యెంకి పాటలు/పంటసేలకే పయనం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పంటసేలకే పయనం

యీ యేపు నోయావు ఆయేపు నోయావు
జోడావులకు నడుమ నా యెంకి.
యీడు
జోడుగా నిలుసుంటె నా యెంకి,
ఆట
లాడతా కలిసుంటె నాయెంకి,
నన్నె
సూడు మన్నట్టుండు నాయెంకి!

ఈయేపు నోయేరు ఆయేపు నోయేరు
యేళ్ల రెంటికి నడుమ నాయెంకి
తలను
పాలకడ వెత్తుకుని నా యెంకి,
సేత
పూలు పుణుకుకొంట నా యెంకి,
పూల
బూర వోయిస్తానె నా యెంకి,
నన్నె
పోలుండుమంటాది నా యెంకి!

యీకాడ నోకొండ ఆకాడ నోకొండ
కొండకోనల నడుమ నా యెంకి,
పాల
కుండ దించూకోని నా యెంకి,
గుడికి
దండ మెడతావుంటె నా యెంకి,
సూడ
రెండేళ్ళ కనిపించు నా యెంకి!
ఈసాయ నోసేను ఆసాయ నోసేను
సేలరెంటికి నడుమ నా యెంకి,
పాలు
పూలు నా కందిచ్చి నా యెంకి,
'సొమ్ము
లేల మన' కంటాది నా యెంకి,
గుండె
జాలి పుట్టిస్తాది నా యెంకి!