రాజశేఖరచరిత్రము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

రాజశేఖరచరిత్రము

(మాదయగారి మల్లన్న ప్రణీతము)

ద్వితీయాశ్వాసము

శ్రీరమణీమణీయవి
హారాయతనూత్నలోచనాంభోజయుగా
దోరమితకీర్తినిరసిత
తారళభృత్కాశ యప్ప దండాధీశా.

1


వ.

అవధరింపు మత్తెఱంగున నావర్తితనామకరణాదిసంస్కారుండై
ప్రతిదినప్రవర్ధమానుం డగుచు నక్కుమారుండు.

2


ఉ.

నిద్దపురత్నభిత్తిఁ దననీడఁ గనుంగొని తోడనాడు న
మ్ముద్దులబాలుఁ డంచుఁ గరముల్ పలుమాఱును జూఁచి చీరుచున్
విద్దెము చేయుచుం దిరుగు విందులు విందులు విందులంచు నే
ప్రొద్దు నృపాలుఁడున్ సతియుఁ బొంగుచు నక్కున గారవింపఁగన్.

3


శా.

కేలీకాంచనసౌధవీథికల చక్కిందొట్లలోఁ బెట్టి యో
ప్రాలేయాచలకన్యకాధవకృపాపారంగతా నిద్రపో
వే లావణ్యపయోనిధీ యనుచు నావిర్భూతమోదంబునన్
జోలల్ పాడుదు రక్కుమారకునకున్ శుద్ధాంతకాంతామణుల్.

4


క.

అల్లారుబెల్లమై గలు
గల్లున నందియలు మొరయఁగా వేడుక పె
న్వెల్లి మునిఁగించె ధరణీ
వల్లభనందనుఁడు చూచువారల చూడ్కుల్.

5

గీ.

కఱకుఁజూపుల మూడవక న్ననంగ
రత్నములు గీలుకొల్పిన రావిరేక
ఫాలభాగంబునను గ్రాల బాలుఁ డపుడు
శంబరారాతి యయాతిచంద మయ్యె.

6


మ.

వనితానేత్రచకోరచంద్రిక తనుస్వచ్ఛందకాంతిచ్ఛటా
ఖని యుత్సాహకళాఖళూరి మతిరేఖామంత్రసంసిద్ధి భో
గనివాసంబు లతాంతసాయకభుజాగర్వావలంబంబు యౌ
వన మమ్మానవనాథపుత్త్రునకు మవ్వం బొప్ప నేతెంచినన్.

7


సీ.

ధర మొక్క మైఁదాల్పఁ దరముకాదని భోగి
                       వరుఁడు దాల్చిన తనుద్వయ మనంగ
హృదయగేహముఁ బాసి యీశుఁ డేగఁకయుండ
                       నలవరించిన బోరు దలు పనంగ
సముదీర్ఘలావణ్యజలధిలోఁ జూపట్టు
                       లాలితశైవాలలత యనంగ
నిందిర విహరింప నెడముగా నజుఁడు గా
                       వించిన క్రొందమ్మివిరు లనంగ


గీ.

నిడుదబాహుయుగంబును వెడదయురముఁ
గొమరుమీసలు దీర్ఘనేత్రములు మెఱయ
మానినీజనమానసమానహరణ
చతురతరమూర్తి యారాజసుతుఁడు మెఱసె.

8


ఉ.

ఏయు నిశాతబాణములహేళిఁ బదింబది సూక్ష్మలక్ష్యముల్
త్రోయు సుతప్రఘాణమునఁ దుంగధరాధరశృంగసంఘముల్
వేయు భుజాకృపాణి నవలీల నయోమయపిండఖండముల్
ప్రాయము పెక్కువన్ ధరణిపాలతనూజుఁడు సత్త్వయుక్తుఁడై.

9


గీ.

ఇత్తెఱంగున యౌవనాయత్తుఁ డగుచు
దండ్రియానతి యొక్కింత తప్ప వెఱచి

యౌవరాజ్యాభి షిక్తుఁడై యతిశయిల్లె
నఖిలవిద్యానిరూఢిఁ బెం పంది యతఁడు.

10


ఉ.

రామునికంటె నప్పరశురామునికంటె ధనుర్విశేషవి
ద్యామహనీయుఁడై మెఱసి యాతఁడు చేతుల తీటవో సము
ద్దామవిరోధిబాహుజవితానము నుక్కడఁగించి వీర ల
క్ష్మి మదిరాక్షికిన్ వలపు గీల్కొలిపెన్ విషమాస్త్రకేళికిన్.

11


సీ.

కలహభోజన మునిగ్రామణి యాకంట
                       నానాఁట నిటమీఁద నవయకున్నె
దళితారి రక్తాపగలు నిండి పాఱమి
                       వారధు లిటమీఁదఁ జెలఁగకున్నె
నిజమండలోద్బేధనిర్వేదములు మాని
                       నలినాప్తుఁ డిటమీఁదఁ జెలఁగకున్నె
రంభానిరంతరరతికేళిఁ బౌలస్త్య
                       నందనుం డిటమీఁదఁ బొందకున్నె


గీ.

యనఘ దర్పితపరిపంథి మనుజపతుల
బీరములు మాన్పి తనపాదపీఠిఁ జేరి
కప్పములు పెట్టి కొలువ నిష్కంటకముగ
ధాత్రి పాలించె భువనైకజైత్రుఁ డగుచు.

12


వ.

ఇవ్విధంబున, బ్రజాపాలనంబు చేయుచుండునంత నొక్కనాఁడు హే
మధన్వమహీపాలుండు పేరోలగంబుండు సమయంబున.

13


చ.

కనుఁగవ నిప్పుకల్ చెదరఁగా నదరుల్ వెదచల్లు కెంజడల్
పెనఁగొన నక్షహారములు బిట్టుగ నిట్టటు లూగ నెంతయున్
గినుక వహించి యొక్కముని కేసరిగొబ్బునఁ జేరవచ్చె న
జ్జనపతియున్ సభాసదులు సాధ్వసమంది వడంకునట్లుగన్.

14


గీ.

అమ్మహామౌని వచ్చిన యాగ్రహంబు
డెంద మవియింప గద్దియ డిగ్గి మ్రొక్క

వినయవినమితుఁడై యున్న విభుని జూచి
లెక్క సేయక పలికె నమ్మక్క యనఁగ.

15


క.

కాచము రత్నము సరిగాఁ
జూచు మహామహుల తపము చూఱలఁబోనీ
వేచింతయు మదిఁ బెట్టవు
రాచఱికం బింతచెఱుతురా నరనాథా!

16


ఉ.

ముంపిరి రాజ్యగర్వమున ముదరగానవు గాకధాత్రిఁ బా
లింపరొ తొంటిరాజులు దిలీపముఖుల్ మునికోటి కూఁత లా
లింపరొ నొంపరో మదవిలీఢకఠోరనిశాటఝాటమున్
సంపరొ దిక్కటాహముల నిర్మలకీర్తిసుధాంశుచంద్రికల్.

17


క.

ఘాతుకదైతేయకశా
ఘాతములటె మౌనినరుల కాయములటె యీ
పాతకము కలిగె ధాత్రికి
నీతరమున నిట్లు చెల్లునే మము వదలన్.

18


ఉ.

పుండ్రకనామధేయమున భూరిభుజాల బలశాలియైన మీ
తండి కవింజర ప్రభుతి తాపసముఖ్యుల యజ్ఞవేళ పె
క్కండ్ర నిశాటులం దఱిమి కౌశికదైత్యుని నుక్కడంచె నా
తీండ్ర యొకించు కేని వలదే కలదే మఱిదిక్కు ధాత్రికిన్.

19


సీ.

కరమండలోద్భేదపదము లాలోకించి
                       మంత్రరక్షణకళామహి దాల్చి
ద్వీపాంతరంబులతెఱుగు లాకర్ణించి
                       గడినున్న మన్నీల క్రమ మెఱింగి
దుర్గాధిపతుల సుద్దులు విచారము చేసి
                       బలముల నప్పటప్పటికిఁ జూచి
నిజరాజధానిలోని విశేషము ల్గని
                       మంత్రిసామంతులమతము లరసి

గీ.

పేదసాముల విన్నపం బాదరించి
వ్రతులమైనట్టి మముబోటివారి నరసి
రాజ్యమేలినఁ దగుఁగాక ప్రాజ్యవైభ
వంబు గలదని సుఖయించువాఁడు నృపుఁడె.

20


సీ.

నెమ్మేని తిమిరంబు నేత్రగోళంబుల
                       పర కర్ణపుటముల ప్రత్తినోరి
వాకట్టుమందు గర్వలతాలవాలంబు
                       వినయకృత్యంబుల వేరువిత్తు
కరుణారసంబు తెక్కలికాఁడు మదిచొక్కు
                       పాతకంబులపాలి పట్టుగొమ్మ
మొగమోట కుడుగని పగరాజసంబుల
                       యిక్కువ గురుసేవ కెదురుచుక్క


గీ.

పరుషవర్తన కునికి లోభంబు టెంకి
బాంధవస్నేహసిందూరపాలకంబు
కలశపాధోధిపుత్త్రి క్రేఁగంటిచూడ్కి
వాని రాజుల నేరమె కాదు సువ్వె.

21


క.

అన విని శివ శివ యని య
జ్జనపతి వెఱఁగంది యపుడు సవినయముగ న
మ్మునివరు విహితాసనమున
నునిచి భయం బొదవఁగా మృదూక్తులఁ బలికెన్.

22


క.

వెఱ పొక యింతయు లే కీ
తెఱఁగున మిము నెవ్వఁ డింత తెగి చేసెనొకో
యెఱిఁగెఱిఁగి యుండి యకటా
కొఱవిం దలఁగోఁకుకొనుటకుం దలపెట్టెన్.

23


గీ.

వికటదైత్యులు నాపేరు విన్నయంత
జలదరించుచు వలయాద్రిచఱులఁ గాని
యెందుఁ దలచూప వెఱతు రిం కేమి చెప్ప
నింతకాలంబునకు నొక వింత గంటి.

24

క.

కినుక మెయి నిపుడు మిమ్ముం
గనుగాన కలంచి నట్టి గర్వాంధునిఁ దు
త్తునియలు గానించెద నే
ననఘా వినిపింపు మనిన నతఁ డి ట్లనియెన్.

25


ఉ.

ఏమని చెప్పువాఁడ ధరణీశ్వర యే వరతంతు సంయమి
గ్రామణి శిష్యుఁడన్ జటిల కౌశికుఁడన్ బహువేదశాస్త్రవి
ద్యామహనీయుఁడన్ బదరికాశ్రమవాసుఁడఁ బుత్త్రికామణిన్
గోమలపాణి భానుమతిఁ గోల్పడి వచ్చినవాఁడ నక్కటా.

26


ఉ.

నీకరుణవిశేషమున నెమ్మది నేమి కొఱంత లేక య
స్తోకతపోవిధానములు చూఱలు పట్టి సమస్తతాపసా
నీకము నేఁటిదాఁక నతినిశ్చలతన్ వసియించె నిప్పు డ
స్వీకృతనిత్యకర్మమయి చిక్కె విశంకటదైత్యబాధలన్.

27


సీ.

వినవయ్య ధరణీశ విరివియై కవ్వంపుఁ
                       గొండచేరువ నొక్కకోన గలదు
బెడఁగైన యక్కోన నడుచక్కి మిక్కిలి
                       భీకరంబగు నొక్కబిలము గలదు
తలకింతయును లేక తద్బిలద్వారంబు
                       సరణిఁబో నొకరక్తసరసి గలదు
ఘోరతరం బైన యారక్తసరసి వెం
                       బడిఁ బోవ నట నొక్కబయలు గలదు


గీ.

పరభయంకర మం దొక్కపురము గలదు
తత్పురంబుననుండి సంతతము వచ్చి
యాత్మతరుణి కూడిగము చేయంగవలసి
పొంచి సవరల పాపలఁ గొంచుపోవు.

28


శా.

కాళీదత్తకఠారలోహమయకంఖాణంబుపై నెక్కి దం
భోళి క్రూరకరాసిఁ ద్రిప్పుచు గళోద్భూతచ్చటాకారముల్

గ్రాలన్ గోత్రధరాధరేంద్రములు వ్రీలన్ లీనమై వేడెముల్
దోలున్ ధేయని యక్షకిన్నరపురస్తోమంబు దూటాడఁగన్.

29


సీ.

ఒకవేళ సింహమై యుఱుకుచు బెదరించు
                       నొకవేళ హరిణమై యొద్ద నిలుచు
నొకవేళ భూజముల్ పెకలించు ఘోణియై
                       యొకవేళ శలభమై యుద్భవిల్లు
నొకవేళ మౌనియై యొయ్య నొయ్యన వచ్చు
                       నొకవేళ నగ్నియై యుఱక వెలుఁగు
నొకవేళ మేఘమై యుఱుముచు నేతెంచు
                       నొకవేళ శైలమై యుండు నడుమ


గీ.

నద్దురాత్మునిమాయ లే మనఁగఁగలదు
జపతపోనిష్ఠ లేమియు జరుగనీక
బదరికాశ్రమసీమ తాపసుల నెల్ల
నలఁచి యేచుచు నొక్కనాఁ డదను వేచి.

30


క.

నాచిన్నిముద్దుకూతురు
నాచక్కనితల్లి వీథి నడయాడఁగ న
న్నీచుకొనిపోయె సాళ్వము
రాచిలుకం గొంచుపోవుక్రమమునఁ దండ్రీ.

31


క.

ఆసవ యొయ్యన నెఱిఁగి మ
హాసుర వెనువెంటఁబోవ నదలించి గత
త్రాసుఁడయి చేతి కశగొని
వ్రేసెన్ నను నిట్లు రోషవివశుం డగుచున్.

32


క.

ఏడవ యేటిది యెవ్వరు
వేడుక కదలించిరేని వెక్కుచు నేడ్చున్
జూడ భయంకరయగు తన
చేడియ కుడిగంబు లెట్లు చేయు నృపాలా.

33

క.

అత్త దయామతిఁ దనకడ
నత్తమిలక నిద్రవోవ దహరహమందున్
బొత్తునఁ గుడువత తాఁగడి
యెత్తదు తజ్జనని యింత కేమయ్యెనొకో.

34


సీ.

కడుపార దొండపం డిడి ముద్దుగఱపిన
                       రాచిల్కకొదమలఁ జూచి చూచి
పాదులలో నిండ బా ల్పోసి పెంచిన
                       చూతపోతంబులఁ జూచి చూచి
తోడికన్నెలుఁ దాను గూడిమాడి చరించు
                       సురపొన్ననీడలఁ జూచి చూచి
బృందావనంబులు పెంచి తిన్నెలమీఁద
                       సూటిఁ బెట్టినమ్రుగ్గు చూచి చూచి


గీ.

సంతసంబున దేవపూజలు ఘటించి
పారికాంక్షులసేవకై పరమనియతి
లీల నడయాడుచున్న బాలికలఁ జూచి
హృదయవీధిక నెట్లు భరించువాడ.

35


ఉ.

ఇంకిట మాట లేమిటికి నింతకు నా తనయాలలామ మే
ణాంకనిభాస్య యెందుఁబడి బొందెనొ యెంత గుందెనో
శంకరసత్కృపారసవశంబున గాంచినయట్టి యీనిరా
తంకునిఁ బంపి నామనసు తల్లడ మార్పఁగదే నృపాగ్రణీ.

36


వ.

అని యిట్లు పలుకుచున్న మునిపలుకుల కులికి నృపాలుం డాత్మ
గతంబున.

37


ఉ.

కానకగన్న వీని నెటుగాఁ గుటిలాసుర మీఁది కోటికిన్
గాననసీమ కంపు దటు గాక దురంతవిషాదవేదనా
ధీనత యీమహాత్మునకుఁ దీర్పక యేగతి నుండఁగాఁదగున్
దీనికి నెద్ది కార్యమని నివ్వెఱఁ గంద నతండు క్రమ్మఱన్.

38

ఉ.

మత్తవిరోధి వీరగుణమర్దనశాలి కపర్ది సత్కృపా
దత్తుఁ డనూనధైర్యనిధి తావకపుత్త్రుఁ డితండు నేఁడు చే
నెత్తురుగాక యుండ నతినిష్ఠురశాతకృపాణధారచే
దుత్తుమురాడి నచ్చు నల దుర్మదు నొండు దలంపకుండుమీ.

39


క.

కావున నీరాజన్యుని
నావెనుకం బనుపు మనుడు నరపతి ధరణీ
దేవుని యప్పని వేగమ
కావింపఁగవలసి సుతుని గనుఁగొని పలికెన్.

40


మ.

బలియుర్ మాయ లఘోరరాక్షసవరుల్ బాలుండ వీ వెన్నడున్
గలనన్ దైత్యులతోడఁ బోర వగజా కాంతుడు నీపాలికిం
గలఁ డచ్చండవిశంకటాసురుని వే ఖండించి మాదీవనన్
దలపూవాడక పోయిరమ్మిపుడు పుత్త్రా వీరవంశాగ్రణీ.

41


చ.

అనిన మహాప్రసాదమని యాత్మఁజెలంగి కుమారవర్యుఁ డ
జ్జనపతిపంపునన్ సకలసైన్యసమేతముగా హుటాహుటిన్
మునిపతి చూపు చొప్పున నముద్ధతమైఁ జని కాంచె ధాటికా
ఘనతరధూళిసంజనితకందరజాలము మంధశైలమున్.

42


క.

కనుఁగొని యజ్జననాథుఁడు
మునినాయక చూడు దూరమునఁ గనుపట్టెన్
వినువీథి బిట్టు రాయుచు
ననఘా యిదియే నగేంద్ర మన నతఁ డనియెన్.

43


ఉ.

అల్లది కంటివే నృపకులాగ్రణి మంధమహీధరంబు రా
గిల్లెఁ బ్రఫుల్లకింశుకవికీర్ణరుచి చ్ఛవి పిక్కటిల్ల నీ
యుల్లసితప్రతాపదహనోగ్రశిఖావళి తానుమున్న య
బ్బల్లిదుఁడైన రక్కసునిపై నెలగోలున వచ్చెనో యనన్.

44


ఉ.

విందును బోలె నో విమత వీరభయంకర రాజలోకసం
క్రందన నీవు రా నెదురురాఁ జనుదెంచె నిలింపకామినీ

బృందలతాంతకాంతకబరీభరసౌరభసారసన్నిభ
న్మందరకందరాసవిధమంధరబంధురగంధవాహముల్.

45


క.

ఇందుమణి మందిరాంగణ
మందారమరందమత్తమధుకరనినదా
నందమునఁ బొంది నగరా
ణ్ణందనయుం దానుఁ బ్రమథనాథుఁడు మెలఁగున్.

46


సీ.

వామదేవుని మౌళి వాడని క్కొవ్విరి
                       బూజగావించిన పుణ్యుఁ డితఁడు
సకలామరశ్రేణి సంప్రీతిఁ బొందంగ
                       దానమిచ్చిన మహాధర్మి యితఁడు
తులసిఁ గల్పించి మర్త్యులఁ బావనంబుగఁ
                       జేసిన యుపకారజీవి యితఁడు
(దేవర్షులకుఁ గామధేనువుఁ గలిగించి
                       తలఁపు లీడేర్చిన ధన్యుఁ డితఁడు)


గీ.

పాఁపతరి ద్రాటఁ ద్రచ్చునిర్బంధమునకు
నోర్చి త్రిప్పట నొందినయుత్తముండు
ఇతఁడు సర్వప్రదానైకహేతు వనుట
గలశవార్ధికిఁ గల్పనాగౌరవంబు.

47


చ.

అని కొనియాడి యాముని విహారమనోహర మైన యీనగేం
ద్రునికడ నేఁడు నిల్త మతిదూరముగాఁ జనుదెంచి సేన డ
స్సిన యది దైత్యుటెంకియును జేరువ యిచ్చటి కర్కమండలం
బును దనుజప్రతాపగతిఁ బోల్పరి వారిధి గ్రుంకం బాఱెడున్.

48


వ.

అని పలుకు నమ్మునిపలుకులు విని యప్పుడమిఱేఁడు పడవాళ్ళం
బిలిచి సేనల విడియ నియోగించె నప్పుడు.

49


సీ.

గగనపాదోల్లేఖగంధసింధురఘటా
                       ఘంటాఘణాత్కారకఠినరవము

తపనాశ్వసుఖకరధ్వజపటపల్లవ
                       స్థలితరథావక్రచక్రరవము
పవనపాణింధమప్రథితవేగవ్యగ్ర
                       సైంధవహేషాప్రచండరవము
కటితటాస్ఫాలనోద్భటవీరభటఖేట
                       కవ్రాతసంభూతగాఢరవము


గీ.

నెఱసి కకుబంతసీమలు నిండినపుడు
చెదరిపాఱెడు మృగములు నదరిచదల
కుఱుకు సింగంపుఁగొదమలు వెఱచిపఱచు
పక్షిజాతంబునై దైత్యభయద మయ్యె.

50


చ.

బెరసిన యమ్మహారవము పెల్లున కుల్లము దల్లడిల్లఁ ద
ద్పరిసరవర్తులైన వనపాలకదానవు లావిశంకటా
సురపతియున్న తద్బిలము సొచ్చి రయంబునఁ జేరఁబోయి యో
గురుభుజశాలి యోదనుజకుంజర నేఁ డొకక్రొత్త వింటివే.

51


ఉ.

 చివ్వకు నిన్ను మార్కొనగ జిష్ణునకైనఁ దరంబుగాదు వాఁ
డెవ్వఁడొకాని మమ్ము నొకయించుక యేని గణింప కెంతయుం
క్రొవ్వునఁ గన్నుగానక యకుంఠితదోర్బల ముల్లసిల్లఁగా
గవ్వపుఁగొండదండ మనకారడవిన్ విడియించె సేనలన్.

52


వ.

అనిన విని యద్దనుజుండు రౌద్రోదేకఘూర్ణమానమానసుండును
వికటఘటితభృకుటినటనభయదఫాలభాగుండును నక్షుద్రరా
గచ్ఛురితదుర్నిరీక్షుండును నగుచు ని ట్లనియె.

53


శా.

ఓరోరీ కలగంటివో భ్రమసితో యుగ్రాహవాటోపదు
ర్వారప్రక్రమమామకీనభుజగర్వం బెన్నరో కాక నా
పే రెవ్వారు నెఱుంగరో యకట నిర్భీతిన్ నరుం డెవ్వఁడేన
జేరన్వచ్చునె నన్ను బెబ్బులిపయిన్ జీంబోతు లంఘించునే.

54

ఉ.

మంచిది యందు కేమి యని మంత్రులమోములు చూచి నవ్వి న
క్తంచరభర్త యెల్లి మనదానవకోటికి భుక్తిగాఁగ మ
ట్టించెద వానిసేనలఁ గడింది మగంటిమిఁ గాళికావరో
దంచితలోహసైంధవఖురాగ్రములన్ లయకాలు కైవడిన్.

55


వ.

అనిన విని సచివనికరం బి ట్లనియె.

56


సీ.

కాకోదరస్వామి కంఠనాళంబులు
                       పుడుకుదుమే యొక్కపూటలోన
సుత్రాముఁ బట్టి యీడ్చుకవచ్చియిట వ్రేలఁ
                       గట్టింతుమే యొక్కగడియలోనఁ
గులమహీధ్రముల నుగ్గులుగాఁగఁ బిడికిళ్ళఁ
                       బొడుతుమే యొక్కింతతడవులోన
గూర్మాధిపునివెన్ను గులగులల్గాబిట్టు
                       మట్టుదుమే మాటమాత్రలోన


గీ.

ముజ్జగంబులు నొక్కట మొనసెనేని
మీఱి నీదాఁక రానిత్తు మేనిశాచ
రేంద్ర నీసత్యమొగిని నీ వెఱుగ వెందు
నిన్ను మార్కొని మర్త్యులే నిలుచువారు.

57


క.

అట్లు పలుకు మంత్రుల విశం
కటదనుజూధముఁడు చూచి ఘనులారా! మహో
ద్భటపరభటకోట్లన్ మ్రిం
గుటయుం ద్రుంచుటయు నేఁడు క్రొత్తలె మీకున్.

58


సీ.

కాల్వురలెక్క కగ్గలముగాఁ గొని యేగి
                       దీర్ఘాస్యుఁ డెలగోలు దివియువాఁడు
చటులప్రభంజనజవతురంగంబులఁ
                       బ్రేతజిహ్వుం డేర్పరించువాఁడు
కదిసి దట్టంబుగా గంధసింధురఘటల్
                       భీమకేతుఁడు నడపించువాఁడు

బిరుదధ్వజాంకితభీకరరథపంక్తి
                       ఘోరదంష్ట్రుఁడు పురికొల్పువాఁడు


గీ.

కపిలధూమ్రాక్షఘర్మరకామరూప
కుటిలబాహులు ముందరఁ గొలుచువారు
గాఁగ మిన్నును నేలయుఁ గ్రక్కతిలఁగ
గాటమై యెల్లివానిపైఁ గదలవలయు.

59


క.

అని నిశ్చయించి మంత్రుల
ననిచి వడిన్ లేచి కటము లదరఁగ నూర్పుల్
పెనఁగొన నిజసౌధమునకుఁ
జనియె నతం డచట నస్తసమయం బగుటన్.

60


క.

మెల్లన మెల్లన చీఁకటి
పిల్లలు చనుదెంచెఁ దొలుత బెదరి దిశలకున్
జెల్లాచెదరయి పోయిన
భల్లూకచయంబు వచ్చు పగిది ఘటింపన్.

61


క.

చరమగిరి సాంధ్యరాగ
స్ఫురితచ్ఛవి చూడఁ జూడఁ బొలుపేద నిశా
చరనాథరాజ్యలక్ష్మీ
గురుకుచపరిలిప్తమయిన కుంకుమభంగిన్.

62


మ.

జ్వలనజ్వాలిక లాత్మసన్నిహితశశ్వత్కాంతిసంరక్షకై
జలదుర్గస్థలి నిల్పి బర్విడిఁ దమస్సందోహముల్ వచ్చె నా
దళదాకీర్ణపరాగహల్లకనతాంతశ్రేణికాసీమలన్
బొలయున్ ఝుంకృతి సింహనాదవిచరత్పుష్పంధయవ్రాతముల్.

63


గీ.

అమ్మహాదైత్యు గెలుచుట కరుగుదెంచు
వీరుఁ డెవ్వాఁడొ యని చూచువేడ్కఁ బెక్కు
గన్ను లొక్కటఁ దాల్చెనో గగనలక్ష్మి
యనగ నల్గడఁ దారక లతిశయిల్లె.

64

గీ.

అపుడు సాయంతనార్హకృత్యములు నెఱపి
యేకతంబున్న ధాత్రీతలేంద్రుకడకు
నమ్మహామౌని యేతెంచి యవనినాథ
దనుజమాయల కొకవేరె యనువు వినుము.

65


క.

మాయాభేదిని యన భూ
నాయక యొకవిద్య గలదు నాయెడ వివిధో
పాయవిధానవిధి న్నేఁ
జేయుదు నుపదేశ మిష్టసిద్ధి ఘటింపన్.

66


గీ.

అని సలక్షణభంగి నమ్మునివరేణ్యు
డమ్మహావిద్య నుపదేశ మాచరింప
నియతిఁ గైకొని కౌతుకోన్నిద్రుఁ డగుచు
నవనినాథుఁడు సుఖసుప్తుఁ డయ్యె నంత.

67


సీ.

తొలఁగు నీరీతి దైత్యులమాయ లని చూపు
                       విధమునఁ జీఁకటి విచ్చివోయె
జరగు నీరీతి నిశాటఫాలాక్షర
                       పంక్తినాఁ దారకాపటలిఁ విరిసెఁ
దలకు నీగతి యాతుధానులప్రాణంబు
                       లను జాడఁ బొలసె మందానిలంబు
దరికొను నిబ్భంగి దైత్యులహృదయంబు
                       లను మాడ్కి నర్కోపలాలి మండె


గీ.

దనుజశుద్ధాంతకాంతావితానవక్ర
కాంతి యీపోల్కిఁ బొలియు నాఁ గమలవైరి
తనకళాస్ఫూర్తి యంతకంతకుఁ దొలంగె
వరుణ దిగ్విధి కడఁజేరి వాడఁబాఱె.

68


గీ.

సవిధకీర్ణపరాగాగ్ని సాక్షి గాఁగఁ
దమ్మివిందు కరగ్రహణ మ్మొనర్పఁ

బొలుచు పద్మినికిని నల్లపూసదండ
గట్టినాఁడన నెలదేఁటిగములు పొదలె.

69


శా.

ఆరీతిం దపనోదయంబగుడుఁ గాల్యక్రియ ల్దీర్చి మ
త్తారాతిద్విపయూధకేసరి యతం డాప్తప్రధానావళిన్
వే రావించి బలంబు లేర్పరుప వేర్వేర న్నియోగించి య
వ్వీరక్రూరనిశాటకోటితెరలన్ వ్రేయించె నిస్సాణమున్.

70


ఉ.

పెల్లగు నమ్మహారవము పేర్చి సరోజభవాండభాండముల్
చిల్లులు వోఁ బ్రచండగతి సేన ధరాస్థలి యీనెనో యనన్
వెల్లిగొనంగ నేర్పరిచి నిర్దయత న్నడిపించె నంత ను
ద్యల్లయకాలకాలసదృశార్భటిఁ బూర్వసుపర్వసైన్యముల్.

71


క.

తొల తొలఁగు తొలఁగు మనుచున్
నిలు నిలు నిలు మనుచుఁ గదిసి నిజసైనికులన్
బిలు పిలువు పిలువు మనుచున్
బలువిడిఁ జనుదెంచె లోకభయదం బగుచున్.

72


మ.

నలుదిక్కు ల్గబళించు నయ్యుభయసైన్యవ్యగ్రగర్జార్భటుల్
గలయబర్వం బునః పయోధిమథనోత్కంఠన్నిలింపాసురా
వలి బల్మిం బెకలింప వచ్చెననుచున్ వైశాఖశైలంబు బె
గ్గిలి కూపెట్టె ననంగఁ జొప్పడు గుహాగేహప్రతిధ్వానముల్.

73


వ.

అప్పు డయ్యిరువాగు నొండరులం దలకడచి పెలుచందల పడినయెడఁ
బొడమి దుమ్ము క్రమ్ముకొని సంజకెంజాయయనం జాలి మెఱయ
ఘాతుకదైతేయనికాయకాయచ్చాయలు కొదమ చీకటి కోమల
సం బొలయఁ గలయఁ బరస్పరఘటితపరశుపట్టిసముసలపరిఘా
విస్ఫులింగంబులు గగనాంగణంబునం గనుపట్టు నుడుగణంబులనం గ
డలుకొన భయంకరవిశంకటదనుజప్రతాపతపనుండు గ్రుంకిఁన
దోఁచు సాయంకాలంబు ననుకరించెఁ బటుపటహాభేరీఢక్కాఢమఢమ
ధ్వానంబులవలన మదకరటిపటలచటులఘీంకారంబులవలన

నఖర్వపవనజవసత్వనిర్వాపణధూర్వహమహితమహావాహ
వ్యూహదోహలహేషానినాదంబులవలన వికటదితిజవదనకుహర
ముహుర్ముహురుదితబహుళకహకహారవంబులవలనం గలను
విలయసమయసముదితసముజ్జృంభితంబగు నంభోధినిం బోలె నంత
కంతకుఁ బంతంబులు పలుకు దనుజులు మనుజులం జుట్టుముట్టి బలిమి
నలిమి యలిగి యలుగులతోడంగూడ మ్రింగిన గ్రుంకక తత్తన్మత్త
రక్షోవక్షుబు లక్షుద్రకౌక్షేయకముఖంబులం గ్రుచ్చి హెచ్చిన
మచ్చరంబునఁ బెచ్చు పెరిఁగి సమున్నిద్రు లగునుచు నగుచు సమున్నత
స్తంభంబులు వ్రక్కలించుకొని యుక్కున వెడలు నృసింహమూర్తు
లం బోలి యేతెంచు దుర్వారవీరవర్గంబులును దితిసుతులకాయంబు
లతినిశితశరపరంపరలు జొన్పి చించి చీకాకు చేసి డాసి పాశంబు
లం దునిమినఁ గనలి నయనంబుల యనలంబు గ్రక్కుచు గ్రక్కున
ముక్కుం జెమర లదర నదరి వడిం జనుదేర నేపున మూఁపు లెక్కింప
రాని తెగువం దిగిచి చేకత్తులఁ గుత్తుకలు తఱిగి తరగని బలంబుల
నొఱఁగఁద్రోచి చంగున నేనుంగులమీఁదికి లంఘించు నకించి
దంచితపరాక్రమాన్వితులగు మావంతులును నగుచుం బోరు
ఘోరం బయ్యె నయ్యవసరంబున.

74


సీ.

ఉప్పరం బెగసి వే కుప్పించి రథరథ్య
                       రథికులఁ దుమురు గా రాచివైచు
నురువడిఁ బఱతెంచి యిరుపక్కియలు దాఁకి
                       గంధసింధురకోటిఁ గనుపుకొట్టు
జెవులు ఱిక్కించి చూచి మునిగా ల్వడి నెత్తి
                       కొట్టుఁ దేజులఁ జాప కట్టు వడగ
వెనుకొనిరా నుద్ద విడిఁ జివుక్కునఁ దన్ను
                       దర్పితభటకోటి తలలు డుల్లఁ


గీ.

బ్రళయధారాధరస్ఫీతభయదనినద
కఠినహేషలు దిక్కుల గ్రమ్ముకొనఁగ

గలఁచి నృపసైన్యమెల్లఁ జీకాకు పడఁగ
జగతి కంపింప నాలోహసైంధవంబు.

75


మహాస్రగ్ధర.

వ్రచ్చున్ మత్తేభరాజిన్ బ్రకుపితమదహర్యక్షమై
ఘోరభంగిన్
గ్రొచ్చున్ రథ్యవ్రజంబున్ ఘుటఘుట రభటిన్ ఘోణియై పైపయిన్ గా
ర్చిచ్చై యేతెంచి యేర్చున్ జిటజిట మనుచున్ సేనలంగాన మాడ్కిన్
వచ్చుం గార్కొంచు గాఢధ్వని మొగులయితావాన పెన్వెల్లి నిండన్.

76


మ.

అపు డమ్మానవనాథపుత్త్రుఁడు తదీయవ్యగ్రరౌద్రాతిరే
కపరాభూతములైన సైన్యములఁ జక్కం జూచి యీవాజి యే
చి పటాపంచగఁ జేసి సైన్యముల గాసిం బెట్టెడున్ దీని నా
దు పటుక్రూరశరాహతిం దుము రొనర్తున్ దానవు ల్బెగ్గిలన్.

77


మ.

అని యూహించి తదీయసైంధవముపై నాగ్నేయబాణంబు వై
చినఁ దద్దేహము నీరుగాఁ గరఁచుటన్ జింతాకులస్వాంతుఁడై
దనుజుం డీతఁ డజేయుఁ డంచు నిజదోర్దర్పంబు చాలించి హె
చ్చినభీతిం బరువెత్తి తద్బిలము చొచ్చెన్ దివ్యు లుప్పొంగఁగన్.

78


ఉ.

చొచ్చినఁ బోకు పోకు మనుచున్ నృపకేసరి తేరు డిగ్గి
వెచ్చటి కేగినన్ విడుతునే పటుబాణపరంపరాహతిన్
బచ్చడి చేయువాఁడ నని ఫాలనటద్భృకుటీకరాళుఁ డై
యిచ్చ నొకించుకేనిఁ జలియింపక తద్బిలవీథిఁ దూఱఁగన్.

79


శా.

ఆలోమాయ ఘటించి యాదితిసుతుం డాభీలకాలానల
జ్వాలోదగ్రవిషంబు గ్రక్కుచు ఫణవ్యాకీర్ణరత్నప్రభల్
క్రాలం గ్రూరభుజంగమై యరుగుదేరం జూచి యమ్మాయ వే
వ్రీలం జేసె మునీంద్రసూచితమహావిద్యాప్రభావంబునన్.

80


ఉ.

సాహసికాగ్రగామి నృపసత్తముఁ డట్లు తదీయఘోరమా
యాహమికల్ హరింపుచు నిరంకుశవిక్రమకేళి చూప ను
త్సాహము దక్కి యాత్మపురి చక్కటి కేగఁగ నొక్కకాళికా
గేహము చొచ్చి యద్దనుజకీటము పాటిలు భీతిపెంపునన్.

81

ఉ.

కావుము కావు మోగిరీశకామిని యోజగదేకమాత నీ
లావున నింతకాలము హళాహళి వ్రేయుదు వైరికోటి నేఁ
డీవనసీమ చొచ్చి నను నించుకయేని గణింప కెవ్వఁడో
చేవ నెదిర్చి తుత్తుమురు చేసె మదీయనిశాటసైన్యమున్.

82


ఉ.

అంతటఁ బోక తావకవరాగతలోహతురంగమంబు నిం
తింతలు చేసివైచి తనయేడ్తెఱ చూపిన నిల్వలేక వి
భ్రాంతి వహించి నీచరణపద్మము చేరితి వాఁడె వచ్చెఁ గా
లాంతకుభంగి నాకు నభయంబు దగం గృపచేయు శాంభవీ.

83


క.

అని వాఁడు మఱువుసొచ్చిన
గనికర మొదవంగ భద్రకాళీశ్వరి యో
రినిశాట యోడ కోడకు
మని యూఱడిలంగఁ బలుకు నత్తఱిలోనన్.

84


ఉ.

వాలిన బాహుగర్వమున వానిపిఱుందన పోయి యమ్మహీ
పాలకనందనుండు గుడిబజ్జకునై చని యోరి నిన్ను మ
త్కాలభుజంగతీవ్రతరఖడ్గముచే బలియిత్తు నిమ్మహా
కాళి కురోజకుంభపరికల్పితరక్తకపాలపాళికిన్.

85


వ.

అనుచు నవ్వీరకంఠీరవంబు చనుదెంచిన.

86


సీ.

కొప్పుపై నొప్పెడు కొదమచంద్రునితోడఁ
                       గస్తూరికాతిలకంబుతోడ
సీమంతవిరచితసిందూరరుచితోడ
                       క్రొత్తముత్తియపుఁజేర్చుక్కతోడఁ
దళతళ మను దంతతాటంకములతోడ
                       రమణీయనాగహారములతోడ
గల్లు గల్లను రత్నకంకణంబులతోడఁ
                       జిలుఁగైన చెంగావివలువతోడ


గీ.

ముద్దుమోమున నవ్వుమొలకతోడఁ
జల్లచూపులఁ గరుణారసంబుతోడ

శాంతరూపంబు గైకొన్నశంభురాణి
యమ్మహాకాళి ప్రత్యక్ష మయ్యె నపుడు.

87


గీ.

అట్లు సాక్షాత్కరించిన యఖిలజనని
గాంచి విస్మయసమ్మదాక్రాంతుఁ డగుచు
మనుజనాథుండు సాష్టాంగవినతిఁ జేసి
వేచి కరములు మౌళి గీలించి నిలిపి.

88


దండకము.

జయ జయ జగదీశ్వరీ సంతతానశ్వరీ విశ్వదైశ్వర్యసంకల్పనా
కల్పవల్లీ కృపాఫుల్లమల్లీమతల్లీ కృతోల్లాసయోగీశహృచ్చంచరీకా
విపంచీ నినాదానుమోదా పదారాధనోద్భూతకౌతూహలాయత్త
జంభాసురారాతిశాతోదరీ ముఖ్యలేఖాంగనా మంటలాపుష్పవత్కుం
డలా కుండలి గ్రామణీ కంఠహారప్రియంభావుకా భావుకశ్రేణికా భావు
కాపాదనాయత్తచిత్తా మనోదృగ్విధాజ్ఞాతవృత్తా భవానీ భవానీతఖేద
ద్రుమూలచ్ఛటాచ్ఛేదినీ నిత్యసమ్మోదినీ నిగమవినుతశంభుకళ్యాణ
వేళాబలాలబ్ధశోణాక్షతభ్రాంతికృత్ఫాలనేత్రా సదాసచ్చరిత్రా
భవారాతికిం బ్రీతి కల్పించు నన్నాతియున్ నీవ కావే తమాలప్రభానీలవై
శోణమాణిక్యభాస్వత్కటీచేలవై నేత్రవద్బాలవై యీశునిల్లాల
వైయున్న యాగట్టురాచూలివి న్నీవ కావే సుధాహారవిశ్రాణనోదార
దర్వీకరావిర్భవద్రోహముద్రా సమున్నిద్రశోభాకరా కిన్కచేఁ దాఁకి
యుచ్చండదోర్జండపాండిత్యముల్ చూపి మొండొండ్డినన్ జండముండా
మరారాతులన్ వాతుల న్నెత్తురుల్ గ్రక్కవే త్రొక్కి ఖండించి తన్మస్త
ముల్ హస్తపద్మంబులం బూనవే వేనవేల్దానవు ల్తోడురాఁ బోరులం
బోరు తత్సైరిభాకారఘోరాసురుం బట్టి పెన్దిట్టవై మట్టి, లోకప్రసిద్ధం
బుగా వానిమూర్ధంబు నీపాదపీఠంబుగా నున్పవే నొంపవే బల్విడింగట్టి
శుంభు న్నిశుంభుం గరాంభోజశూలంబునన్ గ్రోలవే, రక్తబీజామర
ద్వేషి. క్రొన్నెత్తు రువ్వెత్తుగా దుర్గునిం ద్రుంచి దుర్గాభిధానంబునుం
జెందనే పొందవే లోకముల్ శాకసంపత్తిమైఁ బ్రోచి శాకంభరీనామ

విఖ్యాతి నోయమ్మ యావేదముల్ వాదముల్సేయ నీ వేదము ల్గాన కిచ్చో
ట నీపాదము ల్గంటి నేమంటి నావంటి పుణ్యుండు లేఁ డెచ్చటన్.

89


శా.

తల్లీ శాంభవి లోకపావని సముద్యద్భక్తితో నెవ్వఁడేన్
హృల్లేఖన్ భవదీయమంత్రకలనాహీనస్థితిం గాంచు నా
నిల్లాలై విహరించుఁ బంకజపుటీ హేలాగతు ల్మాని సం
పల్లీలావతి వానిభాగ్యము నిలింపస్వామికిం గల్గునే.

90


మ.

అని యమ్మానవనాథవర్యుఁడు తదీయాంఘ్రిద్వయం గ్రమ్మఱన్
వినతుల్ సేయ భవాని సత్కృప మది న్నిండార నోరాజనం
దన నీచండభుజాపరాక్రమకళాధైర్యంబు లే మెచ్చితిన్
గొను మే నిచ్చెద నొక్కదివ్యమణి నీకున్ వేడ్క సంధిల్లఁగన్.

91


గీ.

ఇమ్మహామణి తావకాభీప్సితముల
వలయువేళల సమకూర్చు వసుమతీశ
యమర వర్ణిత మిది యని యభవురాణి
యవనినాథున కొసఁగి యత్యాదరమున.

92


క.

జననాథ నాకుఁగా ని
ద్దనుజుని మన్నింపు మిపుడు తాపసపుత్త్రిన్
గొనివచ్చు నొక్కయోగిని
యని పల్కి యదృశ్యయయ్యె నంతటిలోనన్.

93


సీ.

అలికంబుపై రక్తతిలకంబు తెలిగన్నుఁ
                       గవయందుఁ గాటుక కర్ణపాశ
ములఁ బటికంపుగుండలములు గళమున
                       సంకుఁబూసలకంఠసరులు గుబ్బ
చనుదోయి వన్నెకుచ్చలిగంత దాపలి
                       గరమునందు విభూతి కక్షపాల
పాణిపద్మంబున మాణిక్యమయవీణ
                       పదయుగంబునఁ బైఁడిపాదుకలును

గీ.

నుదరబంధంబు లాతంబు యోగపట్టె
సిగినాదంబు బెత్తంబు చెన్ను మెఱయ
నుట్టిపడ్డట్టు యోగిని యోర్తు వచ్చి
లీల నారాజశేఖరుమ్రోల నిలచి.

94


ఉ.

రమ్ము నృపాల నీదగు పరాక్రమకేళికిఁ జాలమెచ్చి మా
యమ్మ భవాని సంయమికులాగ్రణి కూరిమిబిడ్డ నిచ్చిరా
పొమ్మన వచ్చితిన్ శిఖరిపుత్త్రిక సేవకురాల నాదు గే
హమ్మున నున్న యప్పడుచు నప్పనచేసెద నంచుఁ బల్కినన్.

95


క.

మనమునఁ బ్రియపడి యయ్యో
గిని పిఁఱుదం బోయి సరసకిసలయరేఖా
జనకరుచిపుంజమంజుల
కనకమయం బైన యొక యగారముఁ గనియెన్.

96


క.

కని చేరఁబోయి యోగిని
పడుపున నొకరత్నవేదిపైనుండి ఫలా
వనిజాత జాతగిరిజా
ప్రణుతి పరోదగ్రపతగభాషలు వినుచున్.

97


క.

అచ్చట సేదలుదీఱ వి
యచ్చర విభున కొసఁగె నపు డాతిథ్యము ల
త్యుచ్చయకౌతుకమున నట
నచ్చెరువుగ వచ్చి నిలిచె నమ్మునిసుతయున్.

98


క.

చక్కని యాబాలామణి
నక్కునఁ గోల్కొలిపి దీని నవనీశ్వర పే
రుక్కున విశంకటుం డీ
చక్కటిఁ గొనపోవఁ జూచి సదయహృదయనై.

99


గీ.

ఓడ కోడకు మనుచు నేఁ గూడ బోయి
వాని నదలించి యీమౌనివరుని కూర్మి

తనయఁ దోడ్కొనివచ్చి మత్సదనసీమ
నునిచితిని బాలఁ గొనిపొమ్ము మునికి నిమ్ము.

100


క.

అని పలికి రాజశేఖర
మనుజేశ్వర నేఁడు నాదు మందిరమునకున్
జనుదెంచితి గావున నే
ననఘంబగు నీ శుకంబు నర్పింతుఁ దగన్.

101


శా.

తూచాతప్పకయుండ నాగమకథాస్తోమంబులం జెప్పు వా
చాచాతుర్యము గానరా గతభవిష్యద్వర్తమానార్థముల్
సూచించుచున్ మది మెచ్చ నీ కుబుసు పుచ్చున్ నెచ్చెలింబోలి యీ
రాజిల్కం గయికొమ్ము పార్ధివకుమారా యంచు వర్ణించుచున్.

102


క.

శీతమయూఖకళాధర
శాతోదరి పంచినట్టి శాంబవి యొసఁగెన్
భూతలనాథకుమారుని
చేతికిఁ గరుణారసంబు చిలుకం జిలుకన్.

103


సీ.

ఇచ్చినకీరంబు ఋషిపుత్త్రియును దాను
                       వరయోగినీకాంత తెరువు చూప
బిలము వెల్వడి మౌనితిలకంబుఁ గనుఁగొని
                       సాష్టాంగవినతుల నాచరింప
నాశీర్వచఃప్రౌఢి నతఁడు సంభావించి
                       యానందబాష్పంబు లావహిల్ల
దనయాలలామ నక్కునఁ జేర్చి వాత్సల్య
                       వనధి నోలాడి యోమనుజనాథ


గీ.

యాత్మపురమున కీసేన ననిచి బదరి
కాశ్రమంబున కేతెంచి యచటి మాని
పతులఁ గనుఁగొని దీవనల్ పడసివత్తు
గాక యనవుడు సంభృతోత్కంఠుఁ డగుచు.

104

క.

జనకునకును జయలేఖల
ననిచి పురంబునకు సైనికావళిఁ బోవన్
బనిచి తపస్వియుఁ దానును
మనుజేంద్రుఁడు బదరికాశ్రమంబున కరిగెన్.

105


మ.

అతఁ డచ్చోటకిఁ బోయి కన్గొనియె భూజానేకశాఖాశిఖా
న్వితయౌ మౌనికరస్థముక్తితరుణీవేణీకలాపాకృతిన్
సతతావర్తితసప్తతంతుహుతభుక్సందోహనీరంధ్రని
ర్గతధూమోద్భటహృద్యగంధములు దిగ్భాగంబులం గ్రమ్మఁగన్.

106


సీ.

హెమధేనువ్రాత మొయ్యనట్టలు చాప
                       గొనగోళ్ళ దువ్వెడు క్రోలుపులులఁ
జిగురుదర్భలు గిల్లి మృగపోతముల కర్థి
                       నందంద యిచ్చు పంచాననముల
రాచిల్క బోదలఁ బ్రోచి ఱెక్కలనీడ
                       జల్లఁగా బొదివెడు సాళువముల
బర్హణనిలయంపుఁ బన్నగార్భకముల
                       కుగ్గులు వెట్టు మయూరములను


గీ.

దొండము ల్ముంచి కలఁగక యుండఁ దీర్థ
వారి దరినుండి క్రోలెడు వారణములఁ
జూచి యచ్చెరు వంది యస్తోకమౌని
వరతపశ్శక్తి మెచ్చుచు వచ్చు నపుడు.

107


గీ.

మునుల వెంబడి నవ్వార్త విని చెలంగి
భానుమతి తల్లి యెదురుగాఁ బాఱుతెంచి
కన్నుఁగొనలను హర్షాంబుకణము లొలికి
జాలుకొనఁ జెప్పెఁ బాలిండ్లు బాలు దొలఁక.

108


ఉ.

ఎత్తి కవుంగిలించి యొకయించుక సేపతి గాఢకౌతుకా
యతతం తన్నుఁదా మరచి యంగలతన్ బులకాంకురాళి పె


.

ల్లొత్తఁగ మాటిమాటికీఁ బయోధరపాళిక నప్పళింపుచున్
దత్తమణీలలామ నిజనందనమై నిమిరెం గరంబునన్.

109


గీ.

అట్లు సమ్మదవిస్మయాయత్త యగుచు
మనుజనాథుని దీవించి మగనిఁ జూచి
యీశుభాకార యీబాల యీసుశీల
మగుడ జన్మించిన ట్లయ్యె మనకు నేఁడు.

110


వ.

అనుచు నప్పరమసాధ్వి పలుకునప్పుడు మునిపత్నులు దమలోన.

111


సీ.

కనకావనీధరకార్ముకవరలబ్ధుఁ
                       డను పెంపుగాంచిన యతఁ డితండు
మునితపష్షష్టాంశమునకుఁ బాత్రుఁడు నాగ
                       నవనియంతయు నేలు నతఁ డితండు
అఖిలకంటకుఁడైన యలవిశంకటదైత్యు
                       నదటు పోకార్చిన యతఁ డితండు
పులినోరి కండయై పోయిన మనభాను
                       మతిఁ గ్రమ్మరించిన యతఁ డితండు


గీ.

చూడ రమ్ము మనోహరశుభచరితుని
భువననయనచకోరికాపూర్ణచంద్రు
సజ్జనావనదాక్షిణ్యజన్మభూమి
యనుచుఁ బొగడుచు దీవింప నాదరమున.

112


గీ.

వచ్చి యచ్చటిమునులకు వందనంబు
లాచరించి నృపాలకుం డాతిథేయ
సత్కృతులు గాంచి యారాత్రి జరపి కాల్య
కృత్యములు దీర్చి మఱునాఁడు ప్రియము దొలఁక.

113


ఉ.

మందరగోత్రధీరుఁ డసమానయశోనిధి రాజలోకసం
క్రందనుఁ డమ్మహామునినికాయము వీడ్కొని వచ్చిత్రోవ మ
ధ్యందినవేళ యైన నతిదాహముచే రథరథ్యపంక్తి దూ
లో దనసారథిం గని జలంధరశౌర్యకళాదురంధరా.

114

ఉ.

వచ్చె ననేకదూరము జవంబునఁ దేజులు చాలడస్సె నీ
విచ్చటి కాననాంతరమహీస్థలి యారసి నీరు చూపి లేఁ
బచ్చిక మేపు మిక్కనకపంజరకీరము నిప్డు మిక్కిలి
న్నొచ్చిన దీపథశ్రమము నూత్నఫలావళిఁ దీర్పఁగాఁ దగున్.

115


గీ.

మరుని బాహుప్రతాపవిస్ఫురణఁ గెరలి
హరుని గెలిచెద నని పోవు కరణి విహర
మాణవిహగగరుజ్జాతమారుతముల
మింటి కెగయుపరాగంబుఁ గంటె యెదుట.

116


ఉ.

చూచితివే యినప్రభలు సోఁకని మంజునికుంజపుంజముల్
చూచితివే ఫలావళులజొంపములైన రసాలసాలముల్
చూచితివే విధూతఫలశుద్ధవితర్దిక లల్ల పుష్పనా
రాచవిహారసౌధమనఁ గాదగు కానన మింత యొప్పునే.

117


క.

తరుణపవమానమదకే
సరిపోతము విటపికుంజసామజకుభాం
తరములు గ్రొవ్వినఁ దొరిఁగెడు
గురుమౌక్తికభాతి రాలెఁ గ్రొవ్విరు లవిగో.

118


వ.

అని వర్ణింపుచు.

119


లయగ్రాహి.

భూరి సహకారఫలసారములు గ్రొచ్చి కడు
                       పారఁ దిని యాముకొని మారుని హయంబుల్
సారెఁ బథికు ల్బెదరఁ గోరుచు దిశ ల్గలయఁ
                       బేఱెములు వాఱుచు నుదారగతి నాడన్
సారసమరందరసపూరములు గ్రోలి ప్రతి
                       వార మనివార మని వారణ నటింపన్
భూరమణశేఖరకుమారుఁ డనురాగమునం
                       దేరు డిగి యవ్వనము జేరఁ జని క్రేవన్.

120

క.

వలమానమత్తమధుకర
కలహంస క్రౌంచ బకనికాయ గరుత్మ
త్కుల కలకలరవములఁ గొల
కొల మనియెను నొక్క నిండుకొలఁకుం గనియెన్.

121


గీ.

గాంచి యవగాహనము చేసి కనకపంజ
రాంతకీరంబుఁ దివిచి నీ రార్చి తెచ్చి
చాల డస్సితిగా పథశ్రాంతి ననుచు
నృపతి కరమున నెమ్మేను నిమిరి నిమిరి.

122


క.

ఱెక్కల తడి వోనార్చుచు
నక్కునఁ గీల్కొలిపి ముద్దు లాడుచు మది పెం
పెక్కిన వేడుక నందలి
చక్కని హిమవారి చల్లి చల్లనినీడన్.

123


క.

విప్పుగల విధు శిలాస్థలి
జిప్పిలి మకరందరసము చిలికెడు పువ్వుం
జప్పరము క్రింద వైచిన
కప్పురపుందిన్నెపై సుఖస్థితుఁ డగుచున్.

124


క.

భూదయితుఁ డప్పు డశనా
యాదశ జగదేకమాత యభవుని యిల్లా
లాదిమయోగిని యొసంగిన
యాదివ్యమణిం దలంచు నంతటిలోనన్.

125


సీ.

కలికి బేడిస కూటు వలఁ దోలు జిగిగల
                       కన్నుఁగవలఁ గాటుకలు ధరించి
కొదమ తుమ్మెద యొప్పు నదలింపఁగల కప్పు
                       గులుకు పెన్నిరికొప్పు లలవరించి
జక్కవ కవఁగేరఁ జాలిన కుచకోర
                       కముల ముక్తాహారసమితి దాల్చి

క్రొమ్మించు పసగ్రమ్ము కొనఁగెలుకులజిమ్ము
                       పసనిరత్నపుసొమ్ము పరిఢవించి


గీ.

యరుణకంజాతకర్ణికాంతరము వెడలి
వచ్చు తుమ్మెదలేమల వడువుదోఁప
మానినీమణి యుగ్మ మమ్మణి జనించి
నృపతి వెఱఁగంద ముందట నిలిచె మఱియు.

126


మ.

 కలమాన్నంబు ఘృతంబుఁ బాయసము శాకవ్రాతముల్ పిండివం
టలు పాల్దేనియ జున్ను వెన్న యిడి యానా లుక్కెరల్ చక్కెరల్
ఫలముల్ పానకముల్ రసాయనము లంబళ్ళూరుఁ బిండ్లూరుఁగా
యలు బజ్జుల్ దధిపిండఖండములు నం దావిర్భవించెం దగన్.

127


క.

అంతటఁ బసిండి యటికల
దొంతులు గావించి యోవధూమకరాంకా
సంతతవితరణరేఖా
చింతామణి యింత తడవు సేయుదె యనుచున్.

128


క.

హల్లకగంధులు మృదుకర
పల్లవముల వెలచి పసిఁడిపళ్ళెరముల ను
ద్యల్లీలఁ బెట్టిరి మహీ
వల్లభునకుఁ జులుక రాచవారికి నచటన్.

129


ఉ.

సంచితబాహుమూలరుచిసంపద పొంపిరివోఁ గెలంకులన్
గుంచె యొకర్తు వైవ నొకకోమలపల్లవపాణి లీల వ
డ్డించె నృపాలమాళికిఁ గటీతటహాటకమేఖలాసమ
భ్యంచితకింకిణీరవము నందియమ్రోతలు సందడింపగన్.

130


గీ.

తనదు మధూరాధరముఁ బోలఁ దలఁచు ననుచు
సరసకదళీఫలంబుల చర్మమెత్తు
నోజ వాలారునఖముల నొలిచి యొలిచి
రాజకీరంబునకుఁ బెట్టె రాజవదన.

131

గీ.

రసి రసాన్నము లీరీతి రత్నపుత్త్రి
యర్పణము చేయ వేడుక నారగించి
రాజు రాజీయ రాజకీరమును దృప్తిఁ
బొంది వసియింప నంత నద్భుతముతోఁప.

132


గీ.

సతులు భాండాదివస్తుసంతతులు మగుడఁ
దాల్ప లోఁగొని కాళికాదత్తదివ్య
రత్న మేపారె నారాజరత్న మెదుట
విశ్వరూపంబుఁ జూపిన విష్ణుఁ డనఁగ.

133


క.

అమ్మణిప్రభావమునకున్
సమ్మదమునఁ బొంది రాజచంద్రుఁడు మాళిం
గ్రమ్మఱఁ దాల్చి విభాకర
సమ్మిళితప్రథమశైలసమత వహించెన్.

134


గీ.

అపుడు కీరకులస్వామి ననుచరించి
వితతఫలముల చవులు చూచితివె తనియ
సకలభాషావిశేషవిజ్ఞానచతుర
యింత యొప్పిదమయ్యెనే యీదినంబు.

135


శా.

కాళీదైవతదత్తరత్నమహిమల్ గంటే వధూరూపరే
ఖాలాలిత్యము చెప్పఁ గ్రొత్త బహుశాకద్రవ్యసంభారధా
రాళస్వచ్ఛసుధారసోన్నతి యనిర్వాచ్యంబు కస్తూరికా
కాలాగర్వసులేపసౌరభము లాఘ్రాణింప నిం తొప్పునే.

136


క.

మతిఁదలఁపఁ జోద్య మిది యో
పతగకులత్తంస యనుచుఁ బలికినఁ బ్రీతిన్
జతురాగమార్థసంగ్రహ
చతురుఁడు శుకలోకపాకశాసనుఁ డనియెన్.

137


శా.

ఓరామామకరాంక యోరిపుజయోద్యోగాతి నిశ్శంక నీ
యారూఢోన్నతి నీకుఁ గానఁబడ దాహా రాజమాత్రుండవే

మారారాతి వరప్రసాదగుణసంపన్నుండ వట్లౌటచే
గారాపు న్సుతునట్లు ప్రోవఁదగవే కాళీమహాదేవికిన్.

138


చ.

అనఘచరిత యీమణి యనర్ఘ్య మొకానొకనాఁడు పార్వతీ
వనరుహపత్రనేత్ర నెరవాదితనంబున జూదమాడి గె
ల్చిన మదిఁ గౌతుకం బొదవ శీతమయూఖకళావతంసుఁ డ
వ్వనితకు నిచ్చె నీకు నతివత్సలతన్ గృపజేసెఁ గాళియున్.

139


క.

జననాథచంద్ర యీమణి
యనిమిషలోకైకవంద్య మనఘము మును నీ
కొనరించిన సుకృతఫలం
బునఁ గలిగెంగాక కలదె పురుహూతునకున్.

140


క.

అని పలుకు చిలుకపలుకుల
కనురాగరసాబ్ధి నోలలాడుచుఁ గేళీ
వని నిట్లు ప్రొద్దు పుచ్చెన్
జనపతి యయ్యెడ వసంతసమయం బగుటన్.

141


ఉ.

చిత్తజమూర్తి భవ్యగుణసింధువు సింధుఁడనంగ నొప్పె భూ
భృత్తిలకంబు పుత్త్రిక శరీరకళావిభవాభిభూతవి
ద్యుత్తతియైన కాంతిమతి యుత్సవనీయవనీవిహారసౌ
ఖ్యాత్తమతిన్ సఖీజనసహస్రము గొల్వఁగ వచ్చియచ్చటన్.

142


సీ.

ఈవల్లి బెల్లియై యీవల్లి పూఁబోడి
                       కీవల్లివిరు వెలయించుఁ దరుణి
లేమావిచిగురాకు లేమావివే యింక
                       లేమా విజృంభిపలేరు నీకుఁ
గురువిందమొలనూలు గురువిందలవె చూడు
                       గురువిందగతి నొప్పఁ గోయవలయు
వట్టివేరునకుఁ గే ల్వట్టవే రుచిరాంగి
                       వట్టివేరుగఁ జేయవలదు నన్ను

గీ.

నన్ను నెవ్వతె కందుకో నలవిగాదు
గా దురాశలెగాని యక్కాంచనాలి
నాలితనములు మానవే నాతి యేల
యేలవాడుదు చూడుమా యేలలీల.

143


చ.

కిసలయపాణిలేఁతనునుగెంజిగురాకు మెఱుంగు మోవికిన్
గిసరు దొలగి పోవలసి కేళి వనాంతరలక్ష్మిబోటియై
మసిఁ జిటిబొట్టు పెట్టె ననుమాడ్కి దదానన వాససంపదన్
భసల కిశోరకంబు గనుపట్టెడు నల్లదె పల్లవాధరా.

144


గీ.

అబల చూడు శివద్రోహి యనుచుఁ గెరలి
యతనికంకణశేషాహి యావహించి
నాలికలు గోయు పగిది వనాలి చరిత
లాలి తైలాలతాగ్రపల్లవము లమరె.

145


చ.

కలితకపోలకాంతికళికల్ దళుకొత్త నొకర్తు తీఁగె యు
య్యల వడి నాడువేళఁ జరణాంబుజనిర్మితలాక్ష సోఁకి త
త్తలమహిజాతపల్లవవితానము మించె మదీయసౌమ్యమున్
దలఁపకు మంచుఁ దత్పదము తన్నిన నెత్తురు గ్రక్కునో యనన్.

146


చ.

తెఱవయొకర్తుతోడి సఖి తేటకనుంగవ చూపు డాలు గ్రి
క్కిరిసిన గ్రొవ్విరిం దొలుత నించిన వేడుకఁ గోసి తాన క్ర
మ్మఱ నొకసంచరద్భ్రమరమంజరి నల్లనఁ జూచి కోయఁ గే
ల్గఱచిన మిట్టి పడ్డఁ జెలికత్తెలు నవ్విరి చిన్నపోవగన్.

147


ఉ.

ప్రోడయొకర్తు పువ్వుబొదఁ జొచ్చి సుధారస ముప్పతిల్ల మా
టాడినఁ దోడనాడు శుక మంచుఁ దటుక్కునఁ జేతఁబట్టి ము
ద్దాడుచు నున్నదల్లదె నిజాధరబింబమునే తదాస్యమున్
జూడుఁడు వానిఁ దేర్పుఁ డని చూపుచు నుండు తెఱంగు దోఁపఁగన్.

148


రగడ.

పట్టు పట్టు మని పడఁతుక చంగన
నెట్టు దాటెనే యిది పెలుచనంగ

నలిపి వైవకే నవకలికావలి
యలినీలాలక యది మా కావలి
పొదఁ బిక మున్నది వో మున్నాడకు
నది బెదరించిన నటు నన్నాడకు
పొగడ బ్రాఁతియే పోనే లేవడి
నిగురుబోఁడి కౌ నెంతయు లేవడి
చిలుకుఁ దేనియలఁ జీరకు నేలకు
నలవిగాదది దురాశల నేలకు
మలరు దండకై హారము నమ్మకు
కలికి యీడు సూ కల్లరి నమ్మకు
అందని విరులకు నాఱడిఁ బాఱకు
విందు రమ్మనిన వీడం బాఱకు
పఱపగు మొగ్గలఁ బదముల కూనకు
మెఱుపగు దండకె యీలత కూనకు
ఎలమొగ్గలకై యెక్కకు తీవల
చెలి యున్నది విరిచేమంతీవల
నింతి వల్లికై యింతటి మానిసి
యింత చేసెఁ బో నిత్తఱి మానిసి
పువ్వుల గొలగొని పొలఁతుక చివ్వకు
మెవ్వ రేగిరే యిప్పుడు చివ్వకు
తప్పదు మొదలనె తగవనువారము
చెప్పిన నిదిగో చెలి పగవారము
బాల చేత నీఫలములు రాలవు
కూలఁగ ద్రోచుట కొఱకై రాలవు
తలిరుబోఁడి నీతలఁపునఁ గన్నెర
వలదు తేనెలకు వంచకు గన్నర
సాదులేమతో జవ్వని వావిరి
వాదులేల యీ వనిఁ గఱవావిరి

పొలయ వేసితే పువ్వులవాటులు
నెలఁత మెచ్చితవి నీ కలవాటులు
గేలిచేసె నీగేదఁగి క్రొవ్విరి
బాల చీరె కాపడతులు క్రొవ్విరి
యిగురు బంతికై యీనవ లాకట
జగడ మాడెనే సతి మేలాకట
తేఁటి దాఁటు జిగి తేరెడు వేనలి
యేటికి ముడిచెద వే యిట వేనలి
విరులు చాలునా వేసర నేటికి
మరలి రారుగా మగువలు నేటికి
నని తమ తమలో నతివలు గెరలుచు
నునుబలుకుల చే నున్నతిఁ గెరలుచు.

149


క.

చెలులార చూడుఁ డిదిగో
జలకేళికి మనలఁ గూర్చి సరసులు పనుపన్
చలిగాలి కాముకాలరి
కలితాంభోజాతపత్రి కలుగొని వచ్చెన్.

150


క.

రా రండు రండు సలిలవి
హారమునకుఁ బోదమని లతాంగులు మిహికా
సారము నెనసెడు మిహికా
సారముఁ జేరంగఁ జనిరి సారస్యమునన్.

151


సీ.

వనజవాసకుఁ దండ్రి పనిచిన ముత్యంపు
                       సరము చాడ్పున నంచ చాలు మెఱయ
జలదేవతాపుత్త్రికలు దాల్ప నిచ్చిన
                       గిలుకలక్రియను జెందొవలు దనరఁ
గాసారపతి భుజాంగదవజ్రదీప్తుల
                       సరణి నూర్ముల బేడిసలు నటింప
సమధికసౌరభ్యసంపదఁ గాపాడు
                       సారెకు లనఁగ భృంగాళి దిరుగ

గీ.

బత్త్రఫలపుష్పకిసలయభాగ్యరేఖ
నిండి పొంపిరివోవుచు నీడ చూచు
పగిదిఁ దీరతరుశ్రేణి ప్రతిఫలింప
బొలఁతుకలు చూచి తమలోనఁ బొగడి పొగడి.

152


క.

ఎలదీవలపైఁ గలయం
గలసిన చంద్రాతపంబు పోలిక జిలుఁగున్
వలువలు గట్టిరి పట్టిరి
పొలఁతులు నెలవంక పసిఁడిబుఱ్ఱటకొమ్ముల్.

153


వ.

అటుల జలకేళీసన్నాహంబునఁ గన్నియలు పోయి సరోవరావగా
హంబు గావించి.

154


ఉ.

చిల్లులు చిల్కులం జిలికి చిల్కలకొల్కులు చల్లులాడ స
పల్లలితాంగి చూచి కడు పైకొనువేడుక వారిపూరముల్
చల్లెఁ దదంగనాంగలతలన్ నినుపార ననంగ నప్పు డు
త్ఫుల్లపయోరుహాంతరమ ధూళిఁ జివుక్కునఁ జిమ్మెఁ దెమ్మెరల్.

155


క.

లలనాసౌభాగ్యము గని
జలదేవత లళినినాదసన్నుతు లెసఁగన్
దలలూఁచినగతిఁ బంకజ
ములు యాతాయాతపాతముల నటియించెన్.

156


గీ.

పదువు రొక్కటియై యొక్కపడఁతిఁ దఱుమ
నిలువుటీఁతలఁ బో దాని నీలవేణి
తోఁచె హిమరోచి పెక్కుమూర్తులు ధరించి
రాఁదలంకుచుఁ బాఱెడి రాహు ననఁగ.

157


క.

పడఁతుల కన్నులఁ గనుఁగొని
యడియాసలఁ బోవుఁ దల్లు లని శఫరంబుల్
నిడుదలొ యటువలె నవి కడు
వెడఁదలొ జడమతుల కావివేకము గలదే.

158

క.

ఎఱిగింపకున్న సతులని
తెలియంగా రాదు నాచుదీఁగెలు జడలున్
జలరుహములు మొగములు నళి
కలభంబులఁ జూపు చాలుఁ గత్తరఁ గలియన్.

159


మత్తకోకిల.

ఓల వెట్టుచుఁ దోలి పెట్టుచు నొండొరుల్ గనుబ్రామి పూ
ధూళిఁ గప్పుచుఁ గేలు ద్రిప్పుచు దొడ్డక్రొవ్విరిబంతులన్
వాలి రువ్వుచు లీల నవ్వుచు వారివారికి వారిలో
గేలి దేలుచుఁ జాలఁ బ్రేలుచుఁ గేకసల్ వడిఁ గొట్టుచున్.

160


మ.

తరుణీవక్త్రవిశేషసౌరభము లుద్యల్లీలతోఁ గ్రోలి వా
ని రుచిం బోలమి రోతఁ పుట్టి యట వాంతిం జేసెనాఁ జూచితే
చిరదిందిందిరమర్యమాంశుపటలీసంతప్తపంకేరుహాం
తరసంజాతమధూళి ముక్కుచురు కన్నన్ వెళ్ళఁగ్రాసెం జెలీ.

161


ఉ.

చంచలనేత్ర యీకలికి జాడలు ప్రోడలయందుఁ గాన మొ
క్కించుక గానలేక మొగ మెత్తి కనుంగవ నవ్వుదేర రో
మాంచసమంచితాంగ యయి యల్లదె కన్గొనఁజాల దొక్కరా
యంచ యహా వెసం దనకులాంగన చెంగట రెక్కలార్పఁగన్.

162


గీ.

అని వినోదంబులాడుచు నబ్జముఖులు
గరఁగిపోయిన పూఁతలఁ గన్నుఁగొనల
బెరయు కెంపులఁ దత్సరోవరసమగ్ర
రతి విహారవిరామసంగతుల మెఱసి.

163


ఉ.

గట్టున కేగుదెంచి తొలుకారుమెఱుంగులఁ బోలు నంగనల్
గట్టిరి చంద్రకావు లెసఁగన్ దనువల్లు లిగెర్చెనో యనన్
బెట్టిరి రత్నహారములు పేశలకాంతిగుళుచ్ఛవైఖరిన్
బట్టిరి కేలి పద్మములు పంకజసద్మకు నీడుజో డనన్.

164

క.

జలదుర్గస్థలి హరిమ
ధ్యలు గొని తమయంగబలము నందుంచి రనన్
కలఁకందొఱంగి యెప్పటి
వలెఁ జక్రసరోజశఫరపంక్తులు వెలసెన్.

165


క.

అలకాళి ముఖాబ్జప్రతి
ఫలనావరణాదికాంతిపటలంబులు ద
ల్లలనాసంగతిఁ బాయక కొలఁ
కులు వెనువెంట వచ్చుకొమరు ఘటించెన్.

166


క.

కంజముఖు లపుడు వనమద
కుంజరము లనంగ నెఱసి కొలకొల రాఁ ద
న్మంజీరపుంజమంజుల
సంజాతరవంబు చెవులచవులు ఘటింపన్.

167


క.

చూత మది యేమి కొత్తయొ
కో తా మిట యువతిసమితికోలాహముల్
తోతెంచె నంచు భూపతి
చూతలతాగృహము వెడలి చూడం జూడన్.

168


సీ.

అడుగుదామరదోయిఁ దొడివిన బంగారు
                       రవలపావలముద్దురవము గులుకఁ
గొనబుగా నెఱిగిఁ గట్టిన క్రొత్తచెంగావి
                       చేలపయ్యెదకొంగు తూలియాడ
నతనుగద్దియయుద్ది యనఁ గాంచు పిఱుఁదు చెం
                       గటఁ గాంచికాదామకంబు మెఱయఁ
గలికి జక్కవపిట్టకవ బిట్టువాలించు
                       గురుకుచంబుల సరుల్ గునిసియాడ


గీ.

దంతకురువిందకాంతి బిత్తరము చిమ్మ
సరససల్లాపగోష్టి నచ్చపలనయన

యల్ల నల్లన రాఁ జూచె నవనివిభుఁడు
వేడ్క మున్నీరు పెల్లుబ్బి వెల్లి కొనఁగ.

169


శా.

ఆపుంస్కోకిలవాణి యాజలధికన్యారత్నసౌందర్యరే
ఖాపాణింధమమూర్తి యాత్రిజగతీకాంతావతంసంబు కే
లీపద్మాకరవాంఛ దీఱ దనఁగా లీలావతిన్ నిద్దపున్
జూపున్ గెల్వ వసంత మాడె మహీభృచ్చూడావతంసంబుపైన్.

170


ఉ.

మచ్చరికించి మారుఁడు కుమారుని బాణవిశేషవిద్యలన్
మెచ్చక బాహుగర్వమున మించి సమంచితచాతురీగతిన్
గుచ్చుకపాఱనేసెఁ బువుగోలఁ గుభృత్తిలకంబు నట్టిచం
చచ్చపలాంగి నొక్కమొగి శంబరవైరి నుతింపఁ జెల్లదే.

171


ఉ.

అక్కలకంఠి నప్పుడు వయస్యలు గన్గొని యెంతవెఱ్ఱివే
యక్కట నీ వొకానొకధరాధిపనందనుఁ గాఁ దలంచి పెం
పెక్కిన కూర్మిఁ జూడ కొరుఁ డెవ్వఁడు నేఁ డిట కేల వచ్చు న
మ్మక్క వనీవిహారమునకై చనుదెంచిన పంచబాణుఁడే.

172


క.

అని పలికి చెలువచూ పొక
యనువున మరలించి మగిడి రప్పుడు విభుఁడున్
మనమునఁ బెనఁగొను మమతన్
జనియెను శుక మున్న పువ్వుజప్పరమునకున్.

173


శా.

ఆహా నే డొకక్రొత్త వింటె శుకలోకాధ్యక్ష యే నీలతా
గేహం బింతకుమున్నుగా వెడలి వీక్షింపన్ మనోజాశుగ
వ్యూహప్రక్రియఁ జూపుచాలడర విద్యుద్వల్లరీపంక్తితో
బాహాబాహిఁ బెనంగు మేని జిగి జొంపం బింపు గల్పింపఁగన్.

174


ఉ.

పుత్తడిబొమ్మయో చిలుకబోదయొ కెంజిగురాకుగుత్తియో
ముత్తెపుగోవయో మదనమోహనబాణమొ నావనీవిహా
రాత్తమతిన్ సఖీజనసహస్రము గొల్వగ వచ్చిపోయె నేఁ
డిత్తఱి నొక్కబిత్తరి యహీనవచోరచనావిశారదా.

175

ఉ.

ప్రన్ననిపాదముల్ చిలుకవారినఁ గందెడుమేనుదీఁగెయున్
వెన్నెలవాఱు నెమ్ముగము నిద్దపుముద్దుమెఱుంగుఁజెక్కులున్
గ్రొన్నెలవంటి నెన్నుదురుఁ గోమలబాహుమృణాలయుగ్మమున్
గన్నుల గట్టినట్లు పొడగానఁగనయ్యెడు నాకు నెచ్చెలీ.

176


గీ.

అల్లనల్లన సతి నడయాడెనేని
గలికిపలుకులవాల్గంటి పలికెనేని
యంచలంచల వచ్చు రాయంచ కదుపు
కూడ నేతెంచుఁ గీరంపుఁగొదమపదుపు.

177


శా.

కేలం దామరక్రొవ్విరిన్ బిరబిరన్ గేలీగతిం ద్రిప్పుచున్
వాలారం గొనగోళ్ళ ఘర్మకణికావ్రాతంబు పోమీటుచున్
గ్రాలుంగన్నుల ముద్దులేనగ విగుర్పన్ ఱెప్ప లల్లార్ప క
వ్వాలుంగంటి ననుం గనుంగొనిన భావం బెన్నఁడుం బాయునే.

178


క.

ఆమగువ మోముతోడను
నేమిటనో హెచ్చిరిల్లి హిమకరుఁ డొకనాఁ
డేమో పోలునఁట యిఁకం
దామర తాఁ బోలుదు నన దైవము నగదే.

179


గీ.

సవిధతరుజాలపుష్పగుచ్ఛములఁ జూచి
యువిద చనుదోయి రోసి పై నుమిసె ననఁగ
ధగధగాయితనిర్మలతారహార
వల్లికాకాంతిపుంజంబు పెల్లుడాసె.

180


క.

నునుగాలి సోఁకినంతనె
తునిఁగెడు నెన్నడుము చేసి తోరపుఁజన్నుల్
వనజభవుఁ డిట్లు సేయునె
కనికర మొకయింతయేనిఁ గలుగుదు సుమ్మీ.

181


క.

పొలసినయంతటిలో నా
తలఁపుం బూదేనె యాసుదతి చెలి చూపన్

వలికరువలి కొనిపోయెను
నెలకొను తమకమున నెట్లు నిలుతుం జెపుమా.

182


క.

శుకకులపంకజసంభవ
సకలపురాణేతిహాసచాతుర్యకళా
ప్రకటనకుతుకాపాదిని
త్రికాలవేదివి భవన్మతికి నెన గలదే.

183


క.

వలరాయనిదేవియొకో
పలుకుందొయ్యలియొ కాక బలరిపుసతియో
జలకేళి కిపుడు వచ్చిన
యలికుంతల తెఱఁగు చెప్పుమని యడుగుటయున్.

184


శా.

స్రష్ట్రత్యుల్బణబుద్ధివైభవసమస్తద్వీపవిన్యస్తరా
జ్యోష్ట్రప్రాపితభాగధేయు ధనశౌర్యోదగ్రజన్యాగ్రసు
ద్రష్టాయోదపురస్సరఃకమదుగ్ధాపత్యదైత్యద్విష
ద్రష్ట్రాస్థాపితవైరివీర త్రిజగద్రాజద్యశోమండలా.

185


క.

సాగరకన్యాచంక్రమ
ణాగతపాదారవిందయావకశుభదృ
గ్రాగసలక్షణలక్షిత
భాగవతవిధేయ దానపద రాధేయా

186


సుగంధి.

పారదప్రభావిభాసి భవ్యకీర్తివాహినీ
పూర దానదూత దివ్యభూజరత్నకామధు
గ్వార యాఱువేలవంశవార్ధిపూర్ణచంద్రమా
సారబుద్ధిజాలనీతశత్రుభూమి భృధ్రమా.

187

గద్య
ఇది శ్రీమదఘోరశివాచార్యగురుకరుణావిశేషలబ్ధసారస్వత
మాదయామాత్యపుత్ర మల్లయనామధేయప్రణీతం
బయిన రాజశేఖరచరిత్రంబను
మహాప్రబంధంబునందు
ద్వితీయాశ్వాసము