యెంకి పాటలు/రాగతనం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రాగతనం

కొమ్మలో కోకిలా 'కో'యంటదే_
రాగతనమో యేమొ బాగువోగెరుగదే!
కొమ్మలో కోకిలా...

యెంకి దూరా నుండె,
ఏటిదరి నేనుంటి_
'సావాస మింకెవరొ
సందడెవరో' నంటి! కొమ్మలో...

పూలెరుగు నాకోత
నీలెరుగు నామోత_
మనుగడల కెవరితో
మనుసు కలిపేదంటి! కొమ్మలో...

ఏటికడుపునదాగి
తోటనిదరోయింది
'ఆలనా' నాసొదకు
'పాలనా'యనుకొంటి! కొమ్మలో...

తరిమి తరిమేశాను
తిరిగి 'కో కో' యంది_
ఆడిందె ఆటగా
పాడిందె పాటగా! కొమ్మలో...