రాజస్థాన కథావళి/రాణా హమీరు

వికీసోర్స్ నుండి

రాణా హమీరు.

——:(0):——

అల్లాయుద్దీసు చిత్తూరుపై దండెత్తకమునుపు రాణా లక్ష్మణసింగుయెుక్క పెద్దకుమారుఁడు హరసిం గోకనా డండ్వాయడవికి సపరివారముగా వేఁటకుఁ జని గుహలో నున్న యొక యడవిపందిని లేపి తఱుముగా నది దొరకక పఱచిపఱచి చివరకోకజొన్న చేనిలోఁ దూరి దాఁగెను. రాజకుమారుఁడును వానిబంట్లును చేనిచుట్టు కాచుకొని యుండి పంది నెవరయిన చేనిలోనుండి బయటకుఁ దఱిమిన బాగుండునని తలంచిరి. ఆ చేనిలోఁ బిట్టలఁదోలుటకై కట్టఁబడిన మంచెపై మాసిన గుడ్డలు కట్టుకొని దృఢశరీరముతో నున్నయొక పడుచుకన్య తప్ప చూపుమేరదూరములో వారి కెవ్వరుఁ గనఁబడ రైరి. వేటకాండ్రప్రయత్నముం జూచి యాబాలిక యీమృగమును మీవయి పునకుఁ దణుముదునా యని రాజకుమారు నడిగెను. ఆమె యేమిచేయునో యాచమత్కారమును జూడవలె నని యతఁడు సరే యట్లు చేయుమనెను. వెంటనే యాయువిద జొన్నకఱ్ఱ నొక దానిని బెరికి చివర పదునుగాఁ జెక్కి మంచె వైపునకుఁ బోయి యొక్క నిమిసములో నాపందినిం బొడిచి చంపి రాజకుమారుఁడుఁ బరివారము నద్భుతపడునట్లు దాని కళేబరమును బర బర యీడ్చి తెచ్చి వారి ముందుఁ బడవైచెను. రాజకుమారుఁడు "వేఁటాపఁదలఁచిన జంతువును మఱియొకరు చంపినచో వారి ప్రాణములు నిలుచుట యరిది. అయినను హరసింగు మాత మా పడుచుపై కోపపడక సొహసమునకు మెచ్చుకొనెను. ఆ బాలిక మరలఁ బొలమునకుఁ బోగా వేఁటకాడ్రు దాఁపుననున్న చిన్న యేటియొడ్డునకుఁ బోయి యన్నముఁ దిని సల్లాపములాడుచుఁ గూర్చుండిరి. అంతలో నొక మట్టియుండ విసవిసవచ్చి రాజపుత్రునిగుఱ్ఱపు కాలికిఁ దగిలెను. గుఱ్ఱము కాలు కుంటుబడెను. అందఱును కోప విస్మయములతో నలుదెసలఁ జూడ వినుకటి బాలిక మంచెపై నిలుచుండి వడిసెలతో రివ్వున రాళ్ళు రువ్వుచు చేనిపై వ్రాలు పిట్టలం దోలుచు వారికన్నుల కగపడెను. ఆమె తన కావించిన తప్పెఱింగి వడివడి రాజనందనుని యొద్దకుఁ బఱ తెచి తన్ను శమింపు మని ప్రార్థిం చెను. అతఁనును బాలిక పైఁ గోపింపక మంచి మాటలం బలికి యామెం బని చెను.

అదినమున వేట ముగించి రాజవుతుఁడు పరివారస మేతుఁడై మందిరమున కరుగుచుండ నాబాలిక నెత్తిమీఁద పాలకుండ తోను నిరు ప్రక్కల మెడకు త్రాడుగట్టిన యొక్కొక మేక పిల్లతోను నడచుచు వారివైపునకు వచ్చుచుండెను. ఆమెను జూచీన తోడనే యాపరివారములో నొకఁడు కొంటెతనమునకు నామెపాలకుండను జారవిడుచునో మేక పిల్లను వదలునో చూడ నభిలషించి యామెను బెదర గొట్టుటకై తనగుఱ్ఱమును యామెవై పునకు దుమికించెను. ఆ బాలిక వాని టక్కరితనమును ముందే గ్రహించి. జాగ్రతపడి యించుకయు జడియక చల్లగ నొక మేకపిల్లను గుఱ్ఱపుకాళ్ళ కడ్డముగ వదలెను. గుఱ్ఱము బెదరి తత్తర పడి యాశూరశిఖామణిని నేలఁ బడవైచెను. ఆపడుచు చెక్కు చెదరక పాలొకచుక్క యైనఁ దొనగకుండ చేతిలోని తాళ్లు వదలకుండ నేమియు నెఱుఁగనట్లు తన దారిం బోయెను. రాజకుమారుఁ 'డీవినోదమును గనిపెట్టి చూచి బాలికను పిలిచి నీ వెవ్వరిదాన వని యడిగెను. “నేను చందన వంశజుఁ డగు నొక రాజపుత్రుని కుమా తే౯ను. మాయిల్లిక్కడకు సమీపమే” యని బదులు చెప్ప. రేపు మీతండ్రిని నాయొద్ద కోకసారి రమ్మని చెప్పు' మని పలికి యతఁడు త్వరితముగా నింటికిఁ బోయెను.

మఱునాఁ డుదయమున నా బాలిక తండ్రి రాజపుత్రుని యొద్దకు వచ్చి తాను నిరుపేద యయ్యు నందఱు నాశ్చర్యపడునట్లు వానితో సమానముగఁ గూర్చుండి సమానునితో మాటలాడునట్లు సంభాషించెను. అప్పుడు హరసింగు నీకూఁతును నా కిచ్చి పెండ్లి చేయు మని యడుగ నావృద్ధుఁడు తనకూఁతుని రాజులకిచ్చు యుద్దేశము లేదని ఖండితముగఁ జెప్పెను. హరసింగు సజ్జనుఁ డగుటచే వానిఁ జెరబెట్టించి యామెను బలవంతముగా గ్రహించుటకుఁ జెల్లుబడి యుండియు నట్టిపని చేయుట కిష్టపడఁ డయ్యె. కానీ యాముసలివాఁడు గృహంబునకుఁ బోయి తన్నామె మెచ్చుకొను నని తలఁచి జరిగిన వృత్తాంత మంతయు భార్యకుఁ దెలుప నామె కోపించి యెంత తెలివిమాలిన పనిఁ చేసితిరి? సిరిరా మోకాలొడ్డుదురా? ఇప్పుడైనను రాజపుత్రుని యొద్దకుఁ బోయి చేసిన తప్పుల క్షమింపు మని ప్రార్థించి కూఁతును వాని కాళ్ళపైఁ బడ వేయు మని మందలింప మఱునాఁడతఁడు మరల చిత్తూరునకుఁ బోయి రాజనందనుని గాంచి తప్పు క్షమింపు మని ప్రార్థించి కూఁతును వానికిచ్చి వివాహము చేసెను. వారిరువురకుఁ గలిగినకొడుకే హమీరుసింగు.

చిత్తూరుపురరక్షణమునకు హరసింగు ప్రాణత్యాగము చేసిన నాటికి హమీరు మిక్కిలి బాలుఁడు. అజేయసింగును చిత్తూరుకోట నుండి దాటించి యావలకుఁ బంపునపుడు మీవారు రాజ్యమునకుఁ దన ముద్దులమనుమఁ డైన హమీరును యువరాజుగఁ జేసి సింహాసన మెక్కింపు మని లక్ష్మణసింగు కడసారపు కోరికగ నజేయసింగును గోరెను. హమీరు తగి యున్నయెడల నట్లు చేయుదునని యజేయసింగు వాగ్దానముఁ జేసెను. అల్లాయుద్దీనునకు వెరచి చిత్తూరు నందలి స్త్రీలందఱుఁ జిచ్చురికి పురుషులందఱు శౌర్యము మెరయ యుద్ధము చేసి మృతి నొందిన యాదుర్దినమున హతశేషులై కొందఱు జను లజేయసింగుతోఁ గలిసి పారిపోయి కొండలలో కేయిల్వారలో దాఁగి యుండిరి. అల్లాయుద్దీను "దేశమంతయు దోచుకొని నాశనము చేయుచున్నను వీరుమాత్రము వానికి దొరకక సురక్షితులై యుండిరి. పద్మినీదేవి వసియించు మందిరము తప్ప చిత్తూరులో తక్కిన మేడల మిద్దె లన్నిఁటి నల్లాయుద్దీను పాడుచేసి తాను పోవునపుడానగరమునకు మార్టేవను హిందువును పాలకుఁడుగా నేర్పఱచి మివారు దేశము నందలి యనేక పట్టణములనుగూడ నాశనముఁ జేసి మరల ఢిల్లీకిఁ జనియెను.

కెయిల్వారాలో హమీరు తన పినతండ్రికుమారులతోఁ గలిసి విలువిద్య నేర్చుకొను చుండెను విలువిద్య కఱచుట కట్టియడవులే కదా తగిన చోటులు, ఆకుమారులు మువ్వు రచిరకాలములోనే పగతు దాకుటకు యెట్లో పొంచి వైరిం బడగొట్టుట యెట్లో పఱచుచున్న పగవానిని సిలుగులు బెట్టుట యెట్లో నేర్చిరి. ఆలాయుద్దీను దేశము నందుంచి పోయిన సైనికులతోడను రాజ్యవిహీనుఁడై యడవుల జరియించు రాణాకు లొంగుట కిష్టము లేక స్వేచ్ఛగాఁ దిరుగు కొండ దొరలతోడను దోపుడు కాండ్రతోడను దుర్మార్గులతోడను పలు మారు వారు పోరాడుచు వచ్చిరి. అట్టివారిలో బ్రధానుండు మూంజ జాతీయుఁ డగు నొకశూరుఁడు, ఆమూంజుఁ డొకనాఁడు కెయిల్వారా మీఁదికి దండెత్తి వచ్చి రాణా నెదిరించి వానిని తలపై బల్లెముతో బొడిచెను.

అజేయసింగు గాయమున కంత లక్ష్యముఁ జేయలేదుగాని తీవ్రమైన యాపరాభవ కళంకమును మూంజుని నెత్తుటితోఁ గడిగి వేయవలయునని నిశ్చయించి తనకొడుకులం బిలిచి మీరు నా కపకారము చేసిన మూంజునిపైఁ జని పగఁ దీర్చుకొనఁగలరా యని యడుగ వారు వీర పురుషోతచిత మైనయుత్తర మొసంగ లేకపోయిరి. అప్పుడతడు హమీరునకుఁ దనకోర్కె నెఱిఁగింప నాకుమారసింహుఁడు పినతండ్రితో « నే నిదె పోవుచున్నాను నేను పగతుని జయింతునేని నన్ను మీకు వేగమే చూడఁగలగు.అపజయ మెందుదు నేని వారు నన్నిక నెన్నఁడు జూడ" రని ప్రతిజ్ఞఁ జేసి 'వెడలెను.

అనంతరము కొన్ని దినములకు కెయిల్వా రాజనులందఱు సంతసించునట్లు హమీరు విజయుఁ డై వచ్చి పినతండ్రికి నమస్కరించి “దేవర వారి శత్రునిశిర స్సిదిగో' యని మూంజునితల వానిపాదముల పైఁ బడవైచెను. అజేయసింగు సంతోషమున బాలునిగౌఁగిలించుకొని “నాయనా! నీవే మీవారు దేశమునకు రాజు వగుదువని నీ నొసటను వ్రాసి యున్నది.' అని మూంజుని నెత్తుటిలోఁ దన వ్రేలు ముంచి కుమారుని ఫాలమున నెత్తుటి బొట్టు పెట్టి తక్షణమే వాని యువ రాజుగఁ జేసెను.

అజేయుని కొడుకులవలన నించుకయు బాధ కలుగదయ్యె. ఏల యన నొకఁడు స్వల్ప కాలముననే మృతినొందెను. రెండవవాఁడు రాజ్య సంపాదనమునకై దేశాంతరముల కరిగి మరల రాఁడయ్యె. కొండలు నడవులు దప్ప మీవారు దేశమున మంచిభాగము లన్నియు నప్పుడు ఢిల్లీ చక్రవర్తిస్వాధీనమున నున్నందున మీవారు రాణాగా నెవ్వరున్న నొకటియే యని యెంచి 'రెండవయతఁ డట్లు చేసె. తరువాత మూడువందల యేండ్లకు భాంస్టే కుటుంబయినఁ బుట్టి తురక రాజుల యేలుబడిచే సిలుగులఁ బడుచుండిన మహారాష్ట్ర దేశంబునకు స్వాత త్య్రము కలుగఁ జేసి తురక రాజులకుఁ బక్కలో బల్లెమై ఢిల్లీ పాదుషా యగు నౌరంగజీబునకు లోఁబడక వానిని బలుబాముల బెట్టిన దేశోపకారి యగు శివాజీ యీతనివంశస్థుఁ డే.

అజేయుని యనంతరమున హమీరు రాణా యయి ఢిల్లీ చక్రవతి౯: సైనికులతో క్రమక్రమమైన యుద్ధమును జేయుటకయి పూని తన్ను రాజుగా నంగీకరించీ తన రక్షణ మపేక్షించిన వారందఱు కుటుంబములతో వచ్చి కెయిల్పారాలో కాఁపుర ముండవలసిన దని యానతిచ్చెను. ఆట్లు వారువచ్చి చేరిన పిదప నా రాజకుమారుఁడు వారి సాయమునఁ జక్రవర్తికిలోఁబడియున్న భూములలో దండు విడిసి దారుల నరికట్టి మేచ్ఛసైనికులకు గర్భనిర్భేదకముగ విహరించెను. అప్పుడు రాణాహమీరు పేరు సింహస్వప్నమువలె నుండుటచే తురక సైనికులు వాని యెదుటఁ బడలేక గోలో డాఁగిరి. అతని నొక వేళ తఱుముకొని పోదలంచినను కొండదారుల నతఁ డెఱిగినట్లుత్రువు లెఱుఁగక పోవుటచేతను చుట్టు పట్ల ప్రజలందఱు వానియం దిష్టముగ నుండుట చేతను వైరుల ప్రయత్నములు నిష్ఫలము లయ్యె.

ఇట్లతఁడు వీరవిహారంబు సలుపుచుండ చక్రవతి౯ చేఁ జిత్తూరు పాలించుటకు నియమింపబడిన మాల దేవు తనకుమాతె౯ను హమీరున కిచ్చి వివాహము చేయుటకయి వానిని రమ్మని వత౯ మాన మంపెను. అతని యనుచరు లేదో ద్రోహము జరుగునని పోవలదని బ్రాధి౯చిరి; కాని హమీరు వారి పలుకులు విని నవ్వి 'సాహసలక్ష్మీ' యనుమాట నెఱుఁగరా? ఎట్లయినఁ జిత్తూరు మరలఁబట్టుకోనవలయు; నగర 'మేస్థితిలో నున్నదో తెలిసికొనుట కిదియే మంచిసమయము కాన పోవక మాననని కొందఱుమిత్రులు గలిసి యశ్వారూఢుఁడయి యాకన్నియను జేపట్ట తన తాతతండ్రులు పాలించునగరమునకు జనియె.

మాలదేవుని మందిరముసమీపమున కతఁడు పోయిన తోడనే వాని మనస్సు శంకింప నారంభించెను, పట్టణ మందుగాని రాచనగరు నందుగాని వివాహసంబంధ మయినశోభ యించుకయు గానరాదయ్యె. వేయేల? పెండ్లి ప్రయత్న మున్నట్లే తోఁ చదయ్యె. ఆస్థితిని జూచి వానియనుచరులు తప్పక ద్రోహము జరుగనని నిశ్చయించిరి, కాని హమీరు వారిని వారించి నిర్భయముగ నిశ్శంకముగ గుఱ్ఱము డిగి లోపలి హజారమునకుఁ జనియె. అక్కడ మాలదేవు బంధుగణ సమేతుఁడయి యెదురుగా వచ్చి పెండ్లి కొడుకును గారవించెను. పెండ్లి కొడుకువా రనుకొన్నట్లు ద్రోహ మేది యుఁ గనఁబడదు, కాని యది పెండ్లి వారి యిల్లువలె నుండదయ్యె. అంతట మాలదేవు వధువునుం బిలిపించి యామె నప్పుడే యక్కడనే నొక బ్రాహ్మణుని చేత హమీరునకు వివాహముఁ జేయి౦చెను. పెండ్లి కుమార్తె మేలిముసుంగుకొంగునకు పెండ్లి కుమారుని శాలువ చెఱుఁగు ముడివేసెడి తంత్ర మొకటి తప్ప మఱి యేతంత్రముగాని మంత్రముగాని కన్యా ప్రదానముగాని ఫలప్రదానముగాని జరుగదయ్యె.

దంపతు లిరువురు రాత్రి గలిసికొన్నప్పుడు ప్రపంచమునందే పురుషునకును భార్యగ నుండఁదగని యేవికృత విగ్రహముగల కురూపినో తనకుం గట్టిపెట్టి యుండరుగదా యని యనుమానించి హమీరు మునుముం దామె మేలిముసుఁగెత్తి మొగముంజూచెను, ఆముసుంగు మఱుంగున హమీరు నిరుపమానలావణ్యముఁ గలిగి శాంతరస మొలుకు వదనారవిందమును గనుఁగొనెను కాని యామె యతిదుఃఖతయై చిన్నఁబోయి మగని మొగముం చూచుటకే సిగ్గుపడు చున్న దానివలె కనంబడియె. ఆ తెఱంగున నున్న భార్యను జూచి హమీరు 'యేమిది మన కీవిధముగ నిర్మంత్ర విధిగా నిరుల్లాసముగా వివాహము జరుగఁ గారణమేమి? నీవిట్లు బిట్టువగవ నేల? యని యడిగెను. అన వుడు నాపడఁతి మెల్లగ నాతని కిట్లనియె. "స్వామీ ! దీని కారణమిది మిమ్ము మావాండ్రు నిష్కారణముగా వంచించినారు. మీ చెట్టబట్టిన యీ సేవకురాలు వితంతువుగాని కన్యగాదు. నేను పసిపాపనై, యున్న నాఁడు మాతండ్రి నాకు వివాహము చేసె. పిదప కొన్ని దినములకే నాభత౯ యుద్ధమున మృతుఁ డయ్యె. ఆయన మోగమైన నాకుజ్ఞాపకము లేదు. ” ఆపలుకులు విని హమీరు తాసు నిశ్చయముగ వంచింపఁ బడియెనని యెఱింగి గాఢవిచార సంతప్తుఁ డయ్యె. హిందూ దేశమున వితంతువును వివాహ మాడునతఁడు మిక్కిలి నీచుడుగ నెంచబడుటచే నతఁడు శోకాకుల చిత్తు డయ్యె. శుభ కార్యములు జరుగునప్పు డెదుట నైనఁ బడ: గూడని వితంతువును పరువుగల సుక్షత్రియుఁడు పెండ్లి యాడుటకన్న హైన్యమింక లోకంబున 'లేదని తలఁచి యతఁడు నాటితో తనయభీమానము కులగౌరవము పెంపు నశించెనని బెంగపెట్టుకొని యేదియుఁ దోఁచక పాన్పుపైఁ బవ్వళించి విచారింపఁజొచ్చె. ఆసమయమున నతఁడా బాలికను కోపావేశమున వధించిన నామె నోరెత్తక యుండియుండును. ఏలయన దుర్భర పరాభవముఁ "దెచ్చు నావివాహము నకు వరుఁ డెంత సిగ్గుపడుచుండునో వధువు 'నంతియ సిగ్గుపడుచుండును. తనజోలికి రాక తన నేమియు నిందింపక తనలోఁ దాను దుస్సహమగు పరివేదన మందుచున్న రాజనందను జూచి యాబాలిక యిట్లనియే. "స్వామి: సేవకురాలను క్షమింపుఁడు. ఇందు నా నేరమేదియు లేదు. మీకింత యవమానము గలిగించిన మీపగతుర పగదీర్చుకొను నుపాయము నేను జెప్పెదను. మీపితృపితామహాజి౯తమగు చిత్తూరు నగరమును మీరు మరల స్వాధీనముఁ జేసికొనవచ్చును." అప్పుడు రాణా శాంతము వహించి యామె చెప్పెడు నుపాయ మేదియో వినఁగోర నామె మరల నిట్లనియె. "మా తండ్రిని మీరు కట్నములు కానుకలు నగలు భూములు నడుగక తనమంత్రియైన జాలుఁడను వాని భరణముగ నిమ్మని యడుగుఁడు. అతఁడు 'మీ కోరికఁ ద్రోసిపుచ్చఁడు, జాలుఁడు మనకార్యము నవలీలగా సాధించును. అనవుడు హమీరామెయుపాయమునకు సంతసించి విచారమును విడిచి వితంతువైనను దనభార్య జాణతనమును శౌర్యమును గలిగి రాణిగా నుండఁదగినదని నిశ్చయించి మరునాఁ డుదయమున మామయగు మాల దేవునొద్దకుఁ బోయి కోపమును విషాదమును లేకయే మంత్రియగు జాలుని దమకునరణముగ నిమ్మని యడిగి శలవు పుచ్చుకొని భార్యతోడను కొత్త మంత్రితోడను కైలు వారాపట్టణము జేరెను.

అనంతర మొకసంవత్సరమునకు రాణా కీభార్యవలన నొకకుమారుఁ డుదయించెను. రాణాయు రాణియు జాలుఁడును గలిసి యెవ్వియో పన్నుగడలం బన్నుచు దినములు గడపుచుండిరి. ఇట్లుండ పెండ్లియయిన రెండేండ్ల తరువాత చిత్తూరున కోకయాచారి వచ్చి హమీరు సింగుభార్య తనచిన్న కుమారు నెత్తుకొని వచ్చి కుల దేవతలకు మ్రోక్కించి పోవలయునని కోరుచున్న దని చెప్పెను. అప్పుడు మాలదేవు యుద్ధయాత్ర వెడలి పర దేశమున నుండెను. అతని జ్యేష్ట కుమారుడు తన తోఁబుట్టువు రాఁక కనుమతించి యామే వచ్చినప్పుడు సగౌరవముగా నామె నంతఃపురమున: బ్రవేశ పెట్టెను. ఆజాణయు మెరియల వంటి సైనికులతోడను మంత్రియగు జాలుని తోడను కోటలోఁ బ్రవేశించి మాయోపాయము లెన్నియో కడు నేర్పునంబన్ని ప్రాధి౯ంపఁ దగిన వారిఁ బ్రాధి౯ంచి, లంచములు కావలసిన వారికి లంచము లిచ్చి బెదరింపఁ దగిన వారిని బెదరించి, పొగడ్తలకుబ్బు వారిని పొగడి తండ్రి సైనికుల నెల్ల వశము చేసికొని తనభత౯ను రావించి వాని ననాయానముగ లోపలఁ బ్రవేశ పెట్టించి బంగారపు సూర్యబింబముగల రాణా హమీరు యొక్క ధ్వజము కోటబురుజుపై నెత్తించెను. పిమ్మట గోన్ని దినములకు మాల్దీవు యుద్ధము నుండి రాగా కూఁతురు నల్లుఁడును వానింగోటఁ జేరనియ్యక తమ రిది యాక్రమించినట్లు తెలియఁచేయుట కయి ఫిరంగి గుండ్ల బ్రయోగించిరి. రాణా తన రాజధానిని మరల నాక్రమించెనన మీవారు దేశమునం దంతట జనులు చెప్పు కొనసాగిరి.

అందుచేఁ బ్రజానురాగముగల వాని సేనలో వేనవేలు చేర సైన్యము ప్రబల నుయ్యెను. ఆ సేనం గూర్చుకొని యతఁడు శత్రుసంహారమున కయి సమకట్ట నొకని వెనుక నొకరుగ రాజులెల్లరు లోఁబడిరి. మాల దేవుని తనయులలో నొకఁడు హమీరు ప్రేరణమున వధియింపఁ బడియె, రెండవవాఁడు వానికి లోఁబడి సేనాపతియై కొంత దేశమును జయించి యతని కొప్పగించెను. చిత్తూరునందున్న చక్రవతి౯క సైనికులు రాణా యెదుట నిలువఁ జాలరైరి. స్వదేశపురాజు లదివఱకే వానికి లోఁబడి యుండిరి. చిత్తూరునగరమునకు మీవారు దేశమునకు మరల యెప్పటి మహోన్న తదశ వచ్చెను. ఈనడుమ నల్లాయుద్దీను చక్రవతి౯ మృతినొందుటచే ఢిల్లీ రాజ్య మనేక సంక్షోభములకు లోనయి తనయవస్థలలోఁ దా నుండుటచే స్వతంత్రించిన విదేశముల వంకఁ జూడ లేకపోయెను. అందుచే మీవారు రాజ్యము హమీరు పాలనము క్రింద వృద్ధిఁ జెంది కడు బలపడి యెను.

హమీరు చిత్తూరుసింహాసనమున సుప్రతిష్ఠితుఁ డయిన పిదప తురకలు తొల్లి చేసిన చెరుపంతయుఁ జూచి దుఃఖించి మరల బాగు చేయఁబూనెను, అలా యుద్దీను తాను గోనిపోయినంత గొనిపోయి తీసికొనిపోలేని దానిని బాడు చేసి రాణాలధనాగారమునందలి ధనమంతయుఁ గొల్లఁగోనెను. హమీరు చేయిదాఁ టిపోయిన యమూల్యా భరణములకు ధనమునకు నంతగా విచారింప లేదుగాని కోటలో నడుగు పెట్టినది మొదలు పూర్వాజి౯ తమగు నొక వస్తువునకై చింతిల్లఁ జొచ్చెను, అది యేదియన మున్ను జగన్మాతయగు భవాని వంశకత౯ యగుబప్ప రావునకుఁ బ్రసాదించినదియు విశ్వకర్మ నిర్మితమైనదియు రెండంచుల వాడిగలదియు నగు మహాఖడ్గము. అదియెచ్చటనున్నదో యెవ్వ రెఱుఁగకున్నను లోకమాత యాఖడ్గము మాత్రము గోహింస కుల పాలుసేయ దని యతఁడు నమ్మెను. అది చిత్తూరు ముట్టడిలో యెట్లో యదృశ్య మయ్యేననియుఁ బద్మినివలెనే నదియు శాశ్వతముగా నశించె ననియు జనులు చెప్పుకొనిరి. అయినను తనయం దనుగ్ర హించి తనకు మరల రాజ్యమునొసంగిన దేవత లాఖడ్గము మరల నియ్యకపోరని నమ్మి సకల దేవతలను ముఖ్యముగా నగరసమీపమున వ్యాఘ్రగిరి మీఁద వెలసిన చారుణీ దేవిని నతఁడు మిక్కిలి ప్రాధి౯ంచెను. అంతట చారుణీ దేవి వానికిఁ బ్రత్యక్షమై యాఖడ్గ మంతఃపురమున కడుగున నున్న నేలకొట్లలో నున్నది. తీసుకోమ్మని చెప్పెను.

చిత్తూరు రాజపత్నులు రాజపుత్రికలు చిచ్చురికి చచ్చిన నాఁడు మొద లింతవఱకు మనుష్య మాత్రుఁ డెవ్వఁడు సాహసించి యాసొరంగములఁ బ్రవేశింప లేదు, చచ్చినవారి యాత్మ లచ్చట గ్రుమ్మరు ననియు ద్వారమున నొకమహాసర్పము బుసకొట్టుచు నిలిచి యెవ్వని దరిఁ జేరనీయ దనియు ప్రజలు భయంకరములగు కథలం జెప్పుకొనుచు వచ్చిరి; కాని నూనూఁగుమీసము లైన రాకమునుపే హమీరు మహా సాహసములు చేసిన శూరుఁ డగుటచే నీమాటలకు వెరువక దయ్యము లుండనీ దేవతలుండనీ పాములుండనీ యేముండనీ లోపలకుఁబోయి ఖడ్గమును దెచ్చుకొనుట కతఁడు నిశ్చయించెను.

అట్లు కృతనిశ్చయుఁడై యాశూరశిఖామణి సూర్యరశ్మి యెన్నఁ డెఱుఁగని యామహాంధ కార గుహలలోఁ బ్రవేశించి మెరక పల్లము లెఱుఁగక చేతితో గోడలఁదడుముకొనుచు తనమీఁద మందలు మందలుగా వ్రాలుచున్నవి గబ్బిలములో దయ్యములో యెఱుఁగ జాలక తాను తొక్కి పోవుచున్నవి తన తల్లి యెముకలో తక్కిన రాజాంగనలయెముకలో యని తలంచుకొని జాలి నొందుచు పోయి పోయి తుదకు విశాలమగు నొక మహాభాగముఁ బ్రవేశించి యచ్చట నొక వెల్తురు జిమ్ము మంటయు పొగయు జూచి దాని సమీపించెను సమిపించి చూచునప్పటి కామంట చుట్టు సగము సర్ప దేహము సగము మనుష్య దేహము గలిగి వికృత వేషములతో నున్న కొన్ని స్త్రీ విగ్రహములఁ జూచెను. అందొకటి పండ్లి కిలించుచు నీవెవ్వడవు ? ఇక్కడ నీకేమిపని యున్నది. మాయుత్సవమున కేభంగము కావించెదవని వాని నడిగెను. అతఁడును నిప్పుపై నున్న యొక డేగిసా చుట్టు గూర్చున్న యాదయ్యముల యొద్దకుఁ 'బోయి ,మీపండుగ నేఁ. జెరుప రాలేదు. విశ్వకర్మనిర్మిత మగు నాఖడ్గమును నాకిచ్చిన నాదారిని నేఁబోయెద! నని చెప్పెను. ఆపొగనడుమనుండి చూడ చూడ తలలు విరియబోసికొనియున్న యాదయ్యముల కొకిబికి మొగములు మఱింత భయంకరములై వికృతములై కానంబడియె. అప్పుడవి యతనితో మాటలాడక' డేగిసామూత తీయుమని సన్న జేయ నతఁడు వేరువక యట్లుచేసి లోనున్న దానం జూచెను. అతఁ డేమి చూచెనో యెవ్వ రెఱుఁగరు. అందొక చింపిరి దయ్యము విక విక నవ్వి డేగిసాలో నుడుకుచున్న పదాథ౯ము కొంత(దీసి యొక మూకుడులో బెట్టి తిను మని వానికిచ్చెను. అతఁడును సందేహింపక మారుమాటాడక యిచ్చిన దానిని భక్షించెను.

అప్పుడవి వానిని మెచ్చి యొక మూలనుండి రెండంచులఖడ్గమును దెచ్చి వాని కిచ్చి పంపెను. హమీరును కృతకృత్యుఁడై యెప్పటి యట్లంథకార బంధురమగు గుహను జాగరూకతతో దాటి బయటబడి విశ్వకర్మ నిర్మితమగు ఖడ్గమును చేత ధరించి తనవారి కన్నులకు విందుచేసి యాఖడ్గముతో శత్రువులఁ దెగటార్చి మీవారు రాజ్యము చిరకాలము బాలించెను.