యెంకి పాటలు/యెఱ్ఱి సరదాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

యెఱ్ఱి సరదాలు

యెంకీ వస్తాదాని
యెదురు తెన్నులు కాసి,
దిగులుట్టి, తలదించి,
తిరిగి సూసేతలికి__
యెంకి రావాలి! నాయెదర నిలవాలి!
కులుకుతా నన్నేటొ పలకరించాలి!
పిల్లపొరుగూ రెల్లి
మల్లి రాలేదని,
వొల్లంత వుడుకెత్తి
వొక్కణ్ణి పొడుకుంటె__
ఘల్లుమంటా యెంకి కాలుపెట్టాలి!
'యెల్లి వొచ్చా' నంట యెంకి నవ్వాలి!
యెంకి కోపా లొచ్చి
యేదేశమో పోయి,
కల్లొ నా కాపడితె
కళ్లు తెరిసే తలికి__
తళుకుమని యెంకి నాదరికి రావాలి!
'నిదర కాబో'సంటు నింద నాడాలి!