యెంకి పాటలు/యెంకి పయనం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

యెంకి పయనం

(ప)డుకుంటె నాకేటొ బ్రమ పుట్టినాదీ!
(క)డుపులో సెయ్యేసి కలిపేసినాదీ!
ఎడతెగని జలమంట!
నడమ నో పడవంట!
పడవెక్కి నాయెంకి పయన మయ్యిందంట!

(ప)డుకుంటె నాకేటొ బ్రమ పుట్టినాదీ!
(క)డుపులో సెయ్యేసి కదిపేసినాదీ!
యెంకేటొ బ్రమపుట్టి
యెనక తిరిగిందంట
సందెగాలికి పడవ సాగిపోయిందంట!
పడుకుంటె నా కేటొ బ్రమ పుట్టినాదీ!
కడుపులో సెయ్యేసి కలిపేసినాదీ!

నీటిగాలికి యెంకి
పై టెగురుతాదంట
పడపోయి నట్టేటొ పడ వెల్లినాదంట
పడుకుంటె నాకేటొ బ్రమ పుట్టినాదీ!
కడుపులో సెయ్యేసి కలిపేసినాదీ!

పిల్లసిగలో పూలు
కళ్లిప్పినాయంట!
మిడిసిపాటున దోనె మీరిపోయిందంట!
పడుకుంటె నాకేటొ బ్రమ పుట్టినాదీ!
కడుపులో సెయ్యేసి కలిపేసినాదీ!
మెడసాటు పూసోటీ!
మినుకుమంటాదంట!
పంతాన గంతేసి పడవ పోయిందంట!
పడుకుంటె నాకేటొ బ్రమ పుట్టినాదీ!
కడుపులో సెయ్యేసి కలిపేసినాదీ!

అంసల్లె, బొమ్మల్లె,
అందాల బరిణల్లె,
సుక్కల్లె, నా యెంకి సురిగి పోయిందంట!
పడుకొంటె నాకేటొ బ్రమ పుట్టినాదీ!
కడుపులో సెయ్యేసి కలిపేసినాదీ !