Jump to content

రాజశేఖరచరిత్రము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

రాజశేఖరచరిత్రము

(మాదయగారి మల్లన్న ప్రణీతము)

తృతీయాశ్వాసము

క.

శ్రీచక్రచారుకుచయుగ
సూచకగాఢోపగూహసూచితపులక
ప్రాచుర్యతత్త్వతత్పర
యాచకసంస్తుత్య మంత్రి యప్పామంత్రీ.

1


వ.

అవధరింపుము.

2


క.

అన్నఁ దదీయోక్తులకున్
మన్నన రాజిల్క పల్కె మహీపతీతో న
క్కన్నియ తెఱగంతయు నే
విన్నప మొనరింతునే వివేకవిధానా.

3


చ.

అగునగు నయ్య యచ్చెలియ యట్టిద యెంత నుతింప నంతకున్
దగుఁదగు మర్త్యలోకవనితాజనతావినుతాంగి యానన
ద్విగుణితచంద్రమండల తదీయనిశాతకటాక్షపాతముల్
తగిలిన మారుఁ డెవ్వరి హళాహళి సేయఁడు వాఁడితూపులన్.

4


ఉ.

ఆలతకూన యాకలికి యాయెలజవ్వని యామిటారి యా
లోలకురంగశాబకవిలోచన యాకలకంఠకంఠి యా
బాలరసాలమంజరి నృపాలకవంశవతంస రూపపాం
చాలవయోవిశేషగుణసంపద నీక తగుం దలంపగన్.

5

గీ.

అవధరింపుము పంచబాణావతార
తారతారకహారమందారకీర్తి
కీర్తిపాలకుఁడను మహీభర్త యేలు
నరుణపురమన నొక్కపురము వెలయు.

6


సీ.

భువనత్రయభ్రాజి పురరాజి తలకట్టు
                       కైటభారి వధూటి యాటపట్టు
వేదాదివిద్యలు విశ్రమించిన తావు
                       విబుధకోటులపాలి వేల్పుటావు
పోటుగంటులు దూరి పోవు శూరులయిక్క
                       మదవద్విరోధుల కెదురుచుక్క
నవనవాకృతి నొప్పు నవలాల గమిటెంకి
                       వాసనాగరిమ జవ్వాది వంకి


గీ.

పరిసరోద్యానవాటికాంతరసరన్మ
రందరసపూరసంతతమండితంబు
పరిఖ యున్నతసౌభాగ్యభాగమహిమఁ
బాలమున్నీటిచుట్ట మప్పట్టణంబు.

7


క.

అందు ముకుందుఁ డనంగ ము
కుందనిభుం డొక్కవిప్రకుంజరుడు గలం
డిందుకళామృతశీతల
సందీపితహృదయుఁ డతఁడు సౌజన్యనిధీ.

8


మ.

అఖిలామ్నాయములు బఠించి బహుశాస్త్రాలోచనల్ చేసి బు
ద్ధి ఖలీనోన్నతిఁ జిత్తదుర్మదహయోద్రేకంబు వారించి చి
త్సుఖకేళీపరతంత్రుఁ డై గుణగరిష్ఠుఁడై సదాచారమా
ర్గఖళూరిశ్రముఁడై యశేషబుధలోకఖ్యాతిగాంచె న్మహిన్.

9


సీ

గ్రాసంబునకుఁ జాలఁగా బండు సస్యముల్
                       మొదపులు పదియైదు పిదుకు నింట

విడిముడి దప్పుగా దడిగిన లేఁదు పొ
                       మ్మన లేడు సద్వ్యయ మాచరించు
కలిమిని విఱ్ఱవీగఁడు లేమిఁ గుందఁడు
                       కలపాటిదినములు గడపి పుచ్చు
దుర్దానములు గొనుత్రోవను బో నొల్లఁ
                       డాసపాతకుఁడు గాఁ డీసులేఁడు


గీ.

మఱచి తప్పియు నొరులకు మనసు రాని
పరుషభాషణ లెం దైనఁ బలికి యెఱుఁగఁ
డఖిలజీవదయాపరుఁ డై తనర్చుఁ
బరమసాత్వికబుద్ధి దద్బ్రాహ్మణుండు.

10


మ.

సరసాహారము లింటఁ బెట్టి బహుశిష్యశ్రేణికిం దెల్పు శా
స్త్రరహస్యస్థితి చెప్పు నధ్యయనసంధ్యల్ హవ్యకవ్యంబులన్
సురకోటిం బితృకోటి నేమఱక ప్రోచుస్ విప్రవర్గంబులో
సరి లే రెచ్చట నమ్మహాత్మకునకున్ సౌజన్యభవ్యోన్నతిన్.

11


క.

హింసదెసఁ బోక నరులప్ర
శంసకు మది దెరలి పడక సజ్జనమకుటో
త్తంసుఁడన నతఁడు చేసెన్
సంసారము రీతిగాఁ ప్రజ ల్గొనియాడన్.

12


పొరుగింటి విప్రముఖ్యుం
డరుణుండన నొక్కఁ డతని యట్లన విద్యా
పరిణతుఁ డయ్యును జన్మాం
తరవాసన కతన లేమిఁ దద్దయుఁ బొగులున్.

13


మ.

కులనిర్మూలనకారణంబు ప్రతిభాకుట్టాక ముద్వేగకో
పలతాదోహద మాజవంజవసుఖప్రత్యూహ మాత్మవ్యధా
జ్వలనజ్వాలిక కామినీనయనవీక్షాపాతసంరోధి ని
త్యలఘుత్వాశ్రయభూమి లేమి యది యాహా యేమి గావింపదే.

14

గీ.

పలుచగాఁ జూచు నెంతయు బంధుసమితి
పిలువఁ బిలువంగఁ బలుకరు బిడ్డలైన
రచ్చ కెక్కెడుమాట గారాపుసతియు
లెక్క సేయదు లేమి తూలించెనేని.

15


గీ.

కష్టదారిద్ర్యదోషంబుకతనఁ గాదె
ప్రాభవము దక్కి మును ఋతుపర్ణవిభుని
వంటవాఁడయి కొల్చెను వైరసేని
వాసి చెఱుపదె యెంతటివారినైన.

16


గీ.

అట్లు దారిద్ర్యదోషసంప్రాప్తుఁ డయ్యుఁ
జిత్తవీథి నొకింతయుఁ జింత లేక
నియమపరత నిజాచారనిరతుఁ డగుచు
నడవఁ దత్కాంత మది నొక్కనాఁడు విసివి.

17


క.

పెనిమిటి యనక్షరాస్యుఁడు
ననభిజ్ఞుఁడు నైన దైవమాయని మదిలో
వనరుచు లేమిం బడఁదగు
నినుఁ జెందియు నాకు నింత నెవ్వగ యగునే.

18


క.

మండ జఠరాగ్నిఁ దనయులు
చండత మంగలము వంటి సంసారము నిం
కొండు గతి లేదు దినదిన
గండం బేరీతి నడపఁ గాఁ దగు ననఘా.

19


సీ.

చదివినారలు పెక్కుసంధలఁ గించిత్తుఁ
                       దప్పకయుండ వేదత్రయంబు
పఠియించినారలు ప్రతిభాసమున్నిద్ర
                       సౌష్ఠవంబున మూలశాస్త్రవితతి
శోధించినారలు శుద్ధమతిస్ఫూర్తి
                       నఖిలపురాణేతిహాససమితి

చూచినారలు బుధస్తోమంబు గొనియాడఁ
                       గావ్యనాటకముఖగ్రంథసీమ


గీ.

యేమి చెప్పెడుదాన మీ రిడక లేవు
సకలవిద్యలు భూసురసమితికెల్ల
నజున కెనవత్తు రన్నింట నకట మీర
లల ముకుందుని కన్న నేవెలితి చెపుఁడు.

20


క.

అతని నడవడి చూడరు
గా తామరతంప రగుచు గాదెలఁ గొలుచున్
జేత విడిముడియు బహుగో
వ్రాతంబును గల్గి రాజువడువున నుండున్.

21


క.

పూచిన తంగెడుగతి వి
ద్యాచతురుం డతని సోమిదమ్మ పొరువునన్
వాచాలరత్నకంకణ
సూచితవిభమున మెఱయఁ జూడంగలనే.

22


వ.

అనిన నతం డిట్లనియె.

23


క.

కులమునఁ బడునో బహువి
ద్యలఁ బడునో బుద్ధిఁ బడునొ తరుణీ యేలా
వలవనిదురాశ లెందుం
గలుగదు పో బ్రతుకు పూర్వకర్మముదక్కన్.

24


క.

ఏరికి బుద్ధిబలంబులు
కారణములు గావు సువ్వె కలరె ధరిత్రిన్
నేరిచి బ్రతికినవారలు
నేరక చెడ్డట్టివారు నీరజనేత్రా.

25


ఉ.

సూదిపిఱిందిదార మయి చొచ్చినచోటులు చొచ్చి యేరికిం
గాదనరాదు పూర్వకృతకర్మఫలం బటు గాన నేల ని

ర్వేదనఁ బొందె దిప్పు డలివేణి తపం బొనరించి యేను ల
క్ష్మీదయితప్రసాదమునఁ జెందెదఁ దావకచింతితార్థముల్.

26


సీ.

జగదభినిర్మాణచాతుర్యవిఖ్యాతి
                       మెచ్చి దాతకు నెవ్వ రిచ్చినారు
స్వర్లోకపావనసౌభాగ్యగరిమంబు
                       మెచ్చి యింద్రున కెవ్వ రిచ్చినారు
దృగ్విధాగోచరదివ్యతేజస్ఫూర్తి
                       మెచ్చి భానున కెవ్వ రిచ్చినారు
సకలక్షమాదృతక్షమసత్వసంపత్తి
                       మెచ్చి శేషున కెవ్వ రిచ్చినారు


గీ.

విష్ణుకరుణావిశేషంబు విశ్వమునకుఁ
గారణము గాక మఱి యేది కలదు దిక్కు
కాన నరలేనిభక్తి నో కంబుకంఠి
మనలఁ గొల్చిన మనుపఁడే మదనగురుఁడు.

27


మ.

తరుణీరత్నము లేమిదొడ్డు మదమాద్దంతియూధంబు లే
యరుదత్యున్నతభోగభాగ్యవిభవవ్యాపార మేలెక్క సా
గరసంవేల్లితవిశ్వభూభువనరక్షాశక్తి యేబ్రాఁతి శ్రీ
హరిసేవాపరులైన పుణ్యులకుఁ గాంతా యేల చింతిల్లగన్.

28


మహాస్రగ్ధర.

కొలుతుం దేవాదిదేవున్ గువలయసుషమాగుచ్ఛసచ్ఛాయకాయున్
గలశాంభోరాశికన్యాకచభరవిచరత్కమ్రహస్తారవిందున్
బలి విధ్వంసిం దపస్విప్రకరసుఖకరప్రౌఢకారుణ్యలోలున్
జలశాయిం జక్రపాణిన్ జగదవనపరున్ జంభసంభేదివంద్యున్.

29


వ.

అని వితర్కించి.

30


క.

విమలాచారుం డతిరతి
శమయుతుఁడయి తపము సలుపఁ జనియెన్ లక్ష్మీ

రమణాధీన మనోగతి
యమరాడనుజన్మయైన యమునానదికిన్.

31


క.

అన్నది పావనగుణసం
పన్నత నుతియింపఁగలఁడె పన్నగపతియున్
మిన్నక యన్నది మునిఁగిన
యన్నరుఁ డమ్మరుని తండ్రి యనఁ దగఁ బెరిమన్.

32


మ.

జటిసంఘాతసమీపసంఘటితరజ్యద్వాలుకాలింగసం
స్ఫుటముల్ జన్మపరంపరాఘలతికామూలచ్ఛిదాపాదనో
ద్భటముల్ ముక్తివధూకుచాగ్రపటముల్ భాస్వత్తనూసంభవా
తటముల్ వానికడ న్వసించు నరుచెంతం జేర వేచింతలున్.

33


ఉ.

దీపితభక్తి నన్నది నుతించు మహాత్ములఁ జూతురేని మీ
కాపనిగాదు దైత్యకులఘస్మరశాతకఠోరచక్రధా
రాపటుపాతవేగమున వ్రయ్య లగుం దల లంచు బుద్ధిగా
నా పితృభర్త చెప్పునఁట యాత్మభయంకరకింకరాళికిన్.

34


మ.

మగఁ డెవ్వారలఁ బ్రోచు వారు సతికిన్ మాన్యుల్ గదా యంచు లో
నగముల్ వారిధి మాడ్కిఁ దాఁచె ననఁగా నైదాఘవేళాతప
ద్విగుణీభూతతనూవిదాహ మడఁపన్ వేవచ్చి తత్కూలముల్
డిగి లీల న్విహరించుఁ దీరవనవాటిన్ దంతిసంతానముల్.

35


వ.

అట్లు సకలగుణతరంగిత యగు నత్తరంగిణిం గనుంగొని యవ్విప్ర
పుంగవుండు పులకితాంతరంగుం డగుచు నిట్లనియె.

36


క.

ముల్లోకముఁ బావనసం
పల్లీలల మనుచు నట్టిమహిమలు గాంగా
కల్లోలినికిం గలుగుట
తల్లీ కాళింది నీకతంబునఁ గాదే.

37


శా.

సారాచారు లశేషభూభువనరక్షాదక్షు లబ్జాననా
మారాకారు లశేషభవ్యసుషమామార్తాండు లర్ధార్థి మం

దారుల్ తొంటి భవంబునన్ శమసముద్యచ్చిత్తులై వచ్చి నీ
వారిం గ్రుంకిన వారి వారలఁట కా వార్ధి ప్రియంభావుకా.

38


శా.

రేపుల్దామరచూలిచందమున సంక్రీడించి మధ్యాహ్నవే
ళాపూర్తిం గనకావనీధరధనుర్లాలిత్యము ల్చూపి తా
మాపు ల్మాధవలీలల న్వెలయు నమ్మూర్తాండుఁ డోయమ్మ ని
న్నేపుణ్యంబునఁ గాంచెనో యతనిపెం పిం కేమనం బావనీ.

39


లయగ్రాహి.

జాలుకొనిమించు నెఱ డాలు గలజాతి హరి
                       నీలముల నేలుకొనఁజాలెడు భవత్క
ల్లోలములు భక్తజనలోలములు పాపవన
                       కీలములు మోక్షపదమూలముల తత్త
ద్బాలిశజనప్రకరఫాలతలపద్మజస
                       మాలిఖితదుష్టలిపితూలపటలీవా
తూలములు పుణ్యగుణశీలములు సంస్తవన
                       కేళి పరతంత్రములు లీల నుతియింపన్.

40


వ.

ఇట్లు బహువిధంబుల నమ్మహానది నభినందించి కృతస్నానుండై సమా
కుంచితపంచేంద్రియుం డగుచుఁ బంచాగ్నిమధ్యంబున నిలిచి హరిని
గురించి తపం బాచరించుతఱి నొక్కనాఁడు.

41


సీ.

పుష్పవతీనామపుటభేదనం బేలు
                       నందకాఖ్యానగంధర్వనృపతి
గారాపుఁగూతురు కామునిరాచిల్క
                       లతయను పేరి బాలయు మహేంద్ర
నగరాధినాయకుం డగు చిత్రవాహనా
                       హ్వయమునఁ బరగెడు యక్షభర్త
కనుఁగుఁదనూభవ కనకమంజరి యను
                       కన్నియ జలకేళికాకుతూహ

గీ.

లమున యమునానదీతీరలలితఫలిత
కాననాంతరసీమకుఁ గదలిపోయి
కాంత లిద్దఱు నచ్చట గలసి మెలసి
సంభ్రమంబునఁ బుష్పాపచయ మొనర్చి.

42


గీ.

వార లిరువురు నవ్వుచు వచ్చి చెంతం
జిగురుటాకుల మఱుపునఁ దగిలియున్న
యొక్కమంజరిఁ జూచి యొండొరులఁ గడవఁ
బాఱి యౌవనగర్వసంపదలకతన.

43


క.

ఇవ్విరి నాయది యనఁగా
నవ్వలియది తనది యనఁగ నది హేతువుగాఁ
గ్రొవ్విరి కొఱకై యిద్దఱు
జవ్వనులకు మాట మాట జగడం బగుటన్.

44


క.

తొల తొలఁగు తొలఁగు మనుచుం
దల తల తల మనుచు వట్టి దట్టతనఁబుల్
వలదు వల దనుచుఁ బల్కఁగఁ
గలకంఠుల కపుడు మిగులఁ గలహము ముదురన్.

45


ఉ.

కొప్పులు వీఁడగా బిగువుగుబ్బలు పల్మరు జారఁ బయ్యెదల్
గప్పుచు రత్నకంకణఝళంఝళనాదము మించ హాసముల్
త్రిప్పుచుఁ గౌను దీఁగెలు చలింపగ వేచని తోడివారితో
జెప్పుచు నద్దిరా యనుచుఁ జిట్టలు మీటుచు సందడింపుచున్.

46


క.

అయ్యిరువురిలో లతయను
తొయ్యలి కప్పువ్వుగుత్తి దొరకిన కతనన్
గయ్యమునకుఁ గాల్ద్రవ్వుచు
గయ్యాళితనంబు మీఱఁగా నిట్లనియెన్.

47


క.

తగ వెఱుఁగవు నగ వెఱుఁగవు
మొగమోటయు లేదు కొమ్మ మున్నుగ నాచే

దగిలిన విరి నా కిమ్మని
తగిలెదవో వెఱ్ఱిపట్టి తహతహ వలదే.

48


ఉ.

రక్కెసమాట లేల నగరా తగువారలు నోరు నొవ్వదే
డక్కునె యొడ్లసొమ్ములు పడంతుక యెంత యలంత నొందినన్
నిక్కుచు నీల్గుచుం బలుకనేర్చిన నీ విటమున్న తీఁగెపై
నిక్కుసుమంబు గోయుటకు నేటికీ నేరకయుంటి చెప్పుమా.

49


క.

కామిని వాదులు గొఱగా
వేమిటి కని యూరకున్న నేఱుఁగవు నన్నున్
వేమఱు నొత్తుకు వచ్చెద
వేమిట నాతోడఁ బోలుదే యిటఁ జెపుమా.

50


ఉ.

అన్నఁ దదీయవాక్యముల కామృగలోచన పల్కె రూపసం
పన్నతకుం గులంబునకుఁ బాఱకు నలుగురు మెచ్చనాడు మో
కన్నియ నన్ను నిన్నును జ గం బెఱుఁగున్ మునుమున్న కన్ననా
క్రొన్నన నాకు నిమ్ము మఱి రూపుకొలందులు గాన నయ్యెడున్.

51


ఉ.

వీరిఁడి మాట లేల వినవే యల వాఁడె కళిందకన్యకా
తీరమునన్ వసించి యతితీవ్రతపం బొనరించు మౌనికం
ఠీరవమున్ గరంచునది నేర్పు విలాసము పేర్మి నేటికిన్
బోరఁగ నప్డు కానఁబడుఁ బో మన యిద్దఱ తారతమ్యముల్.

52


క.

ఒసపరి మాటలఁ బాటల
నసమానతపోనిరూఢుఁ డగు నమ్మౌనిం
గుసుమాస్త్రబాణవశమా
నసుఁ జేయుట యిపుడు నీకొ నాకో చెపుమా.

53


చ.

అన విని యామృగాక్షి దరహాసము మోమున నంకురింప యా
వనభరరూపసంపదల వన్నెకు నెక్కుటఁ జేసి యిట్లు
మును కలుగంగ నియ్యకొన ముద్దు నెడన్ మదభద్రదంతినాఁ
గనుఁగొన దాళధళ్యములు క్రందుకొనం జని తన్నదీస్థలిన్.

54

మ.

కటిశాటీభవదేణకృత్తితనుజాగ్రన్నాకులేకాగ్రదృ
క్పుటి లాలాటసమర్పితాంజలి రమాంభోజాననానాయకో
త్కటనిధ్యానసుధాధునీలహరిమగ్నస్వచ్ఛనిర్ణిద్రహృ
త్తటి నద్దివ్యమహానుభావ జటిఁజెంతం జేరి లీలాగతిన్.

55


ఉ.

ఆడుచుఁ బాడుచున్ సరసమాడుచు మోహనలీల వ్రాల న
చ్చేడియ చెయ్వు లెల్ల మునిసింహము కన్గొని యిప్పు డద్దిరా
యోడక వచ్చి నాయెదుర నూరక ప్రేలెడు దీని మత్క్రుధా
బాడబకీలల న్నలఁచిపాఱఁగ వైచెద నంచు నుగ్రుఁడై.

56


మత్తకోకిల.

బాల యౌవనగర్వరేఖఁ బిసాళ మాడెదవేల నా
మ్రోల నెవ్వరిఁగాఁ దలంచితి మోహసాలసమూహని
ర్మూలనక్రమశాలిఁ జక్రధరున్ భజించు కృతార్థుఁడన్
జాలుఁ జాలుఁబొ కాలు పుట్టు రసాతలంబున మర్త్యవై.

57


క.

అని ముని శపియించిన నె
మ్మనమున విభ్రాంతి నొంది మారుతసంచా
లనచలితకలితలత యన
ఘనభీతి లతావధూటి గజగజ వడఁకెన్.

58


క.

అది గని కార్యము దప్పెన్
బొదఁడు పొదం డనుచు నింగిబోటులు మునిరా
ట్పదపద్మవినతు లొనరిచి
మృదుమధురాలాపసరణిఁ గృప తళుకొత్తన్.

59


మ.

కినుకన్ మీ రొకయింత చూచినఁ ద్రిలోకీలోకసంచారముల్
పొనుఁగైపోవె భవన్మహామహిమకున్ బూఁబోండ్లు లక్ష్యంబె యి
వ్వనితన్ దీన ననాథఁ గావఁ గదవే వాత్సల్యసంసిద్ధి నో
వనజాతోదరజాతధీవిభవ యో వాచంయమిగ్రామణీ.

60


గీ.

అనిన నమ్మౌని బలికె దయాళుఁ డగుచుఁ
గమలముఖులార నాదు వాక్యములు తప్ప

వైనఁ గానిండు మున్నొక్క యక్షవరుఁడు
కంబుఁ డనువాఁ డొకానొకకారణమున.

61


ఉ.

మైంధవ నామధేయనృపమన్మథుగర్భమునన్ జనించి సౌ
గంధికబంధువంశకలికామధుమాసవిలాసియై సుధా
సింధుసబందుబంధురవశీకృతకీర్తిధునీప్రపూర్తియై
సింధుఁడు నాఁగ రాజకులశేఖరుఁ డౌ సుతుఁ గాంచె నెంతయున్.

62


క.

ఆరాజకులోత్తంసకు
మారిక యై యిది జనించి మహనీయకళా
శ్రీరంజిత యగుఁ బొండన
వారిజలోచనలు కొంత వగ దిరుగుటయున్.

63


ఉ.

రామలు కేలికాననధరాస్థలికిన్ మును క్రీడ సల్ప రా
రో మనసారఁ గమ్మనివిరుల్ దమనేర్పులఁ గోసికొంచుఁ బో
రో మదవృత్తి నీగతి మరుల్గొని పోరిన వారిఁ గానమొం
డే మనువారమమ్మ తరలేక్షణ వ్రాతఫలం బిటుండఁగన్.

64


క.

అని పలికి యమ్మునిపతికిఁ
బ్రణామములఁ దగ నొనర్చి రాజీవముఖుల్
చని రిట లతావధూటియుఁ
బ్రణుతయశః కంధిసింధుపతి కుదయించెన్.

65


సీ.

ఆ సింధుపతి యేలు నవనిమండల మిది
                       యతని పట్టణభర్మహర్మ్యవీథి
నభ్రంకషంబులై యాడెడుఁ గేతన
                       పల్లవంబులు చూడు మల్ల యవిగొ
చేరువ కిపుడు వచ్చిన కాంతిమతియను
                       తలిరాకుబోఁడి యీసులలితాంగి
యాపువ్వుఁదోట యీయిందీవరేక్షణ
                       క్రీడసల్పెడు నట్టి కేలివనము

గీ.

మహిత మధుమాస మగుట నమ్మందగమన
చెలులుఁ దాను విహారంబు సలువ వచ్చి
పోవుచున్నది నిజపురంబునకు మగిడి
మత్తగజగామినీజనచిత్తచోర.

66


క.

లేకున్న నింతచక్కని
కోకస్తని కోమలాంగి కువలయసుషమా
లోకమునఁ గలదె మానవ
లోకంబున నిఖిలరాజలోకవతంసా.

67


మ.

వనితారత్నము మోము భ్రూవిలసనవ్యాపారముల్ వక్రము
ద్ర నిరూపింపఁ సప్రమాణగతి నేత్రంబుల్ పచారింప నీ
సునఁ దక్కింపఁ గడంగి వచ్చు ద్విజరాజున్ నిగ్రహస్థానయు
క్తునిగాఁ జేసి చెలంగు నప్రతిభచేఁ క్రొత్త ల్వితర్కింపఁగన్.

68


క.

తరుణి యెలకౌను మదకే
సరిసన్నిభమై బ ప్రసన్నత గనియున్
గురుకుచభారవహస్థితిఁ
బరఁగియు నిరుపేదతనము పాయదు కంటే.

69


గీ.

అంగలతికావిలాసంబు వాచరించు
యౌవనామృతవృష్టిసంప్రాప్తికొఱకు
లలితనాభీబిలంబు వెల్వడిన యట్టి
చీమ చాలనఁ జాలుఁ దద్రోమరాజి.

70


క.

మును పరమహంస వాసనఁ
బనివడి సామీప్యపదవిఁ బంకేరుహమున్
గనియెనొ యనఁగా వరవ
ర్ణిని పాదయుగంబు పద్మరేఖం బొలుచున్.

71


చ.

కవిత సుధారసంబు తొలుకన్ సరసప్రియభాణంబులన్
బలికిన శీతకాలమగుఁ బల్లవపాదము లెత్తి లీలమై

మెలఁగ వసంతకాలమగు మించు కనుంగవఁ బాఱఁ జూచినన్
దలకొను కాఱు కాలమగుఁ దన్వి విలాసము చిత్ర మెన్నఁగన్.

72


ఉ.

వ్రీడ దొఱంగి యాహరి విరించి ముఖుల్ భ్రమనొంది గుట్టు పో
నాడరొ పంచసాయకశరాహతి పాల్పడి పువ్వుఁబాన్పులన్
వాడరొ చంద్రచంద్రికలవంకఁ గనుంగొన నోడరో తగన్
జూడరుగాక యక్కలికిచూపుల బాలకురంగలోచనన్.

73


చ.

ప్రచురవివేకసార యల బాలిక నేమని చెప్పు వాఁడని వా
గ్రచనలు గావు మే నమరుఁ గల్పకవల్లిమతల్లి తల్లియై
కచనిచయంబు పొల్పమరుఁ గార్కొను తుమ్మెదచాయ చాయయై
కుచలికుచంబు లిం పెసఁగుఁ గ్రొవ్విరిబంతుల మేలిబంతులై.

74


ఉ.

ఆచ్చిగురాకుబోఁడి నవయౌవనరూపవిలాసరేఖ నీ
విచ్చటఁ గంటి నంటి వది యెంతయుఁ గల్ల యొకింత జూచినన్
బచ్చనివింటివాఁడు తెగఁ బాఱక ని న్నిపు డింతదవ్వు రా
నిచ్చునె రాజశేఖర నరేశ్వర యంచు శుకంబు పల్కినన్.

75


గీ.

పార్థివాగ్రణి సంతోషభరితుఁ డగుచు
నవ్విలాసిని తెఱఁగెల్ల నాను పూర్విఁ
దెలిసి యీరీతిఁ బల్కు నేర్పులు శుకేంద్ర
నీకుఁ బుస్తకపాణికిఁ గాక కలవె.

76


ఉ.

కంటిఁ దపోవిశేషమున గన్నులపండువగాఁ దలోదరిన్
వింటి భషద్వచోరచన వీనులు చల్లఁగ దద్గుణాళి పూ
వింటి యతండు నన్ గినిసి వెంపరలాడక మున్నె యల్ల వా
ల్గంటి మనోజ్ఞిసంగమసుఖస్థితి యేగతిఁ గల్గు జెప్పదే.

77


ఉ.

చంచలనేత్ర పోవునెడ సన్నపుబయ్యెదకొంగు జాఱఁ గాం
క్షించుటగాెని చన్నుఁగవ క్రేవలఁ బ్రోవులు గట్టియున్న క్రొ
మ్మించుల నాదుచూడ్కి మిఱుమిట్లు గొనం గనరాకపోయె నొ
క్కించుకయేని తద్గరిమ యెట్లు భరింపుదు నిచ్చ నెచ్చలీ.

78

ఉ.

కంగిన పైఁడికుండల వకావకలై చనఁజేయఁజాలు చ
న్నుంగవ వ్రేగునం దన తనూలత యల్లలనాడఁ దేట వా
లుంగనుదోయి చూపులు తళుక్కన నల్లన వచ్చినన్ దృఢా
లింగన మాచరించ కవలీఢ మనోవ్యధ మాన నేర్చునే.

79


సీ.

బలువిడి నేతెంచి వలరాచబెబ్బులి
                       వాఁడితూపుల గ్రోళ్ళ వ్రచ్చెనేని
యెలమావికొన యెక్కి పెళపెళ నార్చి కో
                       వెల పోటుఁగూఁతలు పెట్టెనేని
బడిబడిఁ గమ్మపుప్పొడి నిప్పుకలు చల్లి
                       వెడవెడగా గాలి సుడిసెనేని
దేనియల్ గ్రోలి మత్తిలి గండుఁదుమ్మెద
                       కెరలి జుమ్మంచు జంకించెనేని


గీ.

బాడబజ్వాలికలతోడఁ గూడిమాడి
వచ్చి వెన్నెలతేట కార్చిచ్చు బలిసి
యిట్టలంబుగఁ బైఁ జుట్టుముట్టెనేని
పాంథు లక్కట యేరీతి బ్రతుకువారు.

80


వ.

అని పలుకుచు నమ్మానవపతి మానినీవిలాసాపహృతమానధనుండై
మనోభవాధీనమానసుం డగుచు నుండె నంత నిచ్చట.

81


చ.

వెడవెడజారునీవి యరవీడిన పెన్నెఱి గొప్పు నెన్నెడం
దడఁబడు పాదపద్మములు దారిన కన్గవ చూపుతోరమై
బడిబడి వెళ్ళు నూర్పుగమి పయ్యెద యొయ్యెన జాఱఁగా బయల్
పడు చనుగుబ్బలుం గల విలాసిని చందముఁ జూచి నెచ్చెలుల్.

82


చ.

గుజగుజలాడ వారిఁ గనుగోవల బిట్టదలంచి ప్రౌఢ వా
రిజముఖి యోర్తు చూచి సతి ప్రేమభరంబు మరల్పరాదు బే
రజపు లతాంతబాణుఁడు కరస్థితపల్లవఖడ్గధారచే
గజిబిజి చేసెనేని మఱి కార్యము దప్పునటంచు గొబ్బునన్.

83

క.

ఆ రాజన్యు పురంబును
బేరును వంశంబు నతని పెంపును దెలియం
గోరి వివేకిని యగు న
వ్వారిజముఖి తల్లతానివాసంబునకున్.

84


క.

వచ్చి తమకాంతిమతిపై
జెచ్చెర మరుఁడేసినట్టి చిచ్చఱకోలల్
తెచ్చినగతిఁ జెంగలువల
కచ్చు నృపాగ్రణికి దెచ్చి కానుక యిచ్చెన్.

85


ఉ.

ఇచ్చి తదీయమూర్తిఁ గని యెంతయు నచ్చెరు వావహిల్లగా
మెచ్చి కుమారమన్మథ యమేయగుణాకర నేఁడు క్రొత్తగా
నిచ్చటి కేగుదేర గత మెయ్యది దేవరపేరు వేఁడ నా
కిచ్చ భయంబు పుట్టెడు నహీనమహామహిమంబు చూచినన్.

86


ఉ.

ఇంతకుమున్ను లీలమెయి నిచ్చటికిం జనుదెంచి సింధుభూ
కాంతుని కూర్మిపట్టియగు కాంతిమతీసతి నిన్నుఁ జూచి య
త్యంతమనోనురాగదశ నాఱడిఁ బొందుచు దావకీనవృ
త్తాంత మెఱుంగ నన్ను వసుధావర నీకడ కంపె వేడుకన్.

87


చ.

అనిన నతండు లేఁతనగ వాననమందు నిగుర్పఁ గీరముం
గనుగొనినన్ మహీధవశిఖామణితో నది పల్కె నేర్పునన్
మనుజకులాధినాథ యొకమా ఱొకయించుకమాత్రఁ నిన్ను జూ
చిన చిగురాకుఁబోఁడి తమిఁ జిక్కదొ యప్పుడ నీకు దక్కదో.

88


చ.

మనుకులచంద్ర నీదు సుకుమారమనోహరమూర్తి చూచి యే
చిన తమిఁ జిక్కి చిక్కె నిజసీమకు నీ విటఁ బోకమున్న యి
వ్వనమున నున్నవేళనె భవచ్చరితం బెఱుఁగం దలంచి తాఁ
బనిచిన దీవధూటి నల బాలవివేకము మెచ్చ జెల్లదే.

89


క.

అల సింధుభూమిపాలక
తిలకాత్మజ కెల్లవిధముఁ దేటపడంగా

దెలిపి యిటఁ దోడి తెచ్చెదఁ
బలుకులు వేయేల నన్నుఁ బంపు కుమారా.

90


వ.

అనిన శుకవల్లభునకు భూతలవల్లభు డిట్లనియె.

91


క.

నీ కొలఁది నలువరాణికిఁ
గా కొరులకు నెట్లు తెలియఁగా వలయు ననన్
లోకమున నెవ్వియైనను
నీకు నసాధ్యములు గలవె నిర్మలహృదయా.

92


క.

నినుఁ బాసి యొంటి నే నీ
వనమున నిలుపోపఁజాల వనితామణికిన్
మనల నెఱిఁగించి రమ్మీ
యనఘా! కనుఱెప్ప వేయునంతటిలోనన్.

93


ఉత్సాహ.

అనుచుఁ బల్కి చిల్కఱేని నవనినాథవర్యుఁ డ
వ్వనితచేతి కిచ్చి కీరవరుఁడు మంజులోక్తి మీ
యనుఁగుబోటితోడఁ జెప్పు నడుగబడ్డ పద్దతుల్
చను మటన్న సంభ్రమించి జలజనేత్ర పోవుచున్.

94


ఉ.

అంతకుమున్న కాంతిమతి యాత్మపురంబున కేగి యొక్క యే
కాంతవిహారసౌధమున నాత్మ సఖీజనుల న్మొఱంగి సం
క్రాంతదృఢానురాగము విగాఢముగా నిలుపోప కమ్మహీ
కాంతు మనోజ్ఞరూపగుణగౌరవముల్ మదిలోఁ దలంపుచున్.

95


క.

తరుణులు తఱుములు పెట్టుచు
సరగునఁ దోతరఁ దెలియఁజాలిన మతిఁ ద
త్పురమును బేరు నెఱింగినఁ
బరితాపము కొంత డిందు పడదే నాకున్.

96


సీ.

అక్కుమారకుని నింకొక్కమా రెదిరించి
                       కన్నులారఁగఁ జూడఁ గలుగునొక్కొ

యారాజసర్వజ్ఞు నభిరామగుణములు
                       వీనులు చల్లఁగా విందు నొక్కొ
యామానినీమన్మథాకారు బిగి యారు
                       కౌఁగిట నుండంగఁ గాంతు నొక్కొ
యామేరునగధీరుతో ముచ్చటలు దీపి
                       సరససల్లాపంబు దొరకు నోక్కొ.


గీ.

యాకళాపూర్ణిమాచంద్రు నాసమగ్ర
భోగదేవేంద్రు వరియించి పొంది పొసఁగి
కొలఁది యిడరాని కోర్కులఁ గలిసి మెలసి
నిలువఁ గలుగుట యది జన్మఫలము గాదె.

97


ఉ.

అవ్వల నుండునో కడచి యవ్విభుఁ డవ్వలి కెందుఁ బోవునో
యెవ్వరిఁ బంపుదున్ దెలియ హెచ్చిన మచ్చిక పిచ్చలింపఁగా
నెవ్విధి నిల్చు దాన మది నెట్టు భరింపుదు నివ్వటిల్లు నీ
నెవ్వగ నెవ్వగం గడవ నేరుతు నెద్ది యుపాయ మింకిటన్.

98


చ.

చెలులకు నామనోరథము చెప్పిన నేమని గేలిఁ బుత్తురో
తలఁకెడు నామనంబుఁ గని తల్లియుఁ దండ్రియు బుద్ధి నేమిగాఁ
దలఁతురొ రాజకన్యకల ధర్మము గా దిది యంచు బంధువుల్
పలుచన గాఁగఁ జూతు రొకొ పాయపుఁ గోరిక లేమి చేయుదున్.

99


చ.

తలఁపున నాథునిం గలసి తా నది నిక్కముగాఁ దలంచి మిం
చులఁ దులకించు మోవిపయి సోఁకిన కెంపులు గప్పి పుచ్చె నె
చ్చెలి మఱుపెట్టగాఁ దలచి చిత్రగతాబ్జము మూర్కొనంగ ని
చ్చలు గుఱిచేయు నవ్వికచసారసలోచన ప్రేమ మే మనన్.

100


అమ్మాడ్కి నేకతంబున
నుమ్మలికం బొగులుచున్న యువిదం గని యో
యమ్మ యిది మిగులఁ గ్రొత్తలు
పొమ్మని వెఱఁగంది యపుడు బోటులు తమలోన్.

101

ఉ.

కంటిరె యమ్మలార యవగాఢము దీని వియోగవహ్ని దా
ర్వెంటఁ దొలంగిపోవలయుఁ గ్రేవగనన్ వలవంత లింక నే
వెంట భరింపవచ్చు మన వీరిఁడి బుద్దుల నేమి చెప్ప న
ట్లొంటి వసించి యున్న పతి యూరును బేరు నెఱుంగఁ బోలదే.

102


ఉ.

ఎచ్చటనుండి వచ్చె నిపు డో మధుమాసము వచ్చుఁగాక మా
కిచ్చ వనీవిహారమున కిప్పుడ యేటికిఁ బుట్టెఁ బుట్టెఁగా
కచ్చటి కప్పు డన్నరవరాగ్రణి రాఁగతమేమి యింతలోఁ
బచ్చనివింటివాఁ డొకనెపం బిడి కత్తులు నూర నేటికిన్.

103


సీ.

విరహపన్నగఫణావిహరణంబున వేఁడి
                       యూర్పులఁ బయ్యెద యొయ్యఁగదల
ననురాగజలధిసంజనితఫేనచ్చాయ
                       లన మేని వెలిచాయ లతిశయిల్ల
గాఢచింతాలతాకలికాకదంబకం
                       బన ఘర్మకణజాల మంకురింప
నురుమోహతిమిరఖద్యోతంబు లనఁగాకఁ
                       బెట్టు కుంకుమ లేర్చి బేఁటు లెగయఁ


గీ.

గుటిలకుంతలి యున్న యిప్పటి తెఱంగు
ప్రాణపదమైన మనకుఁ జెప్పంగనేల
చాల నట్టింటిపగయైన శంబరారి
యట్టివానికి మన దయ పుట్టకున్నె.

104


వ.

అని చేరం జనుదెంచి.

105


సీ.

కలికిరాచిలుకఁ జెక్కిలి నొక్కి యూఱార్చి
                       ముద్దాడ వేటికి ముద్దులాడి
పసిఁడివీణియ గూర్చి పంచమశ్రుతి మించ
                       మ్రోయింప వేటికి మోహనాంగి
నీలాలుగప్పు పెన్నెఱికొప్పు నొప్పుగా
                       గీల్కొల్ప వేటికిఁ గేకియాన

గొనబుగాఁ దిలకంబుఁ గొనగోరఁ దీర్చి య
                       ద్దము చూడ వేటికిఁ దలిరుఁబోఁడి


గీ.

ప్రోది రాయంచ రమ్మని బుజ్జగించి
యాట నేర్పవదేటికి నంబుజాక్షి
మారువేదనఁ దెరలెడి వారిఁ దెగడు
నీకు నీరీతిఁ జెల్లునే నీలవేణి.

106


క.

అని పలికి కలికితొయ్యలి
తనుసంతాపంబు వాపఁ దలఁచి విసవిసన్
జని బిసవిసరముఁ జిగురులు
ననలుం బుప్పొళ్ళుఁ దెచ్చి నైపుణి మెఱయన్.

107


క.

అజ్జలజపత్రనేత్రలు
గొజ్జఁగినీ రుప్పతిల్లఁ గులికిన విరిపూ
సజ్జపయిఁ దార్చునప్పుడు
లజ్జావతి వాడి యొరగు లత యనఁ జరఁగెన్.

108


క.

తరుణి నటఁ దార్చి పై పై
నరవిరులం గ్రుమ్మరించి రంగనలు రతీ
శ్వరమధురధనుర్నీరద
కరకాకాంతములభంగిఁ గానంబడఁగన్.

109


సీ.

చెంగావి గట్ట నెచ్చెలియోర్తు మానంపు
                       రవి గ్రుంక నగు సాంధ్యరాగ మనఁగఁ
గర్పూరరజ మొకకాంత చల్లె వియోగ
                       దహనమహాకీర్తిమహిమ యనగఁ
గలువలు కన్నుల కలఁది యొత్తె నొకర్తు
                       ప్రాణవాయువు లోని కడఁచె ననఁగ
బొండుమల్లియ లొకపొలఁతి రాశిగఁ బోసె
                       నంగజభూతోపహార మనఁగ

గీ.

నబల కీరీతి శిశిరకృత్యము లొనర్ప
నంతకంతకు సంతొష మావహిల్లఁ
జెలులు కనుగొని తమలోన నల బలంబు
బుడిగి నివ్వెఱగంద నం దోర్తు చూచి.

110


సీ.

చిగురాకులే కత్తు లగునేని నింతకు
                       దగర కోయిలనోరు దెగకయున్నె
యలరు దేనియ వేఁడి యగునేని నింతకుఁ
                       గండుఁదుమ్మెదముక్కు కమలకున్నె
యరవిరులే నిప్పు లగునేని నింతకుఁ
                       బూవిల్తు నఱచేయి పొక్కకున్నె
యసదు గాలియె వెట్ట యగునేని నింతకు
                       గమలవనం బెల్లఁ గ్రాఁగకున్నె


గీ.

భామ యేటికిఁ జిగురు కైవాఁడ బాఱ
వనిత యేటికి దేనెపై వడియఁ బాఱ
వెలఁది యేటికి ననలకై వెల్లఁబాఱఁ
బొలఁతి యేటికి సురటి గాడ్పులకుఁ బాఱ.

111


క.

పెదపెద మాటల నిప్పగి
ది దొడ్డ కలకలము గాఁగ దేవేరియుఁ దా
నిది యెయ్యదియో చూడుమా
పద మనుచుం జేర సింధుపతి వచ్చుటయున్.

112


క.

సిగ్గుపడి మేనువడఁకఁగ
దిగ్గునఁ బూసెజ్జ డిగ్గి తెరమఱుఁగునకై
యగ్గురుకుచ వోవఁగఁ జెలి
బెగ్గిల నద్దేవి చూచి ప్రియము దలిర్పన్.

113


క.

ఇది యేమి తప్పుగా నిటు
బెదరెదరే నాదు కూర్మిబిడ్డ తనమదిన్

మదనునిఁ గోరిన రప్పిం
చేదఁ జెప్పుఁ డటన్నఁ బ్రీతిఁ జెలంగి లతాంగుల్.

114


సీ.

ఓయమ్మ నేఁడు మే ముత్సవాహ్వయకేళి
                       కాననాంతరసీమ గౌరినోమఁ
జని విహారంబులు సలిపి క్రమ్మఱి రా ర
                       సాలవేదికపై విశాలనేత్రు
డాజానుబాహుఁ డత్యంతమోహనమూర్తి
                       యొకరాజనందనుం డొంటి నుండ
మనకాంతిమతి చూచి మన్మథుఁడను భ్రాంతి
                       నుల్లంబు దురపిల్ల నున్నయదియు


గీ.

విన్నవించితి మంతయు వెఱపు లేక
యింకమీఁదటఁ గర్తవ్య మెద్ది గలదు
దెలిసి బాలిక విభ్రాంతిఁ దీర్పుఁ డనుచు
జెలులు పలుకంగ నప్పు డచ్చెరువు దోఁప.

115


క.

మతిశాలి రాజశేఖర
పతి యనిపిన దివ్యరత్నపంజరశుకమున్
జతురతఁ గైకొని యప్పుడు
చతురిక యేతెంచి రాజసమ్ముఖ మగుటన్.

116


గీ.

తరుణి చేతికి నిచ్చుట తగవుగామి
నృపతిసన్నిధి నిడి దేవ నేఁడు నేను
వనవినోదంబునకుఁ బోయి వెనుక చిక్కి
రాఁగ నొకచక్కిఁ జక్కనిరాజసుతుఁడు.

117


క.

మీరాజు సమ్ముఖంబున
నీరాజశుకోత్తమంబు నిడుమన నిడి యే
కారణమొ యనుచుఁ దెచ్చితి
భూరమణవరేణ్య యనుచుఁ బొలఁతి తొలంగన్.

118

క.

చిలుక యపు డధిపుతోడన్
బలికెం బంజరము వెడలి భాషాలలనా
కల కల మంజీరధ్వనిఁ
గల కల నగఁ దగిన కలికి కమ్మనిపలుకుల్.

119


సీ.

శుభమస్తు వైభవప్రభుగుణసంభవ
                       శ్లాఘాపరాభూత శక్ర నీకు
భద్రమస్తు సముద్రముద్రితక్ష్మాభరా
                       భరణ కద్రూసుతప్రౌఢి నీకు
విజయోస్తు నిష్ఠురనిజభుజాసముదగ్ర
                       విక్రమక్రమకళావిజయ నీకుఁ
గళ్యాణమస్తు సత్కవిరాజసంకల్ప
                       కల్పనాకల్చనాకల్ప నీకు


గీ.

నాయురస్తు తుషారనీహారహార
ధాళధళ్యప్రభామలధవళకీర్తి
సాంద్రచంద్రాతపక్లాంతశత్రురాజ
విరహిణీలోకహృదయారవింద నీకు.

120


శా.

రామప్రాభవమైంధవాధిప కుమారా సింధుభూపాల న
న్నేమోకా మదిలోఁ దలంపకు వచో హే వాక కాకోదర
స్వామి న్నాకుఁ ద్రికాలవేదియని భాషాదేవి పేరిచ్చె నా
రామారత్నము చేతిరాచిలుక నేర్పన్ నేర్చితిన్ సర్వమున్.

121


శా.

వాదింతున్ బహువేదశాస్త్రకలనావైయాత్యసంసిద్ధి న
వ్వేదవ్యాసుల తోడనైన మది సంవీక్షించి యెచ్చోట నేఁ
గాదన్నన్ మఱి నిర్వహింపఁగ నశక్యంబేరి కస్మద్వచ
శ్శ్రీదాంపత్యము నాకనాకయనుకో సిగ్గయ్యెడున్ భూవరా.

122


మ.

ప్రకట శ్రీకర రాజశేఖర మహీపాలుండు ఘోరాసుర
ప్రకటధ్వంసన మాచరింపఁగ నటన్ బ్రత్యక్షమై చంద్రమ

శ్శకలోత్తంసవధూటి న న్నొసఁగె నాశౌర్యక్రియాశాలికిన్
శుకమాత్రం బని నన్నుఁ జూడకు బుధస్తోమైకచింతామణీ.

123


మ.

అది యట్లుండఁగ నిమ్ము హేతిహతమత్తారాతి సత్కీర్తిపా
రదశోభాకరదోఃప్రతాపశిఖరారజ్యద్విచిత్రక్రమా
స్పదుఁ డావంచకనాథనందనుఁడు రక్షశ్శైలదంభోళి య
మ్మదిరాక్షీ మకరాంకమూర్తి గడు సమ్మానించు నన్నున్ నృపా.

124


మ.

కదనక్షోణి విశంకటాసుర వరగ్రామీణు దర్పంబు వా
ల్చి దదీయంబగు నాత్మదేశమున కక్షీణత్వరం బోవఁద్రో
వ దరశ్రాంతిఁ దదీయరథ్యములు నిల్పన్ నేటికి న్నిల్చినా
డదె నీకేళివనాంతసీమ నన రా జాశ్చర్యనిర్మగ్నుఁడై.

125


మ.

తన దేవేరి మొగంబు చూచి యిదె కాంతా కంటివే వింత లే
మని వర్ణింపఁగవచ్చు నిచ్చిలుక యాహా పుట్ట నిట్టాడు నే
మన మాశ్చర్యపయోనిధి న్మునిఁగె నీమాహాత్మ్య మేరీతిఁ గ
ల్గెనొ మున్నేమి తపంబు చేసెనొకొ యీకీరంబు పెంపెట్టిదో.

126


మ.

మనువంశాగ్రణి రాజశేఖరుఁ సామాన్యుండుగాఁ డిప్పుడేఁ
జని యచ్చోటికిఁ దోడి తేవలయు నీసౌజన్యధన్యాత్ము నీ
యనఘున్ గీరవరేణ్యు గాంతిమతి కిమ్మా వేడ్క సంధిల్ల నం
చు నృపాలుండు మృదంగభేరిపటహస్తోమాతిసన్నాహుఁడై.

127


గీ.

చని కనుంగొని యత్యంతవినయసంభ్ర
మంబు లుప్పొంగ నాలింగనం బొనర్చి
హేమధన్వ మహీపాలుఁ డేని యింత
వేఱు సేయఁడుగా మమ్ము వీరవర్య.

128


గీ.

ఇట్లు చేరువ కేతెంచి యిష్టబంధుఁ
డయిననుఁ జూచి పోవు నంతయును లేదె
యనుచు విహితానులాపంబు లాడు సింధు
కువలయాధీశు ప్రియముచేకొని యతండు.

129

శా.

ఆరూఢీం బురరాజవీథి విభవాహంకారజంభారియై
రా రా నంతకుమున్న కాంతిమతి యారాచిల్కయుం దాను గే
లీరాజన్మణిసౌధ మెక్కెఁ దమి నాలీలావతీమన్మథా
కారశ్రీనిధి రాజశేఖర మహీకాంతు న్నిరీక్షింపఁగన్.

130


చ.

చిలుక పురోహితుం డగుచుఁ జెంగట నుండఁగ సిగ్గుపెందెరల్
దొలఁగఁగ ద్రోచి బంధుగతి దోరపుఁగోర్కులు సందడింపఁగాఁ
దలపు లతాంగి జన్నమును తాన కనుంగవ దోయిలించి చూ
పులఁ దలఁబ్రాలు పోసె నృపపుత్త్రునిపై విరహాగ్నిసాక్షిగన్.

131


వ.

అప్పు డారాజకీరం బురోజముఖి కిట్లనియె.

132


ఉ.

చేడియ యీ నృపాలకులశేఖరు సంతతదానశీలుఁ గొం
డాడఁగ వేయినోళ్ళు వలె నంచు వచించితి నప్పు డిచ్చకం
బాడితినో నిజంబ కొనియాడితినో యిటఁ గన్నులారఁగాఁ
జూడుము హేమధన్వనృపసూతి మనోహరరూపసంపదల్.

133


సీ.

తలిరాకుఁబోఁడి నీతపములు ఫలియించె
                       గడలేని మమతలఁ గలయవమ్మ
చంపకగంధి నీ సంకల్ప మీడేఱె
                       నానందవార్ధి నోలాడవమ్మ
పల్లవపాణి నీ భాగ్యంబు చేకూఱె
                       మనసులోఁ దహ తహ ల్మానవమ్మ
పూర్ణేందువదన నీ పుణ్యంబు సమకూఱెఁ
                       జిరవైభవోన్నతిఁ జెలఁగవమ్మ


గీ.

మాట లిం కేల సౌఖ్యమ్రాజ్యమునకు
గంబుకంధర పట్టంబు గట్టవమ్మ
పెనిమిటియు నీవు మచ్చిక ననఁగి పెనఁగి
మగువ నామీఁది పక్షంబు మఱవకమ్మ.

134


ఉ.

ఎక్కడి రాజరాజసుతుఁ డెక్కడి నిర్జరరాజనందనుం
డెక్కడి యిందిరాతనయుఁ డేల నుతింతురొ కాని లోకు లీ

చక్కని మానవేశ్వరుని చందము చూడరు సువ్వె యొక్కనాఁ
డక్కఱతోడ వానిఁ గలయంగను నంగన భాగ్య మెట్టిదో.

135


క.

అని యపుడు రాజకీరము
వనితామణి నధికమధురవాగమృతాబ్ధిన్
మునిఁగించె నచట మైంధవ
జనపాలకనందనుండు సంభ్రమపరుఁ డై.

136


సీ.

కనకపంజరశారికాకీరకిన్నర
                       ద్వందకోలాహలోత్తాలరవము
ముహుదరనిలోద్ధూతతుహినోదభస్త్రికా
                       పతదంబుకణగణప్లావితంబు
మర్దలౌఘధిమధిమధ్వానగతినట
                       త్కంజధృన్మండలీరంజితంబు
జాలకాంతరలసచ్చందనాగురుధూప
                       సౌరభసంభారసంభృతంబు


గీ.

లలితతోరణమాలికాలంకృతంబు
బహువితానవితానవిభాసితంబు
నైన నవరత్నకీలితహర్మ్య మొకటి
విడిది గావించి యవ్విభు విడియఁ జేసి.

137


క.

తననగరి కరిగె నపు డ
జ్జనపతినందనుఁడు గేళిసౌధస్థలిపై
వనితామణిఁ దలపోయుచు
ననువేల దృఢానురాగుఁ డై యుండుతఱిన్.

138


చ.

పనివడి పద్మినిం బగలు బైకొనియుండుట గాననీక వం
చన నటియించి పశ్చిమదిశారమణిం గలయంగఁ బోవుచో
వనజహితుండు మై తుడిచివైవఁగ రాలు పరాగపుంజమా
యనఁ గనుపట్టె నస్తశిఖరాంతరసీమల సాంధ్యరాగముల్.

139

గీ.

అపుడు చీఁకటి యల్లల నాక్రమించి
పార్థివాగ్రణి యనురామభద్రుమీఁదఁ
బొంచి యమ్ములవాన నిండించె నపుడు
చిత్తసంభవుఁ డలయింద్రజి త్తనంగ.

140


మ.

జలజాతాహితమాంత్రికాగ్రణి కళాజాలాఢ్యుఁడై దీపికా
కలికాభీలవిషానలానిలతమఃకాలాహిమార్కోవి య
ల్లలనాదేహము తారకానికరలాలాబిందువై యుండ వె
న్నెలమందుల్ పయిఁబూసి తేర్చెననఁ గాన్పించెం బ్రసన్నద్యుతిన్.

141


వ.

మరియు నంతకంతకుఁ జెన్నుమిగుల వెన్నెల మున్నీరు బెట్టు నిట్టవొ
డిచినం దొట్టి పట్టపగలింటిచందంబున నందంబై కనుపట్టె నప్పు డు
ప్పతిల్లు విరహపరితాపంబులఁ జీకాకు లగుచుం దెగి ఘనశోకంబు
లగు చక్రవాకంబులును నరవిరసి నెఱసి చెంగలించు చెంగల్వవిరుల
కచ్చుల మెచ్చుల క్రొత్తనెత్తావి మొత్తంబుల నెత్తుకొని హత్తుకొని
మెత్తమెత్తనం దిరుగు జిలిబిలి వలికరువలి బలంబులును నిండునెలమ
గండు గండుమెఱసి యేతేరఁ దేఱిచూచిన తొగమగువ విరుల నిగ నిగ
నిగుడం జూపుఁ జాలనం జాలి యందంద యందలి మధురమధురసకణ
విసరంబు లెసక మెసగం గ్రోలి మైమఱచి తఱుచు పఱుచు తుమ్మెద
కొదమ పదుపులును బుట పుట నికటికి వెన్నెల తుటుములం జిటులఁ
జంచూపుటంబులం గమిచి సముచితోపలాలనంబునం దెచ్చి యిచ్చి
తమ తమ గరితలు గరితాల్ప నెఱితనంబున నటియించి హృత్తటంబునం
బొడమిన చిట పొటలువో ఘటియించు చంచచ్చకోరవిటపటలంబు
లును గరంగి తరంగితంబగుచుం బొంగి కురంగాంకోపలసలిలంబులం
బాఱు నేఱుల ఘుమఘుమధ్వానంబులును నిజకాముకుల చక్కటికిం
బిక్కటిలు నక్కఱఁ జిక్కి చను చక్కని చందనగంధుల యందియల
సందడియును గుసుమకోదండదండశరకోదండదండిత లగుచు దండి
యలు మీటుచుం బాడు చేడియల కలకలంబులును దండోపతండంబు
లగు రుచిరకాండంబుల మెండుకొను వెండిపళ్ళెరంబు లొండొండనిండఁ

బుండ్రేక్షుఖండశర్కరాఖండక్షీరపూరంబులు నించి యించువిలు
కానిమామకుఁ బ్రేమ నర్పించు కన్నియల తిన్నని యెలుంగుల యల
బలంబులునునై విజృంభించి పంచశరశరసంచయవంచితధైర్యుం
డగుచు నమ్మహీవల్లభుం డాయల్లకభరంబున నుల్లంబు పెల్లగిలం
దురపిల్లుచుండె నంత గాంతిమతియును నత్యంతసంతాపితాంతరంగ
యగుచు వగల నొగులం దగు సఖుల కొప్పగించి యచ్చిలుకఱేఁడు నర
పతిచందం బరయ రయంబున నేతెంచిన.

142


క.

రాచకొమారుఁడు ముద్దుల
రాచిలుకం జూచి పలికె రసవద్వికస
ద్వాచాలమధురమధురిమ
మోచాఫలసార నాకు ముచ్చట దీఱన్.

143


క.

క్షితిపాలకుఁ డే మనియెం
జతురిక యే మనియె నితరసఖు లే మని రా
సతిమణి దా నే మనియెను
మతిశాలీ వేగఁ జెప్పుమా యన నదియున్.

144


సీ.

మనుజేశ యలకేలివనములో మీరంపఁ
                       బనివిని శుద్ధాంతమునకుఁ బోయి
తిమి యటమున్న కాంతిమతీకుమారికా
                       విరహాపలాపముల్ విని నృపాలుఁ
డును దేవియును వచ్చి తనయ చక్కటినుండఁ
                       జతురిక న న్నుంచె నతని యెదుట
నేను దేవరరాక యెఱిఁగింప హర్షించి
                       యచటికి వేవేగ నరుగుదెంచె


గీ.

నిటఁ గుమారిక నన్ను నెంతేని గార
మించి భవదీయగుణము లాలించి పంచ
శరశరాహతిఁ గుందె దుర్భరవియోగ
భరము భరియింపఁజాలక తెరలిపడుచు.

145

సీ.

తుదగోళ్ళఁ బలుమాఱుఁ ద్రుంచి ప్రోవులు గాఁగ
                       వేసిన చివురులవిధము చూచి
బెట్టుగాఁ దెట్టువల్ గట్టి పైపై సెకల్
                       చల్లు నిట్టూర్పులజాడ చూచి
మిక్కుటంబుగ మేనియుక్కచేఁ గమలిన
                       విరిపూవుసజ్జలకరణి చూచి
కడలేనికాటుకకన్నీటికాలువ
                       మడువులు కట్టినవడువు చూచి


గీ.

కనలి యూరక పనిలేని పనికి నైన
నింతమొకమోట లేక యయ్యిందువదన
ప్రాణసఖిఁ బల్కు పల్కులపగిది చూచి
నాకు వెఱఁగయ్యె నప్పు డో నరవరేణ్య.

146


ఉ.

సందియ మింత లేదు పెలుచన్ నునుమొగ్గల మిట్టకోలలన్
గందనకాయ చేసె సుమకార్ముకుఁ డేమని చెప్పువాఁడ నే
నందుకుఁ దోడువీఁడె హరిణాంకుఁ డహంకృతిఁ జూపఁజొచ్చె నిం
కం దరళాక్షిచంద మెటు గాఁగలదో యనుడుం దలంకుచున్.

147


వ.

అప్పు డప్పుడమిఱేఁడు విరహభరంబు భరియింపలేక రాకానిశా
కరు నుద్దేశించి.

148


సీ.

కఱచుకొంచును ద్రావఁగాఁ గాచియున్నారు
                       సురలు నేయెమ్మెలు స్రుక్క వేల
క్షయము నానాఁట నగ్గలముగా నిఁకనొత్తి
                       వచ్చు నీజాడలు వదల వేల
పెనుపాప పగవాఁడు పెడతలగండఁడై
                       యుండ నీమదవృత్తి యుడుగ వేల
యదియునుగాక మే నంతయుఁ గాళిప
                       ట్టుకరాఁ దొడంగె నీవికృతి యేల


గీ.

యదిరిపాటుగ నుదధిలో నౌర్వవహ్ని
నెపుడు పడియెదవోగాని యెరుఁగరాదు

చెప్పినట్టులు వచ్చునే సితమయూఖ
యేల త్రుళ్ళెద విది యేమి మేలు నీకు.

149


ఉ.

రాహువు గాను ని న్నఱగరాచిన శూరుఁడఁ గాను నీతను
ద్రోహము చేసినట్టి యలరోహిణితండ్రిని గాను దజ్జగ
న్మోహిని నీలనీలకచ ముద్దులచక్కెరబొమ్మఁ గూర్ప క
య్యో హరిణాంక తావకమయూకముఖంబుల నేచ నేటికిన్.

150


వ.

అని యిత్తెఱంగునఁ జిత్తంబున నెత్తిన తత్తరంబునం దరంబుగాని విరహ
భరంబు భరియింపఁజాలక పొరలునంత.

151


గీ.

రతిపశరవర్షనాశనక్రమము దెలుప
మొనసి దీపించు నల యింద్రధను వనంగఁ
బ్రాచి యుమిచిన తాంబూలరస మనంగ
నుదయరాగంబు మెల్లన నుప్పతిల్లె.

152


గీ.

తనదుమనుమని పెండ్లి కెంతయును వేడ్క
నఖిలదిగ్నాగపతుల ర మ్మనుచు శోభ
నాక్షతంబులు వెట్టిన యట్టికరణి
గమలబాంధవదీప్తి నల్గడల మెఱసె.

153


సీ.

అటు ప్రభాతంబైన నావంచకాధీశు
                       తనయుండు కాలకృత్యములు దీర్చి
వసియింప నట సింధువసుధేశుఁడును మంత్రి
                       హితపురోహితుల సమ్మతి వహించి
యాహైమధ్వనికి నాత్మతనూజాతఁ
                       గాంతిమతీకన్యకాలలామఁ
గళ్యాణ మొనరింపఁ గౌతుకోనిద్రమా
                       నసుఁడై దిగంతభూనాథతతికిఁ


గీ.

బ్రీతి శుభలేఖ లనిచి రప్పించి మిగుల
మంచిలగ్నంబుగా నిశ్చయించి పుర మ
లంకరింపంగ నియమించె లవణవార్ధి
వేష్టితాశేషమహిజను ల్వెఱఁగు పడఁగ.

154

సీ.

ఏవీథిఁ జూచిన నిందుబింబాననా
                       లాలితలాస్య కోలాహలంబు
లేవాడఁ జూచిన నితరేతరాలాప
                       సమ్మర్దబధిరితాశాముఖంబు
లేచాయఁ జూచిన లోచనోత్సవకర
                       ప్రత్యగ్రమౌక్తికరంగవల్లు
లేచక్కిఁ జూచిన నిద్ధపుణ్యాంగనా
                       కల్పితకళ్యాణగానఫణితు


గీ.

లెచటఁ జూచిన నవరత్ననిచయరచిత
వివిధతోరణమాలికావిలసనంబు
లెందుఁ జూచిన జగదభినందితాచ్ఛ
బహువితానంబు లప్పురి బరిఢవిల్లె.

155


క.

చనుదెంచు పౌరయాత్రిక
జనులకు బర్ణానిలంబు చలువల కనఁగా
మునువాకిళ్ళలు బెట్టిరి
కనకమయోదగ్రకదళికాస్తంభములన్.

156


గీ.

అపుడు శుద్ధాంతమున కేగి యవనివిభుఁడు
శుభముహూర్తంబు నేఁడు మెచ్చులవరుండు
గలిగె మనకాంతిమతి భాగ్యగౌరవమున
నేల యాలస్య మింక పూర్ణేందువదన.

157


క.

సైరంద్రులఁ బిలిపించి కు
మారికఁ గైసేయ బంపుమా యన నద్దే
వేరియు భూపతియనుమతి
వారి నియోగింప నధికవైభవ మొదవన్.

158


సీ.

అంగనామణికిని సంపంగినూనియ
                       శిర సంటె నొక్కరాజీవగంధి
పువ్వుఁబోఁడికి గోళ్ల దువ్వి గంధామల
                       కము వెట్టె నొక్కసైకతనితంబ

కలకంఠికిఁ గమ్మపన్నీట మ
                       జ్జన మార్చె నొక్కవిశాలనేత్ర
యలినీలవేణికి వెలిపట్టుపావడఁ
                       దడియొత్తె నొక్కవేదండగమన


గీ.

మానవతి కోర్తు చెంగావిమడుగు గట్టె
గురుపయోధర కోర్తు క్రొవ్విరులు దుఱిమెఁ
గీరభాషిణి కోర్తు కస్తూరి యలఁదెఁ
జంద్రముఖి కోర్తు రత్నభూషణము లిడియె.

159


క.

ఆనలిననేత్ర యప్పుడు
నానావిధరత్నభూషణచ్ఛవిలోనన్
గానంగఁబడియెఁ గింశుక
సూనాంతరభాసమానశుకియో యనఁగన్.

160


శా.

ఆరీతిన్ సఖు లొయ్యఁదేర వసుధాధ్యక్షుండు తా నక్కుమా
రీరత్నం బతిమానమానసధృఢప్రీతిన్ విలోకించి పై
పై రోమాంచము లంగకంచుకము లై ప్రాపింపఁ బెల్లుబ్బె జం
భారాతిప్రథమానవైభవకళాహంకారసంక్రాంతుఁడై.

161


గీ.

అధికసంభ్రమయుక్తిఁ గళ్యాణవేది
కై కుమారికఁ దెమ్మని యచటి కడుపు
రాజశేఖర మేదినీరమణవరుని
రా నియోగింప వైభవప్రాభవముల.

162


సీ.

తమరుఢమామికాతమ్మటకాహళ
                       పటహభేరీమహార్భటులు మెఱయ
సకలపుణ్యాంగనాజనసమర్పితలాజ
                       జాలంబు నక్షత్రసమితిఁ దెగడ
భూపాలవర్గంబు త్రోపుత్రో పాడుచు
                       గిరికొని రెండుపక్కియలు నడువ

నవనీసురశ్రేణి యాశీర్వచఃప్రౌఢి
                       కోలాహలంబు దిక్కులఁ జెలంగ


గీ.

జయ విశంకటరిపుశైలజంభభేది
జయ త్రిలోకవిస్తారితసారకీర్తి
జయ విలాసవతీపుష్పచాప యనుచు
మది జనవాక్య వైఖరి క్రందుకొనఁగ.

163


గీ.

నగరి మొగసాల కేగె నానరవరుండు
తాను బంధులు సంభృతోత్సాహుఁ డగుచు
నెదురుగా వచ్చి తోడ్కొని యేగుదేర
జూపఱకుఁ జూడ్కు లింపుల జూఱలాడె.

164


ఉ.

ఈజగ మెల్ల నేలుమని యేర్పడఁ జూపెడుభంగిఁ బంకజ
శ్రీజనయిత్రులైన తమచేతులఁ గీల్కొనఁ జేసి రత్నవి
భ్రాజహిరణ్యపాత్రికలు పల్మఱుఁ ద్రిప్పుచు నొయ్యనొయ్య నీ
రాజనముల్ ఘటించి రుడురాజనిభాస్యలు హైమధన్వికిన్.

165


గీ.

చవులు గొలిపెడు ముత్యాలచవికెలోనఁ
బసనివెలిపట్టు నిండారఁ బఱచినట్టి
కనకపీఠికఁ జూపి యజ్జనవిభుండు
చేరి వినయంబు సేయ నాసీనుఁడయ్యె.

166


శా.

డాకేల న్నిజకన్యకామణుల కంఠశ్రేణి గీలించి వీ
క్షాకంజాతము లాత్మపాదనఖరేఖం దార్చి సంగీతవి
ద్యాకౌశల్యము గానరా మదికి నాహ్లాదంబు సంధిల్ల గౌ
రీకళ్యాణము పాడి రప్పుడు పురంధ్రీరత్నముల్ వేడుకన్.

167


శా.

రా రమ్మంచు గడంగి వృద్ధవనితల్ ప్రార్ధింప లజ్జానతా
కారం బంగజసజ్యకార్ముకగతిం గల్పింప నేతెంచి త
న్నీరేజాక్షి కెలంకులం బసిఁడిగిండిం దోయము ల్వోయ న
గ్గారాపల్లుని పాదము ల్గడిగె నక్షయ్యప్రమోదాత్ముఁడై.

168

ఉ.

కల్పితశోభనోచితసుకర్ములు గౌతమగార్గ్యగాలవా
నల్పమహానుభావమతు లాత్మపురోహితు లాగమోక్తసం
కల్పము చెప్ప భూధవశిఖామణి కన్యక ధారవోసే నా
కల్పవిశాలకీర్తికి జగజ్జనసంస్తవనీయమూర్తికిన్.

169


క.

వరనిశ్చలశౌర్యాంబుధి
తెర యెత్తినరీతి నడుమఁ దెర యెత్తిరి య
న్నరపతియు ముద్దుపట్టిం
దెరమఱుఁగున కపుడు తోడితే నియమింపన్.

170


సీ.

ప్రాణసఖీరత్న మరగౌను గెంగేలఁ
                       దొడికి యొయ్యొయ్యన నడువు మనఁగ
నుడిగంపుఁ దొయ్యలి యోర్తు పావడఁ దెచ్చి
                       చిఱుతనెమ్మోము లేఁజెమట తుడువ
సందడి జడియుచు నిందుబింబాస్యలు
                       కైదండ లిచ్చుచుఁ గ్రందుకొనఁగ
మందయానంబున మసలుటఁ బదనఖ
                       లాక్షారసాంకము ల్లక్ష్యము గనఁ


గీ.

గ్రేళ్ళు దాటెడు చూపులు క్రింద నిండఁ
గ్రమ్మి నీలాలనెలకట్టుకరణి మెఱయ
గాఢలజ్జాభయంబులు గడలుకొనఁగ
జంద్రముఖి వచ్చెఁ బెండిలిచవికె కడకు.

171


క.

మంగళసూత్రముఁ గట్టెఁ గు
రంగవిలోచనకు నపుడు రాజోత్తంసుం
డంగాంగయోగసౌఖ్యత
రంగితపులకాంకురాళి గ్రందుకొనంగన్.

172


మ.

చెలు లెల్లం గరపాణిపద్మమున నాచిన్నారి పొన్నారి ము
ద్దుల రాచూలి విలగ్నముం దొడికి తోడ్తో నెత్తఁగా ముత్యపుం

దలఁబ్రా ల్పోసె వసుంధరాధిప కులోత్తంసంబుపై నమ్మహీ
తలనాథుండు నొనర్చె నట్టిపగిదిం దత్తత్క్రియాకేళికల్.

173


గీ.

అట్లు వైవాహికార్హకృత్యములు నెఱపి
నాలుగవనాఁడు సకలబాంధవులుఁ జెలఁగ
నరవరాగ్రణి లోచనానంద మొదవ
నాగవల్లి యొనర్చుటకై గుఱింప.

174


సీ.

ఆణిముత్తియము లొక్కంతగా నొండొండ
                       మేలేర్చి నిండారఁ గీలుకొలిపి
వెలలేనిబ్రాఁతి పచ్చలు దెచ్చి దోయిళ్ళ
                       నించి దట్టంబుగా నెఱపి నెఱపి
నెఱ రంగుగల జాతినీలాలు గుదిగ్రుచ్చి
                       యేనుఁగుల్ చక్కఁగా నేర్పఱించీ
యెదిరి కన్గొనరాని ముదురుఁగెంపులు వోసి
                       తెఱపిఁ గానికలు క్రి క్కిఱియఁబఱపి


గీ.

కలయఁ జొక్కంపుగోమేధికములు నిలిపి
పంచెవన్నెలమ్రుగ్గులు పరిఢవిల్లఁ
బ్రోలు దీర్చిరి చూడ్కి కింపులు ఘటింపఁ
బడతు లత్తఱిఁ బసిఁడికీల్ప్రతిమ లనఁగ.

175


గీ.

కన్నెచనుదోయి చుట్టముల్ గానఁబ్రీతి
వానికళ్యాణవేళకై వచ్చినట్టి
తమ్మిపూమొగ్గలో యనఁ దాల్చి రచటఁ
బూజకుండలు తారకారాజముఖులు.

176


గీ.

సింధుభూపాలు సత్కీర్తి చెలఁగి పద్మ
జాండమవ్వల నీరీతి నావరించుఁ
జూడుఁ డనుమాడ్కిఁ దెల్లనిసున్న మలఁది
మానవతు లందు నిలిపి రైరేని కడవ.

177

క.

ప్రోలనియెడు కాసారము
లో లీలం జెలఁగు చెంగలువమొగ్గ లనన్
జాల బహుదీపకళికలు
చాలుగ ముట్టించి రంత జంద్రనిభాస్యల్.

178


వ.

మఱియు దత్తదుచితకృత్యంబులు మసలక ముసలిముత్తైదువ లొన
రింప నిలింపవిభునిభుండగు నమ్మహీకాంతుండు కాంతిమతీకన్య
కాసమేతంబుగా హోమక్రియాకలాపంబులు బహువిధసల్లాపం
బులు గురుజనవందనంబులుఁ గులదేవతాసందర్శనంబులు నాది
యగు మంగళకరణీయంబులు గావించి.

179


చ.

మగువయు నాథుడుం బసిఁడిమంచముపై వసియించి యొండొరుల్
మొగములు వంచి యోరసిలి ముంచినసిగ్గులఁ గన్నుగోనలన్
నగవు దొలంక విప్రమిథునంబుల కిచ్చిరి దివ్యవాసనల్
బుగులుకొసంగఁ జేసిన యపూర్వమనోహరవీటికావళుల్.

180


ఉ.

అంతటఁ బౌరయాత్రికధరావరముఖ్యులు వారివారి క
త్యంతదృఢానురక్తి వివిధాభరణంబులు చిత్రవర్ణసు
క్రాంతవినూతనాంబరనికాయములుం జదివించి రాత్మ నిం
తంతనరాని వైభవమహావిభవంబులు సందడింపగన్.

181


ఉ.

మామ యమేయమార్గణసమాజమధువ్రతపుష్పవాటికా
సీమ యొసంగె నల్లునకు సింధుసబంధుతటాకబంధుర
గ్రామము లాతిథేయపురరాజరమావిభవప్రయుక్తసం
గ్రామము లిష్టబాంధవనికాయము నివ్వెఱఁ గంది చూడఁగన్.

182


ఉ.

మాకులభర్త శీతరుచిమాన్యుఁడు తావళకీర్తి యేతదు
త్సేక మడంచెఁ జెల్లదని చేతికి నప్పనచేసెనో యనన్
గోకకుచామనోభవునకున్ దనయల్లున కిచ్చె సింధుధా
త్రీకమ నాగ్రగణ్యుఁ డొకదీపితవజ్రసుగంధపేటికన్.

183


ఉ.

దీనిరణోర్వి నెక్కు నరదేవుఁ డజేయుఁ డతండు గట్టులా
యాన ననేకవర్ణజవనాశ్వము లాతఁడు కన్గొనుం ద్రిలో

కీనుతకీర్తులంచు నృపకేసరి యల్లున కిచ్చె నొక్కతే
జీ నపరంజివ్రాతపని చిత్తరుపల్లము లుల్లసిల్లగన్.

184


క.

పనుపున కిచ్చెఁ గుమారికి
వసుధాతలభర్త శాలివరవర్ణితముల్
కుసుమశరచాపరుచి భూ
లసమానము లూళ్లు నూఱు నర్ఘ్యము గాఁగన్.

185


ఉ.

మాళవగౌళచోళకురుమాగధు లంపినవారిలోన సం
శీలలఁగా వివేకవరసీమలఁగా రమణీయరూపరే
ఖాలలితాంగవల్లరులఁగా నుడిగంబున కేర్పఱించి భూ
పాలకుఁ డిచ్చె నూఱువుర బాలికలం దనయాలలామకున్.

186


ఉ.

ప్రాణము ప్రాణమైన తనయామణి నప్పుడు చేరఁ బిల్చి యిం
ద్రాణికినైనఁ గంసరిపురాణికినైనఁ గణింపరాని క
ట్టాణి మెఱుంగుముత్తియ మనర్ఘ్యము ముంగరకిచ్చెఁ దల్లియ
క్షీణరుచి ప్రకాండములు చెంగట వెన్నెల గాయుచుండగన్.

187


సీ.

ధగధగాయితరుచిస్థగితనానారత్న
                       సముదీర్ఘరత్నభూషణచయంబు
చిత్రవర్ణాంబరశ్రేణీసమంచిత
                       కాంచనమయపేటికావ్రజంబు
ఘనసారకస్తూరికాసంకుమదపూర్ణ
                       రారజ్యమానకరండసమితి
ప్రచురముక్తాఫలవ్రాతకళాచికా
                       కర్కరికాసముత్కరము మఱియు


గీ.

వివిధవస్తువితానంబు వేఱువేఱ
కంచుకీసంచయంబులు గొంచురాఁగ
సింధుభూభర్త దేవేరి చిఱుత ముద్దుఁ
గూఁతునకు నిచ్చెఁ గోర్కులు గొనలుసాఁగ.

188

క.

కంజాతరాగమణిగణ
సంజాతరుచిచ్ఛటావిశంకట మగుచున్
రంజిలు పంజర మానృప
కుంజరుఁ డారామచిలుకకుం దగనిచ్చెన్.

189


గీ.

అట్లు మామయు నల్లుండు నఖిలబంధు
సమితియును నీడు జోడాడి సంభ్రమింప
నంత నరుణోదయంబయ్యె నప్పు డుచిత
కృత్యములు దీర్చి సింధుధాత్రీవిభుండు.

190


సీ.

సకలవస్తువ్రాతసంపూరితములైన
                       కాంచనమయశతాంగములు నూఱు
ఖచితనానారత్నకంకణంబులతోడఁ
                       గొమరారుదంతావళములు వేయి
కరువలికన్న వెగ్గలముగా మున్నాడఁ
                       జాలిన దొడ్డతేజీలు లక్ష
విక్రమార్కునికంటె విక్రమోన్నతిగల
                       పరమార్థులైన సద్భటులు కోటి


గీ.

వేఱువేఱుగ నేర్చి పృథ్వీతలేంద్ర
తిలకమగు నాత్మజామాతఁ గొలిచి వెంటఁ
బోవ నియమించి శుద్దాంతమునకుఁ బోయి
తనదు దేవేరితోడ నిట్లనియె నృపుఁడు.

191


క.

మన ముద్దుపట్టి భాగ్యం
బనితరసులభంబు మోహనాంగుడు విద్యా
ఘనపదవినమ్రనానా
జనపతి వరుఁడయ్యె నిఁక విచారం బేలా.

192


గీ.

తగినబుద్ధులు చెప్పి యీతలిరుఁబోఁడి
ననుఁగుఁగూఁతును నిప్పుడ యనుపు మనిన

విన్నఁదనమున వసివాడి కన్నుగొనల
నీరుదొలఁకంగఁ బలికె నన్నీరజాక్షి.

193


క.

నాచిన్నిముద్దుఁగూఁతుర
నాచక్కనితల్లి కాన నామదిలోనన్
దోచినచింతల నెచ్చో
నేచందమునం జరింతు నే యిటఁ జెపుమా.

194


క.

కులమును రూపును ప్రాయము
నిలువడియును గలుగు వరున కీఁగంటి నినున్
దొలినానోచిన నోములు
ఫలియించెం జూవె వికచపంకజనేత్రా.

195


ఏతెఱంగున నీమగనిన్
బ్రీతునిఁ జేసెదవొ యెట్లు పెంపొందెదవో
నీతెలివియు నీకడకయుఁ
జూతముగా యింక నో విశుద్ధచరిత్రా.

196


క.

నీమగఁడు భానువంశో
ద్దాముఁడు నినుఁ గన్నతండ్రి ధవళాంశుకుల
గ్రామణి యీయుభయకుల
శ్రీ మించఁగ జేయనీక చెల్లుఁ గుమారీ.

197


క.

మూసిన ముత్యములై కడు
వాసియు వన్నెయును గలిగి వరుఁడౌ ననఁగా
నీ సకలబంధుకోటికి
బూసలలోదార మగుచుఁ బొసఁగ మెలఁగుమీ.

198


క.

నీ వేమియుఁ బతి వేఁడకు
దా వేడుక విభుఁ డొసంగఁ దగ దనకు నినున్
రావింపఁ దడవు సేయకు
రావింపమి నటకుఁ జేరరాకు లతాంగీ.

199

క.

మగఁ డెవ్వరిఁ దెగఁ జూచున్
మగఁ డెవ్వరిఁ బ్రోచు నట్టి మాడ్కిన సతికిన్
దగు నడవ దేవుఁ డనఁగా
మగఁ డనఁగా వేఱు గలదె మదగజగమనా.

200


సీ.

నామాఱుగా నింతనాఁటనుండియు నిన్ను
                       వేడ్కఁబెంచిన దాది వెంట రాఁగ
సకలవిద్యావిచక్షణత మించిన యట్టి
                       వెరవరి సైరంధ్రి వెంట రాఁగఁ
బ్రాణము ప్రాణమై పాయక నినుఁగూడి
                       విహరించు చతురిక వెంట రాఁగ
హితవు విశ్వాసంబు నెఱుకయుఁ గలిగిన
                       వృద్ధకంచుకులెల్ల వెంట రాఁగ


గీ.

సంతతాక్షీణదాక్షిణ్యజన్మభూమి
ప్రియకళాలాపఘన నీదు పెండ్లికర్త
యీశుకీభర్త వెంటరా నిప్పు డింత
దలఁక నేటికి నీవు నా తల్లి కాన.

201


సీ.

కాళాంజి పట్టు నిక్కలికి గౌడేంద్రనం
                       దన దీని లెస్సగా మనుపవమ్మ
కుంచియ వైచు నీకోమలి చోళక
                       న్యక దీని మన్నన నడపవమ్మ
యడపంబు నీయతివ మాళవరాజు
                       సుత దీనిఁ జులుకగాఁ జూడకమ్మ
బాపడవట్టు నీపడతి మాగధుకూర్మి
                       బిడ్డ దీనిఁ దలంచి పెంచవమ్మ


గీ.

పసిఁడిపావలు పెట్టు నీపద్మగంధి
పాండ్యభూపాలు గారాపుఁబట్టి దీని
ననుదినంబును నరసి కాపాడవమ్మ
వలయు వారలఁ దగురీతి మెలఁపవమ్మ.

202

వ.

అని యద్దేవేరి తనముద్దుఁగూఁతునకుఁ బెద్దయు బుద్దులు చెప్పి యచ్చి
లుకఱేని మొగంబై యిట్లనియె.

203


క.

మాపాలి భాగ్యదేవత
వై పేరునుఁ బెంపుఁగల మహారాజునకున్
జేపట్టి పెండ్లి చేసితి
వీపావను నిన్ను వేఱ యేటికిఁ బొగడన్.

204


సీ.

అనునయోక్తులు వల్కి యత్తమామల కాత్మ
                       గృప పుట్టఁగా నప్పగింపపయ్య
సకలబంధులకు వంచన లేక వినయంబు
                       సేయఁ బల్మరు బుద్ధి చెప్పవయ్య
పతి చిత్తవృత్తిగా సతతంబు విసువక
                       సేవ యొనర్ప శాసింపవయ్య
కినిసి యెవ్వారి నొచ్చిన నోరఁబల్కక
                       యోర్పుమై నుండంగ నేర్పవయ్య


గీ.

యెల్లవారలవలె నేమి యెఱుఁగవయ్య
నిన్నియును నేల నీచేతి కిచ్చినార
మీకుమారిక మీచిత్త మెట్లు వచ్చు
నట్టిజాడలఁ గరుణఁ జేపట్టవయ్య.

205


క.

పలుమఱు నీగతి నవ్విభు
కులపాలిక బుద్ది చెప్పి గుణశాలికి న
ప్పలుకుం దేనియ కొలఁకుకుఁ
జిలుకకుఁ దగ నప్పగించెఁ జిలుకలకొలికిన్.

206


క.

అప్పుడు శుకకులచంద్రుం
డప్పాటలగంధి కనియె నంగన ప్రియముల్
చొప్పడఁ బెఱవారికి బలెఁ
జెప్పెదు నన్నింత వేఱు సేయం దగునే.

207

క.

కుటిలాలక నీపుత్త్రిక
యఁట యెట గుణశీల గరిమ మడుగఁగ నేలా
నిటలాంబకకులకాంతకు
నిటువంటి వివేక మేది యే నెఱుఁగుదుగా.

208


గీ.

ఉభయవంశపవిత్ర యీయుత్పలాక్షి
సర్వలక్షణసౌభాగ్యజన్మసీమ
యీకుమారిక చొచ్చిన యిల్లుఁ బుట్టి
నిల్లు నెంతయు వన్నెకు నెక్కకున్నె.

209


క.

పతియునుఁ దా నన్యోన్య
స్థితి నిప్పుడ కలసి మెలసి చెలులన్ మనలన్
మతి నొకనాఁడుఁ దలంపదు
గత మిచ్చెద దీని కేమి కంజాతముఖీ.

210


క.

పట్టానదేవియై నీ
పట్టి జగం బెల్ల మెచ్చఁ బతిమానస మి
ట్టట్టు చననీక యన్నిట
జట్టిగొనన్నేర్చు నీవు సంతసమందన్.

211


క.

దినముల వెంబడి నన్నియు
వినియెద వేటికి వచింప విభునింటికి నీ
మనసునఁ దెలివిడి గూఁతుం
బనుపుమనం దనయఁ జూచి పైకొను మమతన్.

212


గీ.

అమ్మహారాజుదేవి యిట్లనియె మగుడ
నన్ను మన్నించి యీశుకనాథుపల్కు
లేమి జవదాటకుండుమీ యిదియ నీకు
బరమమైనట్టి బుద్ధిపోఁ బద్మగంధి.

213


క.

మనమున దయపుట్టఁగ నీ
పనిపాటలు విన్నవించుఁ బ్రాణేశున కీ

యనఘుఁడ కారణబంధుం
డని తెలియం బలికి గుండియ దిగు ల్లనఁగన్.

214


క.

తలగ్రుచ్చి కౌఁగిలించుచుఁ
దెలిగన్నులనీరు దుడిచి దీవించి నినున్
నలువదినాళ్ళకె తోడనె
పిలిపించెద నింతయేల బెగడకు తల్లీ.

215


గీ.

అనుచు నూరార్చి పదవమ్మ యనుచుఁ దానుఁ
బ్రాణసఖులును గక్ష్యాంతరములు గడచి
దిడ్డివైచిన యొకనూత్నదివ్యరత్న
ఖచిత మగు పల్లకీమీఁదఁ గన్నె నునిచి.

216


గీ.

ఎట్టకేలకు నప్పు డయ్యింతి యంతి
పురములోనికి వసివాడి యరిగె మగిడి
మగిడి చూచుచు నెంతయు మహిమ నిచటఁ
గంచుకులవాక్యవైఖరి గ్రందుకొనఁగ.

217


గీ.

వల్లకీపాణి పల్లకి యల్ల నల్ల
బురము వెల్వడ సింధుభూవరుఁడు దాను
దండనాథులు సకలబాంధవులు వెంట
లీలమై నేగి రపుడ తేజీల నెక్కి.

218


సీ.

ఆరీతి నేగి ము న్నఖిలసేనాసమే
                       తుఁడయి వెలిని వీడు విడిసియున్న
మనువంశపతిఁ జేరఁ జని ముద్దుఁగూఁతును
                       నప్పగించి విచార మావహిల్ల
నొకభంగి నేగె నయ్యుర్వీతలాధ్యక్షుఁ
                       డిట హైమధన్వియుఁ జటులపటహ
మురజమర్దలరావములు మిన్నుముట్టఁగ
                       గన్యకాసహితుఁడై కతిపయప్ర

గీ.

యాణముల నాత్మపురిఁ జేర నరుగుదెంచి
యప్పు డద్వార్త దండ్రికిఁ జెప్పి పనుప
సమ్మదాంభోధి నోలాడి సకలబలము
నెదురుగాఁ బరిచె నావంచకేశ్వరుండు.

219


వ.

ఇట్లు సకలసేనాసమన్వితుం డగుచు నక్కుమారపంచాననుం డకించి
దంచితకాంచనకదళికానికాయచ్ఛాయాజాయమానకాయ
మానగృహబహిర్భాగంబునుఁ దరుణతరణిరోచిస్సమాచీన
చీనాంబరవిరచితవితానప్రతానంబును వధూవరవరసౌందర్య
సందర్శనకుతూహలసముత్పతత్పక్ష్మలాక్షికటాక్షవీక్షావిలక్షి
తాక్షయాగురుధూపప్రదీపితగోపురంబునుఁ బటుపటహఫణవ
ఢక్కాహుడుక్కారావబధిరితాశావకాశముఖంబును గనక
రుచివిస్తృత్వరతత్పరాభియుక్తముక్తారంగవల్లికంబును ఘుసృణ
కుసుమరసాలేపితవితర్ధకంబును బునఃపునరుద్ద్రీవపౌరకులసంకుల
సంకుమదాంకితరాజమార్గంబును లోహితవిహితాగ్రతోరణ
మాలికాశాలికలధౌతసౌధతలంబును రంగత్కురంగలోచనాంగీ
కృతలాస్యప్రశస్యమంగళసంగీతప్రసంగానుషంగమృదంగ
ధిమధిమధ్వానతరంగితమంచికాసంచయంబును నగుపురంబు
ప్రవేశించి ముహుర్ముహురన్యోన్యాహూతకన్యకాజనలతికానికర
కలితకుసుమసమాజభ్రాజమానలాజాక్షతంబులవలనం బురంధ్రీ
విరచ్యమాననీరాజనవిరాజమానంబులవలనం బృథ్వీసురా
శీర్వాదంబులవలనం బ్రముదితహృదయుండై రాజగృహద్వారంబు
చేరంజని నిజవాహనావతరణం బొనరించి సౌవిదల్ల వృద్ధామాత్య
సామంతసైనికప్రవరుల నుచితవచనశిరఃకంపకరసంజ్ఞావిలోక
నంబులఁ దగినచందంబున ననిచి కక్ష్యాంతరంబులు గడచి యయ్యవ
సరంబున.

220


ఉ.

ఉల్లము పల్లవింప వినయోన్నతిఁ జేరి సుధామరీచిమే
నల్లునిఁబోలు నమ్మనుకులాగ్రణి మత్తవిరోధిదైత్యసం

పల్లతి కాశితాసి పరిపాండురకీర్తి ససంభ్రమంబునన్
దల్లికిఁ దండ్రికిన్ గురుజనంబులకున్ ధర జాగి మ్రొక్కుడున్.

221


ఉ.

గ్రుచ్చి కవుంగిలించుకొని కోరిక లీరిక లెత్త నమ్మహీ
భృచ్చతురాననుం డనియె భీకరదైత్యుల నుక్కడంచి నీ
వచ్చుటఁ జేసి ప్రాణములు వచ్చెఁ జుమీ యిట నేఁడు మాకు వి
వ్వచ్చుఁడు పోరులన్ సవతు వచ్చునె నీ కసమాసమానుషా.

222


మ.

రణసీమన్ సురకోటి నొంచి ఖచరవ్రాతంబుఁ దూలించి చా
రణులం దర్ప మడంచి బాహుబలగర్వస్ఫూర్తి మార్లేక భీ
షణవృత్తిన్ విహరించు దైత్యు నొరులే సంధించువా రీవు కా
రణజన్ముడవు గానఁ గూల్చితి కుమారా రాజకంఠీరవా.

223


వ.

అని బహువిధంబులం బ్రశంసించి పునఃపునరాలింగనం బొనరించి
యన్నరదేవుండు దేవియుం దానును బరమానందంబునం బొంది
యుండ.

224


క.

కోమలపల్లవపాణిం
గోమలి నమ్ముద్దుఁబెండ్లికూఁతును నొకమై
దా మొయ్యఁ దార్చియత్తకు
మామకు మ్రొక్కించి రపుడు మంజులవాణుల్.

225


క.

మ్రొక్కిన కోడలిఁ గొమ్మం
జక్కనిజవరాలిఁ జూచి సతియును బతియున్
మిక్కిలి యక్కఱ మీఱన్
బెక్కువిధంబుల నుతించి పేశలఫణితిన్.

226


క.

రావమ్మ సింధుపుత్త్రీ
పావనచారిత్ర నేత్రపర్వము గాఁగన్
నీవునుఁ బతియును దేవియు
దేవరవలె నుండుఁ డనుచు దీవించి తగన్.

227


క.

కులదేవతానమస్కృతి
సలు పన్నరనాథుదేవి చక్కని తన ము

ద్దులకోడలిఁ జెయిపట్టుకొ
ని లీలమైఁ జనియె నిచట నృపతియుఁ బ్రేతిన్.

228


శా.

ఓనిర్నిద్రభుజప్రతాపతపనా యోబంధుచింతామణీ
యోనారీమకరాంక యేపగిది నయ్యుగ్రాసురున్ గెల్చితో
మౌనిశ్రేష్ఠుని పట్టి నెట్టికరణిన్ మళ్ళించితో సర్వమున్
వీను ల్చల్లఁగఁ జెప్పుమన్న నతఁ డావిర్భూతసమ్మోదియై.

229


క.

రాచిల్కమోము చూచుడు
నాచందం బది యెఱింగి యవనీశ్వరుతోఁ
దూచాతప్పక యుండఁగ
వాచాగోచరవిశేషవైఖరి మెఱయన్.

230


సీ.

తొలితొలిఁ గవ్వంపుమలకు నేగి విశంక
                       టుని భుజదర్ప మార్చినవిధంబుఁ
బ్రత్యక్షమై దివ్యరత్నంబుఁ గాళి యి
                       చ్చినయట్టివిధమును దనవిధంబు
ముష్టింపచస్వామి ముద్దుఁగూఁతును దెచ్చి
                       యతని కర్పించిన యవ్విధంబుఁ
బదరికాశ్రమభూమిఁ బారికాంక్షులచేత
                       దీపనల్ చాలఁ జెందినవిధంబు


గీ.

నుత్సవాహ్వయవనసీమ నున్నవిధము
భవ్యగుణధన్య సింధుభూపాలకన్యం
బెండ్లియాడిన విధము నొప్పిదము గాఁగఁ
దేటపడఁ జెప్పె రాచిల్కమేటి యచట.

231


వ.

అట్లు పలికిన యక్కీరసునాసీరు మెచ్చుల పల్కుల కమ్మహీ
భృచ్చతురాననుం డిచ్చ నచ్చెరు వంది నిష్పందానందకందళిత
హృదయారవిందుండై సుఖం బుండె, నట రాజశేఖరకుమారుండును
గాంతిమతీకుమారికాసమేతుండై.

232

ఉ.

ఈడితమాధవీకుటజహింజులవంజులమంజుకానన
క్రోడములన్ విహారగిరికూటములన్ దమకంబు త్రోపు త్రో
పాడ మనోనురాగ మనయంబును లోఁ దొలఁకాడ మన్మథ
క్రీడలు సల్పుచుండె నురరీకృతసౌఖ్యకళాభిరాముఁడై.

233


ఉ.

సారసలోచనాకుసుమసాయకబంధురదానతోయవి
స్తారితపంచశాఖతలసజనితప్రథమానవల్లికో
దారకృపాణికావిమతధాసితగోపురవాహరత్నదు
ర్వారమదాంధసింధుధరాభరణైక మహాధురంధరా.

234


మాలిని.

కుసృతి పరమహారాట్కూటవృక్కానృగ్సర్పీ
మసృణకరకృపాణీ మారజిన్మౌళి సింధు
స్వసృవిమలయశశ్రీక్షాళితాశాంతదానా
ప్రసృతిసలిలధారాప్లావితాంభోనిధానా.

235


శా.

స్వర్భామాజనకీర్తనీయగుణఘోషద్విట్ప్రతాపార్యమ
స్వర్భానూద్భటపారసీకఖరిచీసౌవీరఘోటీఖురా
విర్భూతోద్బలధాటిధూళిభరదోర్వీర్యావధూలార్జునా
గర్భస్థాపితభూర్భువప్రముఖలోకస్వచ్ఛక్తీచ్ఛటా.

236

గద్య
ఇది శ్రీమదఘోర శివాచార్య గురుకరుణావిశేషలబ్ధసారస్వత
మాదయామాత్యపుత్్రత మల్లయనామధేయప్రణీతం
బయిన రాజశేఖరచరిత్రంబను మహాప్రబంధంబునందు
సర్వంబును దృతీయాశ్వాసము