యెంకి పాటలు/వొనలచ్చిమి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వొనలచ్చిమి

జాము రేతిరియేళ జడుపు గిడుపూ మాని
సెట్టు పుట్టాదాటి సేనులో నేనుంటె
మెల్లంగ వస్తాది నాయెంకీ!
సల్లంగ వస్తాది నాయెంకీ!

పచ్చని సేలోకి పండుయెన్నెల్లోన
నీలి సీరాగట్టి నీటు గొస్తావుంటె
వొయ్యార మొలికించు నాయెంకీ!
వొనలచ్చి మనిపించు నాయెంకీ!

యెంకి వస్తాదాని యెదురూగ నేబోయి
గట్టుమీదా దాని కంటి కాపడగానె
కాలు కదపాలేదు నాయెంకీ!
కరిగి నీరౌతాది నాయెంకీ!

మాటలన్నీ సెప్పి మంచెకిందా కెల్లి
గోనెపట్టా యేసి గొంగడీ పైనేసి
కూలాస గుంటాది నాయెంకీ!
కులుకు సూపెడతాది నాయెంకీ!

యేతా మెత్తేకాడ యెదురూగ కూకుండి__.
మల్లీ యెప్పటల్లె తెల్లారబోతుంటె__.
సెందురుణ్ణీ తిట్టు నాయెంకీ!
సూరియుణ్ణీ తిట్టు నాయెంకీ!