యెంకి పాటలు/సంద్రం
స్వరూపం
సంద్రం
యింతేనటే సంద్ర మెంతొయనుకొంటి
మనకూ సూరీడుకూ మద్దెనుందేనా!
నానీతి నాజాతి
నావారెపోనాడ
మరిగి నామనసు సా
గరమాయెనన్నారు ఇంతే...
నారాజె నాకాసి
వేరు సూపులు సూడ
కడలివలె నా గుండె
కలతబడె నన్నారు ఇంతే...
సత్తె మెరిగినపాప
పొత్తిళ్లలో దాగి
కన్నీరు మున్నీరు
కరిగిస్తి నన్నారు ఇంతే...
అంచుదరి లేదంటె
అమృత ముంటాదంటె
దేము డంతుంటాదొ
ఏమొ యనుకొన్నాను ఇంతే...