యెంకి పాటలు/యెంకిముచ్చట్లు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

యెంకిముచ్చట్లు

యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు
యేటి సెప్పేది నాయెంకి ముచ్చట్లు ?
దొడ్డితోవ కళ్లె తొంగి సూడంగానె
'తోటకాడే వుండు త్వరగొస్త' నంటాది !

యెన్నాని సెప్పేది......
యెంకి రాలేదని యెటో సూత్తావుంటె
యెనకాలగా వచ్చి 'యెవురు వో' రంటాది !

యెన్నాని సెప్పేది......
'సిట్టి సేబా'సాని నిట్టూర మేత్తుంటె
మాటా యినబడనట్టు మరియేటో సెపుతాది !

యెన్నాని సెప్పేది......
'కోడిగూసేసరికి కొంపకెల్లాలి, నీ
కోసరమె సెపుతాను కోపమొ' ద్దంటాది !

యెన్నాని సెప్పేది......
'యెంతసేపున్నాను యిడిసి పెట్టాలేవు
తగువోళ్లలో మనకు తలవొంపు' లంటాది !

యెన్నాని సెప్పేది......
యెన కెనక సూత్తానె యెల్లుతావుంటాది,
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు
యేటి సెప్పేది నా యెంకి ముచ్చట్లు ?