యెంకి పాటలు/యెంకి సూపు
స్వరూపం
యెంకి సూపు
పదిమందిలో, 'యెంకి
పాట' నే పాడంగ
గోడసాటున యెంకి గుటక లేసే యేళ,
సూడాలి నా యెంకి సూపు లాయేళ!
సూడాలి నా యెంకి సోద్దె మాయేళ!
'నా పాటె పా'టంట
'నా మాటె మా'టంట
నలుగు రమ్మలు సేరి నను మెచ్చుతావుంటె,
సూడాలి నా యెంకి సూపు లాయేళ!
సూడాలి నా యెంకి సోద్దె మాయేళ!
పొరుగమ్మతో నేను
వొరస లాడే యేళ,
పొలమెల్లి నే పొద్దుపోయి వచ్చేయేళ,
సూడాలి నా యెంకి సూపు లాయేళ!
సూడాలి నా యెంకి సోద్దె మాయేళ!