యమును నిర్ణయిం చుటకుం గొలువుఁ దీర్చి భీమసింగువంటి శూర శిఖామణిని గోల్పోయి చిత్తూరు రాజ్యలక్ష్మిని దిక్కుమాలిన దానిగాఁ జేసి రాజకుమారు నసహాయు జేయుటకంటెఁ బద్మినీదేవి నాదురాత్మునికడకుఁ బనుచుటయే కాలోచిత మని సిద్ధాంతీకరించిరి. పద్మిని, ప్రాణరక్షణమునకన్న మానరక్షణమే యధికముగా నెంచుకొను రాజపుత్ర, స్త్రీ యయ్యు రాజబంధువులు చేసినతీర్పు నీచమని నిరాకరింపక యాపత్సమయమున మానభంగము రాకుండఁ గాపాడు నాయుధమును జెంతనుంచుకొని పోవుటకు సిద్ధ మయ్యెను. అంతటఁ జిత్తూరుకోటలోనుండి యేడువందల పల్లకులు స్కంధావారమునకు బయలు దేరెను. పల్లకి కాఱుగురు బోయలు చొప్పున రమారమి నాలుగు వేలమంది బోయ లోంకార ధ్వనులచే దిక్కులు పిక్కటిలునట్లు దానిని మోసికొనిపోయి చక్రవర్తి శిబిరమున దింపిరి. పద్మిని మేనమామయగు గోరాసింగును వానీయన్న కొడుకు పండ్రెండేండ్ల ప్రాయమువాఁడు బాదూలుసింగును పల్లకుల వెంట వచ్చిరి. పద్మిని వెంటఁ బల్లకులలో గూర్చుండివచ్చిన తక్కినవా రెవరిని చక్రవ ర్తి యడుగఁ బద్మినీ దేవిని సాగనంపుట కై చెలికత్తెలు, చుట్టములు పరిచారికలు లోనగువాండ్రు "ప్రేమాతిశయమున వచ్చిరని గోరాసిం గుత్తరముఁ జెప్పెను. రాజపుత్ర స్త్రీల ఘోషా చెడకుండఁ జక్రవర్తి గుడారములు వేయించి జాగ్రత్త పెట్టించుట చే బోయలు పల్లకుల నచ్చట దింపిరి. గోరాసింగు చక్రవర్తియొద్దకుఁ బోయి తన మేనకోడలు కడసారి భర్తతో మాటలాడఁ గోరుచున్నది. కావున నట్లు చేయుట కనుమతింపమని ప్రార్థింప నల్లాయుద్దీను సంతోషపరవశుఁ డై యఁదుకు సమ్మతించెను. భీమసింగు గుడారములోపలి కరిగి లోని వారితో నించుక మాటలాడి పద్మిని యెక్కి వచ్చిన దన్న పల్లకి నెక్కి మెల్ల మెల్లఁగ నావలికిం దాఁటెను. కుటిలుఁ డగు చక్రవర్తి పద్మినిని స్వీకరించియు భీమసింగును విడువ నిచ్చగింపక భీమసింగు తప్పించుకొనిపోవుట గ్రహించి వానిం బట్టుకొమ్మని విచ్చుకత్తుల జోదులఁ బంపెను. అసమయమున మహమ్మదీయుల కద్భుతముగ. సింహళ రాజకన్య యగు పద్మినీ దేవియు నామెపరిచారికలు వచ్చుటకుమారుగ నేడువందలపల్లకులనుండి యేడు వందలమంది మహావీరు లగురాజపుతులు వెలువడి యాయుధ పాణులై నిలిచిరి. పల్లకులు మోసినబోయ లందఱు సైనికులై కత్తులు యుద్ధసన్నుద్దులైరి. చక్రవర్తిసేన యింతపాటు వచ్చునని యెఱుంగక నిర్లక్ష్యముగ నుండుటం జేసి రాజపుత్ర సైనికులు కఱకు తురకలపైఁ బడి సంహరించి సైన్యంబును బటాపంచలు చేసి తురకలు తమ రాజునకుఁ గావించినద్రోహమునకుఁ బరాభవమునకుం దగినట్లు కసిఁ దీర్చుకొనిరి. రాజపుత్రు లసహాయశూరు లై పగతురం బొడిచి నురుమాడిరిగాని చక్రవర్తియొద్దకుఁ బోయి వానిం గడతేర్ప నేరక నలుదెసలం గమ్మిన మ్లేచ్ఛసైన్యంబుచేఁ గ్రమక్రమంబునంగూల నారంభించిరి. భీమసింగును పట్టుకొనుటకు వెంటనంటి చన్న తురక బంటుల కతఁడు దొరకక పల్లకి దిగి వేగనంత మగునోక గుఱ్ఱము నొక్కి ప్రాణము దక్కించుకొని మీవారు రాజ్యమును సంరక్షించుటకు బ్రతికి కోటలోఁ బడెను.
అల్లాయుద్దీను నీవిధముగ వంచించి భీమసింగు ప్రాణముఁ బద్మినిమానముఁ గాపాడిన గోరాసింగును దక్కిన రాజవుత్రశూరులును స్వదేశమున కయి ప్రాణముల విడిచి యుద్ధభూమిని బడియుండిరి. రణనిహతులగు శూరులపత్నులు చిచ్చురుకుటకు సిద్ధముగ నుండ సంతలో యుద్ధము నుండి తప్పించుకొని బాలుం డగు బాదూలుం గచ్చటికి వచ్చెను. గోరాసింగుభార్య వానిం జూచి 'నాయనా ! కయ్యమున నాప్రాణేశ్వరుం డెట్లు వర్తించెనో విన(గోరుచుంటిగాన నే నాయనను గలసికొనుటకుఁ బోవక మునుపే నా కెఱిఁగింపు' మని యడిగెను ఆపలుకులు విని బాదూలుసింగు “తల్లీ ! అతఁ డిట్లు వర్తించినాఁ డని నేను వర్ణింపఁ గలనా ? నీహృదయేశ్వరుంచు స్వదేశ సంరక్షణమునకై శౌర్యము మెఱయఁ బోరాడి తన క్రొన్నెత్తుటిచే భూ దేవీ నలంకరించి ప్రాణములఁ బరిత్యజించి వీరస్వర్గముఁ జూరఁగొని యున్నవాఁడు. పగతుర కళేబరంబుల మెత్తని పాన్పుగఁ గావించుకొని యొక కఱకుతురక మేను తలగడ నమర్చుకొని వీరశయనమున నుండి చచ్చియుఁ బగతురకు వెఱపుఁ గొలుపుచున్న వాఁడు సుమీ" యని విన్నవించెను. ఆ మాటలు విని యావీర పత్ని నేనిఁకఁ దడయరాదు. ఆలస్యమైన నాజీవితేశ్వరుఁ డాగ్రహింపఁ గలఁ డని నిర్భయముగ నిర్విచారముగ నిశ్శంకముగఁ జిచ్చురికి మృతి నొందెను. అప్పుడు మీవారు రాజ్య మంతయు దుఃఖ సముద్రనిమగ్న మయ్యెను. రాజపుత్ర వీరులలో ననేకులు మృతి నొందినను జక్రవర్తి చిత్తూరుకోటం బట్టుకొనువిషయమున నాస వడలుకొని చిన్న బుచ్చుకొని ఢిల్లీ నగరమునకుం బయనమై పోయెను.
చక్రవర్తి, కంతటితో బుద్ధి వచ్చి యుండునని రాజపుత్రులు తలంచిరిగాని యాపంతగొండి చిత్తూరునందు జరిగిన పరాభవము నిప్పువలె వానిహృదయమును దహిచుటం జేసి పగ దీర్చుకొనుటకుఁ దగిన సమయమును నిరీక్షించు చుండెను. వెనుకటికయ్యమునాటికి బాలుఁడై నలక్ష్మణసింగు యుక్త వయస్కుడై రాజ్య భారము బూని క్రమక్రమంబునఁ బండెండుగురు కొడుకుల తండ్రి యయ్యెను. భీమసింగు పద్మినీ దేవినిం గూడి యెప్పటికిని రాజగౌరవము నందుచు దేహదార్థ్యము గలిగి తమ్మికోలని చెంత 'మేడలో సుఖించు చుండెను. అలాయుద్దీను చక్రవర్తి యు నేపని చేయుచున్న నేవిషయమై ఆలోచించుచున్న నెవరితో మాటలాడుచున్న పద్మినీ ముఖపద్మమును మఱువక యుత్కంఠముతో నుండెను.
ఇట్లుండి యుండి ప్రజలకు దుర్భరముగఁ బన్నులు గట్టి ధనము చేర్చి మహా సైన్యమును గూర్చుకోని మీవారు పై దండెత్తి చిత్తూరుకోటను మరల ముట్టడింపసాగెను. చక్రవర్తి సాహసమును జూచి రాజపుత్రులు తొలుదొల్త నెగతాళి చేసిరి. రాతిగద్ది యపై ఁ గూరుచున్న యంగనలవలె బురలక్ష్మి చక్రవర్తికి దుర్భేద్యమైనట్టు కనఁబడెను. కాని తూర్పు ద్వారమువద్ద నేల కొంచె మెత్తుగ నుండినందునఁ జక్ర వర్తి యది కనిపెట్టి యాచో టెత్తు చేయింపఁ దలంచి తట్ట కొకడబ్బు చొప్పున నిచ్చిద నని చెప్పి సైనికుల చేత మట్టి మోయించి కోట యెత్తున నొక దిబ్బ గావించి దానిమీద గోడలను బగులగొట్టుటకు, కోట సంరక్షించువారిఁ జంపుటకు లోపలి వారిఁ గడ తేర్చుటకుఁ దగిన యుద్ధ సాధనములును యంత సాధనములును బెట్టించి పని జేయించెను. కోటలోపల నున్న రాజపుత్రులకు లోక సామాన్య మగుప్రతాపపౌరు షములు కలవుగాని మహమ్మదీయుల వద్ద నుండుయంత్ర సాధనాదులు లేకపోవుటచేఁ గోట నిలుచుటయుఁ దమప్రాణములు దక్కుటయు నసాధ్యమని తలంచిరి. అంతలో వర్ష కాలము ప్రారంభమై రాజపుత్రుల బాధలనధికము చేసెను. రాణా యగులక్ష్మణసిం గొకనాఁడు రాత్రి మేల్కని యొకచోట నొక్కఁడు గూర్చుండి మీవారు రాజ్యమునకు రాఁదలంచిన మహోపద్రవమును గూర్చి యోచించుచుండఁగ నొకమూలనుండి "నా కాకలి యగుచున్నదీ నా కాఁకలి యగుచున్న ”దని యొక ధ్వని వినఁబడెను. ఆశబ్దము విని యతఁ డదరిపడి దిగ్గున లేచి నలు కెలంకులఁ జూచునప్పటికి వాని యెదుట దీపము వెలుఁగున భయంకరాకారము కల యొక పెనుభూతము గనఁబడెను. లక్ష్మణసింగు దానిం గని యామె చిత్తూరునగరమును గాపాడు పుర దేవత యని నిశ్చయించి దానితో "రాజపుత్రుల నెత్తురు కావలసినంత ద్రావితివి గదా నీకిం కేమి కావలయ" నని భయభక్తులతో నడిగెను. అప్పు డాపాడుదయ్యము వానితో "నాకు రాజుల నెత్తురు ద్రావినంగాని తనివి సనదు. ఈ నగరమునకు నాసహాయము గావలయునేని మూర్థాభిషిక్తు లగురాజులు పండెండుగురు నాకు బలి కావలయు" నని యుత్తర మిచ్చి యంతర్ధాన మయ్యెను. రాణాయు మిగిలిన రాత్రి యంతయు నిశ్శబ్దముగాఁ గడపి ప్రాతఃకాలమున సేనాధిపతులను బంధువులను రావించి కొలువుదీర్చి రేయి జరిగిన చిత్ర కథ 'వారి కెఱింగించెను. కానీ వారెవ్వ రాకథ నమ్మరైరి. 'నామాటలు నమ్మరేని మీరీ
రాత్రి నామందిరమునకు వచ్చి యేమిజరుగునో చూడుఁడు. ఆదేవత మరల రావచ్చు నని నేఁ దలంచెద.'నని రాణా పలుకుటయు రాజ బంధువు లారాత్రి వాని మందిరమున కరిగి కనుమూయక చూచుచుండ నడిరేయి వెనుకటియట్లు భూతము కనంబడలేదుగాని వినువారి గుండెలు జల్లు మనునట్టు లీక్రిందపలుకులు వినఁబడెను. "నా కాకలి యగు చున్నది. నా కాఁకలి యగు చున్నది. దురాత్ములగు మ్లేచ్చుల నెత్తు 'రెంత త్రావినను నాకుఁ దృప్తి లేదు. నాకు రాజులరక్తము గుటగుట ద్రాగవలేనని యున్నది. రాణాకుటుంబమునుండి పండ్రెండుగురు రాజకుమారులు 'నేరి యందొక్కొక్కనికి బట్టాభిషేకముఁ జేసి ఛత్ర చామరాది రాజచిహ్నములిచ్చు మూఁడు దినములు మీవారు ‘రాజ్యము వాని చేత నేలించి నాలుగవదినమున మ్లేచ్చుల మీఁదికి యుద్దమునకుఁ బంపుఁడు. ఒక నితరువాత నోకని నీవిధముగ బలి యిచ్చిన నేను జిత్తూరునగరమునుండి దేశమున కొక భంగము రాకుండఁ గాపాడెదను. "
పుర దేవత పలికిన యాదారుణవచనములకు నాఁ డచ్చటఁ జేరిన రాజపుత్రులలో శంకించిన వాఁడు వెఱచినవాఁడు నొకఁడయినను లేఁడయ్యె. రాణాకోడుకులు పండ్రెండుగురు 'దేశ క్షేమకర మగునీపని కిం దమప్రాణముల నిచ్చెద మని నిర్భయముగఁ జెప్పి 'నేను ముందు బోవుదు నేను ముందు బోవుదు నని తమలోఁ దారు వంతులు వేసఁ జొచ్చిరి. తుట్టతుదకు జ్యేష్ఠకుమారుఁడు తండ్రిక డుపునఁ దాను దొలు దొల్త నుదయించుటచే ముందుగఁ బోవుటకుఁ దనకు స్వాతంత్ర్యాము గలదని వాదింప వాని యనుజు లందఱు నందుకు సమ్మతించిరి. గ్రామదేవత చెప్పినట్లతఁ డభిషిక్తుడయి మూడు ప్రొద్దులు రాజ్యమేలి నాలవనాఁడు పగతుర దాఁకి వీర స్వర్గము నొందెను.అనంతరము రెండవ కుమారుఁ డగున జేయసింగువకు వంతు వచ్చె. ఇతఁడు తండ్రికి దక్కినకొడుకులకన్న నధిక ప్రియుఁ డగుటచేఁ దండ్రి 'నాయనా అందఱు నన్ను బాసి పోవఁ దలఁచుకొన్నను నీవైన నాకడఁ గొంత తడ వుండి నాకూరట గలుగఁజేయు మని దీనముగ వేడుకొనఁ గుమారుఁ డట్లు చేయుట కిష్టము లేక యుఁ దండ్రిమాటఁ దీసివేయలేక, క్రమక్రమంబునఁ దక్కినసోదరు లందఱు రణమునఁ దెగువఱకు జనకుని సమీపమున నుండెను. రణమునకుఁ బోవుటకుఁ గుమారునివంతు వచ్చినదని తెలిసికొని రాణా మంత్రుల సామంతుల సేనాధిపతుల రాజబంధువులఁ బిలిపించీ కొలువుఁ దీర్చి "శూరులార! హత శేషుఁడై ననాప్రియనందనుఁ డజేయసింగు పోవలసిన కాలము వచ్చినది. ఈ నగరరక్షణమునకయి యీ బాలునిబదులు పెద్దవాఁడను నేనే ప్రాణము లర్పించెదను. దైవాను గ్రహ మున్న యెడల మనమిప్పుడు చేయఁజాలని యీవీరకర్మ మీ బాలుఁడు చేయఁగూడదా ',, అని సభ్యుల మనస్సులు నీ రగునట్లు జాలిగదురఁ బలికెను. ఆపలుకులు విని సభాసదు లందఱు నైకకంఠ్యముగ "వలదువలదు. మీరొక్కరు పోవలదు మనమందఱముఁ గలసియే పోవుదము. ఇప్పుడే యుద్ధ సన్నద్ధులమై వీర కంకణములఁ గట్టుకొని పసపు బట్టలు ధరించి ఖడ్గపాణులమై మీ వెంటవచ్చి చిత్తూరుపుర రక్షణము నకు మాయసువుల విడిచెద" మని శౌర్య ముట్టిపడ నుత్సాహవచనములఁ బలికిరి.
అంతట రాణా వారితో నిట్లనియె. సరే! మీరట్లే చేయ వచ్చునుగాని మనయంతఃపుర స్త్రీలు పాపమునకు వెనుదీయని పచ్చి తురకలపాలుగా కుండునట్టి యేర్పాటులు మనము సేయవలయును. పిమ్మట మనము నిశ్చలమనస్కులమై పగతుర దాఁక వచ్చును., అనుటయు నందఱు నది యవశ్యకర్తవ్యమని తత్ప్రయత్నములఁ జేయఁదొడఁ గిరి. ఆకోటలో నాపత్కాలమున దాఁగొనుటకు నిడివియు సన్నదనమును గల నేలగదులు సొరంగములు గుహలు గొన్ని కలవు. సేవకు లాస్థలములలో కట్టెలతో చితులం బేర్చి చమురుబిందెల నచట సిద్ధ పఱిచిరి. అంతయు నాయత్త మగుటయు నంతఃపుర కాంతాజనంబులు రాణి మొదలు దాసివఱ కందఱుఁ బసపుబట్టలు గట్టి సమస్త భూషణములు ధరించి 'పెండ్లికిఁ బోవు తేఱంగున సంతోషముతో నొక యుత్సవము జరిగినట్లు గుహలలోనికిం బోయి మల్లెపూబాన్పుల నెక్కినట్లు చితుల పై దుమికి శరీరము అగ్ని హోత్రున 'కాహుతులు చేసిరి. తన కారణమున మీవారు రాజ్యమున, కంత దురవస్థ సంభవిం చెనుగదా యనిచింతిలుచుఁ బద్మినీ దేవియుఁ దక్కిన కాంతలతోడ నిప్పుల గుండమువద్దకుఁ బోయి సాటి లేని తనచక్కనిమే నగ్నిహోత్రున 'కాహుతిఁ జేసెను. పిమ్మట మగవాండ్ర వంతు వచ్చినందున వారందఱు పసపుబట్టలను గట్టుకొని మృత్యుకన్యను వరించు పెండ్లి కుమారులు వలె సమరరంగము నకుఁ బయన మైరి. ఆజోదులను 'మొనగాఁ డై నడపింప నజేయసింగు సిద్ధ మయ్యె. కాని రాణా వాని నట్టి ప్రయత్నమునుండి మరల్చి “నాతండ్రీ ! నాకంఠమునఁ బ్రాణము లుండ నావంశ మంతమయ్యే ననుమాట నా చెవిని బడనీయక నీ వెందైనం జని నీప్రాణములం దక్కించుకోమ్మని శూరులగు రాజపుత్రులఁ గొందఱ సాయ మిచ్చి కొడుకు నావలకుం బంపెను. అజేయసింగు జనకుని యదృష్టవశము ననో రాజకుమారుల నందఱఁ దనపొట్టం బెట్టుకొన్న పుర దేవతాప్రసాదంబుననో శత్రువులకంట బడకుండ నవ్వలకుం బోయి సురక్షిత మగుప్రదేశమును జేరెను.కొందఱు నిరపాయముగ దాఁటె నను మాట వినిన తోడనే రాణా కోటతలుపులం దీయించి సైన్యంబును బగతుర పైఁ బురికొల్పుటయు నా సేన దిగబారు 'సెలయేటి చందంబున వడివడి వచ్చి మ్లేచ్ఛసైన్యంబు దాఁ కె. రాజపుత్ర యోధులు నెత్తురులు ద్రావ వచ్చు బెబ్బులట్లు కదనరంగముఁ బ్రవేశించి వీరావేశముచే నొడ లెఱుంగక నడచినచో టెల్ల పీనుఁగ పెంటలు గావించుచు 'వేటాఱుతునియలుగఁ దురకల నఱకుచు వీరవిహారంబు సల్పిరి.రస పుతులకు శౌర్య మెంత యున్నను వారిసంఖ్య యనధిక మగుట చేతను శౌర్యహీనులగుతురకలసంఖ్య మితిమీరి యుండుట చేతను గోట్టకొనకు విజయము మ్లేచ్ఛులకే లభించెను. రాజపుత సేనలు పేరైన లేకుండ నశించిన పిదపఁ జక్రవర్తి జయజయధ్వనులతో గోటఁ బ్రవేశించెను.
అతఁడు ప్రవేశించి చూచునప్పటికీ మహాలక్ష్మి విహరించు మందిరంబులు నిర్మానుష్యములై మృత్యుదేవత కొలువుఁ జేయు హజారములై యుండెను. పరిజనంబుల కోలాహలంబులఁ బ్రతిధ్వను లిచ్చు చదుకములు నిశ్శబ్దములై భయంకరములై యుండెను. వీధులు విపణీతలంబులు గుళ్ళు గోపురములు మఠములు మందిరములు వెల వెల బారుచుఁ గఠినచిత్తు లైన తురకలకు సైతము వేఱపు గొలుపఁ బొచ్చెను. చక్రవర్తి యిట్లు పాడువడియున్న తావులు జూచుచు నంతఃపురమునకుఁ బోయి హృదయేశ్వరి యైనపద్మినికో ఱకు వెదకులాడి యామె నెందుం గానక తనలో 'పురుషులందఱు యుద్ధమునం జచ్చిరి సరే, ఇది యేమిచిత్ర మాడుది యొక్క తెయైనం గానఁబడదు. ఆడువాండ్రందఱు నేమైరి చెపుమా ' యని విచారించుకొనుచు నలు దెసలు పరికించి చూడ నొక వైపుననుండి కమరుకంపుతోఁ గూడిన నల్లనిపొగ బయలు దేఱి వచ్చుచుండెను. దానిం బట్టి శుద్ధాంత కాంతా జనంబులు చిచ్చురికి చచ్చి యుందు రనియు వారితోఁ బద్మినియు నశించి యుండు ననియు నిశ్చయించుకొని యందఱి ప్రాణములు దీసి నను తనమనోరథసిద్ధి గాకపోయెగదాయని బిట్టువగచి నిప్పులగుండము లున్నయా నేలగదులం జూడఁగోరెను. అలా యుద్దీను సేవకులలుం డెలు తీసినబంటు లే యైనను వారిలో నతి ధైర్యవంతులు సైత మా నేలగదుల తలుపులం దెఱవ సాహసింపరైరి.
నాటికి నేటికి నాస్థలఁ బుల కెవ్వరుఁ బోవఁజాలరు. ఒకమారోక మనుష్యుఁడుమాత్ర మాచీఁకటి సొరంగముల ద్వారముల దాఁటి యావలకుం జని మరల నేదో భగవత్కటాక్షమునఁ బ్రాణములతో బయటికి రాఁగలిగె నని చెప్పుదురు. అచ్చటియగ్ని హోత్రము లార నివై యెడతెగక మండుచుండు ననియు నాద్వారముముందర నొక పెనుత్రాఁచుఁబాము చుట్టలు చుట్టుకొని పండుకొని యెవరయిన నచ్చటికి వచ్చినప్పుడు నిప్పులు విసముం గ్రక్కుచు వచ్చెననియు జనులు కొంతకాలము చెప్పుకొనిరి.
రాజపుత్రు లది మొదలు రణరంగమున నెంతెంత శూరులైన శత్రులనైన నెదుర్కొన సాహసించిరిగాని యానేలగదులఁజూచుటకు జననొల్లరైరి. మేవారుదేశస్థు లగురాజపుత్రు లీనాఁడును గొప్ప యొట్టు పెట్టుకొనవలసినప్పుడు 'చిత్తూరు నాశనము చేసినట్టే' యనుచుందురు. ఆనగరము ముమ్మారు మహమ్మదీయులచేత ధ్వంసము చేయఁబడి యిష్టదేవతలవల్ల, బరిత్యజింపఁబడి మేవారు రాజకుటుంబము చేత విడువఁబడి యున్నందున నిప్పుడు పూర్వవైభము దొలంగి నామావశేషమై కథావశేషమై చూచువారలకు వినువారలకు దాని చరితము దుఃఖకారణ మగును.