Jump to content

యెంకి పాటలు/ముందు పుటక

వికీసోర్స్ నుండి

ముందు పుటక

నాపక్క తిరిగి మాటాడవా ? యెంకి !

యీ సిక్కు నీ విప్పగలవా?
యీ జంట విడిపోయి
యే వాడనో తేలి,
యెంకి పాటినగానే
యెదర నిలిసేదెవరో?
నాసూపు
సెదరగొట్టేదెవరో?
నా తోవ
సదును సేసేదెవరో?
నాపక్క తిరిగి మాటాడవా? యెంకీ!
యీ సిక్కు నీ విప్పగలవా?
మన సేతితో నాటి
మన సొంతమని పెంచి
మనకోట యీతోట
మరపు రాకుంటాదా?
నాగుండె
మరిగి పోకుంటాదా?
నాపక్క తిరిగి మాటాడవా? యెంకీ!
యీ సిక్కు నీ విప్పగలవా?

వొయికుంటమే నీతో
వొరుగుతాదని నమ్మి
కలిసున్న నాకాసి
కన్నెత్తి సూసేవ?

నీ వొన్నె
సిన్నేలు సూపేవ?
యింతింత
అన్నేయ ముంటాదా?
నాపక్క తిరిగి మాటాడవా? యెంకి!
యీ సిక్కు నీ విప్పగలవా?

*