Jump to content

యెంకి పాటలు/కొత్త పాటలకు పీఠిక

వికీసోర్స్ నుండి


కొత్త పాటలకు పీఠిక

ఎంకి పాటల ప్రధమ ముద్రణ మయిన్నీ ఆ ప్రతులు నిండుకొనిన్నీ కూడా చాల కాలం గడిచింది. ఈ కొత్త పాటలతోపాటు ఎంకి పాటల పునర్మద్రణమున్నూ చేయదలచి యొప్పటి కప్పడేవో ఆటంకములమూలాన ఆలశ్యం జరిగింది.

నేను 1926 లో న్యాయవాది వృత్తిలో చేరేటప్పడే మిత్రులు Law కున్నూ కవిత్వానికిన్నీ సగమెరకసువిూ అన్నారు. ఎంకిని నిత్యం స్మరిస్తున్నా 1948 వరకు వీనిలో సగం పాటలైనా వ్రాయలేకపోయినాను. 1948 శ్రీ మంచాళ జగన్నాధరావు (All India Radio, Patna) గారి స్నేహము లభించినది. వారు నాటినుండి సంవత్సరమున కొకతూరియైన ఎటు విచ్చేసి మా యింట విడిసి, వారి వీణా గాత్రములు మేళవించి, మనోహర గాన మొనర్చి మాటుమణగిన నాలోని పాటను మేలు కొలుపసాగిరి. వారి స్నేహభాగ్య మబ్బిన పిమ్మటనే యీ పాటలలో సగంపైగా వ్రాయగలిగితిని. వారి కెంతో కృతజ్జుడను.

వారే యెంతో శ్రమకోర్చి యీ కొత్తపాటలలో 40 కి సరియైన (Notations) గురుతులతో స్వరాలు వ్రాసిరి. కాని అనివార్యములగు కారణములవల్ల వానిని గాని వెనుకటి పాటలకు కీ॥ శే॥ విద్వాన్ పారుపల్లి రామకృష్ణయ్యగారు వ్రాసిన స్వరాలుగాని యీ తఫా ముద్రింపలేకున్నాను. మిత్రులీ పాటలు "ఔ" ననియో "కా" దనియో వీనిని ఆంధ్రలోకం యొక్క నదరులో వుంచినారు. కీ॥శే॥ శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారు గుణములేనిదే వారు దూషింపరే యని వానిని (ఎంకిపాటలను) చదివితి" నన్నారు. కావున "కా" దన్నవారును నా పాటలు నేటివరకైన నిలుచుటకే తోడైనారు. వారికే ముందుగా నేనొనర్చు ప్రణామములు.

నా పాటలలో నొక చిన్న పాటకు శ్రీ భమిడిపాటి రామసోయాజులు గారు (Now Advocate Chodavaram Vizag Dt) ఏనాడు  భారతిలో బొమ్మలు చేసినాలో నాటినుండి వీనిపై వాదోపవాదములు పెరిగి జరిగిన ప్రచార మపారం.

కీ౹౹ శే౹౹ కళాప్రపూర్ణ వేదము వెంకటరాయశాస్త్రులువారు (Nuzvid Conference, May '25) సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు (Reddy Conference, December '25) శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రులు వారు (Andhra Panditha Mandali, Madras April, '25) శ్రీ పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రులువారు (Introduction, Yenki Songs, 1st Edition) రావు సాహెబు శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారు (1925 మద్రాసు) నా పాటలయెడ చూపిన ఆదరణకూడ ఆ ప్రచారానికి దోహద మిడినది,

శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ఏప్రియల్ 1925 లో వీనిని ప్రప్రథమున పండిత సభ కెక్కించియు, Prof. D. Appala Narasimham M.A.L.T గారు 1926 లోనూ శ్రీ బూర్డుల రామకృష్ణారావుగారు (Now Chief Minister Hyderabad) 1928 లొనూ వీనిని 'భారతి ' లొ సమర్ధించియు శ్రీ ఎం. చలపతిరావు, ఎం.ఎ గారును (Now Editor National Herald, Lucknow) మిత్రులు శ్రీ కోలవెన్ను రామకోటేశ్వరరావుగారును (Editor, Triveni) త్రివేణిలో వీనిని సానుభూతితో విమర్శించియు, మహా పండితులని కవులు నగు శ్రీ వేదాల తిరువేంగళాచార్యులుగారు తమ “ఆంధ్ర ధ్వన్యాలోకం'లో యీ పాటలలో నొక పాటను ఉదాహరణగాగొనియు, ఆచార్య శ్రీ కురుగంటి సీతారామభట్టారకులు తమ 'నవ్యసాహిత్య వీధు 'లలో ఎంకి'కి కూడ తావొసగియు, మా బెల్లంకొండ రాఘవరావుగారు ఒక్కొక్కపాట నే నిండు ప్రేమతో విమర్శించుచు పెక్కు వ్యాసములు వ్రాసియు, నా గురుతుల్యులు శ్రీ ప్రొఫెసర్ విస్సా అప్పారావుగారు (31-5-58) యెంకిపాటలకును గేయ ప్రపంచంలో ఒక స్థానమిడియు, 'బుచ్చిబాబు,' మిత్రుడు రుక్మిణీనాధుడు, శ్రీ రజనీగార్డు వీనిచుట్టును నాటిక లల్లియు, కీ. శే. ఆడవి బాపిరాజువంటి చిత్రకారులు వీనిని చిత్రించియు, సంగీతకళానిధి ప్రొ౹౹ ద్వారం వెంకటస్వామి నాయుడు గారివంటి మహావిద్వాంసులు వీని  నాదించియు, శ్రీ యమ్. చలపతిరావుగారివంటి ఆంగ్లభాషాపండితులు వీని నాంగ్లమున ననువదించియు, శ్రీ నటరాజ రామకృష్ణగారివంటి నాట్యాభినయవేత్తలు వీని నభినయించియు, కవిసామ్రాట్టు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు తమ సుప్రసిద్ధ నవలలో వీని దయతో పేర్కొనియు, సోదరుడు కృష్ణశాస్త్రి వీనిని గురించి పలుతావుల నభిమానముతో పలికియు, వీనిని పెక్కు సభలలో పాడియు, రసికులు శ్రీ గుడిపాటి వెంకటచలంగారు వీనిని నిండుమనసుతో "Muse' చేసియు, శ్రీ 'శ్రీశ్రీ 'గారు 'స్వతంత్ర' లో వీనిలోని వెలుగులు చూపియు, మా సాహితీ సమితి సభాపతి శ్రీ శివశంకర స్వామిజీ వీనికి దీర్ఘాయువగు నట్లాశీర్వదించియు, 'ఎంకి 'పాటల నుండి నా దృష్టి మరలకుండ చేసిరి. ఈ 'కొత్తపాటలు' వ్రాయుటకు వారందరి అంతఃకరణ నాకు సాయమిడియుండును. ఈ నా ముసలిదశలో నా పాటల మననం ఒకయెత్తు, వారల ప్రేమవాక్కుల మననం ఒకయెత్తుగా కాలం గడుపు చున్నాను. అదే నా కృతజ్ఞత!

ఆల్ యిండియా రేడియా మద్రాసు, విజయవాడ, హైద్రాబాదు నిలయములవారు నా పాటలు నాకే చిత్రచిత్రగతుల నిత్యం వినిపిస్తున్నారు.

ఈ కొత్త పాటలు భాషలోనూ నిర్మాణంలోనూ పూర్వపు పాటల పంధా నుండి వొయిదొలగినవన్నారు. ఆందుకు సోదరుడు కృష్ణశాస్త్రి 8-5-53 న మద్రాసు కల్చరల్ క్లబ్లోనూ, కృష్ణాపత్రికా సంపాదకులు గడచిన రావు సాహెబ్ గిడుగు రామమూర్తిగారి వర్ధంతి సంచికలోనూ సమాధాన మిడిరి. మార్పుగుణమున కాయెనా దోషమున కాయెనా ఆను విషయము సహృదయ లోకమే నిర్ణయించాలి. ఏ యెడను మార్పు సహజం.

ఈ కొత్త పాటల ఆంకింతం నా 'రవల వెలుగుల ' పాటలో తలతడుము కొవి తబ్బిబ్బులైన అద్భుతమూర్తికి. ఆ మూర్తికి నా కవిత్వ జీవితాదర్శముల యెడ నీరసభావముతప్ప మరోభావమునకు తావులేదని యెరింగియు నా భక్తి చేయ వేరు పూజాద్రవ్యములేమి వీనినే అర్పించుచున్నాను.

ఏలూరు

3-8-'53

నండూరి వెంకటసుబ్బారావు

గ్రంధకర్త