యెంకి పాటలు/పూల బాసలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పూల బాసలు

పూలబాసలు తెలుసు యెంకి కీ
తోట
పూల మనసులు తెలుసు యెంకి కీ!

పూల మొక్కలనీటి
జాలుగని నిలుసుండి
పూలన్ని నీపాటె
ఆలించె నంటాది! పూలబాసలు...
పూలంటు కాలంటి
పున్నెముం దంటాది;
వగలమారీ పడుచు
నగదొడిగె నంటాది! పూల...
తెరలెత్తి పూపడవ
పరుగెత్తుతావుంటె,
దారెంట పూలొంగి
దణ్ణమిడె నంటాది! పూల...
పూలతో వియ్యాలు
పూలల్లొ కయ్యాలు
మానల్లె నన్నుంచి
తానె పూవౌనేమొ! పూల...